[ఈ వ్యాసంలో వేరువేరు చిత్రకారులు స్త్రీని వెలయాలిగా, ప్రేయసిగా, భార్యగా, పనికత్తెగా, స్వత్రంత్రవ్యక్తిగా, భయగ్రస్తగా, రోగిగా, మనసు క్రుంగిన వ్యక్తిగా, భ్రష్టురాలిగా, పరిశుద్ధగా, అసాంప్రదాయక బొహీమియన్‌గా — ఇంకా రకరకాలుగా, చిత్రించిన చిత్రాలని గురించి ముచ్చటించాను. ఈ ముచ్చట పైన చెప్పిన వరుస క్రమంలో చెయ్యలేదు సరిగదా కాలక్రమానుసారంగా కూడా చెయ్యలేదు. కొన్ని దిగంబర స్త్రీ చిత్రాలు విధిగా పరిశీలించడం అవసరమయ్యింది. అలాగే కొన్ని ప్రసిద్ధ చిత్రాలలో స్త్రీ ని హింసాత్మకంగా చిత్రించడం అవసరమా? అనే వాదన కూడా చేశాను.
మరొక్క విషయం. ఇందులో నా అభిప్రాయాలకి ఆధారం: చిత్రకళపై గత పాతిక సంవత్సరాలలో నేను చదివిన విమర్శ వ్యాసాలు, పుస్తకాలలో విషయాలు, నా మనసులో జ్ఞాపకాలుగా మిగిలినవి. మరి కొన్ని అభిప్రాయాలు, విమర్శలు చదివిన తరువాత, పేరు మోసిన చిత్రాలని మ్యూజియములలో స్వయంగా చూసిన తరువాత, కొద్దిమంది చిత్రకళాధ్యాపకుల, విమర్శకుల ఉపన్యాసాలు విన్న తరువాత ఏర్పడినవి. ఆఖరిగా ఈ బొమ్మ నచ్చింది, ఆ బొమ్మ నచ్చలేదు అని చెప్పడం ఎవరికైనా తేలికే. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని ఎవరైనా నిలదీస్తే వచ్చే సమాధానం నిష్పాక్షికంగా ఉండదు. నా విషయంలోనూ అంతే. నా వ్యాఖ్యానాల విషయంలోనూ అంతే. ముఖ్యంగా కొన్ని చిత్రాలు — యూరోపియన్ పద్ధతిలో స్త్రీరూప ఆకృతికి నైరూప్యతని మిళితం చేసి గీసిన చిత్రాలు — వీటిపై నా అభిప్రాయాలు కొన్ని ఇప్పుడు వివాదగ్రస్తంగా కనిపించవచ్చు. వివాదగ్రస్తమైన పాక్షికాభిప్రాయాలకి పూర్తి బాధ్యత నాదే. – వేవేరా.]
అన్‌టైటిల్డ్ – ఎస్.వి.రామారావు (2012)
చిత్రకళ చరిత్రలో వేర్వేరు చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాల గురించి, తోడుగా సాంఘికంగా స్త్రీకిచ్చిన స్థానం గురించి చర్చించడం ఏ కాలంలో నైనా ఆకర్షణీయమయిన విషయం. ప్రస్తుతం కాలంలో ఈ చర్చ సందర్భోచితం, ముఖ్యం కూడాను. కారణం: ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో సామాజిక సమానతపై, హక్కులపై, లైంగిక స్వాతంత్ర్యంపై, స్త్రీవాద సాహిత్యం ముమ్మరంగా వచ్చింది. ఇంకా వస్తూనే వున్నది. అయితే, దృశ్యపరంగా స్తీలపై సమాజానికున్న అవగాహన, సాహిత్యం ద్వారా గ్రహించలేం. ఎంత జాగ్రత్తగా పరిశోధించి రాసినా, ఒక వ్యక్తిగా, లేదా సాధారణ సామూహిక చిహ్నంగా, స్త్రీ పై సమాజానికున్న ధోరణి అసంపూర్తిగానే బోధపడుతుంది. వరుసగా స్త్రీరూప చిత్రాలు పరిశీలిస్తే వివిధ దృష్టికోణాలు, వైఖరులను చిత్రకళ ప్రదర్శించినట్టుగా సాహిత్యం ప్రదర్శించలేదు. అందుచేత, ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తిని విశదీకరించిన విధానం విచారించడం వలన మన దృక్పథంలో మార్పు రావచ్చు. మాటవరసకి మార్పు రాదనుకుందాం; కనీస పక్షంగా, ఇంతకు ముందు మనకు స్థిరపడ్డ అభిప్రాయలతో పోల్చి చూడటానికి కావలసిన ‘కొత్త’ విషయాలు తెలుస్తాయి.
ఈ సందర్భంలో విచారించవలసిన మరొక విషయం: పరిశీలించవలసిన చిత్రాలు, ప్రతిమలూ కోకొల్లలు. అందుకని, ఆధునిక చిత్రకళలో బొమ్మలనే ప్రస్తావించు దామనుకుంటున్నాను. ఆధునిక అనగానే, సాధారణంగా కొత్తదనం, వైరుధ్యం, ప్రదర్శించిన చిత్రకళే అన్న అభిప్రాయం విమర్శకులలో పాతుకొని పోయి ఉన్నది. ఈ వైఖరి అవ్యక్తమైనదని నిరాఘాటంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఏ కాలంలో వచ్చిన కొత్త బొమ్మలు ఆ కాలానికి ‘ఆధునిక’ చిత్రాలే! అంతే కాదు. ఒక ప్రత్యేక చిత్రకళా పద్ధతి అప్పటి సమాజానికి నూతన విషయాలు చూపగలిగితే, అప్పటి సమాజం ఆ కొత్తదనాన్ని ఆస్వాదించి ఆమోదించ గలిగితే, ఆ చిత్రకళ ఆధునికమని ఒప్పుకోవచ్చు.
మడొనా అండ్ ఛైల్డ్ – ఎప్‌స్టీన్(1950-52)
ఏది ఏమయినా, వివాదాలలోకి పోకుండా, గత రెండు శతాబ్దాలలో ప్రసిద్ధ చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాలని ఎంచుకొని, వాటిని గురించి చర్చిస్తాను. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు అని ఎందుకన్నానంటే, 1. వీళ్ళు వేసిన చిత్రాలు చూడటానికి తేలికగా లభిస్తాయి, 2. ఈ చిత్రాల చిత్రణ వెనుక ఉన్న కథ, వాటికి అనువైన మద్దతు, మ్యూజియములు, చిత్రకళా విమర్శకులు, చిత్రకళా పోషకులు మనకు తెలియపరచబట్టి. అందుచేత, ఆ చిత్రాలు మాత్రమే గొప్పవీ, విశ్లేషించదగినవీ అన్న అభిప్రాయాన్ని నేను సమర్థించటం లేదు. చిత్రకారులు మగవారు కావచ్చు; ఆడవారు కావచ్చు. ఈ లింగభేదం అప్రస్తుతం కాదు కాని, ప్రధానం కూడా కాదు. ముఖ్యంగా చూడవలసిన విషయం: ఫలానా చిత్రం స్త్రీ పరంగా ఏ విధమైన ప్రతిపాదన(లు) చేసింది? స్త్రీ పరంగా ఏ విధమైన వివరణ(లు) చేసింది? ఈ రెండూ ఈ వ్యాసానికి ముఖ్య అంశాలు.
