ఘటన నించి వెనక్కి లాగి దృష్టిని సంఘటన మనిషి చేతస్సులో పుట్టించే ప్రకంపనల మీద కేంద్రీకరించడం, వాటిల్లోంచి మాటలు ఏరుకుని కవిత్వం అల్లటం – స్థూలంగా ఇదీ మొదటి ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో తెలుగులో భావకవిత్వానికి సమాంతరంగా హిందీలో వచ్చిన ఛాయా వాద కవుల తత్త్వం అని హిందీ సాహితీ పరులు చెప్తారు.
ప్రకంపనలు అనగానే జ్ఞాపకం వచ్చేది శ్రీ శ్రీ మహా ప్రస్థానానికి 1940లో యోగ్యతా పత్రం ఇస్తూ చలం అన్న మాటలు:
“తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం… హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే [శ్రీశ్రీ కే] తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి directగా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవలనిపిస్తుంది.”
ఆరు దశాబ్దాలు గడిచిన తరువాత, ఇస్మాయిల్ తన కవిత్వం గురించి వ్రాస్తూ ఇట్లా అంటాడు:
“పదిహేనేళ్ళ తపస్సు తర్వాత నేను గ్రహించిందేమిటంటే కవిత్వం అనుభవంలోంచి పుడుతుందనీ, కవి ప్రత్యక్షానుభవంలోంచి ఉద్భవించే కవిత్వమే నిజమైన కవిత్వమని, అభిప్రాయాలు, సిద్ధాంతాల వంటి మేధో వ్యాపారపు సరుకులతో కవిత్వం తయారు కాదనినూ. కవి అంతశ్చేతనా, భౌతిక ప్రపంచమూ కలిసేది అనుభవ రంగంలోనే. ఈ రెంటి స్పర్శ వల్లా రగుల్కున్న మంట వెలుగులోనే కవి బహిః ప్రపంచం, మనః ప్రపంచాల అద్భుతాల్ని తిలకించగలడు. జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.”
హృదయం కంపించటం అంటే ఏమిటి? చేతస్సు అంటే ఏమిటి? ఎట్లా ఉంటుంది, అందులో కవి ఎక్కడ మునిగి ఎక్కడ తేలాలి? ఇస్మాయిల్ చెప్పిన మేధో వ్యాపారపు సరుకు అంటే ఏమిటి? అది (చలం మాటల్లో) కవి తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరే దాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావాలకి అడ్డు వస్తుందా? ఎట్లా వస్తుంది? యుద్ధంలో ఆ సరుకు కూడా ఒక పాత్రధారి కాకుండా పోతుందా? ఏది మిత్ర శక్తో ఏది వైరి గణమో కవి ఎట్లా తేల్చుకుంటాడు? అసలు శ్రీశ్రీకి చలం ఇచ్చిన యోగ్యతా పత్రం కవిత్వానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనం పైన ఆధార పడినదైతే, ఆరు దశాబ్దాల తరువాత ఇంకా ఆ నిర్వచనం మళ్ళీ దాదాపుగా అవే మాటల్లో ఇస్మాయిల్ చెప్తే మారినదేమిటి? మారనిదేమిటి?
శ్రీశ్రీ తన కవిత్వాన్ని తూచవద్దు అనుభవించి పలవరించమని చలానికి సలహా ఇచ్చాడని యోగ్యతా పత్రం మొదట్లోనే చలం చెప్తాడు. మహాప్రస్థానం తరువాత రోజుల్లో శ్రీశ్రీ కవితా దృష్టికి మేధో వ్యాపారపు సరుకు అడ్డు వచ్చింది అని ఒక అభిప్రాయం ఈ మధ్యన అక్కడక్కడా వినవస్తోంది. ఆ విమర్శ సరైనది కాదు అని అనే వాళ్ళూ ఉన్నారు. పై పేరాలో ఏకరువు పెట్టిన ప్రశ్నలకి సమాధానాలు లేకుండా శ్రీశ్రీ తన హృదయ ప్రకంపనల మీద పట్టు కోల్పోయాడో లేదో ఎట్లా నిర్ధారించాలో నాకు తెలియదు. ఇలాంటి ప్రశ్నల పట్ల సమిష్టి కృషి జరగడానికి కావలసిన వ్యవస్థ మన యూనివర్సిటీ సాహిత్య విభాగాల్లో ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. అదెట్లా ఉన్నా తెలుగులో సామాన్య ప్రజలకి అందుబాటు లోకి వచ్చే చర్చలు మాత్రం గందరగోళాన్నే ఎక్కువగా సృష్టిస్తున్నాయని అనిపిస్తుంది. జరగవలసిన సంభాషణలు, పరిశోధనలూ చాలా మటుకు గాలికి చెదిరి పోతున్నాయని తోస్తుంది. నిర్ధారణగా చెప్పడానికి కావలసిన సరంజామా నా దగ్గర లేదు, కానీ ఇప్పటికైనా జరిగితే బాగుంటుంది అని నాకు అనిపించే రెండు సంభాషణల గురించి ఈ వ్యాసం. ఇది వ్రాయటం నాకు – అంటే ఒక పద్ధతిగా తెలుగు భాషని కానీ, దాని ద్వారా సాహిత్యాన్ని కానీ సాధన చేసి ఉండని వాడికి – సాహసమే. అందుకే ముందుగా కొంచెం సంజాయిషీ ఇచ్చుకుంటాను.
దాపరికం లేకుండా చెప్పాలంటే నేను మేధో వ్యాపారపు సరుకుని, అది కూడా వచన రూపంలోనే, ఇంగ్లీషు లోనే ఎక్కువగా చదువుతాను అని చెప్పక తప్పదు. ఏ భాషలోనైనా కవిత్వం నాకు ఎప్పుడయినా ఎక్కిందంటే అది కవిత్వం కైపు తెలిసిన మిత్రులు చదివి వినిపించినప్పుడే. అయితే పని/ శ్రమ/ పనితనం ఇట్లాంటి మాటలంటే నాకు మోజు. జమాపద్దులు వ్రాయటమైనా, పసిపిల్లలకు మూతులూ ముక్కులూ తుడవటమైనా, కవిత్వం వ్రాయటమైనా శ్రద్ధతో చేసే వాళ్ళ పట్ల నాకు ఆసక్తి. అందుకే కవులు, తమ పని గురించి వ్రాసుకునే వ్యాసాలు చెప్పుకునే మాటలూ వీలైనప్పుడు చదవడమో అడిగి చెప్పించుకోవడమో చేస్తుంటాను.
కవిత్వాన్ని ఒక పనిగా చూడవచ్చును అని నాకు నేర్పినది పదిహేను సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక మైథిలీ బ్రాహ్మణ మిత్రుడు. పరిచయమైన రెండవ రోజునే ఈ మిత్రుడు శ్రీశ్రీ మహాప్రస్థానం వినాలని ఉంది అడిగి నాతో చదివి వినిపించుకుని, అందుకు బదులుగా రాత్రి తెల్లవారే దాకా హిందీ, మైథిలి భాషల్లో కవిత్వం చదివి వినిపించాడు. అన్నీ వివరంగా జ్ఞాపకం లేవు కానీ ఆ రాత్రి విన్న దాంట్లో నాకు ‘బాబా నాగార్జున’ అన్న కవి అల్లిన కవిత్వం లోని చాలా పంక్తులు ఇప్పటికీ ఆ మిత్రుడి స్వరంలోనే జ్ఞాపకం ఉన్నాయి. ఈ మధ్యన తెలుగులో కవిత్వం గురించి ముఖ్యంగా వెబ్ పత్రికలలో జరుగుతున్న చర్చలు చూస్తూండగా నాకు ఆ రాత్రి జ్జ్ఞాపకం వచ్చింది. ఆ పైన కొన్ని అనుమానాలు వచ్చాయి. అవి నివృత్తి కావాలనుకోవటంతో పాటుగా కాలంతో చెదిరిపోతున్న సంభాషణలను ఒక దగ్గర ప్రోవు చేసి ఉంచితే ఎప్పటికైనా పనికొస్తుంది అనే ఆలోచన ఈ వ్యాసం వ్రాసే సాహసం నాతో చేయిస్తోంది.
