కాకా హోటల్లో విపరీతమైన రద్దీగా ఉంది. మనిషి కూర్చోవడానికి చోటు లేదు. పొడుగ్గా వేసి ఉన్న బెంచిల మీద మనుషులు దగ్గర దగ్గరగా కూర్చున్నారు. బెంచి చివర్లలో కూర్చున్న వాళ్ళకి ఒక మోచేయి మాత్రమే ఆనించడానికి చోటు ఉంది. చేతులు కడుక్కొని వచ్చిన వాళ్ళు టీ తాగడానికి ముందే ఖాళీ చేసిన చోటులో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. నిలబడే టీ నీళ్ళు తాగవలసి వస్తోంది. ముగ్గురు నలుగురుగా వచ్చిన వాళ్ళు వేరు వేరు బెంచిలలో కూర్చోవలసి రావడం వల్ల అందరికీ అన్నీ వచ్చాయా అని తొంగి తొంగి చూసుకోవాల్సి వస్తోంది.
సాంబారు, చట్నీ గిన్నెలను మోసుకు వస్తున్న సర్వర్లు ‘సైడ్, సైడ్’ అని అరిచినా తొలిగి దారి ఇవ్వడానికి అక్కడ చోటు లేదు. గిన్నె అంచులో ఉన్న సాంబారు, చట్నీలు దారి ఇస్తున్నట్లు ఒకవైపు వంగి నిలబడ్డ వాళ్ళ చొక్కా మీద పడుతోంది. తిన్న తరువాత అరిటాకును తిన్నచేత్తోనే మడిచి పట్టుకొని ఎంగిలాకుల తొట్టి వైపు నడుస్తున్న వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఎంగిలి క్రింద పడకుండా పట్టుకొని నడిచి వెళ్తున్నా కూడా నేల మీద, పంచెల మీద సాంబార్ చట్నీ మరకలు పడుతూనే వున్నాయి.
దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ అన్న అరుపులు, ఇడ్లీ చల్లారి ఉంటుందని వేడిగా దోశ కోసం ఆకు ముందు కాచుకొని ఉన్నవాళ్ళు, రసం వడ తేవడం కోసం ఆకులో ఉన్న దోశని తినకుండా ఉన్నవాళ్ళు, మొదటి విడత తినేసి రెండో విడత కోసం ఎండిపోతున్న ఎంగిలి చేత్తో అలాగే కూర్చున్న వాళ్ళు, ఆ చేత్తోనే టీ నీళ్ళు తాగి ఆనక లేద్దామని కూర్చున్నవాళ్ళు, ఆఖరున కూర్చున్నవాడు తిని లేవడం కోసం ఓపికతో కాచుకొని ఉన్నవాళ్ళు…
“ఒరేయ్! కాస్త మంచి నీళ్ళు తెచ్చిపెట్టు.” అని అరిచే వాళ్ళు, సగం దోశను ఆకులో ఉంచేసి ఇంకో రౌండ్ చట్నీ సాంబారు కోసం కాచుకొని ఉన్నవాళ్ళు, “ఇదిగో అబ్బీ, లెక్క ఎంతయింది?” అని అడుగుతూ నిలబడ్డ వాళ్ళు…
లోపల్లాగుకి పైన మాసి పోయిన టవల్ మాత్రం చుట్టుకొని ప్లేట్లలో ఇడ్లీ, దోశలను తీసుకొని నడుస్తున్న సర్వర్లు, చేతిని ఆ టవల్ తోనే తుడుచుకొని మంచి నీళ్ళ గ్లాసులలో వేళ్ళను ముంచి తీసుకొని వచ్చి ఇస్తున్నారు. చట్నీ, సాంబార్ గిన్నెలను తీసుకొని పరుగులు పెడుతున్నారు. పరుగుల మధ్య గల్లా దగ్గర లెక్కలు చెబుతున్నారు. వంట చేసే చోట నిలబడిన వాళ్ళ మీద కేకలు వేస్తూ వెళ్ళ గొడుతున్నారు.
రోజూ కాకా హోటల్లో ఇదే లెక్కన రాత్రి దాకా కూడా వ్యాపారం కొనసాగితే ఆ హోటలు వోనరు ఈ పాటికి కోటీశ్వరుడు అయ్యేవాడు. కానీ ఇదంతా పది రోజుల పండగే. అందులోనూ గుడి ముందు జెండా ఎక్కిన మొదటి మూడు రోజులకూ పెద్దగా జనం ఉండరు. నాలుగో రోజు తిరునాళ్ళప్పుడు మాపటి వేళ ఆరు గంటలకి దుకాణం తెరిస్తే తెల్లారే దాకా ఇదే హడావిడి. అందులోనూ రధోత్సవం నాడు రాత్రీ పగలూ కూడా కాకా హోటలికి విరామం ఉండదు.
