నారాయణరావు మార్గదర్శక పరిశోధనా పద్ధతి

[ఫిలిప్ వాగనర్(phillip B Wagoner) కనెటికట్ వెస్లీయన్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా భారతీయ, ఇస్లామీ కళల చరిత్ర గురించి పరిశోధిస్తుంటారు, పాఠ్యాంశాలుగా బోధిస్తుంటారు. 80లలో విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్.డీ పొందిన వాగనర్ ప్రత్యేకాసక్తి 11-15 శతాబ్దాల మధ్య కాలం నాటి దక్కనీ ప్రాంతంలో హిందూ పర్షియన్ సంస్కృతుల పరస్పర ప్రభావాన్ని విశ్లేషించడం.]


[మూల వ్యాసం in English]

వెల్చేరు నారాయణ రావుతో నా మొదటి పరిచయం 1975లో, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో తెలుగు నేర్చుకోవడం కోసం ఆయన క్లాసులో చేరినప్పటిది. ఆయన పాఠం చెప్పడంలో చూపించే ఉత్సాహం, భాష మీద ఆయనకున్న మమకారం, వివరించి చెప్పే తీరు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయి అంటే తెలుగు భాష, సంస్కృతులపై నా అభిమానం చాలా కొద్ది కాలంలోనే ఒక వ్యసనంగా మారిపోయింది. అలా నేను తెలుగు భాషలో పరిశోధనలు చేయాలని నిశ్చయించుకొని, అక్కడే సౌత్ ఏషియా స్టడీస్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో చేరిపోయాను. అప్పుడు నారాయణ రావు నాకు గురువు, పథనిర్దేశకుడు. నా చదువులు పూర్తయిన తరువాత ఆయన నాకు సహోద్యోగి. ఇలా ఆయనతో నా అనుబంధం ముప్ఫై ఐదేళ్ళకు పైగా అని చెప్పుకోవడం నాకు గర్వంగా వుంటుంది. అప్పట్లో తెలుగు నేర్చుకునేవారం ఇద్దరమో, ముగ్గురమో మాత్రమే ఉండేవాళ్ళం. నా తోటి వాళ్ళు చాలా మంది హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇలా ఇతర భాషలని చదువుతుండేవారు. కానీ ఎవరు ఏ భాష చదువుతున్నా, వారి పరిశోధనాంశం ఏమైనా, అందరిలోనూ ఉమ్మడిగా కనిపించే లక్షణం ఒకటి ఉండేది. అది నారాయణ రావు అంటే ఉన్న అభిమానం, గౌరవం. కారణం ఆయన పాఠాలు చెప్పే తీరు, సదస్సుల్లో ఆయన ప్రసంగాలు ఎంతో ఆలోచనాత్మకంగా, ఆసక్తిదాయకంగా ఉండేవని మాత్రమే కాదు. ఆయన ఎంతో కలివిడిగా ఉండేవారు. మాకు ఏ సందేహం వచ్చినా తీర్చుకోవడానికి మాకెప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఇది ఆయనను విద్యార్థులందరికీ మరింత దగ్గర చేసింది.

నారాయణ రావు తన సహాధ్యాపకుల లాగా ఒంటరిగా తన ఆఫీసు గదిలో కూర్చొని, తన పనిలో ముణిగిపోయి వుండడానికి ఇష్టపడేవారు కాదు. అందువల్ల ఆయన ఎవరైనా కనిపిస్తే కబుర్లు చెప్పుకోవడానికి తరచుగా కారిడార్లో తచ్చట్లాడుతూ కనిపించేవారు. చాలా సార్లు ఆయన మేమంతా కూర్చునే గదికి వచ్చి మాతో చేరిపోయేవారు. విద్యార్థులు అప్పటిదాకా చేస్తున్న పిచ్చాపాటీ, నారాయణ రావు వచ్చి చేరిన కాసేపటికే మరింత లోతుగా, ఉత్తేజపూరితంగా అయేది. ఆయన ఉన్నట్టుండి చేసే ప్రకటనలు, –“Authors don’t ‘write’ texts; it’s the text that ‘writes’ the author.” — లాంటివి మమ్మల్ని ప్రేరేపించేవి. చర్చ మరింత రసవత్తరంగా మారేది. తరగతి గదిలో పాఠాల కంటే అదాటుగా జరిగే ఇలాంటి చర్చల నుండే ఆరోజుల్లో నాకు ఎక్కువ విషయ పరిజ్ఞానం అలవడింది. ఇలా లాభపడింది నేనొక్కణ్ణే కాదు, చర్చల్లో పాల్గొన్న నా సహాధ్యాయులు, నారాయణ రావు కూడా అని నేను అనుకుంటాను.

