ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి

పరిచయము

గడచిన నెల వ్రాసిన వ్యాసములో ఉదాహరణముల ఉత్పత్తిని, వాటి నియమములను, విభక్తులను గుఱించిన విశేషములను, రగడల లక్షణములను చర్చించినాను. ప్రతి విభక్తికి నిదర్శనముగా కొన్ని ప్రసిద్ధమైన ఉదాహరణ కావ్యములనుండి వృత్తములను, కళికోత్కళికలను నిదర్శనములుగా చూపినాను. ఇప్పుడు నేను వ్రాసిన శారదోదాహరణతారావళి అనబడు ఒక ఉదాహరణ కావ్యమును మీకు సమర్పిస్తున్నాను. దీనిని ఒక పుష్కరమునకు ముందు వ్రాసినాను. దానితోబాటు మఱికొన్ని విశేషములను చేర్చినాను.


1. తెలుగు విభక్తి లక్షణములు

నేను అదనముగా చేర్చినవి రెండు, అవి – (1) ఉదాహరణముల నియమములలో వృత్తములుగా శార్దూల మత్తేభవిక్రీడితములను, చంపకోత్పలమాలలను మాత్రమే వాడవలయునని ఉన్నది. కవులు ఇతర వృత్తములను, కందమును, ద్విపదను కూడ వాడినారు. నేను ప్రతి విభక్తికి ఒక వృత్తమును వాడినాను. అవి పై నాలుగు వృత్తములుగాక వేఱైనప్పుడు ఆ వృత్తములలో ఒకదానిలో కూడ వ్రాసినాను. (2) విభక్త్యాభాసమునకు చతుర్థీ విభక్తిని మాత్రమే కవులు ఉపయోగించినారు. ద్వితీయా, తృతీయా, షష్ఠీ విభక్తులలో కూడ ఉత్కళికను వ్రాయునప్పుడు విభక్త్యాభాసము సాధ్యము అని నిరూపించినాను. ఉదాహరణములలో ఉపయోగించే విభక్తులను, ఈ ఉదాహరణపు కళికలలోని రగడలను గుఱించిన వివరముల పట్టికను కూడ ఇచ్చియున్నాను.

ప్రథమా విభక్తి

ఉత్పలమాల –
శ్రీల నొసంగు దేవి పలు – చెల్వము లిచ్చెడు దేవి విద్యలన్
జాల నొసంగు దేవి నర-జన్మకు నర్థము నిచ్చు దేవి స-
చ్ఛీల మొసంగు దేవి ప్రవ-చించఁగ వేదము లిచ్చు దేవి గా-
రాల నొసంగు దేవి యను-రాగము మీఱఁగ వాణి నీయుతన్

కళిక – మధురగతి రగడ –
మఱియును నుత్పల – మాలల గంధము
గరువపు నడకల – కందపు టందము
హరుసము నిచ్చెడు – హంస రుతమ్ములు
కరిబృంహితములు – క్రౌంచపదమ్ములు
కోకిల కలరవ – కోమల గీతము
ప్రాకట మగు ష-ట్పద మృదు గీతము
వసుమతి చేసెడు – పలు వందనములు
ప్రసువున కొసగెడు – ప్రణ యార్పణములు

ఉత్కళిక – చ/చ
నవ్వులు తెల్లన
పువ్వులు తెల్లన
హారము తెల్లన
కీరితి తెల్లన
డెందము తెల్లన
చందము తెల్లన
భగవతి ధ్యానము
యుగముల ప్రాణము

కొన్ని వివరణలు

  1. విభక్తులకు పేరులు, అధిదైవములు గలవు. ప్రథమా విభక్తి పేరు వాణి, అధిదేవత వీరావళి. ఇందులో వాణి పేరు పద్యములో వచ్చినది.
  2. కావ్యము శ్రీకారముతో నారంభమైనది. ఎందుకనగా-
    శ్రీకారము శుభకర మగు
    శ్రీకారము సకలకార్యసిద్ధి నొసంగున్
    శ్రీకారము గీర్తిద మగు
    శ్రీకారము గృతుల నాది జేకూర్ప దగున్ (చాటుధార)
  3. కళికలో ప్రకృతిలో గల చరాచరములను, జడజీవములను తల్లి శారదకు భూదేవి ప్రేమతో అర్పణ చేయుచున్నదను ఒక భావన. ఛందస్సు నాకు ప్రియము, అందు వలన వృత్తముల, ఇతర పద్యముల నామములు ఇందులో గలవు. అవి- ఉత్పలమాల, కందము, హంసరుతము, కరిబృంహితము, క్రౌంచపదము, కోకిల, కలరవ, కోమల, గీతము, వసుమతి.
  4. చందము అనగా తెఱగు. ఛందస్సు అని కూడ అర్థము. ఛందస్సు వేద భాష కూడ.
  5. సరస్వతిని తెల్లదనముతో బోల్చుట వాడుక. యా కుందేందు తుషారహార ధవలా… శారద నీరదేందు ఘనసార పటీర… ఇత్యాదులు. అందువలన ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో ఆ తెల్లదనమును తెలిపి, చివరి రెండు పాదములలో నియతమైన ప్రథమా విభక్తిని వాడినాను.

