జీవిత నవల (Biographical Novel)
మనిషి జీవితం లాంటి ఒక మామూలు ముడి పదార్థాన్ని తీసుకొని స్వచ్ఛమైన కళారూపంగా మార్చి చూపే పరుసవేది జీవిత నవల. ఒక జీవనయానాన్ని, ఆ ప్రయాణంలో నమోదైన మైలురాళ్ళవంటి సంఘటనలను, ప్రామాణికమైన ఆధారాల పునాదుల మీద కేవలం పునర్నిర్మించడమే కాదు; వాస్తవబద్ధమైన మానవ జీవనాన్ని అద్భుతమైన సాహిత్యంగా మలిచి మనకు ప్రదర్శించి అబ్బురపరుస్తుంది.
వాస్తవ జీవితాల్లో కనిపించే రమణీయత కాల్పనిక సాహిత్యంలోని సృజనకు ఏ మాత్రమూ తీసిపోదని, మానవ వ్యక్తిత్వంలోని అంతులేని, అంతు చిక్కని సంక్లిష్టతలని మించిన కథావస్తువు లేదనే బలమైన నమ్మిక జీవిత నవలకు పునాది, ప్రాతిపదిక. ‘మనిషే మానవాళి అధ్యయనం’ అన్న అలగ్జాండెర్ పోప్ మాటలని అక్షరబద్ధం చేసే సవాలుని తన భుజాలపైకి ఎత్తుకుంది జీవిత నవల. అందుకే, పాత్రలే దానికి వస్తువు. పాత్రల వికాసం, విస్తరణే దానియొక్క అంతస్సూత్రం. వాటి పరిపూర్ణత్వమే దాని అంతిమ తీర్మానం, ముగింపు.
జీవిత నవలా ప్రక్రియ తన మాతృకలైన కాల్పనిక కథా శిల్పాన్ని, జీవిత వాస్తవాలను కలగలుపుకొంటుంది. అక్కడితో ఆగకుండా వాటికి మాతామహి అయిన చరిత్రను కూడా తన కథనంలో సమ్మిళితం చేసుకుంటుంది. జీవిత నవల లక్ష్యం జీవితంలో జరిగిన ప్రతీ సంఘటననీ ఏకరువు పెట్టటం కాదు. ఆ జీవితాన్ని సంగ్రహంగా పరికల్పించడం; కథానాయకుడి వ్యక్తిత్వాన్ని అతని దేశ కాల చారిత్రక నేపథ్యంలో ప్రామాణికంగా పునఃప్రతిష్టించగలగడం; అన్నిటికీ మించి నవలాశిల్పం యొక్క నిర్దిష్టమైన ప్రమాణాలని, అంచనాలనీ అదే సమయంలో అందుకోగలగడం, జీవిత నవల ఆశయము, లక్ష్యము కూడా.
ప్రధానంగా జీవిత నవలా రచయిత ఒక మేలిమి పటకారుడని నేను నిస్సంకోచంగా చెప్పగలను. అంతేకాదు, జీవిత నవల ఒక బలమైన సాహిత్య ప్రక్రియ అనీ, అది మానవ చరిత్రలో వాస్తవంగా జరిగిన గొప్ప కథలని చెప్పడానికి సృష్టించబడిందని కూడా చెప్తాను. నవలకున్న గొప్ప లక్షణం పాత్రల పెంపుదల. ఆ శిల్పలక్షణాన్ని సలక్షణంగా వినియోగించుకోగల అవకాశం సంపూర్ణంగా చేజిక్కించుకున్న భాగ్యశాలి జీవిత నవల. నవలాగమనం కదలకుండా, పెరగకుండా స్థిరంగా ఉండే స్థాణువు కాదు – పాత్రల పెంపుదల, వాటి వికాసం మంచి చెడుల దిశగానో, సృష్టి లయల రూపంగానో పరిణామం చెందుతూనే ఉంటుంది. పాత్రలలో ఈ పరిణామాన్ని గమనించడం కంటే ఉత్కంఠ కలిగించే సాహిత్యానుభూతి నవల పాఠకుడికి ఇంకొకటి లేదు. ఈ విషయంలో జీవిత నవలకు సాటి రాగల సాహిత్యప్రక్రియ మరొకటి లేదు – ఎందుకంటే, పాత్రల పెంపుదల అనే ఈ నవలాలక్షణం, జీవితానికి స్వభావసిద్ధమైనది. జీవిత చరిత్రలో (Biography) ప్రధానం మనిషి, అతని పెంపుదల మాత్రమే కానీ, నిరాపేక్షమైన చరిత్ర కాదు.