నారాయణ రావుకున్న ఈ ప్రత్యేకమైన అలవాటు, ఈ కలుపుకుపోయే గుణం, గురించి ఇక్కడ నేను ప్రస్తావించడానికి ఒక కారణం, అది తరువాత తరువాతగా ఆయన పనిచేసే పద్ధతికున్న విశిష్టతను ముందుగానే పట్టించిందని నేను ఊహించడం. ఆ పద్ధతి – సంయుక్త గ్రంథకర్తృత్వం, కొలాబరేటివ్ ఆథర్‌షిప్, ఉమ్మడి రచనా పద్ధతి. ఇద్దరు ముగ్గురు గవేషకులు కలిసి ఒకే అంశం మీద పని చేయడం, పరస్పరం సహకరించుకొని కలిసి ఆ ఫలితాలను ప్రచురించడం, అప్పటికే జీవ, భౌతిక శాస్త్రాలలో సామాన్యంగా కనిపిస్తున్నా అది సామాజిక శాస్త్ర విభాగాలలో చాలా అరుదైన పద్ధతి. తన గదిలో ఒంటరిగా కూర్చుని, తాను పరిశోధిస్తున్న విశేషాంశానికి సంబంధించిన ఏ వనరులనో విశ్లేషించుకుంటూ ఏకాకిలా, వేరేవారి చూపు పడకముందే ముందే తను కనుగొన్న ఫలితాలను వెంటనే ప్రచురించడం – ఇదీ రివాజు. ఇలాంటి వాతావరణంలో సహాధ్యాయులు ప్రత్యర్థులవుతారే కానీ, సహచరులు కాలేరు. సుహృద్భావత లేకపోవడంతో, ఒంటరి తనం, వ్యాకులత, మానసిక ఒత్తిడి — వీటితో వ్యవస్థ అంతా విషతుల్యమై పోయే అవకాశం ఎక్కువ. మరి ఈ అనారోగ్యం నుంచి తప్పించుకోవాలంటే, తన తోటి వారితో కలిసి చర్చించి, తనకు తెలిసినవి పంచుకుని, తెలియనివి నేర్చుకొని, భిన్న దృక్పథాలలో సమాచారాన్ని విశ్లేషించి, ఆపైన వారితో కలిసి సహకర్తృత్వంలో ఆ ఫలితాలను ప్రచురించడం కంటే మంచి దారి ఇంకేముంది? విద్యాసంబంధి విషయాలలో ఈ పరస్పర సహకారం ఎంత మేలు చేస్తుందో, ఈ బహువిధ శాస్త్రీయ దృక్పథం పరిశోధకుల మధ్య సామరస్యం ఏర్పరిచి పరిశోధనలు కొత్త పుంతలు త్రొక్కడానికి ఎంత దోహదం చేస్తుందో, వేరే చెప్పనవసరం లేదు.

