“యాదుం ఊరే; యావరుం కేళిర్
తీదుం నండ్రుం పిఱర్ తర వారా;
నోదలుమ్ తణిదలుమ్ అవట్రోరన్న; …”ఏ ఊరైనా మన సొంత ఊరే, అందరూ మన బంధువులే. మంచి, చెడు అన్నవి మనకు ఇతరులు చేసేవి కావు. దుఃఖము, ఓదార్పు అన్నవి కూడా అంతే, అవి మనలోనుండే కలిగేవే.
“పుఱనానూఱు” అనే తమిళ కావ్య సంకలనంలో కణియర్ పూంగుండ్రనార్ అన్న కవి చెప్పిన మాటలవి. నేటికీ ఆ కావ్య సౌరభాలు తమిళ నాట నిత్య నూతనంగా గుబాళిస్తూనే ఉన్నాయి.
సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, దక్షిణ భారతదేశంలో, తమిళ నాట ఒక అద్భుతమైన సాహిత్య సంప్రదాయం వికసించింది. దీనినే నేడు సంగ సాహిత్యం అని అంటున్నారు. ఈ సాహిత్యం ఏవో జానపదులు పాడుకొన్న అల్లిబిల్లి పాటల సమాహారం కాదు; ఛందోబద్ధమైన కావ్య రీతులలో అప్పటి ప్రజల జీవితం, ప్రేమ, ధైర్యం, బాధ, ఆశలు, విలువల ప్రపంచాన్ని మన ముందుకు తీసుకొచ్చే సజీవమైన చరిత్ర.
ఏమిటీ సంగ సాహిత్యం?
తమిళ సాహిత్య సంప్రదాయం ప్రకారం దాదాపు పది వేల సంవత్సరాల కాలంలో మూడు తమిళ సంగాలు విలసిల్లాయి. ‘సంగం’ అంటే కవుల సభ. ఈ సభల్లో కవులు తమ రచనలను చదివి, చర్చించి, పరస్పరం ప్రోత్సహించుకున్నారని సంప్రదాయం చెబుతుంది. సంగం అన్నది ఒక భాషా, సాహిత్య అకాడెమీ వంటిది అని అర్థం చేసుకొంటే చాలు. చరిత్ర పరంగా ఈ సభలపై చర్చలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందులో పుట్టిన కవిత్వం మాత్రం కాలాన్ని జయించి నిలిచింది. మొదటి సంగం ప్రాచీన మదురై నగరంలో, రెండవది కపాటపురం అనే నగరంలో ఉండేవి. ఈ రెండు నగరాలు నేడు సముద్రంలో కలిసి పోయినాయని ఇతిహాసం. ఆ నాటి సాహిత్యం ఏదీ అందుబాటులో లేదు. తమిళ వ్యాకరణ గ్రంథం ‘తొల్కాప్పియం’ రెండవ సంగ కాలానికి చెందినదని కొందరు అంటారు గానీ దానిపై అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మూడవ తమిళ సంగం క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 100వ సంవత్సరం మధ్య కాలంలో ఇప్పటి మదురై నగరంలో వర్థిల్లింది. ఆ కాలంలో సృష్టించబడిన తమిళ సాహిత్యాన్నే ఇప్పుడు సంగ సాహిత్యమంటారు. ఈ కాలంలో ఇంచుమించుగా 473 మంది కవులు, కవయిత్రులు 2,381 కవితలను సృజించారు.
సంగ సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకునే కవిత సంకలనాలు ఇవీ :
- ఎట్టుతొగై (ఎనిమిది పద్య సంకలనాలు)
- పత్తుప్పాట్టు (పది దీర్ఘ కవితల సంకలనం)
- తొల్కాప్పియం (వ్యాకరణం, ఛందస్సు, కావ్య రీతులపై లక్షణ గ్రంథం)
ఆ కాలంలోని సాహిత్యాన్ని రెండు రకాలుగా విభజించారు. ప్రకృతి, ప్రేమ, ప్రణయం, విరహం ప్రధాన వస్తువులుగా ఉన్న కావ్యాలను ‘అగం’ అనీ, వ్యక్తుల వీరత్వం, శౌర్యం, దయ, దాన గుణాలను కీర్తిస్తూ చెప్పినవి, వైరాగ్యాన్ని ప్రబోధించేవి అయిన కావ్యాలను ’పుఱం’ అనీ పిలిచారు. స్థూలంగా అగం వ్యక్తిగతమైన విషయాలను వర్ణిస్తే, పుఱం వ్యక్తుల బాహ్య వ్యవహారాలను వర్ణిస్తాయి. మొదటి రకంలోని శ్రేష్టమైన కవితలను ఏర్చికూర్చినవి ఐదు సంకలనాలు. మూడు పాదాలనుండి ఐదు పాదాల పద్యాలు ఒక ఐదు వందలు కూర్చినది “ఐంగుఱునూఱు” అనే గ్రంథం. నాలుగు నుండి ఎనిమిది పాదాల పద్యాలు నాలుగు వందలు కూర్చిన సంకలనం ‘కుఱుంతొగై’. తొమ్మిది నుండి పండ్రెండు పాదాలున్న పద్యాలు నాల్గు వందలున్న సంకలనం ‘నట్రిణై’. పండ్రెండు కంటె ఎక్కువ పాదాలున్న నాలుగు వందల పద్యాల కూర్పు ‘అగ నానూఱు’. కలిప్పా అన్న చందస్సులో కూర్చిన ఒక నూట యాభై కవితలను సంకలించిన గ్రంథం ‘కలిత్తొగై’. ఈ ఐదు సంకలనాలను అగప్పోరుళ్ వర్గానికి చెందిన సాహిత్యం.