ఒక వ్యక్తి జీవితాన్ని అక్షరబద్ధం చేసే చరిత్రకారుడికి (Biographer) లేని స్వేచ్ఛ, ఆ వ్యక్తి మనస్తత్వాన్ని విశ్లేషించడంలో, జీవిత నవలారచయితకి (Biographic Novelist) ఉంటుంది. అందువల్ల తను చదువుతున్న వ్యక్తిని ప్రభావితం చేసిన ప్రేరణలతో మమేకమయి, ఆ వ్యక్తితో సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకొనే అవకాశాన్ని పాఠకుడికి కలిగించ గలుగుతాడు. అయితే, ఈ ప్రక్రియలో చారిత్రక వివరాలు పలుచబడే అవకాశం లేకపోలేదు. సాధారణంగా మనం మన జీవితంలో పదింట తొమ్మిది వంతుల వివరాలని విస్మరించి, మన జ్ఞాపకాలలో ఘనీభవించిన అనుభవాలనుంచే జీవితానికి అర్థం చెప్పుకున్నట్లుగా, జీవిత నవలలో కూడా చారిత్రక వాస్తవాలు వివరంగా లేకపోవటం సహజమే! జీవిత నవల కేవలం వాస్తవాల ఏకరువు మీద ఆధారపడ్డది కాదు. మానవజీవితంలో సహజమైన, న్యాయమైన ఆవేశకావేషాల ఆటుపోటులను చిత్రించడమే దాని ధ్యేయం. మనం అప్పుడే విన్న గణాంకవివరాలని వెంటనే మరచిపోగలం; కానీ మనం ఒకసారి అనుభవించిన భావోద్వేగాన్ని స్మృతిపథం నుంచి తీసిపారెయ్యడం అంత సులభం కాదు! అలాగని, పాఠకుడిలో కృత్రిమంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసే చేసే ప్రయత్నం సఫలీకృతం కానేరదు.
ఒక వ్యక్తి జీవితాన్ని సందేశాత్మకంగా ప్రదర్శించడానికి గానీ, దేశకాలమాన పరిస్థితులను క్రోడీకరించడానికి ఆలంబనగా తీసుకొని గానీ, జీవిత చరిత్ర (Biography) రాయవచ్చు. కానీ జీవిత నవల (Biographical Novel) వ్యక్తి యొక్క అంతఃవైరుధ్యాల నుంచో, వ్యక్తుల మధ్య సంఘర్షణల నుంచో, లేదా వ్యక్తికీ విధికీ మధ్య జరిగే పోరాటాల నుంచో సహజంగా, సహజాతంగా ఎదగాలి. మనం పంచుకోగల అనుభవం మన సొంతమై, స్వీయానుభవంలో అంతర్భాగమైపోతుంది కాబట్టే, జీవిత నవల పాఠకుడిని కథలోని భావోద్వేగమనే నెగడులోకి నెట్టి, ఆ స్పందనని తన సొంతం చేసుకోమంటుంది. ఈ రకంగా పుట్టిన స్పందన ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని, జ్ఞానాన్ని కలిగి మేధకు అందనిదిగా ఉంటుంది.
శాస్త్రీయమైన చరిత్ర రచనలలో పాఠకుడు ఒక సాధారణ ప్రేక్షకుడు మాత్రమే. పుస్తకం పుటల్లో తను చదువుతున్న సంఘటన ఏనాడో తనకి సంబంధం లేని వ్యక్తుల మధ్య జరిగినది. కానీ, అదే సంఘటన జీవిత నవలగా మలిచినప్పుడు పాఠకుడు కూడా అందులో భాగస్వామి అవుతాడు. మొదటి పుట తెరచిన మరుక్షణం నుంచే ఆ కథ అతనని తనలోకి లాగేసుకుంటుంది. ఆ కథతో అతను తాదాత్మ్యం చెందడంతో, పాఠకుడికి సంబంధించినంత వరకూ కథ అతని వర్తమానంలోనే జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా కథని ప్రేరేపించే ప్రధాన పాత్రధారిగా పాఠకుడు మారిపోతాడు. అందువల్ల చరిత్ర సమకాలీనమయిపోతుంది – నిజానికి ఎప్పుడూ ఇలానే కదా జరిగేది? ఈ రకంగా చరిత్రతో తాదాత్మ్యం చెందగలిగే సౌలభ్యం వల్లనే చారిత్రక జీవిత కథలు అంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయేమో! ఈ రకంగా కథలో, చరిత్రలో మమేకత్వం పొందగలిగే లక్షణమే పఠనాన్ని క్రియాశీలకంగా మార్చగలదు. పాఠకుడు ఒక వెయ్యి జీవితాల అనుభవాన్ని ఏకకాలంలో పండించుకోగలడు. నెపోలియన్ కథలో పాఠకుడినే నెపోలియన్ చెయ్యగలిగే మహిమ – ఈ సాహిత్యప్రక్రియలోని సమ్మోహన శక్తి.
మెరెజ్కోవ్‌స్కీ (Dmitry Merejhkovsky) రాసిన లియొనార్డో డావించీ ప్రేమకథ, విజేత అనే పేరిట గెర్ట్రూడ్ అథెర్టన్ (Gertrude Atherton) రాసిన అలగ్జాండర్ హామిల్టన్ జీవిత కథ తప్పించి, అమెరికాలో మూడు దశాబ్దాల క్రితం వరకూ జీవిత నవలలు ఆమోదించబడలేదు, లేవు కూడా. కానీ, ఈనాడు చెప్పుకోదగ్గ ప్రతి ప్రచురణకర్త జాబితాలోనూ ఇవి చోటు సంపాదించాయి. శైశవదశని దాటింది కాబట్టి, జీవిత నవలని రాయడంలోని మెళకువలని, మౌలికనియమాలని చర్చించే కాలం ఆసన్నమయిందేమో!
జీవిత నవల రాసే రచయిత పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఒకటుంది. చరిత్ర అతనిని, అతని కథని నిర్దేశించే పాలకుడే గాని, అతని కథకి లొంగిపోయే బానిస కాదు. చారిత్రక పరిశోధన ఎంత లోతుగా, సమగ్రంగా ఉంటే ఆ కథ అంత లోతుగా, సమగ్రంగా ఉంటుంది. రచయిత పరిశోధన సారహీనంగా, సందిగ్ధంగా, రెచ్చగొట్టే విధంగా ఉంటే పర్యవసానంగా కథ కూడా అంతే పలుచగా, రెచ్చగొట్టే రీతిలోనే ఉంటుంది.