లింగభేద సమస్య, సమస్య కాదనడానికి ఉదాహరణగా పికాసో (Pablo Picasso, 1881-1973) గీసిన Girl Before A Mirror (1932) చిత్రం చూద్దాం. ఈ చిత్రం పురుషులే చూడదగిన చిత్రం కాదు. గొప్ప చిత్రకారులు స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని చిత్రంలో చిక్కబట్టి చూపగలరు. ఈ చిత్రాన్ని గురించి మరొకచోట చర్చించుతాను. ఇందుకు ప్రతిగా కొందరు పురుష చిత్రకారులు ఎంత ప్రయత్నించినా స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని బొమ్మలో చూపలేరు. అల్లాగే, మరికొందరు స్త్రీ చిత్రకారులు పురుషుని అంతర్గత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని బొమ్మలో ఇమడ్చలేరు. ఇటువంటి చిత్రాలు ఉన్నాయి; అవి చిత్రాలుగా గమనించదగ్గవి కావు, అని నా అభిప్రాయం.
ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధునిక చిత్రాలు చారిత్రిక ప్రతీకల నుండి వేరుచేసి బోధ పరచుకొనేవి కావు. మానవుని ఊహ, భావన, కల్పన, ఎన్నో కల్పాల గుర్తులని, జ్ఞాపకాలనీ ప్రతిబింబించుతుంది. అందుకనే కాబోలు, ఇప్పటికీ వీనస్ (Venus of Willendorf c. 15,000-10,000 B.C) శిల్పంలో స్త్రీ మూర్తిత్వాన్ని, కాదు! స్త్రీత్వాన్ని మనిషి చూడగలుగుతున్నాడు.
భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం (physical anthropology) లైంగిక పరంగా సృష్టిలో స్త్రీ పురుషుల రెండు ఆకారాల (dimorphism) మధ్య విభేదాలను స్పష్టపరుస్తుంది. అందుకనే కాబోలు, ఏ మ్యూజియంలోనైనా చూడండి: ముఖ్యంగా పాలరాతి శిలాప్రతిమలు చూడండి. పురుషులు దృఢంగా బలిసిన కండరాలతోను, కొట్టవచ్చే గడ్డం తోను (ఒక్కొక్క సారి వెండ్రుకల్తో నిండిన గడ్డం), స్త్రీ ప్రతిమలు — ముఖ్యంగా వారి ముఖకవళికలలో — ఎంతో సౌమ్యత, మెత్తదనం, చక్కని పొడుగాటి ముక్కు, వగైరాతో ఒకే రకంగా కనిపిస్తారు. అన్ని స్త్రీ ప్రతిమల్లోనూ ముఖాకారం కోడిగుడ్డులా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఏ విధమయిన భేదమూ, ఏ శిలా ప్రతిమ లోనైనా సరే, ఎంత వెతికినా కూడా కనిపించదు. ఇంకా విపులంగా చెప్పాలంటే, ప్రతి కోడిపెట్టకీ అన్ని కోడిగుడ్లూ ఒకేలా కనపడినట్లు! మనిషిని చూసి అదేరకంగా చిత్రాలు గీసేవారి (portrait painters) చిత్రాలలో, శిలాప్రతిమలు తయారు చేసేవారి ప్రతిమలలో కూడా, స్త్రీ మూర్తిమత్వ విశిష్టత పూర్తిగా లోపిస్తుంది. అందరినీ ఒకే రకంగా చిత్రించడం చేత, వ్యక్తిత్వం మరుగున పడిపోతుందని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. చూడండి: మోనా లీసా చిత్రంలో, ఆ పెదాలపై చిరునవ్వు మీద వందలకొద్దీ పేజీల విమర్శనా సాహిత్యం దొరుకుతుంది. అంటే అసలు అర్థం: బొమ్మలో స్త్రీమూర్తిమత్వ విశిష్టత లోపించబట్టే విమర్శకులు పురాణాలు రాశారని అనవచ్చు.
ఇది పూర్వకథ.
పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దాల చిత్రకళ చరిత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్త్రీ మూర్తి చిత్రవర్ణన పరిధి పెరిగింది. స్త్రీ కున్న ప్రత్యేక లక్షణాలని నిరూపణ చెయ్యటానికి ఆస్కారం లభించింది. కేవలం భౌతిక లక్షణాలే కాకుండా ఇతర వ్యక్తిగత లక్షణాలని చిత్రించే సభ్యత, స్వాతంత్ర్యం చిత్రకారులకి కలిగింది. ఇందుకు కారణం చిత్రకారుడు భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం సృష్టించిన లైంగికభేదాలకి కట్టుబడి ఉండనవసరం లేకపోవడం. అంతే కాకుండా, సాహిత్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన రొమాంటిసిజమ్, సింబాలిజమ్ వంటి విప్లవాలు వ్యక్తి అంతర్గత జీవితాన్ని మరింత శ్రద్ధగా పరిశీలించటానికి వెసులుబాటు కల్పించాయి.
ఇరవయ్యో శతాబ్దంలో చిత్రకారుడు స్త్రీ భౌతిక లక్షణాలని అణగదొక్కటం (suppression), ఒక్కొక్కసారి విస్తరించి చిత్రించటం (exaggeration), వక్రీకరించి, కొన్నిచోట్ల వికృతీకరించి (distortion) చిత్రించే ‘అధికారం’ చేజిక్కించుకొన్నాడు. స్త్రీ మానసిక తత్వాన్ని, మానసిక నైజాన్ని వివరించే చిత్రణ మొదలయ్యింది. అంతే కాదు. 1839లో ఫొటొగ్రఫీ బాగా పుంజుకున్నది. ఈ ప్రక్రియ, చిత్రకళకి అవసానదశ వచ్చిందనే భయాన్ని కలిగించింది. ఈ ఫొటోగ్రఫీ తెచ్చిపెట్టిన భయంతో, పాతకాలపు దృశ్యమాన స్వరూప చిత్రణ నుంచి విడిపడి చిత్రకళ ఒక విపరీత స్వేచ్చని కౌగలించుకుంది. చిత్రకారుడు, కంటికీ కేమెరా భూతద్దానికీ చిక్కని మానసిక నైజాలని కుంచె ద్వారా వివరించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ సందర్భంలో చిత్రకారుడు స్త్రీ ముఖచిత్రణలో వైపరీత్య పూరణకి పూనుకున్నాడు. అంతర్గత జీవన చిత్రణలో వికృతీకరణావశ్యకత అనివార్యమయ్యింది.
