తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం?

మన భాషను తెలుగు, తెనుగు, ఆంధ్రము అంటూ ప్రాచీన కాలం నుంచి వివిధ చోట్ల ప్రస్తావించడం మనకు సుపరిచితమే. తెలుగు, తెనుగు, ఆంధ్రము వీటిల్లో ఏది ప్రాచీనమయినది? మొట్టమొదట మన భాషను ఏ పేరుతో వ్యవహరించేవారు? మిగిలిన రెండు పేర్లు వ్యవహారంలోకి ఎందుకువచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఈ పదాలకున్న అర్థాలు ఏమిటి? దీనిపై నాటి సంప్రదాయ కవులు, వ్యాకర్తలు నుంచి ఆధునిక కాలపు చరిత్రకారులు, భాషవేత్తలు వెలువరించిన అభిప్రాయలను సంక్షిప్తంగా సరళంగా పరిచయం చేయడమే ఈ వ్యాసపు ముఖ్యోద్ధేశ్యం.

ఆంధ్రము

తెలుగు, తెనుగు, ఆంధ్రము అన్న మూడు పదాలు నేడు సమానార్థకాలుగా ఉపయోగిస్తున్నా, సంస్కృత వాఙ్మయంలో ఆంధ్రము అన్న శబ్దమే అత్యంత ప్రాచీనమైనది. తమకు చిక్కిన శత్రువులకు అంధత్వం శిక్షగా వేస్తారు కాబట్టి ఆంధ్రులన్నారని, అంద, అంధక అన్న ప్రాకృత శబ్ద సంస్కృతీకరణే ఆంధ్ర అని కొందరు అభిప్రాయపడుతున్నారు కాని ఈ ఊహలను బలపరిచే ఆధారాలు ఏవీ లేవు. ఆంధ్ర శబ్దం మొట్టమొదటగా క్రీ.పూ. 600 ప్రాంతం నాటి ఐతరేయ బ్రాహ్మణంలో జాతివాచకంగా కనిపిస్తుంది. విశ్వామిత్రుడు వెలివేసిన తన అవిధేయులైన పుత్రులే ఆంధ్రులు అని అందులో చెప్పబడింది.

ఏతేఽన్ధ్రాః పుండ్రాః శబరాః పులిందా మూతిబా ఇతి
ఉదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనాం భూయిష్ఠాః
(ఐతరేయ బ్రాహ్మణ 7.18.2)

పై వాక్యానికి కొందరు మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. పైన పేర్కొనబడిన జాతులతో విశ్వామిత్రుని కుమారులు కలిసిపోయారన్నది ఆ వ్యాఖ్య సారాంశం. అలా అయితే ఆంధ్రులు క్రీ.పూ. 600 మునుపే ఒక జాతిగా ఉనికిలో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఆంధ్రులు మాట్లాడే భాషను ఆంధ్రము అన్నారు. ఇలా ఆంధ్రము అన్నది జాతిపరంగా సిద్ధించిన గౌణనామధేయము.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతులు, భాషలు, ప్రాంతాలను చూస్తే వాటి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఓ భాష మాట్లాడటం వలన ఆ భాష మీద ఆ జాతికి పేరు ఏర్పడిందా? లేక ఆ జాతీయులు మాట్లాడే భాష గనుక ఆ జాతి పేరుతో ఆ భాషనూ పిలిచారా? ఓ ప్రాంతంలో ఓ జాతి నివసిస్తున్నందువల్ల ఆ ప్రాంతం పేరు మీదగా ఆ జాతిని పిలుస్తున్నరా? జాతివల్లే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందా? వీటికి సమాధానం దొరకడం కష్టం. కాని వాటి మధ్య పరస్పర సంబంధం మాత్రం ఉంటుంది.

తెలుగు/తెనుగు, ఆంధ్రము రెండూ చాలా భిన్నమైనవి. నేటి వ్యవహారం ప్రకారం జాతీయత ఆంధ్రము, భాష తెలుగు. తెలుగుజాతి మనది అని వాడటం ఇటీవల కాలం నాటిది. నా దృష్టిలో, మనకుగల ఈ వైరుద్ధ్యానికి కారణం నేటి తెలుగు మాట్లాడే వారంతా ఏకజాతీయులు కాకపోవడం. అనాది కాలంగా అనేక జాతులు ఈ ప్రాంతంలో ఈ భాషలో మమేకమై పోయారు. ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న జాతులే కాక పురాణాల ప్రకారం నాగులు, యక్షులు, అశ్మక మహిషకులు మొదలైన జాతులు కలసిపోయిన వారిలో ఉన్నారు. అలాంటి వారిలో ఆంధ్రులు ఒకరు. వారు సాధించిన రాజకీయ ఆధిపత్యం వల్ల ఆనాడు తెలుగుని ఆంధ్రము అని పిలిచి వుండవచ్చు. వారికి ఉన్న ఘనచరిత్రకి వారసులం అని చెప్పుకోవడం నేటి తెలుగువారు ఆంధ్రజాతీయతను అంగీకరించి వుండవచ్చు. కాని నేడు ఎవరు ఆంధ్రులు, ఎవరు తెలుగువారు, ఎవరు నాగులు, యక్షులని చెప్పలేము. శతాబ్దాల తరబడి ఒకే ప్రాంతంలో కలసి వున్నందున, యుగయుగాలుగా భిన్న ఆర్థిక రాజకీయ కారణాల వల్ల జరిగే సామాజిక పరివర్తన ఫలితంగా జాతిసాంకర్యంలో వాటి ఆనవాళ్ళు కొట్టుకుని పోయాయి. ఆంధ్రాది జాతులు వారి మాతృభాషను విడిచి తెలుగుభాషలో కలిసిపోయారు అంటే స్థూలంగా: 1. మిగిలిన జాతులకంటే తెలుగు మాట్లాడే జాతి సంఖ్య చాలా హెచ్చుగా ఉండేదని, 2. తెలుగువారు ఆ భాషను మొట్టమొదట నుంచి మాట్లాడుతున్న జాతి బహుశా, ఆంధ్రజాతి కంటే ప్రాచీనమైనదని, అనుకోవచ్చును. అందువల్లనే నేటికి కూడా శిష్టవ్యవహారములో మనజాతికి భాషకు ఆంధ్ర, ఆంధ్రము అని వ్యవహరిస్తూ వున్నా ఎక్కువమంది ప్రజలు ఆంధ్రమని వ్యవహరించడం లేదు.

తెలుగు – తెనుగు

ఆంధ్ర శబ్దం జాతివాచకంగా భాషావాచకంగా మనకు అర్వాచీనంగా సిద్ధిస్తే అంతకు ముందు మన భాషకు తెలుగు అనిగాని తెనుగు అనిగాని వ్యవహారంలో ఉండాలి. ఈ రెండు శబ్దాలలో ఏది ప్రాచీనమైన శబ్దమో తెలిస్తే మన భాషకు ఆది నుంచి వ్యవహారములో వున్న పేరేమిటో మనం తెలుసుకోవచ్చు. కాని ఈ శబ్దాల ప్రాచీనత మీద, వ్యుత్పత్తి మీద చాలా సందేహాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తెలుగు ప్రాచీనమన్నారు. మరికొందరు తెనుగు ప్రాచీనమని, తొలి తెలుగు సాహిత్యములో తెనుగన్న శబ్దమే కనిపిస్తుందని, తరువాత వచ్చిన సాహిత్యములో మాత్రమే తెలుగన్న శబ్దము కనిపిస్తుందని వాదించారు. వీరి వాదనలను పరిశోధనలను క్రోడీకరించి తెలుగు, తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనమో తెలుగుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం.

ముందుగా తెనుగు అన్న శబ్దాన్ని విచారిద్దాం.