మెట్ట వీథి మారాజు ఈ ఏడు రోజుల్లోనూ కాసుల రాసులని పెద్ద ఎత్తున పోగు చేసుకుంటాడు. ఇందులో పోలీసు వాళ్ళకి, దేవసం బోర్డ్ అధికారులకి, దుకాణాలను వేలంవేసే అధికారులకి, ఊళ్ళో పెత్తనం చెలాయించే పెద్ద మనుషులకి దమ్మిడీ ఖర్చు లేకుండా తినిపించినా అది వడ్లగింజలో బియ్యపు గింజ లాంటిదే. పెద్దగా ఏ నష్టమూ ఉండదు.
గుడి ముందు జెండా ఎక్కిన రోజే తన పొలం ఉన్న జాగాలో అమ్మాసిని పిలిపించి మట్టితో నడుం దాకా గోడను లేపి వాకిటిని పెట్టి భోజనం చేయడానికి, వంటకీ అని రెండు భాగాలుగా విడదీసి, నాలుగు పక్కలా తాటాకులతో గోడలాగా చేసి, పది బెంచీలు, మేజ బల్లలూ వేయించగానే – భగవతి విలాస్ కాపీ క్లబ్ తయారు.
ఒకటికి రెండింతలు ధర. సాధారణంగా రెండు రూపాయలకి అమ్మే ఇడ్లీ, దోశ, వడ అన్నీ ఐదు రూపాయలు. సరకు యొక్క నాణ్యం, సైజు గుంపును బట్టి మారుతూ ఉంటుంది. కొబ్బరి పిప్పితో నీళ్ళ చట్నీ, గుమ్మడికాయ ముక్కలు వేసి శనగపిండి కలిపిన సాంబారు. కానీ అన్నీ ఎప్పుడూ వేడి వేడిగా దొరుకుతాయి.
ఊరిలో ఉన్న వాళ్ళెవరూ జాతర సమయంలో కాఫీ క్లబ్బుకి వచ్చే అలవాటు లేదు. పాట కచ్చేరి వినడానికి, వాహనంలో దేవుడి ఊరేగింపునూ చూడడానికి వచ్చే జనమే అంతా. నాగర్ కోవిల్ నుంచి సుశీంద్రానికి రాత్రి, పగలు అని లేకుండా జాతర స్పెషల్ బస్సులు ఉంటాయి. కాబట్టి చుట్టు ప్రక్కల పది పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న ఊర్ల నుంచి గుంపులు గుంపులుగా జనం వచ్చి చేరుతారు.
ప్రతీ రోజూ రెండు కచ్చేరీలు. సాయంత్రాలలో శూల మంగళం సిస్టర్స్, కే.పి. సుందరాంబాళ్ , సీర్గాళి గోవిందరాజన్, బాలమురళీ కృష్ణ అని ఆరు గంటలనుంచి తొమ్మిది దాకా ఉంటుంది. తరువాతా నామగిరి పేట్టై , ఏ.కే.సి., చిట్టి బాబు, రమణి అని రాత్రి మూడు దాకా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వినీ వినీ చుట్టు ప్రక్కన గ్రామంలో ఉన్న వాళ్ళకి కొంచం సంగీత జ్ఞానం వచ్చేసింది. ఎదురుచూసిన రీతిలో కచ్చేరీ లేకపోతే మాత్రం సంగీత జ్ఞానాన్ని తాత్కాలికంగా వెనక్కి నెట్టి రాళ్ళూ విసిరి, ఈలలు వేసి విద్వాంసులను తరిమి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒక సారి పీకల దాకా తాగి వచ్చి రాజరత్తినం పిళ్ళై నాదస్వరాన్ని చేతిలో పెట్టుకొని, పెళ్ళాం చచ్చి పోయిన వాడిలాగా తల దించుకొని కూర్చున్నాడని ఇప్పటికీ చెప్పు కుంటారు. ఆ పాపం పోయేటట్లు మరుసటి సంవత్సరం తెల్లవారే దాకా, ఐదు గంటలవరకూ ఆయన నాద స్వరం వాయించారనీ, అప్పుడు గంటన్నర సేపు ఆయన వాయించిన తోడి రాగం ఇప్పటికీ ఆ మండపంలో మారు మ్రోగుతున్నదనీ అతిశయోక్తిగా చెబుతూ ఉంటారు.