చిత్రకళలో ఆధునికత మిణుకు మిణుకుగా పదిహేడవ శతాబ్దంలోనే పొడచూపింది. రెంబ్రాంట్ (Rembrandt Van Rijn, 1606-69) నిజంగా ఆధునికుడు కాదు. అయినా, అతను వేసిన స్త్రీ చిత్రాలలో ఆధునికత చూచాయగా కనిపిస్తుంది. ఉదాహరణకి అతను చిత్రించిన Bathsheba (1654) చిత్రం చూడండి. సాధారణ స్త్రీ రూపం పైకి కనిపిస్తుంది. వైవాహిక పరంగా తప్పని పాతివ్రత్యం, అందుకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన పరపురుషుని ఆకర్షణల మధ్య తీవ్రంగా ఆలోచన చేసే అసాధారణ వ్యక్తిత్వం ఈ చిత్రంలో సూచనగా కనిపిస్తుంది. బాత్‌షెబా ముఖంలో ముందేమి జరగబోతున్నదో తెలిసిన ఆందోళన కనిపిస్తున్నది. స్త్రీ మానసిక స్థితి, బైబిల్ కథనం వాక్యాల మధ్యలో ఇమిడి వున్న భావన,రెండూ చదివిన చిత్రకారుడు రెంబ్రాంట్ అన్న విషయం స్ఫురణకి రాక మానదు.
కాథే కోల్‌విట్జ్ (Kathe Kollwitz, 1865-1945) 1905లో చేసిన Nude లితోగ్రాఫ్ చూడండి. ఈమె, రెంబ్రాంట్ సంప్రదాయంలో చిత్రకళోపాసన చేసిన చిత్రకారిణి. ఈమె సామ్యవాది. ఈ చిత్రంలో స్త్రీ వివస్త్ర. ఈ చిత్రం, ఆర్థిక రిక్తత, సాంఘిక అన్యాయం, వ్యక్తపరిచే చిత్రం. వయసొచ్చిన స్త్రీ భౌతిక దేహాన్ని ధైర్యంగా చిత్రించింది. కాథే కోల్‌విట్జ్ అప్పటి కాలానికి విప్లవాత్మక చిత్రకారిణే అని ఒప్పుకోక తప్పదు. ఈమె చిత్రాలలో స్త్రీలు దయనీయమైన స్థితిలో వుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ఈమె మీద చూపిన ప్రభావం ఈ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉమన్ విత్ డెడ్ ఛైల్డ్ (Woman with dead child, 1903) ఇందుకు ఒక మంచి ఉదాహరణ. కాథేకి పూర్తిగా విరుద్ధంగా విల్లెమ్ డె కూనింగ్ (Willem de Kooning), గత శతాబ్ద మధ్య భాగంలో తను వరుసగా చిత్రించిన స్త్రీ చిత్రాలలో స్త్రీ వ్యధ పూర్తిగా మరిచిపోయి, స్త్రీ పైన ద్వేషం, కోపం, చిత్రించాడు. కూనింగ్ గురించి, అతని చిత్రాల గురించి తరువాత పరిశీలిస్తాను.
ఫ్రాంచిస్కో గోయా (Francisco Goya, 1746-1828) దృశ్యమాన పరంగా ఆధునికతకి దగ్గిరవాడేనని చెప్పవచ్చు. స్త్రీ రూపాన్ని ప్రౌఢమైన పురుషోచిత సంప్రదాయంతో దృక్పథంతో మెచ్చుకొనేవాడు. అతని మాహా చిత్రాలలో స్త్రీలు (Nude Maja, 1800; Clothed Maja, 1803) నిజంగా దృఢమైన, స్వతంత్ర వ్యక్తులు, లౌక్యం తెలిసి తెలివిగా మసలుకొనేవాళ్ళు. అయితే మనే (Edouard Manet) కూడా ఈ పద్ధతే అవలంబించాడు. అంటే అతని వేసిన ఆడవారి బొమ్మలు స్వతంత్ర వ్యక్తులుగా, లౌకికులుగా, దృఢంగా ఉన్నప్పటికీ, వారిలో వగలాడితనం లోపిస్తుంది. ఉదాహరణకి Olympia (1863) చిత్రం చూడండి.
స్త్రీలు పురుషులకి ఎల్లప్పుడూ మార్మిక వ్యక్తులుగానే గోచరించేవాళ్ళు. అయితే, ఆధునిక స్త్రీ, పురుషులకే కాకుండా సాధారణ స్త్రీలకి కూడా సమస్యగానే అగుపించేది. అంత ఎందుకు? స్త్రీ, స్త్రీగా తనకే ఒక సమస్య, అన్నా చిక్కు లేదు. మనం ఇప్పుడు తెలుసుకున్నాం: స్త్రీ చరాస్తి కాదని, పనికత్తె మాత్రమే కాదని, జీవితాంతం పిల్లలని కనే యంత్రం కాదని, ఒకే పురుషుడికి అంకితమయిన మనిషి కాదని, తలకొవ్వి తీరికగా కూచునే జీవి కాదనీ — అయినా ఇప్పటికీ కూడా, బయటి ప్రపంచంలో అన్ని విషయాలలోనూ సమాకలిత సభ్యురాలిగా స్త్రీ గుర్తించబడలేదు.
నిజం చెప్పాలంటే, పంతొమ్మిదవ శతాబ్దంలో చిత్రకారుడు సహజంగా స్త్రీ ప్రతిమని చిత్రించాలనుకుంటే, అప్పట్లో చిత్రకళలో ఉన్న పాత సాంప్రదాయాలు — అందం, సుకుమారత — వంటివి కనిపించేట్టు చిత్రించాలి. ఇటువంటి సాధారణ లక్షణాలకి ఉద్వాసన చెప్పవలసిన అవసరం ఉన్నదని నమ్మి, ఆ పని చేసిన వాడు డేగా. చాలామంది ధనికవర్గం స్త్రీలకి అప్పట్లో ఇది బాధ కలిగించింది. డేగా శిష్యురాలు, స్నేహితురాలు అయిన మేరీ కసాట్ (Mary Cassatt, 1845-1926) చిత్రించిన స్త్రీ చిత్రాలు సహజంగా, ఆహార్య రహితంగా (ఉదా. La Toilette) ఉంటాయి.
ల ట్వాఁలెట్ – మేరీ కసాట్(1894)
సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థ, గందరగోళం, సమస్యని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. ఈ అభిప్రాయాలు వేద సూత్రాల లాగా, అంతిమ సత్యాల లాగా వల్లించటం పరిపాటి అయ్యింది. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.
ఎడ్గార్ డేగా (Edgar Degas) స్త్రీలు ప్రదర్శనార్థం కోసం కానప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో అల్లాగే తన చిత్రాలలో స్త్రీలని చిత్రించాడు. కొన్ని పాత సాంప్రదాయాలని ప్రతిఘటించి, ముఖ్యంగా, స్త్రీలు సృష్టిలో కేవలం అందమైన ప్రాణులు మాత్రమే కాదని చూపడానికి ప్రయత్నించాడు.