తెనుగు

తొలి తెలుగు సాహిత్య గ్రంథాలలో తెనుగే ఎక్కువగా కనిపిస్తుంది. తొలి తెలుగు కావ్యం అని చెప్తున్న నన్నయ (క్రీ.శ 11వ శతాబ్ది) ఆంధ్రమహాభారతంలో తెనుగుభాష అనే అన్నాడు.

“దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్” (ఆదిపర్వం – 16)

“నానారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా…” (ఆదిపర్వం – 26)

తెలుగులో ఇప్పటి వరకు లభించిన గ్రంథాలలో ఇదే అతిప్రాచీనమైనది. ఇదే గ్రంథములో నన్నయ ఆదికవిగా తనను తాను ప్రకటించుకున్నాడు. దానితో చాలా మంది నేడూ ఏకీభవిస్తున్నారు. నన్నయ భారతం తరువాత మనకు లభిస్తున్న ప్రాచీన తెలుగు గ్రంథము నన్నెచోడుని కుమార సంభవము. ఈ గ్రంథములో కూడా తెలుగు భాషను తెనుగనే వ్యవహరించారు. నన్నెచోడుడు 12వ శతాబ్దికి చెందినవాడని చెప్తారు.

“దేశికవితఁ బుట్టించి తెనుంగున నిలిపి”
“సరళముగాగ భావములు జానుఁ దెనుంగున నింపు పెంపుతోఁ”
(కుమారసంభవము – పీఠిక)

నన్నయ, నన్నెచోడుడు ఆదికవులుగా మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. వీరిద్దరూ ఎక్కడా తెలుగు, తెలుంగు అన్నపదాలు వాడలేదు కేవలం తెనుగు శబ్దాన్ని మాత్రమే భాషాపరంగా ప్రయోగించారు. ఇంచుమించు నన్నెచోడుడికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణములో కూడా తెనుగు శబ్దప్రయోగాన్ని చేశాడు.

“సరసమైన పరగిన జానుఁదెనుంగు” (బసవ. పు. ఏపు-4)

13వ శతాబ్ధికి చెందిన తిక్కన కూడా తన భారత అవతారికలో తెలుగుభాషను తెనుగనే సంభోదించాడు.

“బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబు లై పెంపునం దుదిముట్టన్‌” (విరాట్ పర్వం – 7)

“తెనుఁగుబాస వినిర్మింపఁదివురుటరయ” (విరాటపర్వం – 18)

కాని, పాల్కురికి సోమనాథుడు, తిక్కన తెనుగుతో పాటు తెలుగు శబ్దాన్ని కూడా వాడారు. అక్కడక్కడ తరువాతి కాలంలో కూడ కొందరు తెనుగు శబ్దాన్ని ప్రయోగించినా, తెలుగన్న పదమే మనభాషకు చివరకు స్థిరపడిపోయింది. ఇలా సాహిత్యపరంగా చూసి కొందరు తెనుగే ప్రాచీనం, తెనుగు నుంచి తెలుగు రూపాంతరం చెందింది అని భావిస్తారు.

న-ల అబేధాలు

తెలుగు – తెనుగు వేరు వేరు అర్థాలు కలిగివున్న పదాలు కావు, ఒకే ధాతుజాలు. ఒకదాని నుంచి మరొకటి రూపాంతరం చెందింది. తెలుగు – తెనుగులో తేడా, ల – న స్థానాలలో ఉన్న మార్పు మాత్రమే. తెలుగులో ల-కార, న-కారాలు దంతమూలియాలు. అందుచేత అవి పరస్పరం మారడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మార్పు మూలద్రావిడ భాషలో కూడా జరిగేదని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి నిరూపించారు.

  • లకారం నకారంగా మారిన కొన్ని పదాలు:

    లచ్చి – నచ్చి
    లంజ – నంజ
    లెగు – నెగు
    లాంగలి – నాగలి
    లేదు – నేదు
    లావు – నావు

  • నకారం నుంచి లకారంగా మారిన పదాలలో కొన్ని:

    మునగ – ములగ
    తెనగవాళ్ళు – తెలగవాళ్ళు
    చెనగు – చెలగు
    సెనగలు – సెలగలు
    మునుగు – ములుగు
    జన్మం – జలమం

కాబట్టి తెలుగు, తెనుగు శబ్దాల పరస్పర మార్పిడి వినియోగపరంగా చాలా ప్రసిద్ధికెక్కిన వర్ణపరిణామం. ఇవి ఒకదాని నుంచి ఒకటి రూపాంతరము పొందిన పదాలే తప్ప భిన్న ధాతుజాలు కావు. ఏ శబ్దం యే శబ్దంగా రూపాంతరము చెందిదో తెలిస్తే ఏది ప్రాచీన పదమో తేలిపోతుంది. ఒక పదం యెక్క ప్రాచీనతను, ప్రాచీన రూపాన్ని కనుక్కోవడంలో నేడు తులనాత్మక భాషాశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతోంది. పరిశీలించవలసిన పదాన్ని అదే భాషకుటుంబానికి చెందిన జ్ఞాతిపదాలను (cognates) తీసుకుని తుల్యం చేయడం ద్వారా ఏ రూపం నుంచి ఏ రూపానికి ఆ పదం వచ్చింది, వాటి మూలరూప పదం ఏమిటి అని నిర్థారిస్తారు. ఈ విధమైన తులనాత్మక పరిశీలనలో పదాల, భాషల ప్రాచీనతల నిర్థారణే కాకుండా మూలభాషా స్వరూపాన్ని కూడా పునర్నిర్మించగలుతాము. ఇలా తులనాత్మక అధ్యయనం ద్వారా ఫలితం రాబట్టాలంటే తెలుగు/తెనుగు అన్న శబ్దానికి అర్థమేమిటో తెలియాలి. తద్వారా అదే అర్థాన్ని కలిగివున్న సోదరపదాలను (cognates) తీసుకుని మూలరూప నిర్ణయం చేయవచ్చు.

తెలుగు శబ్దానికి ప్రాచీన కాలం నుంచి నేటివరకు చాలా మంది పండితులు వ్యుత్పత్తి చెప్పడానికి ప్రత్నించారు. ఆ వ్యుత్పత్తులు స్థూలంగా మూడు రకాలు: తెలుగు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన సంస్కృత శబ్దమని కొందరు, అచ్చతెలుగైన ద్రావిడ పదమని కొందరు, ముండా భాషలనుంచి వచ్చిందని మరికొందరు ప్రతిపాదించారు.

త్రిలింగమే తెలుగు

ఇది తెలుగునాట చాలా ప్రసిద్ధి చెందిన వాదము. త్రిలింగము అనే సంస్కృత శబ్దం నుంచి తెలుగు పుట్టిందని, తెలుగునేలలో ఆబాలగోపాలము సైతం నమ్ముతున్న వ్యుత్పత్తి. ఆంధ్రదేశంలోని శ్రీశైలం, దాక్షారామం, కాలేశ్వరం అనే మూడు ప్రాచీన శైవక్షేత్రాలలోని శివలింగాలను త్రిలింగాలంటారు. ఈ మూడు పవిత్రలింగాల మధ్యప్రదేశమే త్రిలింగ దేశమని, ఆ దేశీయుల వ్యవహారిక భాషే త్రిలింగ భాషని, దాని వైకృతే తెలుంగు/తెలుగు అని ఈ వాద సారాంశము. ఈ వాదన చాలా ప్రాచీనమైనది. ఆంధ్ర దేశానికి చెందిన ప్రాచీన తెలుగు సంస్కృత కావ్యాలలో ఈ వ్యుత్పత్తి కనిపిస్తుంది.

