ఇల్లు విడిచి ఒళ్ళు మరచి పచ్చని నీడల్లా నిలచిన కొండకోనల్లో ఆనందవిహారం చేసొద్దామన్న స్పృహ, సరదా అనేకమందికి అరుదయిన పగటి కల. కానీ పగటి కలో, రాత్రి కలో రాఘవశర్మగారికి బుద్ధిపుట్టి, అది పెరిగి పెనురెక్కలను ఏపుగా పెంచింది. ఫలితంగా ఏ పెద్దలూ నిర్ణయించని సుముహూర్తంలో విరాగిలా కొండల వెంట పడ్డారాయన. కొండల్లో నెలకొన్న కోనేటిరాయుడి తాలూకు శేషాచలం కొండల అడవిదారుల్లో మనసు ఉరకలు వేసినంతా తిరిగారు. అపురూపమయిన జలాశయాలు, తీర్థాలు, గుహలు, రాళ్ళ వంతెనలూ దాటి వాటి లోయల కింద ఎక్కడెక్కడో మొదలయిన జలపాతాల వెంట తిరిగారు. అలా నడచి నడచి మంచి పుస్తకం ఒకటి రాసి ఇలా తీసుకొచ్చారు. ఆ పుస్తకం పట్టి చదువుతోంటే నేనూ ఆయనతోపాటు తిరుగుతున్నట్టే ఉంది. చదివితే మీకూనూ అలాగే ఉంటుంది.
‘రాఘవ’ అని పుస్తకం మీద పేరుగల ఈ రచయిత సిసలు పేరు రాఘవశర్మ. సీనియర్ జర్నలిస్టు, కవి, రచయితానూ. పుస్తకం పేరు శేషాచలం కొండల్లో (తిరుమల దృశ్యకావ్యం-2). ఇది తిరుమల దృశ్యకావ్యం-1కి తదుపరి భాగం. వాహ్యాళికని వెళ్ళినట్టు తిరుమల కొండల మీద రచయిత చాలాసార్లే కాలుగాలని పిల్లివలె, జింకపిల్లవలె ప్రేమ మీర తెగ తిరిగొచ్చారు. ఒక్కరే కాదు, ఓ ట్రెకర్ జాతిని పట్టుకునే. ఇదో మహా సాహసయాత్ర. కులం, మతం, ప్రాంతం, జాతి, హోదా, గార్దభాండం వంటి ఏ తేడాల్లేని మహోత్సాహ, విజ్ఞాన దాహం ఒక ఆర్తిని కలగజేసి అలా నడిపిస్తుంది… ప్రకృతి ఒక మిత్రునివలె, వేదాంతివలె, ఉపాధ్యాయునివలే తెలియజెప్పే విశేష అనుభవజ్ఞానం ఉత్తినే రాదు – అని ఎరుకగల రాఘవ వయసు మరచి శేషాచలం కొండల వింతల్లోకి నడచి, చూసి, గుచ్చెత్తించిన అనుభవమాల ఈ పుస్తకం. బోలెడన్ని మంచి ఫోటోలు, విశేషాల బాక్స్ ఐటమ్‌లు కూర్చి వట్టి సమాచార వేదిక వలె గాక చక్కగా చదివి ఆనందించే శైలిలో రాశారు.
చిట్టడవిలో వర్షం వస్తే, సుడిగాలి వీస్తే, చెట్లూ పొదలూ గడ్డీ ఎలా ఉంటాయో, వాటి మార్మిక సౌందర్యం ఏమిటో అడుగడుగునా గమనిస్తూ నడవటం ఒక ఎత్తు. కానీ దాన్ని పాఠకుడికి అంతే రసవత్తరంగా అందించే భాష, వాక్యాల స్వేచ్ఛా ప్రవాహపు ఒడుపు తెలియడం మరో ఎత్తు. అది తెలిసిన రాఘవగారు ఇదంతా కవిత్వంలో కాదుగానీ వచనంలో రాశారు. చూడండి… ఓ చోట జలపాతానికి ‘వేలాడే వెండి జలతారు’ అని పేరు పెట్టారు! నారాయణ తీర్థం, బ్రహ్మ తీర్థం వంటి కోనల్లో మనం హడలిచచ్చే అనకొండ వంటి భారీ సుదీర్ఘమయిన ‘గిల్లి తీగ’ను కొండల నడుమవున్న ‘గజమాల’గా వర్ణిస్తారాయన. అడుగడుక్కీ పేజీల్లో ఇలాటివి కనిపిస్తాయి.