కవిత్వానికి కావలసిన సరుకు ఎంతో కొంత అంతస్సులోనించి రాకపోతే పుట్టేది ప్రచారమే కానీ కవిత్వం కాదు – అన్న మాట మనకు ఇవాళ చాలా కామన్ సెన్సికల్గా కనిపిస్తుంది. కానీ మనం అంతస్సు అని చెప్పుకుంటున్నది ఎప్పుడూ ఒక లాగే ఉండి ఉంటుందా? లేదా దీనికి ఒక చరిత్ర ఉందా? ఒక నైసర్గిక నక్షా గీయటం సాధ్యమవుతుందా? చలం [మనిషి] చేసే “అంతర్బహిర్ యుద్ధారావాలే”‘ కవిత్వం అంటాడు. బాహ్య ప్రపంచం చారిత్రకంగా భౌగోళికంగా ఎప్పుడూ అన్నీ చోట్లా ఒకేలా ఉండదు కదా? మరి అంతస్సు అన్నది ఎప్పుడూ అన్నీ చోట్లా ఒకేలా ఉంటుందా ? అంతస్సుకీ బాహ్య ప్రపంచానికీ మధ్య హద్దులో మరి? అవి కూడా మారుతూ ఉంటాయా?
ఇట్లాంటి ప్రశ్నలకు కొంత వరకు సమాధానాలు చూచాయగా పార్థా చటర్జీ(1986) పుస్తకంలో[1] దొరుకుతాయి. ఆయన చెప్పేదేమంటే ఒకానొక చారిత్రక సందర్భంలో, జాతీయోద్యమం రాజకీయ ఉద్యమంగా బలపడుతుండే తరుణంలో – భారతీయులు ఒక అంతర్ – బహిర్ అనే సరిహద్దుని రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నారు అని. పల్లె జీవనం – పట్టణ జీవనం, ఆధ్యాత్మిక జీవనం – భౌతిక జీవనం, స్త్రీ – పురుషులు, ఇల్లూ -వాకిలీ, ఇట్లాంటి రకరకాల ద్వయాల మీదకి అంతః ప్రపంచం – బాహ్య ప్రపంచం అనే ద్వయాన్ని ప్రొజెక్టు చేశారు అని ఆయన సూచిస్తారు. ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే, ఇలాంటి ద్వయాలు కవుల ఊహాశక్తికి ఒక గొప్ప ఊపునిచ్చి ఉంటాయి అని మనం చెప్పుకోవటం తేలికే. (అందుకే కాబోలు, ఇస్మాయిల్ అరవై డెబ్భై సంవత్సరాల క్రితం మనకి కవిత్వమెక్కడదీ అంటాడు.) ప్రొజెక్టు చేయడానికి ఇవేవీ బల్ల పరుపుగా ఉండే ఉపరితలాలు కావు కాబట్టి ఈ పరస్పర విరుద్ధమైన ప్రతీకల జంటలు ఒక దానితో ఒకటి అల్లుకు పోయి ఉంటాయి అని చెప్పటం సబబు కావచ్చు. (భారత దేశాన్ని ఒక స్త్రీ మూర్తిగా ఊహించుకుంటే, ఆ స్త్రీ మూర్తిని కాపాడే పురుషులంతా ఆమె గర్భంలోనించి వచ్చిన బిడ్డలవుతారు. వలస పాలకులు బయటినించి వచ్చిన దుర్మార్గులవుతారు. బంకించంద్ర ఆనంద మఠ్ నవల వ్రాయటానికి ముందు భారత మాత ఎక్కడుండేదో ఏమిటో గానీ భరత మాత రూపు రేఖలు ఎట్లా దిద్ద బడ్డాయో తెలుసుకోవాలంటే సదన్ ఝా వ్రాసిన వ్యాసం చూడవచ్చును.)
ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ, ఆ తరువాత చరిత్రే ఇప్పటి వరకు ఎవరూ నిశితంగా ఆలోచించినట్టు కనపడదు. పంతొమ్మిదవ శతాబ్దపు ఆఖర్న కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత రాజకీయ ప్రచారాలకు భాషా పరమైన సంఘాలు ఏర్పడడం ముఖ్యం కావటంతో ఎక్కడికక్కడ భాషామతల్లులు పుట్టుకు వచ్చినట్టు కనపడుతుంది. ఆయా భాషలు మాట్లాడే ప్రజలుండే ప్రాంతాలలో – అంటే ఆ భాషల్లో ప్రభుత్వ ఉత్తర్వులు అందే ప్రాంతాలూ, పత్రికలు సర్క్యులేట్ అయ్యే ప్రాంతాలలో ఉండే వాళ్ళంతా ఆ తల్లులకి బిడ్డలయ్యారు. ఆ క్రమంలో తెలుగు తల్లి ఎట్లా పుట్టిందో, అట్లాగే మలయాళ తల్లి కూడా పుట్టింది (అప్పట్లో పెద్దగా పట్టింపులు ఉండేవి కాదు కాబట్టి పడమర దిక్కుకి ఉండాల్సిన వాలు తూర్పు దిక్కుగా కనపడుతోందని గమనించ గలరు). ఇంకా చాలా మందే ఉండి ఉంటారు.
ఇట్లాగ భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో – ఏది అంతః ప్రపంచమో ఏది బాహ్య ప్రపంచమో నిర్వచించుకోవడానికి ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము. అందుకేనేమో కొంతమంది తెలుగు వాళ్ళకి ఈ మధ్యన పుట్టుకొచ్చిన తెలంగాణ తల్లి అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. కానీ నిజానికి కొత్తగా పుట్టుకొచ్చినదే అయినా ఈ తెలంగాణ తల్లి పద్ధతిగానే తెలుగు తల్లి ఎట్లా పుట్టిందో అట్లాగే పుట్టింది. ఎవరు బయటివారు ఎవరు లోపలి వారు, ఏది లోపలి ప్రపంచమూ ఏది బయటి ప్రపంచమూ అన్నది గుర్తించుకోవడానికీ, దాని మీద ఎంతో కొంత కవితావేశాలు అనుభవించడానికీ వీలు కల్పిస్తుంది.
మొత్తమ్మీద తెలుగు వాళ్ళ అంతర్బహిర్ ప్రపంచాలు రక రకాలుగా అల్లుకుపోయి ఉంటే, వీటిలో ఏది బయట ఏది లోపలా అన్నది ఎక్కడ ఎట్లా నిర్ధారించాలి – అన్న ప్రశ్నకు పార్థా చటర్జీ లాంటి రచయితలు సమాధానాలు చెప్పలేరు. ఎందుకంటే , బయట – లోపల అనే సరిహద్దు స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అందులో విభిన్న శక్తుల మధ్య ఒరిపిడి ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఏ శక్తులు మన సందర్భంలో ఎట్లా పని చేశాయి అన్న చరిత్రలు వ్రాయటం, నక్షాలు గీసుకోవటం మనమే చేసుకోవాలి.
మనం ఈ రోజున అంతస్సు అనుకుంటున్నది కలగా పులగమైన సామంత (భారతీయ) చరిత్ర పాయల్లోనించి పుట్టుకొచ్చినదే అని అనడంలో నా ఉద్దేశ్యం బ్రిటిష్ వారి వలస పాలనకు ముందు అంతస్సు, చేతస్సు, స్త్రీ పురుష ప్రతీకలూ ఇవేవీ భారతీయుల ఊహా ప్రపంచంలో లేవనే మూర్ఖపు వాదన చేయటం కాదు. కానీ పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో ఆ ఊహా ప్రపంచపు నక్షా కచ్చితంగా తిరుగు లేకుండా మారిపోయిందనీ, ఆ మార్పుల ఫలితంగా కొత్త ప్రతీకల బంధాలూ తయారయినాయనీ, గుర్తించక తప్పదు. ఇదిలా ఉంటే, మొత్తంగా గత శతాబ్ద కాలాన్ని ఒక్క సారి విహంగవీక్షణంగా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యం బలహీన పడుతోంది అన్నది తెల్లంగా తెలుస్తున్న రోజుల నించీ కవులు తమకి ఏది ముఖ్యమో తెల్చుకోవడానికి అంతస్సు, బాహ్య ప్రపంచం అన్న మాటలని మర్మ సంకేతాలుగా వాడుతున్నట్టు అనిపిస్తుంది. అవి దేనికి సంకేతాలు అన్నది కవి సమయానికి చెందిన విషయం. నిర్దుష్టంగా కాలాతీతంగా లోపల అంటే ఇదీ, బయట అంటే అదీ అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే, ఎప్పటికప్పుడు ఆ మాటలకు అర్ధాలు కొత్తగా చెప్పుకోకపోతే కవుల మధ్య వివాదాలు చూసే వాళ్ళకి చాలా మార్మికంగా కనిపిస్తాయి.