అ) ప్రతాపరుద్రీయమ్ – విద్యానాథుడు

13వ శతాబ్దికి చెందిన విద్యానాథుడు తన ప్రతాపరుద్రీయమ్ సంస్కృత కావ్యనాటకములో మొట్టమొదటగా ఆంధ్రదేశాన్ని త్రిలింగదేశమని పేర్కొనడమే గాక అప్పటి దాని అధినేత అయిన ప్రతాపరుద్రుని ‘త్రిలింగ పరమేశ్వర’ అని సంబోధించాడు.

“యైర్దేశ స్త్రిభిరేషయాతిమహతీం ఖ్యాతింత్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాసశైలాః కృతాః”


“తేదేవాః ప్రసరత్ప్రసాదమధురా శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్వచ్ఛ్రేయసేజాగ్రతు”

– (ప్రతాపరుద్రీయమ్ – నాటకప్రకరణమ్ 5-22)

స్వామీ! త్రిలింగపరమేశ్వరా! ఎవరిచే, ఈదేశమునకు త్రిలింగమను పేరు వడసి మిక్కిలి ఖ్యాతిని చెందెనో, కాకతీయరాజుల కీర్తి వైభవముచే ఎవ్వరి (తెల్లని) కైలాసశైలము చేయబడినో, వ్యాపించిన యనుగ్రహముచే కమనీయులగు శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వర నివాసులైన ఆ దేవతలు నీ శ్రీయస్సు విషయమై ఎల్లప్పుడును జాగరూకులై యుండుదురు గాక!

ఆ) కావ్యాలంకార చూడామణి – విన్నకోట పెద్దన

15వ శతాబ్దికి చెందిన విన్నకోట పెద్దన (క్రీ.శ 1410 ప్రాంతం) తన కావ్యాలంకార చూడామణిలో

“ధర శ్రీపర్వత కాళేశ్వర దాక్షారామ సంజ్ఞవఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశంబరుదారఁ ద్రిలింగ దేశ మనఁ జనుఁ గృతులన్”
(9 -5)

“తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగుదేశ మఁనఁగ దేటపడియే
వెనుఁకఁ దెనుఁగు దేశమును నండ్రు కొంద ఱ
బ్బాసపంచగతులఁ బరఁగుచుండు”
(9-6)

ఇ) అప్పకవీయము – కాకునూరి అప్పకవి

క్రీ.శ. 1650 నాటి తన అప్పకవీయంలో ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశంగా వ్యవహరిస్తారని కాకునూరి అప్పకవి కూడా పేర్కొన్నారు.

“శ్రీక్షితిధర కాళేశ్వర
దాక్షారామంబులనఁగఁదన రారెడునీ
త్రిక్షేత్రంబులు లింగము
లీక్షింపఁ ద్రిలింగ సంఙ్ఞ నెన్నిక కెక్కున్”
(అప్పకవీయం -1- 99)

“తత్త్రిలింగ నివాసయై తనరు కతన
నాంధ్ర దేశంబుదాఁ ద్రిలింగాఖ్యమయ్యేఁ
దెలుఁగగుచుఁదద్భవము దాని వలనఁ బొడిమె
వెనుకఁ గొందఱు దానినే తెనుఁగు నండ్రు”
(అ. క 1-100)

పై ప్రాచీన గ్రంథాల ఆధారంతో తెలుగు సంస్కృత పదమైన త్రిలింగ నుంచి పుట్టినట్లు కనిపిస్తోంది. కాని దీనిని ఆధునిక భాషావేత్తలు ఒప్పుకోలేదు. తెలుగు అన్న పదం సంస్కృతం నుంచి పుట్టిన పదం కాదని, ఇది దేశ్యపదమే అని వారు వాదించారు. ఇలా తెలుగు త్రిలింగం భవము కాదు దేశ్యమని నిర్థారించడానికి ప్రయత్నించన వారిలో కొమర్రాజు లక్ష్మణరావు ముఖ్యుడు.

తెలుగు దేశ్యము, తెలుగే త్రిలింగము – కొమర్రాజు లక్ష్మణరావు వాదము

కొమర్రాజు లక్ష్మణరావు (18-5-1877 నుంచి 13-7-1923) తన లక్ష్మణరాయ వ్యాసావళిలో తెలుగు శబ్దం చాలా ప్రాచీనమైనదని దానినుంచి పండితులు కృత్రిమంగా త్రిలింగ శబ్దం సృష్టించడం జరిగిందని ఇలా నామాలను సంస్కృతీకరించడం తెలుగుకు మాత్రమే పరిమితం కాదని పేర్కొన్నారు. ఇది వాస్తవము. తెలుగునేలపై ఔత్తరాహికుల ఆగమనంతో ఏర్పడిన మత, రాజకీయ కారణాలవల్ల సంస్కృత, ప్రాకృత ప్రాముఖ్యత పెరిగింది. ఔత్తరాహికుల ఆర్యీకరణలో భాగంగా స్థానిక భాషలలో ఉన్న పేర్లను సంస్కృతీకరించడం మనం నాటి గ్రంథాలలో, శాసనాలలో చూడవచ్చు. ఈ నామాల సంస్కృతీకరణ రెండు విధాలుగా జరిగినట్లు మనకు తెలుస్తోంది: ఒకటి అర్థసారూప్యతతో జరిగినవి: ఉదా. చేబ్రోలును (చే అనగ రాగి; చెంబు అనగా రాగితో చేసిన పాత్ర) తామ్రపూరిగా, ఓరుగల్లుని (ఒరు = ఒక; కల్లు = రాయి) ఏకశిలానగరముగా, నల్లమలను (నల్ల అంటే మంచి శ్రీకరము; మల అంటే కొండ) శ్రీశైలముగా, కణ్ణబెణ్ణా (నల్లని, పెన్నా అంటే నది) కృష్ణవేణినదిగా మార్చడం. రెండవది, శబ్దసారుప్యంతో జరిగినవి: బెజవాడను విజయవాడగా, కర్నాడును (కరి = నల్లని, నాడు = దేశం; నల్లనినేలలు కలిగిన ప్రదేశం) కర్ణాటకగా సంస్కృతీకరించటం జరిగింది.

ఆంధ్రం–తెలుగు విషయములో జరిగినట్లే గ్రంథాలలోనూ, శిష్టవ్యవహారములో మినహా సాధారణ జనవ్యవహారములో వీటి వ్యాప్తి తక్కువగా ఉన్నందువల్ల నేటికి కొన్ని పేర్లు స్థానిక భాషయైన తెలుగులో మనుగడ సాధించగలిగాయి. కొన్ని పుణ్యక్షేత్రాల విషయంలో మాత్రం సంస్కృతీకరణ సామాన్య జనవ్యవహారంలో నిలిచింది. కొమర్రాజు గారు ఈ విషయాన్నే ఆధారంగా చేసుకుని త్రిలింగ శబ్దవ్యుత్పత్తి దాని చరిత్రను శోధించి. త్రిలింగ శబ్దము ప్రాచీనము కాదని ఈ వ్యుత్పత్తి కాకతీయుల కాలం నుంచి మాత్రమే వ్యవహారంలోకి వచ్చిందని, ప్రతాపరుద్రీయమ్ సంస్కృత నాటకకర్త అయిన విద్యానాథుడే మొట్ట మొదట ఈ ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని తన కావ్యనాటకంలో పేర్కొన్నాడని, అంతకు ముందు ఈ శబ్దము వ్యవహారములో లేదని పేర్కొన్నాడు. ఈ విషయమై కొమర్రాజు గారు తన వ్యాసావళిలో మరింతగా వివరించేందుకు ప్రయత్నించారు. కొమర్రాజు గారి మాటల్లో:

పొరుగు రాజ్యమైన కరినాడు (నల్లని భూములున్నదేశము) శబ్దాన్ని సంస్కృత పండితులు ‘కర్ణాటకమని’ ప్రౌఢనామాన్ని ఎలాగైతే నూతనముగా కల్పించారో అలాగే ఈ తెలుగునాడు లోని బెజవాడను, విజయవాడని, కమ్మంమెట్టుకు స్తంభపుర అని సంస్కృతీకరించడం మనకు తెలిసినదే. అలాగే ఈ త్రిలింగ శబ్దము. పదకొండో శతాబ్దమున అంటే నన్నయభట్టు కాలమున ఈ శబ్దము వాడుకలో లేదు. అందుకు ‘తెలుగు’ మహాభారతమే సాక్షి. అందులో ‘ఆంధ్ర, తెనుగు, తెలుగు, వేఁగినాడు’ అను పదములే ఉపయోగించబడినవి కాని ‘త్రిలింగ’ పదము దేశవాచకముగా కాని భాషా వాచకముగా కాని వాడబడలేదు. తిక్కన కాలమునకూడా ఆ త్రిలింగ శబ్దము వ్యవహారములో ఉన్నట్లు కనిపించదు. తిక్కన సమకాలికులైన కేతానాదులు కూడా ‘త్రిలింగ’ శబ్దాన్ని ఉపయోగించలేదు. ఈ శబ్దము కేవలము కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన పండితుడైన విద్యానాథ మహాకవి యెక్క బుద్ధివైభవమే ఈనూతన శబ్దనిర్మాణానికి హేతువని నా తాత్పర్యము. ఈ విద్యానాథుడు పదునాలుగో శతాబ్దివాడు. ఆ కాలమున ‘త్రిలింగ’ శబ్దమును నిర్మించడానికి ఒక కారణము కలదు. ఓరుగల్లు రాజధానిగాకల కాకతీయ సామ్రాజ్యము ఈ మూడు లింగముల మధ్యప్రాంతములో వ్యాపించి ఉండేది. అంటే రాజ్యానికి మూడువైపుల సరిహద్దు ప్రాంతాలలో ఈ మూడు శివక్షేత్రాలు వుండటంచేతనే విద్యానాథుడు ఆ రాజ్యాన్ని త్రిలింగ దేశమని, దాని ప్రభువైన ప్రతాపరుద్రమహారాజును త్రిలింగ పరమేశ్వరుడని సంబోధించాడు.

ఇది నిస్సంశయముగా కాకతీయ సామ్రాజ్యా విస్తరణను, సరిహద్దులను ఉద్దేశించబడినదే కాని మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశాన్ని ఈ మూడు లింగాల మధ్యప్రదేశానికే పరిమితం చేస్తే, ఉత్తరాంధ్ర, గోదావరిజిల్లాలలో కొంతభాగం, మధ్యతీరాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలో చాలా భూభాగాలు ఈ త్రిలింగ క్షేత్రాల వెలుపలే ఉంటాయి. ‘త్రిలింగ’ము నుంచి ‘తెలుగు’ పుట్టినమాటే వాస్తవమైతే ఒకానొక కాలమున ఈదేశానికి ‘త్రిలింగ’మని వాడుక పేరు వుండాలి. మహారాష్త్ర ష్ట్రా దేశపు భాష మాహారాష్ట్రీ, మగధదేశపు భాష మగధి. అట్లే త్రిలింగభాష ఎక్కడైనా చెప్పబడివుందా? విద్యానాథునికి పూర్వం ఏ గ్రంథాలలోనూ త్రిలింగశబ్దం కనిపించదు. కొన్ని పురాణాలలో త్రిలింగ శబ్దము దేశపరంగా వ్రాయబడినది. కాని పురాణ రచనాకాలము కచ్చితంగా తెలియనందు వల్ల, కొన్ని పురాణాలు పురాతనమైనవని తెలిసినా అందులో నూతనముగా ప్రక్షిప్తశ్లోకములు అనేకము కలుపబడినందువల్ల ‘త్రిలింగ’ సంబంధమైన చర్చకు పురాణముల బట్టి నిర్ణయించడానికి వీలులేదు.తదితర గ్రంథముల బట్టి మాత్రమే నిర్ణయించాలి.

కొమర్రాజుతో మొదలైన ఈ వాదనను తరువాత కాలంలో చాలా మంది భాషావేత్తలు, చరిత్రకారులు మరిన్ని సాక్షాధారాలతో త్రిలింగ శబ్దానికి అంత ప్రాచీనత లేదని ధ్రువపరిచారు.

త్రిలింగ శబ్ద ప్రాచీనత

కొమర్రాజు లక్ష్మణరావు వాదనతో తెలుగు త్రిలింగ శబ్దమన్న శైవయుగపు వాదాన్ని గండికొట్టడంతో చాలా మంది చరిత్రకారులు, భాషావేత్తలు త్రిలింగ శబ్దప్రాచీనత మీద మరింత శోధించారు.

  1. గ్రీకు జాతీయుడైన పి. టోలమి (క్రీశ. 130) భారతదేశములో ట్రిలింగాన్ అనే దేశమున్నట్లు విన్నానని తన రచనలో పేర్కొన్నాడు.
  2. ఆంధ్రవిష్ణువు ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలాలను కలుపుతూ ఓ ప్రాకారము కట్టి త్రిలింగ దేశాన్ని స్థాపించినట్లు ఆంధ్రకౌముదిలో వివరించబడి వున్నది.
  3. అథర్వణాచార్యులు త్రిలింగ శబ్దాను శాసనము అనే వ్యాకరణాన్ని రచించాడు.
  4. 10వ శతాబ్దానికి చెందిన రాజశేఖరుని విద్ధసాల భంజిక నాటకములో ‘జయతు జయతు త్రిలింగాధిపోదేవః’ అని ప్రయోగించాడు.
  5. సింగనాయకుని అక్కలపూడి శాసనము (1318) లో ‘త్రిలింగ దేశాధిపతిః శ్రీమాన్’ అని వుంది.

పై పరిశోధన ఫలితాలు కూడా త్రిలింగానికి మరీ ప్రాచీనతను తెచ్చి పెట్టలేకపోయాయి. గ్రీకు దేశీయుడైన టొలామి పేర్కొన ట్రిలింగాన్, ట్రిలిప్తాన్ ప్రాంతాలు ఆంధ్రదేశానికి సంబంధించినవని చెప్పడానికి ఆధారాలు లేవు. ఆ ట్రిలింగాన్ ప్రాంతం గంగానది ఒడ్డున ఉందని టోలామి పేర్కొన్నాడు. పైగా టోలామీ రచనలలో ఆంధ్రదేశ ప్రస్తావన కూడా ఉంది. ట్రిలింగాన్ ఆంధ్ర ప్రాంతమే అయితే ఆ విషయాన్ని పేర్కొనుండేవాడు. పై రెండు కారణాల వల్ల ట్రిలింగాన్‌కు త్రిలింగ శబ్దానికి సంబంధం లేదని చెప్పవచ్చు.

శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువుకు సంబంధించిన జానపద కథలు చాలా ప్రాచీనమైనవి. అతను ఆంధ్రజాతికి చెందిన ఓ వీరుడు. శాతవాహనులకంటే ప్రాచీనుడు. <ఎం>ఆంధ్రకౌముది, బ్రహ్మాండపురాణం, స్కంద పురాణాలలో ఇతనిని మహావిష్ణువు అవతారంగా ప్రచారం చేయడం జరిగింది. అంతకు ముందున్న పురాణాలు, ఇతర సంస్కృత కావ్యాలు ఆంధ్రులను అనార్యులుగా పేర్కొన్నాయి.ఆంధ్రుల అనార్యత్వాన్ని పోగొట్టడానికి విష్ణువు ఆంధ్రజాతిలో జన్మించి వారికి ఆర్యత్వాన్ని ప్రసాదించినట్లు చెప్పబడే ఈ కథలో శంభుడనే రాక్షసునితో పోరాడి, శ్రీశైలం ద్రాక్షారామం, కాళేశ్వరాలను మహేంద్రగిరితో కలిపి ఈ వీరుడు ఒక ప్రాకారాన్ని నిర్మించాడని ఆ కావ్యాలలో కనిపిస్తుంది.