ఆఫ్టర్ ది బాత్ – ఉమన్ డ్రైయింగ్
హర్‌సెల్ఫ్ – డేగా (1898)
వీపు గోక్కుంటూనో, కాలి చీలమండ మర్దన చేసుకుంటూనో, ఇలా సహజ ప్రక్రియలలో స్త్రీలను చిత్రించటం ఏ స్త్రీ సహించదు. డేగా సరిగ్గా అటువంటి సహజమైన పనులు చేసే బాలే (ballet girls) నృత్యకన్యల బొమ్మలు వేశాడు. ఒకసారి, ఎవరో అడిగారట, “డేగా! నువ్వుఎప్పుడూ కురూపులు, అనాకారులుగా కనిపించే స్త్రీ చిత్రాలని ఎందుకు వేశావు?” అని. అందుకు డేగా సమాధానం: “సాధారణంగా స్త్రీలు అనాకారులే కాబట్టి!”
ఎడ్వర్డ్ ముంక్ (Edvard Munch, 1863-1944) అనే ఆధునిక చిత్రకారుడు మనస్సంబంధితలైంగిక వికాసానికి అన్వయించుకోటానికా అన్నట్టు కనిపించే సూత్రం తన The Dance of Life చిత్రం ద్వారా తెలియపరిచాడు. ఈ బొమ్మలో స్త్రీ మానసిక పరిణామం మూడు దశలుగా చూపిస్తూ ఒక వ్యూహాత్మక కథనం (ప్రణాళిక?) చిత్రించాడు.
ది డాన్స్ ఆఫ్ లైఫ్ – ముంక్ (1899)
మొదటి దశ: స్వప్న మయమైన ఊహా ప్రపంచంలో నుంచి స్త్రీగా పెరిగే బాలిక – మొగ్గనుండి పువ్వుగా వికసించే వ్యక్తి – తరువాత భౌతిక వాంఛతో పురుషునితో కలయిక — పురుషుడు ప్రేమికుడు, మోసపోయినవాడు కూడా — ఆఖరిగా స్త్రీ తిరస్కృతగా తయారయిన వితంతువు. ఈ బొమ్మని చాలా మంది చిత్రకళా విమర్శకులు, బైబిల్‌లో ఉన్న విశ్వసృష్టి పురాణకథకి వైపరీత్య వ్యాఖ్యానం అని రాశారు. కాని, ఆ వ్యాఖ్యానం బహుశా సరైనది కాదు. ఈ బొమ్మలో స్త్రీ తన వ్యక్తిగత మూలాన్నీ, దేశీయ హేతువులనీ అధిగమించినదని వ్యాఖ్యానించవచ్చు. ఏది ఏమయినా, బొమ్మ మధ్యలో శవాకారంలా చిత్రించబడ్డ పురుషుడి గురించి ఏ విధమైన వ్యాఖ్యానం చెయ్యచ్చు? స్త్రీ లైంగికత్వ ధ్వంసకారిణా? కాదు. ఈ చిత్రం స్త్రీ పురుష సంబంధాలలో జటిలమైన సత్యాలని చిత్రించిన చిత్రం.
ఉమన్ విత్ ఎ కాఫీ పాట్
– సెజాఁ (1895)
పాల్ సెజాఁ (Paul Cezanne, 1839-1906) తన Woman with coffee pot చిత్రంలో స్త్రీ లోని సహజ మానవతని నిర్జీవం చేస్తే, ఆన్రీ మటీస్‌కి (Henri Matisse, 1869-1954) స్త్రీ ఒక అలంకరణ వస్తువే! వీరిద్దరూ క్యూబిజమ్ (Cubism) ప్రారంభానికి నాంది పలికిన వాళ్ళు. ప్రొటొ క్యూబిస్టులని చెప్పవచ్చు. కాని, గీతలు, సమచతురాలు మాత్రమే ఉపయోగించి, క్యూబిస్టుల క్రూరమయిన ‘భాష’లో ఒదిగి ఉండే స్త్రీ చిత్రాలని గీసినవాడు పికాసో. 1937లో గీసిన Weeping Womanలో స్త్రీ అంతర్లీన జీవనం విజయవంతంగా గుర్తించగలిగాడు. గుర్తించటమే కాదు; ‘అనుభవించి’ చిత్రంలో స్త్రీ కన్నుల నుండి తడి కన్నీటి బిందువులు సృష్టించాడు.
ఇంతవరకూ స్త్రీ చిత్రణలో పురుషుడు వద్దనుకున్నా కనిపిస్తాడు. అంటే, స్త్రీ స్వాతంత్ర్యం అనేది ఏదన్నా ఉంటే అది మరుగున పడి ఉండిపోయింది. ఇప్పుడు, ఏకాంతత, వంటరితనం ఎలా చిత్రించారో చూద్దాం. ఈ ఏకాంతత — స్త్రీ తనకు తానుగా కోరుకున్న ఏకాంతత, వంటరితనం కావచ్చు. సామాజిక బంధాలు తెగిపోవటం, చుట్టూ చిన్న పిల్లలు లేకపోవడం కారణం కావచ్చు. ఇది చిత్రకళలో మరొక ఆధునిక ప్రస్తావన. అంతర్లీన జీవనం సాధారణంగా సాహిత్య ప్రక్రియ. స్త్రీ ఊహలు, అనుభూతులు, అనుభవాలూ, రాయటంలో ఉన్న సులువు వేరు. చిత్రీకరించటంలో ఉన్న కష్టాలు వేరు. ఒక కళోపాసనకు కావలసిన వ్యూహరచన, భౌతిక సదుపాయాలు — చిత్రకళ, శిల్పకళ, ప్రింట్ తయారీ — సాధారణంగా వసతి గృహాలలో ఏర్పాటు సాధ్యంకాదు. దానికి తోడుగా, పక్షపాతం (prejudice) మరొక అవరోధం. చిత్రకళకి సంబంధించిన సాహిత్యం లోను, చిత్రకళాభ్యాసం లోను కూడా, స్త్రీలు పాక్షికతని ఎదుర్కోవాలి. ఈ పాక్షికతని కవయిత్రుల కన్నా, నవలా రచయిత్రుల కన్నా ఎక్కువగా అనుభవించవలసిన వాళ్ళు చిత్రకారిణులు. అయినప్పటికీ కొద్దిమంది చిత్రకారులు, స్త్రీ యొక్క వంటరితనాన్ని వస్తువుగా స్వీకరించి చిత్రాలు గీశారు.
అమెరికన్ చిత్రకారులలో ఎడ్వర్డ్ హాపర్ (Edward Hopper, 1882-1967) స్త్రీ ఏకాంతతని చిత్రీకరించిన ‘కవి’ అంటారు. హాపర్ 1931లో వేసిన Hotel Room చిత్రం చూడండి. ఈ చిత్రంలో స్త్రీ ఒక చవకబారు హోటల్ గదిలో ఒంటరిగా కూర్చుంటుంది. నిజంగా ఒంటరిది కాదు. తన భర్తతో కలిసే వచ్చింది. కానీ అతను లేడు. భర్త లగేజీ, విడిచిన తన చెప్పులు, తన చేతిలో ఒక తెరిచిన పుస్తకం; చదవటానికి కుతూహలం మాత్రం లేదు — మానసికంగా విడవబడి, ఒంటరితనం నెత్తిన రుద్దబడిన స్త్రీ.