హృదయ కంపనం అంటే ఏమిటో అర్ధమైపోయినట్లే అందరమూ బుర్ర ఊపుతాం కానీ అంతకు మించి అది భాషకి అందదు. అట్లాంటి మార్మికత వలన కవులకి ఏవైనా ప్రయోజనాలు నెరవెరుతాయేమో నాకు తెలియదు కానీ – ఎవరికి ఏది నచ్చితే అదే కవిత్వమనో, లేకపోతే నాకు తోచిందే కవితకి అసలైన గీటు రాయి అనో – మూర్ఖపు ధోరణులు ప్రబలడానికీ, పాఠకులకి కవిత్వానికీ నష్టం కలిగించడానికీ ఈ మార్మికత దోహద పడుతుందనిపిస్తుంది. తెలుగులో కవితా ధోరణుల మధ్యన వివాదాలకి మూలం ఉన్నది ఈ అల్లుకు పోయిన అంతర్ బహిర్ ప్రపంచాల మధ్య ప్రయాణాలలోనించే కాబట్టి, ఏది బయటా ఏది లోపలా అన్న దాని మీద కసరత్తులు చేసే ముందు, కవి అంతరంగాన్ని – నదికి ఎటువైపున ఉన్నదో చెప్పడం సాధ్యం కాని కృష్ణ లంకల లాగా – వూహించుకుంటే కొంచెం వెసులుబాటు అవుతుందేమో. కవి తన సరుకుని నిత్యమూ ఏది ఒడ్డో ఏది లంకో నిర్ధారితంగా చెప్పనివ్వని జీవన ప్రవాహం లోనించి రవాణా చేస్తున్నట్లు భావించటం వీలయితే అప్పుడైనా కవిత్వానికి సంబంధించినంత వరకు ఏది సరైనది ఏది కాదు అన్నది చెప్పటం, ఇతరులకు కొంతయినా నేర్పటం సాధ్యం అవుతుందేమో? ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు సాహిత్య చర్చల్లో కనపడుతుండటం నేను చూసాను. కానీ నిలకడగా దీని మీద దృష్టి పెట్టటం సాధ్యమవుతున్నట్టు కనిపించదు.
జరగవలసి ఉండీ చెదిరిపోతున్న సంభాషణల్లో అది ఒకటి.
పైన చెప్పిన దానికి చేరువలోనే మరొక సంభాషణ జరగవలసి ఉన్నది. చేతస్సు, చేతన, చైతన్యం అన్న మాటలు మనం చాలా తేలికగా వాడుతుంటాం. కానీ మనిషి చేతస్సు గురించి మనకు సమిష్టిగా తెలిసినది చాలా తక్కువే. సరళంగా ఉండటానికి ఈమాట పాఠకులలో చాలా మందికి తెలిసి ఉండే అవకాశం ఉన్న ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. బాలగోపాల్ రచనలతో ఏమీ పరిచయం లేని వాళ్ళకు కూడా బాలగోపాల్ మార్క్సిజంతో మొదలు పెట్టి పది పదిహేను సంవత్సరాల తరువాత మావోయిస్టు హింసని నిరసించి, ఆ రకంగా మార్క్సిజం నించి విముఖుడైనాడు అన్న మాట వినే ఉంటారు. ఈ అభిప్రాయం సాహితీ పరుల లోనూ, రాజకీయ కార్యకర్తల లోనూ, సిద్ధాంత కర్తల లోనూ, సాధారణ పాఠకుల లోనూ కూడా విస్తృతంగా ప్రచారమయ్యాయి . ఆయన సమర్ధకులూ విమర్శకులూ కూడా ఇదే నిజం అని అనుకుంటారు. ఆయన కూడా ఎప్పుడూ దీన్ని స్పష్టంగా ఖండించే ప్రయత్నం చేయలేదు.
మానవ హక్కుల కార్యాచరణలో ఆయనకీ ఇతరులకీ వచ్చిన విభేదాలని ప్రస్తుతానికి పక్కన పెడితే పైన చెప్పిన అభిప్రాయానికి ఒక కారణం – ఆయన తెలుగులో వ్రాసిన రెండు వ్యాసాలూ, ఇంగ్లీషులో వ్రాసిన ఒక వ్యాసం. తెలుగులో ఒక మహిళా నక్సలైటు జీవిత కథా కథనమైన ‘రాగో’ నవలకి ముందు మాటగా వ్రాసి ‘చరిత్ర, మనిషి , మార్క్సిజం‘ అన్న పేరుతో అరుణ తార పత్రికలో విడిగా ప్రచురించిన వ్యాసమూ; ఇంగ్లీషు లో బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత సంఘ పరివార్‌ని అణిచి వేయటం సమంజసమేనని వాదించిన సుమంత బనర్జీతో విభేదిస్తూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో వ్రాసిన వ్యాసమూ సందర్భాలు వేరయినా ఒకే అసంతృప్తిని వ్యక్తీకరిస్తాయి. (తెలుగులో రెండవ వ్యాసం ‘చీకటి కోణాలు‘ పూర్తిగా కార్యాచరణకి సంబంధించిన ధోరణిలో ఉంటుంది కాబట్టి సిద్ధాంత ప్రతిపాదన అంతర్లీనంగా ఉంటుంది.)
స్థూలంగా చెప్పాలంటే ఆ అసంతృప్తి – భౌతికమైన అస్తిత్వానికీ చేతస్సుకీ మధ్య ఉండే సంబంధం ఎలాంటిదీ అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకక పోవటం వలన వచ్చింది. భౌతిక అస్తిత్వానికీ చేతస్సుకీ మధ్యన కార్యకారణ సంబంధం ఉంటుంది అని ఆయన అప్పటివరకూ అనుసరించిన మార్క్సిస్టు-లెనినిస్టు ఆలోచనా విధానం చెప్పింది. కానీ 1980-90ల మధ్య కాలంలో వచ్చిన పరిణామాలను (అంటే సోవియెట్ సామ్రాజ్య పతనం, భారతదేశంలో విప్లవోద్యమాల కార్యాచరణ వంటివి) జాగ్రత్తగా చూస్తే ఈ మార్క్సిస్టు-లెనినిస్టు ప్రతిపాదన అంత సంతృప్తికరంగా అనిపించటం లేదు అని బాలగోపాల్ నిర్ధారిస్తాడు. భౌతిక ప్రపంచంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పు వస్తే దానికి అనుగుణంగా చేతస్సులో మార్పులు వస్తాయి, కొత్త మనుషులు పుడతారు అన్న ప్రతిపాదన, చేతస్సుని భౌతిక ప్రపంచానికి (బాహ్య ప్రపంచానికి?) అనుయాయిగా చిత్రీకరిస్తుంది. ఇది నాకు సరిపడడం లేదు అని ఆయన చెప్తాడు. మార్క్సిజం గురించిన ఈ అసంతృప్తి బాలగోపాల్‌కి కలగడం కాకతాళీయం కాదు.
మార్క్సు జీవిత కాలం తరువాత, ప్రత్యేకించి సోవియెట్ సామ్రాజ్యం – అమెరికన్ సామ్రాజ్యం చెరో పక్కనా ప్రపంచాన్ని పంచుకున్న తరువాత, మార్క్సిస్టు ఆలోచనా విధానంలో యాంత్రికమైన ధోరణులు చాలా చోట్ల బలపడ్డ మాట నిజమే. ఈ యాంత్రికత నించి బయట పడి కొత్త పుంతలు తొక్కడం అన్నది 1960ల లోనే యూరప్‌లో , ప్రధానంగా జెర్మనీ, ఫ్రాన్సులలో మొదలయినాయి. (ఇందులో చాలా మంది సిద్ధాంతకర్తలు – 1920లలో ఇటలీలో పని చేసిన మార్క్సిస్టు మేధావి అంతోనియో గ్రాంషి (Antonio Gramsci) వ్రాసుకున్న నోట్స్‌ని ఒక ఉత్తేజంగా తీసుకుంటారు.) మానవతా ప్రధానమైన మార్క్సిజం పాయలుగా చెప్పబడే ఈ ధోరణులు అమెరికా -రష్యాల మధ్య శీతయుద్ధం బలహీనపడటం మొదలయే దాకా అంతగా ప్రచారంలోకి రాలేదు. 1980 దశకంలో మాత్రమే నెమ్మది నెమ్మదిగా ఇవి బలపడటం మొదలయితే సోవియెట్ సామ్రాజ్య పతనం తరువాత ఇవి అందరికీ అందుబాటులోకి రావటం మొదలయింది.
