విశ్వమహిళానవల 14: కరొలీనా పావ్లోవా

కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. ఎవరూ అందుకోలేనిది. వివిధ కారణాల వల్ల స్వదేశం వదిలి మరో దేశంలో తలదాచుకున్న రష్యన్ రచయితల జాబితా బాగా పెద్దదే. పుష్కిన్, లెమొన్‌తోవ్, తుర్గెనెవ్, దాస్తోవ్‌యెస్కీ, పాస్టర్‌నాక్, నబకోవ్, సోల్జెనిట్సిన్, బ్రాడ్‌స్కీ ఈ జాబితాలోని కొందరు ప్రముఖులు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కూడా ఉంది. ఆమె 19వ శతాబ్దికి చెందిన కరొలీనా పావ్లోవా (Karolina Pavlova). ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు నుంచి వచ్చిన అణచివేత కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.

1807లో పుట్టి 1893లో మరణించిన కరొలీనా తన జీవితంలో నలభై యేళ్ళ పాటు స్వదేశం వెలుపలే (జర్మనీలోని డ్రెస్‌డెన్‌లో) నివసించింది. బంధువులు, స్నేహితులు, అభిమానులు, ఎవ్వరూ తోడు లేకుండా, కనీసం డబ్బు కూడ లేకుండా, అనాథగా, ఏకాకిగా మరణించింది. ఆమె మరణించినపుడు ఒక్కటంటే ఒక్క రష్యన్ పత్రిక కూడ ఆమె మరణవార్తను, ఆమె సాహిత్య కృషినీ నామమాత్రంగా కూడ ప్రచురించలేదు. ఇంతకూ ఆవిడ చేసిన నేరమేమిటి? అని ప్రశ్నిస్తే, కవిత్వం తన జీవితమని ప్రకటించుకోవడం; దుర్మార్గుడైన భర్తపై కేసు పెట్టడం. ఈ ‘నేరాల’కుగాను, సాహిత్యచరిత్రలో కొన్ని దశాబ్దుల పాటు ఆమె ప్రస్తావనే లేకుండా చేశారు ఆ రష్యన్ మేధావులు!

కరొలీనా ప్రధానంగా కవయిత్రి. ఆమె రాసింది ఒకే ఒక నవల. ఎ డబుల్ లైఫ్ (A double life) అన్న ఈ నవల ఆమె రాసినప్పుడే (1848) ప్రజాదరణ పొందింది. (ఆ నవల గురించి తర్వాత) కవయిత్రులు కరువైన ఆ యుగంలో మంచి కవిగా పేరు తెచ్చుకున్న ఒక దశ ఆమెకుంది. కానీ క్రమక్రమంగా కవిత్వం పట్ల ఆమె దృక్పథం, ఆమె సామాజిక జీవితం, ఆమె వ్యక్తిగత జీవనం, తోటి సాహిత్యకారులకూ పాఠకులకూ కంటగింపుగా పరిణమించాయి. ఇది ఎంతవరకూ పోయిందంటే, ఆమె ప్రశాంతంగా మాస్కోలో జీవించలేక, జర్మనీకి వలసపోయింది. 1858 నుంచి 1893లో మరణించేవరకూ అక్కడే ఉండిపోయింది. ఆమెను తిరిగి స్వదేశానికి రమ్మని తోటి కవులు గాని, పాఠకులు గాని, చివరికి కుటుంబసభ్యులు గానీ ఏనాడూ ఆహ్వానించలేదు.

