ఆక్సిజన్ మాస్క్‌

“డాడీ ఇంట్లో లేరా?” తలుపు తీసిన కూతుర్ని జీవిక అడిగింది ఇంట్లోకి అడుగుపెడుతూ. ‘ఆయన తలుపు తీస్తారు’ అని ఆమె మనసులో ఏ మూలో ఉన్న చిన్న ఆశ కాస్తా ఆమెని దింపి తిరిగివెడుతున్న టాక్సీలోకి లాంగ్‌జంప్ చేసి పారిపోయింది.

“టివి చూస్తున్నారు” అన్నది జానీ చేతిలోని కోవిడ్ టెస్ట్ కిట్‌ని జీవిక చేతికందిస్తూ. ఆ అట్టపెట్టె చేతులు మారుతున్నప్పుడు తగిలే ప్రసక్తి లేకుండా ఇద్దరి వేళ్ళూ రెండు తీరాలనున్నాయి. ‘ఆయన చూసుంటే ఎగిరి గంతేసేవారు దోసిట్లోకి ఎత్తిపడెయ్యలేదని!’ అనుకోకుండా జీవిక ఉండలేకపోయింది. ‘ఆరడుగులు కాదు అరవయ్యడుగుల దూరంలో ఉంటారు వీలయితే. పరిస్థితులు తారుమారయితే, తనే ఖచ్చితంగా తలుపు తీసి ఉండేది, కూతురిని అరవయ్యడుగుల దూరంలో ఉంచి!’ అని కూడా.

“బేస్‌మెంట్‌లోనా?” కొంచెమన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దామనుకుని అడిగింది.

“లేదు.” ‘ఈ లెవెల్లోనే’ అన్నట్టు తలకాయని వెనక ఫామిలీ రూమ్ వైపు తిప్పి చూపుతూ జానీ జవాబిచ్చింది ‘వింత ప్రశ్న లేస్తున్నావు!’ అన్న మొహం పెట్టి.

చేతిలో ఉన్న కేరీఆన్‌ని అక్కడే వదిలిపెట్టి, భుజాన ఉన్న లాప్‌టాప్‌ సంచీతో మెట్లెక్కి మాస్టర్ బెడ్‌రూమ్ చేరింది జీవిక. అక్కడ బరువుని, టెస్ట్ కిట్‌ని దించుకుని మెట్లు దిగి కిందకు వస్తూ, “తలుపెయ్యకుండా అట్లా నిల్చున్నావేమే?” అన్నది కొద్దిగా చికాగ్గా.

“ఈజ్ దట్ ఆల్, యువర్ లగేజ్?” అన్నది జానీ తలుపేస్తూ.

“కొత్తగా అడుగుతున్నావ్. ఎప్పుడూ వెళ్ళేది ఈ కేరీఆన్‌తో మాత్రమేగా?” రెండు చెవులనీ కడుతూ నోటినీ ముక్కునీ బంధించి ఉన్న నల్ల మాస్క్ ఆమె కళ్ళల్లోని చికాకుని కూడా కొంత కప్పేసింది. ఎంత లైట్లేసి ఉన్నా రాత్రి చీకటి కూడా తోడుకాకపోలేదు.

“ఐ డోన్ట్ నో!” అన్నది జానీ భుజాలు ఎగురవేస్తూ.

“అవున్లే. నేను ఎయిర్‌పోర్టుకి వెళ్ళే సమయంలో స్కూల్లో ఉంటావు, తిరిగొచ్చేటప్పటికి నీ గదిలో తలుపేసుక్కూర్చుంటావు” అంటూ కూతురి మొహం చూసింది. ‘చూశారంటే మాస్క్ పెట్టుకోలేదని ఎగుర్తారు’ అనుకుంది.

“ఐ విల్ లెట్ యు నో ది రిజల్ట్!” అంటూ కేరీఆన్‌ని తీసుకుని మెట్లెక్కి బెడ్‌రూమ్ చేరింది. టెస్ట్ కిట్ తీసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్ళింది. ఆ కుటుంబంలో అందరికీ గత ఆరు నెలలుగా అలవాటయిన పని అది. నలుగురి తరఫునా మొత్తం ఎనిమిది టెస్ట్ కిట్స్‌ని ప్రభుత్వం ఇంటికి పంపింది. బందీలోంచి బయటపడ్డ ప్రాణాలు గుంపుల్లో కలవడం మొదలుపెట్టగానే కోవిడమ్మ పలకరింపులు మొదలు. కొంచెం జలుబు చేసిందనిపించినా టెస్ట్ చేసుకోవడంతో ఇప్పుడు సగమే మిగిలాయి.

టెస్ట్ స్ట్రిప్ మీద రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ కేరీఆన్‌ లోంచి విడిచిన బట్టలని తీసి బాత్‌రూమ్‌లో ఒక మూల పడేసింది. మేకప్ తుడుచుకుని, మొహం కడుక్కుని, నైట్‌డ్రెస్‌లోకి మారి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పటికే మోగన్ నించి రెండు మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టడంవల్ల ఆమెకి తెలియలేదు. హబ్బీ అని, మోహన్ అనీ కాక ఆ పేరుతో భర్తనంబర్ లిస్ట్ చెయ్యడం తప్పితే, అతని ఇష్టానికి విరుధ్ధంగా చేసిన పని ఏదీ ఆమెకు గుర్తుకురాదు. ఆమె ఊహాలోకంలో శయ్యాగారంలో అతన్ని ‘మోగన్’ అని పిలుస్తుంది. అతను ‘అయామ్ యువర్ గన్’ అంటాడు. ఆమె ‘మో!’ అంటుంది మత్తు నిండిన గొంతుతో. అతను ‘జీ!’ అంటాడు ఆయాసపడుతూ. ఇహలోకంలో మాత్రం, అన్ని గారాల్లోనూ, శాలల్లోనూ ఆమె ‘ఏమండీ’ ‘అది కాదండీ’ ‘అలాక్కాదండీ, ఇలాగండీ’ అనే అంటుంది.

