మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు

ఈ వ్యాసాన్ని కొన్ని కథలతో మొదలు పెడతాను. మనం ఆదికావ్యం అనుకునే రామాయణాన్ని గురించి, ఆదికవి అనుకునే వాల్మీకిని గురించి చాలామందికి తెలిసిన కథ ఒకటుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం అనే పేరుతో సంస్కృతంలో అచ్చయే రామాయణ పుస్తకాలు అన్నింటి లోను ఈ కథ వుంటుంది. ఈ రామాయణం రెండవసర్గలో వాల్మీకి తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు కూడా వెళ్తాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయం ప్రశాంతమనస్కుడైన వాల్మీకి హాయిగా ఉన్న రెండుపక్షులను చూస్తాడు. అవి క్రౌంచపక్షులు. ఒకటి ఆడ, ఇంకొకటి మగ. ఆ పక్షులు రెండూ హాయిగా మైథునానందంలో మైమరచి వున్నాయి. ఆ సమయంలో ఒక బోయవాడు (నిషాదుడు) ఆ రెండింటిలో మగపక్షిని చంపుతాడు. చచ్చిపోతున్న మగపక్షిని చూసి ఆడపక్షి ఏడుస్తూ వుంటుంది. ఆ విషాద దృశ్యాన్ని చూసి అప్రయత్నంగా వాల్మీకి నోటి నుంచి శాపరూపమైన ఈవాక్యం1 వినిపిస్తుంది.

మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమశ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్

ఆ మాటలు తన నోటి నుంచి వచ్చిన వెంటనే వాల్మీకి తనకు తానే ఆశ్చర్యపోయి “కిమిదం వ్యాహృతం మయా” (ఏమిటి నేనన్నాను?)2 అని చూసుకుంటాడు. ఆ తరువాత ఒక మంచి సాహిత్యవిమర్శకుడి లాగా తన వాక్యాలను తానే చర్చిస్తాడు. అందులో నాలుగు సమానమైన పంక్తులున్నాయి. ప్రతి పంక్తి లోను ఉన్న అక్షరాలు సమానంగా వున్నాయి. తీగలున్న యంత్రం మీద ఇది పాడడానికి వీలుగా వుంది — అని వివరించాక, ఇది శోకం లోంచి పుట్టింది కాబట్టి దీన్ని శ్లోకం అనడమే న్యాయం అని దీనికొక పేరు పెడతాడు.

ఆయన ఈ శ్లోకాన్ని చెప్పిన వెంటనే, పక్కనే వున్న భరద్వాజుడు దాన్ని అప్పటికప్పుడు కంఠస్థం చేసి రాగ, తాళబద్ధంగా పాడతాడు. రచన, విమర్శ, పఠన — ఈ మూడూ కలిసి దీనిని కావ్యం చేస్తాయి. ఇది మొదటి కావ్యం. ఈ కావ్యాన్ని చెప్పాడు కాబట్టి వాల్మీకి మొదటి కవి. ఈ కథ మీలో చాలా మందికి తెలుసు.

అయితే, వాల్మీకిని గురించిన కథ ఇది ఒకటే కాదు. ఇంకో కథ కూడా వుంది. ఆ కథ సంస్కృత సాహిత్య విమర్శరంగం లోకి ఎక్కలేదు. కానీ ఆనోట ఈనోట వచ్చిన ఈ కథ స్కాందపురాణంలో, ధర్మఖండంలో3 వుంది. తెలుగులో వాల్మీకి చరిత్ర4 రాసిన రఘునాథ నాయకుడు (రాజ్యకాలం 1600-1631) కూడా చెప్పాడు. కానీ అంతకన్నా ప్రచారంగా ఈ కథ నోటి మాటగా చాలా కాలంగా ఉంది. ఆ కథ ఇది.

వాల్మీకి మొదటిలో బందిపోటు దొంగ. దారులు కాసి వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని బెదిరించి, అవసరమైతే చంపి వాళ్ళ డబ్బు దోచుకునేవాడు. ఒక రోజున కొంతమంది బ్రాహ్మలు, కాశీకి వెళ్ళేవాళ్ళు, అతనికి కనిపించారు. అతను వాళ్ళని ఆపి, “మీ డబ్బంతా ఇవ్వండి, లేకపోతే చంపేస్తాను” అన్నాడు. వాళ్ళు అతన్ని నెమ్మదిగా మాటల్లోకి దింపి, “ఒక సంగతి చెప్పు. ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు?” అని అడిగారు. “నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించడం కోసం నేను చేసే వృత్తి ఇది,” అని చెప్పాడు అతను. “బాగుంది, నువ్వు ఈ పని చేయడంలో చాలా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. నువ్వు సంపాందించే డబ్బులో పాలు పంచుకునే నీ పెళ్ళాం పిల్లలు నీ పాపంలో కూడా పాలు పంచుకుంటారా?” అని అడిగారు ఆ బ్రాహ్మలు. ఈ ప్రశ్నకు సమాధానం తోచక ఆ దారిదొంగ నాకు తెలియదన్నాడు. “నువ్వు ఇంటికెళ్ళి కనుక్కురా. మేమిక్కడే వుంటాం,” అన్నారు వాళ్ళు. ఆ దారిదొంగ ఇంటికెళ్ళి పెళ్ళాం పిల్లల్ని అడిగాడు. “నేను మిమ్మల్ని పోషించడానికి దారులు కాసి మనుషుల్ని చంపి డబ్బు సంపాదిస్తున్నాను. అందువల్ల నాకు చాలా పాపం వొస్తోందని కొందరు బ్రాహ్మలు చెప్పారు. నా డబ్బులో పాలు పంచుకుంటున్న మీరు నా పాపంలో కూడా పాలు పంచుకుంటారా?”

వాళ్ళు దానికి సమాధానంగా, “నువ్వు మాకోసం డబ్బు సంపాదించడంలో ఏ పాపపుణ్యాలు మూట కట్టుకుంటున్నావో అది నీ పని. అందులో మాకేమీ వాటా లేదు. నీ పాపం నీదే, అది నువ్వే అనుభవించాలి,” అని అన్నారు. దిక్కు తోచని ఆ దొంగ తిన్నగా ఆ బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తను చేసిన పాపం నుంచి విముక్తుడవడానికి మార్గమేమిటని అడిగాడు. వాళ్ళు అతన్ని దయ తలిచి రామమంత్రం అతనికి ఉపదేశించ దలుచుకుని అయినా తామసుడు, శుద్ధమూర్ఖుడు అయిన అతనికి ఆ మంత్రాన్ని యథామార్గంలో ‘రామ’ అని చెప్పకుండా తిరగేసి ‘మరా’ అని చెప్పి ఆ మంత్రాన్ని ఒకచోట కూర్చుని నిష్టతో జపించమన్నారు. ఆ మూర్ఖుడు బండగా మఠం వేసుకుని ఒకచోట కదలకుండా కూర్చుని మరామరామరా5 అని జపిస్తూ వుంటే అది రామరామరామ అయ్యింది. అలా కూర్చున్న ఆ దొంగ మీద చెదలు పుట్టలు పెట్టాయి. అయినా అతను అలా జపిస్తూనే కూర్చున్నాడు. కొన్నాళ్ళకి రాముడు ప్రత్యక్షమై అతనికి మోక్షమిచ్చాడు. సంస్కృతంలో పుట్ట అంటే వల్మీకం. వల్మీకం లోంచి పుట్టాడు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యాడు.

భారతదేశానికి ఇంగ్లీషువాళ్ళతో సంబంధం వచ్చిన తరువాత ఇలాంటి కథలు – తలాతోకా లేనివి, ఎప్పుడు ఎలా పుట్టాయో తెలియనివి – విజ్ఞానుల్ని చిరాకు పెట్టేవి. ఈ కొత్తవిజ్ఞానులు ఇలాంటివన్నీ కట్టుకథలనీ, చరిత్ర లేని జాతికి ఇలాంటి కథలే వుంటాయని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా వుండగా భారతీయ విజ్ఞానులలోనే అలంకార శాస్త్రపండితులు కూడా ఈ కథల్ని పనిగట్టుకుని నిరాకరించక పోయినా కావాలని ఆదరించలేదు. అటు ఆలంకారికుల చేత, ఇటు ఆంగ్లేయుల చేత నిరాదరణకు గురయిన ఈ కథలు కొత్త చదువులు ముదురుతున్న కొద్దీ పాతపడి ఎవరికీ జ్ఞాపకం కూడా లేకుండా పోతున్నాయి. ఈ కథల్లో ఒక కాలానికి చెందనివాళ్ళు అని సాహిత్య చరిత్రకారులు నిర్ణయించిన కవులు కలిసి మాట్లాడుకుంటారు. అసలు ఏ కాలం లోనూ వున్నారని చెప్పడానికి వీలు లేని కవులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. పైగా, వాళ్ళకు లోకాతీత శక్తులుంటాయి. ఒక్క మాటతో వాళ్ళు మహారాజుల్ని బిచ్చగాళ్ళుగా మార్చగలరు, బిచ్చగాళ్ళని మహారాజుల్ని చేయగలరు. అవసరమైతే దేవుణ్ణే ఎదురించగలరు. ఈ కథల్ని ఎలా అన్వయించాలో తెలియక తికమక పడ్డారు సాహిత్య చరిత్రకారులు.