జాతర సమయంలో ప్రతీ ఏడూ వచ్చే జనానికి తక్కువలేనట్లుగానే కాపీ క్లబ్బుకి వచ్చే జనానికీ తక్కువలేదు. ఇంకా చెప్పాలంటే తిరునాళ్ళ సమయంలో కొత్తగా వెలిసే కాపీ దుకాణాలు లేక పోలేదు.
మాణిక్యానికి సంగీతంలో పెద్దగా ఆసక్తి ఏమీ లేదు. కానీ కాస్త పాటల పిచ్చి మాత్రం ఉంది. సినిమా పాటలని అచ్చు అలాగే పాడతాడు. స్కూల్లో జరిగే పాటల పోటీలో భారతియార్ పాటలను పాడటం, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేలలో జెండా వందనం పాటలను పాడటం అలవాటు. ఇప్పుడు తొమ్మిదవ తరగతికి వచ్చిన తరువాత కూడా టీచర్లు దేవారం, తిరువాశకం పాటలను రాగయుక్తంగా పాడటం నేర్పించినా అది సినిమా పాటలు పాడినట్లుగా లేదు.
మాణిక్యం తండ్రికి తోడి, భైరవి, ఖరహర ప్రియలకు తేడా తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. అయినా కూడా పాట కచ్చేరికి వెడతారు. అందరూ వెళ్తున్నారు కదా అని వెళ్ళొచ్చు. కచేరి ఆఖరున పాడే తుక్కడా, సినిమా పాటలకోసం అయి ఉండొచ్చు. లేకపోతే మనుషుల సందడి, బీడీ ప్రకటన కోసం వేయించే ఓరియంటల్ డాన్స్, మత్స్య కన్నె, మృత్యు బావి లాంటి ఆకర్షణల కోసం అయి ఉండొచ్చు. ఇదీ అని నిర్ధారణగా చెప్పడానికి వీలు లేదు. తిరునాళ్ళ ప్రోగ్రాం నోటీసు చూసినప్పటి నుంచి మాణిక్యం తండ్రిని నస పెట్టడం మొదలు పెట్టాడు.
“నాన్నోవ్, ఏడో రోజు జాతరకి నీతో నేను కూడా రానా?”
“అంత దూరం నడవడం నీ వల్ల కాదురా.”
“నడుస్తాను నాన్నా.”
“ఆనక కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి అని అనకూడదు. వెళ్ళి రావడానికి పది మైళ్ళు అవుతుంది.”
“పోయిన సారి రధోత్సవం చూడ్డానికి వెళ్ళినప్పుడు నడిపించే కదా తీసుకొని వెళ్ళావు.”
“అది పగలు. ఇది రాత్రి కదా. నిద్ర పోకుండా ఉండాలి. తిరునాళ్ళ దుకాణంలో అది కొనివ్వు, ఇది కొనివ్వు అని నస పెట్ట కూడదు.”
నాన్న పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకునే మాణిక్యం తిరునాళ్ళకి బయలుదేరాడు. ఐదు గంటలకి ముందే తండ్రీ కొడుకులు ఇద్దరూ తినేసి బయలు దేరారు. తిరునాళ్ళు చూసి తిరిగి రావడానికి తెల్లవారుతుంది కాబట్టి కడుపుకు ఆకలి వెయ్యకుండా పూర్తిగా మెక్కారు. నడుస్తున్నప్పుడు మాణిక్యం రెండు మూడు సార్లు చేతిని వాసన చూసుకున్నాడు. ఎండు చేపల పులుసు గుబాళింపు ఎంతో సుఖంగా అనిపించింది. తెరేకాల్ పుతూర్, పుదుగ్రామం, తేరూర్ గ్రామాలని దాటి సుశీంద్రం వెళ్ళి చేరడానికి ఏడయ్యింది.
“నాన్నోవ్, సీర్గాళి గోవిందరాజన్ సినిమా పాటలు పాడటం మొదలుపెట్టి ఉంటాడా?”
“దానికి ఎనిమిది దాటాలి. ఇప్పుడింకా రాగం తీస్తూ ఉంటాడు.”
పాత కాలువలో దిగి మెయిన్ రోడ్డుకి ఎక్కి చెరుకు దుకాణం, బాల పాండియన్ మిఠాయి దుకాణం, వేల్ విలాస్ స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దాటి తెప్పోత్సవం జరిగే చోటుకి వెళ్ళి చేరేసరికి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ఎక్కడ చూసినా ఇనుప తొప్పిలు ధరించిన రిజర్వ్ పోలీసులు చేతిలో లాటీకర్రలతో. చూస్తేనే భయంగా అనిపించింది.