శిఖర, జలపాతాల వెంట తెచ్చుకున్న తాళ్ళ సాయం తప్ప సాయం లేని ప్రమాదకర ప్రాంతాల్లో సాగటం ఎలా? అందుకనే అక్కడ నిత్య ‘ట్రెకింగ్ వీరుడు’, ‘జలపాత స్వాప్నికుడు’ యక్షుడిలాగ డాక్టర్ ప్రసాద్ వంటివారు సిద్ధంగా ఉంటారట. కాలిబాటల్లో, లోయల లోతుల్లో రెల్లుపొదల స్పర్శ ‘అమ్మ తల నిమిరినట్ట’నిపిస్తుందట! నడుస్తోంటే పక్కన ఒక చెట్టుకొమ్మ చెంప ఛెళ్ళుమనిపిస్తే, ఆ కొమ్మ జాలిగా చూస్తోంటే ‘దెబ్బ తగిలింది నీకా నాకా!’ అనుకుంటూ నడుస్తాడీ రచయిత. ఎదురొచ్చే సన్నని వెదురుపుల్లలు మేష్టారి బెత్తాల్లాగ ఊగుతూ తప్పుదారి పట్టకు అన్నట్టు హెచ్చరిస్తుంటాయట! ఇలా సాగిపోతోంటే కొండల దొంతరలు ‘శక్తి కటారి తీర్థం’, ‘తాంత్రిక లోయ’లూ విస్మయాన్ని కలిగిస్తాయంటారు.
అలుపెరుగక నడుస్తోంటే సాటి ట్రెకర్లకు అలసట కలగకుండా కబుర్లు చెప్పే ‘జై బాలాజీ’ ఎవరో ఎదురొస్తారట. అతగాడెవరో చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని, పరోపకారార్థం అక్కడక్కడ ఉంటాడట. పంచకట్టు, పిల్లనగ్రోవితో సైకిల్ మీద తిరుగుతూ తన-పర భేదం లేకుండా పలువురి కోసం పాటుపడుతుంటాడట – అలాంటి సన్మార్గదర్శకుల పిట్ట కథలూ బాక్సులయివుంటాయీ పుస్తకంలో. లోయల్లో కైలాసతీర్థం, యుద్ధగళ, హలాయుధ తీర్థాలు, అన్నదమ్ముల తండ, ఎర్రచందనపు కోనలు ఎన్నో చూడవలసినవి పలకరిస్తాయి. మబ్బుల గుంపులో కుంగిపోయే వెలుగు, చిరుచీకట్లో కీచురాళ్ళ మధ్య నడకలో ఇలాటి కనీవినీ ఎరుగని పేరుగల వింత ప్రాంతాలు అక్కడి కథలు చెబుతాయట. దట్టపు లోయల్లో సాహసులు నడిచే ప్రాంతాలవి. ‘చామల కోన’ జడివానలో తడుస్తూ నడుస్తూంటే ‘డబ్బారేకుల కోన’ వస్తుందట; అక్కడి గిరిజనుల ఆత్మసౌందర్యం, జీవన వైవిధ్యం చూసి తెలుసుకోవాల్సిందేనట. అలాంటి బాటల్లో సుదీర్ఘ నడకల్లో వారూ వీరూ అని లేకుండా కలిసే వారంతా ఏకమై ఒకరికొకరు తోడ్పడుతూ ‘మనిషితనాన్ని’ నేర్చుకునే సద్భావం కలిగించే కొండల గుంపులవి అని చెబుతారు రచయిత. అందుకు ఉదాహరణ కోకొల్లలు చూపిస్తారు. ఆ అనుభవాన్ని బయట సాధారణ జీవితంలోకి అనువదిస్తే అది గొప్ప జీవన సౌలభ్యాన్నిస్తుందని ఆశావాదం పలుకుతారు రచయిత.