వలసపాలన ద్వారా వచ్చిన పాశ్చాత్య విద్యల్లో ఒకటి సాహిత్య చరిత్ర6. ఏ కవి ఏ పుస్తకం ఏ కాలంలో రాశాడు అనేది నిర్ణయించడం ఈ సాహిత్య చరిత్రకి మొదటి అవసరం. ఈ కొత్త చరిత్రకారులు కొత్త ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. కాళిదాసు ఎప్పటివాడు? ఎంతకాలం బ్రతికాడు? ఈ వాల్మీకి, వ్యాసుడు నిజంగా రామాయణం, భారతం రాశారా? ఒక్క వ్యాసుడు అన్న వ్యక్తి అంటూ వుంటే వేదాల్ని విభజించి, మహాభారతాన్ని రాసి, పురాణాలన్నింటికీ కర్త అయి, ఆ తరవాత ఇంకా తోచక భాగవత పురాణాన్ని కూడా రాశాడంటారు కదా, అతను ఎంత కాలం బ్రతికి ఉండాలి? అది అలా వుంచి మీ కవులు ఒక్క పద్యంతో రాజుల్ని రాజ్యభ్రష్టులుగా ఎలా చేయగలిగారు? ఇలాంటి ప్రశ్నలు అడగటంతో సాంప్రదాయిక భారతీయ పండితులు ఒక పక్క తమ సంప్రదాయాన్ని రక్షించుకునే పని లోను, రెండో పక్క ఆ కొత్త చరిత్ర పద్ధతుల్ని నేర్చుకునే పని లోను పడి సాహిత్య చరిత్రకారులుగా పునర్జన్మ యెత్తారు. పాత శాసనాలని పరిశీలించడం, అవి ఆధారంగా రాజవంశాల కాలక్రమాల్ని నిర్ణయించడం, గ్రంథం లోనే వున్న అంతర్గత సాక్ష్యాల ఆధారంగా శైలీభేదాలని పట్టి కావ్యకర్తృత్వాలని నిర్ణయించడం — ఇలాంటి పని పందొమ్మిది-ఇరవై శతాబ్దాల సాహిత్య చరిత్ర కారులు చాలా మంది చేశారు. ఈ పద్ధతిలో నిర్మించిన తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్ని విలువైన విషయాలు తెలిశాయో, అందుకోసం ఎంతమంది ఎంత పరిశ్రమ చేశారో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ పనిలో వాళ్ళకు తారసపడిన ఈ కథలు కాదనలేక తమ సాహిత్య చరిత్రలో చొప్పించిన వాళ్ళు కొందరు, నిర్దాక్షిణ్యంగా నిరాకరించిన వాళ్ళు కొందరు.

ఈ కథల్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించి సాహిత్య చరిత్ర నిర్మాణానికి అతి నిశితమైన, పరమ ప్రామాణికమైన పదార్థానికి ఈ కథలు ఆధారమని చెప్పడం నా ఉద్దేశం. ఇవి నిజమైన సాహిత్య చరిత్రకి మూలభూతమైన దినుసులు అనీ, కవి అంటే ఎవరు, గ్రంథం అంటే ఏమిటి, పాఠకులు అంటే ఎవరు, ఈ మూడు పదార్థాలకి (అంటే, ఈ పదాల అర్థాలకి) వున్న సంబంధాలు ఎటువంటివి, ఈ పదార్థాలు, ఏ పరిస్థితుల్లో ఎలా మారాయి, ఆ మార్పులు చెప్పడమే సాహిత్య చరిత్ర చేయవలసిన పని అని నా ఉద్దేశం. అంతే కాని కాలక్రమంలో ఏ పుస్తకం ముందు వచ్చిందో, ఏ పుస్తకం తరువాత వచ్చిందో చెప్పుకుంటూ కూర్చోవడం సాహిత్య చరిత్ర కాదు. అలాంటి చరిత్ర మనకి లేకపోయినందుకు మనం విచారించక్కర్లేదు అని నా అభిప్రాయం.

ప్రపంచంలో ఆధునికులు చాలా మంది లాగే మన మనసుల్లో కూడా పుస్తకానుభవం ఈ కింది వరసలో వుంది.

  • రచయిత >>> పుస్తకం >>> పాఠకుడు

అయితే భారతదేశంలో కవి పుస్తకాన్ని రచించడు, పుస్తకమే కవిని రచిస్తుంది. ఈ మాటని మరికొంచం వివరంగా చెప్పనివ్వండి. ఒక పుస్తకం ఇతిహాసమో, పురాణమో, శాస్త్రమో అయితే దాని కర్తగా అది ఒక మనుష్యాతీతశక్తి వున్న కర్తని సృష్టించుకుంటుంది. ఉదాహరణకి, రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ఇదే పుస్తకం భక్తిగ్రంథంగా చదివితే దానికి కర్త ఇంకొక వాల్మీకి అవుతాడు. అంటే కిరాతుడు ఋషిగా తయారయిన వాల్మీకి అవుతాడు. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు. ఈ రకంగా చూస్తే కవిని గురించిన కథ పుస్తకంలో భాగం. ఆ కథ కర్తృత్వంతో పాటు ఆ పుస్తకానికి వుండవలసిన స్థాయిని, ఆ పుస్తకాన్ని చదవవలసిన విధానాన్ని కూడా చెప్తుంది.

ఈ విషయాన్ని మరికొంత వివరంగా పరిశీలించడానికి కవుల్ని నాలుగు భాగాలుగా విభజించి చూస్తాను.

  1. ఆర్షకవులు
  2. కావ్యకవులు
  3. భక్తికవులు
  4. చాటుకవులు

ఇందులో మొదటి రకం కవికి, అంటే ఆర్షకవికి ఒక మానవాతీత జీవిత కథ వుంటుంది. ఆయన మనలాగా పుట్టడు, పెరగడు, మరణించడు. ఆయనకి దేవుళ్ళతో ప్రత్యక్షసంబంధం వుంటుంది. ఆయన భూత, భవిష్యద్వర్తమానాలు చూడగలడు. ఆయన దృష్టి ప్రపంచాన్నంతటినీ ఆకళింపు చేసుకోగలదు. ఆయన వాక్కు ఆర్షవాక్కు. అంటే మానవమాత్రులు తప్పులెంచడానికి వీలు లేని వాక్కు. ఆయన రాసిన దాంట్లో వ్యాకరణ దోషాలు వెతకటం లాంటి పని వ్యాకర్తలు తలపెట్టకూడదు. మనం చేయగల పనల్లా ఆ మహానుభావులు చెప్పినవి అర్థం చేసుకోగలగటమే. వ్యాసవాల్మీకులు అలాంటి వాళ్ళు.

ఒక చిన్నమలుపు

సంస్కృతకావ్యాలకి అన్నిటికీ కలిపి ఒక మహాసిద్ధాంతాన్ని తయారు చేయాలనే పెద్ద ఆశతో మొదలైన అలంకార శాస్త్రం ఆర్షకవుల్ని కూడా మామూలు కవులతో పాటు తన పరిధి లోనికి తీసుకు రావడానికి ప్రయత్నించింది. తొమ్మిదో శతాబ్దపు ఆనందవర్ధనుడు, తన ధ్వన్యాలోకంలో మహాభారత రామాయణాలని కావ్యాలు గానే పరిగణిస్తాడు. రామాయణానికి కరుణం అంగిరసం అని, మహాభారతానికి శాంతం అంగిరసమని పట్టుపట్టి ప్రతిపాదిస్తాడు. ఋషి రాసిన కావ్యాన్ని అలా గౌరవంతోనైనా మనుష్యమాత్రులు రాసిన కావ్యాలతో కలిపి పరిగణించడం అలంకార శాస్త్రం చేసిన ప్రధానమైన సైద్ధాంతిక ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం మొదలు పెట్టిన ఆనందవర్ధనుడికి ఇది తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని తెలుసు. దీనికి కొన్ని తరాల బుద్ధిమంతులైన పాఠకులు, భావుకులు తోడు కావాలి. మానవాతీతమైన స్థాయికి చెందిన వ్యాసుణ్ణి కాని, వాల్మీకిని కాని అలంకార శాస్త్రనిష్కర్షకి లోబడేట్టు చేయడం తనకు సాధ్యం కాదు. అందుకనే ఆయన వ్యాసుణ్ణి, వాల్మీకిని కవులకు ఆదర్శాలుగా, గురువులుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి, మహాభారత రామాయణాల లాంటివి ఒక రసంతో పరిపూర్ణంగా తయారయి వున్నాయని, ఆ కథల్ని తిరిగి చెప్పే వాళ్ళెవరయినా అందులో రసాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదని నిక్కచ్చిగా చెప్పాడు ఆనందవర్ధనుడు. (సంతి సిద్ధరసప్రఖ్యా యేచ రామాయణాదయః కథాశ్రయా న తైర్యోజ్యా స్వేచ్చారసవిరోధినీ )7 అంటే వ్యాసుడు, వాల్మీకి కూడా కవులే అయినా వాళ్ళ స్థాయి వేరని చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది.

అలంకార శాస్త్రం దృష్టిలో కావ్యకవి మామూలు మనిషి. మమ్మటుడు తన కావ్యప్రకాశంలో చెప్పినట్లు కవులు కావ్యాలని పేరు కోసం రాస్తారు, డబ్బు కోసం రాస్తారు. కావ్యంతో కలిగే ఇతర — శివేతరక్షతి, కాంతాసమ్మితయా ఉపదేశం — అనే ఫలితాలతో పాటు వీటిని కూడా అనుమానం లేకుండా కలిపాడు మమ్మటుడు. కావ్యకవి మామూలు మనిషి కాబట్టి అతను మంచి కవి కావడానికి శిక్షణ అవసరం. మంచి పద్యం మంచి శిక్షణ వల్ల తయారవుతుంది. కావ్యం దోషాలు లేకుండా, అలంకారాలతో కూడి, రసవత్తరమై ఉండాలి. ఆ కావ్యాన్ని పుచ్చుకున్న కృతిభర్తకి, చదివే పాఠకులకి ఏ రకమైన అవాంతరాలు రానివ్వకుండా మంగళకరమైన భాషలో నిర్మించబడాలి. భారతీయ సంప్రదాయంలో శబ్దం చాలా శక్తిమంతమయినది. సరిగ్గా వాడితే అది కామధేనువు లాగా కోరినవన్నీ ఇస్తుంది. సరిగ్గా వాడకపోతే వాడినవాళ్ళని పశువుల్ని చేస్తుంది.

అలంకార శాస్త్ర గ్రంథాలన్నీ కావ్యానుభవాన్ని సిద్ధాంతీకరించడంతో పాటు కవుల్నీ, సహృదయుల్నీ సుశిక్షితులుగా తయారు చేయడం కోసం రాసినవి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ఇతర సాహిత్య శాస్త్ర గ్రంథాలు కవులకన్నా పై స్థాయిలో వుండి కవుల్ని శాసించలేదు. స్థూలంగా చూస్తే కావ్యం రమణీయంగా తయారవాలంటే కవి ఈ నియమాలని పాటించాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టు ఉన్నా, అలంకార శాస్త్ర గ్రంధాలు, నిజానికి కవిని శాసించే పని లోనే, కవికన్నా పైస్థాయిలో వుండే గొంతుక తోటే రాయబడ్డాయి. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే అప్పటి సాంప్రదాయక ధర్మంలో కావ్యజగత్తు లౌకికజగత్తుకి ప్రతి రూపం. అంటే ఒకదానికొకటి సమానంగా వుంటాయి. ఉదాహరణకి ఈ బొమ్మ చూడండి.

