సూట్‌కేస్

ఇస్ఫహాన్ రైల్వేస్టేషన్ ఆకాశం ఇంకా బాంబుల పొగతో బూడిద రంగులోనే ఉంది. కూలిన కాంక్రీట్ దిమ్మలనుంచి లేచిన దుమ్ము, మండుతున్న ప్లాస్టిక్ వాసన, ఏదో తెలియని కమురు వాసన గాలిలో కమ్మి ఉన్నాయి…

స్టేషన్ అంతా గందరగోళం. తలల గాయాలకు కట్లు, పిల్లల ఏడుపులు, సామాన్లను రైల్లో ఎక్కించడానికి రైల్వే అధికారులతో గొడవ పడుతున్న ప్రయాణికులు.

అమీర్, ప్లాట్‌ఫారమ్ చివర ఉన్న ఒక పాత చెక్క బెంచీపై కదలకుండా కూర్చున్నాడు. ఈ కదలికలూ కోలాహలమూ అతన్ని తాకుతున్నట్టు లేదు. అతని బూట్ల మీద ఒక మందపాటి బూడిద పొర పేరుకుపోయి ఉంది. దాన్ని దులుపుకోవాలన్న ధ్యాసే లేదతనికి.

అతనితోబాటు, పట్టీలు అరిగిపోయి ఉన్న ముదురు గోధుమ రంగు పాత సూట్‌కేస్ కూడా ఆ బెంచీ మీదే ఉంది. చుట్టూ జరుగుతున్నవాటి మధ్య అతనూ, ఆ సూట్‌కేస్ మాత్రమే నిశ్చలంగా, అతీతంగా కనిపిస్తున్నారు.

కింద పడిపోయి ఒలికిన ఒక టీ కప్పు చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న ఈగ తీపి కోసం వెతుకుతూ, టీ మరక చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

అమీర్ తన సూట్‌కేస్ జిప్ కొద్దిగా తెరిచాడు. లోపల బట్టలు లేవు. కేవలం కొన్ని వస్తువులు మాత్రమే ఉన్నాయి. అందులోంచి ఒక సగం కాలిన ఎర్రటి బట్ట ముక్కను తన బొటనవేలితో నిశ్శబ్దంగా తడిమాడు. అది అతని పదేళ్ల కూతురి గౌను ముక్క. ఆ ముక్కను చేతిలో పట్టుకున్నప్పుడు, పేలిన ఆ బాంబు వేడి ఇంకా దానికి అంటుకుని ఉన్నట్లు అనిపించింది.

గుండెను పూర్తిగా ముంచెత్తిన బాధతో, అతని కళ్ళలో నీళ్ళు పొడిబారేయి.

ఈగ ఎగిరి అతని సూట్‌కేస్ మీద వాలింది. అమీర్ దాన్ని అదిలించలేదు. ఆ చిన్న జీవి కూడా తనలాగే, ఎండిపోయిన తీపి కోసం వెతుకుతూ దారి తప్పిపోయిందేమో…

ఆ నిశ్శబ్దంలో, రైలు కూత శబ్దం అతనికి బాంబుల శబ్దం కంటే భయంకరంగా వినిపించింది.

రైలు కదిలింది – ఉత్తరం వైపు, భారంగా. ఇనుప చక్రాలు పట్టాల జాయింట్ల మీద పడుతూ చేసే ‘ఠక్- ఠక్’ శబ్దం ఆ బోగీలో వినిపిస్తూంది, మొండి గడియారపు క్రమబద్ధతతో.