మరీ పెద్ద పుస్తకం ఏమీ కాదు – చిన్నదే. చదవటం పూర్తయేసరికి పాఠకులకు పైసా ఖర్చు, పిసరంత శ్రమ లేకుండా సనకసనందన తీర్థం, కాయరసాయన తీర్థం, అక్కగార్ల గుండాలు, మలయప్ప కోన, జ్వరహోర తీర్థం, తుంబుర తీర్థాలు గాక వెంగమాంబ గుహ, అందులో ‘దిగంబరస్వామి’ కథ ఎన్నో అద్భుత దర్శనాలవుతాయి. అప్పుడు ఆకలి వేస్తే అక్కడ అరుదుగా ఎదురయే ‘ఎలిఫెంటా ఆపిల్’ తినవచ్చు. ‘అకేషియా డల్హసి’ చెట్టు నీడన సేద తీర్చుకోవచ్చు. ఇలాగే దారీతెన్నూ లేని దశావతార తీర్థం దాటి శేష తీర్థాన్ని చూడవచ్చట. మెలికలు తిప్పే వాగుల నీటిలో కావాలనుకుంటే తప్పిపోనూవచ్చు. పైగా నీటి రాళ్ళ మధ్య జారిపడటం ‘ట్రెకర్ల జన్మహక్కు’ అట! ఇక అలా పడి దెబ్బలు తిని సొలసినవారికి మళ్ళా యవ్వన సత్తా రావాలంటే, ఆ చలిసాయంత్రాలు ఎర్రచందనం దుంగ పొడి వేన్నీళ్ళలో ఉడికించి చల్లార్చి వడగట్టి తాగితే చాలట… ‘పుష్పా’లవుతారు. అలాగే నడస్తోంటే పరిసరాల్లో ‘అపర నయాగరా’ గుంజన జలపాతం కనిపిస్తుందట. దాని మీద రచయిత మంచి కవిత రాసి పుస్తకంలో చేర్చారు. మరొక సంగతేమంటే- మనకు తెలిసిన కపిల తీర్థం దాటుకుని పోతే ఆపై బోలెడు జలపాతాలున్నాయిట; వాటికోసం భరద్వాజ తీర్థం దాటి వెడితే చాలు… సప్తరుషి తీర్థాలు, శనేశ్వర తీర్థం చూడటం ‘మస్ట్’ అంటున్నారు. అక్కడే భయత సౌందర్య గరుడ తీర్థం, ఇవతల మహాజలపాతం చూసి తరించిపోవాలనుకునేవారికి ‘లేని పునర్జన్మ విమోచన’ లభిస్తుందంటారు ఈ ట్రెకర్ రచయిత. పుస్తకంలో మరో ఆకర్షణ – ఘన గంభీర పర్వత నీడల్లో తిరుగుతూ రచయిత తమ తల్లిగారికి రాసిన లేఖ. అది చదివితే యుద్ధరంగం నుంచి తల్లిని స్మరించిన వీర సైనికుడు కనిపిస్తాడు – బహు బాగుంది. పుస్తకం ఆసాంతం చదవండి.
పుస్తకం: శేషాచలం కొండల్లో.. తిరుమల దృశ్యకావ్యం -2
రచన: రాఘవ
ప్రచురణ: పండు పబ్లికేషన్స్, తిరుపతి, 2025.
వెల: 200 రూ.
ప్రతులకు: రచయితను సంప్రదించండి. ఫోన్, ఈమెయిల్.