ఇలాంటి విషాదయోగంలో ఉండిపోయిన కరొలీనా జీవితం, సాహిత్యం, ఆమె రాసిన నవల ఎలాంటివి? కరొలీనా తండ్రి కార్ల్ జేనిష్, మాస్కోలో భౌతిక, రసాయనశాస్త్రాల్లో ప్రొఫెసర్. జర్మనీనుంచి రష్యాకు వలసవచ్చిన కుటుంబం అతనిది. కుమార్తె మీద అమితమైన ప్రేమతో ఆమెకు బాల్యం నుంచి ఇంట్లోనే ఉన్నతవిద్యదాకా నేర్పించాడు. (మాస్కో విశ్వవిద్యాలయంలో 1876 వరకూ ఆడపిల్లలకు ప్రవేశం లభించలేదు కనక ఉన్నత విద్య కావాలనుకున్న యువతులు ఇంట్లోనే చదువుకోవాల్సివచ్చేది.) తండ్రి పుణ్యమాని కరొలీనా రష్యన్ మాత్రమే కాక, జర్మన్, ఫ్రెంచ్, డచ్, ఇటాలియన్, స్పానిష్, పోలిష్ భాషల్లో నైపుణ్యం సంపాదించింది. ప్రసిద్ధ రష్యన్ కవులను ఆమె జర్మన్ లోకి అనువదించేది. సాహిత్యసభల్లో ఆ కవితలు చదివి వినిపించేది. తను కూడ జర్మన్, ఫ్రెంచి భాషల్లో కవిత్వం రాసేది. ఇంతవరకూ ఆమెకు సాహిత్యలోకంలో మంచి పేరే ఉండేది. సామాజికహోదా కూడ ఉండేది. 1836లో ఆమె నికొలాయ్ పావ్లోవ్ అనే ఒక ‘చిన్నకారు’ రచయితను వివాహం చేసుకుంది. అతని ప్రతిభ అంతంత మాత్రమే. కరొలీనాను ఆమె డబ్బు కోసమే చేసుకున్నానని స్పష్టంగానే చెప్పాడా మహానుభావుడు. 1844 వరకూ వాళ్ళ ఇల్లు కవితాగోష్టులకు, రష్యన్, పశ్చిమదేశాల తాత్వికతపై ఘాటైన చర్చలకు నిలయమైంది. ఆ సభల్లో ఆమె తన అనువాద కవితలు వినిపించేది. ఆ క్రమంలోనే తన స్వీయకవితలను కూడ వినిపించేది. అప్పుడే మొదలైంది ఆమె పట్ల విముఖత. పురుషుల సామ్రాజ్యమైన కవితాసామ్రాజ్యంలోకి స్త్రీ అడుగు పెట్టడమేమిటి? అందులోనూ జర్మన్ మూలాలున్న ఒక స్త్రీ రష్యన్‌లో కవిత్వం రాయడమేమిటి? ఇది ఒక పట్టాన ఎవరికీ కొరుకుడు పడలేదు. అలా కొందరు దూరమైతే, ఇంట్లో మరో కారణం వల్ల ఆమెకు మనశ్శాంతి కరువైంది. భర్త పావ్లోవ్ ఆమె సంపాదనను, ఆస్తిని తన జూదాల్లో ఊదిపారేశాడు. ఎంతో కొంత రచయితగా పేరున్న అతని కథల్ని ఇప్పుడు ఎవరూ చదవడం లేదు. భార్య కరొలీనా కవిత్వాన్ని సామాన్యపాఠకులు ఉత్సాహంగా పఠిస్తున్నారు. భార్య ముందు తను ఎందుకూ పనికిరాడని తేలిపోగానే అతనిలో ఆత్మన్యూనత ప్రారంభమైంది. ఆమెకు దూరమయ్యాడు. కరొలీనానే కాపాడి, ఆశ్రయమిచ్చిన అమ్మాయితో వేరు కాపురం పెట్టాడు పావ్లోవ్. అలా ఆమె సంసారజీవితం ఛిన్నాభిన్నమయింది.