ఆ మోగన్ ఆలోచన వాళ్ళ తమిళ స్నేహితుడు రాగవన్ అతన్ని పిలవగా విన్నప్పుడు జీవికకి వచ్చింది. కొన్నేళ్ళక్రితం ఒకసారి, గారూ కలిపల్లా ‘మోగన్‌గారూ!’ అన్నది. అతను వెంటనే, ‘నన్నలా పిలవకు!’ అన్నాడు. ‘అది పేరుని ఖూనీ చెయ్యడమే!’ అని కూడా జోడించాడు. ‘ఏవండీ అనే తప్ప మోహన్‌గారూ అని ఒకసారి కూడా పిలిచానా? మోగన్‌తోనే మొదలుపెడితే కోపం రాదూ?’ అని తనని మందలించుకుంది.

బాత్‌రూమ్‌లో సింక్ ముందు నిలబడి జుట్టు దువ్వుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద అక్షరాలని స్క్రోల్ అయాయి. ‘మూడవసారి కూడా తియ్యకపోతే మరీ చిరాకుపడతారు,’ అనుకుంటూ స్వైప్ చేసి, “హలో” అన్నది.

“ఫోన్ తియ్యవేం? రెండుసార్లు చేశానిప్పటికి!”

‘ఎలా ఉన్నావు, ఒంట్లో బాగా లేకపోయినా ప్రయాణం ఎట్లా చెయ్యగలిగావు?’ అనే ఆప్తవాక్యాలని ఎదురుచూసిన ఆమెకి అది ప్రేమ పలకరింపు కాదని అర్థమై మనసు చివుక్కుమన్నది. “సైలెంట్ మోడ్‌లో ఉంది. మొహం కడుగుతున్నప్పుడు, కేరీ-ఆన్‌లోని బట్టలని తీస్తున్నప్పుడు కాల్ చేసినట్టున్నారు” అన్నది ముక్కుతో గాలిని బలంగా పీలుస్తూ. ‘ముక్కులు బిగదీశాయి. పైగా, ప్లేన్లో గాలిలో తేమ తక్కువగా ఉన్నది. చలికాలం అవడంవల్ల ఇంట్లోనూ అంతే. ఒక అరగంట హాట్ షవర్ కింద నిల్చుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.’

ఆ ముక్కు పీల్చిన శబ్దాన్ని విని, “ఖచ్చితంగా కోవిడే!” అవతలి పక్కనించి నిర్ధారణ వినబడింది. రెండు రోజుల క్రితం హోటల్‌నించి ఫోన్ చేసి కొంచెం నలతగా ఉన్నదని చెప్పినప్పుడు ఆమె విన్న మాటలే. ‘పదిరోజులూ ఇక్కడే ఉండమంటారా?’ అని అడుగుదామని ఆమె నోటిచివరిదాకా వచ్చింది కానీ, ‘మంచి ఐడియా!’ అని జవాబు వస్తుందేమోనని భయం వేసి నొక్కేసింది. కనీసం ఎనిమిది రోజుల హోటల్ బిల్ అంటే పదిహేను వందల డాలర్లు చేతిలోంచి పడతాయని తెలియగానే, ‘బుధ్ధున్నదా అలా ఆలోచించడానికి?’ అని చీవాట్లు తినే అవకాశాన్ని కోరి తెచ్చుకోనందుకు పెద్ద అవాంతరం తొలిగిపోయినట్లు రిలీఫ్ వచ్చింది. తరువాత ఆమెకి గుర్తొచ్చింది – ఒకవేళ హోటల్లో ఉండే ఆలోచనకి సమ్మతి చూపినా, ‘ఆయన షుగర్ పేషెంట్ మరి! ఆయన ఆదుర్దా ముందుగా ఆయన గూర్చే అవడంలో ఆశ్చర్యమేముంది?’ అనుకున్నది. పైగా, ‘కోవిడ్ కాంప్లికేషన్స్ అతనికి సోకితే సేవలు చెయ్యాల్సింది తనే మరి!’ అన్న ఎరిక ఉన్నా గానీ అది ‘షుగరుండడం ఎగబడి స్వీట్లు తినడానికి మాత్రం అడ్డం రాదు!’ అని అనుకోవడానికి మాత్రం ఆమెకి అడ్డం రాలేదు. ఒక పార్టీలో ‘స్వీట్లు మరీ ఎక్కువ తింటున్నారు!’ అన్నందుకు, ‘నా యిష్టం!’ అన్న జవాబు వారంరోజులపాటు వారి మధ్య మాటల్లేకపోవడానికి దారి తీసింది.

“రిజల్ట్ రాగానే ఫోన్ చెయ్యి!” అని భర్త ఫోన్ పెట్టెయ్యబోతుంటే, అతన్ని ఆపుతూ, “నెగెటివ్ వస్తే కిందకు వచ్చి డిన్నర్ చేసేదా?” జీవిక అడిగింది.

“నెగెటివ్ వస్తే రేపు పిసిఆర్ టెస్ట్ చేసి కన్‌ఫర్మ్ చేయిద్దాం. అప్పటిదాకా జాగ్రత్తలో ఉండడం మంచిది.” అవతలినించి జవాబు వచ్చింది.

“మీదీ, దానిదీ డిన్నర్ పూర్తయిందా?”

“తొమ్మిదయింది. నువ్వు ఊళ్ళో లేనప్పటిలాగానే తినేశా. అది దానికి కావలసినదేదో చేసుకుంది. అయినా నువ్వొచ్చేదాకా కాలే కడుపుతో కూర్చుంటే ఇంతే సంగతి!”