బాలగోపాల్‌కి మార్క్సిజం-లెనినిజం పట్ల కలిగిన అసంతృప్తి ఆయన ఆలోచనని మానవతా ప్రధానమైన మార్క్సిస్టుల ఆలోచనల వైపు మళ్ళించి అక్కడితో ఆగి పోలేదు. ఏ సిద్ధాంతమైనా ప్రపంచాన్ని మనకు పూర్తిగా అర్ధం చేయించలేదనీ, మనం చేయగోరిన పని దృష్ట్యా సిద్ధాంతాలను అంచనా వేసుకోవటం, పదును పెట్టుకోవటం మనమే చేసుకోవాలి అని – కల్లోల కథా చిత్రాలు అన్న పేరుతో అచ్చు వేయబడ్డ ఆయన వ్యాసాల సంకలనానికి చివరి మాటలో ఆయన చెప్తాడు. ఆ చివరి మాటలో మార్క్సిజం-లెనినిజం ఆలోచనా విధానాన్ని అనుసరిస్తున్న కాలంలో ఆయన వ్రాసిన వ్యాసాల తాత్విక విమర్శ ఆయనే చేసుకోవటమే కాక ప్రత్యామ్నాయ మార్గాలపై ఆయన అంచనా కూడా చెప్తాడు.
‘చరిత్ర, మనిషి, మార్క్సిజం‘తో బాలగోపాల్ మార్క్సిజం నించి వెనుదిరిగాడనీ, బూర్జువా ఉదారవాదిగా మారిపోయాడనీ 1992లో పడికట్టు మాటలతో మొదలయిన ప్రచారం 1996లో చీకటి కోణాలు వ్యాసం ప్రచురితమయిన తరువాత తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత ప్రచురితమైన కల్లోల కథా చిత్రాలు పుస్తకం చివరి మాట విశదీకరించి చెప్పిన విషయాలను ఆయన ప్రజా తంత్ర పత్రికకి 2000లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ రేఖామాత్రంగా ప్రస్తావించాడు కానీ ఇక ఆ పైన మళ్ళీ ఈ విషయాల గురించి పెద్దగా ఏమీ వ్రాసినట్టు కనపడదు. అయితే, కల్లోల కథా చిత్రాల చివరి మాట లోనూ , ఇంటర్వ్యూలోనూ కూడా రేమండ్ విలియమ్స్ అనే బ్రిటిష్ మార్క్సిస్టు సాంస్కృతిక విమర్శకుడి పేరు ప్రస్తావిస్తాడు. మిగతా సిద్దాంత చర్చ ఎట్లా ఉన్నా, సాహిత్యానికీ సంస్కృతికీ పనికి వచ్చే మాటలు ఈ సందర్భంలోనే చెప్తాడు.
రేమండ్ విలియమ్స్ (Raymond Williams), బ్రిటిష్ సాహితీ వేత్త, మార్క్సిస్టు సిద్ధాంత కర్త. వయోజన విద్య మీద చాలా కృషి చేశాడు. ఒక పక్కన రచనా వ్యాసంగాన్నీ, సిద్ధాంత రూపకల్పననీ సాగిస్తూనే, ఆయన కవిత్వం చదవటం ఎట్లా, అన్న విషయంపై చాలా సంవత్సరాలు వయోజనులకు తరగతులు నడిపాడు. ఆయన చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తుతం మనకి ముఖ్యమైనవి రెండు చెప్తాను. మొదటిది; సంస్కృతి అన్న పదాన్ని – సంగీతం, సాహిత్యం ఇట్లాంటి వాటిలో – ఉచ్చ శ్రేణి సమాజానికి , చైతన్యానికీ చెందిన వ్యవహారంగా భావించడం పొరపాటు. సంస్కృతి అన్నది అనేక రూపాల్లో ప్రజలు చేసే రోజు వారీ చర్యల్లో ఉంటుంది. రెండవది; సాహిత్యమూ సంస్కృతీ అన్నవి భౌతికవాద మార్క్సిస్టులు అంతవరకు అనుకున్నట్లుగా కేవలం చైతన్య రూపాలుగా, ఉత్పత్తి సంబంధాల పునాదిపై ఆధారపడే భావజాలానికి సంబంధించిన వ్యవహారంగా చూడటం పొరపాటు. అంటే, సాహిత్యమూ సంస్కృతీ కూడా ఉత్పత్తి రూపాలేననీ, వాటిని ఆచరణ రూపాలుగా చూడటం వలన వాటిని శ్రమ రూపాలుగా, ఉత్పత్తి రంగంలో భాగాలుగా చూడడం సాధ్యమవుతుందని ఆయన అన్నాడు. ఆధిపత్య పోరులో ఈ ఆచరణ రూపాలకు ప్రాముఖ్యత ఇవ్వటం సాధ్యమవుతుందని కూడా చెప్తాడు. (ఆ తరువాత బాగా విస్తృత ప్రచారంలోకి వచ్చిన ఈ ఆలోచనా విధానాన్ని సాంస్కృతిక భౌతికవాద మార్క్సిజంగా చెప్పుకోవచ్చును. )
కల్లోల కథా చిత్రాలకు చివరి మాటలో బాలగోపాల్ – తాను ఆ పుస్తకంలో వ్యాసాలు వ్రాస్తున్న రోజుల్లో అనుసరించిన మార్క్సిజం -లెనినిజం, పునాది- ఉపరితలాల మధ్య అంటే భౌతిక ప్రపంచమూ చేతస్సులకు మధ్యన కార్య కారణ సంబంధం ఉన్నదని నమ్ముతుందనీ, దీని పట్ల తనకు అసంతృప్తి ఉన్నదనీ స్పష్టంగా చెప్తూ – సాహిత్యాన్నీ సంస్కృతినీ ఆచరణ రూపాలుగా భావించే రేమండ్ విలియమ్స్ తరహా మానవతా ప్రధానమైన మార్క్సిజం పట్ల కొంచెం మొగ్గు చూపుతాడు. అప్పటికీ ఆచరణకి వర్గ స్వభావం ఆపాదించే రేమండ్ విలియమ్స్ సూత్రీకరణ పట్ల బాలగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. పరమ వికృతంగా హోదా, సంపద, జ్ఞానమూ ఇలా అన్నీ రంగాలలోనూ ఆధిక్యతని కొందరు వ్యక్తులకు అందచేసే పితృస్వామ్యాన్నీ, వర్ణ వ్యవస్థనీ, వర్గ ప్రయోజనాలకు లోబడి ఉండే విషయాలుగా అర్ధం చేసుకోవటం అసాధ్యం అని తెగేసి చెప్తాడు. బాలగోపాల్ రేమండ్ విలియమ్స్ నించి గ్రహించినదీ మనకు ప్రస్తుత సందర్భంలో చాలా పనికొచ్చేదీ సాహిత్యాన్నీ సంస్కృతినీ ఆచరణ రూపాలుగా చూడటం.
ఇట్లా చూడడం వలన ప్రయోజనం ఏమిటో బాలగోపాల్ చివరి మాటలో సిద్ధాంత చర్చగా చెప్తాడు కానీ, అంత కన్నా ముఖ్యంగా ఈ దృష్టిని విశ్లేషణలో ఎట్లా ఉపయోగించుకోవచ్చునో ఆయన చీకటి కోణాలు వ్యాసంలో చేసి చూపించాడు.
చీకటి కోణాలు వ్యాసంలో బాలగోపాల్ పదే పదే ఉదాహరణల ద్వారా నిరూపించినది ఏమంటే అణగారిన ప్రజల తరఫున పోరాడుతున్నామనే కార్యకర్తలు, ఆధిపత్య సంస్కృతి నించి బయట పడతారు అన్న నమ్మకం ఏమీ లేదని. దానికోసం ప్రత్యేకమైన సాంస్కృతిక కృషి జరగాలనీ, ఆచరణలో అప్రమత్తత అలవర్చుకోవలసి ఉంటుందనీ, అది లేక పోవటం వలన ఆధిపత్య పోరులో పాత్రధారులు మారవచ్చును కానీ ఆధిపత్య సంస్కృతి యధాతధంగా ఉండి పోవటం సాధ్యమేనని నిరూపిస్తాడు. సాహిత్యాన్నీ సంస్కృతినీ చైతన్య రూపాలుగా, భావజాలంలో భాగంగా (అంటే భౌతిక అస్తిత్వానికి, ఉత్పత్తి రంగానికీ అనుయాయిగా) కాకుండా ఆచరణ రూపాలుగా చూడటం వలన కలిగే ప్రయోజనం బాలగోపాల్ స్పష్టంగా చూపించినా కూడా అది ఒక పద్ధతిగా తెలుగు సాహిత్య విమర్శలో ఏమీ ప్రాచుర్యం పొందినట్టు కనిపించదు.
