మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం


సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి
గార్లపాటి పల్లవి, 2017.

జీవిత చరిత్రలకైనా, స్వీయ చరిత్రలకైనా ఆకర్షణ ఎప్పుడూ ఉంటుంది. లోకంలో నిజంగానే జీవించిన మనుషులూ, వారితో సంబంధమున్న వాస్తవిక సంఘటనలూ ఈ రచనలకు విలువను ఆపాదిస్తాయి. కాల్పనిక సాహిత్యంలో మాదిరి సొగసైన ఊహలకూ, నాటకీయ ఘట్టాల చిత్రణకూ వీటిలో ఆస్కారం ఉండదు. సరిగ్గా ఈ పరిమితే వీటికి విశ్వసనీయతను పెంచుతుంది. అయితే అందరికీ ఆమోదయోగ్యంగా, సర్వసమ్మతంగా ఉండేలా రాసే జీవిత చరిత్ర/ స్వీయ చరిత్రలు దాదాపు ఉండకపోవచ్చు.

భారతీయ సంగీతానికి మారు పేరుగా పేరు తెచ్చుకున్న అపురూప గాయని, ఎమ్‌.ఎస్.గా ప్రపంచానికి చిరపరిచతమైన మదురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. సుప్రభాతమై మేల్కొలిపినా, భక్తి భావనను ఆర్తిగా నివేదించినా ఆమె గానం అనుపమానం. ఆ స్వర పరిమళం జాతుల, మతాల, భాషల ఎల్లలు దాటి విశ్వవ్యాప్తమయింది.

నూటొక్క సంవత్సరాల క్రితం పుట్టి, పదమూడేళ్ళ కిందటి వరకూ మనమధ్యే ఉన్న ఎమ్‌.ఎస్. సుబ్బులక్ష్మి పాటలు అజరామరం. అవి విని పరవశించి, ఆమెను ఆరాధించే, అభిమానించే ఎందరికో ఆ గానం వెనక ఆమె చేసిన కృషి గురించి అంతగా తెలియదు. అంతే కాదు; ఆమె అభివృద్ధికి పునాది వేసిన తల్లి గురించీ, ఆమె నేపథ్యం గురించీ తెలియదు. పదేళ్ళ వయసులోనే గ్రామఫోన్ రికార్డు కెక్కిన అరుదైన ఘనత ఆమెకెలా సాధ్యమైందో తెలియదు. ఆమె స్వభావం, అలవాట్లు, ఆకాంక్షలు, జీవిత పర్యంతం సంకెళ్ళై వెంటాడిన ఆంక్షలూ… వీటి గురించి సవివరంగా తెలియదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, పాటే బతుకైన ఆమె వ్యక్తిగతం గురించి తెలిసినవాళ్ళు తక్కువమంది. సంగీతం జీవితంలో లేకపోయినా, పిల్లల్ని కని పెంచుకుంటే చాలనుకున్న వ్యక్తి సుబ్బులక్ష్మి. కానీ ఆమె కనకపోయినా నలుగురు పిల్లలకు తల్లి అవటంతో పాటు జీవితంతో పెనవేసుకుపోయిన సంగీత కళలో అత్యున్నత స్థాయిని సాధించటం ఒక వైచిత్రి!

వీటినీ, ఇంకా మరెన్నో విశేషాలనూ తెలుపుతూ సుబ్బులక్ష్మి జీవిత గాథను అక్షరబద్ధం చేసిన పుస్తకం, సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి మే నెల్లో మార్కెట్లో విడుదలైంది. రచయిత్రి గార్లపాటి పల్లవి. 536 పేజీలున్న ఈ పుస్తకం వెల 300 రూపాయిలు. గతంలో ఈమె మహానటి సావిత్రి: వెండితెర సామ్రాజ్ఞిని రచించారు.

సుబ్బులక్ష్మి జీవితం గురించి టి.జె.ఎస్. జార్జి అనే జర్నలిస్టు, రచయిత 2004లో ఎమ్.ఎస్. – ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనే పుస్తకం రాశారు. ఆమె సజీవంగా ఉన్నపుడే ఈ పుస్తకం విడుదలైంది. అప్పటిదాకా సుబ్బులక్ష్మి గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను జార్జి ఆ పుస్తకం ద్వారా బయటపెట్టారు. ఆ పుస్తకానికి ఇది అనువాదం కాదు.