పెద్దగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. తన ప్రశ్న నవ్వొచ్చే విషయం ఎందుకయిందో జీవికకి అర్థం కాలేదు. ‘ఒంట్లో బాగోలేకపోయినా ఆ డాలస్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక టర్మినల్ నించి ఇంకో దానికి కనెక్షన్ దొరకదేమో అని పరుగులెట్టి, ఫ్లయిట్ మిస్ కాకుండా అనుకున్న సమయానికి ఇంటికి వస్తే – ఎంత చల్లని మాటలు! పైగా, కనీసం ఇంకొక రెండు రోజులు దూరంగానే ఉండమని శాసనం!’ ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

అతను మంచివాడేనా? అని ఎవరయినా అడిగితే, ఆ మంచితనానికి నిర్వచనమేమిటో పూర్తిగా తెలియక, ‘అవును’ అని ఆమె చెప్పలేదు. అతను చెడ్డవాడా? అనడిగితే, ‘కాదు’ అనీ చెప్పలేదు. కాని, ఉద్యోగం చెయ్యద్దనలేదు, బిజినెస్ పని మీద వేరే ఊళ్ళు వెళ్ళాల్సివస్తే వద్దనలేదు, తన మీద ఏ అనుమానమూ ఇప్పటిదాకా చూపలేదు, ఇద్దరి జీతాలూ ఒకే ఖాతాలో వేసినా డబ్బులేమీ దుబారా చెయ్యట్లేదు, తనని కాని, పిల్లల్ని కానీ కొట్టట్లేదు, తిట్టట్లేదు. వీటినన్నిటినీ బేరీజు వేసుకున్నా గాని, లీస్ట్ కామన్ ఫాక్టర్ వెదికి తెచ్చినా గానీ జవాబు చెప్పలేని ప్రశ్నలవి. ‘నా పెళ్ళి స్వర్గానికి చాలా దూరంలో జరిగిందని చెప్పగలను. కనీసం స్వర్గానికీ, నరకానికీ కూడా సమదూరంలో జరిగుంటే రాజీ పడగలిగేదాన్ని!’ అన్నది ఒక అమెరికన్ కొలీగ్ డివోర్సీ. ఎంత ఫ్రాంక్‌గా మాట్లాడగలిగింది! జీవిక ఆశ్చర్యపోయింది.

‘ఈ వివాహం స్వర్గనరకాలకి సమదూరంలో ఉన్నదా? అని ప్రశ్నించుకుంటే నా జవాబు మాత్రం, లేదు అనే!’ జీవిక అనుకున్నది సింక్ వెనకనున్న అద్దంలోకి చూస్తూ. మసకబారిన కళ్ళని తుడుచుకుంటూ చూపుని కిందకి మరల్చుతున్నప్పుడు ఆమె కళ్ళు సింక్ మీద పెట్టి ఉన్న టెస్ట్ స్ట్రిప్ మీద వాలాయి. రెండు క్షణాలు దానివైపు అలాగే చూసి, “నాకు డిన్నర్ తెచ్చిపెట్టండి” అని భర్తకి ఫోన్ చేసి చెప్పింది.

“వ్హాట్?” అన్నాడు మోహన్ అవతలినుంచి. ‘పక్కన పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు!’

“రెండు రోజుల నించీ చెబుతున్నారుగా, మీరే కరక్ట్. టెస్ట్ రిజల్ట్ పాజిటివ్!”

“జాగ్రత్తగా ఉండమని చెబితే విన్నావా? మాస్క్ పెట్టుకుని ఉండవు!” ఆ విసుగు ఆమె మదిలో బానే ఇంకింది.

“ఏం తెచ్చిపెట్టాలి? ఎప్పుడయినా నీకు ప్లేట్లోనయినా పెట్టానా, ఇప్పుడు తెచ్చల్లా ఇవ్వడానికి? ఎయిర్‌పోర్టులో తినేసి రావాల్సింది!” ఫోన్ నిజాయితీగా ఆమెకి చేరవేసిన చిరాకుతో బాటు, ఒప్పుకున్న నిజాన్ని కూడా అందించింది.

“సరే, దానికి చెబుతాను గానీ కాసిని మంచినీళ్ళు తెచ్చిపెడతారా?”

“మంచినీళ్ళ గ్లాసు పైన ఒకటి ఉన్నట్టు గుర్తు. బాత్‌రూమ్ సింకులో పట్టుకోలేవా?” అవతలి నించి ప్రశ్నలాంటి జవాబు.

పెదిమలు బిగబట్టుకుంది జీవిక. ‘వీడియో కాల్ చేయకపోవడం మంచిదయింది.’ జానీకి ఫోన్ చేసి తనకి కావలసిన వేవో చెప్పింది. జానీ ఒక ట్రేలో వాటిని పట్టుకొచ్చి, బెడ్‌రూమ్ తలుపు ముందు పెట్టి వెళ్ళిపోయింది.

“మామ్. సారీ టు హియర్. ఐ సస్పెక్టెడ్ ఇట్ ఫస్ట్ టైమ్ యూ టెక్స్‌టెడ్ అబవుట్ యువర్ సింప్టమ్స్. యూ షుడ్ బి ఫైన్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్!” సాయి నించి టెక్స్ట్ మెసేజ్. ‘ఫోన్ చేసి ఒక నిముషం మాట్లాడడానికేం?’ అనుకుని వాడికి ఫోన్ చేస్తే అది వాయిస్ మెయిల్‌కు వెళ్ళింది.

టివి ఆన్ చేసి భోజనం చెయ్యడం మొదలుపెట్టింది గానీ జీవిక ఆలోచనలన్నీ రాబోయే వారం రోజుల గూర్చే. ‘ఈ కోవిడ్ క్వారంటైన్ అంటే బెడ్‌రూమ్ తలుపు దాటి బయటకు వెళ్ళకపోవడం. ఇంట్లో ఇంకో ఇద్దరు మనుషులున్నారు గానీ ఒకళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బిజీ, ఇంకొకళ్ళు స్కూల్ వర్క్‌తో బిజీ. తనని పట్టించుకోవడానికి ఎవరికున్నది సమయం? తనకి ఫ్లూ వచ్చినా గాని, సిక్ లీవ్ తీసుకున్నా గానీ తనే ముక్కుతూ, మూల్గుతూ కాఫీలు, టీలు, భోజనాలు వేళ ప్రకారం అందించడానికి అందరూ అలవాటుపడ్డారు. తను గది దాటి బయటకు రాకపోవడం వాళ్ళకి మొదటి అనుభవం.’

మరునాడు శనివారం అన్న గుర్తింపు ఆమెని నిరాశానిస్పృహలకి గురిచేసింది. వారంలో ఏ రోజయినా సరే ఆమెకి ఆరు గంటలకల్లా మెలకువ వస్తుంది. కిచెన్‌కు దిగివెళ్ళి క్యురిగ్‌లో పాడ్‌ని పెట్టి కాఫీ తయారు చేసుకుని, అందులో వేడిపాలు కలుపుకుని తాగుతుంది. భర్తకి డయాబిటిస్ అని తెలిసినప్పటి నించీ ఆమె కూడా కాఫీలో పంచదార వేసుకోవడం మానేసింది. ‘ఆయన శనివారం తొమ్మిది గంటలకి ముందర లేవరు. జానీ కూడా అంతే. రేప్పొద్దున్న తొమ్మిది గంటల దాకా నాకు దొరికేది కాఫీ నామస్మరణే!’ జీవిక అనుకున్నది.