ద్వితీయా విభక్తి

వసంతతిలక
రాజేశ్వరిన్ సుకవి-రాజహృదంతరాత్మన్
రాజీవ నేత్రిని స్వ-రామృత వర్షదాయిన్
రాజీవగంధిని ని-రంతర హర్షదాయిన్
రాజాననన్ గొలుతు – రాజ మరాళయానన్

ఉత్పలమాల –
నన్నయ నన్నెచోడుల మ-నమ్ముల నిల్చిన నీరజాక్షిఁ, ది-
క్కన్న కలమ్ములోన మధు-రామృత మద్దిన మిన్కుగొమ్మఁ, బో-
తన్న గళమ్ములోన మధు – ధారల నింపిన శారదాంబనున్
జెన్నుగ సత్కవిత్వ మధు-సేవన మీయఁగ వేడెదన్ సదా

కళిక – మధురగతి రగడ –
మఱియు గులాబుల, – మణిమంజరులను
విరియు నలినముల, – విపినతిలకమును
మకరందికలను, – మల్లెల మాలను
రకరకముల కిస-లయ వృత్తములను
చంపకకేసరి – చంపకమాలను
సొంపుల నొసగెద – సురలత ననలను
పదములఁ గొలువఁగ – భారతి ప్రభవను
ముదమున బొగడఁగ – మోహన విభవను

ఉత్కళిక – చ/చ
గురువుల గురువై
స్వరముల కిరవై
అక్షి కలఘువై
అక్షర లఘువై
కీర్తికి మతియై
ఆర్తికి గతియై
తలచఁగ సుముఖిని
పిలువఁగ ప్రముఖిని

వివరణలు

  1. ఎనిమిది విభక్తులకు ఎనిమిది రకములైన వృత్తములను వాడవలయునని తలచినందున, ఈ విభక్తికి వృత్తముగా వసంతతిలకను ఎన్నుకొనినాను. వసంతతిలక- త-భ-జ-జ-గ-గ యతి (1, 8). ఈ వృత్తమునకు ఇతర నామములు సింహోన్నత, ఔద్ధర్షిణి, శోభావతి, మధుమాధవి. ఇది శక్వరి ఛందములోని 2933వ వృత్తము.
  2. కళికోత్కళికలలో గోచరమగు పద్యముల పేరులు- గులాబి, మణిమంజరి, నలిన, విపినతిలక, మకరందిక, మల్లెలమాల (నా సృష్టి), కిసలయ, వృత్త, చంపకకేసరి, చంపకమాల, సురలత, సుముఖి. కాలమునకు ఆదియని ప్రభవ పదము సూచించును.
  3. పద్యము పాదములతో విరాజిల్లును. పాదములు పదములతో శోభించును. పదములు అక్షరములతో నిండియుండును. అక్షరములు గురులఘువులు. పద్యములు సంగీతభరితము. ఈ గుణములు అక్షర, గురు, లఘువు, స్వర పదములతో తెలుపబడినవి.
  4. ద్వితీయా విభక్తికి పేరు ఝట, అధిదేవత కీర్తిమతి. కీర్తిమతి యను పేరు ఉత్కళికలో ఇచ్చినాను.
  5. కళికలో అన్ని పాదాంతములలో ద్వితీయా విభక్తియైన ను-కారము, ఉత్కళిక చివరి రెండు పాదములలో ని-కారము ఇవ్వబడినవి.

క్రొత్త ప్రయోగము – ద్వితీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక- చ/చ
కంజదళాక్షి ని
రంజనమూర్తి ని
రంతర శాంతి ని
తాంత సుకాంతి ని
గూఢ గుణాళి ని
రూఢ కళాబ్ధి ని
రర్గళ వాణిని
స్వర్గవిహారిని