సౌరభం: అనుభూతార్థస్మృతి కదంబం

శేషేన్ ప్రభావితుడు శేషభట్టర్ గారి అష్టవింశతి అనుభూతార్థస్మృతుల వ్యాస కదంబం సౌరభం చేతికంది చాలా రోజులే అయినా స్పందించలేకపోవడానికి నా అవిజ్ఞతయే కారణం.

మధువును గ్రోలే ఏ కీటకమైనా మధుపమే. అయితే మధుపమనగానే తుమ్మెద అనో, తేనెటీగ అనో భావించటం కద్దు. కవితాంతరంగుడైన రఘు శేషభట్టర్ ఈ పొత్తానికి పూవుపై వాలిన చిత్రపక్ష విశేషమైన సీతాకోకచిలుకను ముఖచిత్రంగా వేసుకున్నారు.

నల్లని కురులను పోల్చడానికి ఉదహరించే తుమ్మెద మకరందం గ్రోలగానే ఝంకారం చేస్తుంది. భ్రమరనాదానికి మధురభక్తి భావానికి ముడి ఉన్నది. మరొక మధుపాయి తేనెటీగ పూలనుండి తేనె సంగ్రహించి పంచి పెడుతుంది. ‘తేనెజుంటీగలీయవా తెరవరులకు’ అన్నది అందరికీ తెలిసినదే.

ఇక, ఈ సీతాకోకచిలుక ఉన్నదే ఇది పూలనుండి తేనె తాగి కడుపు నింపుకోవడమే కాదు పూల రంగుల్ని ఒంటినిండా పులుముకొని తానే పువ్వయిపోతుంది. ఇది రసజ్ఞతను సూచించే లక్షణం. ‘చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకం’ అన్నాడు భాస్కర శతక కర్త మారవి వెంకయ్య కవి.

శేషభట్టర్ రఘుగారి వ్యాసకదంబం లోని వ్యాస శకలాలన్నీ (చిరు వ్యాసాలు) ఉత్తమసాహిత్యాధ్యయనోద్దిష్టమైనవి. అనేక సంస్కృత కావ్యాలలోని ఉత్తమ కవిత్వ లక్షణాలు గలిగిన శ్లోకాలనుదహరిస్తూ వాటిని పోలిన తెలుగు కవిత్వ రసగుళికలను ఎత్తి చూపి, కవిత్వమర్మాలను వివరించటమే ఈ వ్యాసాల ప్రధానోద్దేశము.

మందఃకవి యశః ప్రార్థీ గమిష్యామపహాస్యతాం
ప్రాంశులభ్యే ఫలేలోభా దుద్బాహురివ వామనః

అన్న కాళిదాసు ప్రసిద్ధ శ్లోకార్థంతో అరసికులైన కవులను హెచ్చరించటమే శేషభట్టర్‌గారి పుస్తక లక్ష్యం అని నాకనిపించింది.

తుమ్మెదలవంటి కాళిదాసాదులు తమ కవితా ఝంకారంతో పలువురు రసజ్ఞులను కవులుగా మారిస్తే, తేనెటీగల వంటి పండితులు మనకోసం మకరందాన్ని నిక్షిప్తం చేస్తే సుకవులు సీతాకోకచిలుకల వలె కవితాత్మకైక జీవనులై కవితలు వెలువరిస్తారని అన్యాపదేశ సూచన కనిపిస్తుంది వ్యాసాల నిండా.

తరువు పరాకాష్ట పుష్పవికాసం. పుష్పం సత్యశివసుందర ప్రతీక. వాసనలేని పువ్వు కొరగానిదని పెమ్మయ సింగధీమణి నుడివినట్లు సౌరభం లేని పువ్వు వంటిదే కుకవిత్వం. సౌరభానికి సువాసన అనే కాకుండా అనుభూతార్థ స్మృతి అని కూడా నైఘంటికార్థం. కనుక మంచి కవిత్వాన్ని అనుభూతించినపుడే మంచి కవిత్వం వెలువడగలదనేది విశేషార్థం. అధ్యయనం మకరంద రసాస్వాదన వంటిది. ఏ అధ్యయనం లేకుండా తాము రాసిందే కవిత్వమని ఎగిరిపడే వారికి ఈ పుస్తకమొక నిప్పుచురక.