కిక్కిరిసిన ఆ థర్డ్ క్లాస్ బోగీలో గాలి కూడా కదలడం లేదు. ఎవరూ కిటికీలు తెరవడం లేదు, బయట ఉన్న చలి గాలికంటే, ఎక్కడ ఏ ప్రమాదం (డ్రోన్ల రూపంలోనో, బాంబర్ల రూపంలోనో) పొంచి ఉందోనన్న భయం. ఆ ఇరుకు బోగీలో చెమట, పాత ఉన్ని దుస్తులు, ఎండిపోయిన రొట్టెల వాసనలు బరువుగా తేలుతున్నాయి.
అన్నిటినీ మించి, భయం వాసన.
పైకప్పుకు బిగించిన బల్బు అప్పుడప్పుడూ మినుకుమినుకుమంటూ ఆరుతో వెలుగుతోంది. ఆ పల్చని వెలుతురులో ప్రయాణికుల ముఖాలు పాలిపోయిన మైనపు బొమ్మల్లా నిర్జీవంగా…

కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు అమీర్. మసకబారిన అద్దంలోంచి ఏమీ కనబడటం లేదు. ఆమాటకొస్తే చూడాలన్న స్ఫురణ కూడా లేదతనికి. చేతులు మాత్రం తన ఒడిలోని ఆ పాత సూట్‌కేస్ హ్యాండిల్‌ను అప్రయత్నంగా గట్టిగా పట్టుకుని ఉన్నాయి.

బయట విశాలమైన ఎడారి వెన్నెల వెలుగులో మౌనంగా పరుచుకుంది. ఆ నిశ్శబ్దమయిన ఊళ్ళు, ఇసుక దిబ్బలు, అరుదుగా కనిపించే పొదలు దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు నిశ్చలంగా ఉన్నాయి.

ఆ తెల్లటి వెన్నెల రంగు అతనికి ఆ దాడి జరిగిన రాత్రిని బలంగా గుర్తుచేసింది. పేలుడు శబ్దం కంటే ముందు, ఆకాశం పగలులా మారిపోయిన ఆ భయంకరమైన, కృత్రిమమైన వెలుగులాంటిదే అది. అతని కళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది.

అది ఒక మామూలు గురువారం రాత్రి. వాళ్ళ అపార్ట్‌మెంట్‌లోని వంటగదినుండి వేయించిన కోడిమాంసం, పులావ్ సువాసన వస్తోంది. భోజనాల బల్ల దగ్గర అతని భార్య అమీనే, పదేళ్ల కూతురు కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద పాత పింగాణీ ప్లేట్లు.

కూతురు తన పాఠశాల హోంవర్క్ గురించి, టీచర్ గురించి ఏదో ఫిర్యాదు చేస్తోంది. అమీనే చిరునవ్వుతో ఆమె తల నిమురుతూ, పులావ్ వడ్డిస్తోంది.

చేతిలోని నీళ్ళ గ్లాసును పెదవులకు చేర్చాడు అమీర్. గ్లాసు మీది నీటి బిందువుల చల్లదనం అతనికి ఇంకా స్పష్టంగా గుర్తుంది.

సరిగ్గా అప్పుడు.

ఆకాశం బద్దలైంది. చెవులు పగిలిపోయే పేలుడు శబ్దం రాలేదు ముందు. కేవలం తెల్లటి వెలుగు. వేలాది సూర్యులు ఒక్కసారిగా ఇంట్లోకి దిగివచ్చినట్లు… ఆ వెలుగు తీవ్రతకు తన చేతిలోని గ్లాసు, అందులోని నీరు, చుట్టూ ప్రపంచం క్షణంలో ఆవిరైపోయినట్లు అనిపించింది అమీరుకు.

సమయం గడ్డకట్టుకుపోయింది. ఆ భయంకరమైన వెలుగు తగ్గేసరికి… దట్టమైన దుమ్ము, మందుగుండు వాసన, రక్తం రుచి, గొంతులో పచ్చి మట్టి.