ఆ తర్వాత ఆమెతో అంతవరకూ స్నేహంగా ఉన్న పురుషకవులు కూడ క్రమంగా దూరమయ్యారు. దానికి కారణం ఆమె తనని తాను సాహితీవేత్తగా, కవిగా ప్రకటించుకోవడం! వ్యక్తిగత జీవితంలో ఆనందం లభించని కరొలీనా అనుక్షణం కవిత్వానికే జీవితాన్ని అంకితం చేయడం వారికేమాత్రం నచ్చలేదు. ఒక వివాహిత స్త్రీ, కొడుకు కూడ ఉన్న స్త్రీ, కుటుంబమే నా జీవితం అనడానికి బదులు ‘నేను కవిత్వం కోసమే బతుకుతాను’ అనడం అహంకారపూరితమని, కపటమనీ వాళ్ళు తీర్మానించారు. అప్పటి ప్రసిద్ధ రష్యన్ కవులకు ఆమెపై ఎంత కోపం వచ్చిందంటే ఆమె మీద పేరడీలు రాయడం మొదలుపెట్టేంతగా. పొరపాటున ఏ పాఠకుడైనా ఆమె కవితను మెచ్చుకుంటూ చదివితే, వెంటనే సదరు ప్రసిద్ధ కవి తను ఆమెపై కట్టిన పేరడీ కవితను వినిపించేవాడు. దానితో అందరూ నవ్వుకునేవారు. స్త్రీలు యథాలాపంగా అప్పుడప్పుడూ ఏదో రాస్తే రాయవచ్చు గానీ సాహిత్యమే జీవితంగా బతికే స్థాయి వారికి ఉండదని నాటి సమాజం తీర్పు. అలా, ఆమె చేత తమ కవితల్ని ఇతర భాషల్లోకి అనువదింపజేసుకున్న మహానుభావులే, ఆమె స్వీయకవిత్వాన్ని ఎద్దేవా చేశారు. ‘కవిత్వరచన ఆడలక్షణం కాదని’ ప్రకటనలు చేశారు. వీళ్ళ చర్చలు, తిరస్కారాలు తన ఇంట్లోనే జరగడం కరొలీనాకు మరింత మనస్తాపం కలిగించేది. ఆమె కొడుకు ఒకసారి తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు: ముందు గదిలో అందరూ తీవ్రస్థాయిలో చర్చలు చేసుకుంటూంటే అమ్మ లోపలి గదిలోకి పారిపోయి వచ్చేది. నేను చూస్తూండగా, అటూ ఇటూ గదిలో పచార్లు చేస్తూ ఆశువుగా కవితలు చెబుతూండేది. ఆమె అసహనాన్ని, అసంతృప్తినీ అలా కవితలు చెప్పడంలో కప్పిపెట్టేది. ఆ తర్వాత ఆ కొడుకు కూడ ఆమెకు దూరం కావడం మరో విషాదం.

కరొలీనాపై ఎగతాళి ద్వేషంగా మారడానికి, ఆమె ‘స్నేహితులు’ కూడ దూరమవడానికీ దారితీసిన సంఘటన, పూర్తిగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పావ్లోవ్, కరొలీనా సంపాదనను కర్పూరహారతి చేయడమే కాక, ఆమె ఇంటిని కూడ ఆమెకు చెప్పకుండా తన జూదంలో తాకట్టు పెట్టడంతో, ఇక భరించలేక పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పది నెలలు జైల్లో ఉన్నాడు. భర్త అరెస్టుకు కారణమైనందుకు (అతను ఎన్ని అన్యాయాలు ఆమె పట్ల చేసినా) ఆమెను ఎవరూ క్షమించలేదు. ఒక స్త్రీ, తన భర్త తనకు అన్యాయం చేశాడని, మోసం చేశాడనీ బహిరంగంగా చెప్పడం, పోలీసులకు అతన్ని అప్పజెప్పడం వాళ్ళకు కొరుకుడు పడలేదు. ఆమె రచనల పట్ల అప్పటిదాకా చూపిన గౌరవమంతా ఈ ఒక్క సంఘటనతో ఎగిరిపోయింది. దాదాపు మిత్రులందరూ ఆమెకు శత్రువులైపోయారు. ఆ భర్తగారు, ఆమె ఆదరణకింద ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడంలో, ఆమె ఆస్తిని ఆమె అనుమతి కూడ లేకుండా తగలెయ్యడంలో ఎంత అమానుషంగా ప్రవర్తించాడన్నది వాళ్ళకు పట్టలేదు. చట్టరీత్యా అతను చేసిన నేరాన్ని ఆమె పోలీసులకు చెప్పడం మాత్రం వాళ్ళకు దుర్భరమనిపించింది. క్షమించరాని నేరమైంది.