నవలా రూపం

సుబ్బులక్ష్మి జీవిత చరిత్రే అయినా దీన్ని ‘వాస్తవాధారిత నవల’గా పుస్తకంలో పేర్కొన్నారు. విషయాన్ని నిస్సారంగా కాకుండా నవల్లో అయితే కథాత్మకంగా, సంభాషణలతో, మనోభావాల వివరణతో ఆసక్తిగా చెప్పే వీలుంటుంది. అందుకే సేకరించిన విస్తృత సమాచారాన్ని పఠనీయంగా చేయటానికి రచయిత్రి నవలారూపాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతుంది. శ్రీశ్రీ కూడా తన ఆత్మకథను (అనంతం) ‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’గానే రాశారు కదా!

సందర్భోచితమైన ఛాయాచిత్రాలను అభిరుచితో అమర్చి ఈ నవలను ఆకర్షణీయంగా రూపుదిద్దారు. ముఖ్యంగా సుబ్బులక్ష్మి, ఆమె సన్నిహితుల ఫొటోలను ఇచ్చి, దాదాపు అవే భంగిమల్లో కొంత కాలం తర్వాత తీసినవి కూడా వాటి పక్కనే ప్రచురించటం ఎంతో బాగుంది. కాలం తెచ్చిన మార్పులు వీటిలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి.

ఆరు సంవత్సరాల కుంజమ్మ (సుబ్బులక్ష్మి) తన తల్లి షణ్ముగవడివుతో, అన్న శక్తివేల్, చెల్లి వడివాంబలతో, బంధుగణంతో మధుర మీనాక్షి దేవాలయ సందర్శనకు వెళ్ళే ఘట్టంతో మొదలవుతుందీ నవల. కథాకాలం నాటి రాజకీయ పరిస్థితులను, పరిణామాలనూ ప్రస్తావిస్తూ రచన సాగుతుంది. పాఠకులకు కథావాతావరణం పరిచయమై దానికి అలవాటు పడ్డాక పఠనం వేగం పుంజుకుంటుంది. కళాకారిణిగా సుబ్బులక్ష్మి ఎదుగుదల ఎలా సాగిందో ఆ క్రమం సులువుగా అవగతమవుతుంది. ఆసక్తికరమైన కథనం విడవకుండా చదివిస్తుంది.

పంజరంలో చిలక

తల్లి చాటు బిడ్డగా ఎదిగిన కుంజమ్మ ఎవరో ఒక పోషకుడి నీడలో బతకాల్సిన దేవదాసీ ఆచారాన్ని ధిక్కరించింది. జీవితంలో క్లిష్టమైన దశలో ఒంటరిగా ఇంటినుంచి బయటపడే సాహసం చేయగలిగింది. మనస్సాక్షికి విలువనిచ్చి తన జీవితంలో మలుపును స్వయంగా ఆహ్వానించింది. ఆ రకంగా ‘కల్కి’ త్యాగరాయ సదాశివం ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఆపై ఆమె జీవిత గమనాన్ని ఆయనే నిర్దేశించాడు.

చలన చిత్రకళ తొలి అడుగులు వేసే రోజుల్లో ఆమెను సినిమాల్లోకి ప్రవేశపెట్టాడు సదాశివం. శకుంతలగా, మీరాగా వెండితెరకెక్కిందామె. సుబ్బులక్ష్మి నటించిన మీరా సినిమా హిందీ వెర్షన్‌లో భారత కోకిల సరోజినీనాయుడు కనిపిస్తుంది. ‘ఈ సినిమాలో రెండు గంటల పాటు సుబ్బులక్ష్మి పాటలు వింటే సాక్షాత్తూ మీరానే వచ్చి పాటలు పాడినట్లు ఉంది.’ అని ఆమె ప్రశంసించింది. తర్వాత సినిమాల నుంచి విరమించి, సంగీతంపైనే పూర్తి దృష్టిపెట్టటానికి రాజాజీ సూచన కారణం.