స్పృహలోకి వచ్చిన అమీర్ కళ్ళు తెరిచాడు. ఇల్లు లేదు. అమీనే లేదు. తన కూతురు లేదు. నవ్వులు లేవు, అన్నం వాసన లేదు. పగిలిన పింగాణీ ముక్కలతో సహా అంతా బూడిద అయిపోయింది. కేవలం విశాలమైన, లోతైన గొయ్యి. కాలిపోయిన ఇటుకలు, వంకర తిరిగిన ఇనుప చువ్వలు…

అదంతా ఒక భయంకరమైన కల. ఆ రాత్రి తాను ఏడవలేదని అతనికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ దుమ్ముతో నిండిన శిథిలాల మధ్య, చొక్కాకు అంటిన చిన్న రక్తపు మరక ఒక్కటే అతనికి గుచ్చుకుంటోన్న వాస్తవం.

పక్క సీట్లో ఒక యువతి తన బిడ్డను గుండెలకు హత్తుకుని నిద్రపుచ్చుతోంది. ఆ బిడ్డ చిన్నగా మూలుగుతూ, తన తల్లి ఉన్ని శాలువాను మురికి పట్టిన చిన్న చేతులతో గట్టిగా పట్టుకుని ఉంది.

చూస్తున్న అమీర్ గుండెలో నరమేదో గుంజుకు పోయింది. ఇప్పుడు తన చేతులు ఖాళీ. రక్షించడానికి ఎవరూ లేరు, కాపాడుకోవడానికి ఏమీ మిగలలేదు. కిటికీ అద్దం మీద తన నీడ. అద్దం వెనుక కదులుతున్న ఎడారి చీకటి, అతని ముఖాన్ని మరింత వృద్ధుడిలా చూపిస్తోంది. ఆ క్షణంలో, తను కూడా ఆ ఇటుకల కిందే తన కుటుంబంతోపాటు చనిపోయినట్లు, ప్రాణం లేని శరీరం మాత్రమే ఈ రైల్లో గమ్యమంటూ లేకుండా భారంగా లాగబడుతోన్నట్లు అతనికి స్పష్టంగా అర్థమైంది.

రాత్రి మధ్యజాము అవుతోంది. చాలామంది ప్రయాణికులు అసౌకర్యంగానే నిద్రలోకి జారుకున్నారు. అమీర్ సూట్‌కేస్‌ తెరిచి, అంచులు నలిగిపోయిన ఒక పాత విప్లవ కవిత్వపు పుస్తకాన్ని బయటకు తీశాడు. ఒకప్పుడు ఆ కవిత్వంలోని మార్క్సిస్ట్ భావజాలం, పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాటం, శ్రామిక వర్గవిప్లవం గురించి చదువుతుంటే అతనికి రక్తం ఉడికిపోయేది. తెహ్రాన్ వీధుల్లో తన స్నేహితులతో కలిసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతను చేసిన నినాదాలు గుర్తొచ్చాయి. వాళ్ళు ఎంత అమాయకులో! విప్లవాలు, సిద్ధాంతాలు, దేశభక్తి నినాదాలు… ఆకాశంనుండి ఒక్క బాంబుపడితే చాలు, అవన్నీ బూడిదగా మారిపోతాయి కదూ!

ఆ పుస్తకం ఇప్పుడు ఒక పాత స్నేహితుడి సమాధి. తన యవ్వనపు ఆశయాలకు శవపేటిక. కాగితాల మీది పదాలకు, నిజజీవితంలో నెత్తురోడే గాయాలకు సంబంధమేముంది? ఒక నిట్టూర్పు విడిచి, ఆ పుస్తకాన్ని ఒక పసిబిడ్డను పడుకోబెట్టినంత సున్నితంగా సూట్‌కేస్‌లో పెట్టి మూసేశాడు.

తెల్లవారుజాము. రైలు ఒక నిర్మానుష్యమైన స్టేషన్‌లో ఆగింది. చలిగాలి బోగీలోకి దూసుకొచ్చింది. రాత్రి అంతా ఏమీ తినకపోవడంతో ఆకలితో పేగులు మండుతున్నాయి. ప్లాట్‌ఫారమ్ మీద ఒక వృద్ధుడు ఒక బుట్టలో ఎండు రొట్టెలు అమ్ముతున్నాడు. అమీర్ కిటికీలోంచి చేయి చాచి ఒక రొట్టెను కొన్నాడు. రొట్టె ఇంకా కొద్దిగా వెచ్చగా ఉంది. దాన్ని చేతిలోకి తీసుకోగానే, అతని చేతులు అసంకల్పితంగా, ఒక యంత్రంలా, అలవాటు ప్రకారం ఆ రొట్టెను మూడు ముక్కలుగా విరిచాయి.