పురప్పొరుళ్ వర్గానికి చెందిన మరో నాలుగు వందల కవితల కూర్పు ’పుఱనానూఱు’. పరిపాడల్ అనే డెబ్భై కవితల సంకలనం (అందులో ఇప్పడు 22 మాత్రమే లభ్యం), చేర దేశపు రాజు వదిన్మరైను కీర్తిస్తూ పది దశకాలుగా చెప్పిన వంద పద్యాల సంకలనం ‘పదిట్రుపత్తు’. భారతదేశంలో అత్యంత పురాతనమైన కావ్య సంకలనాలు బహుశా ఇవే. అందులో మళ్ళీ ’అగనానూఱు’ మరింత ప్రశస్తమైనదిగా పరిగణించబడుతోంది. స్థూలంగా ’అగం’ కాల్పనిక సాహిత్యమని, ’పుఱం’ ఆనాటి రాజుల, వీరుల గుణ గణ గానమని అనుకోవచ్చు.
సంగ సాహిత్యంలోని ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి స్థల నిర్ణయం. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క స్థలం నిర్దేశింపబడింది. ఈ స్థలాన్ని ’తిణై’ అంటారు. పర్వతప్రాంతాలు, పచ్చికబయళ్ళు, వ్యవసాయభూములు, సముద్రతీరాలు, ఎడారి ప్రాంతాలు అంటూ అగం కవిత్వానికి సంబంధించినంత వరకు ఈ తిణైలు అయిదు. ఎలాంటి కవిత్వం ఏ తిణై పూర్వ రంగంలో జరగాలో తమిళ భాషలో దొరుకుతున్న మొదటి వ్యాకరణ గ్రంధం తొల్కాప్పియంలో వివరంగా చర్చింపబడింది. అలానే పుఱం కవిత్వానికి కూడా వేర్వేరు తిణైలు ఉన్నాయి. అవి స్థలాన్ని కాకుండా, చర్యలను సూచించేవి.
అగం వర్గానికి చెందిన అయిదు తిణై వివరాలు:
- కుఱింజి (పర్వత ప్రాంతం)
ఈ తిణై పర్వత ప్రాంతాలను సూచిస్తుంది.
ఇతివృత్తం: ప్రేమికుల కలయిక, రహస్య సమాగమం, నిరీక్షణ (వివాహపూర్వ ప్రేమ).
దేవత: మురుగన్.
వృత్తి: వేట, సేకరణ.
ప్రతీకలు: పన్నెండేళ్లకు ఒకసారి వికసించే కుఱింజి పువ్వు వికాసంతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రేమికుల అరుదైన, తీవ్రమైన కలయికకు ప్రతీక.
- ముల్లై (పచ్చిక బయళ్ళు/అటవీ ప్రాంతం)
ఇది అడవులు, చుట్టుపక్కల ఉన్న పచ్చిక బయళ్ళను సూచిస్తుంది.
ఇతివృత్తం: ఓపికతో వేచి ఉండటం (ప్రియమైన వ్యక్తి తిరిగి రావడం కోసం).
దేవత: మాయోన్ (విష్ణువు).
వృత్తి: పశు పోషణ, పాడి పంటలు.
ప్రతీకలు: భర్త విధులపై లేదా యుద్ధానికి వెళ్ళి దూరంగా ఉన్నప్పుడు భార్య నుండి ఆశించే సహనం, శీలం వంటివాటిని ప్రతిబింబిస్తుంది.
- మరుదం (వ్యవసాయ భూములు, మైదానాలు)
ఈ తిణై తడి నేలలు, సారవంతమైన వ్యవసాయ భూములను పూర్వరంగంగా చేస్తుంది.
ఇతివృత్తం: ప్రేమికుల కలహాలు లేదా తాత్కాలిక విభేదాలు (అలుకలు).