అన్ని జీవితాలలోనూ కథలకి పనికొచ్చే ముడిపదార్థం ఉండదు. ఎందరో మహానుభావులు ఉండవచ్చు గాక, వారి ఘనత ఎంతో విలువైనది కావొచ్చు గాక – కానీ, అవన్నీ వాటంతటవిగా ఒక కథాక్రమానికి లొంగకపోవచ్చు. కాని, కొంతమంది వ్యక్తులు, తామొకనాడు ఏదో కథలో ప్రధాన పాత్రధారులమవుతామనే స్పృహతో జీవించారా! అనిపిస్తుంది. వారు అప్రమేయంగానే తమంత తాముగా ఒక కథకి అవసరమయిన శిల్పాన్ని సృష్టిస్తారు. అటువంటి వ్యక్తుల జీవితంలో నవలకి అవసరమయిన ప్రత్యేకమైన నాటకీయపు హంగులు, జయాపజయాలు, వ్యధలు, బాధలు, సంఘర్షణలు పడుగుపేకలై ఆ జీవితం ఒక కథగా తనని తానే ప్రకటించుకుంటుంది.
రచయిత తనకి పనికొచ్చే జీవితాలని ఎన్నుకోడానికి స్వతంత్రుడైనప్పటికీ, తనెంచుకున్న కథాక్రమానికి అనువుగా వాస్తవాలనీ, సత్యాన్నీ వక్రీకరించకూడదు. చారిత్రక వాస్తవాలని మెలిపెట్టి, వంచించి తన కథని రక్తి కట్టించాలని ప్రయత్నించే రచయితల దౌర్భాగ్యపు ప్రయత్నాలు ఈ రంగంలో చెల్లవు. అలాగే, నీతి బోధలు, రాజకీయ ప్రయోజనాలు ఆశించే రచయితలకీ, కరపత్ర రచయితలకీ తేడా లేదు. ఇంతకుముందు అమెరికన్ రచయితలు, జీవిత కథలని తమకి కావాలసిన విధంగా మలచుకుని, చరిత్రని వంచించి, సత్యానికి తిలోదకాలిచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఆ కథలేవీ సహేతుకమైన జీవిత చరిత్రలు కావు, విశ్వసనీయమైన నవలలూ కావు. ఒక లక్ష్యానికో, ప్రయోజనానికో అవసరమైన హంగులన్నీ విస్తారంగా ఈ చారిత్రక నవలల్లో ఉంటాయి. జీవిత నవలా ప్రక్రియ, ఇంకా యవ్వన దశలోనే ఉన్నప్పటికీ మోసపూరితమైన ప్రయోజనాలకి వాడుకోబడింది. అయితే, ఈ ప్రమాదం ప్రతి కళకీ ఎప్పుడూ పొంచే ఉంటుంది – ముఖ్యంగా మనిషి మేధని, ఆలోచనలని ఆక్రమించాలని పోరాటం జరుగుతున్న సమయాలలో ఇటువంటి ప్రయత్నాల దుర్గంధం మనల్ని విముఖులని చేస్తుంది. రచయిత యొక్క వ్యక్తిగతమైన, వృత్తిపరమైన చిత్తశుద్ధి మాత్రమే అతను సృజించిన జీవిత కథ కాలపరీక్షలో నెగ్గి చిరాయువు కాగలదా లేదా అనే అంశాన్ని అంతిమంగా నిర్ణయిస్తుంది.
కథాసామగ్రికి, రచయితకి మధ్య – సున్నితమూ, స్వచ్ఛము, పరస్పర త్యాగశీలతతో కూడి – సమతుల్యమైన బాంధవ్యం ఏర్పడితేనే జీవితచరిత్రలు సుసంపన్నమయిన కథలుగా రూపాంతరం చెందుతాయి. నవల తయారయ్యే ప్రక్రియలో ఈ ఇద్దరూ – జీవిత చరిత్ర (Biography), రచయిత (Novelist) – ఒకరితో ఒకరు తులతూగే ముఖ్యమైన పాత్రధారులు. కథాసామగ్రి రచయితని లోబరుచుకుని, కథాశిల్పాన్ని వెక్కిరించే మలుపులు తీసుకోవచ్చు, లేదా రచయిత కథాసామగ్రిని తన ఇష్టానుసారంగా లోబరుచుకోవచ్చు. ఇలా ఏ ఒక్కరు, రెండవ వారికి లొంగినా, లోబరుచుకున్నా, నవలలో సమతౌల్యత నశిస్తుంది. ప్రతి కథనీ గొప్పగా చెప్పడం ఏ రచయితకీ సాధ్యపడదు. తెలివైన రచయిత, తను అర్థం చేసుకోగలిగే కథ కోసం, తనని కదిలించే కథ కోసం, తను సజీవంగా సృజించగలిగే కథ కోసం నిరంతరం వెతుకుతాడు; అది దొరికేవరకు ఆగుతాడు. తమ శక్తిసామర్థ్యాలు తప్పుగా అంచనా వేసుకొనో, లేక కథని, కథాసామగ్రిని పూర్తిగా అర్థం చేసుకోలేకో, వివేకహీనంగా రంగంలోకి దూకే నవలాకారుల రచనలు సారహీనమైన పిప్పిలా మాత్రమే ఉంటాయి.