అందరి నిరాదరణకు గురైన కరొలీనా మాస్కోలో ఉండలేక, కొడుకుతో సహా తన తండ్రి వద్దకు వెళ్ళింది. మనశ్శాంతి కరవై ఒక ఏడాదిపాటు కవిత్వరచన పూర్తిగా మానేసింది కూడా. అయితే తనకంటే 25 ఏళ్ళు చిన్నవాడైన బోరిస్ అనే యువకుడితో ప్రేమలో పడ్డంతో మళ్ళీ ఆమెలో ఉత్సాహం చిగురించింది. ఉద్వేగభరితమైన కవిత్వం రాయడం మొదలు పెట్టింది. (అప్పటి తీర్పరి సమాజానికి ఇది ఇంకా దుర్భరమైవుంటుంది.) అప్పుడు రాసిన ప్రేమకవితలు ఆమె కవిత్వ ప్రతిభకు అద్దం పడతాయి. ఈలోగా ఆమె కుమారుడు తల్లి దగ్గర ఉండలేనని, తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి, ఆమెకు మానసిక క్షోభనే మిగిల్చాడు. ఆ తర్వాత భర్త కాని, కొడుకు కానీ ఆమెను చూడ్డానికి రాలేదు.

కరొలీనాకు అండగా ఉన్న తండ్రి కూడ మరణించడంతో 1858 నుంచి జర్మనీలోని డ్రెస్‌డెన్ నగరంలో ఏకాంత జీవితం మొదలుపెట్టింది. ఈ ఒంటరితనంలో ఆమెకు తోడున్నది ఆమె కవిత్వమే. కానీ ఇది కూడ తోటి కవులకు నచ్చలేదు. 1860లో ఆమెను చూడ్డానికి వచ్చిన ఒక సాహితీమిత్రుడు, తిరిగి మాస్కోకు వెళ్ళిన తర్వాత, తన మిత్రులతో ఆమెతో గడిపిన క్షణాలను వర్ణిస్తూ అన్నాడు: ఒక్క పదినిమిషాలు నాతో మామూలుగా, ఆనందంగా మాట్లాడింది. అంతే. ఆ తర్వాత తన కొత్త కవిత వినిపించడం మొదలుపెట్టింది. అదేం మనిషో… కుటుంబమంతా దూరమై, ఏడుస్తూ ఉండాల్సింది పోయి, కవిత్వం వినిపిస్తుందా నాకు? ఎంత అహంకారం? తన దుఃఖాన్ని, ఒంటరితనాన్ని కవిత్వంలో మరిచిపోవడానికి ప్రయత్నించిన ఆమెను తోటి కవులు అర్థం చేసుకున్న తీరు అది! కరొలీనా కవితారచనంతా పురుషులకు తాను తీసిపోనని ప్రకటించుకోవడానికి రాసిందేనని, అది ఆమె అహంకారానికి నిదర్శనమనీ వాళ్ళు భావించారంటే, ఆ కవుల సంస్కారాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి. ఈ ధోరణే ఆమెను ఇంకా ఎక్కువ బాధించింది. ఆమెలో పంతం కూడ పెంచింది.

అందుకేనేమో తన స్నేహితురాలు ఓల్గాకి రాసిన ఉత్తరంలో అంది: I am occupied with the contemplation of an interesting experiment; I wish to see whether everything that befalls me will strengthen me; whether I will withstand it or not. ఆమె అనుకున్నదానికంటే ఎక్కువగానే తట్టుకోగలిగింది – రోజుకు ఎనిమిది గంటలు రాస్తుండడం ద్వారా.