ఆంధ్రనాధో మహావిష్ణు ర్నిశంభుదనుజాపహా
పురాస్వాయంభువమనోః కాలేకలియు గేవారః
అభసంవత్సర్వదేవైశ్చ వేష్టితో లోకపూజితః
(ఆంధ్రకౌముది)

కర్ణాటాశ్చైవత్రైలింగ గూర్జరరాష్ట్ర వాసినః
ద్రావిడాద్రావిడాఃపంచ నింధ్యదక్షిణ వాసినః
(స్కాంద పురాణము వాచస్పత్యము)

జయతిప్రసిద్ధంలోకే సర్వలక్షణలక్షితం
శబ్ధలింగశబ్ధనా మధర్వణకవేఃకృతిః
కరోమిశబ్ధంశబ్దంశబ్దానాం త్రిలింగానాంనలక్షణం
బార్హ స్పత్యానిమాత్రాణి కాణ్వంవ్యాకరణం విదన్
(అధర్వణాచార్యకృత త్రిలింగశబ్ధానుశాసనం.)

ఈ సంస్కృత గ్రంథాలు అంత ప్రాచీనమైనవి కావు. ఇవన్నీ 11వ శతాబ్ది కాలానివి అని చాలా మంది పండితులు అభిప్రాయ పడుతున్నారు. (ఆంధ్రుల చరిత్రము – ప్రథమ భాగము (1910) -చిలుకూరి వీరభద్రరావు.) 10 శతాబ్దికి చెందిన రాజశేఖరుడు గుర్జరప్రతిహార దేశపు ఆస్థాన కవి. తన సంస్కృత నాటక కావ్యమైన విద్ధసాల భంజిక లోని త్రిలింగ శబ్దము ఆంధ్రదేశానికి సంబంధించి చేనట్లు ఆధారాలు లేవు. ఈ గుర్జరప్రతిహార రాజ్యము మహారాష్ట్ర – గుజరాత్ సరిహద్దుల్లో ఉండేది. అథర్వణాచార్యుల త్రిలింగ శబ్దాను శాసనమ్ మనకు లభించడంలేదు. వీరు ఈ గ్రంథాన్ని వ్రాసినట్లు తరువాత కాలం నాటి వ్యాకర్తలు పేర్కొన్నారు.

అథర్వణాచారులు నన్నయకు సమకాలికుడని, ఈయన కవిత్రయాలకు సమాంతరంగా ఓ భారతాన్ని కూడా రాశాడని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ పద్యాలు నన్నయకు తరువాత కాలంనాటివని తేలింది. ఇక, కుమార సింగనాయకుడు ప్రతాపరుద్రమహారాజు సేనాని. త్రిలింగ శబ్దము విద్యానాథునికంటే ముందే వాడబడినా మరీ అంత ప్రాచీనమైతే కాదు. దీనికంటే ప్రాచీనమై రచనా కాలం కలిగినవని భావిస్తున్న వాయు, బ్రహ్మాండ పురాణాలలో తెలింగ, తిలింగ పదాల వాడకం కనిపిస్తుంది.

“అర్ద, పశ్చ, తిలింగశ్చ, మగధశ్చ, వృకైస్సహ మధ్యదేశ జనపదాః ప్రాయసోమి ప్రకీర్తితః”
(వాయుపురాణము)

“తిలిమ్‌గ కుంజరి-దరి కచ్చః వాసశ్చ యే జనాః”
(బ్రహ్మండపురాణము)

ఈ తెలింగ తిలింగ శబ్దాలు అంతకు ముందే ఈ ప్రాంతాన్ని, భాషను తెలిపే శబ్దాలుగా ఉన్నట్లు ఈ పురాణాలను బట్టి అర్థమౌతోంది.

ఈ తెలింగ, తిలింగ శబ్దాలు త్రిలింగ శబ్దానికి అర్థసారూప్యతతో ఉన్నటువంటి పదాలు కావు. ఈ శబ్దాలకు వ్యుత్పత్తులను ఊహించడానికి భాషావేత్తలు ప్రయత్నించారు.

తెలింగ – తిలింగ

తెలింగ–తిలింగ శబ్దాలు ఆస్ట్రిక్ భాషలనుంచి వచ్చిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంగ – వంగ, తోసల – కోసల లాంటి జంట పదాలు ప్రాచీన భూవిభాగాలకు ప్రాతినిధ్యం వహించినట్లే కళింగ – తెలింగ కూడా పక్కపక్కనే ఉన్న రెండు భూవిభాగాలని ఈ ప్రతిపాదన చేస్తున్న భాషావేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికి ఆంధ్రదేశంలో, వ్యవసాయం వృత్తిగా చేసుకున్న పాతకులంవారు తెలింగలు లేక తెలగాలని పిలవబడుతున్నారు. ఆపైన, పశ్చిమబర్మాలో తెలంగ్ అనే చిన్నప్రాంతమున్నది. తెలింగలోని సముద్రతీర ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని భావిస్తారు. అంగ, వంగ, కళింగ మాదిరిగానే తెలుంగ్ పదం కూడా ధ్వనిసామ్యాన్ని బట్టి దేశనామంగా పేర్కొనవచ్చు. ఈ పేర్లలో కనిపించే ఙ్గ్-ప్రత్యయం సంస్కృత, ద్రావిడ భాషలలో ఎక్కడా దేశ పర్యాయంగా కనిపించక కేవలం ఆస్ట్రిక్ భాషలలో మాత్రమే ఆవిధంగా కనిపిస్తుంది. ఇప్పటికి సవర ప్రజలు తమ నివాసస్థలాన్ని ఇంగ్ అని వ్యవహరిస్తారు.

ఈ ఆస్ట్రిక్ భాషలలో కళింగ అంటే తీర ప్రజలు, తెలింగ అంటే దేశస్థప్రజలు అనే అర్థమున్నట్లు చెప్తారు. ఇదివరకే చెప్పినట్లు పురాణాల రచన, అందులోని ప్రక్షిప్తశ్లోకాల కాలం నిర్థారించడం కష్టసాధ్యం. ఈ బ్రహ్మాండ, వాయుపురాణలోని ప్రక్షిప్తాలకాలం 8-9 శతాబ్దాల మధ్య అని భావిస్తున్నారు. శాసనాలలో ఈ తెలింగ, తిలింగ పదాలు 10వ శతాబ్ది నుంచి కనిపిస్తున్నాయి. ఈ తెలింగ, తిలింగ పదాలనే తరువాత త్రిలింగగా సంస్కృతీకరించి వుండవచ్చు. ఈ త్రిలింగ భావం విద్యానాథుని కంటే కొంత ముందే ఏర్పడిందన్న భావవ్యాప్తికి మాత్రం విద్యానాథుడి రచనే ఎక్కువగా దోహదం చేసింది. తెలింగ, తిలింగ శబ్దాలను త్రిలింగగా భావవ్యాప్తి కలిగించడానికి కారణం కాకతీయ సామ్రాజ్య సరిహద్దులే కాకుండా ఆనాడు ఆంధ్రదేశములో శైవమత విజృంభన, ఆదరణ కూడా ఒక కారణం కావచ్చు. కృత్రిమము, ఆర్వాచీనము అయిన త్రిలింగ శబ్దం తెలింగ, తిలింగ శబ్దాలకు మాతృక కాదు. త్రిలింగ శబ్దానికి దానికంటే కొన్ని శతాబ్దాలు ప్రాచీనమైన తెలింగ, తిలింగ శబ్దాలే త్రిలింగకు మాతృకలై ఉండవచ్చునని పెక్కుమంది పండితుల అభిప్రాయము. వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నావున్నా, శాసనాధాrAలు, పురాణాల పరిశీలన ద్వారా, తెలింగ, తిలింగ శబ్దాలు త్రిలింగ శబ్దానికంటే ప్రాచీనమైనవనడంలో సందేహం లేదు.

