డాక్టర్ భార్గవి ‘నా చదువు కథ’

డాక్టర్ భార్గవి ‘నా చదువు కథ’ దాదాపు చదువరులందరి కథ. ఈ పుస్తకమనే అద్దంలో ‘చందమామ,’ ‘బాల’లతో చదువు మీద ఆసక్తి పెంచుకుని మెల్లమెల్లగా చండీదాసునీ, త్రిపురనీ చదువుకునే దాకా కొనసాగి, ఇంకా కొనసాగుతూనే వున్న తరమందరినీ ఆ గ్రంథాలయంలోకి తీసుకు వెళ్ళి మళ్ళీ ఆ చందమామలను ప్రేమగా తడిమి ముచ్చటపడి ఇప్పటి అక్షర జ్ఞానానికి ఒకింత గర్వపడే కథ. అందరం ఆ రెండు జడల పిల్లతో కలిసి అరుగు మీద కూర్చుని చదువుకున్నతీయని ఙ్ఞాపకాల కథ.

కళ్ళతోనే గాని, వేళ్ళతో అంతగా పనిలేని కాలం కథ ఇది. ప్రతి మధ్యతరగతి ఇంట్లో తప్పనిసరిగా ఒక దినపత్రిక, ఒక బాలల పత్రిక, పెద్ద వాళ్ళ దగ్గర భారత భాగవతాలు వుండేవి ఒకరెవరో వంట సమయం మిగిల్చే కొత్త గాడ్జెట్స్ రావడం వల్ల స్త్రీలలో పత్రికలు చదివే అలవాటు పెరిగిందని ‘వ్యంగీకరించారు’. అందువల్ల వాటి సర్కులేషన్ పెరిగిందట. పత్రికలు పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలని మరొకరి వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవి వ్యాపార పత్రికలే కావచ్చు, కానీ ఇవాళ మనం తప్పకుండా చదవాల్సినవిగా చెప్పుకునే పుస్తకాలు చాలావరకూ పత్రికల్లో ధారావాహికంగా వచ్చినవే. పుంఖానుపుంఖాలుగా వస్తున్న నవలల్లో కథల్లో తాలునుంచి గింజలను తూర్పారబట్టడం పాఠకులకు నేర్పాయి పత్రికలు అప్పుడు చదవడం ఇష్టం గా మొదలుపెట్టిన యువతి మన భార్గవి. వ్యక్తిత్వం సంతరించుకుంటున్న కాలంలో అంటుకున్న సాహిత్య ప్రేమ నిలిచి వెలుగుతుంది.

భార్గవి చెప్పినట్టు 1960 నుంచి 80 వరకూ వార మాస పత్రికలకు స్వర్ణయుగం. అవి చదువరులకు గొప్ప రచయితలను పరిచయం చేసాయి. అటువంటి గొప్ప రచయితలయిన చలం, కుటుంబరావు, రావిశాస్త్రి, ఆర్.వసుంధరాదేవి, చండీదాస్, మంచి అనువాదకుడైన చక్రపాణి గురించీ, ఇంకా అనేకుల గురించీ ఈ పుస్తకంలో వివరంగా రాసింది భార్గవి. అంతే కాకుండా ఒక సమయంలో వచ్చిన పత్రికలూ, వాటి ప్రత్యేకతా, కొందరు రచయితల జీవననేపథ్యాన్ని కూడా చెప్పింది ఈ పుస్తకంలో. ఈ కథ చెప్పడం వెనుక చాలా కృషీ, శ్రద్దా వున్నాయి. భార్గవి చెప్పిన తన చదువు కథలో కేవలం ఒక చదువరిగా మొదలైన ఆమె ప్రయాణం మాత్రమేకాక ఉత్తమ సాహిత్య ప్రేమికురాలిగా, విశ్లేషకురాలిగా ఎదిగిన క్రమాన్ని గమనించవచ్చు. భార్గవి ‘నా చదువు కథ’ తెలుగు సాహిత్య రంగంలో ఒక పిరియడ్ కథ. ఇప్పటి యువతరం తప్పక వినవలసిన కథ. చరిత్ర అని కూడా అనొచ్చు.

ఆసక్తులు అంకురించే వయసులో రచయిత ముఖచిత్రమూ, ముందూ వెనుకా ఆ కాలపు పత్రికలూ, సినిమా పత్రికల రంగుల చిత్రాలు, ప్రతి పుటలోనూ ప్రసిద్ధ వ్యక్తుల ఫొటోలతో 94 పేజీలు మాత్రమే వున్న ఈ చిన్న పుస్తకం లో ఎంతో విలువైన విషయాలు వున్నాయి. ఈ పుస్తకం ఇంతటితో ముగిసింది అని నేను అనుకోవడం లేదు. దీనికి రెండో భాగం కూడా వస్తుందని, రావాలని ఎదురుచూస్తున్నాను.