అట్టు నా ఆదర్శం

1. స్వేచ్ఛాగానం

రుబ్బుఱాయిలో ఊగే కాచకాన్ని
నీటిలో నానిన పప్పు బంధిస్తుంది
గడియేని ఆగని పెనాన్ని
చితుకుపుల్లల బాహువులు బంధిస్తాయి
పీతడెక్కల గాడిపొయ్యిని
చేతులెత్తే జ్వలనం బంధిస్తుంది
గలగలలాడే నూనెబొట్టుల్ని
సలసలకాగే అంచులు బంధిస్తాయి
తన చుట్టూ తాను తిరిగే పిండిని
మలుపులు తిరిగే గరిటె బంధిస్తుంది
తెగవాగే జలపాతపు జిహ్వని
సెగలెగిసే మిరప బంధిస్తుంది
ముడతలుపడ్డ ముసలి అట్టుని
మాటలురాని నాలిక బంధిస్తుంది
తేలి వచ్చిన అప్పచ్చి వాసనని
ముక్కున దాగిన గ్రంథులు బంధిస్తాయి
గురిమరచిన నాల్కబాణాన్ని,
తిరగమోగిన అల్లపుచట్నీ బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది అట్టుదోశ.

(అట్టునాడ, డిసంబరు 2010.)

2. మనిషీ మనిషీ!

మనిషీ మనిషీ,
ఎత్తుగా ఆకాశంలో
ఎగిరే డేగని చూడు
సరిహద్దుల్లేవు దానికి
గిరిగీసుకుని కూచోదు
భూచక్రాన్ని గుండ్రంగా
చూచుకాగ్రంపై తిప్పుతుంది
స్ఫుటంగా తీక్షణంగా వీక్షించే
సూర్యనేత్రం దాని ఆదర్శం.

మనిషీ మనిషీ,
పిట్టలకు ఎగరటం నేర్పిన
చెట్టుని చూడు
ఏ భాషలో పుష్పిస్తుందది?
ఊడల నీడల్లో మాపటి వేళల్లో
ఊడల్లా కావలించుకునే
ప్రియుల హస్తాలు
ఏ భాషలో తడుముకుంటాయి?

మనిషీ మనిషీ,
వరిమళ్ళల్లో ఈదే
చిరు ఆకాశాల్నీ చిట్టి పరిగల్నీ చూడు
ఆనందపు రంగులు
చైనా వియత్నాం జపాన్‌ పొలాల్లో
ఎక్కడైనా
అవే కద,

మనిషీ మనిషీ,
అట్టు ఏ పెనమ్మీదైనా
అట్టుగానే ఉంటుంది.

(అట్టునాడ, 12-12-10.)

3. అట్టు నా ఆదర్శం

జలచాపము వీడిపోయి
గురిమరచిన బాణంలా
తిరుగాడును పిండి.

పెనం గుట్టు తెరవబోయి
బిరడాలో ఇస్క్రూలా
ఇరుక్కున్న అట్టు.

పిండి సగం, సగం పప్పు
తిరగలిచొచ్చి, పెనమ్మీదవిచ్చి
విరులు తాల్చు అప్పచ్చి

(అట్టునాడ, 2010.)

4. అట్టు వేసిన మధ్యాహ్నం

బరువెక్కిన సూర్యుడు
బతకనీడు మంచాన్ని
ఉదయమ్మొదలు
ఊపిరాడనీడు
కంఠాన్ని అదిమిపట్టి
దోశలని కుక్కాడు.

ఆకల్లాటలు.
ఏ కరువు ఎరగని
ఏకరువు జఠరం.

ఇంతలో హటాత్తుగా
డొక్కకు కలిగింది క్షుత్తుకడుపు.
ఆకలి గాలులు
గాడిపొయ్యిని వూపాయి.
పెనపుచూచుకాలు నల్లపడ్డాయి.
నూనెబొట్ల చెంపలు తెల్లపడ్డాయి.

అవాళ మధ్యాహ్నం
అకస్మాత్తుగా దిగిన అట్టుపొర
ఊరంతటినీ ఆవలుంచి
ఒంటరిగా నన్ను మూసింది.