ఈ తెలింగ, తిలింగ శబ్దాలేనా ప్రాచీనమైనవి. దీని నుంచే తెలుగు, త్రిలింగ పదాలు వ్యుత్పత్తి అయ్యాయా? అంటే దీనితోనూ విభేదించేవారున్నారు.

తెలుంగు శబ్దమే తెలింగకు మాతృక

తెలుంగు, తెలుగు, తెనుగు శబ్దాలు ఆస్ట్రిక్ భాషాలనుంచో, సంస్కృత భాషలనుంచో కాక తెలుగుభాష స్వకుంటుంబమైన ద్రావిడభాష నుండే పుట్టినట్లు, ఇది అచ్చతెలుగు దేశ్య శబ్దమని నేడు ఆధునిక భాషావేత్తలు నమ్ముతున్నారు. ఇతర భాషలలో తెలుగు శబ్దానికి సహేతుకమైన వ్యుత్పత్తి లేదు. తెలుంగే, తెలింగగా, త్రిలింగగా, సంస్కృత పండితులు సంస్కరించుకున్నారని, ఈ సంస్కరణ కూడా కళింగ-కు జంటపదం సృష్టించడంలో భాగమై ఉండొచ్చునని అభిప్రాయ పడుతున్నారు. దీనిని కొన్ని ఆధారాలు కూడా ధృవపరుస్తున్నాయి. 5వ శతాబ్దికి చెందిన తమిళ వ్యాకరణ గ్రంథం అగత్తియమ్‌లో కొంగణం, కన్నడం, కొల్లం, తెలుంగం భాషాపరంగా తెలుగును పేర్కొన్నారు. ప్రాచీన తమిళ, కన్నడ శాసనాలలో, వాఙ్మయంలో ఆంధ్రుల ప్రసక్తి వచ్చిన ప్రతిచోట తెలుంగ, తెలుంగు శబ్దాలు మాత్రమే కనిపిస్తాయి తప్ప ఎక్కడా త్రిలింగ, తెలింగ వంటి శబ్దరూపాలు కనిపించవు. ఈ వాఙ్మయ, శాసన ఆధారాలు పురాణ ప్రక్షిప్తాలకంటే ప్రాచీనమైనందున, తెలుగు లేదా తెలుంగు శబ్దమే తెలింగ, తిలింగ, త్రిలింగ కన్నా చాలా ప్రాచీనమైనదని నిర్థారించుకోవచ్చు. తెలుగుకు ద్రావిడ భాషలలో వ్యుత్పత్తి వివరించే ప్రయత్నం కూడా చేశారు కొందరు పండితులు. తెలుగుకు దేశీయవ్యుత్పత్తులు పరిశీలించే ముందు బాగా ప్రచారంలోకి వచ్చిన త్రికళింగ-వాదాన్ని కూడా ఓ సారి చూద్దాం. తెలుగు/తెనుగు శబ్దము కళింగ వలనే ఏర్పడినట్లు ప్రముఖ భాషాశాస్త్రవేత్తలు చిలుకూరి నారాయణరావు, ఆచార్య గంటిజోగి సోమయాగి వంటివారు అభిప్రాయపడ్డారు. దీనిని త్రికళింగ వాదమని అంటారు. త్రికళింగ వాదాన్ని నారాయణరావు సమర్థించారు.

ఆచార్య గంటి జోగిసోమయాజి తెలుఁగు త్రికళింగ శబ్దభవమని ధ్వని పరిమాణం వల్ల కాలక్రమంలో అది త్రికళింగ > త్రిఆలింగ > తెలింగ > తేలింగ > తెలుఁగుగా మారిందని తన ఆంధ్రభాషా వికాసములో (పుట 21-22) అభిప్రాయ పడ్డారు. త్రికళింగము అంటే మూడు కళింగాలని అర్థము. 1. మధు కళింగం, 2. ఉత్కళింగం, 3. కళింగం. ఈ మూడు కళింగాలకు త్రికళింగ అని పేరున్నట్లు శ్రీముఖలింగేశ్వరాలయాది శాసనాలబట్టి తెలుస్తుంది. కాని ఈ వాదన నిలబడలేదు. ఈ శాసనాలన్నీ 12వ శతాబ్దికి చెందినవి.

చివరికి నిలబడినది తెలుగు/ తెనుగు దేశ్యాలని దాని సంస్కృతీకరణే తెలింగ, తిలింగ, త్రిలింగమన్న వాదన.

ఈ తెలుగు/ తెనుగు పదానికి అర్థము ఏమిటి? దీని మీద ఆధునిక భాషావేత్తలు చాలా ప్రయత్నాలు చేసి చాలా ఉత్పత్తులు ప్రతిపాదించారు. కాని అవి ఏవీ నిరూపణకు నిలబడలేదు. ఆ ఉత్పత్తులను కూడా ఓసారి చూద్దాము.

తెనుగుకు కొన్ని ప్రసిద్ధ దేశీవ్యుత్పత్తులు

తేనె + అగు = తెనుగు

తేనె + అగు అనే శబ్దాల కూడికవల్ల తెనుగు పదం ఏర్పడిందని Linguistic Survey Of Indiaలో సర్ జార్జ్ గ్రియర్సస్ అభిప్రాయపడ్డారు. రాబర్ట్ కాల్డ్‌వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తెనుగుభాషకు ఉన్న మాధుర్యం దృష్ట్యా, శబ్దసామ్యం దృష్ట్యా వీరు ఈ విధమైన వ్యుత్పత్తిని కల్పించారే తప్ప దీనికి మరో ఆధారమేదీ లేదు.

తెన్ > తెను > అగు = తెనుగు

ఇది సి.పి బ్రౌన్ తన తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు (పు. 547) ఊహించిన వ్యుత్పత్తి. తెన్ (దక్షణ దిక్కు) అనే పదానికి ఓ అచ్చు చేరి తెను అయిందని, తెనుగు అంటే దక్షిణాది, దక్షిణాదివారు అనే అర్థంలో తెనుగు శబ్దం ప్రయుక్తమై వుండొచ్చునని అభిప్రాయపడ్డారు.

తెనుగు దిగ్వాచి

తెన్ అనే దేశీయ ధాతువుకు దక్షిణదిక్కు అని అర్థం. తెన్ అనే ధాతువుతో ఏర్పడిన పదాలు పెద్దగా తెలుగు వ్యవహారంలో లేకపోయినప్పటికి తక్కిన ద్రావిడ భాషలలో నేటికీ విశేషంగా వ్యవహారంలో ఉన్నాయి. దిక్కులను బట్టి కూడా కొన్ని దేశాలకు, భాషలకు, జాతులకు పేర్లు స్థిపడిన ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. తమిళుల తొల్కాప్పియం (తొలికావ్యము)లో ఆంధ్రులను వడుగర్ అని పిలిచారు. వడుగర్ అంటే ఉత్తరదిక్కునుండు వారు అని అర్థం. ఇలాగే భౌగోళికంగా దక్షిణదేశీయులైన ఈ ప్ర్రాంతంవారిని తెన్ దిగ్వాచకంపై గు-ప్రత్యయం చేర్చి తెన్గు, తెనుగు అనే రూపాలు ఏర్పడాయి. ఇది త్రిలింగ వ్యుత్పత్తి తరువాత అంతటి ప్రసిద్ధికెక్కిన వాదము. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారంతా పేరుకెక్కిన భాషావేత్తలు. మొట్టమొదట దీనిని సి.పి బ్రౌన్ తెర మీదకు తీసుకువచ్చాడు. ఆచార్య గంటి జోగిసామయాజి తన ఆంధ్రభాషా వికాసములో (పు: 33-34) ఈ వాదనను బలపరిచారు. అలాగే ఆచార్య జి.యన్. రెడ్డి తెలుగుభాష చరిత్రలో ఈ వాదనకు వత్తాసు పలికారు.