లౌకికజగత్తులో రాజు వేదశాస్త్రాలు చెప్పిన నియమాలని బట్టి పరిపాలిస్తాడు.అంటే వేదశాస్త్రాలు రాజులు అనుసరించవలసిన శాసనాలు. ఆ వేదశాస్త్రాలని అన్వయించే పని చేసేవాడు పురోహితుడు. రాజు చేసే పని — ఆ శాసనాలకి పురోహితుడు చెప్పిన అన్వయానికి లోబడి తదనుగుణంగా పరిపాలన చేయడం. ప్రజల పని — ఆ పరిపాలన యొక్క మంచి ఫలితాలని అనుభవించడం. సరిగ్గా ఇలాగే కావ్యజగత్తులో కూడా అలంకార శాస్త్రం కవిని శాసిస్తుంది. ఆ శాసనాన్ని ఆలంకారికులు అన్వయిస్తారు. దాన్ని అనుసరించిన వాడే కవి, కావ్యకర్త, అవుతాడు. పాఠకులు సహృదయులై వాటి వల్ల కలిగే రసాన్ని ఆనందిస్తారు. మంచికవి తప్పులు చెయ్యడు. లిఖితప్రతిలో తప్పులు కనిపిస్తే అవి లేఖకదోషాలు.

అయితే, అలంకార శాస్త్రంలో చెప్పిన స్థాయిభావాలన్నీ మానవచైతన్యంలో భాగాలే. కవులు ఈ మానవచైతన్యంలో భాగాలయిన వాటిని మానవులే అనుభవించగల రసానుభవంగా మారుస్తారు. ఈ మాట ఇంకొంచం స్పష్టంగా చెప్పాలంటే రసానుభవం మనుష్యులకొక్కరికే సాధ్యం. అంటే రసానుభవానికి మనకి వేరే అర్హతలేమీ అక్కరలేదు. మనం మనుషులమైతే చాలు. సాహిత్యానందం కేవలం మానవకర్మ. ఈ అనుభవానికి మానవులందరు సమానంగా అర్హులు. వాళ్ళకి మనిషిగా వుండటం తప్ప వేరే విశేషార్హతలు ఏవీ అక్కరలేదు. పోతే, కావలసినదల్లా కవిత్వాన్ని ఆనందించగల హృదయం. ఇలాంటి వాళ్ళని సహృదయులు అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది అలంకార శాస్త్రం.

అయితే భక్తికవిత్వం ఆనందించడానికి ఈ అర్హతలు సరిపోవు. అందుకోసం పాఠకుడు భక్తుడు కూడా కావాలి. ఉదాహరణకి వేంకటేశ్వర సుప్రభాతంలో ఈ చరణం చూడండి.

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగతపారిజాత
శ్రీ వేంకటేశ్వరవిభో తవ సుప్రభాతం

ఇందులో వున్నవన్నీ విష్ణుమూర్తి పేర్లు. విష్ణుమూర్తి పేరు వింటే చాలు ఒళ్ళు పులకరించిపోయే భక్తుడికి ఇది మహాకవిత్వం. భక్తుడు కాని మామూలు వ్యక్తి వింటే, ‘అయితే ఏవంటావ్?’ అన్నట్లుగా చూస్తాడు.

ఆలంకారికులు భక్తిని రసంగా అంగీకరించడానికి ఇబ్బంది పడటం ఈ కారణం వల్లనే అనిపిస్తుంది. జగన్నాథుడు తన రసగంగాధరంలో8 భక్తిని రసంగా ఎందుకు అంగీకరించ కూడదు అన్న విషయం సహేతుకంగా చర్చించి అది రసమేనని ఒప్పుకుంటున్నట్లు కనపడి, చివరికి నాట్యశాస్త్రం అడ్డుపెట్టుకుని తప్పుకుంటాడు. ఫలితంగా ఆయన నిర్ణయం ఏమిటంటే భరతాది మునివచనమేవ అత్ర రస భావత్వాది వ్యవస్థాపకత్వేన స్వాతంత్ర్య అయోగాత్, అని. రసమూ, భావమూ అనేవి ఏవి అవునో ఏవి కావో అన్న వ్యవస్థ విషయంలో భరతుడి వచనమే అనుసరించాలి కాని, మనం ఇష్టం వచ్చినట్లు ఆ వ్యవస్థని మార్చడానికి వీలులేదు. భరతుడు రసాలు ఎనిమిదే అన్నాడు. దానికి భక్తిని కలపడానికి వీల్లేదు. ఇది శాస్త్రకార శాసనం.

అంతకు ముందు అభినవగుప్తుడు కూడా తన అభినవభారతిలో, స్థాయిభావాల్ని గురించి చెప్తూ, స్థాయిత్వంచ ఏతావతామేవ జాతయేవహి జంతు రిత్యాదిభిః సంవిద్భిః పరీతోభవతి, అని నియమం చేశాడు. అంటే స్థాయిభావాలు ఇవే. మానవుడు వీటితోటే జన్మిస్తాడు. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం భక్తి మానవసహజాతాలలో ఒకటి కాదు. అంచేత దానికి రసత్వం లేదు.

కానీ భక్తికవులు రాధాకృష్ణుల ప్రేమని వర్ణించేటప్పుడు, ఉదాహరణకి జయదేవుడి లాగా (తరవాత అన్నమయ్య లాగా), యథేఛ్ఛగా రాయడంతో ఆలంకారికులకి గట్టి ఇబ్బందులే వచ్చాయి. జగన్నాథుడైతే నిష్కర్షగా, రతేః సంభోగరూపాయాః మనుష్యేష్వివ ఉత్తమదేవతా స్ఫుటీకృత సకలానుభవ వర్ణనం అనుచితం, అని చెప్పాడు. ఉత్తమదేవతల సంభోగరూపమైన రతి మనుష్యుల విషయంలో లాగా స్ఫుటంగా దాపరికం లేకుండా వర్ణించడం ఉచితం కాదు, అని. గీతగోవిందంలో జయదేవుడు చేసిన వర్ణనలు దృష్టిలో పెట్టుకుని ఇంకా కఠినంగా — జయదేవాదిభిస్తు గీతగోవిందాది ప్రబంధేషు సకల సహృదయ సమ్మితోయం సమయః మదోన్మత్త మతంగ జైరివ భిన్న ఇతి న తన్నిదర్శనేన ఇదానీంతనేన తథావర్ణయితుం సాంప్రతం, అన్నాడు. (జయదేవాది కవులు గీతగోవిందం లాంటి ప్రబంధాల్లో సహృదయులెందరో అంగీకరించిన ఈ నియమాన్ని మదించిన ఏనుగుల్లాగా నాశనం చేశారని, అందుచేత అది నిదర్శనంగా చూపించి ఈనాటి వాళ్ళు అలా వర్ణించడానికి వీల్లేదు). అయినా కృష్ణభక్తులకి ఇది అభ్యంతరంగా తోచలేదు. రాధాకృష్ణుల ప్రేమని విశృంఖలంగా వర్ణించడం వాళ్ళకి అనుచితంగా కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని భక్తిరసంగా చూశారు కాబట్టి. ‘భక్తిరసామృతసింధువు’లో రూపగోస్వామి ఈ విషయాన్ని అలంకార శాస్త్ర పరిధి లోనే చర్చించి భక్తికి రసత్వాన్ని సాధించాడు.

మళ్ళీ అసలు విషయం

ఈ అలంకార శాస్త్ర విషయం అంతా నిజానికి మనకి అక్కర లేదు. లోకంలో భక్తికవులకి, కావ్యకవులకి వాళ్ళ జీవిత చరిత్రలని గురించి వినిపిస్తున్న కథలు ఈ విషయాన్ని బలంగా స్పష్టపరిచాయి. ఉదాహరణకి పాఠకులు పోతన్న భాగవతాన్ని భక్తిగ్రంథం గానే చదివారు కాబట్టి ఆయన గురించి అల్లిన కథలు అందుకు అనుకూలంగా వుంటాయి. పోతన్న రాసిన పుస్తకాన్ని సర్వజ్ఞసింగభూపాలుడు తనకి అంకితం ఇవ్వమన్నాడని, పోతన్న అందుకు అంగీకరించక తన పుస్తకాన్ని నరాంకితం చెయ్యనని కచ్చితంగా చెప్పాడని, అంచేత సింగభూపాలుడు కోపగించి ఆ పుస్తకాన్ని పాతిపెట్టించాడని, పాతిపెట్టిన పుస్తకంలో కొన్ని భాగాలు చెదలు కొట్టేయగా తరవాత ఆయన శిష్యులు వెలిగందల నారయ, మడికి సింగన ఆ భాగాలు పూర్తి చేశారని ప్రసిద్ధంగా చెప్పుకునే కథ ఉంది. రాజాశ్రయాన్ని నిరాకరించాడు కాబట్టి పోతన్న పొలం దున్నుకుంటూ పేదరికం లోనే బతికాడని ఈ కథ చెప్తుంది. శ్రీనాథుడు ఆయన బావమరిది అని, ఆయన వచ్చి పోతన్నతో, ‘రాజాశ్రయం వొప్పుకుని సకలసంపదలతో బతకరాదా,’ అని చెబితే పోతన్న,

బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్
కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి, గహనంతరసీమల కందమూలగౌ
ద్దాలికులైన నేమి, నిజదారసుతోదరపోషణార్థమై

అన్నాడని, సరస్వతీ దేవే స్వయంగా వచ్చి కన్నీరు పెట్టుకుని కనిపిస్తే ఆవిణ్ణి ఓదారుస్తూ పోతన్న, “కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల నేడ్చెదో,” అని ఓదార్చి, “నిన్నాకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ,” అని చెప్పాడని, ప్రసిద్ధంగా చెప్తారు. ఈ కథలకి పరమార్థం భక్తికవులకి, కావ్యకవులకి ఉన్న తేడా నిష్కర్షగా చూపించడం. భక్తికవికి డబ్బక్కర్లేదు. భక్తికవి తన పుస్తకం భగవంతుడికే యిస్తాడు. పుస్తకం కవికి కన్నకూతురు అని ఇప్పటికే కావ్యసంప్రదాయం నిర్ధారణ చేసింది. ఆ ఉపమానం మరికొంత పొడిగిస్తే తన కావ్యానికి రాజుని కృతిభర్తగా చేసిన కావ్యకవి భక్తికవుల దృష్టిలో తార్పుడుకాడు అవుతాడు. అందుకే పోతన్న చెప్పాడని అనే పద్యంలో అలాంటి రాజులు ఇచ్చే డబ్బు పడుపుకూడు అవుతుంది.