శకుంతల సినిమా చిత్రీకరణ సందర్భంగా నాయక పాత్రధారి, సంగీత కళాకారుడూ అయిన జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యంపై సుబ్బులక్ష్మి మనసుపడింది. ఈ సందర్భంగా నాలుగు కోణాల ప్రేమకథ గురించి- ‘పార్వతి (సదాశివం భార్య) భర్త ప్రేమ కోసం ఆరాటపడుతుంది. ఆ భర్త సుబ్బలక్ష్మి ప్రేమ కోసం వెంపర్లాడుతున్నాడు. సుబ్బలక్ష్మి తన హీరో ప్రేమ కోసమై పరితపిస్తుంది. ఈ మనసుల ఊసులు ఇలా ఉన్నప్పటికీ చిత్రీకరణ సాఫీగా సాగిపోతోంది’- అంటారు రచయిత్రి.

సదాశివాన్ని చేసుకోనని, ఆయన పెత్తనం భరించలేనని అనుకున్న సుబ్బులక్ష్మికి చివరకు అతణ్ణే పెళ్ళి చేసుకోక తప్పలేదు. సుబ్బులక్ష్మి గాయనిగా తారాపథానికి చేరటంలోనూ; జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎదురులేని విజయాలు సాధించటంలోనూ భర్త సదాశివానిదే ప్రధాన పాత్ర.

ఎంతో పేరు తెచ్చుకున్నాక అన్న ఆధ్వర్యంలో సంగీతంలో తొలి గురువైన తల్లి సమక్షంలో జన్మస్థలమైన మదురైలో ఆమె కచేరీ చేసింది. ఆ సన్నివేశ వర్ణన పాఠకుల మనసులకు హత్తుకుంటుంది.

సుబ్బులక్ష్మి కీర్తి ప్రతిష్ఠలు ఒక పార్శ్వమైతే వ్యక్తిగత జీవితంలో భర్త మితిమీరిన అదుపాజ్ఞలు ఆమెకు కలిగించిన తీరని వేదన మరో పార్శ్వం. ఈ రెండిటికీ ఈ నవల అద్దం పడుతుంది. చనిపోయిన తల్లిని చివరిసారి చూడటానికి కూడా భర్త సమ్మతించలేదు. ఆమె దేవదాసీ నేపథ్యం లోకానికి వెల్లడవుతుందేమోననే భయం దీనికి కారణం. ఎట్టకేలకు గురువు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ శతవిధాలా నచ్చచెప్పాక ఆ అనుమతి దొరికింది. బాగా చీకటి పడ్డాక బయల్దేరి వెళ్ళి తల్లిని కడసారి చూడగలిగింది. అన్న కన్ను మూసినపుడు కూడా ఇదే పరిస్థితి. అతడి మృతదేహాన్ని చూడటానికి ఆమెకసలు వీలే కాలేదు. ఇలాంటి దుర్భరమైన కట్టడుల మధ్య పంజరంలో చిలకలా ఉంటున్న ఆమెకు సంగీతమే సర్వస్వమైంది.

ఈ సందర్భంలో ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన సెల్వి కథను గుర్తు చేస్తారు రచయిత్రి. సుబ్బులక్ష్మి పరిస్థితిపై ఆ కథను రాశారాయన. సెల్వి, మోహన పాత్రలు సుబ్బులక్ష్మి, సదాశివంలే. ఆ కథలో తల్లి చనిపోతే సెల్వి కచేరీలన్నీ వదిలేసి తల్లి పక్కకు చేరుకుంటుంది. ఇక తిరిగి రాదు. మోహన్ వచ్చి బతిమిలాడినా తిరస్కరించి, వెనక్కి రాదు. కథలో సుబ్బులక్ష్మికి విముక్తి లభించింది కాని, వాస్తవంలో అలా జరగలేదు. ఆమె బంగారు పంజరంలోనే సర్దుకుపోయింది. ఆ పరిమితుల్లోనే తన కళలో ఉత్కృష్టతను సాధించటం విశేషం. అయితే, భర్త సహకారం, ప్రోత్సాహం లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు.

తమ కళలో ఎన్ని శిఖరాలు అధిరోహించినవారైనా సాటివారి పట్ల కరుణ, సాయపడే గుణం లోపిస్తే వారి ప్రతిభ తావి లేని పూవే అవుతుంది. తాను జీవిత పర్యంతం చేసిన కచేరీలకు టికెట్ల రూపంలో వచ్చిన ఆదాయాన్ని సుబ్బులక్ష్మి వితరణకూ, సామాజిక కార్యక్రమాలకూ వెచ్చించింది.