ఏకైక నవల: ఎ డబుల్ లైఫ్

స్వీయానుభవాలు, ఆనాటి స్త్రీకి సమాజంలో ఉన్న ప్రతిపత్తి, స్త్రీని ఆమె వైవాహిక జీవిత సాఫల్యం ద్వారానే కొలిచే సంప్రదాయం, స్త్రీలు కవిత్వం రాయడంపై సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరులు – వీటన్నిటినీ అధిక్షేపిస్తూ అసాధారణమైన కథన శిల్పంతో రాసిన నవలే ఎ డబుల్ లైఫ్. ప్రచురింపబడుతున్నపుడు పాఠకుల ఆదరణ పొందిన నవల. విమర్శకులు కూడా మెచ్చుకున్న కవితాత్మక నవల (లిరికల్ నావెల్). కానీ అది ఆమె భర్తతో ‘సుఖంగా’ కాపురం చేస్తున్న రోజులు. తర్వాత భర్తతో గొడవపడ్డాక, ఈ ‘మంచి’ నవలే కంటగింపుగా మారింది విమర్శకులకు. ఇలాంటి నవల ఒకటి ఆమె రాసిందని చెప్పడం కూడ మానేశారు. కేవలం వ్యక్తిగత జీవితంపై తీర్పుల వల్ల రచయిత్రిగా తన స్థానాన్ని కోల్పోయిన దురదృష్టవంతురాలు కరొలీనా.

ఈ నవలలో పది అధ్యాయాలున్నాయి. సిసిలీ కథానాయిక. 18 ఏళ్ళ అందగత్తె. నవలంతా ఆమెకు ‘యోగ్యుడైన’ వరుడిని వెతికి పెళ్ళిచేయడమే. ఆమె తల్లి వీరా, స్నేహితురాలు ఓల్గా, ఆ అమ్మాయి తల్లి, సిసిలీకి పనికొచ్చే మొగుణ్ణి వెతకడమే పనిగా జీవించేవాళ్ళు. ఈ వెతకడంలో నిజాయితీ అంతంతే. తల్లికి, ఆమెను రాజవంశీకుడైన ప్రిన్స్ విక్టర్‌కు ఇచ్చి పెళ్ళి చేయాలని వుంటుంది. కానీ ఓల్గా తల్లి పథకం వేరు. ప్రిన్స్‌కి తన కూతుర్నిచ్చి చెయ్యాలని ఆమె ఉద్దేశం. కనక, సిసిలీని మరొకడికి అంటగట్టడానికి పథకం రచిస్తుంది. అతను కూడ ధనవంతుడని వీళ్ళని నమ్మిస్తుంది. ఆ దిమిత్రీ నిజానికి దుర్మార్గుడు. ఆశాపరుడు. స్త్రీలపట్ల గౌరవం లేనివాడు. డబ్బుమనిషి. జూదరి (దిమిత్రీలొ చాలావరకు కరొలీనా భర్తే ఉన్నాడని పాఠకులకు సుళువుగానే అర్థమైంది). సిసిలీ కొద్దో గొప్పో ఆస్తికి వారసురాలని తెలిసి, ఆమెను పెళ్ళాడ్డానికి సిద్ధమౌతాడు. ఆమె మీద ‘అకుంఠిత ప్రేమ’ను ప్రకటిస్తాడు. అక్కడినుంచి ప్రేమ, పెళ్ళి అనేవి ఆ కాలం నాటి రష్యన్ సమాజంలో ఎంత కుటిలత్వాన్ని సంతరించుకున్నాయో, సంపన్న వర్గాల్లో సంబంధాలు ఏర్పరచుకోవడంలో కుట్రలు, కుతంత్రాలు ఎలా పనిచేస్తాయో కొన్ని పగళ్ళు, రాత్రుళ్ళ చిత్రణ ద్వారా చెబుతుంది రచయిత్రి. ఈ పగలు, రాత్రి విభజనలోనే, ఆ రెండు పూటల్లో కథానాయిక సిసిలీలో చెలరేగే సంఘర్షణలోనే నవలలోని ప్రత్యేకత దాగివుంది.