మోగన్ పిలుస్తున్నాడంటూ ఫోన్ మీద పరుగిడుతున్న అక్షరాలను చూసి స్వైప్ చేసి, “చెప్పండి!” అన్నది.

“నా క్లాజెట్‌లోకి అడుగుపెట్టకు, అటువైపు వెళ్ళకు. వీలయినంత దూరంగా ఉండు. నా బట్టలు తెచ్చుకోవాలిగా? మాస్క్ పెట్టుకుని, గ్లవ్స్ వేసుకునీ వస్తాననుకో. అయినా, వాటి మీద నీ ఊపిరి కూడా పడకూడదు గదా, అందుకు!”

‘హిజ్ అండ్ హర్ క్లాజెట్లు వేరేగా ఉన్నా కూడా రెంటికీ దారి మాస్టర్ బెడ్రూమ్ తలుపులలోంచి లోపలకి అడుగుపెట్టినప్పుడే కదా!’ అన్న రియాలిటీ ఆమె ఒక భుజం మీద, ‘నాకా మాత్రం తెలియదా? పనిగట్టుకుని మీకు అంటించే దాన్నయితే తిన్నగా వచ్చి మీ మొహమ్మీదే ఊదేదాన్నిగా, ఇట్లా గదిలో కూర్చుని ఎందుకు మగ్గిపోతాను?’ అన్న ఆలోచన రెండవ భుజం మీద, రేపిన మంట ఆమెని ఆ ఫోన్‌ని దాదాపు గోడకేసి విసిరిగొట్టేలా చేసింది. కానీ సర్దుకుంది.

“బాగా ఆలోచించారు. అట్లాంటి ముందు చూపు నాకెందుకుండదో!” అని ఆగి, “రేప్పొద్దున్న కొద్దిగా ముందు లేచి నాకు కాఫీ పెట్టివ్వగలరా?” అని అడిగి జవాబుకోసం ఊపిరి బిగబట్టింది.

“ఇంట్లో సింగిల్ కప్ కాఫీ మేకర్ ఉండాలి గదా, దాన్నీ కాఫీ పౌడర్నీ నీ గది ముందుంచమని జానీకి చెబుతాను. పడుకోబోయే ముందర ఆ పని చేస్తుందిలే.”

ఎదురుగా అద్దం లేకపోవడంవల్ల జీవిక తన మొహం మీద చేరిన ఉదయాస్తమయ సూర్యబింబపు రంగులని చూడలేకపోయింది. అరువు తెచ్చుకున్న శాంతంతో, “పాలు లేకుండా కాఫీ తాగలేను” అని జవాబిచ్చింది.

“దాందేముంది. కాసిని పాలు చిన్న గ్లాసులో పోసిమ్మని చెబుతాను. ఫ్రిజ్ లోంచి తీసినవేగా, రేప్పొద్దున్నకి ఏమీ పాడయిపోవు, పైగా, వేడిచెయ్యాల్సిన అవసరం లేకుండా తెల్లారేసరికి రూమ్ టెంపరేచర్‌కి చేరిపోతాయి. అందువల్ల కాఫీ అంత చల్లబడదు కూడా.”

‘మీ రూటే వేరు!’ అనుకుని, “మీలాగా ఎవరూ ఆలోచించలేరు,” అన్నది జీవిక.

“కదా? నా రూటే వేరు!” అటునించీ సమాధానం. ‘ఇంట్లోకి రాగానే ముందు బేస్‌మెంట్‌ లోకెళ్ళి కోవిడ్ టెస్ట్ చేసుకో అని పంపలేదు. అంతవరకు నయం. ఆ ఆలోచన ఆయనకి రానందుకు సంతోషించాలి. లేకపోతే వారం రోజులపాటు ఈ ఏడుపు అక్కడ కూర్చుని ఏడవాల్సొచ్చేది!’ జీవిక తనని తాను సంబాళించుకుంది.

“మామ్, నీకు మెడిసిన్స్ ఏమయినా కావాలా?” కాఫీ సరంజామాని తెచ్చి తలుపు ముందర పెట్టిన తరువాత, జానీ అడిగింది.

“అక్కర్లేదు. అన్నీ నా కేరీఆన్‌లో ఉన్నాయ్!” జీవిక జవాబిచ్చింది.

తరువాత ఆమె మంచం మీద దిళ్ళని హెడ్‌రెస్ట్‌కి నిల్చోబెట్టి, వాటిని ఆనుకుని కూర్చుని కాసేపు టి.వి. చూసింది. వేసుకున్న జలుబు మాత్రల ప్రభావంవల్ల త్వరలోనే నిద్రలోకి జారుకుంది. ముక్కు బిగదియ్యడంతో గంటలో మెలకువ వచ్చినప్పుడు మాత్రం, ‘నిద్రపోయే ముందర షవర్ తీసుకోవడం మర్చిపోయాను’ అనుకున్నది.


మరునాడు పొద్దున్న దాదాపు పది గంటలవుతున్నా ఇంట్లో శబ్దాలేవీ జీవికకి వినపడలేదు. ‘ఆకలేస్తోంది. ఈపాటికి ఒక బ్రెడ్ ముక్కో అరటిపండో తినివుండేదాన్ని. ఊపిరి పీలుస్తూ, రెండుకాళ్ళ మీద నిలబడి కనిపించడంవల్ల కాబోలు నాకున్నది సీరియస్ జబ్బు కాదని, అంతగా భయపడనవసరం లేదని నిర్ణయించుకున్నట్టున్నారు!’ అనుకున్నదామె. వెంటనే, గత రెండున్నరేళ్ళల్లో కోవిడ్ గూర్చి ప్రపంచం ఎంత భయపడ్డదీ, దాన్ని ఒకప్పటి మశూచికంలాగా భావించి ఎంత దగ్గరి రక్తసంబంధీకులనయినా సరే దాని బారిన పడితే ఎంత దూరంగా ఉంచినదీ, ఆత్మీయులని కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయిన స్నేహితుల, చుట్టాల కథలు విని కళ్ళనీళ్ళు పెట్టుకున్నదీ, ఆమెకు గుర్తొచ్చి, ‘ఛ, ఛ. ఏమిటిట్లా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాను?’ తనని మందలించుకున్నది.