సాధన! సాధన!

పాడిన పాట, స్తోత్రం, కీర్తన- అదేదైనా, ఏ భాషలో ఉన్నా అర్థం, ఉచ్చారణ తెలుసుకుని భావం మనసులోకి అనువదించుకుని, సంపూర్ణంగా సంలీనమై పాడే అంకితభావం సుబ్బులక్ష్మిది. ప్రేక్షకులపై, వారి చప్పట్లపై ధ్యాస పెట్టటం కాకుండా, తాదాత్మ్యంతో పాడటం వల్ల ఆ గానం అజరామరమయింది. దాదాపు మరే గాయకులకూ సాధ్యం కానంత పేరు ప్రతిష్ఠలు పొందినా అవేమీ పట్టని నిరాడంబర స్వభావం ఆమెది. సుబ్బులక్ష్మిలోని ఈ స్వభావాన్ని మూర్తిమత్వం చేసి పాఠకుల మనో నేత్రాలకు చూపించే ప్రయత్నం చేశారు రచయిత్రి.

తన తెలుగుపాటల్లో ఉచ్చారణ దోషాలున్నాయని బెంగుళూరు నాగరత్నమ్మ చేత మాట అనిపించుకున్న సుబ్బులక్ష్మి తగిన కృషి చేసి త్వరలోనే ఆ లోపం సవరించుకుంది. ఐదేళ్ళ తర్వాత అదే వ్యక్తి చేత ప్రశంసలు పొందింది. వేంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం రికార్డు చేయటానికి ముందు వాటిని సాధికారికంగా గానం చేయటానికి సుబ్బులక్ష్మి చేసిన కృషి, సాధన అబ్బురపరుస్తాయి. సాధనలో పావు వంతే కచేరీలో వస్తుందంటే ఆ సాధన ఏ స్థాయిలో ఉంటుందో గ్రహించవచ్చు.

ఎంతో పేరు వచ్చినా 66 సంవత్సరాల వయసులోనూ నాలుగు గంటల కచేరీ ఇవ్వటానికి మూడు గంటలపాటు సాధన చేయటం ఆమె అంకితభావానికి నిదర్శనం. కచేరీ చేసే ప్రతిసారీ ఎలా చేస్తానో అని ఆందోళనపడటం, ఆపై అత్యద్భుతంగా కచేరీ కొనసాగించటం ఆమెకు అలవాటయిన విషయం. 72 ఏళ్ళ వయసులో నిత్యవిద్యార్థిలా 72 మేళకర్త రాగమాలికను నేర్చుకుని, రికార్డు చేసింది. నిద్ర, తిండి లాంటి కనీస అవసరాలకు లేవటం తప్ప రోజంతా సాధన చేసిన రోజులు ఎన్నో సుబ్బులక్ష్మికి. సాధన, అంకిత భావంతో చేసే సంగీత సాధన, భక్తితో చేసే సంగీత సాధన.

ఆకట్టుకునే ఘట్టాలు

పదేళ్ళ వయసులో పాడిన మొదటి గ్రామఫోను రికార్డును (తమిళ భక్తి పాట- మరకత వడివం…) దాదాపు అరవై ఏళ్ళ తర్వాత ఓ అభిమాని సేకరించి ఆమెకు బహూకరించిన సంఘటన; నలబై సంవత్సరాల తర్వాత శకుంతల, మీరా సినిమాల దర్శకుడు డంగన్ ఆమెరికా నుంచి భారత్‌కు వస్తే వారిని సుబ్బులక్ష్మి దంపతులు కలుసుకోవటం; ఆమె గొంతుపై కత్తి పెట్టాల్సి వస్తుందని టాన్సిల్స్ ఆపరేషన్ చేయటానికి వైద్యుడు నిరాకరించటం; సంగీత విద్వాంసుడు చెంబై వైద్యనాథ్ భాగవతార్ సుబ్బులక్ష్మిని సత్కరిస్తూ ఆమె మెడలో దండ వేయటానికి తటపటాయిస్తూ సృష్టించిన సరదా ప్రహసనం… ఇలాంటి సంఘటనలు నవలలో ఆకట్టుకుంటాయి.