‘ఈ వ్యక్తి జీవితం నేను చెప్పదలచుకున్న కథకి ఉపయోగపడుతుందా?’ అని తర్కించే అధికారం లభించాలంటే రచయిత ముందుగా ‘ఈ వ్యక్తి జీవితాన్ని కథగా రాయడానికి నేను తగినవాడినేనా?’ అని తనని తాను ప్రశ్నించుకోవాలి.
జీవిత నవలారచయిత జీవితాన్నుంచి అనుభవాల గంజి వార్చేవాడు కాదు. మానవ జీవితానుభవం అనే మరిగే ద్రావణం లోంచి సాహిత్యాన్ని తేటపర్చగల నైపుణ్యుడైన కలాలి. అందుకే, జీవిత, సామాజిక చరిత్రల ఊనిక ఎంతగా ఉన్నప్పటికీ, అంతిమంగా జీవిత నవల రచయిత మేధస్సుని దాటిపోలేదు. కౌశలం లేని రచయితను ఎంత బలమైన చరిత్ర అయినా, ఎంతో అద్భుతమైన జీవిత చరిత్ర అయినా, కాపాడలేవు. కథా సామగ్రిలో, చరిత్రలో ఎంత ఉద్రేకమున్నప్పటికీ, రచయిత ఉద్విగ్నరహితుడైతే, నవల కూడా ఉద్వేగరహితమవుతుంది. రచయితలో హాస్యచతురత కొరవడితే రచనలోనూ హాస్యరసం లోపిస్తుంది, రచయిత లక్ష్యం సంకుచితమైతే, నవల కూడా తన హృదయవైశాల్యాన్ని కోల్పోతుంది. కథానాయకుడి జీవితం ఎంత మహోన్నతమైనదైనా, రచయిత కపటి అయితే రచన కూడా బూటకమే అవుతుంది. అందుకనే, జీవిత నవల కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర చిత్రణ మాత్రమే కాదు. అది ఆ నవలా రచయిత ప్రతిభ, నైపుణ్యతలకు తార్కాణం కూడా!
చరిత్రని లోతుగా అధ్యయనం చెయ్యని ఒక సాధారణ పాఠకుడు ఒక జీవిత నవల సత్యతను, పరిపూర్ణతను ఎలా నిర్ధారించుకోగలడు? ‘ఇదెంత వరకు నిజం’ అన్న ప్రశ్నకి సమాధానం ఎలా కనుగొనగలడు? దానికొకటే మార్గం ఉంది – శాస్త్రీయమైన చరిత్ర రచనలలోనూ, జీవిత చరిత్రలలోనూ ఎంత సాధికారమైన ఆధారాలు ఉంటాయో, జీవిత నవలలో కూడా అంతే సాధికారత ఉండాలి.
ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?
సంక్లిష్టమైన కథాశిల్పాన్ని ఊహించే కుశలత, పాఠకుడిలో ఉద్వేగాన్ని కలిగించే నేర్పు, రక్తి కట్టే సన్నివేశ రూపకల్పన, ఆకట్టుకునే సంభాషణలు నడిపించే ఒడుపు – వీటి సరసన సాహిత్యపు సౌరభం నిండిన వాక్యరచనా పటిమ, ఉత్కంఠభరితమైన కథన చాతుర్యం; వీటన్నితో కుస్తీలు పట్టి, కాల్పనికరచనలో ప్రవీణుడైన రచయితే జీవిత కథలని నేర్పుగా రాయగలడు. జీవిత నవల రాయడానికి ముందు కనీసం ఐదూ పది నాటకాలు రాసి, నాటకరచనలోని అంతర్లీనమైన పోడిమిని గ్రహించాలి. కథని రంగస్థలం మీద ప్రదర్శించే నేర్పు రచయితకి చాలా అవసరం, ఎందుకంటే కళ్ళకి కట్టినదే కథ, అటువంటి కథే రక్తి కడుతుంది.
జీవిత నవలారచయిత చరిత్రరచనలో సుశిక్షితుడు కావాలి. ఒక వ్యక్తికి గానీ, లేదా కొంతమంది వ్యక్తులకి సంబంధించిన సమాచారాన్ని సమకూర్చుకోవడంలోనూ, దానిని సమ్మిళితం చేసుకుంటూ అమర్చుకోవడం లోనూ, ఒక జీవిత గమనంలో ముందువెనుకలుగా, అంతర్గతంగా పెనవేసుకుపోయిన కథని ఆకళించుకోవడంలోనూ, రచయిత నిష్ణాతుడై ఉండాలి. చెప్పదలచుకున్న కథని సజీవమూ, చైతన్యవంతమూ చెయ్యడానికి అనువయే శైలివిన్యాసాలను అలవర్చుకోవాలి. ప్రాణపతిష్ట చేసి, ఒక చారిత్రిక వ్యక్తిని ఆ వ్యక్తిత్వంతో తిరిగి పాఠకుడి అనుభవంలో సజీవుడుగా నిలపగలిగే సాహిత్యమర్మాన్ని రచయిత ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రతి జీవితానికీ తనదంటూ ఒక ప్రత్యేకమైన రూపురేఖలు ఉంటాయి, వాటిని ఒడుపుగా పట్టుకోవడంలోనే ఆ కథ శతకోటి కథలనుంచి వేరుపడి తనదైన అస్తిత్వాన్ని సంపాదించుకోగలదు.
