డాక్టర్ భార్గవి అలా కొందరు అంటూ మనకు జ్ఞాపకం చేసిన ఆ పదిహేనుమంది జీవిత కథలలో కొన్ని మనసుని మెలిపెడతాయి, ప్రశ్నార్థకాలవుతాయి. ప్రపంచానికి వెలుగులు చిమ్మి తమ బ్రతుకుల్ని చీకటి చేసుకున్నారెందుకని దిగులుపడతాం. నలుగురు నడిచిన నలిగిన దారిలో ఎందుకు నడిచారు కాదు?
వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? అనుకుంటాం. పులుముకున్న చీకటి వేదనని తామే అనుభవించి మనకు చల్లని చందమామలైన వాళ్ళు కొందరు. ఈ పదిహేనుమందిలో అత్యాశతో అహంకారంతో అపకీర్తి మూటకట్టుకుపోయిన పాబ్లో ఎస్కోబార్ తప్ప తక్కినవారంతా కళాకారులే, తమ రంగాల్లో నిష్ణాతులే. వీరి మధ్య ఈ మాదకద్రవ్యాల మహారాజు ఎందుకు అంటే అతని ఉత్థాన పతనాలనుంచి మనం చాలా తెలుసుకోవచ్చు అనుకోండి. ఈ జీవిత కథాగుచ్ఛం అంతా విషాద భరితం కాదు. ఇందులో చందమామ చక్రపాణిగారి గురించి మనకు తెలియని మంచి విషయాలున్నాయి. దేవుడిని తలపించే డాక్టర్ శర్మగారి పనితనం, ఆదర్శవంతమైన జీవనవిధానం తెలుసుకుని గౌరవంతో చేతులు జోడిస్తాం. సాగే గడియారాల సాల్వడార్ డాలీ సర్రియలిస్ట్ చిత్రాల గురించే కాక ఆయన ప్రత్యేకమైన జీవనశైలిని చూసి ‘అలాగా!’ అని ఆశ్చర్యపోతాం. ‘శారద’గా తెలుగు పాఠకుల హృదయాలను కదిలించే సాహిత్యం ఇచ్చి వెళ్ళిన తమిళ నటరాజన్ ఎంత దుర్భరమైన జీవితం అనుభవించాడో తెలిసి ఒక మంచి రచయితను ఆదుకోలేని సాహిత్య ప్రియులమా అని సిగ్గుపడతాం.
మంచి చదువరి అయిన భార్గవి తను చదివి స్పందించిన జీవితాలను గురించి శోధించి ఫేస్బుక్లో వ్రాసిన జీవితకథల గుచ్ఛమే ఈ చిన్న పుస్తకం. వీరంతా సంఘసంస్కర్తలూ విప్లవవీరులూ కాకపోవచ్చు. అలసిన వేళల్లో సేద తీర్చినవారు. మనకి పంచిన వెలుగులో తాము నీడలైన వారు. నిన్నటితరం వారు. ‘గతం బరువు దించుకుని సాగిపోవాలి. నాకోసం నేను. నాకు నేను’ అనే ఇప్పటి తెలివిడి లేనివాళ్ళు. ఒత్తిళ్ళకూ తమ తమ భావోద్వేగాలకూ లొంగిపోయి సంపూర్ణ జీవితం గడపలేకపోయిన స్త్రీలు ఇందులో పెక్కుమంది. అయితే కాగజ్ కే ఫూల్, ప్యాసా, సాహెబ్ బీబీ ఔర్ గులామ్ వంటి గొప్ప సినిమాలు తీసి అవార్డులు, పేరు ప్రతిష్ఠలు పొందిన గురుదత్, ఎన్నో ప్రజారంజకమైన పాటలు కట్టిన ఒ. పి. నయ్యర్ల జీవితాలలో అలజడి గురించి చదివినప్పుడు జాలి కలుగుతుంది. పురుషులుగా సమాజంలో వున్న అనుకూలతలు కూడా వీళ్ళకు జీవితాన్ని సంబాళించుకునేందుకు ఉపయోగపడలేదేమో అనిపిస్తుంది.