1966 అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితిలో ప్రతిష్ఠాత్మక కచేరీ చేయటానికి ముందు న్యూయార్క్‌లో విడిదిలో ఉన్నపుడు సుబ్బులక్ష్మికి గొంతు నుంచి మాట రాని పరిస్థితి ఏర్పడింది. అయినా కచేరీలో పాడే సమయానికి గొంతు మామూలుగానే వచ్చేసింది. నమ్మశక్యం గాని ఈ సంఘటన గురించి చదివితే కల్పన కంటే సత్యమే వింతగా ఉంటుందనే వ్యాఖ్య గుర్తొస్తుంది.

ఇరవయ్యో శతాబ్దం తొలి భాగంలో ఆవిష్కృతమైన సాంకేతిక సాధనాలు సుబ్బులక్ష్మికి, ఆమె పాటలకూ ఎలా ప్రాచుర్యం కలగజేశాయో తెలుపుతూ చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ పుస్తకంలో సుబ్బులక్ష్మి తర్వాత పాఠకులను ఆకర్షించే మరో వ్యక్తి, ఆమె కూతురు రాధ. మీరా సినిమాలో చిన్ననాటి మీరాగా అభినయించిన రాధ సంగీతం నేర్చుకుని, దశాబ్దాల పాటు తల్లికి గాత్ర సహకారం అందించింది. పక్క గాయనిగా కాకుండా ఒంటరిగా ఎదగగలిగిన విద్వత్తు ఉండి కూడా తండ్రి మాటకు కట్టుబడి అమ్మకు తోడై నిలిచింది. వేదికపై సుబ్బులక్ష్మి పక్కన రాధ లేకపోతే ‘చంద్రుడు లేని ఆకాశాన్ని చూస్తున్నట్టు’ ఉందని శ్రోతలు వ్యాఖ్యానించేవారట.

పుస్తకం చివరికొచ్చేసరికి వార్ధక్యంలో మంచమ్మీద అపస్మారక స్థితిలో సుబ్బులక్ష్మి అమ్మానాన్నలను, అన్ననూ కలవరించిన సందర్భం వర్ణిస్తూ రచయిత మనలని హఠాత్తుగా 88 ఏళ్ళ వెనక్కి తీసుకువెళతారు. తల్లి కడుపులో ఉన్న ఘట్టం, జననం, నామకరణం, చీకూ చింతా లేని బాల్యం, సంగీతం… వీటి ఫ్లాష్‌బ్యాక్‌తో అనుసంధానం చేసి, మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కలవరింతల్లోకి తీసుకు వచ్చిన పతాక సన్నివేశం పాఠకులను కదిలిస్తుంది.

ఏడు సంవత్సరాల కృషి

ఈ పుస్తకం రాయటానికి రచయిత్రి పల్లవి ఏడు సంవత్సరాల కాలం వెచ్చించారట. కేవలం సమాచార సేకరణకు ఇంతకాలం పట్టలేదు. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలన్నీ ఆకళించుకుని, ఆమెతో మానసికంగా చెలిమి చేసి… ఆపైన మాత్రమే రాయటం మొదలుపెట్టానంటారు రచయిత్రి. సజీవంగా లేని వ్యక్తి జీవిత గాథను పునర్నిర్మించటం అంత సులువైన పని కాదు. ‘ఈ ఏడేళ్ళూ సుబ్బులక్ష్మి 88 సంవత్సరాల జీవితంలోని ప్రతి పుటనీ స్పర్శించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. కొన్ని పుటలు సమాచార గనులైతే చాలా పుటలు తెల్ల కాగితాలే’ అంటారు రచయిత్రి తన ముందుమాటలో. సుబ్బులక్ష్మి చుట్టూ ఆమె భర్త సదాశివం నిర్మించిన కోట దీనికి కారణమంటారామె.