‘అయినా, ఈ రెండున్నరేళ్ళల్లో నాకున్న స్ట్రెస్‌ని పట్టించుకున్న వాళ్ళెవారున్నారు?’ అన్న ఆలోచన జీవిక మదిలో వెంటనే ప్రవేశించింది. ‘ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ పనిపెట్టింది తనకే! స్కూళ్ళు మూసి, జూమ్‌లో పాఠాలు చెప్పడంవల్ల పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చోవడం గూర్చి, ఆ తరువాత వాళ్ళు హోమ్‌వర్క్ చెయ్యడం గూర్చి శ్రధ్ధ తీసుకున్నది తనే. ఆఫీస్ కంప్యూటర్ ముయ్యగానే ఆయన టీవీ ముందు సోఫాలో కూలబడేవారు. పిల్లలున్న ఉద్యోగులకి ఇద్దరు పనిచేసే కంపెనీల్లోనూ అదే జీతానికి పని గంటలని రోజుకి ఎనిమిది నించి ఏడుకి తగ్గిస్తే ఆయన ఆ గంటని కూడా నెట్‌ఫ్లిక్స్‌కి ధారపోశారు. పాండెమిక్ ముందు దాకా వారానికి కనీసం ఒకసారి బయట రెస్టారెంటుకి వెళ్ళడం, నెలకి రెండుసార్లయినా స్నేహితుల ఇంట్లో కలవడం ఉండేవి. పాండెమిక్ బలవంతంగా నలుగురినీ వారానికి ఏడు రోజులు, రోజుకి ఇరవై నాలుగు గంటలూ ఇంట్లో కట్టిపడేసింది. ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం కదూ, పాండెమిక్ మొదట్లో వారానికి కనీసం రెండుసార్లు షాపింగ్ అంటూ తను ఇంట్లోంచి బయటపడ్డది? షుగర్ పేషంట్లకి ఎక్కువ ప్రమాదం అని తెలిసినప్పటినుంచీ ఆ ఆటవిడుపుకు కూడా తాళంపడ్డది. అన్నీ హోమ్ డెలివరీకి మారిపోయాయ్.’

బాక్ టు ఆఫీస్ అన్న ఆప్షన్ ఇవ్వగానే ఆమె ఎగిరి గంతేసి కారులోకి దూకింది. బిజినెస్ పని మీద బయట ఊరు వెళ్ళాల్సివచ్చినప్పుడు ఇంకా ఆనందంగా వెళ్ళింది. పాండెమిక్ ముందు కూడా ఈ ట్రిప్పులేసినా, అప్పుడు పిల్లలని వదిలి వెళ్ళడం బాధగా అనిపించినా, ఇప్పుడు మాత్రం వాటిని ఒక ఆట విడుపుగా ఆహ్వానిస్తోంది. గత నాలుగు నెలల్లో ఈ ట్రిప్ మూడవసారి. జానీ ఇప్పుడు హైస్కూల్‌కి రావడం, సాయి కాలేజీకి వెళ్ళడం కూడా ఆమెకి తెరిపినిస్తోంది. ‘ఆ ఆలోచన కలిగినందుకే నా స్వార్థం నేను చూసుకుంటున్నట్టు సిగ్గేస్తోంది. కానీ, విమానంలో ఎక్కిన తరువాత సేఫ్టీ గూర్చి అందించే వివరాల్లో చెప్పేదేమిటి? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు ఆక్సిజన్ మాస్క్‌ని నీ మొహానికి తగిలించుకో – అని కదూ? దాన్ని స్వార్థం అని ఎవరూ అనరే?!’ ఇది ఆమె ఎవరినీ అడగగలిగే ప్రశ్న కాదు.

“నీకేమయినా కావాలా?” మెట్ల కింద నిలబడి గామోసు మోహన్ పెద్దగా అరవడంతో జీవిక ఈలోకంలోకి వచ్చింది. ‘ఫోన్ చేసి అడగచ్చు! వారం రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పటి నించీ ఇప్పటిదాకా మొహం చూడలేదు గనుక వీడియో కాల్ చెయ్యచ్చు! కిందనించి అరిచినా, జీవికా అంటూ మొదలు పెట్టొచ్చు. అదేం లేకుండా – సో ఇంపర్సనల్!’ జీవికకి ఒళ్ళు మండింది.

“ఆకలేస్తోంది!” ఆమె కూడా పెద్దగానే అరిచింది.

“ఏం తింటావ్?”

“ఒక అరటిపండు, కొంచెం గ్రీక్ యోగర్ట్.”

“వై ఆర్ యూ గయ్స్ స్క్రీమింగ్?” పెద్దగా అరుస్తూ జానీ. ‘అది తన బెడ్‌రూమ్ బయటికొచ్చినట్లుంది’ అనుకున్నది జీవిక.

“వుయ్ ఆర్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్.” మోహన్ వివరించాడు.

“వై డోన్ట్ యు యూజ్ ది ఫోన్? జీసస్! బి సివిలైజ్‌డ్!” అంటూ జానీ తన బెడ్‌రూమ్ లోకి వెళ్ళి ధడాల్న తలుపు వేసుకున్న శబ్దం జీవిక చెవులకి సోకింది.

కాసేపటికి, “ఇక్కడ పెట్టాను!” అన్న మోహన్ గొంతు విని ఆమె తల పైకెత్తింది. ఇరవై అడుగుల దూరంలో, తలుపు బయట మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకున్న గెటప్‌లో అతను కనిపించాడు. పాండెమిక్ మధ్యలో కొనిపెట్టుకున్న సరుకది. చెత్తలో పడెయ్యడంకన్నా వాడడమే మంచిదిలే అనుకున్నది. కావాల్సొస్తుందేమోనని రెండేళ్ళ క్రితం పాండెమిక్ మొదట్లో కొనుక్కున్న మందులని ఎక్స్‌పైర్ అయ్యాయని ఒక నెల క్రితం సీల్ తెరవని డబ్బాలు డబ్బాలు చెత్తలో పారేస్తుంటే ప్రాణం ఉసూరుమనడం ఆమెకి ఇంకా గుర్తున్నది.