పైగా పోతన్నకి సహజకవి అనే ఇంకో బిరుదు వుంది. పండితుల్లాగా శాస్త్రమర్యాదలన్నీ పాటించి నిర్దోషంగా చెప్పిన కావ్యం కూడా చివరికి సత్యాన్ని వర్ణించగలుగుతుందా? ఈ లౌకిక పాండిత్యాలు భగవంతుడికి అవసరమా? ఈ ప్రశ్నలు ఇంకా పొడిగిస్తే భక్తికవి తను తన పుస్తకానికి కర్తనని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయడు. “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట…” అని వినయంగా చెప్పి తన కర్తృత్వాన్ని నిరాకరించుకుంటాడు పోతన్న. అన్నమయ్యా ఆ పనే చేస్తాడు.

అన్నమయ్య గురించి కూడా ఇలాంటి కథే వుంది. సాళువ నరసింహరాయలు అన్నమయ్యని తన మీద ఒక పదం రచించమన్నాడని, మానవమాత్రుల మీద పదాలు రాయనని అన్నమయ్య తిరస్కరించాడని నరసింహరాయలకి కోపం వచ్చి అన్నమయ్యకి సంకెళ్ళు వేస్తే, అన్నమయ్య వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయాయని అన్నమయ్య జీవిత చరిత్ర రాసిన ఆయన మనవడు చినతిరుమలాచార్యులు మనకి చెప్పాడు.

ఈ కథలు ఇందాక చెప్పినట్లుగా భక్తికవులకి ఒక విధానం ప్రకారం జీవిత చరిత్రని నిర్మించడానికి వాళ్ళ భక్తులు చేసిన ప్రయత్నం. అంతేకాని సర్వజ్ఞసింగభూపాలుడు పుస్తకాన్ని పాతిపెట్టించేటంత దుర్మార్గుడని, అప్పటికి భాగవతానికి ఒక్కటే ప్రతి వుందని, పోతన్న నిజంగా తెలుగు, సంస్కృతము, శాస్త్ర గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు, గురుముఖతా చదువుకోలేదని, శ్రీనాథుడు అతనికి నిజంగా బావమరిది అనీ — ఈ కథలకి అర్థాలు చెప్పడానికి వీల్లేదు. ఈ కథలు ఆ కవులు రాసిన గ్రంథాల పాఠకులు, శ్రోతలు, కల్పించుకున్నారు. అంటే, ఈ పుస్తకాలలో అర్థం వల్ల వాటి కర్తృత్వం ఏర్పడిందన్న మాట. మళ్ళా ఇంకోసారి చెప్పాలంటే కవి పుస్తకాన్ని నిర్మించలేదు. పుస్తకమే కవిని నిర్మించింది.

భక్తికవుల పుస్తకాలలో భగవంతుడికి కూడా కర్తృత్వం వుండాలి. పోతన్న “అల వైకుంఠపురంబులో నగరిలో…” అన్న పద్యాన్ని మొదలుపెట్టి అది ఎలా ముగించాలో తెలియక బయటికి వ్యాహ్యాళికి వెళ్ళాడని, ఆ సమయంలో భగవంతుడే పోతన్న రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశాడని ఒక కథ చెప్తారు. ఇలాంటి కథే సర్వేశ్వరశతకం రాసిన యథావాక్కుల అన్నమయ్యని గురించి కూడా చెప్తారు. తుకారాంని గురించి కూడా ఇలాంటి కథే వుంది. భగవంతుడే తన చేత ఈ పదాలని రాయించాడని తుకారాం అంటే, అప్పటి కావ్యకవులు అతని మాటల్ని నమ్మరు. చివరి నిర్ణయం భగవంతుడికే వదిలిపెట్టాలని తుకారాం అంటాడు. అప్పటి కావ్యకవులు తుకారాం పదాలున్న పుస్తకాన్ని నది నీళ్ళలో పడేసి, అది భగవంతుడు నిజంగా అంగీకరించిన పుస్తకమే అయితే ఆ పుస్తకం పదమూడు రోజుల తరువాత నీళ్ళలో తేలాలి, అని వేళాకోళంగా అంటారు. తుకారాం భగవంతుడిని, ‘ఈ పదాలని నువ్వు రాయమంటే నేను రాశాను, నాకు నిజంగా ఏ పాండిత్యమూ లేదు, ఇవి తేలాలో మునగాలో నువ్వే నిర్ణయించు,’ అని ప్రార్థిస్తాడు. ఆశ్చర్యకరంగా పదమూడో రోజున నీటి తడి కూడా అంటకుండా ఆ పుస్తకం పైకి తేలుతుంది. ఏకనాథ్ గురించి కూడా ఇలాంటి కథే వుంది. మరాఠీ భాషలో భాగవతం రాసిన కవి ఆయన. ఆయన పుస్తకాన్ని గంగానదిలో పారేస్తే నదీదేవత స్వయంగా ఆ పుస్తకాన్ని రెండు చేతులతో పైకెత్తి తీసుకువస్తుంది.

రాజాస్థానంలో కావ్యకవి అయితే తన పుస్తకంలో పండితులు తప్పులు చూపిస్తే వాళ్ళతో వాదించి గెలవాలి. శ్రీనాథుడి లాగా తన ప్రత్యర్థి కంచుఢక్కని పగలగొట్టించాలి, కనకాభిషేకాలు చేయించుకోవాలి, గండపెండేరాలు వేయించుకోవాలి. రాజాస్థానపు కవి సాహిత్యప్రపంచంలో తన ప్రభుత్వాన్ని ప్రకటించుకుంటాడు. అతనికి కవిరాజు, కవిచక్రవర్తి, కవిసార్వభౌముడు ఇలాంటి పేర్లుంటాయి. రాజులు ఇతర రాజుల్ని కత్తి దూసి జయించినట్లే రాజకవి ఇతర కవుల్ని మాట దూసి జయిస్తాడు. రాజుది లౌకికసామ్రాజ్యం, కవిది కావ్యసామ్రాజ్యం. అందుకే రాజకవుల్ని గురించిన కథల నిండా కావ్యవివాదాలు, పండితసంఘర్షణలు వుంటాయి. ఇదే రాజకవులు తమకావ్యాలలో భక్తికవుల్లాగే భగవంతుణ్ణి వర్ణించవచ్చు. భగవత్కథలు చెప్పొచ్చు. అయినా వాళ్ళు రాజకవులు కావలసి రావడమే వాళ్ళ పాఠకులు చెప్పుకునే ఈ కథలకి ప్రయోజనం.

కృష్ణదేవరాయలని గురించి ఆయనకి అష్టదిగ్గజాలున్నారని, ఆయన వాళ్ళ మధ్య కూర్చుని సాహిత్యవ్యాసంగంలో మునిగి తేలుతుండేవాడని, మనకి నిజం కన్నా నిజం లాగా వినిపించే బోలెడు కథలున్నాయి. ఈ కథలు చరిత్రే అన్న నమ్మకంతో సాహిత్య చరిత్రకారులు ఆ అష్టదిగ్గజాలు ఎవరో రకరకాల సాక్ష్యాలతో రకరకాల జాబితాలు కూడా వేశారు. అష్టదిగ్గజాలు లేరు. తరువాతి కాలంలో పాఠకులు కల్పించుకున్న కథల్లో పుట్టారు వాళ్ళు. అయితే ఈ కథలకి వేరే ప్రయోజనం వుంది. అవి కవుల చరిత్రని చెప్పవు, సాహిత్యాభిరుచి చరిత్రని చెప్తాయి.

ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. కాళిదాసు, భవభూతి ఈ కథలో ఒక కాలం వాళ్ళు. భవభూతి తన ఉత్తరరామచరిత్రని పూర్తి చేసి తన కవిత్వం కాళిదాసుకి నచ్చుతుందో లేదో చూద్దామని తన సేవకుడి ద్వారా ఒక శ్లోకాన్ని ఆయన దగ్గరకు పంపిస్తాడు. కాళిదాసు ఆ శ్లోకాన్ని చదివి ఏమీ అనకుండా వూరుకుంటాడు. చాలా నిరాశపడిన భవభూతి, ‘కాళిదాసు ఏమీ అనలేదా, అసలు నువ్వున్నంతసేపూ ఆయన ఏమీ మాట్లాడలేదా?’ అని తన సేవకుణ్ణి గుచ్చిగుచ్చి అడుగుతాడు. ‘అయ్యా, ఆ శ్లోకం కాళిదాసుగారు చదివిన సమయంలో ఆయన ప్రియురాలు తన దూతిక ద్వారా కాళిదాసుగారికి తాంబూలం పంపించింది. ఆ తాంబూలం వేసుకుని, ఈ పద్యం చదువుతూ కాళిదాసుగారు ఇందులో కొద్దిగా సున్నం ఎక్కువయ్యింది, అని మాత్రం అన్నారండి,’ అని చెప్తాడు. భవభూతి వెంటనే తన శ్లోకంలో ఒక సున్నా యెక్కువగా వుంది అని గ్రహించి ఆ సున్నా తీసేస్తాడు. ఆ శ్లోకం ఇది.

కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్
అవిరలిత కపోలం జల్పతో రక్రమేణ
అశిథిలపరిరంభవ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రిరేవం వ్యరంసీత్

ఈ శ్లోకంలో చివరి పాదంలో ఏవం అన్న దగ్గర సున్నా తీసి చదవండి.

రాత్రిరేవ వ్యరంసీత్.

అంటే, గడిచిపోయింది రాత్రి మాత్రమే అని.