ఉమన్ బైటింగ్ హర్ నెయిల్స్
సోయర్ (1972)
అలాగే రాఫెల్ సోయర్ (Raphael Soyer, 1899-1987) వేసిన చిత్రం — Woman Biting her Nails (1972) — పిరికిగా, ఉదాసీనంగా, విచారమగ్నంగా గోళ్ళు కొరుక్కుంటున్న స్త్రీ. ఈ చిత్రాలు స్త్రీ వంటరితనానికి, తన పరిసర సమాజంపై అనాసక్తతకి ప్రామాణిక ఉదాహరణ అని చెప్పవచ్చు. కాని, ఈ చిత్రాలు ఏవీ ప్రజాభిమానం పొందలేదు. ఎందుకని? స్త్రీ చిత్రం అనగానే అందమైన బొమ్మలా కృతకంగా కూర్చున్న స్త్రీ చిత్రాలే ‘గొప్ప’ చిత్రాలు అనే అపోహే కారణం. ఆ చిత్రాలే ప్రజాభిమానం పొందాయి.
స్త్రీ పరంగా సాధారణ వృత్తులు అందరికీ తెలిసినవే. ఇవి చిత్రకారులు ఎలా చూపించారో చూద్దాం. ఇంటిపనులు అన్నీ కష్టపడి చేసే పనులు — వంట చేయటం, ధాన్యం నూర్పిడి, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చెయ్యటం వగైరా. విసిగి వేసారి డస్సిపోయే పనులు, ఇవన్నీ! > జాఁ ఫ్రాన్స్‌వాఁ మియే (Jean Francois Millet, 1814-75) వేసిన ఉమన్ విత్ ఎ రేక్ (Woman with a rake), ది గ్లీనర్స్ (The gleaners), ది స్టబుల్ బర్నర్ (The Stubble burner), బ్రేకింగ్ ఫ్లాక్స్ (Breaking Flax), ఇలా ఎన్నో చిత్రాలలో రోజువారీ శ్రమను చిత్రించాడు. ఈ చిత్రాలన్నీ కూడా 1850-60 ప్రాంతాలలో Labors of the field అనే పరంపరలో వేసినవి. ఒనోరే డమియే (Honore Daumier, 1808-79) వేసిన ది లాండ్రెస్ (The Laundress, 1863), డెగా వేసిన టు లాండ్రెసెస్ (Two Laundresses, 1884), పికాసో వేసిన Ironing woman (1904) చూడండి. వీటన్నిటిలో అలసి డస్సిపోయి, నిరాశ, నిసృహలతో ఉన్న స్త్రీ మూర్తులు కనిపిస్తారు.
ప్రాస్టిట్యూట్ బిఫోర్ ఎ మిర్రర్
– జార్జ్ రూఆఁ (1927)
పోతే, ‘చెడ్డ స్త్రీలు’ అనబడే వారి చిత్రాలు చూడండి. చిత్రకళ చరిత్రలో ఎంపిక చేయబడ్డ స్త్రీ ప్రతికృతులు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలలో స్త్రీకి భౌతికంగా ఏ విధమైన అనాకృతీ ఉండడానికి వీలు లేదు. నైతికంగా వీళ్ళు మచ్చలేని వాళ్ళు. దురదృష్టవశాత్తు — పావనమైన ఋషుల వంటి స్త్రీల బొమ్మలు, తల్లులుగా, అణుకువతో మెలిగే భార్యలుగా స్త్రీల బొమ్మలు, మంచితనం, ప్రేమ వొలకపోస్తున్న దేవతల ప్రతిమలు — ఇటువంటి చిత్రాలనే చాలా మ్యూజియములు ప్రదర్శించటానికి సాహసిస్తాయి. ఇవే కాకుండా వివస్త్రగా స్త్రీ చిత్రాలు కూడా పదిలపరచటం సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి ప్రతిగా మరొక సాంప్రదాయం కూడా ఉన్నది. పిల్లలని కనడానికి, తమ లైంగికావసరాలకీ కూడా అతీతంగా ఎదిగి, పురుషులకి ఆసక్తి రేపే స్త్రీ చిత్రాలు — వివస్త్ర లైన వెలయాలుల చిత్రాలు ప్రదర్శించే సాంప్రదాయం. జార్జ్ రూఆఁ (Georges Rouault, 1871-1958) వేసిన Prostitute (1924-27) అనే చిత్రం, ఆన్రి లోట్రెక్ (Henri Lautrec, 1864-1901) వేసిన Woman standing before a mirror (1897) అనే చిత్రం వీటికి ఉదాహరణ. స్త్రీ మానవతని దిగంబరీకరించడం తప్ప, ఈ రెంటిలోనూ చెప్పుకోదగ్గ గుణాలు ఏవీ లేవు.
ఉమన్ స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్
– ఆన్రి లోట్రెక్(1897)
పాపానికంకితమైన జీవితాల మూలంగా, చివరలో మానవత్వం ఎటువంటి దుర్దశకి వస్తుందో, ఈ చిత్రాలలో మోటుతనం, స్థౌల్యం సంజ్ఞా రూపకంగా తెలియపరుస్తున్నాయి. ఇటువంటి చిత్రాలు చిత్రించిన చిత్రకారులు, ‘భ్రష్టలు’గా మారిన స్త్రీలని చిత్రించారు కాని, ఏ వొక్క చిత్రకారుడూ, భ్రష్టులైన పోషకుల చిత్రాలు వెయ్యలేదు. బహుశా పురుష దురహంకారం దీనికి కారణమా? కాకపోతే, చిత్రకారులు భ్రష్టలైన స్త్రీలనే ఎందుకు చిత్రించారు? పురుషభ్రష్టతని ఎందుకు చిత్రీకరించలేదు? ఇందుకు మతం కారణం కావచ్చునేమో! మన ప్రాచీన జ్ఞాపకాలు మనని తేలికగా వదలవు. భ్రష్టలైన స్త్రీలని గర్హించటం, అసహ్యించుకోవటం, మన మత సంబంధ జ్ఞాపకాలకి తార్కాణం అని అనటం తప్పు కాదేమో!
ఇంతకు ముందు కూనింగ్ గురించి ప్రస్తావించాము. కూనింగ్ వేసిన Women Series బొమ్మలు స్త్రీ జాతి మీద ద్వేషానికి అంతిమ ప్రతీకలు అనవచ్చు. 1948లో మొదలు పెట్టి 1960ల చివరి భాగం వరకూ — ఈ మధ్య కాలంలో కూనింగ్ ఒక డజను పైచిలుకు స్త్రీ చిత్రాలు గీశాడు. వాటిలో Woman I నుంచి – Woman VI అన్న మకుటాలతో వేసిన ఆరు చిత్రాలు చాలా ప్రసిద్ధి కెక్కిన చిత్రాలు. ఆ తరువాత కూడా స్త్రీ చిత్రాలు వేశాడు కానీ, వాటి గురించి వచ్చిన ప్రస్తావన బహు కొద్దిమాత్రమే. ఈ ఆరు చిత్రాలలో స్త్రీని చిత్రించిన విధానం చాలా భయానకంగా ఉంటుంది. ఇవి పెద్దపెద్ద కేన్వాసులు. క్యూబిజం ధోరణి, పికాసో, రూబెన్స్‌లు అనుసరించిన పద్దతి ఈ చిత్రాలలో కనిపిస్తుంది. తీవ్రమైన నైరూప్య పద్ధతిని, యూరోపియన్ ఆకృతి చిత్రీకరణతో కలిపితే వచ్చే చిత్ర కళకి ఈ చిత్రాలు ఉదాహరణలు.