ఒక గంట తరువాత లంచ్ ప్రహసనం మొదలయింది.

ఊబర్ ఈట్స్, లేదా డోర్ డాష్‌ల ద్వారా తెప్పించుకుందాం. ఇండియన్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయ్ కదా మనకి దగ్గరగా? లేదంటే, దగ్గర్లో డామినోస్ ఉండనే ఉన్నది – మోహన్ నించీ టెక్స్ట్ మెసేజ్.

పిజ్జా వద్దు. ఇండియన్ తెప్పిస్తే మీకు, దానికి, నాకు వాటాలు చేస్తూ నేను ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి కదా, ఇప్పుడది ఎలా కుదురుతుంది? – జవాబిచ్చింది జీవిక.

‘తెలుగులో సందేశాలు పంపే వెసులుబాటు వచ్చినందువల్ల స్పష్టంగా గౌరవంగా సంబోధించడానికి వీలవుతోంది. ఇంగ్లీషులో యు అంటే నువ్వు అంటూ చిన్నచూపు చూస్తున్నారో లేదా మీరు అంటూ గౌరవిస్తున్నారో తెలిసి చావదు’ అన్నాడు మోహన్ ఒకసారి. ఆమె ఫోన్లో తెలుగు ఫాంట్ డౌన్‌లోడ్ చేసిచ్చాడు. అందుకని ఆమెకు భర్తమీద గౌరవాన్ని వెలిబుచ్చుతూ సందేశాలని పంపే వెసులుబాటు దొరికింది.

ముగ్గురం ఎవరికి కావాల్సినవి వాళ్ళం తెప్పించుకుందాం – అతను.

నేను అంత తినలేను. చాలా మిగిలిపోతుంది – జీవిక.

మిగిలింది రాత్రికి తిను – అతను.

ఆ టెక్స్ట్ చూడగానే ఆ ఫోన్‌ని టీవీకేసి విసిరి కొట్టాలనిపించింది ఆమెకి. డీప్ బ్రెత్ తీసుకుని కాసేపు మంచం మీద అటూ ఇటూ పొర్లింది. చివరికి కళ్ళు తుడుచుకుని, సహనాన్ని ఆవహింపజేసుకుని దాన్ని వంటినిండా పులుముకుంది.

మీరు రాత్రికి ఏం తింటారు? – టెక్స్ట్ పంపింది.

ప్రసాద్‌గారింట్లో పార్టీ ఉన్నది గదా, మర్చిపోయావా? కనీసం నేనయినా వెళ్ళకపోతే బావోదు కదా? -జవాబొచ్చింది. ఆమె వంటిమీంచి ఆ సహనమంతా ఫెళఫెళా పెళ్ళలు పెళ్ళలుగా నేల మీదకి రాలిపోయింది.

నేను రాలేదేమని అడిగితే కోవిడ్ వల్ల అని చెబుతారా? – ఎమోటికాన్ దేన్నీ జోడింపకపోవడంవల్ల ఆమె ఎమోషన్‌ని ఆ టెక్స్ట్ మెసేజ్ అందజేసే అవకాశమే లేదు.

ఛ. అలా ఎందుకు చెబుతాను. ఊరెళ్ళొచ్చి అలిసిపోయింది, విశ్రాంతి తీసుకుంటున్నదని చెబుతాను. అన్నట్టు నీకు ఫీవర్, తలకాయనెప్పీ ఏమయినా ఉన్నాయా?

నిన్న రాత్రి ఇంటికి వస్తే ఇప్పటికి అడగాలనిపించిందా? – సెండ్ బటన్ నొక్కగానే ‘నా కింత ధైర్యం ఎలా వచ్చింది?’ జీవిక ఆశ్చర్యపోయింది. ‘పంపకుండా ఉండాల్సింది!’ పశ్చాత్తాపపడింది.

నేనడిగిన ప్రశ్నేమిటి? నీకు ఎలా ఉన్నదని కదా? జవాబు చెప్పవా? చూడ్డానికి బానే ఉన్నావని అది రాత్రి చెప్పింది. అప్పుడయినా, ఇప్పుడయినా జ్వరంగా ఉన్నది, మందులో, కాఫీనో పంపమని తమరు అడిగితేనే గదా తెలిసేది! చెప్పకు. దాచిపెట్టుకో! – కోపంతో ఎర్రబడ్డ మొహం ఎమోజీ కూడా వచ్చింది.


“మంట మీదున్నాను!” అన్నది చెల్లెలు సుమకి ఫోన్ చేసి. “నాకు కోవిడ్ సోకిందని తెలిసిన తరువాత నా అత్తమామలు, ఆడపడుచులూ ఆయన ఆరోగ్యం గూర్చి ఆదుర్దా పడడాన్ని అర్థం చేసుకోగలను. ఇటు అమ్మా నాన్నా కూడా, ‘ఆయన ఆరోగ్యం జాగ్రత్తమ్మా!’ అంటుంటే తలకాయ గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది!” అని బాధని వెళ్ళబోసుకుంది.

“వాళ్ళ డబ్బుతో నీకు కొనిపెట్టిన వస్తువుని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్తున్నారు అమ్మా నాన్నా. అందులో తప్పేమున్నది? ఒకటి గుర్తుపెట్టుకో, ఇవి అమెరికా గోడలు! నీ తలకాయ బానేవుంటుంది గానీ ఒక గోడకి గుంట పడ్డదనుకో, దాన్ని పూడ్చిన తరువాత ఆ గదంతా పెయింట్ చేయించాల్సొస్తుంది. నాలుగంకెల ఖర్చు విషయం!” సుమ జవాబిచ్చింది.

“ఇటు ఈయన సరేసరి! నేను రోగంతో పడి ఏడుస్తుంటే తను పార్టీకి కూడా వెడతారు!” ఆమె అక్కసు వెళ్ళబోసుకుంది.