తెనుగు దిగ్వాచియేనా?

తెనుగు పదాన్నే ఆదికవి నన్నయ ఉపయోగించాడు కాబట్టి ప్రాచీనతలో తెలుగు కంటే తెనుగే ముందుందని భావిస్తూ ఈ వ్యుత్పత్తి తీసుకొచ్చారు కాని ఇందులో చాలా దోషాలు ఉన్నాయి. వ్యాసం చర్చను అంతా ఓసారి మననం చేసుకుంటే మనకు నన్నయకు ముందున్న శాసనాలలో గాని ఇతరభాషా కావ్యాలలోగాని ఎక్కడా తెనుగు అన్నది కనిపించదు అని స్పష్టమవుతుంది. తెనుగు మొట్టమొదట మనకు ఆంధ్రమహాభారత పీఠికలో మాత్రమే కనిపిస్తుంది. దిగ్వాచిగా తెనుగు వ్యుత్పత్తి అంతగా నిలువదు. తెలుగువారు పెక్కు ద్రావిడ భాషావ్యవహార్తులకు ఉత్తర, తూర్పుదిక్కులో ఉన్నారే తప్ప ఏ నాగరిక ద్రావిడ వ్యవహార్తులకు దక్షణ దిశలో లేరు. పర్జీ, కుయీ, గదబ, గొండి, కొలామి వంటి వారికి మాత్రమే నేడు తెలుగు వారు దక్షిణదిక్కులో ఉన్నారు. వీరంతా స్థిరనివాసమున్న నాగరిక తెగలవారు కారు. మొన్న మొన్నటి వరకు వీరంతా సంచారజీవనంలో ఉన్నవారే. సంచారజీవనములో వీరి భౌగోళిక ఎల్లలు మారుతూ ఉండటంచేత వీరికి తెలుగువారు ఒక స్థిరమైన దిక్కులో ఉండే అవకాశము లేదు. పై తెగలలో కొన్ని తెగలు కొంత ప్రాచీనకాలము నుంచి ఒక స్థిరభౌగోళిక ప్రాంతములోనే సంచారము చేస్తున్నవారూ ఉన్నారు. వారికి తెలుగువారు దక్షిణదిక్కున ఉండే అవకాశము కూడా ఉంది. కాని పై తెగలతో పాటు అందరు ద్రావిడ భాషీయులు తెలుంగువారని వ్యవహరిస్తుంటారే తప్ప ఎవ్వరూ కూడా తెనుగు శబ్దోచ్ఛారణతో ఈ నేలను గాని ఈ ప్రజలను గాని వ్యవహరించుటలేదు.

ఇక ఆర్యభాషా కుటుంబీకులైన ఉత్తరదేశవాసులు తెలుగువారిని దిగ్వాచిగా సంబోధిస్తే వారు తమ ఆర్యభాషలలో సంబోధిస్తారు తప్ప ద్రావిడ శబ్దాలను ఉపయోగించరు. అందువల్ల కేవలం ప్రాంతీయోచ్ఛారణల భేదాల వల్ల తెలుంగే తెలుంగు > తెనుంగు > తెనుగు అనే పదాలు ఏర్పడినట్టుగా భావించవచ్చు. నన్నయ కాలంలో తెలుగు, తెనుగు శబ్దాలు రెండూ కూడా వ్యవహారంలో ఉన్న కారణంగా ఆయన తెనుగు పదాన్ని ఉపయోగించడం జరిగింది. తెనుగే ఎందుకు ఉపయోగించారు అన్న ప్రశ్నకు ఊహమాత్రముగా సమాధానం ఇవ్వొచ్చు. ఆ ప్రాంతంలోని జనవ్యవహారములో తెలుగు కంటే తెనుగు అధిక వినియోగంలో ఉండి వుంటుంది. తెలుగులో ల, న శబ్దాలు పరస్పరం మార్పిడి జరగడం ఎక్కువగా మనకు గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే నేటికి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలలో ఇటువంటి భేదం పెద్దగా కనిపించదు. ఆదికవి నన్నయ తెనుగు పదాన్ని సాహిత్యంలోకి చొప్పించి దాని వ్యాప్తికి కారకుడైనాడు. అయినా కూడా వ్యవహార విసృతిలో తెలుగుకే వ్యాప్తి హెచ్చుగా ఉండటం చేత ఓ ప్రాంతీయోచ్ఛరణ మాత్రమే పరిమితమైన ఈ తెనుగు అట్టేకాలం మనుగడలో నిలబడలేకపోయింది.

ఈ తెనుగుకు కొందరు ఆధునిక పండితులు ‘త్రినగ’ నుంచి తెలుగు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. త్రి-నగము అంటే మూడు కొండల మధ్యప్రాంతమని దీని వ్యుత్పత్తి. త్రిలింగ వ్యుత్పత్తిని పోలి ఉంటుంది. కాకపోతే కాళేశ్వరము బదులు ఇక్కడ ద్రాక్షారామము, శ్రీశైలము, శ్రీకాళహస్తులుగా పేర్కొన్నారు. త్రిలింగ వ్యుత్పత్తిలాగే ఇది కూడా అసంబద్ధమైన కల్పిత వ్యుత్పత్తి. పైగా దీని వ్యాప్తి, ప్రసక్తిలు ఏ ప్రాచీన గ్రంథాలలో కన్పించవు. ఇది కేవలం ఆధునికులు చేసిన కల్పితము.

దేశీయంగా తెలుగు శబ్దవ్యుత్పత్తి

తెలుగు సంస్కృతభవము అన్న వాదాన్ని హేతుబద్దంగా ఆధునిక భాషావేత్తలు తిరస్కరించడం వల్ల కొందరు విమర్శకులు, పండితులు తెలుగుకు దేశీయ వ్యుత్పత్తిని కనుక్కొనే ప్రయత్నం చేశారు వాటిలో ముఖ్యమైనవి.

తెళుగన్నడం

చిలకూరి నారాయణరావు తన ఆంధ్రభాషా చరిత్రములో తెళుగన్నడం అనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని అభిప్రాయపడ్డారు. కాని ఇది కేవలము ఊహ మాత్రమే. ఈ తెళుగన్నడ వ్యుత్పత్తిని ఓ ప్రాచీన కర్ణాటక లాక్షణికుడు పేర్కొన్నాడని తన ఆంధ్రభాషా చరిత్రములో (పు. 34) పేర్కొనడం జరిగింది. ధ్వని పరిణామ సూత్రాలద్వారా, తెళుగన్నడం నుంచి తెలుగు-గా ధ్వని పరిణమించడం శాస్త్రరిత్యా అసాధ్యము. తెళుగన్నడం, తెన్నడమ్ అవుతుందే గాని తెలుగు కాదు. పైగా నారాయణరావుగారు చెప్పినట్లు తెళుగన్నడ పదప్రయోగం ఎప్పుడూ, ఎక్కడా, ఎవ్వరూ పేర్కొన్నట్లు కనిపించలేదు. వారు కూడా ఆ లాక్షణిక పండితుడెవారో తన గ్రంథంలో పేర్కొనలేదు.

తేల్ + అగు = తెలుగు

తేల్ అనే నది (ఒరిస్సాలోని మహానదికి ఉపనది) ప్రాంతంలో కొంతకాలం ప్రజలు నివసించిన తరువాత ఆంధ్రప్రాంతానికి రావడం వల్ల ఆ ప్రజలు తెలుగువారయారనన్నది ఈ వ్యుత్పత్తి సారాంశము. దీనికి యే ఆధారాలు లేవు ఇది భౌగోళిక విశేషం వల్ల ఏర్పడ వ్యుత్పత్తి, అంతేగాని ప్రఖ్యాతమైనది కాదు. దీనిని ఆచార్య గంటి జోగిసామయాజి (ఆంధ్ర భాషా వికాసము, పుట. 26) వివరంగా ఖండించారు.