ఉదాహరణకి Woman I బొమ్మలో తీవ్రమైన హింస జొప్పించటంతో ఈ చిత్రంలో వ్యంగ్యం ఉన్నదన్నది కొందరి విమర్శకుల అభిప్రాయం. కాని, అనావశ్యకమైన హింస చిత్రంలో ఎక్కువయి, వ్యంగం ఉన్నదన్న అపోహ అడుగున పడుతుంది. ఈ చిత్రంలో ఉన్నది ఒక వృద్ధ స్త్రీ. ఎక్కువ బరువుగా ఉండే వృద్ధ స్త్రీ. మరీ పెద్దవైన కళ్ళు, కట్టుడుపళ్ళు చూపిస్తూ వికారం కలిగించే నవ్వు, సన్నని చిన్న కాలిమండశీల, లావైన కాలు, చవకరకం చెప్పు వేసుకొని, ఎంత నికృష్టంగా ఉండాలో అంతకన్నా ఎక్కువ నికృష్టంగా స్త్రీ ఆకారాన్ని చూపించే చిత్రం ఇది.
మిగిలిన స్త్రీ చిత్రాలొక్కొక్కటీ, గీసిన కాలక్రమంలో చూస్తూ పోతే, తరువాత అన్నీ కలిపీ ఒక్కసారిగా చూస్తే, పోనుపోను చిత్రం ముఖంలో రాక్షసి నవ్వు, భీకరత్వం పెరిగి కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. మానవత్వం కృశించి పోతుంది. ఈయన పంతొమ్మిదివందల అరవైలలో వేసిన స్త్రీచిత్రాలని అశ్లీల చిత్రాలని అనడం అతిశయోక్తి కాదు. స్త్రీ ఆకారాన్ని ఇంత హింసాత్మకంగా చిత్రించిన చిత్రకారుడు బహుశా ఇంకెవరూ లేరేమో! పేరు మోసిన ఏ విమర్శకుడూ ఈ చిత్రాలపై ఎక్కడా వ్యతిరేకంగా రాయకపోవడం ఆశ్చర్యం.
న్యూడ్ సీటెడ్ ఆన్ ఎ బెడ్
– వాలదాఁ (1922)
విల్లెమ్ ద కూనింగ్, మానవ సాంస్కృతిక పతనానికి, విధ్వంసానికి స్త్రీ కారణమని అనుకున్నాడా? సాంస్కృతిక పతనమే నిజమయితే, ఈ పతనానికి పురుషుడికి కూడా సమాన బాధ్యత లేదా? నిజం చెప్పాలంటే, ఎక్కువ బాధ్యత పురుషుడిదే కాదా? కూనింగ్ ప్రదర్శనలపై రాసిన విమర్శకులు ఈ విషయాలు అడగటం మరిచిపోయారా? చెదురు మదురుగా ఎవరో స్త్రీవాదులు ఈ విషయాలు రాసి ఉండవచ్చు కాని, ప్రసిద్ధికెక్కిన పత్రికలలో ఎక్కడా నాకు కనపడలేదు. కూనింగ్ నైరూప్య చిత్రకళాకారుడిగా చాలా గొప్పవాడు. కాని, స్త్రీమూర్తి చిత్రణలో మాత్రం కాదని నా అభిప్రాయం.
న్యూడ్ రిక్లైనింగ్ ఆన్ సోఫా
– వాలదాఁ (1928)
పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో సాంప్రదాయానికి విరుద్ధంగా, బొహీమియన్ జీవితానికి చిహ్నంగా స్త్రీ రూపొందింది. స్వేచ్చ, పేదరికం, వలపు, దురవస్థ — వీటి కలయికతో కనపడే స్త్రీ నమూనా అగ్రగామి అయ్యింది. ఈ లక్షణాల కలయిక ఉన్న స్త్రీ ఇప్పటికీ ఒప్పుకోదగినదే! బొహీమియన్ స్త్రీ ఎప్పుడూ సజీవే! అమిదియో మొదిల్యియాని (Amedeo Modigliani, 1884-1920) బొహీమియనిజం దృష్టిలో వేసిన బొమ్మలు — అన్నీ వివస్త్ర లైన స్త్రీల బొమ్మలే! ఈ బొమ్మల చిత్రణకి అతగాడు చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదట! ఎందుకంటే, అతను గీసిన బొమ్మలన్ని, అతని స్నేహితురాళ్ళవి, అతని ఉంపుడు కత్తెలవీనూ! అతని స్త్రీ చిత్రాలన్నీ కామోద్రిక్తలు, భోగాసక్తులూనూ!
పింక్ ట్యునిక్ – లెంపికా (1927)
సుజాఁ వాలదాఁ (Suzanne Valadon, 1867-1938) స్త్రీ చిత్రకారిణి. ఆవిడ వేసిన దిగంబర స్త్రీల బొమ్మలలో అమాయకత్వం కనిపిస్తుంది. స్త్రీ తన లైంగికత్వాన్ని అమ్మకానికి పెట్టిందా అన్నట్టు మాత్రం ఆవిడ ఎక్కడా చిత్రించలేదు. ఉదాహరణకి, Nude seated on a bed (1922), Nude reclining on a couch (1928) అన్న ఈ రెండు చిత్రాలూ చూడండి. టమారా (Tamara de Lempicka, 1898-1980) గీసిన Pink Tunicలో (1927) అత్యంత దృఢమైన వ్యక్తి కనపడుతుంది. ఇది రాతిపై చెక్కిన శిల్పంలా ఉన్నది అన్న ఊహ రాక మానదు.
సెల్ఫ్ పోర్ట్రెయిట్ – బెకర్ (1906)
స్త్రీ చిత్రకారులే స్త్రీ చిత్రాలని ప్రమాణసిద్ధంగా యదార్థంగా చిత్రించగలరా? అని ప్రశ్నిస్తే, నిక్కచ్చిగా సమాధానం చెప్పటం కష్టం. కాని, పురుషులకీ స్త్రీలకీ లైంగికానుభవం, ఒకే రకంగా ఉండదు. 1973లో లూసీ లిపర్డ్ (Lucy Lippard) చిత్రకళా ప్రదర్శన కేటలాగ్ Women Choose Womenలో ఈ విధంగా రాసింది: “The overwhelming fact remains that a woman’s experience in the society is simply not like that of a man… and if this factor does not show up in women’s art, only repression can be to blame.” ఇది కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తుంది కాని, పచ్చి అబద్ధం మాత్రం కాదు. పాలా బెకర్ (Paula Modersohn-Becker, 1876-1907) వేసిన Self Portrait (1906) చిత్రం చూడండి. కచ్చితంగా స్త్రీ దృక్పథం, స్వీయ ప్రకటన — రెండూ కనిపిస్తాయి. ఈ చిత్రం వేసిన ఒక సంవత్సరం తరువాత, చిత్రకారిణి ప్రసూతిలో మరణించింది.