ప్రతి పగలూ ఒకలాగే మొదలవుతుంది. పార్టీలు, తినడం, తాగడం, ఒకరిపై ఒకరు గుసగుసలుపోవడం, సంబంధాలు ఏర్పరచుకోవడం, సంబంధాలు తెంపడం, తెంచుకోవడం, కవిత్వంపై చర్చలు. అలాగే సిసిలీ ఇంటికి వచ్చీపోయే పెళ్ళిళ్ళ పేరయ్యలు… అంతా కృత్రిమమైన బాహ్యజీవితం. అదే రాత్రి సిసిలీ ఒంటరిగా తన గదిలో ఉన్నప్పుడు ఆమె మానసిక జీవితం ఆరంభమవుతుంది. ఉదయం నుంచి చూసిందీ, విన్నదీ అంతా మటుమాయమై, ఆమె ఆంతరంగిక జీవితం తలుపు తెరుచుకుంటుంది. అంటే, ఆమె అసలు జీవితం మొదలవుతుంది. ఆమె మనసులోని భావాలు, ఆమె ఉద్వేగాలు, ఆమె ఆకాంక్షలు అన్నీ పురివిప్పుతాయి. అవి ఆమె సామాజిక జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. బయటకు చెప్పుకోలేనివీ; గట్టిగా తనకు తాను కూడ ప్రకటించుకోలేనివీ. అవన్నీ అంతరంగతరంగాలై ఆమెను ముంచెత్తుతాయి. మనిషి జీవితంలోని బాహ్యాంతర పార్శ్వాలను పగలు, రేయితో ప్రతీకాత్మకంగా చిత్రించడం ఈ నవల ప్రత్యేకత.

దీనితోపాటే ఒక అసాధారణమైన రచనాశిల్పాన్ని ప్రదర్శించింది రచయిత్రి. పగలు జరిగేదంతా శుద్ధవచనంలో, పదునైన శైలిలో ఉంటుంది. రచయిత్రికి ఆనాటి వివాహవ్యవస్థ, సమాజంలో స్త్రీపురుషుల అసమాన స్థితిగతుల పట్ల ఉన్న ఆగ్రహం, అవహేళన ఈ భాగంలో స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి సిసిలీ ఒంటరిగా గదిలో మథనపడుతున్నప్పుడు రచనంతా కవితారూపంలో ఉంటుంది. ఏకకాలంలో, వచనాన్ని, కవనాన్నీ సమానంగా వాడిన అరుదైన రచనాశిల్పం ఈ నవలలో ఉంది. పగలు జరిగేది వాచ్యం; కృత్రిమం; వ్యాఖ్యానాత్మకం, బాహ్యం. రాత్రి జరిగేది ఆత్మాశ్రయం; ఉద్వేగభరితం, భావాత్మకం, ఆంతరంగికం. ఒకరకంగా దేనికి వచనం వాడాలో, దేనికి కవిత్వం వాడాలో చెప్పే మెటాఫిక్షన్ స్వరూపం ఈ నవలలో కనిపిస్తుంది. బహుశా ప్రపంచసాహిత్యం లోని ఏ నవలలోనూ సగభాగం వచనంలో, సగభాగం కవిత్వంలో ఉన్న నవల వచ్చివుండదు. ఈ రకమైన రచనాశిల్పాన్ని అప్పటి విమర్శకులు, పాఠకులు కూడ ఆదరించారు; మెచ్చుకున్నారు. ఫ్రాయిడ్ అచేతన, ఉపచేతనావస్థల సిద్ధాంతం ఇంకా పుట్టకముందే ఈ రకమైన పాత్రతో అంతఃకల్లోలచిత్రణ ద్వారా ఆ స్ఫూర్తిని కలిగించింది కరొలీనా.

ఉదయం పూట జరిగే చర్చల్లో ముఖ్యమైంది ఆడవాళ్ళు కవిత్వం రాయవచ్చా అన్నది. (ఇందులో రచయిత్రి స్వీయానుభవం స్పష్టం.) దాన్ని అధిక్షేపధోరణిలో గొప్పగా రాసింది కరొలీనా. ఉదాహరణకు ఒక సన్నివేశంలో రచయిత్రి వ్యాఖ్య: In Cecily’s world, women are not expected to be more than a fancy piece of decoration. In one scene, a man gets alarmed when a woman speaks, ‘not having expected the unseemly retort from this living piece of furniture.’ Our protagonist has been trained to think that a woman with a gift is a cursed woman: She knew that there were even women poets, but this was always presented to her as the most pitiable, abnormal condition, as a disastrous and dangerous illness. స్త్రీలు కవిత్వం రాయాలనుకోవడం ఏదో వినాశకరమైన జబ్బుకు సూచిక! ఇంట్లో ఫర్నిచర్‌గా మాత్రమే చూడబడే స్త్రీలు కూడా ప్రత్యుత్తరం ఇవ్వడమేంటని అతను ఆందోళన చెందాడట! ఇలాంటి వాక్యాలెన్నో కరొలీనా తన కాలంనాటి పురుషుల ఆలోచనావిధానాన్ని అవహేళన చేస్తూ నవల్లో జోడించింది.