జీవిత నవలారచయిత జోనాస్ సాల్క్ లాగా (Jonas Salk) సునిశితుడైన శాస్త్రీయ పరిశోధకుడు అయ్యుండాలి. శాస్త్రీయ పరిశోధన ఎలా చెయ్యడం అనే విషయం నేను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదివిన ఆరేళ్ళలోనూ బోధనాంశంగా ఉండేది కాదు. శాస్త్రీయంగా పరిశోధన చెయ్యడం ఎలా అనేది నాకు నేనుగా, తప్పటడుగులు వేస్తూ నేర్చుకోవలసి వచ్చింది. ఈనాడు పరిస్థితులు చాలా మారాయి. శాస్త్రీయ పరిశోధన ఒక పాఠ్యాంశంగా ఎన్నో కళాశాలలు బోధిస్తున్నాయి. అటువంటి పరిశోధన యొక్క సాధన సామగ్రి నేర్చుకోడానికి ఈనాడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
పలుగు, పార పనిముట్లుగా, అకుంఠిత దీక్షతో పురాతన నగరాల చారిత్రక శోభని వెలికితీసే పురాతత్వ శాస్త్రవేత్తని మరిపించేటట్టుగా, చారిత్రక పరిశోధనలో దొరకని వాస్తవమంటూ ఉండదనీ, కఠోరమైన ఓరిమితో, అంతకుమించిన చతురతతో, వెతికితే ఏనాటికైనా ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరికి తీరుతుందనే అచంచల విశ్వాసం జీవిత నవలారచయిత అలవరచుకోవలసిన పరిశోధనా దృక్పథం. వినూత్నమైన రీతుల్లో ఒక కళాకారుడు తన ఊహాలోకాన్నే విధంగా కొత్తపుంతలు తొక్కిస్తాడో అదే విధంగా పరిశోధకుడు తనకి అవసరమైన ఆధారాల కోసం ఎక్కడ, ఎలా వెతకాలో నిరంతరం నిత్యనూతనమైన మార్గాలు కనిపెడుతూ ఉండాలి. అంతే కాకుండా, ఒక ప్రేమపిపాసి కుండే మొక్కవోని దృఢచిత్తం చారిత్రక నవలాకారుడికి అవసరం. ఎందుకంటే, సర్వసాధారణంగా, తన కథకి ఎంతో అవసరమైన సమాచారం ఎక్కడో లోతుగా దాగి ఉంటుంది. పొదివి పట్టుకున్న తన సౌశీల్యాన్ని, సొగసులని తనని ఎంతగానో ప్రేమించిన మనసుకే అది అర్పిస్తుంది.
ఒక ప్రహేళిక పూరించడంలో, ఒక అపరాధ పరిశోధనలో ఉన్న ఉత్కంఠత చరిత్ర పరిశోధనలో కూడా ఉంటుంది, కానీ చారిత్రక పరిశోధన చాలా కష్టమైన పని – అలుపెరుగని, నిరంతరాయమైన కృషి కావాలి. పరిశోధకుడు ఒక్కోసారి సమాచారం అనే ఊబిలో కూరుకుపోవడమో, వాస్తవాల కాననంలో చిక్కుకుని తప్పిపోవడమో జరుగుతూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే, జీవిత కథ సముద్రంలో తేలుతున్న హిమపర్వతం వంటిది. ఎలాగైతే, తొమ్మిదొంతుల మంచుకొండ నీటి మట్టానికి దిగువనే ఉండి, పైనున్న ఒక్కవంతు గంభీరంగా కదలడానికి తోడ్పడుతుందో, అలాగే నవలలో పాఠకుడికి చెప్పిన కథ కంటే అన్నిరెట్లు ఎక్కువ వివరాలు రచయితకి తెలిసుండాలి, లేకుంటే కథ తేలిపోతుంది. తను దాచిన తొమ్మిదొంతుల పరిశోధనా సామగ్రి నవలలోని ప్రతి పేజీ నేపథ్యంలోనూ నిమ్మళంగా ఒదిగి పాఠకుడికి పెద్దదిక్కులా నమ్మిక కలిగిస్తుంది. ఒక కావ్యంలోనో, కథలోనో ప్రతి ఉదంతం చెట్టుకి పండిన ఫలం వంటిదే – ప్రతి ఫలానికి ఎలా తనదంటూ ఒక ప్రత్యేకమైన రంగు, రుచి, వాసన ఉంటాయో, నవలలో ప్రతి ఉదంతానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. నేపథ్య పరిశోధన, జీవిత నవలలోని ప్రతి ఉదంతానికి చిక్కదనాన్ని ఆపాదిస్తుంది, అదే పాఠకుడిలో ఈ సాహిత్యం మేడిపండు కాదనే స్పందనని కలుగజెయ్యగలదు. అందుకే, జీవిత కథలకోసం రచయిత చేసిన పరిశోధన రక్తమాంసాదుల వంటి నిర్మాణం. పైకి కనిపించే సాహిత్యం ఆ పరిశోధనకు రూపునిచ్చే చర్మం వంటిది.