“నిలబడకు. ముందుకు వెళ్తూనే ఉండు.” అదిలింపులు.
ప్రధాన ద్వారం దగ్గర నిలబడడానికి కూడా చోటు లేదు. గుంపును రెండుగా విడదీసిన దారిలో చుట్టూ తిరిగి రావడం అయ్యింది. ఎక్కడా కూర్చోవడానికి జాగా లేదు. ఊరిలో అక్కడక్కడా లౌడ్ స్పీకర్లు పెట్టి ఉండడం వలన జనం గుంపులుగా కూర్చుని పాట కచ్చేరి వింటూ ఉన్నారు.
“పా… పా…. పా” అంటూ ఇంకా ఎంత సేపు రాగం తీస్తూ ఉంటాడు అనిపించింది మాణిక్యానికి. ఒక రౌండు చుట్టి వచ్చి గోవిందరాజన్ కంటికి కనబడేటట్టుగా ద్వారానికి పక్కన ఉన్న మండపంలో కూర్చున్న జనానికి మధ్యలో ఎలాగో చోటు చేసుకొని కూర్చున్నారు మాణిక్యం, అతని తండ్రి. సినిమా పాటలు పాడే సమయం ఆసన్నమయింది కాబోలు. జనం మధ్య నుంచి “సినిమా పాటలు.. సినిమా పాటలు..” అంటూ చేతులు పైకి లేచాయి. ఒక్క నిమిషం సుదీర్ఘమైన మౌనం.
“ఏడుకొండల వాడా ఎక్కడున్నావయ్యా” అంటూ పై స్థాయిలో పాట ఎత్తుకోగానే గోవిందరాజన్ గొంతు అగర్ బత్తి పొగలాగా సుడులు తిరిగి జనం మధ్య వ్యాపించింది. కచ్చేరి ముగియడానికి తొమ్మిదిన్నర అయ్యింది. గుంపులో ఒక భాగం వెళ్ళి పోయింది. షేక్ చిన మౌలానా నాదస్వరం, వలయపట్టి, వలంగ మాన్ స్పెషల్ తవిల్ వినడానికి ఇంకో గుంపు వచ్చి చేరింది. కచ్చేరికి ఒక గంట విరామం ఉంటుంది. ఈ విరామ సమయంలోనే సర్కస్, రికార్డ్ డాన్సులూ జోరుగా సాగుతాయి. దొరికిన విరామ సమయాన్ని వినియోగించుకుంటూ బాలపాండియన్ మిఠాయి, తానా బీనా సొక్కన్ లాల్ బీడీ ప్రకటనలు అదిరిపోయేటట్లు వేశారు. లౌడ్ స్పీకర్లలో నాగర్ కోవిల్ దుకాణాలకి నోరు మూయకుండా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.
ఒంటి గంట అయి ఉంటుంది. చల్లని గాలి మెల్లిగా వీయసాగింది. గుంపుకు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల వెచ్చగా అనిపించింది మాణిక్యానికి. గుంపుకు మధ్యలో దారికి పక్కనే కూర్చుని ఉన్నందువలన స్టేజి మీద నాదస్వరం, తవిల్ బాగా కనిపిస్తున్నాయి. ఒక చేతి వేళ్ళకి కుప్పెలు పెట్టుకొని, ఇంకో చేతిలో చిన్న కర్రతో వాయించగానే ‘డు డు డుమ్’ అంటూ తవిల్ ఆక్రోశంగా అదిరింది.
మాణిక్యానికి నిద్ర వస్తున్నట్లు అనిపించింది. నిద్రపోతే నాన్న తిడతాడని భయం కూడా వేసింది. కచ్చేరి ముగియడానికి ఇంకో రెండు గంటలైనా అవుతుందని అనిపించింది. అంతవరకూ నిద్ర పోకుండా ఆపుకోవడం అసాధ్యం. బిత్తర చూపులు చూసుకొంటూ కూరున్నాడు మాణిక్యం. తనియావర్ధనం ముగియగానే, పది చింత చెట్లను ఒకేసారి కుదుపుతున్నట్లు టపటపమని చప్పట్లు చెరువు పక్కన ఉన్న రాళ్ళని తాకి ప్రతిధ్వనించాయి. గుంపులు గుంపులుగా జనం లేవసాగారు. ఖాళీ ఏర్పడిన జాగాలలో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు.