ఒక రకంగా చెప్పాలంటే, చీకటి కోణాలు వ్యాసాన్ని నక్సలైటు ఉద్యమం మీద విమర్శగా మాత్రమే అందరూ చదవటం వలన చాలా నష్టం జరిగింది. ఆ వ్యాసాన్ని సాంస్కృతిక విమర్శగా, సాహిత్య విమర్శగా చదివితే విషయాన్ని దానికి తగిన పరిధిలో అర్ధం చేసుకునే అవకాశం కలుగుతుందని నా నమ్మకం. చైతన్యమూ-భౌతిక అస్తిత్వమూ, ఉపరితలమూ-పునాది వంటి ద్వయాలను పక్కన పెట్టి సాహిత్య సృష్టి ఏ శ్రమనించి ఏ ఆచరణలోనించి జరుగుతుంది? ఆధిక్యతా పోరాటాలలో సాహిత్యమూ సంస్కృతీ ఏ పాత్ర వహిస్తాయి? ఆచరణకి పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? దానికి వస్తు రూపం ఎట్లా వస్తుంది? ఇవే కాక, సాహిత్యం వినిమయ వస్తువుగా ఎట్లా మారగలదు? మార్పుకి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? – ఇలాంటి ప్రశ్నలు చాలా వేసుకోవచ్చును.
బాలగోపాల్ అంత స్పష్టంగా చూపించిన విషయాల పట్ల తెలుగు సాహితీ వేత్తలెవరైనా ఆసక్తి చూపిస్తారేమో, మాట కొంచెం ముందుకి కదిలితే చర్చల్లోంచి పోయినేటి దీపావళి ప్రమిదల్లో జిడ్డులా వదలకుండా పట్టుకున్న మార్మికత కొంత వరకైనా వదులుతుంది అని నేను ఆశ పడ్డానని చెప్పక తప్పదు. బాలగోపాల్ వ్రాసింది వచనం కదా మనకెందుకు అనుకున్నారో మరి లేకపోతే ఆయనేదో మార్క్సిస్టు కాబట్టి మాకు సంబంధం లేని విషయం అనుకున్నారో లేక మరేమైనా కారణాలున్నాయో తెలియదు. ఎందు చేతనైతే నేమి, చేతస్సు గురించీ, అంతరంగం గురించీ ఆరాట పడుతూ, అనుభూతిలో మునకలు వేస్తూ అంతర్బహిర్ ప్రపంచాల మధ్య యుద్ధారావాలతో కొత్త సృజనలు చేస్తూ మననందరినీ అనుభవించి పలవరించమని చెప్పే కవులు ఎవరూ కూడా బాలగోపాల్ తోటి సంభాషించే ప్రయత్నం చేసినట్టు కనపడదు.
ఇది చెదిరిపోతున్న రెండవ సంభాషణ.
ఇట్లా చెదిరిపోతున్న సంభాషణలని ఒక చోట ప్రోవు చేసే ప్రయత్నంలో నాకు తట్టిన మరొక ఆలోచనతో కొన్ని ప్రశ్నలొచ్చాయి – భారతీయులు బ్రిటీషు వలస వాదాన్ని ఎదుర్కొనే క్రమంలో డిస్కవర్ చేసిన అంతరంగం, చేతస్సూ ఎటువంటివి? భౌతిక ప్రపంచం మారుతూ వస్తూంటే అవి ఎట్లా మారుతూ వచ్చాయి? ఈ ఒరిపిడి లోనించి కొత్త శక్తులు ఎప్పుడూ ఎట్లా ఎప్పుడు పుట్టుకొచ్చాయి?
ఇట్లాంటి ప్రశ్నలకి నిర్దుష్టమైన వ్యక్తుల గురించీ స్థలకాల పరిస్థితుల గురించీ మాట్లాడుకోకుండా జవాబులు వెతకడం సాధ్యం కాదు. కానీ, నిర్దుష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అంత తేలిక కాదు. దానికి కావలసిన సావకాశం, ఆవేశ కావేశాలు తగ్గించుకుని మాట్లాడుకోవడానికి తగిన సందర్భం – మనమే సృష్టించుకోవాలి. అంత పని నేను చేయలేనన్నది తెలుసును కానీ, తెలుగు భాషలో కవుల నించి కొంచెం దూరంగా వెళ్ళి శ్రీశ్రీ, కాళోజీ లకు సమకాలికులైన ఇతర భాషా కవుల గురించి మాట్లాడుకుంటే విషయాన్ని కొంచెం సావకాశంగా ఆలోచించడానికి వెసులుబాటు కలుగుతుందని ఆశ. ఇక క్రింద వ్రాయబోయేది ఆ ఆలోచన తోటే.
తెలుగులో ఇంత వరకు బాబా నాగార్జున గురించి పరిచయ వ్యాసాలు ఎక్కడా వచ్చినట్లు నా దృష్టికి రాలేదు. ఆమాట కొస్తే, తెలుగులో ఆఫ్రికన్ కవులూ, స్పానిష్ కవులూ, ఇంగ్లీషు కవులూ, అందరూ ఉంటారు కానీ, ఇతర భారతీయ భాషల్లో కవులు పెద్దగా చెలామణీలో ఉన్నట్టు కనపడదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నమ్మకమేమైనా దీనికి కారణమేమో నాకు తెలియదు. నా మట్టుకు నాకు మొత్తం మీద దక్షిణ భారతీయ భాషల్లో, ప్రత్యేకించి తెలుగులో ఒక భయంకరమైన అంతర్ముఖత్వం రాజ్యామేలుతోందనీ – ఇది దాదాపుగా ఆంధ్ర రాష్ట్రావతరణ రోజుల్లోనే మొదలైతే ఎమర్జెన్సీ తరువాత బాగా పాతుకు పోయిందనీ నాకు చాలా కాలంగా అనుమానం. దీనికి ఒక రూపం సాధారణ మధ్య తరగతి జీవితాలను ఈసడించుకునే విప్లవ సాహిత్యమైతే, మధ్య తరగతి జీవితాల్లో ఉండే మురికిని ఆరాధ్య వస్తువులుగా మార్చేసిన తెలుగు సినిమాలూ, పాపులర్ సాహిత్యమూ మరొక రూపం. మొత్తమ్మీద ఎవరి పుణ్యమైతేనేమి తెలుగు మాట్లాడే ప్రాంతాలలో, కొడవటిగంటి కుటుంబరావు గారి ఐశ్వర్యం నవలలో ఒక పాత్ర (సూర్యమేనని జ్ఞాపకం) అన్నట్లు – ఇంగ్లీషు తిట్టుకోవడానికీ, సంస్కృతం దీవించడానికీ, తెలుగు కూరగాయలు బేరం చేయడానికీ తప్ప (అప్ డేట్ చేసుకోవాలంటే హిందీ భాష టీవీ సీరియల్స్ చూసుకోవడానికి పనికొస్తుందని చెప్పుకోవచ్చునేమో) మరెందుకూ ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితులు పీఠం వేసుకుని ఉన్నాయి. గతాన్ని గురించిన చింత, భవిష్యత్తుని గురించిన ఆందోళన, ఎంత ఎక్కువ పాళ్ళలో ఉంటే, వర్తమానాన్ని విమర్శించడానికి కానీ, అందులోని మంచి చెడులని గుర్తించడానికి కానీ, కావలసిన వివేకం అంత తక్కువ పాళ్ళలో ఉంది.
అటువంటి సందర్భంలో మరీ ఇరుకుగా తోచినప్పుడు ఊపిరి పీల్చుకోవటానికి నా దృష్టి నాగార్జున కవిత్వం వైపు పోతుంది.
నాగార్జున అసలు పేరు వైద్యనాథ మిశ్రా. బీహారు లో దర్భంగా జిల్లాకు చెందిన ఒక నిరుపేద బ్రాహ్మణ రైతు కుటుంబంలో 1911లో పుట్టిన వైద్యనాథ మిశ్రా తండ్రి వ్యవసాయంతో పాటు పౌరోహిత్యం కోసం వూరూరు తిరుగుతూండగా వెంబడి తిరుగుతూండేవాడట. అట్లా మొదలయిన ప్రయాణం, 24 నాలుగు సంవత్సరాలు వచ్చేటిప్పటికి సంస్కృతం, హిందీ, మైథిలీ భాషల్లో పాండిత్యం సాధించడం, వివాహం, స్కూల్ టీచరుగా ఉద్యోగం వరకూ వచ్చింది. శ్రీశ్రీ తెలుగులో కవిత్వం మొదలు పెడుతున్నప్పుడే వైద్యనాథ మిశ్రా సంస్కృతంలో కవిత్వం వ్రాయటం మొదలు పెట్టాడు. రాహుల్ సాంకృత్యాయనుడు చేసిన ‘సుత్త పిటకం‘ లోని కొన్ని భాగాల అనువాదాలు చదివి, మూలం పాలీ భాషలో చదవాలన్న కోరికతో వైద్యనాథ మిశ్రా 1935 ప్రాంతంలో శ్రీ లంకకి వెళ్ళాడు. అక్కడ బౌద్ధ మఠంలో భిక్షువులకు సంస్కృతం నేర్పుతూ బదులుగా పాలీ నేర్చుకుంటూ, మఠంలో ఉండటానికి అనువుగా ఉంటుందని బౌద్ధ భిక్షువుగా మారాడు. నాగార్జునగా స్థిర పడ్డాడు. శ్రీ లంకలో ఉండగానే మార్క్సిజం, లెనినిజం అధ్యయనం చేశాడు.