ఒకసారి, ఏదో అంతుచిక్కని విషయం గురించి అమెరికాలో ప్రసిద్ధులైన చరిత్రకారుల్లో ఒకరైన చార్లెస్ బెర్డ్ (Charles A. Beard) సహాయం కోరి న్యూ కానన్ లో ఆయన లైబ్రరీలో ఆయన్ని కలిశాను. మాటల సందర్భంలో “ముప్పై ఏళ్ళుగా నేను నమ్మినది అసత్యమంటూ ప్రతి రోజూ ఏదో కొత్త సమాచారం నాకు ఎదురుపడుతూనే ఉంటుంది” అని ఆయన అన్నారు. అదే రీతిని, ఒక్కోసారి పరిశోధకుడికి ఒకే విషయానికి సంబంధించి పరస్పర వైరుధ్యమైన కథనాలు, వేరువేరు తారీఖులతో, సందర్భాలతో సహా దొరుకుతాయి. అటువంటప్పుడు రచయితకి సత్యం ఏనాటికైనా బయటపడుతుందని, దొరికినవే కాకుండా సిసలైన కథనం ఎక్కడో ఉందని, కొత్త మార్గంలో అన్వేషిస్తే అది బలమైన సాక్ష్యాధారాలతో దొరుకుతుందని, ధృఢమైన విశ్వాసం ఉండాలి.
జీవిత నవలారచయితకి సంబంధించినంత వరకూ, చరిత్ర అచంచలమైన పర్వతం కాదు, అది ఒక నిత్యచలితమైన ప్రవాహం. ఒక సరికొత్త లోజూపో, మరొక ఆధునిక భాష్యమో పాత కథకే కొత్త అర్థాన్నో, దృక్పథాన్నో స్ఫురింపచేయవచ్చు. ఎప్పుడో జీవించిన వ్యక్తుల చరిత్రకి ప్రాణపునఃప్రతిష్ట చెయ్యడంలో జీవిత నవలా రచయిత పురాతత్వ శాస్త్రజ్ఞుడే – అతని పనిముట్లు కేవలం పలుగు, పార కాదు. మండుటెండలో శిథిలాల తవ్వకంలో నుదుట పట్టిన చెమట, కాయలు కాచిన చేతివేళ్ళు, అటుపిమ్మట రాబోయే అసలైన పరిశోధనకి, కొత్త భాష్యాలకీ తెరతీసే పురోభావ సూచనలు మాత్రమే!
సమాజంలో వేళ్ళూనుకొనిపోయిన చారిత్రక సమాచారాన్ని సవాలు చేసే ప్రశ్నార్థక దృక్పథం జీవిత నవలారచయితకి ఎప్పుడూ ఉండాలి. నా తోటి రచయిత రాబర్ట్ గ్రేవ్స్ (Robert Greaves), టసిటస్ నవల చదివినప్పుడు, ‘ఇది ఖచ్చితంగా అబద్ధమే’ అని అతని మనసుని పట్టి ఊపేసిన అలజడి ‘ఐ, క్లాడియస్’ అనే చారిత్రక నవలకి ప్రాణం పోసిందని, మయోర్కాలో (Majorca or Mallorca) జరిగిన ఒక సభలో నాతో చెప్పాడు.
ఈనాటికీ చరిత్రలో నిజాలుగా పాతుకుపోయి గౌరవించబడుతున్న సత్యాలు, అర్థసత్యాలు నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఎన్నో ముఖ్యమైన, విస్తారమైన అంశాలు (ఒక ఉదా: అమెరికా అంతర్యుద్ధం) కూడా క్షుణ్ణంగా పరిశోధించబడలేదు. మరి కొన్ని చారిత్రకాంశాలను అసలెవరూ పట్టించుకోలేదు కూడా! సరిగ్గా, ఈ నిర్లక్ష్యమే, సరికొత్త దృక్పథంతో, యవ్వనోత్సాహంతో ఉరకలేస్తున్న జీవిత నవలారచయితకి అందివచ్చిన సువర్ణావకాశం అని నా అభిప్రాయం. ఎందుకంటే అతను పాతుకుపోయిన సంప్రదాయంలో అసత్యాన్ని ‘ఇది కచ్చితంగా అబద్ధం’ అని ఆరోపిస్తాడు. ఆ పైన ‘అవును, ముమ్మాటికీ ఇదే నిజం’ అని యదార్థాన్ని నిరూపిస్తాడు. ఆవిధంగా అతడు చరిత్ర చీకటి గుహల్లో మగ్గిపోతున్న ఎన్నో జీవితాలలో తన పరిశోధనా కరదీపికలతో నిజమనే వెలుగుని నింపగలిగే సాహిత్య సత్యాన్వేషిగా భాసిస్తాడు.
అందుకే, అతను ఒక సాహసవంతుడైన యోధుడు కూడా అయ్యుండాలి. సాధారణంగా అర్థవంతమైన, బలమైన, కథలన్నీ చరిత్రలో ఉపేక్షించబడ్డ, వివక్షకి గురికాబడ్డ, అపఖ్యాతిపాలైన వ్యక్తులవే అయ్యుంటాయి. నా రచనల నుంచే యుజీన్ డెబ్స్, రాకెల్ జాక్సన్, మేరీ టాడ్ లింకన్ కథలనే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దురభిప్రాయాలని నిర్ద్వంద్వంగా తోసిరాజని, ఆర్ద్రతతో, సమతౌల్యంతో, వివేకంతో సత్యాన్ని కనుగొని, ప్రదర్శించే ప్రయత్నమేదైనా ఎదురుకోళ్ళకి, తిరస్కారానికి తట్టుకుని నిలబడవలసి ఉంటుంది. సాధారణంగా మనిషి ఆస్తికి ఎంతగా అనురక్తుడై ఉంటాడో, అంతకంటే ఎక్కువగా సనాతన విశ్వాసాలకీ, మూఢనమ్మకాలకీ కట్టుబడిపోయి వుంటాడు. అంతేగాక, ఆ శృంఖలాలని తెంచుకోటానికి సిద్ధపడడు.