చిత్రకళలో ప్రేమ, వలపు, వివాహం లాంటి సాంఘిక విషయాలు భాగాలే. చిత్రకళలో ‘ప్రేమ’ అనేది వివిధ రకాలుగా కనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం స్త్రీపురుషుల కౌగిలికే పరిమితం కాదు. తల్లి – పిల్లల మధ్య అనురాగం, అభిమానం, ఇవన్నీ ప్రేమకి ఉదాహరణలే. అగూస్ట్ రొదాఁ (Auguste Rodin, 1840-1917) శిల్పం The Kissలో, మేరీ కసాట్ చిత్రం The bathలో, జేకబ్ ఎప్‌స్టీన్ (Jacob Epstien, 1880-1959) గీసిన Madonna and Childలో రకరకాల ప్రేమానుభూతులు చూడవచ్చు.
రొదాఁ విషయం వచ్చింది కాబట్టి అతను వేసిన దిగంబర స్త్రీ నీటిరంగుల చిత్రాల ప్రసక్తి చెప్పి తీరాలి. రొదాఁ కొన్ని వందల బొమ్మలు వేశాడు. దిగంబర స్త్రీని చూస్తూ కాగితానికేసి చూడకండా పెన్సిల్‌తో స్కెచ్ గీసి, ఆ తరువాత కాగితంపై నీటిరంగులు పులిమేవాడని అంటారు.
అందంగా అచ్చు వేసిన ఒక వంద బొమ్మలు కూర్చిన Auguste Rodin, Erotic Water Colors, 1995 అనే పుస్తకం చూస్తే బహుశా ఇది నిజమే సుమా అని మీకు కూడా అనిపించక మానదు. స్త్రీ చిత్రాలలో స్త్రీని దిగంబరంగా చిత్రించటం బహుశా పురుష ప్రకృతి కావచ్చు. సంప్రదాయకులైన మన భారతీయ చిత్రకారులు కూడా దిగంబర స్త్రీ చిత్రాలు వేశారు. దామెర్ల రామారావు కూడా దిగంబర స్త్రీ చిత్రం, అమాయిక (నిరంబర) గీశాడు. చిత్రకారులందరికీ ఈ ప్రక్రియ ఒక రిచువల్ కావచ్చు. స్త్రీ ఆకృతి సర్వసాధారణంగా వ్యక్తిగత లైంగిక అనుభూతులను విశదీకరిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంతకుముందు ఉదహరించిన మొదిల్యియాని చిత్రం, రిక్లైనింగ్ న్యూడ్ (Reclining nude) చూడండి. స్త్రీ సుఖాన్నిచ్చే విలాసవస్తువు గానే చూపబడింది. ఎర్రటి పెదవులు, ఒక చేయి తల క్రింద పెట్టుకొని, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రించటం, లైంగిక తృప్తికి ఉదాహరణ.
పాశ్చాత్య సంస్కృతిలో వివాహం ఒకరకమైన ద్వేషభావంతో కూడిన హాస్యంగా చిత్రీకరించటం కద్దు. స్త్రీ – పురుషుడు కొద్దికాలం కలిసిమెలిసి వున్న తరువాత, వివాహానంతరం ఊహించిన ఇంద్రజాలం శాశ్వతంగా ఉండదు. ఆ అనుభూతి మిధ్య అని తేలిపోతుంది. మార్క్ షగాల్ (Marc Chagall, 1887-1985) తన Birthday చిత్రంలో ఒకరికొకరు బహుమతులిచ్చుకునే ఆచారంగా మాత్రమే వివాహం మిగిలిపోతుందని హాస్యంగా ఈ భ్రమనే సూచిస్తాడు.
ది టెంపెస్ట్ – కొకోష్కా (1914)
ఓస్కార్ కొకోష్కా (Oskar Kokoschka, 1886-1980) గీసిన The Tempest (Bride of the wind) చిత్రంలో ‘ప్రేమ’ గురించి ఎలా చిత్రించాడో గమనించండి. ఈ చిత్రంలో ఉన్నది ఓస్కార్ అతను ఉన్మాదంగా ప్రేమించిన ఆల్మా మాలెర్. ఆమె కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నది. అతని ముఖంలో ఆందోళన, అతని శరీరం బక్కచిక్కినట్టుగా వున్నది. వారిద్దరి ముఖ కవళికలో ఎంత భేదం ఉన్నదో గమనించమని తప్ప నేనింకేమీ చెప్పను.
కార్ల్ హాఫర్ (Karl Hofer), జాన్ కోఖ్ (John Koch), రాజర్ ఫ్రెనే (Roger de la Fresnaye) — వీళ్ళ చిత్రాలలో వివాహం గురించి, వివాహానంతర ప్రేమ ఈ భ్రమే అన్న అర్థం వచ్చేట్టు రకరకాలుగా చిత్రించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాశ్చాత్య ఆధునిక చిత్రకళలో romanceని అనూహ్యమైన కాల్పనికాంశంగా చూడలేదు.
కానీ ఇందుకు విరుద్ధంగా హాఫర్ చిత్రించిన Early hour (1935) చూడండి. కిటికీనుంచి సూర్యోదయం గదిని ఎర్రగా మార్చింది. ఇంకా నిద్రపోతున్న తన స్త్రీని గురించి అతను ఆలొచిస్తుండాలి. ఇద్దరి ముఖాల్లోనూ ప్రశాంతత కనపడుతున్నాది. కాళ్ళ దగ్గరే పడుకున్న పెంపుడు కుక్కలో కూడా అదే నిశ్చింత. ఏ తెల్లవారుజామునో నిద్రలేచి ఇంకా నిద్రిస్తున్న తన ప్రియుడినో, ప్రియురాలినో గమనించినప్పుడు కలిగే ఊహలు ఆ బంధం ఎలాంటిదో సూచిస్తాయని మీకు తెలుసు.