‘పూతమెరుంగులున్ పసరుపూప బెడంగులు చూపునట్టివా కైతలు’ అన్నాడు అలనాడు అల్లసాని పెద్దన. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నాడు విశ్వనాథ పండితుడు. ఇన్ని విషయాలను స్ఫురించే విధంగా వ్యాసాలను అందించారు ఉత్తమ సాహిత్య సృజనాభిలాషియైన శేషభట్టర్ రఘుగారు. ముందుమాటలోనే:

కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతాం
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా

(ధీమతులు కావ్యశాస్త్ర పఠనంలో వినోదాన్ని వెదుక్కుంటే, మూర్ఖులైన వారు వ్యసనం, నిద్ర, కలహాల వంటి వాటితో బతుకుతారు) అని తన అంతర్లోకాలలో తారసపడ్డ కవుల కవిత్వాన్ని అవలోడనం చేసుకుని రాసిన వ్యాసాలుగా తన కవిత్వ ప్రేమను చెప్పుతారు ఈ కవి. అలా, తెలుగు సాహిత్యానికి ఆధారభూతమైన సంస్కృత సాహిత్య పరిమళాలను ప్రసరింపజేయటమే ఈ వ్యాసకదంబం ధ్యేయం.

ఔషధం అన్న శీర్షికలో భవభూతి ఉత్తరరామచరిత్రలో విరహాన్ని ఉట్టంకించే శ్లోకాలను ఉదహరిస్తూ యక్షుడి విరహాన్ని వర్ణించిన కాళిదాసే కాదు, సారస్వతలోకంలో ఇంకా ఎందరో మహాకవులున్నారని, మనిషిలోని చిత్తప్రకోపాలకు దివ్యౌషధం సారస్వతమని తేల్చి చెప్పుతారు వీరు.

తవ స్పర్శే స్పర్శే మమహి పరిమూఢేంద్రియ గణో
వికారశ్చైతన్యం భ్రమయతి చ సమ్మీల యతి చ

అనే శ్లోకానికి తమ స్వేచ్ఛానువాదాన్ని ‘నీ స్పర్శతో అవయవ సమూహం నిశ్చేష్టమౌతుంది. భ్రమ వంటి పరవశమేమో కలుగుతుంది’ జోడిస్తూ కావ్యానందాన్ని ప్రకటిస్తారు.

అలాగే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న వ్యాసంలో శీర్షిక ప్రతిపాదకంగా భర్తృహరి శృంగారశతకంలోని ‘లీలావతీనాం సహజా… ముధా షఢంగ్రి’ అనే శ్లోకం, శేషేంద్ర ప్రేమలేఖలు కావ్యంలోని ‘నీవు స్త్రీవి కావు అందాల తుఫానుని… చీరా తారా కలిపి నేసిన రూపానివి’ కవితాత్మక వాక్యాన్ని, విశ్వనాథ ‘మాకంద తరుశాఖికా కోకిలాలాప… వసంత నవశోభవచ్చె నప్సరసవోలె’ అంటూ విశ్వామిత్రుని తపోభంగం చేయడానికి వచ్చిన మేనక రాకను వసంతంతో పోల్చిన లయాన్విత పద్యంతో పాటు శేషభట్టర్ తమ స్వీయ కవిత లిపి తడిపిన తరుణం లోని ‘పిట్టగోడల మెడల మీద ప్రియురాలి జడల్లా… తల ఉంచితే తెలిసింది’ అనే చరణాలను ఉదహరిస్తారు.

వ్యాసాలన్నీ ఉత్తమ కవితల ఉదాహరణలే. గీర్వాణ భాషా శోభితాలే. తెలుగు కవితా మకరంద మాధుర్యాలే. సరస సాహిత్య సౌరభాలే. ముందే చెప్పినట్లు తనకు తారసపడ్డ ఆంధ్ర గీర్వాణ భాషల అధునాతన ప్రాచీన కవుల కవితా స్మరణే పుస్తకం నిండా.