గత ఇరవై ఏళ్లుగా ప్రతిరోజూ, బ్రేక్ ఫాస్ట్ సమయంలో అతను చేసే పని అది. ఒకటి తనకు, ఒకటి అమీనేకి, మరొకటి కూతురికి. క్షణం పాటు అతని చేతులు అలాగే గాలిలో ఆగిపోయాయి. ఆ రొట్టెను అందుకోవడానికి ఎవరూ లేరని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. ఆ రెండు ముక్కలను అరచేతుల్లో పెట్టుకుని ఉండిపోయాడు.

రొట్టెలోని యీస్ట్ వాసన అతనికి తన ఇంటి వంటగదిని గుర్తు చేసింది. ఏడుపు రాలేదు, కన్నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి, కానీ గొంతులో ఏదో ముద్ద అడ్డుపడినట్లుగా అనిపించింది. ఆకలి చచ్చిపోగా, తన ముక్కను మాత్రమే తీసుకుని, మిగిలిన రెండు ముక్కలను మళ్ళీ జాగ్రత్తగా కాగితంలో చుట్టి, వాటిని ఒక పవిత్రమైన ప్రసాదంలా సూట్‌కేస్‌లో దాచుకున్నాడు. అవి ఎండిపోయి రాళ్ళవుతాయని తెలిసినా, వాటిని పారేయడానికి మనసు అంగీకరించలేదు.

మధ్యాహ్నం సమయం. ఎండ వేడిగా కాస్తున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఎదురుగా ఇప్పుడొక వృద్ధుడు కూర్చున్నాడు. అతను వచ్చి కూర్చున్నప్పటి నుండి ఆగకుండా మాట్లాడుతున్నాడు. “మనం ఈ సామ్రాజ్యవాదులకు బుద్ధి చెప్పాలి. మన దేశం ఎప్పటికీ తలవంచదు,” అంటున్నాడు ఉపన్యాసమిస్తున్నట్లు.

అమీర్ అన్నీ వింటున్నాడు కానీ అతని మనసులోకి ఆ పదాలు ఏవీ వెళ్లడం లేదు. వృద్ధుడు చేతులు ఊపుతూ మాట్లాడుతుంటే, అమీర్ దృష్టి అంతా ఆ వృద్ధుడి పాత ఉన్ని కోటుకు ఉన్న ఒక బటన్ పైకి మళ్ళింది. ఊడిపోవడానికి సిద్ధంగా ఉందది. కేవలం ఒక్క సన్నటి దారం దాన్ని కోటుకు పట్టి ఉంచుతోంది. ఆ వృద్ధుడు కదిలినప్పుడల్లా ఆ బటన్ వేలాడుతోంది.

ఆ ఒక్క దారం పోగులో అమీర్‌కు మానవ జీవితపు అస్థిరత్వం కనిపించింది. ఎంత పెద్ద యుద్ధాలు జరిగినా, ఏ దేశం విజయం సాధించినా, సామాన్యుడి జీవితానికీ ఆ దారంపోగుకున్న బలానికీ తేడా లేదనిపించింది.

ఆ వృద్ధుడు ఉపన్యాసం ఆపి, “నువ్వేమంటావు? విజయం మనదే కదోయ్?” అన్నాడు. అమీర్ ఆ బటన్ వైపు నుండి చూపు తిప్పుకోకుండా, “ఇది చలికాలం. మీ కోటుకు ఆ బటన్ కుట్టుకుంటే మంచిది,” అన్నాడు నెమ్మదిగా. ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా అమీర్ వైపు చూశాడు. బోగీలో మళ్ళీ రైలు చక్రాల చప్పుడు మాత్రమే మిగిలింది.