పరిశీలించి చూస్తే, భిన్న సంస్కృతీ సంప్రదాయాలతో, విభిన్నమైన భాషాసాహిత్యంతో అలరారే దక్షిణ ఆసియా ప్రాంత అధ్యయనానికి బహువిధ శాస్త్రీయ దృక్పథం సహజంగానే అవసరమైనది. అందువల్ల, సాటి మేధావులతో కలిసికట్టుగా చేసే పరిశోధనల వల్ల మరింత లాభం వొనగూరుతుంది. తతిమ్మా ‘ప్రాంతీయ అధ్యయన’ రంగాల లాగానే, దక్షిణ ఆసియా అధ్యయనం కూడా 1950వ దశకంలో, ‘ఐరోపేతర ప్రాంతాల సమాజాల పరిధినీ, వైవిధ్యాన్నీ పరిశీలించి, మానవ జీవనానుభవాల విస్తృతిని అవగాహన చేసుకోవడానికి ఒక సరికొత్త రూపావళిని ఏర్పరుచుకోవడం’ అనే ఆశయంతో మొదలయింది. ప్రాంతీయ అధ్యయనానికి కావలసిన విశిష్టగుణం, ఆయా ప్రాంతాల భాషా సాహిత్య స్వరూపాలను, సంప్రదాయాలను లోతుగా ‘స్వాభావికంగా’ తెలుసుకోవడం. ఒక ప్రాంతీయ అధ్యయనానికి కావలసిన వనరులను అక్కడి సమాజం నుంచి సేకరించుకోవడం ద్వారా మాత్రమే ఆ ప్రాంతపు మానవ వికాసాన్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. తద్వారా మాత్రమే ఆ ప్రాంతీయ సంస్కృతికి వున్న విశిష్టత మన అనుభవంలోకి రాగలదు. అప్పటికే యూరోపియన్ సమాజ అధ్యయనానికి మౌలికమైన పనిముట్లుగా అక్కడి విశ్వవిద్యాలయాలలో చరిత్ర, ఆర్థిక, మానవ జీవన శాస్త్రాలు చలామణీ అవుతున్నాయి. వాటి ఆధిపత్యానికి తలొగ్గకుండా మాత్రమే దక్షిణాసియా సమాజ తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకోగలం. అంటే ఈ శాస్త్రాల ఆధారంగా యూరోపియన్ సమాజాన్ని అర్థం చేసుకున్న నమూనాను యూరోపేతర సమాజాలని కూడా అన్వయించకుండా ఉండడం ద్వారానే ఇది సాధ్యం. గిరిగీసుకుని ఉన్న శాస్త్రాల పరిధులకు ప్రాంతీయ అధ్యయనం లొంగదు; అది కేవలం ఏ ఒక్క శాస్త్ర విశ్లేషణకో లోబడకుండా, బహుశాస్త్ర సమ్మిళితమైన దృక్పథాన్ని అలవర్చుకుంటేనే సాధ్యమవుతుంది.


వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం
విస్సెన్‌షాఫ్ట్ కొల్లేగ్, బెర్లిన్, 2000.
డెర్ టాగెష్పీగెల్ పత్రిక నుంచి

ఈ నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంతీయ అధ్యయనానికి నారాయణ రావు మార్గదర్శకం చేస్తున్న ఈ సహకార పరిశోధనా సంప్రదాయం ఎంత గొప్పగా తోడ్పడగలదో, ఇప్పటికే ఎంత తోడ్పడిందో మనం సులభంగానే గ్రహించగలం. ఎందుకంటే, ఈ కొత్త సంప్రదాయం అప్పటిదాకా వేటికవేగా వున్న శాస్త్రీయ పరిశోధనల మధ్య వున్న సరిహద్దులను చెరిపివేసింది. ఆయా పరిశోధకుల మధ్య చర్చకు, తమ అనుభవాల కలబోతకు, ఆ రకంగా ప్రాతీయ అధ్యయనరంగాలలో వారికి సంపూర్ణమైన అవగాహన రావడానికి దారి తీసింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యంలతో కలిసి నారాయణ రావు వ్రాసిన దక్షిణ భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం (Textures of Time: Writing History in South India, 1600-1800, Permanent Black, 2001) అన్న పుస్తకం. ఈ పుస్తకం, వలస పాలనకు ముందు భారతీయ సమాజంలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో చారిత్రక అవగాహన ఉన్నదా? అనే అంశం మీద అప్పటిదాకా ప్రాచుర్యంలో వున్న అభిప్రాయాలను సవాలు చేస్తూ, వలసపాలనకు పూర్వం భారతీయ సంస్కృతిపై జరిగిన పరిశోధనలలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పుస్తకం ప్రభావాన్ని మరికొంతగా వివరిస్తాను.