కాళిదాసు, భవభూతి, భర్తృహరి, పండిత జగన్మాథరాయలు వంటి సంస్కృత కవులు; నన్నయ, పెద్దన వంటి ప్రాచీన కవులు; ఇటీవలి విశ్వనాథ, శేషేంద్ర మొదలైన కవులు; ఆధునికులలో ఎలనాగ, ఎండ్లూరి, నామాడి శ్రీధర్, బివిఎన్ ప్రసాద్, బులుసు వేంకటేశ్వర్లు వంటి వారేగాక సీతారాం అవధాని, వనమాలి, సాత్యకి, రాం నారాయణ్, కవిరాజు వంటి విస్మృత కవుల కవిత్వాన్ని తలచుకుని తమ విశ్లేషణతో వారి కవితా సౌందర్యాలను చూపిస్తారు.

విష్ణుచిత్తులెక్కడ? అన్న వ్యాసంలో రొడ్డకొట్టుడు కవిత్వాన్ని ఈసడించుకుంటూ, తాము రాసిన కవిత్వమే గొప్ప కవిత్వమని మురిసిపోయే నమ్రతలేని కవులను దుయ్యబడతారు. దీనికి భవభూతి రాసిన మాలతీమాధవీయం లోని ‘వాక్య ప్రతిష్ఠాణి దేహినాం వ్యవహార తంత్రాణి‘ -మానవ లోక వ్యవహారాలన్నీ మాటల కూర్పుతోనే ముడివడి ఉన్నాయి- అనే మాట ఇలాంటి వారి గురించే అయ్యుంటుందని వాపోతారు.

‘ఏది విమర్శ ఏది సమీక్ష’ అనే వ్యాసంలో గుణదోషాలు విడమర్చి చెప్పటం విమర్శ. కానీ విమర్శించడానికి భయపడాల్సిన ప్రస్తుత వ్యవస్థలో విమర్శ నిర్జీవమైందంటారు. దానికి కారణం మొహమాటం. స్వకీయ సమీక్షకులు రాసిన సానుకూల సమీక్షలతో సాహిత్యం ఉద్ధరించబడేది లేదంటూ, విమర్శకులు ప్రతిభావంతులైతే కవులు అప్రమత్తులవుతారని ప్రకటిస్తారు. ఒకరకంగా ఇది నిష్కర్షగా రాసిన వ్యాససంకలనమే. తాను చెప్పదలచుకున్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడానికి వెనుకకు పోలేదు శేష భట్టర్‌గారు.

‘ఒక సారస్వత సౌరభం పొత్తూరి సుబ్బారావు’ అంటూ పండితకవి ఆంగ్లోపన్యాసకులైన డా. పొత్తూరి సుబ్బారావుగారి గురించిన విశేష వ్యాసం ఉంది ఇందులో. వారికి అమరస్మృత్యంకంగా పుస్తకాన్ని సమర్పించుకున్నారు రచయిత.

అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకం మింగుడు పడకపోవచ్చు. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చివుకు కలిగించవచ్చు కాని, సాహిత్యోన్నతిని కాంక్షించే సదాశయం కలిగిన పుస్తకం సౌరభం. అర్థవంతంగా ఆకర్షణీయమైన ముఖచిత్రంతో వెలువరించిన ఈ పుస్తకం సాహితీప్రియులు చదివి సాహిత్యపు లోతుపాతులు తెలుసుకోవడానికి ఉపయుక్తమైనది. ఇంకా చెప్పాలంటే తెలుగు సాహిత్య విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఉండదగిన పుస్తకం కూడా. మొదట్లోనే ‘కవిత్వం పట్ల అవ్యాజమైన ప్రేమ తప్ప ఇతర ప్రయోజనాలేవీ లేని ఫక్తు సారస్వత పత్రాలివి’ అని విన్నవించుకున్నారు రఘు శేషభట్టర్. ఒక మంచి సాహిత్య వ్యాస సంపుటి ఈ పుస్తకం. సాహిత్యలోకానికి రఘుశేషభట్టర్ అందించిన అరుదైన పుస్తకసౌరభం.