దీనికి విరుద్ధంగా ఉంటుంది సిసిలీ రాత్రి కలల్లోనూ, భ్రమల్లోనూ తనతో తను జరిపే సంభాషణ. That prisoner of society’s world/ That sacrifice to vanity/ The blind slave of custom/ That small-souled being isn’t you. స్త్రీలు ఇలా బందీలుగా, గుడ్డిబానిసలుగా, ఆత్మలేని వాళ్ళుగా ఉండకూడదని తనకు తాను నచ్చచెప్పుకుంటుంది. దిమిత్రీతో తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని గట్టిగా అనుకుంటుంది. కానీ అవన్నీ అనుకోవడం వరకే. ఆచరణలో అంత ధైర్యం ఆమెకు లేదు. స్త్రీ బాహ్యజీవితానికి, ఆంతరజీవితానికీ ఏ పొంతనా ఉండదని, ఆమె ఆంతరజీవితలేశం బయటకు పొక్కినా సమాజం తట్టుకోలేదనీ ఈ నవలలో ధ్వనింపజేస్తుంది రచయిత్రి. నవలలో చివరి కవితలో సిసిలీ తన విధిని తప్పించుకోలేకపోయినా, తన లోలోపల ఒక కొత్త దర్శనం ఊపిరిపోసుకుందని అంటుంది. ప్రస్తుతానికి అది కేవలం తన విధిని భరించడానికే పనికిరావచ్చు; బహుశా తర్వాతి దశలో దానిపై తిరగబడవచ్చు కూడా.

నవలా శీర్షికే ధ్వనిపూరితం. ఎ డబుల్ లైఫ్. ఈ డబుల్‌లు పరస్పర వ్యతిరేక భావనలు; స్త్రీ/పురుషుడు, పగలు/రేయి, స్వేచ్ఛ/ఆంక్ష, చేతన/అచేతన, నిజం/అబద్ధం. పగలంతా ఒక అబద్ధంలో, ఆంక్షల మధ్య, పురుషాధిపత్య చేతనావస్థని అనుభవిస్తుంది సిసిలీ. రాత్రి అచేతనలో ఒక స్త్రీగా తన స్వేచ్ఛాకాంక్షను, తను నమ్మే నిజాన్ని అనుభూతి చెందుతుంది. ఇలా ఈ నవలను ఎన్నో పొరలనుంచి దర్శించవచ్చు; వ్యాఖ్యానించవచ్చు.

ఈ నవలా నాయిక సిసిలీ నిజానికి కవి కాదు. కానీ రాత్రి నిద్రిస్తున్నపుడు కలలో కనిపించే తను మంచి కవి; అలవోకగా కవితలు చెప్పేస్తూంటుంది. రష్యన్ సమాజంలో కవయిత్రుల పరిస్థితిని అద్భుతంగా వ్యాఖ్యానించిన చిత్రణ అది. కలలో మాత్రమే కవులుగా ప్రకటించుకోవాలి స్త్రీలు. వాస్తవ జీవితంలో సొంతకవిత్వం రాస్తే కరొలీనా లాగే విమర్శలకు గురౌతారు. కానీ కరొలీనా దేనికి పనికివచ్చింది పురుషులకు అంటే వాళ్ళ కవితలను జర్మన్ లోకి, ఫ్రెంచి లోకి అనువదించడానికి. అనువాదకురాలిగా ఆమెకు కీర్తిని ఆమోదించడానికి ఆ పురుషపుంగవులు సిద్ధమే. అవి తమ కవితలు కనక. కానీ స్వతంత్రకవిగా ఆమెను గుర్తించడానికి వారికి మనసొప్పదు. నవలలో వివిధపాత్రల మధ్య జరిగే చర్చల్లో కూడ పురుషులు అంగీకరించిందే కవిత్వం; స్త్రీలకు రంగం కవిత్వం కాదన్న తీర్మానాలు వెలువడుతూంటాయి. అందుకే సిసిలీ రాత్రిపూట నిద్రలో మాత్రమే కవయిత్రిరూపం దాలుస్తుంది.