అల్ బీరూనీ 11వ శతాబ్దం లో చేసిన విమర్శ మొదలుకొని ఎంతోమంది విదేశీయులు భారతీయులకు చారిత్రకస్పృహ లేదు అని పదే పదే వ్యాఖ్యానిస్తూనే వున్నారు. కానీ నారాయణ రావు అతని సహరచయితలు ఇది నిజం కాదని చూపిస్తారు. పాశ్చాత్య, మధ్యధరా ప్రాంతాల సాహిత్యంలో లాగా భారతదేశంలో, ప్రత్యేకించి దక్షిణభారత సాహిత్యంలో చారిత్రక రచన అంటూ ఒక ప్రత్యేకమైన ప్రక్రియ లేకపోవడమే ఇటువంటి విమర్శకు కారణం. అప్పటికే యూరోపియన్ సాహిత్యంలో స్పష్టమైన వర్గీకరణలు, జాన్రాలు (Genre) అమలులో ఉన్నాయి. భారత సాహిత్యంలో చారిత్రక రచన ఏ ఒక్క సాహిత్యవర్గానికో పరిమితమై ఉండలేదు. అటువంటి విభజనలకి అతీతంగా పద్య మహాకావ్యం నుంచి తెలుగు వచన చారిత్రము దాకా సాహిత్యంలో ఎన్నో రూపాలలో అది విస్తరించింది. ఈ సాహిత్యరూపాలేవీ కూడా స్వతస్సిద్ధంగా చారిత్రక రచనలు కావు; ఆ రకంగా అవి ఎప్పుడూ ఆ సమాజంలో చూడబడలేదు. 16వ శతాబ్దంలో బాగా చదువుకొని, వ్రాయడం నేర్చుకొని, రాజాస్థానాలలో కవిలెలు రాసే వారిగా, రాచకార్యాల వివరాలు నమోదు చేసేవారిగా వ్రాయసగాళ్ళ ఉద్యోగాలు చేసే ఒక విద్యాధిక వర్గం ఏర్పడింది. ఈ రకమైన జాన్రాతీత సాహిత్యం మొదటగా వారి వల్లనే పుట్టిందనీ, దాని పుట్టుక, పెరుగుదల వ్రాయసగాళ్ళ వర్గం ప్రాభవంతో జతపడి ఉందనీ ఈ పుస్తక రచయితలు వాదిస్తారు. నారాయణ రావు, అతని సహరచయితలు ఈ పుస్తకంలో షుమారు ఇరవై పుస్తకాలను ఈ వాదనకు ఆధారంగా చూపిస్తారు. కేవలం తెలుగు నుంచే కాకుండా తమిళం, సంస్కృతం, మరాఠీ, పార్సీ — ఇలా ఎన్నో భాషల నుంచి, ఎన్నో జాన్రాల నుంచి ఉదహరించి విశ్లేషించారు. ఇంత పరిపూర్ణమైన విచారణ ఏ ఒక్క శాస్త్రపద్ధతి ద్వారానో, ఏ ఒక్క సాహిత్య పరిశోధకుడి వల్లనో రాగలిగేది కాదు. ఈ పుస్తకం చదివిన వారికి వలస ఆధునికతకు ముందు కాలంలో దక్షిణభారత దేశంలో చరిత్ర వ్రాసుకునే తీరు ఒకటి ఉండేదనీ, ఆ తీరు ఆ ప్రాంతానికే ప్రత్యేకమైనదనీ నిస్సందేహంగా బోధపడుతుంది. సంప్రదాయంలోనూ, భావకల్పనలోనూ, ఈ చారిత్రక రచనా పద్ధతి యూరోపు, చైనా, మధ్య ఆసియా పద్ధతులతో కొన్ని లక్షణాలను పంచుకున్నప్పటికీ, వాటికంటే ఊహాత్మకంగా ఎంతో విభిన్నమైనది అని విశదపడుతుంది.

ఈ ఊహాత్మక విభిన్నతను రెండు అక్షాల ఆధారంగా ఈ ముగ్గురు రచయితలు పరిశీలిస్తారు. అవి, ఒకటి శైలీలక్షణం. రెండు సామాజిక నేపథ్యం. ఈ రెండు అక్షాలను కలగులుపుకుంటూ, దక్షిణ భారత దేశపు సాహిత్యాన్ని పరిశీలించడం ద్వారానే భారతీయ చారిత్రక దృక్పథాన్ని అర్థం చేసుకోగలుగుతాం.