చివరగా, జీవిత నవలారచయితకి పుస్తకం సనాతనమనే విశ్వాసం ఉండాలి, పుస్తకాలని అతను అమితంగా, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే, అతని జీవితకాలంలో సింహభాగం రకరకాల పుస్తకాల అధ్యయనంలోనే గడపవలసి ఉంటుంది – అందులో చాలాభాగం కొరకరాయి కొయ్యలై ఉంటాయి. చిన్న చిన్న అక్షరాలని పట్టిపట్టి చదవడంలో అతని కళ్ళు కలకబారతాయి. పచ్చబారి పెళుసైపోయిన ప్రతులు, పాతబడిపోయి, క్షీణించిన ఆంతరంగిక పత్రాలు, ఉత్తరాలలోని వెలిసిపోయిన సిరాకి అలవాటు పడడంలో తలనొప్పులు అతనికి ప్రీతిపాత్రాలు కావాలి. అన్నిటికీ మించి, సాహసించి బిగ్గరగా చదివితే పళ్ళు రాలగొట్టే శక్తి ఉన్నవిగా నమ్మబడే మృత్యు సముద్రపు ఫలకాలను (Dead Sea Scrolls) సైతం అతను సాహసోపేతంగా, అమితంగా, గాఢంగా ప్రేమించాలి.
ఇక, కొన్ని నిర్దిష్టమైన విషయాలని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.
లియొనార్డో డావించీదో, అలక్జాండర్ హామిల్టన్దో జీవిత కథని నవలగా రాయాలని నిర్ణయించుకున్న రచయిత ఒక ఆరునెలలు లేదా ఒక ఏడాది పాటు తానొక రచయితననే భ్రాంతిని తన మనస్సులోంచి పూర్తిగా తుడిచిపెట్టి, పుస్తకాల పురుగై గ్రంధాలయాలు పట్టుకు వేలాడాలి. తనెంచుకున్న చారిత్రిక వ్యక్తికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అతను సేకరించాలి, ఆకళించుకోవాలి. ఆ వ్యక్తికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు, ఆ వ్యక్తి రచనలో, గీసిన చిత్రాలో, సృష్టించిన శిల్పాలో క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. కథానాయకుడికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అతని ఆంతరంగిక పత్రాలు, జ్ఞాపకాలు, అదే నాయిక అయిన పక్షంలో బీరువా మధ్య అరల్లో భద్రంగా దాచి ఉంచిన లేఖలు – అవి విప్పిచెప్పగలగే అద్బుతమైన కథలు – ఒక్క మాటలో చెప్పాలంటే, తన కథానాయకుడికి లేదా నాయికకి సంబంధించిన ప్రతి అక్షరాన్ని పట్టి, పట్టి పట్టుదలతో చదవాలి. ఒకవేళ, కథానాయకుడు సమకాలీనుడైతే, అతనిని ఎరిగిన వ్యక్తులతో, అతని జీవిత నాటకంలో పాత్రధారులందరినీ ప్రత్యక్షంగా కలిసి వారితో ముఖాముఖీ చర్చలు చెయ్యవలసి ఉంటుంది.
ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు, అక్కడి కాలికింద భూమి వాసన, ఆ చోట సూర్యుడు పంచే వెలుగురేఖలు, అక్కడి నగరాల వ్యక్తిత్వం, పల్లెల సౌందర్యం ఇవన్నీ అతను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి – అప్పుడే, అతనికి తన కథని ఆత్మీయంగా తడిమిచూసిన అనుభూతిని అందులో పలికించగలుగుతాడు.
ఇవన్నీ రచయిత మొదటగా చెయ్యవలసినదైతే, ఆపైన చెయ్యవలసిన పరిశోధన కూడా అతి ముఖ్యమైనది. తన కథానాయకుడి కాలాన్ని, అప్పటి సమాజాన్ని, ఆనాటి స్థితిగతులని, అలవాట్లని, ఆనాడు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న అధిక సంఖ్యాకుల వాదాలనీ, అలాగే అల్పసంఖ్యాకుల నమ్మకాలనీ, ఆనాటి సమాజపు మత, తాత్విక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ, సంఘర్షణలనీ లోతుగా అధ్యయనం చెయ్యాలి. క్లుప్తంగా చెప్పాలంటే – ఎటువంటి సాంఘిక, ఆధ్యాత్మిక, అలౌకిక, మానసిక, శాస్త్రీయ, అంతర్జాతీయ వాతావరణంలో తన కథలోని పాత్రలు జీవించాయో, ఏ విధంగా వారి ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మాలు మార్పులు చెందాయో తెలుసుకోవాలి. అప్పటి నేపథ్యాన్ని అవగతం చేసుకోడానికి ఆ కాలంలో ప్రచురించిన పుస్తకాలని చదవాలి. ఆ కాలాన్ని, అప్పటి సమాజాన్ని సజీవంగా పునఃసృష్టించడానికి అవసరమయిన సహస్రాధికమైన వివరాలు గుప్పెట్లోకి రావాలంటే అప్పటి పాత దినపత్రికలు, కరపత్రాలు, పత్రికలు, నవలలు, నాటికలు, కవితలు చదవాలి – ఆ విధంగా, ఆనాటి ప్రజల వస్త్రధారణ, వారి ఇండ్ల రూపురేఖలు, వారు వాడిన గృహోపకరణాలు, శీతాకాలంలో వారి ఇండ్లను ఎలా వెచ్చగా ఉంచుకునేవారో, ఏ కాలంలో ఏ సమయంలో ఏమి తినేవారో, సంతలో వారే వస్తువులు, ఎందుకు, ఎలా కొనేవారో, వాటి ధరలెంతో, వాటి రంగు, రుచి, వాసనలు ఎలా ఉండేవో, వారే అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారో, వాటికి ఏ మందులు వాడేవారో, వారి సంభాషణల్లో ఎటువంటి చెణుకులు, ప్రత్యేకమైన వ్యక్తీకరణలు ఉండేవో, వారి మతాధికారులు వారికి ఎటువంటి ఉపదేశాల నిచ్చేవారో, కళాశాలల్లో ఉపాధ్యాయులు ఏ బోధనలు చేసేవారో – సమస్తం జీవిత నవలారచయితకి తెలియాలి.