ఈ చిన్న కథ చారిత్రకం కాదని, కాళిదాసు, భవభూతి ఒక కాలం వాళ్ళు కాదని కొట్టిపారేసే ఆధునిక చరిత్రకారులు గమనించని విషయం ఒకటుంది. ఇది చరిత్ర కాదు. ఇది సాహిత్యాభిరుచి చరిత్ర అని ఇందాక అన్నాను. ఆ దృష్టితో ఈ కథని మరికొంచం జాగ్రత్తగా చూద్దాం. ఈ కథలో కాళిదాసు గొప్ప కవే కాదు, గొప్ప సహృదయుడు కూడా. తను తనతోటి కవి పద్యం లోని లోపాన్ని బండగా, ‘ఆ సున్నా తీసేయ్’ అని చెప్పకూడదు. పరోక్షంగా సూచించాలి. అలా సూచిస్తే గ్రహించగల సూక్ష్మజ్ఞానం భవభూతికి ఉంది. పైగా ఈ మాటలు చెప్తున్నప్పుడు కాళిదాసు చుట్టూ వున్న వాతావరణం పరమరమణీయమైన వాతావరణం. ఆయన తన ప్రియురాలు పంపిన తాంబూలం వేసుకుంటున్నాడు. సాహిత్యానుభవం తాంబూలచర్వణానుభవం లాంటి ఇంద్రియానుభవం. తాంబూలంలో లాగే పద్యంలో చేరిన దినుసులన్నీ సమపాళ్ళల్లో వుండాలి. ఏది యెక్కువైనా అనుభవంలో అందం దెబ్బ తింటుంది. ఇంత పరిణతమైన సాహిత్య విమర్శతో పాటు ఈ కథ ఇంకో విశేషాన్ని కూడా చెప్తుంది — కవిత్వంలో అందాల్ని ఇంకో కవే చెప్పగలడు. భవభూతి పద్యాన్ని కాళిదాసే గ్రహించగలడు.

నాయకరాజులు

భక్తికవుల్ని రాజకవుల్ని విడతీయడానికి కల్పించబడ్డ పైకథలు చూసిన తరువాత ఇంకొక రకమైన కథలు చూద్దాం.

నాయకరాజుల కాలంలో రాజే దేవుడైనాడు. ఆ కాలంలో కవుల్ని రాజకవులనాలా? భక్తికవులనాలా? ఆ కాలంలో వున్నవాడని చెప్పబడుతున్న క్షేత్రయ్యని గురించి రెండురకాల కథలూ ప్రచారంలో వున్నాయి. నిజానికి క్షేత్రయ్యని కల్పించినవి ఈ కథలే. క్షేత్రయ్య పేరుతో వున్న పదాలకి, ఆ తరవాత అలాంటి భాష లోనే కనిపిస్తున్న ఇతర పదాలకి, నిజమైన ప్రయోక్తలు వేశ్యలు. నాయకరాజుల కాలంలో వేశ్యావృత్తి సగర్వమైన వృత్తి. దీనికి సామాజికమైన ఆంక్షలు కానీ, నైతికమైన ప్రతిబంధకాలు కానీ అప్పుడు లేవు. వేశ్యలు సంగీతజ్ఞులు, రసజ్ఞులు, సాహిత్యవేత్తలు, తమ జీవితాన్ని తాము సగర్వంగా సగౌరవంగా నిర్వహించుకుంటున్న వాళ్ళు. వాళ్ళు పాడుకుంటున్న పదాలకి ఒక మొగకర్తను సమకూర్చవలసిన అవసరంలో క్షేత్రయ్య పుట్టాడని నా అనుమానం. వేశ్యావృత్తికున్న గౌరవం వెనకపడుతూ సమాజంలో ఇంకొక రకమైన ఆధిపత్యం అమల్లోకి వస్తోంది. క్షేత్రజ్ఞుడు అనే పేరుతో సుబ్బరామదీక్షితులవారు (1839-1906) సంగీతసంప్రదాయప్రదర్శినిలో9 ఒక కథ చెప్పారు.

తంజావూరు రాజైన విజయరాఘవ భూపాలుడు క్షేత్రయ్యని గొప్పగా ఆదరించి అనేక బహుమానాలు ఇవ్వడం ఆయన ఆస్థానంలో వున్న ఇతర కవులకి ఈర్ష్య కలిగించింది. మహారాజా ఇదేమిటి? ఏరా, రారా, పోరా అని పదాలు రాసే క్షేత్రయ్య మీద ఇంత గౌరవమా, ఇన్ని బహుమానాలా? అని వాళ్ళు తమ అభ్యంతరాన్ని తెలియచేస్తే క్షేత్రయ్య ఆ సంగతి విని కాంభోజిరాగంలో వదలకపోవే అనే పదం మూడో చరణం దాకా — “భామరో శకునము లడిగితి మువ్వగోపాలుడు వత్తునని కామించి నాధుల కలయు చెలులజూచి కరగి చింతనొందితి,” — చెప్పి మిగతా చరణాలని ఆస్థానకవుల్ని పూర్తి చేయమని తాను తీర్ధయాత్రకు వెళ్ళిపోతాడు. ఆస్థానంలో కవులు యెంత ప్రయత్నించినా ఆ మిగతా భాగాన్ని పూర్తి చేయలేరు. క్షేత్రయ్య తిరిగి వచ్చి “రామరామ ఈమేనితో వానిమోము చూడవలెనా మొదటిపొందే చాలు,” అని పూర్తి చేశాడట. ఇలాంటి కథే కాళిదాసుని గురించి కూడా చెప్తారు.

ఇదే క్షేత్రయ్యని గురించి విస్సా అప్పారావుగారు ఇంకో కథ10 చెప్పారు. వీరి కథలో క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఆయన కృష్ణాజిల్లా లోని మొవ్వ అనే గ్రామంలో వుండేవాడు. అతను ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆ వేశ్య మువ్వగోపాల భక్తురాలు. ఆవిడ క్షేత్రయ్య ప్రేమను తిరస్కరించి, నువ్వు ఇంతవరకూ అన్ని పదాలు రాజుల మీదే రాశావు, దేవుడి మీద రాయమని ఉపదేశిస్తుంది. క్షేత్రయ్య ధ్యాననిమజ్ఞుడై మువ్వగోపాల పదాలు పాడుతూ, స్త్రీల పట్ల తన భావాలని మార్చుకుంటాడు. ఆ తరవాత ఆ వేశ్యతో కలిసి పాటలు పాడుకుంటూ క్షేత్రాలన్నీ తిరుగుతాడు. అప్పారావు గారు చెప్పిన కథ స్థూలంగా ఇది.

ఈ రెండు కథల్లో మొదటి కథ క్షేత్రయ్యని రాజకవి చేయడానికి చెప్పిన కథ. రెండవకథ క్షేత్రయ్యని భక్తికవి చేయడానికి చెప్పిన కథ. ఈ రెండు కథలకి మధ్య బోలెడు అంతరం వుంది. మొదటి కథ చెప్పుకున్న కాలంలో వేశ్యావృత్తికి, శృంగారానికి అగౌరవం లేదు. విస్సా అప్పారావుగారి కాలం నాటికి తెలుగు మధ్యతరగతి మేధావులు శృంగారాన్ని, ముఖ్యంగా దేవుడితో కలిపిన శృంగారాన్ని ఒప్పుకోలేక పోయారు. పైగా ఈ పదాలు అప్పటికీ వేశ్యలే పాడేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ పదాలని రక్షించి, వాటిలో మరీ ఇబ్బందిగా ఉన్న పదాలని తొలగించి క్షేత్రయ్యకి ఒక భక్తుడి స్థానాన్ని కల్పించే కథలివి. అంటే పాటల్లో అర్థం మారితే పాటల కవి కూడా మారాడన్నమాట.

చాటుకవులు

ఇకపోతే చాటుకవులు. వీళ్ళని గురించిన కథలు ఎవరు చెప్పారు, ఇవి ఎంత పాతవి, ఇవి ఎలా ప్రచారం లోకి వచ్చాయ్, వీటిని గురించి బోధపరుచుకోడానికి మనం సంస్కృతం లోను, తెలుగు లోను ఇతర భారతీయభాషలు కొన్నిట్లోను ఏర్పడిన చాటుసాహిత్య ప్రపంచాన్ని పరిశీలించాలి. మనకి చాటుపద్యాలు తెలుగు లోను, సంస్కృతం లోను చాలా ప్రచారంలో వున్నాయి. వాటి గురించిన కథలు మనం చెప్పుకుంటూ వుంటాం. అవి చాలా పుస్తకాల్లో, సంకలనాల్లో కనిపిస్తూ వుంటాయి. సి. పి. బ్రౌన్ ఈ పద్యాలు సేకరించి తనకు అలవాటైన పద్ధతిలో అన్నీ కలగలిపి కొన్ని సంపుటాలుగా చేశాడని, అవి ప్రాచ్య లిఖిత గ్రంథాగారంలో వున్నాయని మనకు తెలుస్తోంది. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు చాటుపద్యమణిమంజరి సంపుటుల్లో వీటిలో కొన్నిటిని వివిధస్తబకాలుగా విభజించారు కూడా. ఇటు తెలుగు లోను, అటు తమిళం లోను వీటికి ప్రచారం చాలానే వుంది.

విజయనగర సామ్రాజ్యం ముగిసిపోయిన తరువాత సాహిత్యం పతనావస్థకి చేరిందని, అక్కణ్ణించి క్రమంగా క్షీణించి, క్షీణించి క్రమంగా చితికిపోయిందని, ఆంగ్లేయ పరిపాలన ప్రభావం తోటే తెలుగులో ఆధునికతాపునరుజ్జీవనం మొదలయ్యిందని, తెలుగు సాహిత్యకారులు చెప్తుంటారు. నిజానికి ఆ కాలంలో సాహిత్యం చితికిపోలేదు సరికదా కొత్త రకాలుగా అభివృద్ధి పొందింది. అవన్నీ వివరించే అవకాశం ఈ వ్యాసంలో నాకు లేదు కానీ చాటుపద్య ఆవిర్భావం ఆ కాలంలో వచ్చిన గొప్ప మార్పు. సాహిత్యం రాజాస్థానాల్లో నుంచి పరిణత పాఠకుల చేతుల్లోకి వచ్చిందని చెప్పడానికి ఈ చాటువులు గుర్తు. ఈ చాటువుల కర్తలు రాజాస్థానాల్లో వున్నవాళ్ళు కాదు. అయినా ఈ చాటువులు రాజాస్థానాలని మరిచిపోవు. తెలుగులో ఈ పద్యాలు నోటిమాటగా ప్రచారం లోకి వచ్చినా సంస్కృతంలో మాత్రం ఒక పుస్తకంలో చేరాయి. భల్లాలసేనుడు సంకలనం చేసిన భోజప్రబంధం చాటుపద్యాల సంకలనమే. భల్లాలసేనుడు పదహారవ శతాబ్దపు చివరివాడు.