మొదటి అక్షం శైలీలక్షణం. లేదా ఒక రచన వ్రాయబడిన తీరు. శైలీభేదాలు, భాషాప్రయోగాలు, ఈ రెండు రచనా సాధనాలు పడుగు, పేకలా కలిసిపోయిన తీరు ఏ పుస్తకానికైనా ఉండే ఒక శైలీలక్షణాన్ని నిర్వచిస్తుంది. ఇది సాహిత్య లక్షణాల కలనేత. ఈ అర్థం స్ఫురించడానికేనేమో “టెక్స్‌చర్స్” (Textures) అన్న పదాన్ని నారాయణ రావు ఉద్దేశించాడు. మనం ముఖ్యంగా ఈ శైలీలక్షణాన్ని, అంటే ఆ సాధనాల ఉపయోగంలో వ్యత్యాసాలను మరింత లోతుగా పరిశీలించాలి. ఈ లాక్షణికతా విన్యాసాలను అత్యంత జాగరూకతతో పసిగట్టడం ద్వారానే దక్షిణ ఆసియా సాహిత్యంలో చారిత్రకత ఎలా భాగం కాగలిగిందో మనం తెలుసుకోగలం. ఇది ఈ అక్షపు సిద్ధాంతం.

చారిత్రక వృత్తాంతానికి సంబంధించిన శైలీలక్షణం భిన్నంగా ఉంటుంది. అనుభవ వేద్యమైన సత్యాలను, కార్య కారణ సంబంధాలను విస్తరించి చెప్పడం, విలక్షణమైన సంఘటనల ప్రత్యేకతను నొక్కి చెప్పడం — ఈ లక్షణంలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందువల్ల, చరిత్ర రచన శైలీలక్షణం, పాఠకుడికి వివరించి చెప్పేదిగానే ఉంటుంది తప్ప అతడిలో భావోద్వేగాన్ని కలిగించేదిగా వుండదు. ఈ సాహిత్యలక్షణం సాధారణంగా, వాస్తవికంగా, నిర్ధారణకు లోబడిన వివరాలను కలిగి వుంటుంది. (ఉదాహరణకి, రంగరాయ చరిత్రము, మనుచరిత్రము రెండూ కావ్యాలే. రెంటిలోనూ కావ్య లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కానీ రంగరాయ చరిత్రంలో సంఘటనలు వాస్తవం ఆధారమైనవి కాగా మనుచరిత్ర కేవలం కల్పన. ఈ రెండు కావ్యాల శైలీలక్షణంలో ఈ వ్యత్యాసం చక్కగా కనిపిస్తుంది.) అలా అని ఈ సాధనాల ఆధారంగా సాహిత్యగుణాన్ని నిర్వచించబోవడం వీలు కాని పని. అది నైరూప్య లక్షణం. అందువల్లనే, నారాయణ రావు, అతని సహరచయితలు ఇచ్చిన ఉదాహరణలలో ఏ ఒక్క సాధనమూ విస్పష్టంగా కనిపించదు. కానీ, ఏ ఒక్క ఉదాహరణ తీసుకున్నా, ఆ పుస్తకంలో అన్ని సాధనాలు కలగలసిన శైలీలక్షణం ఎటువంటిదో మనకు సులభంగానే అర్థమవుతుంది. ఇది కేవలం ఈ ముగ్గురు పండితుల విశ్లేషణా స్ఫూర్తి వల్లనే సాధ్యం కాగలిగింది.