ఆ తరువాత బీహారులో స్వామి సహజానంద అనే రైతుకూలీ ఉద్యమ నాయకుడి దగ్గర కార్యకర్తగా ఓనమాలు దిద్దుకుని 1940ల నాటికి ఒక పక్కన ఉద్యమాలు నిర్వహిస్తూ ఒక పక్కన కవిత్వం మీద పట్టు సాధించడం మొదలు పెట్టాడు. మైథిలి, హిందీ భాషల్లో కవిగా నిలదొక్కుకున్నాడు. 1998లో ఏ మాత్రమూ మారని పేదరికంలో 88 ఏళ్ళ వయసులో నాగార్జున గొంతు మూగబోయే నాటికి హిందీ కవిత్వంలో ఏ రకమైన వాదాలూ బలంగా లేవు. కానీ, కాళిదాసు ప్రకృతి వర్ణనల దగ్గరినించీ భారతీయ కవితా సాంప్రదాయాలలోని అన్నీ ధోరణులూ నాగార్జున కవిత్వంలో కనిపిస్తాయి అని తెలిసిన వాళ్ళు అంటారు. కవులూ నాయకులూ పాత్రికేయులూ ఎవరైనా సరే నాగార్జునని – బాబా నాగార్జున అనే గుర్తిస్తారు. ఎన్ని రకాల వివాదాలలో ఎంత మృదువుగా, ఎంత పెద్ద వాళ్ళని అపహాస్యం పాలు చేసినా ప్రజా కవిగా అందరికీ తెలిసిన నాగార్జున మీద చేయి చేసుకోవడానికి ఎవరైనా జడిసేవారు. (క్రితం సారి UPA ప్రభుత్వంలో రైల్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లాలూ ప్రసాద్ యాదవ్ – రైల్ ఛార్జీలు పెంచితే అధికారానికున్న మూలాలు కదిలిపోతాయని చెప్తూ – నాగార్జున కవితని ఉటంకించాడంటే జన చైతన్యంలోకి నాగార్జున కవిత్వం ఎంత లోతుగా చొచ్చుకు పోయిందో ఊహించవచ్చు.)
ఈ వ్యాసంలో మొత్తం నాలుగు కవితలు పరిచయం చేస్తాను. వీలుండి దేవనాగరిలో చదువుకోవాలనుకున్న వారికి సదుపాయంగా లింకులు ఉన్నాయి. (తెలుగు భాషలో వ్రాయటమే ప్రయత్న పూర్వకంగా చేస్తున్నాను – అనువాదాలు నాకన్నా బాగా చేసే అనుభవం ఉన్న వారు మరొకరెవరైనా ప్రయత్నిస్తే ఇంకా బాగా రావచ్చేమో.)
నేను పరిచయం చేస్తున్న మొదటి రెండు కవితల్లోనూ నాగార్జున కవిగా ఒక ప్రణాళికా ప్రకటన చేస్తున్నట్లు కనపడుతుంది. కానీ రెండింటిలోనూ మధ్య విషయంలో వ్యత్యాసం ఉంటుంది. మొదటిది కవి చేసే పనిని శ్రమ రూపంగా, ఆచరణ రూపంగా నిలబెడుతుంది. దానికి ఒక వర్గ స్వభావాన్ని ఆపాదిస్తుంది. రెండవది కవిగా నాగార్జున్ కవిగా, మనిషిగా ఎటువంటి ఆచరణ పట్ల నిబద్ధుడో చెప్తుంది.
అవును మహా ప్రభూ వ్రాస్తున్నాను (జీ హాఁ లిఖ్ రహా హూఁ)
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను
అబ్బో ఎంత వ్రాస్తున్నానో
చాలా చాలా వ్రాస్తున్నాను
కుప్పలు తెప్పలుగా వ్రాస్తున్నాను
చిక్కేంటంటే అదంతా మీరు చదవలేరు
చూడను కూడా చూడలేరుదాపరికం ఎందుకులెండి
ఈ మధ్యన నేను వ్రాసినవి
నేనే చదవ లేకపోతున్నాను
నియాన్ రాడ్ మీద మొలుచుకొచ్చే పంక్తుల లాగా
అవి మరు క్షణానికే మాయమైపోతుంటాయి
చైతన్యపు కీబోర్డు మీద రెండు మూడు సెకండ్లు మాత్రమే నిలుస్తుంటాయి
ఏదో అప్పుడప్పుడు వాటిని పట్టుకుని కాగితమ్మీద నోట్ చేయగలుగుతున్నానుఅలుపెరుగని ఎరుక బుద్బుద మాలికలు రువ్వుతుంటే
వాటిని పట్టుకుని సవర దీసి సాపు చేసి పద్ధతిగా ఇంకొకరికి అందించటం…
ఓర్నాయనో ఇందులో ఎంత శ్రమ వుందోమరి మీరేమో ఫోర్ ఫిగర్ జీతగాడూ ఉన్నతాధికారీ నాయె
నాకు తెలుసు
మనసులోనే నవ్వుకుంటుంటారు
వీడి మొహం ఇదీ ఓ పనేనా? ఏదో అవీ ఇవీ ఆలోచనలు పోగు చేసి
సన్న సన్నగా ఇంత పొడుగు సాగదీసుకుంటూ పోతుంటాడు
ఇదీ ఒక పనేనా? అనుకుంటుంటారు
ఫోర్ ఫిగర్ జీతగాడూ అధికారీ అయిన మనిషి వ్యాపారపు సరుకుల్తో డీల్ చేస్తాడు. అది మేధో వ్యాపారమయితేనేమి, కిరాణా సరుకయితేనేమి, సమాజాన్ని నియంత్రించడానికి కావలసిన పగ్గాలయితేనేమి. వాడికి తేలికగా అర్ధం కాని శ్రమ శక్తి – కవి దగ్గర ఉంది. దాన్ని వెచ్చించి కవి వస్తువుని సృష్టిస్తాడు. అది మామూలు శ్రమ కాదు. చిత్త సాగరం రువ్వే నురుగుని సవరదీసి నిలకడగా ఉండే మాలలు కట్టే శ్రమ.
1975 లో వ్రాసిన ఈ కవిత, ప్రతిబద్ధ్ హూఁ చూడండి.
కంకణ ధారినే
అవును కంకణ ధారినే
సమసమాజ నిర్మాణార్థం
సంకుచిత స్వలాభాపేక్ష నివారణార్థం
వివేకహీన జన
అంధ బధిర జన మార్గ దర్శనార్ధం
స్వీయ ప్రేరిత వ్యామోహాత్ పునః పునః నిర్మూలనార్ధం
శతధా కంకణ ధారినే
కొంచెం జాగ్రత్త గా చూస్తే, రెండవ కవితలో కవి బాహ్య ప్రపంచానికి మార్గ దర్శనం చేయటానికి ఎంతగా సిద్ధ పడతాడో, ప్రతి క్షణం తనని తను కాపాడుకోవడం పట్ల కూడా అంతే నిబద్ధత చూపిస్తాడు అని కూడా తెలుస్తుంది. (తెలుగులో తనని తాను కాపాడుకోవటం కూడా కవికి ఒక బాధ్యతేనన్న కవులు, రచయితలూ ఎవరయినా ఉన్నారేమో తెలిసిన వాళ్ళు చెప్పాలి.)
ఇక 1969 లో వ్రాసిన ‘మంత్ర కవిత’ చూడండి. 1969లో భారతీయ జాతి చేతస్సుకి ఈ కవిత ఒక మాప్ లాంటిది. సాధారణంగా మాప్ అంటే బయట కనపడుతున్న దానికి ప్రతి రూపం అని చాలా మంది అనుకుంటారు. మాప్ లలో ఎంత చరిత్ర ఇమిడి ఉంటుందో ఊహించడానికి ఒక సారి అమెరికాలో రాష్ట్రాల సరిహద్దులు చాలా వరకు సరళ రేఖలుగా ఎందుకు ఉంటాయో ఆలోచించండి. సువిశాలంగా జన సమ్మర్దం లేని భూఖండాన్ని (నేటివ్ అమెరికన్ల వేట భూములని కొనేసుకునో జయించుకునో తెల్ల వాళ్ళు సాధించుకోగలగడం కూడా ఒక కారణం) కాగితంపై గీతలతో లెక్కలతో విభజించేయటం వలన ఇది సాధ్యమయింది. అదే హైదరాబాదులో రింగు రోడ్ మాప్ చూస్తే గీత మలుపు తిరిగిన ప్రతి చోటా స్థానిక ప్రజలు, ఆస్తి పరులూ, చిన్నా పెద్దా నాయకులూ తమ తమ బలాబలాలను ఎట్లా ప్రదర్శించారో కనపడుతుంది. ఆ మాప్ సంఘర్షణలని ప్రతిఫలిస్తున్నాదని అర్ధమవుతుంది. అట్లాగ మంత్ర కవిత 1969 లో భారతీయ చేతస్సుకు ఒక మాప్.