తెలుగులో చాటుపద్యాలు చెప్పినవాళ్ళు కృష్ణదేవరాయల ఆస్థానాన్ని మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు ఆ ఆస్థానాన్ని గురించి తమ అభిప్రాయాలని చెప్పడానికి అక్కడి కవుల్నే వాడుకున్నారు. ఈ చాటు పద్యాలన్నీ ఆ ఆస్థానాల చుట్టూ తిరుగుతూ వుంటాయి. దానితోపాటు చరిత్రలో యెక్కడా లేని తెనాలి రామలింగడు అనే వ్యక్తిని ఈ చాటుపద్యాలు కల్పించాయి. కృష్ణదేవరాయలకి, పెద్దనకి, ధూర్జటికి, తెనాలి రామలింగడికి, వాళ్ళు కల్పించిన తాతాచార్యుడనే పండితుడికి ఈ కథల్లో విలక్షణమైన పాత్ర వుంటుంది.

భల్లాలసేనుడి భోజప్రబంధంలో11 కూడా కాళిదాసుకి, భవభూతికి, భోజుడికి, దండికి ఇంకా ఒకే కాలానికి చెందని కవులకి జాగా వుంటుంది. వీళ్ళనందరినీ కలిపి ఒకచోట కథలు చెప్పడంలో మనం బోధపరుచుకోవలసింది — సాహిత్యాభిరుచి రాజాస్థానాల్లో లేని, పండితప్రపంచంలో లేని, విద్యావంతులైన సామాన్యపాఠకుల చేతిలోకి వచ్చింది అని. సాహిత్యాభిరుచి మారింది అని. ఈ ప్రపంచంలో కవి పాత్ర, రాజుపాత్ర, వికటకవి అనే పేరుతో వచ్చిన కొత్తకవి పాత్ర ఎలా వుందో చూడడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను.

ఒకసారి కాళిదాసు తనకి ఎంత దగ్గర స్నేహితుడో పరీక్షించి చూద్దామనుకుని భోజుడు తన వేషం మార్చుకుని సన్యాసి రూపంలో కాళిదాసు దగ్గరికి వెళ్ళి, ‘ఇవాళ భోజుడు చచ్చిపోయాడు, నీకు తెలుసా,’ అని అంటాడు. కాళిదాసు చాలా విచారంతో-

అద్యధారా నిరాధారా నిరాధారా సరస్వతీ
పండితాః ఖండితాః సర్వే భోజరాజే దివం గతే

అని అనగానే సన్యాసి రూపంలో వున్న భోజుడు హఠాత్తుగా చచ్చిపోతాడు. చచ్చిపోయినవాడు భోజుడే అని, తన వాక్బలం వల్ల అతడు మరణించాడని గ్రహించిన కాళిదాసు వెంటనే మాట మార్చి-

అద్యధారా సదాధారా సదాధారా సరస్వతీ
పండితాః మండితాః సర్వే భోజరాజే భువం గతే

అని అనగానే భోజుడు బతికి నిలబడతాడు. ఒక్కసారి ఈ శ్లోకాల నిర్మాణం చూడండి. అవి ఒకదానికొకటి పూర్తిగా పోలి వున్నాయి. అందులో వున్న దీర్ఘాచ్చులు మీరు చదివే గొంతుకను బట్టి అటు విషాదాన్ని ఇటు సంతోషాన్ని సమానంగా వ్యక్తపరుస్తాయి. వాటిలో వుండే అక్షరస్పష్టత వల్ల సరిగ్గా కావలిసిన చోట్ల మాట మారిస్తే రెండో శ్లోకం తయారవుతుంది. ఇంత స్పష్టమైన వాక్కు యదార్థాన్ని పరిమార్చగల, మళ్ళా పునరుజ్జీవింప చేయగల ఒక వశ్యవాక్కు గొంతుక ఇది — అని చెప్తుంది.

చాటుప్రపంచంలో కవి మనుష్యాతీతమైన శక్తులు గల విశేషవ్యక్తి. ఇలాంటి చాటుకవి విశేషమైన కథ లేకుండా తయారవడు. కాళిదాసుని గురించి చాటుప్రపంచంలో ఒక కథ వుంది. కాళిదాసు మొదట్లో ఒట్టి మూర్ఖుడు. గొర్రెలు కాసుకుంటూ బతుకుతుండేవాడు. ఒక రోజున తను తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుక్కుంటున్నాడు. నిజంగా ఒక మూర్ఖుని కోసం వెతుక్కుంటూ వస్తున్న ఒక మహామంత్రికి ఈ కాళిదాసు కనపడతాడు. ‘నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు, పడి చచ్చిపోతావు సుమా,’ అని మంత్రి అతన్ని హెచ్చరిస్తాడు. పైనుంచి కాళిదాసు ‘నేను చావను, నువ్వే చస్తావు, తప్పుకో,’ అని అరుస్తాడు. వీడురా, నిజమైన మూర్ఖుడు! అని మంత్రి సంతోషించి అతన్ని కిందికి దింపుతాడు. అసలు సంగతి ఏమిటంటే, ఈ మంత్రిగారు మహారాజు కుమార్తెకి తన కుమారుణ్ణి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నాడు. కాని, సకల విద్యాపారంగతురాలు అయిన ఆవిడ మంత్రికుమారుడు తగినంత చదువుకోలేదని తిరస్కరిస్తుంది.ఆమె మీద కక్ష తీర్చుకోవడానికి ఎలాగైనా ఒక పరమమూర్ఖుణ్ణి ఇచ్చి పెళ్ళి చేయాలని మంత్రి శపథం చేస్తాడు. అందుకు తగిన పరమమూర్ఖుణ్ణి వెతుకుతుంటే మంత్రిగారికి కాళిదాసు కనిపిస్తాడు.

ఆ మూర్ఖుణ్ణి తీసికెళ్ళి మంత్రి రాజుగారితో అతను మహాపండితుడని, ఒక ప్రత్యేక కారణం వల్ల చూడటానికి మూర్ఖుళ్ళా కనిపిస్తాడని మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్ళి చేస్తాడు. ఆ రాత్రి పడకగదిలో రాజకుమార్తె తన భర్త మూర్ఖుళ్ళా నటించే పడింతుడు కాదని, నిజంగా మూర్ఖుడేనని గ్రహించి కాళిదాసుకి విద్య అనే మాట ఒక్కటి నేర్పి అర్ధరాత్రి కాళికాలయం లోకి వెళ్ళి లోపల తలుపులు వేసుకోమని చెప్తుంది. రాత్రి నగర సంచారానికి వెళ్ళిన కాళికాదేవి తెల్లవారు ఝామున తిరిగి వచ్చి తలుపు తడుతుందని, అయినా తలుపు తీయవద్దని ‘విద్య విద్య’ అని మాత్రమే అనమని చెప్పి పంపుతుంది. మూర్ఖుడైన కాళిదాసు అంత మూర్ఖంగాను వెళ్ళి కాళికాలయంలో తలుపు బిగించుకుని కూర్చుంటాడు. కాళికాదేవి తలుపు తడితే, ‘విద్య విద్య’ అని మాత్రమే అంటాడు. తెల్లవారి పోతోంది, జనం కంటపడతాను అని భయపడిన కాళికాదేవి తలుపు కొద్దిగా తెరిచి నాలిక మాత్రం బయట పెట్టమని చెప్పి కాళిదాసు నాలిక మీద బీజాక్షరాలు లిఖిస్తుంది. ఒక్కపట్టున కాళిదాసు అద్భుతమైన సంస్కృతంలో కాళీస్తవం మొదలు పెడతాడు. అలా పండితుడు, కవి అయిన కాళిదాసు ఇంటికి వచ్చి పరమానందంగా తలుపు తీయమని భార్యని అడుగుతాడు. ఆ మాటలో మార్పుని గ్రహించిన కాళిదాసు భార్య “అస్తికశ్చిద్వాగ్విశేషః” (ఈ మాటల్లో ఏదో తేడా వుంది) అని ఆశ్చర్యంతో తలుపు తీస్తుంది. ఆవిడ మాటలు సగౌరవంగా స్వీకరించిన కాళిదాసు ఆ మాటలతోటే తన మూడు కావ్యాలు మొదలు పెడతాడు. ‘అస్త్యుత్తరస్యాందిశిదేవతాత్మా’ అని కుమారసంభవము ‘అస్తి’తోనూ, ‘కశ్చిత్కాంతావిరహగురణా’ అని మేఘదూతము ‘కశ్చిత్’తోనూ, ‘వాగర్థావివసంపృక్తౌ’ అని రఘువంశము ‘వాక్’తోనూ మొదలు పెట్టి, తన భార్య మాటలకి సార్థకత కల్పిస్తాడు. కాళీవరప్రసాదం వల్ల కవి అయాడు కాబట్టి, ఆయన కావ్యాలకు మనుష్యాతీతమైన శక్తి వస్తుంది. దానితోపాటే ఆయనకి శాపానుగ్రహ శక్తి వస్తుంది.

చాటుప్రపంచంలో కవి మామూలు మనుషులకి కనిపించని (సూర్యుడికి కూడా దొరకని) విశేషాలు గమనించ గలవాడని కృష్ణదేవరాయల కాలంలో వున్న కథలు మనకి చెప్తాయి. సరిగ్గా ఇలాంటి కథలే తమిళంలో కంబన్‌ని గురించి కూడా వున్నాయి. సుమతీశతకంలో రెండు రకాలుగా ప్రచారం లోకి వచ్చిన రెండు పుస్తకాలకి కర్తలు ఎలా ఏర్పడతారో ఇంతకు పూర్వం రాసిన వ్యాసంలో వివరించాను. ఇంతకీ ఫలితార్థమేమిటంటే భారతీయ వాఙ్మయప్రపంచంలో కవి పుస్తకంలో అర్థాన్ని బట్టి యేర్పడతాడు. పుస్తకంలో అర్థం మారితే కవి మారతాడు. అంటే కవి పుస్తకాన్ని రాయడు. పుస్తకమే కవిని రాస్తుంది.

అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని, సంస్కృత సాహిత్యం కాని, ఇంకా చాలా ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు. నిజానికి నూటికి తొంభై పాళ్ళు ఆ పేరు ఉన్న వ్యక్తే ఆ పుస్తకాన్ని రాసి వుండవచ్చు. కాని అది కాదు మనకి ప్రధానం. అందుకే మనకి కవుల జీవిత చరిత్రలు లేవు. కవుల కథలే ఉన్నాయి. నన్నయ ఎప్పుడు పుట్టాడు, ఎవరి దగ్గర పని చేశాడు, ఎవరితో దెబ్బలాడాడు, ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆయన ఎలా వుండేవాడు, ఎలా బతికాడు, ఎలా మరణించాడు, ఆయనకీ రాజరాజనరేంద్రుడికీ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలా వుండేవి? అనేవి మనకి తెలియవు. తెలియాలని మనం కోరుకోలేదు కూడా. మనకి కావలిసింది నిజజీవితంలో నన్నయ కాదు, భారతం గౌరవప్రదమైన పుస్తకం కావడానికి తోడ్పడే నన్నయ. మన మనస్సులో ఆ నన్నయ ‘నిత్య సత్యవచనుడు, మత్యమరాధిపాచార్యుడు,’ అంతే. అప్పకవి వొచ్చి నన్నయ అసూయతో భీమకవి రాసిన రాఘవపాండవీయాన్ని అణగదొక్కాడంటే, మనం ఒప్పుకోలేకపోయాం, మనకి నన్నయ అలాంటి పని చెయ్యడని నమ్మకంగా తెలిసినట్టు. హైదరాదు టాంక్ బండ్ మీద వున్న నన్నయ మన ఊహలకి తగినట్టుగా మనం తలపించుకున్న ఆకారం.

పుస్తకం అంటే ఏమిటి?

ఇక్కడ ఆగి, అసలు పుస్తకం అంటే ఏమిటో చూద్దాం. గత రెండు వందల సంవత్సరాలుగా ఒక కవి పేరుతో కనిపించిన లిఖితప్రతులన్నీ ఎక్కడెక్కడివీ వెతికి సంపాదించి అవి దొరికిన చోట్లేమిటి, వాటిని వాడిన వాళ్ళు ఎలా వాడారు, వాటి పఠన సంప్రదాయాలేమిటి, అనే వాటితో సంబంధం లేకుండా అన్నీ గుదిగుచ్చి వాటి పాఠాలు తైపారు వేసి అక్షరదోషాల్ని, పునరుక్తుల్ని, వ్యాకరణం లోని లోపాల్ని సవరించి ఒక నిర్దుష్టమైన పరిశోధిత ప్రతిని (Urtext) తయారు చేయడం మనం పాశ్చాత్యుల నుండి నేర్చుకున్నాం. మహాభారతానికి పూనా ప్రతి, రామాయణానికి బరోడా ప్రతి ఇలా తయారయినవే. తెలుగులో ఇదే పద్ధతుల్లో ఈ ఉద్ధరణ కార్యక్రమం నిర్వహించినవాడు సి.పి. బ్రౌన్.

మౌఖిక వ్యవహారానికి (orality) లిఖిత వ్యవహారానికి (literacy) పెద్ద అగడ్త ఉందని చూపించి, ఆ పద్ధతిలో చాలా శ్రద్ధగా, వివరంగా పరిశ్రమించి కృషి చేయటం పాశ్చ్యాత్యదేశాల్లో ఒక చిన్న సైజు పరిశ్రమ లాగా కొనసాగింది. దానికన్నా భిన్నంగా భారతీయభాషల్లో ఒక విలక్షణమైన వాగ్వ్యవహారం యేర్పడిందని చూపిస్తాను. భారతదేశంలో భాషలకు అక్షరత్వం లేఖనం రాకముందే యేర్పడింది. వీటికే వర్ణాలని పేరు. సంస్కృతవర్ణసమామ్నాయం ధ్వనుల స్ఫుటీకరణ వల్ల వాగ్రూపం లోనే ఏర్పడింది. ఆ వర్ణాలకి లిఖితరూపం ఇవ్వడం తర్వాత జరిగింది. పాణిని వాడిన మాహేశ్వర సూత్రాలు;

అ ఇ ఉ (ణ్)
ఋ లు (క్)
ఏ ఓ (ణ్)
ఐ ఔ (చ్)
హ య వ ర (ట్)
ల (ణ్)
ఞ మ ఙ ణ న (మ్)
ఝ భ (ఞ్)
ఘ ఢ ధ (ష్)
జ బ గ డ ద (శ్)
ఖ ఫ చ ఠ థ చ ట త (వ్)
క ప (య్)
శ ష స (ర్)
హ (ల్)

అనేవి ధ్వని రూపంలోనే ప్రకటితమయ్యాయి. ఇతర భారతీయ భాషలు కూడా ఇదే వరసలో అ ఆ ఇ ఈ అనే వర్ణ క్రమం చెప్పుకుంటాయి. తెలుగులో గుణింతం చెప్పేటప్పుడు కకారఅకారాలు క, కకారఆకారాలు కా, కకారఇకారాలు కి, కకారఈకారాలు కీ అని చెప్పేవారు. (రాయడం అలవాటు చెయ్యడానికి, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు, కకు గుడిస్తే కి అని చెప్పడం తరవాత కాలంలో వొచ్చింది.) ఉదాహరణకి, ఈ కింద భారతీయభాషల్లో హిందీకి, తెలుగుకీ వర్ణాలు ఒకే క్రమంలో వుండటం చూడచ్చు.

ఈ ధ్వనులకి ఏ రకమైన లిఖితరూపానైన్నా జోడించుకోవచ్చు. సంస్కృతాన్ని భారతీయభాషల్లో అనేక లిపుల్లో రాస్తారు. సంస్కృతానికి తనదైన లిపి అంటూ ఒకటి లేదు. నాగరలిపికి నాగరి ప్రచారణ సభ వాళ్ళ ప్రచారం వల్ల ప్రాధాన్యత వచ్చింది కానీ ఇప్పటికీ తెలుగువాళ్ళు తెలుగు లిపి లోనే సంస్కృతం రాస్తారు, చదువుతారు. అలాగే కన్నడంవాళ్ళు కన్నడ లిపిలో, వంగదేశీయులు వంగ లిపిలో సంస్కృతం చదువుతారు. ధ్వనికీ, లిపికీ వున్న సంబంధం ఇది: ధ్వని ముందు, లిపి తరువాత ఏర్పడింది. అందుచేత తెలుగులో రాయడానికి, పాండిత్యానికి మధ్య వున్న సంబంధం అవిభాజ్యమైనది కాదు. తెలుగులోను సంస్కృతంలోను స్వయంగా రాయటం నేర్చుకోనక్కర లేకుండా పండితుడవడం సాధ్యం. ఇంతకు ముందు నేనింకొక చోట చెప్పినట్లుగా తెలుగులో రాయడం అంటే రచన చేయడం అనే అర్థం ఈ మధ్యకాలం లోనే వచ్చింది. అంతకు ముందు రాయడం అంటే చూచి ఇంకొక ప్రతి రాయడం, లేదా బొమ్మ గీయడం. కవులకి రాయసకాళ్ళు వేరే వుండేవాళ్ళు. పుస్తకానికి ప్రతులు రాసేవాళ్ళు రాయసకాళ్ళు. బొమ్మలు గీసేవాళ్ళు కూడా రాయసకాళ్ళే. కాళహస్తిలో కలంకారీ బొమ్మలు గీసే వాళ్ళు ఉండేవీధికి రాతపనివీధి అనే పేరు ఇప్పటికీ వుంది. మన కవులు పుస్తకాలు చేశారు, చెప్పారు, నిర్మించారు, అల్లారు, కట్టారు. కానీ రాయలేదు. ఆ పని రాయసకాళ్ళు చేశారు. (ఇంతకు ముందు వరకూ ఈ వ్యాసంలో రాయడం అనే క్రియ రచించు అనే అర్థంలో మన ఇప్పటి అలవాటుని గౌరవిస్తూ వాడాను.) దీన్ని బట్టి మనకి రెండు రకాల వాగ్వ్యవహారాలున్నాయి. ఒకటి సాక్షరమైన వాగ్వ్యవహారం, ఇంకొకటి నిరక్షరమైన వాగ్వ్యవహారం. అంటే ఒక రకంగా చదువుకున్న పండితులు, చదువురాని వాళ్ళు కూడా వాగ్వ్యవహారం లోనే వుండేవారు. కావ్యాలని వర్గీకరించిన దండి, భామహుడు దృశ్యకావ్యాలు, శ్రవ్యకావ్యాలు అని కావ్యానికి రెండే విభాగాలు చేశారు. మొన్నమొన్నటి వరకు చదవటం అంటే పైకి చదవటమే. పైకి చదవందే పద్యానికి అస్తిత్వం లేదు. సంస్కృతంలో బహుశ్రుతుడు అంటే పండితుడు అని అర్థం. అంటే చాలా విన్నవాడు అని.

మహాభారతం, రామాయణం లాంటి పుస్తకాలు చదివినా, అమరుశతకంలో శ్లోకం ఒకటొకటి చదివినా, అన్నీ పైకే చదివారు. అచ్చు రాకముందు చదవడమంటే పైకి చదవడమే. తాటాకు మీద ఉన్నా, భూర్జపత్రం మీద ఉన్నా, లిఖితమైన ప్రతి తరవాత పైకి చదవడం కోసం రాసిందే. అంటే, మనకి రెండు రకాల ‘పుస్తకాలు’ ఉన్నాయన్న మాట. ఒకటి, లిఖిత పుస్తకం, రెండోది శ్రవ్య పుస్తకం. ఈ శ్రవ్య పుస్తకం ఒక వ్యక్తి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరొక తరానికి శ్రవ్యంగానే అందింది. అది అలా ఉండగా, లిఖిత పుస్తకం లిఖితంగానే ఒక తరం నుంచి మరొక తరానికి అందింది. పుస్తకం ఎలా చదవాలో తెలియని వాళ్ళు ఎప్పుడూ లిఖిత పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని తిన్నగా చదివెయ్యలేదు. అంటే, ఆధునిక కాలంలో నవల లాగా లైబ్రరీ నుంచో పుస్తకాల షాపు నుంచో తెచ్చి పుస్తకం తెరిచి చదివేయడం మొదలు పెట్టలేదు. ఈ సంగతి తెలుసుకుంటే మనకు రాతలో విరామ చిహ్నాలు ఎందుకు అవసరం లేకపోయాయో బోధపడుతుంది. పద్యం ఎక్కడ ఆపాలో, ఎలా విరవాలో, ఎలా పూర్తి చేయాలో తెలుసుకోక ముందు పద్యాన్ని ఎవరూ ఎప్పుడూ చదవలేదు. అందుచేత మనకి ఫుల్‌స్టాపులు, కామాలు, సెమీ కోలన్లు అక్కర లేకపోయాయి. (నిజానికి పాశ్చాత్య పుస్తకాలకీ అక్కర లేకపోయాయి. ఆ సంగతి పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజు చెప్తారు.)