ప్రపంచంతో తెగిపోయాయి
పంచతంత్రులూ,
నాలుకపై రంగులు
విస్తరించాయి ముందుగా,

స్వరాలూ సువాసనలూ
అతిశయించాయి తరువాత.
ఆశలూ ఆశయాలూ
ద్వేషాలూ రాగాలూ
రెచ్చకొట్టే స్మృతులూ
రెక్కలు ముడిచాయి పిదప

విప్పుకున్న బతుకంతా వెనక్కి చుట్టుకుపోయి
ఇప్పుడు నేనేమీ కాను తతత
రేపటి తిరగలిగర్భంలో
వర్ధిల్లే దోశపిండాన్ని.

(డిసెంబర్‌ 2010.)

5. దోశతోపు

నల్లటి యీ దోశపెనం
గిల్లిన వంట వారిపై
ఎర్రటి వాతలని
ఎక్కుపెట్టింది.

అగ్గి శవాన్నెత్తుకుని
కదల్లేదు పెనం.
గుచ్చుకుని సమిధాంగుళి
గుడ్డిదయ్యె పొయ్యి.

ఆకలిముల్లు గుచ్చుకొని
గాయపడెను ఉదరం.
కాలిమసై కట్టె, నిలిచె
దాలిపొయ్యిన అస్థికలు.

రుచులతెడ్లు వేసుకుంటు
తరలిపోయె పిండి.
తేన్పునురగ నోటతేల
మరలివస్తి ఒక్కణ్ణీ.

(డిసెంబర్‌ 18, 2010.)

6. ఔఆఒఊ ఓఖజఊ, కఖచ జఆఘ

పిండికీ
పప్పుకీ
“రవ్వ”ంతే తేడా.

వలలుడికీ
ఉపభోక్తుడికీ
ఒకటే ఏకాగ్రత!

అట్టు చివరి కొసని
నాలుక నిత్యం జ్వలిస్తే
అడబాల గంటె తుదని
పిండి నిశ్చలంగా జారుతుంది.
వంటింటిలో లేచే సుడిగాలే
వార్పురంగంలో పిడికిలి బిగిస్తుంది.

జిహ్వల తుఫానుకి
కొంకర్లు తిరిగే నరాలచెట్టులా
నాలికల సమరంలో
వంకర్లుపోయిన అట్టు అంచులూ అల్లపుచట్నీలు.

హసంతిభంగిమలకి
రసనంతిభంగిమలకి
వ్యత్యాసం ఉందంటారా?

ఉవ్వెత్తుగా లేచిపడి
ఉద్రేకపు చివర్ల
బిగుసుకునే కాకువులకి కారణం
అప్పచ్చా, అరాచకమా?

ఐతే,

బుద్ధిగా అట్టుతినక
యుద్ధాలెందుకు చేస్తారో
నాకర్థం కాదు.

(12-12-2010.)

7. రుబ్రాయిలో పిళ్ళు

అలలు రాల్చింది మా
రుబ్బురాయి సుమము
నిలువెల్ల పాకగా
వేసిన పిండి

నేటితో అట్టు నీ
పెనంపై జారదు.
గరిటె జారుగ విచ్చి
నూనె ఇక నిలవదు.

జల శృంఖల తెగినా
వదలదు పిండి
తలనిండ పిడులతో
ఊగే పొత్రం.

పిండి తడిసిన
రాతిపొత్రపు మెట్లు
పలకరించే వేళ్ళు
పడతుల జట్లు.

ఎడబాటు తెరచీల్చి
తరుణుల వేళ్ళు
పిడులకడుపున పోల్చు
పొత్రపు రోళ్ళు.

(ఏప్రిల్‌ 2010, 2011.)

[ఉపాహారంలో అట్టును వదిలి బతకలేని నేను, చెట్టు నా ఆదర్శం అంటూ ఇస్మాయిల్ వ్రాసిన ఒక రచన చదివిన తరువాత వాటికి పేరడీగా వ్రాసుకున్న కొన్ని కవితలు ఇవి. ఇస్మాయిలుగారికి అట్టు ఇష్టమో లేదో తెలియదు కానీ, ఆయన చెట్టు కింద ఇప్పుడు బోలెడు అట్లు ఉన్నవి. ఆయన కూడా ఆ పైలోకాలనుంచి ఇవి చదువుకుని ఏదో ఒక అనుభూతికి లోనవుతారన్న ఊహతో.

మీరు కూడా ఏదో ఒక అనుభూతికి గురవుతారన్న ఆశతో.]