కథానాయిక మానసిక సంఘర్షణ, ఆమె ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడం తప్ప చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, 19వ శతాబ్ది రష్యన్ సమాజంలో స్త్రీల ప్రతిపత్తికి అద్దం పట్టే నవల ఇది. కొంతవరకూ ఇది కరొలీనా ఆత్మకథాత్మకమే అయినా, ఎక్కువమంది స్త్రీల జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కథానాయిక సిసిలీ జీవితం ప్రేమాస్పదుడైన వ్యక్తిని అన్వేషిస్తూ వసంతరుతువుతో ప్రారంభమై, ఆకులు రాలేకాలంలో ఏ రకంగానూ ఆమె ప్రేమకు అర్హుడు కాని దిమిత్రీతో వివాహంతో ముగుస్తుంది. అప్పటి యువతుల జీవితాలకు ఇంతకంటే మంచి ప్రతీక దొరకదు.

అందుకే ఆమె ఈ నవలని సమాజంలో ఉన్న ఎందరో సిసిలీలకు అంకితమిచ్చింది. You Cecily’s unmet by me/ All of you Psyches without wings/ Mute sisters of my soul! అంటూ తన అంకితాన్ని ప్రకటించింది.

తన యావత్తు జీవితంలో ఆమెను అర్థం చేసుకుని, గౌరవించి, ఆమె రచనలను, వ్యక్తిత్వాన్ని ఆదరించిన ఒకే ఒక వ్యక్తి అలెక్సీ కాన్‌స్టాంటినోవిచ్ తోల్‌స్తోయ్. (కవిగా, నాటకరచయితగా సుప్రసిద్ధుడైన ఇతను లియో తోల్‌స్తోయ్‌కి కజిన్.) అతనొక్కడే ఆమెతో జీవితాంతం స్నేహం కొనసాగించాడు. అతని రచనలను ఆమె జర్మన్ లోకి అనువదించడంతో అతని కీర్తి ప్రతిష్టలు ఐరోపాకి వ్యాపించాయి. అతను ఆమెకు రష్యన్ ప్రభుత్వం నుంచి పింఛను అందే ఏర్పాటు చేసి, ఆమె రుణం తీర్చుకున్నాడు. 1875లో అతను మరణించేవరకూ అతని స్నేహమే కరొలీనాకు ఊరట కలిగించేది.

ఇంతకు ముందే చెప్పినట్టు, ఆమె మరణించినందుకు రష్యాలో ఎవరూ కన్నీళ్ళు పెట్టలేదు. కనీసం ఒక కవయిత్రి, నవలారచయిత్రి మరణించిందన్న సంతాపం ప్రకటించలేదు. 20వ శతాబ్దిలో క్రమంగా ఆమెకు ప్రాణప్రతిష్ట జరిగింది. ఆమె సమకాలికులు గౌరవించని ఆమె కవిత్వాన్ని సింబలిస్ట్ కవులు గుర్తించారు. ఆమె కవితల్లోని గేయాత్మకతను కొనియాడారు. 19వ శతాబ్ది రష్యన్ కవుల్లో తొలివరసలో నిలుచునే పురుషకవుల సరసన ఆమెను కూడ చేర్చారు. ఆమె రాసిన ఏకైక నవలకు భిన్నమైన, లోతైన భాష్యాలు చెప్పారు. అమెరికన్ రచయిత్రి బార్బరా హెల్ట్ (Barbara Heldt) 1978లో ఈ నవలను ఇంగ్లీషులోకి అనువదించాక, ఆమె రచనల అధ్యయనం రష్యా పరిధిని దాటింది. కాని, ఇప్పటికీ 19వ శతాబ్దినాటి రష్యన్ సాహిత్యంలో కరొలీనాకు దక్కాల్సినంత స్థానం దక్కలేదనే భావించాల్సివుంటుంది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...