ఇక రెండవ అక్షమైన సామాజిక నేపథ్యం, సమాజంలో వస్తున్న ఏ మార్పుల సందర్భంతో ఈ రకమైన చారిత్రక రచనా పద్ధతి, జాన్రాతీత సాహిత్యం ముడి పడివుందో పరిశీలిస్తుంది. ఈ పరిశీలన రెండు ఆశయాలను సాధిస్తుంది. ఒకవైపు, ఈ రకమైన చరిత్ర రచనకు సామాజిక సందర్భాన్ని ప్రతిపాదించి, దాని ఆధారంగా పైన చెప్పుకున్న శైలీలక్షణం ఎలా రూపు దిద్దుకుందో వివరిస్తుంది. రెండవ వైపు, ఇతర భాషల సాహిత్యంలో కూడా చరిత్ర రచన ఇదే విధమైన శైలీలక్షణం కలిగి వుండటానికి గల కారణాలను వివరిస్తుంది. ఈ రెండవ అక్షపు సిద్ధాంతం ప్రకారం, ఈ రకమైన చరిత్ర రచన, 16వ శతాబ్దంలో వ్రాయసగాళ్ళ వర్గ ప్రాబల్యంతో ముడిపడి వుంది. గ్రామాలలో కరణీకపు ఉద్యోగవిధులని స్ఫురిస్తూ ఈ వర్గానికి నారాయణ రావు, సహ రచయితలు ‘కరణాలు’ అని నామకరణం చేశారు. గ్రామకరణాలలా కాకుండా ఈ కరణపు వర్గీయులు గ్రామాల స్థాయిని దాటి — రాజాస్థానాలలో మంత్రులుగా, ఆర్థిక శాఖలో గణకులుగా, దౌత్య కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించే వారిగా, దౌత్యరాయబారులుగా — అనేకమైన ప్రభుత్వోద్యోగాలు నిర్వహించారు.

ఇలా ఎన్నో విభిన్నమైన రంగాలలో బాధ్యతలు నిర్వర్తించే వీరందరినీ ఒక తాటిన కలిపి వుంచినది “కరణ సంస్కృతి”. ఈ సంస్కృతికి ఐదు ప్రధాన లక్షణాలున్నాయి. 1. ఈ వర్గీయులందరూ విద్యాధికులు. ప్రాథమిక విద్యాస్థాయిని దాటి, గణాంకాలు, ముసాయిదా తయారీ, ఇత్యాది ప్రత్యేకమైన శాస్త్రాలలో ఉన్నత శిక్షణ పొందిన వారు. 2. ఈ వర్గీయులు వచనానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, పద్య ప్రధానమైన భారతీయ సాహిత్య సంస్కృతికి భిన్నంగా వ్యవహరించిన వారు. 3. కరణ సంస్కృతిలో కవి, లేఖకుడు ఒకరే. ఇతర వర్గాలలో కవులు ఉండే వారు, కానీ వారి సాహిత్యానికి లిఖిత రూపాన్ని ఇచ్చిన వ్రాయసగాళ్ళు వేరే వారు. అందువల్ల కరణేతర సంస్కృతుల్లో సాహిత్యం పదిమంది కలిసి వినడానికి, లేదా పెద్దగా చదివి వినిపించుకోడానికి అనువైనది. ఆ రకంగా అది ప్రకాశపఠనానికి అనువైన సాహిత్యం. కేవలం కరణీకులలో మాత్రమే మౌనపఠనానికి, అంటే ఏకాంతంగా చదువుకోవటానికి అనువైన సాహిత్యాన్ని మనం గమనిస్తాం. 4. కరణ సంస్కృతి ఇంకో ముఖ్య లక్షణం, అది బహు భాషామిళితమైనది కావటం. కరణీకం ఏ ఒక్క భాషాప్రాంతానికో, ఒక ఉపజాతికో నియమితమైనది కాదు. అది బహు విస్తారమైనది. అనేక ప్రాంతీయ భాషలనుండి, సంస్కృతం, పార్సీ వంటి విశ్వవ్యాప్త భాషా సంస్కృతుల దాకా విస్తరించినది. కరణాలు ఉద్యోగరీత్యా బహుభాషా వేత్తలు. వారి భాష వారి కార్యకలాపాలలో ఇతర భాషల సంపర్కం ద్వారా వృద్ధి చెందినది. అనేక భాషా సాహిత్యాల చరిత్ర రచనలో కనిపించే శైలీలక్షణ సామ్యం, ఈ భాషాసంపర్కం వల్లనే సాధ్యపడింది. 5. చివరిగా, కరణాలు రాజులతో ఇచ్చిపుచ్చుకునే సంబంధంతో ఉండేవారు. రాజులు వీరి విద్యానైపుణ్యాల మీద ఎంతగానో ఆధారపడేవారు అయినప్పటికీ అధికార వాంఛ లేకుండానే, రాజరికాన్ని గౌరవిస్తూనే కరణాలు వారి బాధ్యతలను నిర్వహించారు. గ్రంథకర్తలే చెప్పినట్లుగా, “కరణీకులు బాహాటంగా అణకువ ప్రదర్శిస్తూ తెరచాటుగా పాలన చక్కబెట్టడంతోనే సరిపెట్టుకున్నారు. (పే. 111.)