మళ్ళా క్లుప్తంగా చెప్పాలంటే, మనకు పుస్తకాలు రెండు మార్గాలలో ప్రచారమయ్యాయి. ఒకటి, లిఖిత మార్గం, రెండవది శ్రవ్య మార్గం. రెండూ సమాంతరంగా నడిచాయి. పుస్తకం చదవక ముందు అది ఎలా చదవాలో ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి కాబట్టి లిఖిత పుస్తకాన్ని పాఠకుడు తిరిగి పునర్నిర్మిస్తాడన్నమాట, అవసరమైతే మధ్యమధ్యలో తన వ్యాఖ్యానాలు కూడా జోడించి. భారత రామాయణాల లాంటి పెద్ద పుస్తకాలైతే, మొదటి ఆకు (పేజీ) నుంచి మొదలు పెట్టి చివరి ఆకు దాకా వరసగా ఎవరూ ఎప్పుడూ చదవరు. అందులో కొన్ని భాగాలు తీసి వాటికి వేరే మొదలు ఏర్పాటు చేసి, ఇంకొక చివర ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక గ్రంథాన్ని పాఠకుడు తయారు చేస్తాడు. ఇలా చూస్తే, చదువుతున్న ప్రతిసారి లిఖిత పుస్తకం నుంచి శ్రవ్య పుస్తకం ఎప్పటికప్పుడు తయారవుతుంది అన్నమాట. ఈ విషయాన్ని పై బొమ్మలో చూడవచ్చు.

ఇలా లిఖిత గ్రంథం నుంచి శ్రవ్య గ్రంథం (దీనినే స్వీకృత గ్రంథం అని కూడా అనవచ్చు) ఏర్పడే సంప్రదాయం అచ్చుయంత్రం వల్ల, ఆధునిక విద్యల వల్ల దెబ్బ తింది. మనకు ఇప్పుడు అచ్చులో వందలకొద్దీ పుస్తకాలు కనిపిస్తాయి. కానీ, అవి లిఖిత గ్రంథాలు మాత్రమే. వాటి శ్రవ్య రూపాలు ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, అక్కడక్కడా. కానీ మనకు వాళ్ళ మీద ఆదరణ లేదు.

ఈ సంగతి 12వ శతాబ్దంలోనే గమనించాడనుకుంటాను శ్రీహర్షుడు, నైషధీయచరితంలో చివర ఇలా రాశాడు.

గ్రంథగ్రంథి క్వచిత్క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా
ప్రాజ్ఞమ్మన్యమనా హఠేన పఠితీ మా ఽస్మిన్ఖలః ఖేలతు
శద్ధారాద్ధగురుశ్లథీకృతదృఢగ్రంథిస్సమాసాదయ
త్వేతకావ్యరసోర్మిమజ్జనసుఖవ్యాసజ్జనం సజ్జనః

ఈ అసాధ్య సుందరమైన ఈ శ్లోకాన్ని అనువదించే ప్రయత్నం చెయ్యను. దీని తాత్పర్యం ఏమిటంటే — ఇందులో ప్రయత్నించి మరీ కొన్ని పీటముడులు వేశాను. సమర్థుడు కాని వాడెవడూ, తాను పండితుణ్ణనే గర్వంతో ఇందులో వీలు పెట్టకుండా వుండడానికి. శ్రద్ధగా గురువు దగ్గిర నేర్చుకున్న సజ్జనుడు, ఆయన సహాయంతో ఆ ముడులు విప్పి, ఈ కావ్యరసడోలికల్లో ఓలలాడు గాక.

లిఖిత గ్రంథమే మిగిలి, శ్రవ్య గ్రంథం నశించిపోయిన స్థితిలో, గ్రంథమంతా లిఖిత గ్రంథమే అనుకుని దానితోటే మన గ్రంథ పరిష్కరణ కొనసాగించి నందువల్ల ఆధునిక కాలంలో ఎన్ని నష్టాలు వచ్చాయో చెప్పడానికి నాకిక్కడ అవకాశం చాలదు. నేను చెప్పదలచుకున్న దేమిటంటే –

పుస్తకాలు ఒక్కొక్కటీ వేరు వేరుగా ఉండవు. అనేక పుస్తకాలు ఒక చిన్న సమాజంగా ఏర్పడతాయి. ఆ పుస్తకాల లాగే, ఆ పుస్తకాలు చదివే వాళ్ళు కూడా ఒక సమాజంగా ఏర్పడతారు. ఈ పుస్తకపఠితృ సమాజాలకి పుస్తక కర్తకున్నంత స్వామ్యం ఉంటుంది. అందుకే వాళ్ళు పుస్తక పాఠాలలో చేర్చే మార్పులు పుస్తక కర్త చేసిన మార్పుల లాగా అంగీకరించ బడతాయి. పుస్తకపఠితృ సమాజం పుస్తకానికి వేరే అర్థం ఇస్తే ఆ అర్థాన్ని ప్రతిబింబించే కవి ఆ పుస్తకానికి కర్త అవుతాడు. పుస్తకపఠితృ సమాజం నిష్కర్షగా, చాలా కొద్దిమంది ఏ మార్పులూ లేకుండా కొనసాగితే, ఆ పుస్తకం కూడా అలాగే ఏ మార్పులు లేకుండా కొనసాగుతుంది. ఉదా. పాణిని వ్యాకరణం, పతంజలి మహాభాష్యం, మొదలైనవి ఇలాంటివి. కానీ పుస్తకపఠితృ సమాజం విస్తారమైనదై దేశమంతా వ్యాపిస్తే ఆ పుస్తకాలలో మార్పులు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి.

గ్రంథాలకి కర్తలే కాకుండా చరిత్రలు వుంటాయి. సంస్కారాలు ఉంటాయి. చావు పుట్టుకలు ఉంటాయి. పునర్జన్మలుంటాయి. ఇవి ఏదో వేరే దొరికే వస్తువులు కావు. వాటి కర్తలకి యథార్థమైన జీవిత చరిత్రలుండవు. కాలంతో మారుతున్న వారి జీవిత చరిత్రల అయథార్థత్వమే పుస్తకాలకు ప్రాణం పోస్తుంది. అంటే పుస్తకాలు, వాటిని చదివే సమాజాలకి ప్రతిబింబాలు.

ఈ పరిస్థితి దాదాపు ఆధునికత మొదలవుతున్న రోజుల నుంచి మారడం మొదలు పెట్టింది. ఒక రకంగా అదే ఆధునికతకి గుర్తు. ఆధునిక కాలంలో పుస్తక రచయితకీ (ఈ మాట ఆధునిక కాలంలోనే అవసరమై కల్పించుకున్న కొత్త్త మాట) పుస్తకానికి వున్న సంబంధం ఎలా మారిందో ఇంకో వ్యాసంలో చెప్తాను.

(ఈ వ్యాసం నేను ఎమొరీలో, షికాగోలో, బ్రౌన్‌లో, యేల్‌లో ఇచ్చిన ఉపన్యాసాలకి లిఖిత రూపం. ఇది ఉపన్యాసంగా రాయబడింది కాబట్టి దీనికి ఆచూకీలు చూపించే పాదసూచికలు లేవు. ఎక్కడైనా, వాక్యాల తప్పులు కూడా వుండచ్చు. – నారా.)

(పాదసూచికలు మే 3వ తేదీ జత చేయబడ్డాయి – సం.)


  1. వాల్మీకి. శ్రీమద్రామాయణం, వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు. హైదరాబాదు; ఆర్ష విజ్ఞాన ట్రస్టు; 1987; 1-15.
  2. పైదే; 1-16.
  3. ఈ కథే ఈదులపల్లి భవానీశకవి ధర్మఖండము (శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాశాల, పిఠాపురం, 1931) అనే పుస్తకంలో కూడా వుంది. భవానీశకవి సుమారు 1660-1700 ప్రాంతం వాడు.
  4. రఘునాథ నాయకుడు; వాల్మీకి చరిత్రము, పరిష్కర్త బి. రామరాజు; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు; 2008.
  5. రాజస ప్రవృత్తి కలవాళ్ళు ఏ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకుండా, “అయధావత్” గ్రహిస్తారు. భగవద్గీత 18-31.
  6. ఈ సందర్భంలో తప్పకుండా చదవవలసిన రెండు ఇంగ్లీషు ప్రచురణలు; David Perkins, Is Literary History Possible?, The Johns Hopkins University Press; 1993. Michael Foucault, What Is an Author? (1969), in: Donald F. Bouchard (Ed.); Language, Counter – Memory, Practice: Selected Essays and Interviews by Michel Foucault. Ithaca/ New York: Cornell UP, 1977: 113 -138.
  7. ధ్వన్యాలోకం – తృతీయోద్యోతం.
  8. రసగంగాధరం – ప్రథమాననం.
  9. సుబ్బరామదీక్షితులు; సంగీత సంప్రదాయ ప్రదర్శిని; మొదటి సంపుటం; రెండవ ముద్రణ; ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి, హైదరాబాదు; 1973 (మొదటి ముద్రణ తేదీ లేదు); పే. 9-10.
  10. విస్సా అప్పారావు (సం); క్షేత్రయ్య పదములు; సరస్వతీ పవర్ ప్రెస్; రాజమహేంద్రవరము; 1963 (మొదటి ముద్రణ 1950).
  11. భల్లాలదేవ; భోజప్రబంధ; నిరణ్య సాగర్ ప్రెస్, 1932.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...