ఒక ప్రక్కన బలపడుతున్న హిందూ మత మౌఢ్యం, ఒక పక్కన అలీనోద్యమం వీటన్నిటికీ మధ్యన కులాల వారీగా బల సమీకరణాలూ, వ్యోమయానం, అంతర్జాతీయ పెట్రోలు ధరలూ, ఉక్కు ఉత్పత్తి,, అణు పరీక్షలూ – విడివిడి గా చూస్తే శబ్దాలు తప్ప పంక్తులకి ప్రత్యేకంగా అర్ధాలు ఉండవు. చదువుతుంటే వింటూంటే మాత్రం కళ్ళ ముందు వరసగా ఎన్నో దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఈ దృశ్యాల పరంపర ఒక సారి మనసుకి పట్టుకుంటే ఆ వాసన మననీ అంత తేలికగా వదలదు. సందు దొరికిన చోటికల్లా పాకుతుంది. మే మే మే మే మేలిమి బంగారం. కడ మోళ్ళంతా ఓ ఓ ఓ ఓ టి కుండలూ అని ఒక సారి వల్లె వేసిన తరువాత ఎవరికైనా మళ్ళీ నోరు తెరిచి మాట్లాడే ముందు తమని గురించి తాము ఒకసారి ఆలోచించుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం – మంత్ర కవితలో వినపడే శబ్దాలకి మనం పోల్చుకోగలిగే ఒక క్రమం ఏమీ ఉన్నట్లు వెంటనే కనిపించదు. మనిషి చేతస్సు – అంటే కనీసం కవికి అందుబాటులో ఉండే చేతస్సు ఇట్లాగే ఉంటుందా లేక దానికి అంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుందా అన్నది ఒక ఆసక్తి కరమయిన ప్రశ్న. దానికి అంటూ ఏమీ స్ట్రక్చర్ లేకపోతే అందులోనించి కవి ఏమైనా అర్ధవంతంగా ఉండేది ఎట్లా పుట్టించగలగాలి? లేక దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటే ఇక అందులో కవికి స్వేచ్ఛ ఎక్కడినించి వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు నిజానికి బాలగోపాల్ ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ లో వేసిన ప్రశ్నలకి చాలా దగ్గరిగా ఉంటాయి.
మంత్ర కవిత
ఓం శబ్దమే బ్రహ్మం
ఓం శబ్దం మరో శబ్దం మరో శబ్ధం మరో శబ్దం.
ఓం ప్రణవం, ఓం నాదం, ఓం ముద్రా
ఓం వక్తవ్యం, ఓం ప్రకోపం, ఓం ప్రకటనా
ఓం ఉపన్యాసం…
ఓం ప్రవచనం…
ఓం హుంకారం, ఓం ఛీత్కారం, ఓం చెప్పుదెబ్బలూ
ఓం అంతా స్వంత లాభం, ఓం పిసరైనా ఇంగితం, ఓం చూపులతోటే సైగలూ
ఓం నినాదం మరో నినాదం మరో నినాదం మరో నినాదం
ఓం సర్వస్వం సర్వస్వం సర్వస్వం,
ఓం గుడ్డి గవ్వా గుడ్డి గవ్వా గుడ్డి గవ్వా
ఓం బండ మీది గడ్డి కుందేటి కొమ్ము
ఓం ఉప్పూ నూనీ పసుపూ జీలకర్రా ఇంగువా
ఓం ఎలక పెంటికా పచ్చ గన్నేరు ఆకూ
ఓం పిశాచి కేకా, అఘోరీ పేలుడూ
ఓం బొగ్గూ ఉక్కూ పెట్రోలూ
ఓం మే మే మే మే మేలిమి బంగారం బాకీ సబ్ వొ వో వో వోటీ కుండలూ
ఓం ఇదమాన్నం, ఇమామాపహ ఇదమాజ్యం ఇదమ్ హవిహి
ఓం యజమాన, ఓం పురోహిత, ఓం రాజా ఓం కవిహి
ఓం క్రాంతి క్రాంతి క్రాంతి సర్వత్రా క్రాంతి ఓం శాంతి శాంతి శాంతి సర్వత్రా శాంతి
ఓం భ్రాంతి భ్రాంతి భ్రాంతి సర్వత్రా భ్రాంతి
ఓం బచావ్ బచావ్ బచావ్
ఓం హటావ్ హటావ్ హటావ్
ఓం ఘెరావ్ ఘెరావ్ ఘెరావ్ ఘెరావ్
ఓం నిభావ్ నిభావ్ నిభావ్
ఓం పార్టీల్లో ఒక పార్టీ మన పార్టీ ఓం
ఓం అంగీకరణం, శుద్ధీకరణం, జాతీయకరణం
ఓం ముష్టీకరణం తుష్టీకరణం పుష్టీకరణం
ఓం అభ్యంతరం, ఆక్షేపనం, క్రమం తప్పక శిక్షణం
ఓం గద్దీ పై ఆజన్మ వజ్రాసనం
ఓం ట్రిబ్యూనల్ ఓం అభయం
ఓం అలీనం ఓం సత్తా సాపేక్ష్యం ఓం జోడ్ తోడ్
ఓం ఆషాఢభూతి ఓం మిథ్యా ఓం హోరా హోరీ
ఓం ఊక దంపుడూ ఓం ప్రారంభోత్సవం
ఓం మారణ మోహన ఉచ్చాటనం
ఓం కాళీ కాళీ కాళీ మహా కాళీ మహా కాళీ
ఓం వేసెయ్ వేసెయ్ వేసెయ్ గురి తప్పకుండా వేటు వేసెయ్
ఓం అస్మదీయులకు శుభం భూయాత్
ఓం తస్మదీయులకు మన్ను బోయాత్
ఓం ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ వేసెయ్
ఓం ఎగస్పార్టీ తలకాయలు నీ మెళ్ళో దండలుగా
ఓం హ్రీమ్ క్రీమ్ హూం
ఓం తిలకే వైనా గాంధీవైనా కాళ్ళిరుచుక తింటాం
ఓం ముసలి కళ్ళు ఓం పడుచు కాటుక
ఓం తులసీదళం, బిల్వపత్రం, సిందూర కుంకుమాక్షతం గంగాజలం
ఓం పులికోర భల్లూకం గోరూ
ఓం మరకత పటకా
ఓం ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నా మనవడిదే రాజ్యం
ఓం ఛూ ఛూ ఫూ ఫూ ఫిట్ ఫుట్
ఓం పగవాడి ఛాతీ పై సమ్మెట పోట్
ఓం భైరో భైరో ఓం బజరంగ బలీ
ఓం తుపాకీ మీట పిస్తోలు గొట్టం
ఓం డాలర్ డాలర్ ఓం రూబుల్ రూబుల్
ఓం పౌండ్ ఓం పౌండ్ ఓం సౌండ్ ఓం సౌండ్
ఓం ఓం ఓం
ఓం ధరిత్రీ ధరిత్రీ ధరిత్రీ వ్యోమమ్ వ్యోమమ్ వ్యోమమ్
ఓం అష్ట ధాతువుల ఇటికెల భట్టీ
ఓం మహామహీమ్ మహా మహో ఉల్లూ కే పట్ఠే
ఓం దుర్గా దుర్గా తారా తారా తారా
ఓం జీర్ణం జీర్ణం సమస్త కార్మిక కర్షక లోకం జీర్ణోభవా జీర్ణోభవా
హరిహి ఓం తత్సత్ హరిహి ఓం తత్సత్.
చివర పంక్తిలో నేను సమస్త కార్మిక కర్షక లోకం అన్న సమాసం వాడాను కానీ – హిందీ మూలంలో నాగార్జున్ అక్కడ వాడిన మాటలు “ఇసీ పేట్ మే సమా జాయె సర్వహారా”.