వెల్చేరు నారాయణ రావు, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్ — ఈ ముగ్గురూ తమ మేధలో, పరిశోధనలో, అగ్రగణ్యులు. అయినప్పటికీ టెక్స్‌చర్స్ ఆఫ్ టైమ్ వంటి పరిపూర్ణమైన గ్రంథాన్ని వీళ్ళల్లో ఏ ఒక్కరూ ఒంటరిగా వ్రాయగలిగేవారని నేననుకోను. వీరికున్న బహుశాస్త్రకోవిదత్వం కూడా తక్కువేమీ కాదు. కానీ వీరి శాస్త్రీయ దృక్పథాలు వేరు. అవి సున్నితంగా స్పృశించి అన్వయించుకోగలిగిన సమాచారం వేరు. వీరిలో ఒక్కొక్కరి శాస్త్రవిజ్ఞానం ఈ పుస్తకానికి ఎంత ముఖ్యమైనదో, ముగ్గురూ కలిసికట్టుగా ఒకే విషయాన్ని వేర్వేరు దృక్పథాలతో పరిశీలించి చేసిన విశ్లేషణ కూడా అంతే ముఖ్యమైనది. ఈ ముగ్గురూ తమకు తాముగా వ్రాసిన పుస్తకాలను, కలిసి వ్రాసిన ఈ పుస్తకాన్ని లోతుగా చదివిన వారికెవరికైనా, ఈ పుస్తకంలోని ఆలోచనలు, ప్రతిపాదనలు మునుపెన్నడూ కనిపించనవనీ, అవి కేవలం వీరి సహకార గ్రంథకర్తృత్వం వల్లనే సాధ్యమైనవని స్పష్టంగానే అర్థమవుతుంది. ఒక వస్తువు పూర్ణత్వం, ఆ వస్తువులోని వేర్వేరు భాగాల మొత్తం కంటే ఎక్కువగా వుండటమనే నానుడి వీరికి ఈ పుస్తక సందర్భంలో చక్కగా అన్వయిస్తుంది.

అందుకేనేమో, ఈ పుస్తకం ముందుమాటలో ఈ ముగ్గురు రచయితలు — ఏ భాగం ఎవరు రాశారో, ఏ ‘మసాలా దట్టించిన వాక్యం’ ఎవరిదో అంటూ వారే ఇంతకు ముందు వ్రాసిన సార్థకప్రతీకలు (Symbols of Substance, 1992) పుస్తకంపై చేసిన విమర్శకుల ఊహాగానాలని ఏకకంఠంతో తిరస్కరిస్తారు. “ఈ పుస్తకంలో ప్రతీ వాక్యము, ప్రతీ పదము మేము ముగ్గురమూ కలిసి వ్రాసినది. అందువల్ల ఈ పుస్తకం బాగోగులకు మాది సమానమైన ఉమ్మడి బాధ్యత.” అని ఘంటాపథంగా చెప్తారు. అక్కడితో ఆగకుండా, ఈ వ్యాసారంభంలో ఉటంకించిన నారాయణ రావు సూక్తిని గుర్తుకు తెచ్చేలా, “సాహిత్యమే రచయితలని సృష్టించేదైతే, మా నమూనా ది క్రానికిల్స్ ఆఫ్ హొనోరియో బుస్తోస్ డోమెక్ (The Chrnicles of Honorio Bustos Domeq, p.xii) పుస్తకాన్ని పోలినది.” అంటారు. ఈ పోలిక అర్హెంటీనా రచయిత హొర్హే లూయీస్ బోర్హెస్ (Jorge Louis Borges, 1899-1986) తనకంటే వయసులో చిన్నవాడైన అడోల్ఫో బియోయ్ కాసారెస్ (Adolfo Bioy Casares, 1914-1999) తో కలిసి సృష్టించిన సాహిత్యం గురించినది. వీరిద్దరూ కలిసి, వారి ఉమ్మడి కృషికి సూచనగా హొనోరియో బుస్తోస్ డోమెక్ అన్న మారుపేరుతో రచనలు చేశారు. వారి సహగ్రంథకర్తృత్వానికి ఆపైన బియోర్హేస్ అన్న పేరు కూడా వచ్చింది. ఈ పోలిక చూపడం ద్వారా, నారాయణ రావు, సంజయ్, డేవిడ్‌, తమ తమ స్వంత ఉనికిని ఒక ఉమ్మడి పేరులోకి పరాధీనం చేసే ప్రయత్నంగా తమ పుస్తకాన్ని భావించమంటున్నారు.