“నువ్వు బెడ్‌రూములో, తను ఫామిలీ రూములో. ఇద్దరూ ఎలాగూ వేరే చోటేగా ఉండేది, రెంటికీ తేడా ఏమిటి? ఓ నాలుగయిదు గంటలు బయట తిరిగొస్తాడు. అంతేగా?” సుమ తిరిగి ప్రశ్నించింది.

“నువ్వు కూడా నన్ను సపోర్ట్ చెయ్యవా?” అన్నది జీవిక కోపంగా.

“లేకపోతే, అమ్మలాగా ‘నీకెంత కష్ట మొచ్చిందే తల్లీ!’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొమ్మంటావా? ఆవిడ అనే ఉంటుంది, నీ మంటలో అది ఆవిరైపోయుంటుంది. అందుకని గుర్తుండి ఉండదు. నీ గోల ఏళ్ళబట్టీ వింటూనే వున్నాను. ఆయన్ని మార్చాలేవు, నువ్వు మారాలేవు. కనీసం, డైవోర్స్ తీసుకుంటానని భయపెట్టవే అంటే వినవు.”

“అదొక్కటే మిగిలింది! పిల్లలు పెద్దవాళ్ళవడం వల్ల బతికిపోయాను గానీ ఈ పాండెమిక్ అయిదేళ్ళ క్రితం వచ్చుంటే మాత్రం ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో వాళ్ళతోనే ఉండి పిచ్చెత్తిపోయేది.”

“నువ్వు భయపడ్డ వయసే మా పిల్లలది పాండెమిక్‌లో. నాకు పిచ్చెత్తిందంటావు!”

“కొత్తగా ఎక్కడమేమిటి, మొదటినించీ ఉన్నదేగా! నువ్వు మీ ఆయన గూర్చి ఇప్పటిదాకా నాకు కంప్లైంట్స్ ఏమీ చేయకపోవడం అందువల్ల కాదా? చెయ్యడానికేమీ లేవని అనుకోవడానికి నేనేం నిన్ననే పుట్టలేదు!”

“చెయ్యడానికి కంప్లైంట్స్ ఎందుకు లేవూ, బోల్డన్ని ఉన్నాయ్. అయితే, మా మధ్య కామన్ ఫాక్టర్ కొద్దిగా పెద్ద సంఖ్య – కనీసం రెండంకెల్లో ఉన్నదని నా నమ్మకం. అదే మీ మధ్యలో? ఒకటో, రెండో – లో సింగిల్ డిజిట్. కిరణ్‌ని ‘మా ఆయన’ అని నేను అనగా నువ్వెప్పుడూ వినలేదు. అయినాగానీ అతని గూర్చి నాతో మాట్లాడేటప్పుడు నువ్వు ‘మీ ఆయన’ అనడం మానవు.”

“మై హజ్‌బెండ్ అనడానికీ, మా ఆయన అనడానికీ తేడా ఏమున్నది?”

“కొత్తవాళ్ళకి పరిచయం చేసేటప్పుడు లేదు. నాతో మాట్లాడేటప్పుడయినా అమ్మతరం వాళ్ళ లాగా పేరు చెప్పడానికి సిగ్గుపడుతూ ‘మా ఆయన’ అని కాక మోహన్ అని చెప్పచ్చుగా? జానీ గూర్చి నాతో మాట్లాడేటప్పుడు ‘మా అమ్మాయి’ అని చెబుతావా? కాదు గదా? అలాగే మొగుడి గూర్చి చెప్పేటప్పుడు కూడా చెయ్యచ్చు. మాటిమాటికీ హజ్‌బెండ్ అని గుర్తుచేసుకుంటూ మనసులో పాదాలు కళ్ళకద్దుకోవక్కర్లా!”

“నీకు ఫోన్ చేసేది సుత్తి కొట్టించుకోవడానికి కాదు!” అని జీవిక విసురుగా ఫోన్ పెట్టేసింది.

‘వాళ్ళిద్దరూ అమెరికాలో ఎమ్.ఎస్. చేస్తున్నప్పుడు కలిశారు. సినిమాలకీ షికార్లకీ బదులు హైకింగులకీ విహార యాత్రలకీ వెళ్ళారు. తనూ చేసింది ఎమ్.ఎస్. అమెరికాలో. ఆయన ఇండియా నించి ఉద్యోగపరంగా అమెరికా వచ్చారు. అమెరికాలో ఉన్న ఇద్దరికీ ఇండియాలో అరేంజ్‌డ్ మారేజ్. అదా తేడా? ఆలోచనల్లో కూడా ఆయనే అని వింటే అదింకా ఆట పట్టిస్తుంది. మోహన్ వచ్చాడు అని ఎందుకు అనుకోలేకపోతున్నాను?’


సోమవారం జీవిక జీవితంలో కొత్తరోజు. ఆమె ఎవరికీ ఏమీ అందించకుండానే రోజు గడిచింది. అది ఆమెకి కొద్దిగా గుచ్చుకున్నమాట మాత్రం నిజం. జానీ తనంతట తనే లేచి, స్కూల్‌కెళ్ళింది. బ్రెక్‌ఫాస్ట్‌కి బేగెల్స్ బయటి నుంచి డెలివరీ. ఒక బేగెల్‌నీ కాఫీనీ ఆమెకి అందించి తొమ్మిదికల్లా ఆఫీస్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు మోహన్. అవసరమయిన మందుల్ని మింగి, తన కంప్యూటర్‌ని తెరిచి బెడ్‌రూములో దాని ముందు కూర్చుంది జీవిక. మీటింగులప్పుడు చెవులకి హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నారిద్దరూ. లంచ్ ఊబర్ ఈట్స్ సరఫరా చేసింది. మిగిలినవి డిన్నర్‌కి అనుకున్నది గానీ ఏ కళనున్నాడో మోహన్ అన్నం, పప్పు చేశాడు. ‘చెయ్యడం రాక కాదు’ అని ఆమెకి తెలిసినదే. సాయంత్రం అయిదు గంటల నించీ పడుకోబోయేదాకా ఉన్న సమయాన్ని ఎప్పటినించో చూడాలనుకుని సమయం లేక మానేసిన అమెజాన్ ప్రైమ్ సీరియల్స్ చూడడానికి కేటాయించింది. ఎప్పటిలాగానే స్కూల్ నించి రాగానే జానీ తన స్కూల్‌వర్క్‌తో బిజీగా ఉండి, తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నది.