దేవత: ఇంద్రుడు.
వృత్తి: వ్యవసాయం.
ప్రతీకలు: తాత్కాలిక కలహాలు, రాజీలు జరిగే స్థిరమైన గృహస్థ జీవితం.
- నెయ్దల్ (రేవు పట్టణం/సముద్ర తీరం)
ఇది సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినది.
ఇతివృత్తం: వియోగం, విరహం/విలాపం.
దేవత: వరుణుడు (సముద్రుడు).
వృత్తి: చేపల వేట, ఉప్పు తయారీ.
ప్రతీకలు: వియోగం యొక్క దుఃఖాన్ని, సముద్రయానంనుండి ప్రియమైన వ్యక్తి తిరిగి రావడం కోసం ఆశను రేకెత్తిస్తుంది.
- పాలై (శుష్కభూమి/ఎడారి)
ఇది ఎండిపోయిన లేదా ఎడారి లాంటి ప్రాంతాలను సూచిస్తుంది.
ఇతివృత్తం: కష్టాలు, వియోగం, కఠినమైన భూభాగంలో ప్రయాణం.
దేవత: కొట్రవై (యుద్ధ దేవత).
వృత్తి: దోపిడీ, ప్రయాణికులను అడ్డగించడం.
ప్రతీకలు: ప్రేమికులు భరించే కష్టమైన ప్రయాణం, బాధాకరమైన వియోగాన్ని సూచిస్తుంది. ఇది నాయకుడు సంపాదన కోసం దూరంగా వెళ్ళడానికి దారితీస్తుంది.
ఇవే కాక ఒక్కో తిణై లోను, నగరాల పేర్లు ఎలా ఉండాలి, వారు తినే ఆహారం ఏమిటి, వారి కట్టుబొట్లు, కట్టుబాట్లు ఏమిటి, వారు పెంచుకునే పక్షులు, జంతువులు ఏవి… ఇలా అన్నీ వివరంగా చర్చింపబడి ఉన్నాయి. తమిళ సాహిత్యంలో ఈ స్థల పూర్వరంగ నిర్ణయం ఎంత బలంగా ఉందంటే, ఈ నాటి సినీ కవులు కూడా తమ పాటల్లో ప్రతీకలు వీలైనంతవరకు ఈ తిణైలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తపడతారు.
తిణై వ్యవస్థ అంటే ప్రకృతి ద్వారా ప్రకటితమయ్యే భావాలు అన్నమాట. సంగ కవిత్వంలో భావాలను నేరుగా చెప్పరు. వాటిని ప్రకృతి ద్వారా సూచిస్తారు. దానికి ఈ తిణై పద్దతి ఉపకరిస్తుంది.
- కుఱింజి – పర్వతాలు – గోప్య ప్రేమ
- ముల్లై – అడవులు – ఎదురు చూపు
- మరుదం – పొలాలు – దాంపత్య జీవితం
- నెయ్దల్ – సముద్ర తీరాలు – వియోగం
- పాలై – ఎడారి – కష్టం
ఉదాహరణకు, ఒక కుఱింజి కవితలో అర్ధరాత్రి వికసించే పువ్వు, ఒక పక్షి కూయడం వర్ణిస్తే – అక్కడ ప్రేమికుల గోప్య కలయిక ఉందని పాఠకుడు గ్రహిస్తాడు. ఇలా సంగ కవిత్వం మొత్తంలోను ప్రకృతిని ప్రతీకాత్మకంగా వర్ణించారు తప్ప, కేవలం ప్రకృతి అందాలను వర్ణించడం కోసమే వ్రాసిన పద్యాలు దాదాపుగా లేవు. సంగ సాహిత్యానికి ఇది ఒక ప్రత్యేకత. తెలుగు వారి వర్ణనాత్మకమైన ప్రబంధ కావ్య శైలికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనది.
తిణైల గురించి ఇక్కడ ఇంతకన్న వివరంగా చర్చించలేము. కనుక వాటిని వదిలి సంగ కవిత్వాన్ని కొంత పరిశీలించుదాం.