గుంపుతో సహా లేచిన తండ్రితో చేరి మాణిక్యం నడవసాగాడు. బాగా ఆకలిగా అనిపించింది. సాయంత్రం ఐదు గంటలకి తిన్న అన్నం కడుపులో ఏ మూలకి పోయిందో తెలియలేదు. నోట్లో నీళ్ళు ఊరాయి. ఏదైనా తింటే గాని సరిపడేటట్లు లేదు. నాన్నని అడుగుదామా వద్దా అని ఆలోచించాడు. కాసేపు తిరునాళ్ళ దుకాణాలను వేడుక చూస్తూ తిరుగుతూ భగవతి విలాస్ క్లబ్ దగ్గరకి వచ్చారు. వేడి వేడి నూనెలో బజ్జీలు వేగుతున్న వాసన. నాన్న మాణిక్యాన్ని అడిగారు.
”ఏరా.. ఆకలిగా ఉందా?”
“అవును.” తల ఆడించాడు మాణిక్యం.
బయటికి వచ్చే వాళ్ళను తోసుకొని మరీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. డబ్బులు వసూలు చేసే బల్ల చుట్టూ ఒకే గుంపు. ఇద్దరూ చోటు చేసుకొని ఎలాగో కూర్చున్నారు. తలా నాలుగు దోశలు, రెండు రస వడలు, టీ నీళ్ళు. సుద్ద ముక్కతో బోర్డ్ మీద రాసి ఉన్న ధరల పట్టికను చూసి మనసులోనే కూడిక వేసుకున్నాడు మాణిక్యం. అంతా కలిపి ఇరవై ఐదు రూపాయల యాబై పైసలు అయ్యింది. ఎంగిలి ఆకును తీసి తొట్టిలో వేసి నోరు పుక్కిలించి, చేతులు కడుక్కొని తువాలతో నాన్న, షర్ట్ అంచుతో మాణిక్యం చేతులను తుడుచు కొని డబ్బులు ఇవ్వడం కోసం బల్ల దగ్గరికి వచ్చారు.
“కళ్ళజోడు పెద్దాయన ఐదు తొంబై.” “తరువాత మనిషికి పది అరవై.” “ముసలాయన ఖాతా ఐదు రూపాయలు.” అంటూ గొంతులు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. గల్లా ముందు కూర్చున్న అతనికి తలెత్తి ఎదురుగా నిలబడిన మనిషిని చూసి, డబ్బులు లెక్కపెట్టి తీసుకొని, బాకీ చిల్లర డబ్బులు ఇవ్వడం పెద్ద ప్రయత్నంగా అవుతోంది. ఏమీ ఎరగనట్లు ముందుకు నడిచిన మాణిక్యం నాన్న నిదానంగా నిలబడి పంచె ముడిని విప్పి మూడు రూపాయలు తీసి బల్లమీద పెట్టారు. తలెత్తి చూసిన గల్లాదారుకి “రెండు టీ”; అని లెక్క చెప్పి మాణిక్యం చెయ్యిని గట్టిగా పట్టుకొని బైటికి నడిచారు.
కొంచం దూరం వెళ్ళగానే మాణిక్యం వెనకాల తిరిగి తిరిగి చూసాడు. నాన్న ముఖాన్ని కనుకొసలతో ఓరగా చూసాడు. ఒకవేళ నాన్న దీని కోసమే తిరునాళ్ళను వదలకుండా పాట కచ్చేరి వినడానికి వస్తున్నారేమో అని అనిపించింది. ఇకపై నాన్నతో రాకూడదని మనసులో నిశ్చయించుకున్నాడు.
నాంజిల్ నాడన్ కన్యాకుమారి తాలూకాలో జన్మించారు. అసలు పేరు సుబ్రహ్మణ్యం. నాంజిల్ ప్రదేశానికి చెందిన వాడు అని అర్థం వచ్చేట్టుగా తన కలం పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం కోయింబత్తూర్ లో పనిచేస్తున్న వీరి మొదటి కథ విరధం, 1975లో ప్రచురించబడింది. 2002లో వీరి నవల తలైకీళ్ విగితంగల్ సొల్ల మరంద కథై అనే సినిమాగా తంగర్ బచన్ తీశారు. 2010లో వీరి కథా సంకలనం ‘సూడియ పూ సూడర్క’కు సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరి విస్తృత సాహిత్యం ఎన్నో యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ఉంది. జీవితాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నంగా, అసిత్త్వాన్ని వెతికి పట్టుకునే ఒక ప్రక్రియగా తన రచనల గురించి చెప్పుకునే నాంజిల్ నాడన్ రచయిత గురించి ఇలా వ్యక్తీకరిస్తారు: “మెచ్చుకోలుతో రచయిత పుట్టడు, కానీ రచయిత మళ్ళీ మళ్ళీ ఎదురుచూసేది ఆ మెచ్చుకోలు కోసమే.”