మంగళవారంనాడు మాత్రం జానీ ఆలస్యంగా లేవడం వల్ల బస్ మిస్సయి, తండ్రిని స్కూల్లో దింపమన్నది. ‘ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది, దింపలేను!’ అనడంతోపాటు డిసిప్లిన్ ఎంత ముఖ్యమో అన్న విషయం గూర్చి మోహన్ లెక్చరిచ్చాడు. ఒకరోజు ఫలితాలని అనుభవిస్తేనే గానీ బుధ్ధి రాదన్నాడు. ఆ రోజు ముఖ్యమయిన పరీక్ష ఉన్నదని, దానికోసం తయారవుతూ రాత్రి రెండింటిదాకా నిద్రపోకపోవడం వల్లనే లేవడం ఆలస్యమయిందని, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే గానీ మేకప్ పరీక్ష పెట్టరని, అందువల్ల ఆ రోజు స్కూల్ మిస్సయితే తన జిపిఎ పడిపోతుందనీ జానీ అరిచింది. ‘వంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాడివి కదా, అలాగే ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చెయ్!’ అని డిమాండ్ చేసింది. ‘తప్పుతుందా, సరే పద!’ అంటూ మోహన్ వెళ్ళి దింపి వచ్చాడు.

‘పాండెమిక్‌కి ముందు వాడికీ దానికీ ఇవ్వన్నీ చేసిందెవర్టా? బస్ మిస్సయినప్పుడు స్కూల్లో దింపడంతోపాటు వయొలినో, హోమ్‌వర్కో, ఇంకోటింకోటో మర్చిపోయానంటూ ఫోన్ వస్తే మధ్యలో వెళ్ళి అందజేసిందెవర్టా? నేనేగా? ఒక్కసారికే అంత ఇదయిపోతున్నారు!’

బుధవారం నించీ శుక్రవారం దాకా వాళ్ళ దినచర్య సోమవారంనాటిదే, చిన్న మార్పుతో.

“ఛస్తున్నా పైకీ కిందకీ తిరగలేక!” అని ఏమయినా తెచ్చిపెట్టినప్పుడల్లా మోహన్ అనడం బుధవారం మొదలయింది. అప్పటికీ, డిన్నర్ తెచ్చిపెడుతోంది, గది బయట రోజంతా పోగయిన ప్లేట్లనీ కప్పుల్నీ పడుకోబోయే ముందర గ్లవ్స్ వేసుకుని కిందకి తీసుకుని వెడుతోంది జానీయే. మొదటిసారి విన్నప్పుడు జీవిక చివ్వున తలెత్తి బెడ్‌రూమ్ లోంచి బయటకు చూసింది. ఆ తరువాత పట్టించుకోవడం మానేద్దామనుకున్నది గాని, ఆ మాటలు చెవిలో దూరి చేసే సలపరాన్ని మాత్రం ఆపలేకపోయింది.

వారం మధ్యలో తల్లికి సాయి విడియోకాల్ చేసినప్పుడు, “నీ మొహం నీరసంగా కనిపిస్తోంది” అన్నాడు. “శనివారం ఫోన్ చేస్తే దానికి ఇప్పుడా జవాబివ్వడం? అయినా, నాగూర్చి ఈమాత్రమన్నా పట్టించుకునేవాడివి నువ్వొక్కడివేలే!” జీవిక జవాబిచ్చింది.

మరునాడు శుక్రవారం అంటూ, సాయి ‘ప్రభుత్వం చెప్పిన ప్రకారం కోవిడ్ సోకి పదిరోజులవుతుంది గనుక నీకు రేపటి నించీ క్వారంటైన్ అవసరం లేదు’ అని టెక్స్ట్ చేసి గుర్తుచేసినప్పుడు జీవికకి దిగులుపట్టుకుంది.

“మళ్ళీ టెస్ట్ చేసుకో!” మోహన్ ఆదేశించాడు. “అవసరం లేదు” అని జానీ అన్నది. కానీ షుగర్ పేషెంట్ ఒప్పుకోలేదు. “కొంతమందికి నెలదాకా పాజిటివ్ వస్తూనే ఉంటుందట!” అని జానీ భయపెట్టినా లొంగలేదు.

శనివారం పొద్దున్న కోవిడ్ రిజల్ట్ నెగెటివ్ చూపించిన టెస్ట్ స్ట్రిప్‌కి జీవిక ఫొటో తీసి ఫామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టింది. బెడ్‌రూమ్ బయట అడుగుపెట్టి మెట్లు దిగింది.

ఎందుకయినా మంచిది, ఇంకొక వారం మాస్క్ వేసుకునే తిరుగుదాం, వేరే గదుల్లోనే పడుకుందాం – నిద్రలేచిన తరువాత బెడ్ మీంచే మోహన్ టెక్స్ట్ పంపాడు.

‘వారమేం ఖర్మ, నెలకి పొడిగిద్దాం! అయినా ఎల్లుండి నించీ నేను ఆఫీసుకెడతాగా’ అనుకున్నది జీవిక. అప్పుడామెకి గుర్తొచ్చింది. ‘ఇప్పటికే రెండువారాలు. ఇంకా వారం రోజులకన్నా తట్టుకోలేడు పక్కలో దూరానికి. అదీ అసలు గోల!’ పెదవి విరిచింది. ఆలోచనలోనయినా ‘రు’కి బదులు ‘డు’ దొర్లడం ఆమె గమనించిందన్నడానికి నిదర్శనంగా ఆ విరుపు సన్న నవ్వుగా మారింది.


“లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్ – తలకాయ నొప్పీ, నీరసమూ లాంటివి ఏమయినా ఉన్నాయా?” నెలరోజుల తరువాత ఫోన్ చేసినప్పుడు సుమ అడిగింది.

“నాకు కోవిడ్ సోకితేగా!”

అర్థం చేసుకుని ఆశ్చర్యపోయి, “మీ ఆయనకి చెప్పేదా?” సుమ టీజ్ చేసింది.

“అమెరికన్ రాజ్యాంగం అందరికీ వాక్స్వాతంత్ర్యాన్నిచ్చింది. నీకు కూడా!” అన్నది జీవిక.