రైలు సరిహద్దులకు చేరుకుంటోందని కండక్టర్ అరుస్తున్నాడు. గాలిలో ఇప్పుడు సముద్రపు తేమ, మంచు వాసన కలిసి వస్తున్నాయి.

అమీర్ తన కుడి జేబులో చేయి పెట్టుకున్నాడు. అతని వేళ్ళకు ఒక పాత ఇత్తడి తాళంచెవి తగిలింది. అది ఇస్ఫహాన్‌లో వాళ్ళ అపార్ట్‌మెంట్ తాళపు తాళంచెవి. తండ్రి తనకు ఇచ్చిన ఇల్లు అది. ఇన్నేళ్ళ వాడుకతో ఆ తాళంచెవి అంచులు అరిగి మెరుస్తున్నాయి. దాన్ని చేతిలోకి తీసుకోగానే, ఆ లోహపు చల్లదనం ఎంతో పరిచయంగా అతన్ని తాకింది.

సాయంత్రం ఇంటికి చేరగానే వినవచ్చే తాళం తెరచుకుంటున్న శబ్దం, లోపలనుండి వెంటనే వినవచ్చే అమీనే అడుగుల చప్పుడు, వంటగదినుంచి వచ్చే బియ్యం సువాసన… అన్నీ ఒక్కసారిగా అతని మనసులో మెదిలాయి.

కానీ ఇప్పుడు ఆ తలుపు లేదు, ఆ ఇల్లు లేదు, అసలా తాళంచెవి తెరిచే ప్రపంచమే ఇప్పుడు లేదు. ఆ తలుపు ఇంకా ఈ విశ్వంలో ఎక్కడో ఉన్నట్లుగా, ఎప్పటికైనా తాను ఆ తలుపు తెరుచుకుని ఇంట్లోకి వెళతానన్నట్లుగా అతను ఆ తాళంచెవిని భద్రంగా పట్టుకున్నాడు. అది తాళంచెవి కాదు, తన గత జీవితానికి మిగిలిన ఏకైక సాక్ష్యం అన్న స్పృహతో, దాన్ని అపురూపంగా మళ్ళీ సూట్‌కేస్‌లో, కాలిన గౌను ముక్క పక్కన ఉంచాడు.

ఆ చిన్న సూట్‌కేస్ ఇప్పుడతని కుటుంబానికి చెందిన ఒక సంచార స్మశానం.

చివరి స్టేషన్. తబ్రిజ్ సరిహద్దు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం తమ సామాన్లతో టర్కీ వైపు పరుగులు తీస్తున్నారు.

అందరి ముఖాల్లోనూ భయం, ఆందోళన, త్వరగా ఈ దేశం దాటిపోవాలన్న తపన. అమీర్ అందరూ దిగేక నెమ్మదిగా రైలు దిగాడు.

సూర్యుడు అస్తమిస్తున్నాడు. జరిగిన దారుణాన్ని నెమరు వేసుకుంటున్నట్లు ఆకాశం రక్తం రంగు పులుముకుంది. నేలమీద పడుతున్న అతని నీడ పొడవుగా, దెయ్యంలా సాగుతోంది. కింద పెట్టిన సూట్‌కేస్‌ను ఎత్తాడు అమీర్. అందులో తన భార్య నవ్వు, తన కూతురి భవిష్యత్తు, తన ఇంటి వాసన, తన కాలిపోయిన జీవితం అన్నీ అన్నీ ఉన్నాయి.

ఆ పాత సూట్‌కేస్ ఇప్పుడు చాలా తేలికగా ఉంది, కానీ దాన్ని మోస్తున్న అతని చేతులు మాత్రం అది ఒక నిండు శవపేటికంత బరువుగా ఉన్నట్లు వణుకుతున్నాయి.