తన కథ పట్ల లోతైన స్పందన రచయిత కున్నప్పుడు, విస్తారమైన చారిత్రకసామగ్రిలో నుంచీ, నవలకి ప్రధానమైన వస్తువుని, ఆ నవలకి సహజమైన ఆకృతి, నిర్మాణం, శైలి, శిల్పవిన్యాసాలని – సంగీత కచేరీలో ఆలాపనలోనే రాగలక్షణాలు ప్రస్ఫుటం అయ్యేటట్లు – అతను సులువుగానే కనుగొనగలుగుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, మానవజీవితపు బృహత్పథకాన్ని అతను చూడాలి – ప్రతి జీవితం పకడ్బందీగా అల్లిన కథాశిల్పం. ఎప్పుడైతే రచయిత కథాగమనానికి, దిశానిర్దేశానికి మధ్య తేడాని గుర్తించలేకపోతాడో, అప్పుడు కథలో కృత్రిమమూ, అసహజమూ ఐన కథనం చేరి, మొత్తం కథాచిత్రాన్నే సమూలంగా ధ్వంసం చేసే ప్రమాదం ఉంది.
అయినప్పటికీ, జీవిత నవలా రచయిత, తను సేకరించి, క్రోడీకరించిన కథా సామగ్రిని శాసించే ప్రభువు. తన పరికరాలపై నియంత్రణ లేని పనివాడి చేతి లోంచి కథ జారిపోతుంది. తన కథకి అవసరమైన పరిశోధన పూర్తి చేశాక, అతను పరిశోధకుడి పాత్ర చాలించి, ఒక నవలారచయితగా, తన కథని ప్రత్యేకమైన కథాశిల్పాన్ని తయారు చేసుకోడానికి తన శక్తినీ, కాలాన్నీ వెచ్చించాలి. తన పరిశోధనలలో అతను కైవసం చేసుకున్న జ్ఞానం పాఠకుడికి, కథనానికి మధ్యలో అడ్డుగోడగా ఉండకూడదు. జీవిత నవల వర్తమానంలో, పాఠకుడు చదువుతున్నప్పుడే జరుగుతున్నట్టుగా ఉండాలనేది రచయిత ఉల్లంఘించలేని మౌలికమైన శిల్ప సూత్రం. అందువల్ల, రచయిత కథలో దూరి పాఠకుడికి రాబోయే కాలంలో జరిగేదాని గురించి సూచనలు, బోధనలు చెయ్యకూడదు. పాఠకుడు కూడా కథలో ముఖ్యమైన పాత్రధారి అనుకుంటే, కథలో పాత్రలకి ఎంతవరకూ తెలుసో, అంతవరకే పాఠకుడికి కూడా తెలియాలి. పాఠకుడికి ఏది తెలిసినా, అతనేది తెలుసుకున్నా అది కథలోని పాత్రల ద్వారానూ, కథలోని సంఘటనల ద్వారానే గానీ, రచయిత కథలో ప్రవేశించి స్వారీ చెయ్యకూడదు. రచయిత కథలోని కార్యకారణ సంబంధాలని వివరించే ప్రవక్త కాకూడదు. కథలో ముందు ఏం జరగబోతోందో పాఠకుడు తనకు తానుగా ఊహించుకోగలగాలి గాని కథలోని కాలగమనం రచయిత చేత వక్రింపబడడం మూలంగా కారాదు. రచయిత వివేకవంతుడైతే (భగవంతుడు అప్పుడప్పుడైనా రచయితకి వివేకాన్ని ప్రసాదించుగాక!) కథ స్వభావం నుంచీ, ఆ కథాచట్రానికి లోబడి అతనెంచుకున్న సామగ్రి నుంచీ, ఆ కథలోని పాత్రల తృష్ణ, కోరిక, ప్రేరణలపై అతను పెంపొందించుకున్న అవగాహన నుంచీ, నవల అత్యంత సహజంగా జన్మించి, ఎదిగి పరిపూర్ణమైన జీవికను సాధించుకుంటుంది.
(వ్యాసం రెండవ భాగం వచ్చే సంచికలో…)