వందల యేళ్ళ పాటు వందలాది కవులు రచించిన పద్యాల సంకలనాలివి. అయితే వీటిలో చాలా మంది కవులు తమ పేరు, ఊరు వంటి వ్యక్తిగత వివరాలను ఎక్కడా చెప్పుకోలేదు. ఇది సంగ కాలంలోనే కాక తరువాత కూడా తమిళ సాహిత్యంలో ఆనవాయితీ అయింది. ఈ సంకలనాలు కూర్చిన కాలంలో సంకలనం చేసినవారు వారి కవిత లోని ఏదో ఒక ప్రత్యేకతను బట్టి వారికి పేరు పెట్టారు. ఉదాహరణకు ‘తొల్ కాప్పియం’ అన్న వ్యాకరణాన్ని వ్రాసిన కవి పేరు “తొల్కాప్పియర్” అయింది. ప్రేయసీ ప్రియులు ఎర్ర మట్టి , నీళ్ళ వలె కలిసిపోయారని ఉపమానం చెప్పిన కవికి ‘ఎర్రమట్టి నీళ్లాయన’ (చెంబులప్పెయల్ నీరార్) అని పేరు పెట్టారు. నీటి ప్రవాహంపైని చిరు నురగ రాళ్ళను ఢీకొని కరిగి పోవడాన్ని వర్ణించిన కవి పేరు “రాయిపై చిరు నురగ కవి” (కల్పొరు చిఱునురైయార్) అయింది. చెత్త కుప్పపై కోళ్ళ పోట్లాటను వర్ణించినాయన పేరు “కుప్పపై కోళ్ళాయన” (కుప్పై కోళియార్) అయిపోయింది. వందకు పైగా కవులకు పేర్లు ఇలాగే ఏర్పడ్డాయి.
అత్యద్భుతమైన , ఉన్నతమైన ప్రణయ కవిత్వం ’నట్రిణై’లో కనిపిస్తుంది. మచ్చుకొకటి:
తెలుగులిపిలో
పిఱప్పు ప్పిఱిదు ఆగువదు ఆయిన్
మఱక్కువేన్కొల్ ఎన్ కాదలన్ ఎనవే” (397, నట్రిణై)
తమిళలిపిలో
பிறப்புப் பிறிது ஆகுவதுஆயின்,
மறக்குவேன்கொல், என் காதலன்’ எனவே.
ప్రియుని రాక కోసం వేచి వేచి విరహబాధతోనే మరణిస్తానేమో అని భయపడుతోంది నాయిక. ఐతే ఆ భయం మరణం గురించి కాదు. పునర్జన్మ ఎత్తితే గతజన్మ స్మృతులు మాయమై తన ప్రియుని మరచిపోతానేమో అని భయమట!
ఇలాంటి అందమైన భావనలు నట్రిణై, కుఱుంతొగై, అనానూఱు అంతటా కనిపిస్తాయి.
తెలుగులిపిలో
ఎందైయుం నుందైయుం ఎమ్ముఱైక్ కేళిర్
యానుం నీయుం ఎవ్వఴి యఱిదుం
చెంబులప్ పెయనీర్ పోల
అన్బుడై నెంజం తాంగలన్ దనవే (40, కుఱుంతొగై)
తమిళలిపిలో
எந்தையும் நுந்தையும் எம்முறைக் கேளிர்
யானும் நீயும் எவ்வழி யறிதும்
செம்புலப் பெயனீர் போல
அன்புடை நெஞ்சம் தாங்கலந் தனவே
— 40, குறுந்தொகை
“నా తల్లికి నీతల్లి ఏమౌతుంది! నా తండ్రికి నీ తండ్రితో ఏ చుట్టరికం ఉంది! నేను, నువ్వు ఒకరినొకరం ఏవిధంగా ఎరుగుదుం! ఐనా ప్రేమతో మన హృదయాలు ఎఱ్ఱమట్టితో వాన నీరు కలిసినట్లు కలిసిపోయాయి కదా!” అని ఆశ్చర్యపోతాడు ఒక నాయకుడు.
సంగ సాహిత్యం మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది –- కాలం మారినా, మనిషి హృదయం మారదు. దాని సంవేదనలు మారవు. ప్రేమ, బాధ, ధైర్యం, దయ, కరుణ – ఇవన్నీ శాశ్వతమైనవి. ఈ కారణంగానే, రెండువేల ఏళ్ల తరువాత కూడా, సంగ కవిత్వం మనల్ని కదిలిస్తుంది. సంగ కవిత్వం దేవతలు లేదా పురాణ వీరుల గాథలకంటే, సాధారణ మానవ అనుభవాలను, అనుభూతులను కావ్య వస్తువుగా చేసుకుంటుంది. అందుకే తమిళ భాష తెలియని పాఠకులకు కూడా ఈ సాహిత్యం ఒక ప్రాచీన నాగరికత మనసును అవగాహన చేసుకునే అద్భుత ద్వారంగా మారుతుంది. సంగ సాహిత్యం కేవలం కవిత్వం కాదు — అది జీవన తత్త్వం. జీవితం పట్ల ప్రేమ, జీవనసమరం పట్ల ధైర్యం, ప్రకృతి పట్ల గౌరవం నేర్పించే ఈ సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో ఒక అపూర్వ రత్నం. అందుకే తెలుగు వారు ఈ సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలి, చదవాలి, అనుభూతి చెందాలి, ఆనందించాలి. అందుకోసం ఈ చిన్న ప్రయత్నం.