ఆ కోట, ఆ కోటరీ ఇప్పటికీ అభేద్యమైనవే. ఆ కోటరీ ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా నేను తెలుసుకున్న సుబ్బలక్ష్మికే ఈ పుస్తకంలో పెద్ద పీట వేశాను’ అని రచయిత్రి పాఠకులకు వాగ్దానం చేశారు. అందుకనుగుణంగానే సుబ్బులక్ష్మి జీవితంలో అంతర్లీనంగా ఒక వెలితి ఈ రచన చదివిన పాఠకులకు ద్యోతకమవుతుంది. సుబ్బులక్ష్మి మౌనం వెనక, గాంభీర్యం వెనక, ఒక మంద్ర విషాద స్వరం పాఠకులకు అనుభూతికొస్తుంది. అయినప్పటికీ ‘సుబ్బలక్ష్మి మూడొంతుల జీవితం సదాశివం నిర్మించిన కోటలోనే గడిచింది గాన, నా మాటలు ఆ కోటని దాటలేకపోయాయి’ అంటూ ఈ లోపాన్ని సహృదయంతో స్వీకరించమని మనవి చేస్తారు రచయిత్రి.

‘ఆ మహాగాయని కంఠంలోని సప్త స్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖ వర్ఛస్సుపై తీర్చిదిద్దింది’ అంటూ డా. వరప్రసాద్ రెడ్డి రచయిత్రి కృషిని మెచ్చుకున్నారు. ‘సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం’ అని దీన్ని ప్రశంసించారు రచయిత ముదిగొండ శివప్రసాద్. దీన్ని ఇతర భాషల్లోకి కూడా అనువదించాలని ఆయన ఆకాంక్షించారు.

సమాజం చిన్నచూపు చూసే నేపథ్యం నుంచి వచ్చి, అదే సమాజం తనను అపర సరస్వతిగా, సుస్వర లక్ష్మిగా గౌరవించే స్థాయికి చేరగలగటం కళాకారిణిగా ఆమె సాధించిన ఘన విజయం. సుబ్బులక్ష్మి ప్రతిభావిశేషాలూ విజయాలతో పాటు ఆమె అంతరంగ సంఘర్షణకూ సర్దుబాటు ధోరణికీ అద్దం పట్టటానికి రచయిత్రి ప్రయత్నించారు.

కొన్ని మెరుపు వాక్యాలు

తారస్థాయి ప్రత్యేకత: పాట అందుకుందంటే ఇక ఎవరితోనూ సంబంధం పెట్టుకోదు. పక్క వాద్య కళాకారుని చూసి నవ్వటం, వాళ్ళని సరిచేయాలనుకోవటం అలాంటివేమీ చేయదు. ఆమెకు జన్మతః సిద్ధించిన వరం వల్ల ఎంతటి క్లిష్టమైన రాగాన్ని పాడుతున్నా మొహం భయపెట్టే సంకోచ వ్యాకోచాలు చూపదు. ఎంత పై స్థాయికి వెళ్ళినా ఆమె ముఖ కవళికలు అంతే చూడబుద్ధవుతాయి.

భావమే ప్రధానం: ఒకే రాగంలో ఉన్న రెండు త్యాగరాజ కృతులు సుబ్బలక్ష్మి పాడితే ఆ రెండు పాటలు ఒకే రాగం అంటే నమ్మశక్యంగా ఉండదు. ఆ పాటల్లో భావమే సుస్పష్టంగా అర్థమయ్యి పాట వ్యాకరణాలు వెనక్కు వెళతాయి. పాట భావానికి పెద్దపీట వేసి, తన పలుకుని భావానికి అనుగుణంగా మార్చుకున్న తొలి గాయకురాలు సుబ్బలక్ష్మి.

నిలువెత్తు సంయమనం: సుఖదుఃఖాలను, ఎత్తుపల్లాలను, కలిమిలేములను, పొగడ్తలను, విమర్శలను ఒకేలా ఎంచి, పాటల పూదోటలో తపస్సు చేసి, ఆ తపో ఫలాలని తనకంటే ఎక్కువగా ఎదుటివారికి పంచి ఇచ్చిన తపస్విని.

సర్వస్వమూ సంగీతమే: సంగీతంలో శ్రమించి, సంగీతంలోనే సేదతీరి, సంగీతమే తలపు, వలపై, ప్రయాణమూ సంగీతమై, ఆ సంగీతమే పరమావధియై సిద్ధి పొందిన సాధ్విలాగా ఆమె తనువు తేజరిల్లుతుంది.