ఇంక ఇందులోని స్త్రీలందరూ ప్రజ్ఞావంతులు. గొప్ప కళాకారులు. నటులు, విదుషీమణులు. తమ నటనతో సౌందర్యంతో గానంతో ప్రేక్షకుల్ని శ్రోతల్ని పారవశ్యంలో ముంచినవాళ్ళు. మారిలిన్ మన్రో, రీటా హేవర్త్ తెలియని నిన్నటి తరం సినిమాప్రియులుండరు. గౌహర్ జాన్, అంజనీబాయ్ మాల్పేకర్ వంటి గాయనుల గురించి కనీసం వినివుండని వారు వుండరు. అలాగే మీనాకుమారి, పర్వీన్ బాబీల సినిమాలు చూడనివారూ వుండరు. మరి గీతా దత్ పాట మెచ్చనివారుండరనే నా నమ్మకం. గూఢచారిణి అనే అభియోగంతో ఉరికంబం ఎక్కిన మాటా హారి తెలిసే వుండాలి. వీరందరి జీవితాలలో అంతస్సూత్రం విషాదం.
ప్రథమ గ్రామొఫోన్ రికార్డు గాయని గౌహర్ జాన్. తన పాటకు అత్యధిక పారితోషికం తీసుకునే ఆ విదుషి జీవిత చరమాంకం ఎలా గడిచింది? కుమార్ గంధర్వ, కిశోరీ అమోన్కర్, లతా మంగేష్కర్లకు స్వరాలు నేర్పిన అంజనీ బాయ్ సంగతేమిటి? వారి జీవితాల్లో ప్రవేశించిన బదనికలెవరు? అఖండమైన విద్వత్తు కల ఈ స్త్రీలు తమ సంపాదనని తమ జీవితాన్ని నయవంచకుల పాలు చేసుకోడంలో వారి అమాయకత్వంతో పాటు సమాజం పాత్ర, కాలమాన పరిస్థితుల ప్రభావం, పురుషాధిక్య సమాజంలో తమ వ్యవహారాలు చూసిపెట్టేందుకు ఒక పురుషుని అండ అవసరమనుకోడం, ఆ పురుషుని మీద నమ్మకం, ప్రేమ కోసం తపన, ఆశాభంగాలు, మద్యపానం వ్యసనం కావడం, మానసిక బలహీనత, మనో వ్యాధి, ఇలా జీవితాలను నైపుణ్యాలను వ్యర్థం చేసుకున్న తారల జీవితాలను మనకి దృశ్యమానం చేశారు భార్గవి.
ఇప్పుడు వీరి ముచ్చట మనకెందుకంటారా? ఇవి మనకి చాలా అవసరమైన పాఠాలు. విఫల ప్రేమలు, నమ్మకద్రోహాలు, ఆత్మహత్యలు ఆగనేలేదు. డబ్బు దగ్గర ఇంకా కొంతమంది తండ్రులు, అన్నదమ్ములు, భర్తలు, ప్రియులు స్త్రీలను కట్టడిచేస్తూనే వున్నారు. స్త్రీల మేధస్సు, నైపుణ్యాలు తలవొగ్గుతూనే వున్నాయి. మరీ అప్పటిలాగా కాకపోయినా. మారిలిన్ మన్రో పైనో, పర్వీన్ బాబీ పైనో జాలిపడమని కాదు. కళాకారులు బ్రతుకు తెలివి కలిగి వుండకపోతే ఎవర్ని వాళ్ళు ప్రేమించుకోకపోతే, ఎవరి బ్రతుకు విలువ వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళకే కాదు సమాజానికీ నష్టమే. అందుకే అందరి కథలూ వినాలి.
భార్గవి మనని కూర్చోబెట్టి ఎంతో ఆర్ద్రంగా చెప్పిన ఈ కొందరి గురించి తెలుసుకోవాలంటే ఛాయా బుక్స్ ప్రచురించిన అలా కొందరు చదవాలి. భార్గవి అలా ఆ కొందరి గురించి చెబితే, తన రేఖా చిత్రాలతో ఆర్టిస్ట్ అన్వర్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టించాడు. అవి పాఠకులకు అదనపు అమూల్య కానుక.
ఈ పుస్తకం వెల 175 రూపాయలు. ఛాయా బుక్స్ లోనే కాక అమెజాన్, నవోదయలలో కూడా వుంది.