ఈ తెలి లేదా తేలి నదిని గోదావరి, కృష్ణనదులని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇది అభిప్రాయంగానే ఉంది గాని ఇప్పటివరకు సహేతుకమైన ఆధారాలతో ఎవ్వరూ ప్రతిపాదనరూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు.

తలైంగ్ > తెలుగు

ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహములో (పు:5) ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఈ వాదనను లేవనెత్తారు. బర్మదేశములో తలైంగ్ అనే ఓ తెగ ఉంది. ప్రాచీన కాలంలో వారు సముద్రతీరాన్ని అనుసరిస్తూ వచ్చి ఆంధ్రాప్రాంతంలో స్థిరపడిపోవడం చేత తలైంగ్ > తలేంగ్ జాతివారి నివాస భూమి తెలుంగు అయ్యిందని వీరి వాదము. ఈ తలైంగ్ పదమే ప్రాచీన తిల్లింగు పదానికి మరియుమధ్యయుగం నాటి త్రిలింగ పదానికి మూలమని ఊహించారు. ఈ వాదాన్ని ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో (పు. 25-26) వత్తాసు పలికారు. ధాతువు చివర ఏంగ్ > ఐంగ్ > ఏంగ్ గా మారి వుంటుందని ఆరుద్ర అభిప్రాయము. తలైంగ్ లేదా తలేంగ్ నుంచి దీర్ఘ మధ్యరూపాలు ప్రాచీన తెలుగు భాషలో లేని కారణంగా ఈ వ్యుత్పత్తి కూడా సమంజసమైనది కాదు. అలాగే బర్మాలోని ఈ తెగ ప్రజల జన్యువలతో నేటి ఆంధ్రుల జన్యువులతో పొంతన కుదరకపోవడం కూడా తలైంగ్ జాతికి తెలుగుజాతికి మధ్య సంబంధం సత్యదూరమని చెప్పవచ్చు.

ఇవి కాకుండా చెదురు ముదురు ప్రతిపాదనలు తెలుగు శబ్దవ్యుత్పత్తి మీద ఎన్నో ఉన్నాయి. పై ప్రతిపాదనలన్నీ సశాస్త్రీయ నిరూపణలకు దూరంగా నిలబడటం వల్ల ఇవి ఊహలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఈ ఊహలను హేతువాద దృక్పధంతో బాగా పరిశీలిస్తే, పైన చెప్పిన దేశీయ వ్యుత్పత్తులు ఏవీ సహేతుకమైన వాదాలు గావన్నవి స్పష్టమవుతుంది.

అసమంజసంలో సమంజసం

ఇదివరకే పేర్కొన్నట్లు తెలుగు వ్యుత్పత్తికి ఇప్పటివరకు ఊహలే తప్ప నిరూపణకు నిలబడే సహేతుకమైన వాదాలు ఏవీ లేవు.

కాని చాలా మంది నేటి భాషావేత్తల వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం తెళ్ + గు = తెలుగు అయ్యిందన్నది. తెలుగు లోని తెలియదు, తెలివి, తెలుపు, తెల్లన మొదలైన శబ్దాలు తెళ్ ధాతువు నుంచి పుట్టినవే అన్న విషయం మరిచిపోకూడదు. దీనికి అర్థం బోధపడటం, గ్రహించడం, తేటపడటం మొదలైన ప్రాధమిక అర్థవిశేషాలను కలిగి వుంది. విరుగు, కరుగు, గొడుగు మొదలైన పదాల్లో గు-ప్రత్యయం వుంది. వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే అన్నట్లు తెల్లపరిచే (అర్థం తెలిజేయు, అర్థం కలిగివున్న) ఈ ప్రత్యేక వాక్ సమూహాలను తెలుగని పిలుచుకుని ఉంటారన్నది ఈ వాదన. పై వాదాలతో పోల్చితే ఇది కొంత సమంజసమైన వాదము.

తెలుగే ప్రాచీనము

తెలుగు శబ్ద వ్యుత్పత్తి ఇది అని నిర్థారణగా చెప్పడానికి ఆధారాలు లేవు. వ్యుత్పత్తి తెలియకుండా తెలుగు శబ్దం ఏ భాషా కుటుంబం నుంచి వచ్చిందో చెప్పే వాదనలన్నీ అభ్రిపాయాలే తప్ప శాస్త్రసమ్మతిగా చెప్పేందుకు పనికి రానందున తులనాత్మక భాషాశాస్త్రాన్ని ఉపయోగించి తెలుగు-తెనుగు శబ్ధాలలో ఏది ప్రాచీనమో నిర్థారణ చేయలేము. మన భాషకు తెలుగు భాష అనే పేరే జనవ్యవహారంలో చాలా కాలం నుంచి ఎక్కువగా ప్రాచుర్యం ఉంది. అందుచేత తెలుగు పదమే చాలా ప్రాచీనమైందని చెప్పవచ్చు. తమిళ, కర్ణాటక, ప్రాచీన శాసనాల్లో తెలుంగు అనే పదమే సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ భాషలలోని శాసనాలలోనూ, వాఙ్మయాల్లోనూ, ఆంధ్రుల ప్రసక్తి వచ్చిన ప్రతీచోట తెలుంగ, తెలుంగు శబ్దాలే వాడడం జరిగింది. కాని, తెనుగు శబ్దం ఎక్కడ కానరాదు (ఆచార్య గంటిజోగి సోమయాజి, ఆంధ్ర భాషా వికాసము -పు. 20). వ్యుత్పత్తి పరంగా పరిశీలిస్తే తెలుగు శబ్దమే ప్రాచీనమైనదని తెలుగు వ్యుత్పత్తికోశం (సంపుటి 4. పు. 130 -131) నిరూపించింది. భాషా వ్యవహార్తులు అనేకులు తెలుగు అని వ్యవహరించడం వల్లనూ, చాలా ప్రాచీన కాలం నుంచి ఇతర భాషా శాసనాల్లో తెలుగు పదానికి మాత్రమే వ్యాప్తి ఉండడం వల్లనూ, తెలుగు వ్యుత్పత్తికోశం భాషాశాస్త్ర ధ్వనిసూత్రాల ద్వారా నిరూపించడం వల్లనూ, తెలుంగు పదమే చాలా ప్రాచీనమని, దాని నుంచే తెలుగు పదం పుట్టిందని మనం నిర్దారించవచ్చు.

(ఈ వ్యాసం రాయడానికి నన్ను ప్రోత్సహించడమే కాకుండా ఓర్పుగా, శాస్త్రీయతకు నిలబడేలా అడుగడుగునా దిద్దుబాట్లు చేసి సవరించిన గురుతుల్యురు శ్రీ కొలిచాల సురేశ్ గారికి నా ధన్యవాదాలు.)


ఉపయుక్త గ్రంథములు

  1. తెలుగు భాషా చరిత్ర – వెలమల సిమ్మన్న, 2004.
  2. తెలుగు భాషా చరిత్ర – సం. భద్రిరాజు కృష్ణమూర్తి, 1975.
  3. ప్రాచీనాంధ్రదేశ చరిత్ర గ్రామీణజీవనం – పి.వి పరబ్రహ్మశాస్త్రి, 2012.
  4. లక్ష్మణరాయ వ్యాసావళి – కొమర్రాజు వెంకట లక్ష్మణరావు,
  5. ఆంధ్రుల చరిత్ర – బి. ఎస్. ఎల్. హనుమంతరావు, 2012.
  6. ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి (క్రీ.శ 1336 వరకు) – ఎం. ఏ చరిత్ర పాఠ్యాంశ గ్రంథం. – పిశుపాటి శ్రీరామశర్మ