ఉదయానే ఓ రంగుల పిట్ట

ఎంతబాగుంది
ఎవరినీ పట్టించుకోని ఈ
సంతోషపు పిట్ట

ఉన్నట్టుండి
గోడమీంచి వూగని వూయల పైకి
దాని మీంచి వూగే చిటారు కొమ్మపైకి ఎగిరింది
పిడికెడంత బరువుకే
కిందాకా తూగిన కొమ్మచివరన
చిన్ని పిట్ట పైకీ కిందకీ సంతోషాన తేలింది
తననెవరు చూస్తున్నా లెక్కలేకుండా
తోక ఈకలను పైకెత్తి
కూసి కూసి ఎగిరింది

ఎన్ని భావాలకు రంగులను అద్దితేనో కదా
ఒక మెత్తటి ఈకవుతుంది
ఎన్ని రంగుల ఈకలను పొదువుకుంటేనో కదా
ఇలాటి ఒక పిట్టవుతుంది

నేను వచ్చి ఇక్కడ కూచుందే
అందుకు కదా
అటుగా ఎగిరి వెళ్ళే
ఇలాటి రంగు రెక్కల ముద్దుపిట్టొకటి
వాలి పలకరిస్తుందనే కదా

ఇలాటి రంగులపిట్టల
కువకువలెన్నో జతపడితే కదా
ఒక కవిత చేరి వాలుతుంది
నేనిక్కడికి వచ్చి కూచుందే అందుకు కదా

రంగుల ఈకలను పొదువుకుని
లోలోపలగా ఎగిరే చిన్ని వూహల పిట్టలు
గుండె చిటారు కొమ్మన వాలి కిందాకా వూగి
పైకెగిరి పలకరిస్తాయనే కదా!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...