బియోయ్, బోర్హెస్ ప్రస్తావన ఇక్కడితో ఆగకుండా, ఇంకొక లోతైన అనుబంధాన్ని నిర్వచించడానికి కూడా సముచితమైనదని నాకు బలంగా అనిపిస్తుంది. లెవీన్ (Suzan Jill Levine) ఈ ఇద్దరు అర్హెంటీనా రచయితల మధ్య బంధాన్ని, ఇన్వెన్షన్ ఆఫ్ మొరేల్ అన్న పుస్తకం ముందుమాటలో ఇలా వివరిస్తుంది:

బోర్హెస్ శిష్యుడిగా, అతనికి తోడ్పడే రచయితగా మాత్రమే బియోయ్ కాసారెస్ లాటిన్ సాహిత్యలోకంలో గుర్తింపబడడంతో, బోర్హేస్ నీడ నుంచి అతను బైటికి రాలేకపోయాడు. బోర్హేస్ బియోయ్‌ని సీక్రెట్ మాస్టర్ అని ఒకసారి వర్ణించాడు. ఎప్పటిలాగానే బోర్హేస్ మాటకు ద్వందార్థం ఉండింది. మాస్టర్ అనడంలో బోర్హెస్ ఉద్దేశ్యం, పెద్దలకే పాఠాలు చెప్పగలిగిన పిల్లవాడిని సంబోధించే తీరు అది. గురుశిష్యుల కంటే కూడా, బోర్హేస్, బియోయ్ జీవితాంతం ప్రాణ స్నేహితులుగా మెలిగారు. సాహిత్యం గురించి, వారి అభిమాన రచయితల గురించి నిరంతరం ఎంతో అభినివేశంతో వారు చర్చిస్తుండేవారు. ఈ సాహిత్యాభిలాష వారిద్దరికీ సమంగానే లాభం చేకూర్చింది.

ఈ అర్హెంటీనా రచయితల పేర్ల స్థానంలో నారాయణ రావు అతని సహరచయితల పేర్లు ఉంచి మళ్ళీ చదివితే, ఈ ముగ్గురు రచయితల అనుబంధం ఎలాంటిదో మనకు స్పష్టమైతుంది. నారాయణ రావు నమ్రతనీ, ఇతరుల సహచర్యంలో ఉండే సుగుణాన్ని ఈ అనుబంధం చూపిస్తుంది. ఇదే నారాయణ రావు, అతని “ప్రాణ స్నేహితులు” మనకు దారి చూపిస్తున్న పరిశోధనా పద్ధతి.


Textures of Time: Writing History in South India 1600-1800 (2001): ఈ పుస్తకానికి బీజం ఎలా పడింది, వ్రాయడం ఎలా జరిగింది, సంజయ్ సుబ్రహ్మణ్యం ఈ సంచికలో వ్రాసిన లేఖలో చదవండి. ఈ పుస్తకం మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం సరళం చేసిన అనువాదాలు కూడా ఇవ్వబడినాయి.

షెల్డన్ పోలాక్ వ్రాసిన విమర్శాత్మక సమీక్ష (హిస్టరీ అండ్ థియరీ, సంపుటి 46, అక్టోబర్ 2007) పిడిఎఫ్, అదే సంచికలో వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మక సమాధానం పిడిఎఫ్. ఈ రెండు వ్యాసాలు అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వార్షిక సమావేశాలలో భాగంగా 2006లో ఈ పుస్తకంపై జరిగిన ప్రత్యేక చర్చ నుండి వచ్చినవి. ఇదే చర్చలో భాగంగా రమ మంతెన వ్యాసం, క్రిస్ చేకూరి వ్యాసం కూడా ఈ సంచికలో పొందుపరచబడినాయి.