గర్ల్ బిఫోర్ ఎ మిర్రర్ – పికాసో (1932)
వ్యాధిగ్రస్తత (morbidity) ఇతివృత్తంగా గీసిన స్త్రీ చిత్రం చూద్దాం. పికాసో గీసిన Girl Before a Mirror గురించి ప్రస్తావించాం. ఒక బాలిక స్త్రీగా పరిణతి చెందబోయే సమయంలో, ఆ బాలిక మనోభావాలని, భయాలనీ, చూపిస్తున్న చిత్రం, ఎడమవైపున. కుడిపక్కన ఒక రకమైన యెక్స్-రే ప్రతిబింబం! కుడిపక్క ప్రతిబింబంలో వెన్నెముక, తదితర గర్భావయవాలు — సంతానోత్పత్తి అవయవాలు. ఎడమ బొమ్మలో అమాయకత జొప్పించే కళ్ళు; ముఖం చుట్టూ ప్రకాశవంతంగా వెలుగు. ప్రతిబింబంలో నల్లని, పీక్కోనిపోయిన ముఖాకృతి. ఎడమబొమ్మలో ముఖవర్చస్సు, కుడి ప్రతిబింబంలో ముఖవర్చస్సు పోల్చి చూస్తే, భయం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. బొమ్మ నిలువుగా రెండు భాగాలుగా చీల్చబడింది. బాలిక కుడిచెయ్యి ప్రతిబింబాన్ని అందుకుంటూ, మానసికంగా ఇద్దరూ ఒకరినొకరు అనునయిస్తూ దరికి చేరుకుంటున్నారా అనిపిస్తుంది. బొమ్మ అంతా మొత్తంగా చూస్తే బాల్యదశ అపరిపక్వతనుంచి యవ్వనంలోకి వస్తున్న అమ్మాయి భయాలని సహానుభూతితో చిత్రకారుడు గీశాడా అని తడుతుంది. అదీ, ఈ చిత్రంలోని గొప్పతనం. ఈ చిత్రాన్ని ముంక్ వేసిన ప్యూబర్టీ (Puberty, 1895) తోను, జెరాల్డ్ బ్రాక్‌హర్స్ట్ (Gerald Leslie Brockhurst) గీసిన ఎడొలెసెన్స్ (Adolescence, 1932) లితోగ్రాఫ్ తోను పోల్చిచూడండి. మూడింటిలోనూ విషయం ఒకటే; దృశ్యమాన వివరణలో భేదం!
అన్‌టైటిల్డ్ 2 – ఎస్.వి.రామారావు (2012)
పద్మశ్రీ యస్. వి. రామారావు ఇంగ్లండ్ లో ఉండగా, చాలా స్త్రీ చిత్రాలు, రంగుల్లోనూ, చార్ కోల్ మాధ్యమం గానూ life-size portraits వేశాడు. దిగంబర స్త్రీ చిత్రాలు వేసినట్టు లేదు. ఒకవేళ అభ్యాసం కోసం వేసినా అవి ఎక్కడా ప్రదర్శించలేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తనదైన శైలిలో figurative చిత్రాలు గీస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వేసిన దృశ్యమాన చిత్రాలలో రెండు చిత్రాలు ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రచురిస్తున్నాము. ఈ ఏప్రిల్ నెలలో ఢిల్లీ నగరంలో రామారావు ప్రత్యేక ప్రదర్శనలో ఈ బొమ్మలు కూడా ఉంటాయి. తానుగా ఈ బొమ్మలకి ప్రత్యేకంగా మకుటాలు ఏవీ ఇంతవరకూ ఇవ్వలేదు. స్త్రీ మానసిక ప్రవృత్తి చిత్రరూపంగా ప్రదర్శించటానికి స్త్రీని భయంకరంగా, జుగుప్స కలిగించేట్టుగా చిత్రించనక్కరలేదని చెప్పటానికి ఉదాహరణగా ఈ రెండు కొత్త చిత్రాలు చాలు ననుకుంటాను.
అన్‌టైటిల్డ్ 3 – ఎస్.వి.రామారావు (2012)
వేరువేరు స్త్రీ చిత్రాలు పరిశీలించిన తరువాత, ఈ చిత్రాల వెనుక ఒక ప్రత్యేకమయిన ఊహ, సిద్ధాంతం, ఏదయినా ఉన్నదా? ఒకరకంగా ఉన్నదనే అనవచ్చు. ఒకే ఒక్క ప్రాథమిక భావన, వేరు వేరు దృశ్యమాన ఆకృతులుగా మార్పు చెందుతున్నది. సాంఘిక ఆర్థిక సాంకేతిక మార్పులు ఇందుకు కారణం. సాంకేతికత, పద్ధతి పక్కన పెట్టి చూస్తే, అన్ని కళలలోనూ లైంగికత చాలా ముఖ్యమైనది; చిత్రకళ అందుకు వ్యతిరేకం కాదు. చిత్రకారుడు లైంగిక ప్రభావాలకు, సామ్యతలకి, వ్యతిరేకతలకీ అతీతుడు కాదు. ఒక విషయం మాత్రం నిజం. మనం పరిశీలించిన చిత్రాలు, పరిశీలించని కొన్ని వందల చిత్రాలు, పురుషుడి దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ప్రవర్తిస్తే తనకి నచ్చుతుంది — ఎలా ఉంటే తనకి నచ్చదు — ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అన్న అభిలాష స్ఫుటంగా కనిపిస్తుంది. స్త్రీలు వేసిన స్త్రీ చిత్రాలు చాలా వస్తున్నాయి; ఇక ముందు ఇంకా చాలా చాలా వస్తాయి. అప్పుడు స్త్రీ గురించి వివరంగా అందరికీ తెలియవచ్చు. స్త్రీ చిత్రాలు సెంటిమెంటల్‌గా, అలంకరణగా, అమాయకంగా ఉండక పోవచ్చు. కాని, స్త్రీ చిత్రాలు భౌతికంగా క్రూరంగా, దారుణంగా మాత్రం ఉండవు.
[ఈ వ్యాసంలో ఉదహరించిన చిత్రాలు ఇంటర్నెట్ ద్వారా కాపీరైట్ నిబంధనలకు లోబడి తెచ్చినవి. స్థలాభావం వల్ల కొన్ని చిత్రాలను వాటి పేరు పైన క్లిక్ చేస్తే కనిపించేవిగా అమర్చాము. పాఠకులు దయచేసి గమనించగలరు – సం.]
ఉపయుక్త గ్రంథావళి
- The Grass Roots of Art by Herbert Read (1947).
- A Concise History of Modern Painting by Herbert Read (1959). (These two are good introductory books which have been used as text books for Art Appreciation Courses in a number of UK and US Universities over a long period of time.)
- Ways of Seeing by John Berger, BBC & Penguin Books, 1972. A good discussion on the images of women in general.
- Women and Art by Elsa Honig Fine (1978). (This is a very nice book on art from a woman’s point of view.)
- Erotic water Colors by Auguste Rodin (1995). (This has over 100 Rodin’s nudes in water color and a lot of them as the book claims were drawn by Rodin as he watched and the nudes were allowed to do whatever they wanted to do undisturbed. That means, they did not pose for the drawings. Rodin later splashed water colors on the drawings.)
- Gramercy Great Masters, Gramercy Books (1993). (A series of books on several Western painters. A reasonably good introduction is given for each painter. The color reproduction in all the books are very poor and woeful.)
- Brushes with History Writing on Art from The Nation 1865 – 2001, Edited by Peter Meyer (2001). ( A compilation of hundreds of art reviews appeared in The Nation. From some reviews one can learn how not to write an art review.)