సర్వహారా అన్న హిందీ పదం ఇంగ్లీషులో ప్రోలేటేరియట్‌కి సమానార్ధకం. సర్వహారా అంటే, సర్వమూ కోల్పోయిన వాడు. కమ్యూనిస్ట్ మానిఫెస్టో సృజనకర్తలు “వర్కర్స్ ఆఫ్ ది వర్ల్డ్ యునైట్! యు హావ్ నథింగ్ టు లూజ్” అంటారు. అక్కడినించి వచ్చిన పదం ఇది – శ్రమ శక్తి మినహా సర్వమూ కోల్పోయిన వాళ్ళు. వాళ్ళని అంటే ఆ మిగిలిన శ్రమ శక్తిని నమిలి మింగేసి జీర్ణించుకుని వొళ్ళు పెంచుకుంటుంది పెట్టుబడి దారీ వ్యవస్థ. విప్లవం వస్తే , మార్పు వస్తే, అట్లా శ్రమశక్తి మినహా అన్నీ కోల్పోయిన వాళ్ళ నించే వస్తుంది. (ఈ విషయం పెట్టుబడిదారీ వ్యవస్థకీ తెలుసు కాబట్టే, వాస్తవంలో అంత పూర్తిగా శ్రమ శక్తి తప్ప మరేమీ లేని ప్రజల సంఖ్య సమతూకంలో ఉంచుకోవడానికే అది ప్రయత్నిస్తూంటుంది అనచ్చు అనుకోండి, అది వేరే విషయం.)
ఇక ఆఖర్న – నాగార్జున్ కవితల్లో కథనం ఎట్లా ఉంటుందో చూడండి
గులాబీ గాజులు (గులాబీ చూఢియాఁ)
ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయితేనేం
ఏడేళ్ళ బిడ్డ తండ్రి కాడేంటి?ఎదురుగా గేర్ రాడ్ పైన
కొక్కానికి తగిలించి వున్నాయి
నాలుగు మట్టి గాజులు గులాబీ రంగువి
బస్సు వేగానికి అనుగుణంగా
ఆడుతూ వున్నాయికొంచెం వంగి అడిగేశాను
వులిక్కి పడ్డాడనుకో…
మధ్య వయస్కుడు
బుంగమీసాలతో
ఠీవీ వుట్టి పడే మొహం…నెమ్మదిగా అన్నాడు, అవునయ్యా
ఎన్ని రకాలుగా చెప్పినా వినదు నాబిడ్డ
చాన్నాళ్ళ నుంచే ఇలా వెళ్ళాడుతున్నాయి
మున్నీ అమానతు ఇట్లా అబ్బా కళ్ళ ముందు
ఏ నేరం చేసాయని వీటిని
ఇక్కడినించి తీసెయ్యమంటారు?డ్రైవర్ నాకేసి ఒక చూపు చూస్తే
నేను డ్రైవర్ వేపు ఒక చూపు చూసాను
పెద్ద పెద్ద కళ్ళలోంచి పాల వాత్సల్యం తొణుకుతోంటే
సీదా సాదా ప్రశ్నకి సరళమైన జవాబు
చెప్పేసి ఆ కళ్ళు చూపులు రోడ్ మీదకి సారించాయినేను మళ్ళీ వంగి ఇలా అన్నాను –
అవునన్నా
నేను కూడా తండ్రినే
ఉండబట్ట లేక అడిగేశాను కానీ
ఇవి ఎవరికి నచ్చవు గనకా?
చిట్టి చేతుల గులాబీ గాజులు.
పై కవితలో కవి పనితనం చూడండి. ‘అబ్బా’ అన్న మాట బస్సు డ్రైవర్ ముస్లిం అని సూచిస్తుంది. ప్రశ్నలు అడుగుతున్న వాడు హిందువు. గాజులు గేర్ రాడ్‌కి పైన ఎందుకు కట్టావు అన్న ప్రశ్నకి జవాబు చెప్పటానికి డ్రైవర్ తటపటాయిస్తాడు. ఈ విషయం ప్రయాణీకుడు గ్రహిస్తాడు. చిట్టి గాజులు ఎవరికి నచ్చవూ అన్న మాట చెప్పకపోతే ఆయన ప్రాణం ఊరుకోదు ఈ గాజుల బలం ముందు నువ్వూ నేనూ ఒకటే సుమా అని స్నేహ బంధం కలుపుకుంటాడు. అట్లాగే బస్సు కదలికలకీ గాజులు ఊగుతుంటే వాటి కథ ఏమిటో చెప్పి ఇవి ఇక్కడుంటే ఎవరికేమి కష్టం అన్న డ్రైవర్ కళ్ళలోంచి చిప్పిల్లినది పాలు గారే వాత్సల్యం. బుంగ మీసాలూ ఠీవీ ఉట్టిపడే మొహం. పైనించి క్రింది దాకా పురుషత్వం రూపు కట్టుకుని ఉంటే – అందులోంచి చిప్పిల్లినది మాత్రం తల్లి ప్రేమ. ఇట్లాగ ప్రపంచాన్ని మనకు తెలిసిన హిందూ ముస్లిం, స్త్రీ లూ పురుషులూ ఇలాంటి వర్గీకరణల్లోంచి తేలికగా సున్నితంగా తప్పించేస్తాడు నాగార్జున. వర్గీకరణల నిరంకుశత్వం నించి తప్పుకునే తెలివి లేక పోతే, ఒక్క క్షణంలోనే అవి ఎక్కడ లేని శతృత్వాలకి దారి తీయగలవు – అన్న ప్రమాద సూచిక ఈ కవితలో అంతర్లీనంగా ఉంటుంది. నాగార్జున కవే కాదు. కథకుడు, నవలా కారుడు కూడా. గులాబీ గాజులు కథ రూపంలోనూ వ్రాయవచ్చును. కానీ అవసరం లేదు. పైగా ఇక్కడ పదాల పొదుపరితనం చేయగలిగిన పని కధ చేయలేదు. కానీ అంతకన్నా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ.
నాగార్జున కవిత్వంలో ఇది కవిత్వమూ, ఇది జీవితమూ, ఇది రాజకీయమూ, ఇది కాదూ అని విడదీయడానికి వీలుగా ఉండదు. బ్రిటన్ మహారాణీకి స్వాగతం పలికిన నెహ్రూని వెక్కిరించినా, పుత్ర ప్రేమతో అధికార ప్రేమతో చెలరేగుతున్న ఇందిరా గాంధీని చెండాడినా, గాంధీ గారి మూడు కోతులనీ వెక్కిరించినా, సర్వోదయ ఉద్యమ నాయకుల కపటత్వాన్ని కడిగేసినా, మీరట్‌లో మత కల్లోలాల తరువాత రుద్రాక్ష మాల వేసుకుని రిక్షా తొక్కుకుంటున్న యువకుడిని ఆత్మీయంగా పలకరించినా – జన జీవనం పట్ల కవిత్వం పట్లా నిబద్ధతతో జీవించిన సాధారణమైన మనిషి నాగార్జున. అందుకే, నాగార్జున కవిత్వం సాదాగా సీదాగా వూరి చెరువు లాగా ఉంటుంది. దిగితే ఆప్యాయంగా పలకరిస్తుంది.
ఇంత పొడుగు నాగార్జున్ కవిత్వాన్ని పరిచయం చేసిన తర్వాత ఉపసంహారం కోసం వ్యాసం ఆరంభంలో లేవనెత్తిన ప్రశ్నలకి ఇదంతా ఎట్లా ఉపయోగ పడుతుంది అని ప్రశ్నించడం సమంజసమే. మొదట్లో చెప్పినట్లుగా, ఈ వ్యాసానికి ఉన్న పరిధి పరిమితమయినదే – చెదురుతున్న సంభాషణలని ఒక దగ్గర ప్రోవు బెట్టడం. మళ్ళీ ఒక సారి చెప్తాను: భారతీయ కవిత్వంలో అంతస్సూ, చేతస్సూ ఇట్లాంటి వాటికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ, ఈ చరిత్రలో ఎనభై తొంభై సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. ఆ తరువాత ఏ భారతీయ భాషలోనైనా ఏ తరం కవులైనా అంతస్సూ చేతస్సూ అన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కావలసిన నిఘంటువులు మనం తయారు చేసుకోక పోవటంతో వాదవివాదాలు మార్మికతతో నిండి వుంటున్నాయి. అందు చేత మనం రెఫర్ చేస్తున్న అంతస్సు ఎట్లా పుట్టుకు వచ్చిందో దానికి ఉన్న పుట్టుమచ్చ లేమిటో, దానికి ఒక స్ట్రక్చరో అస్తి పంజరమో ఏదైనా ఉంటుందా ఉండదా – అంతర్బహిర్ అనే మాటలకి అర్ధం ఏమిటీ – ఇలాంటి వాటి గురించి కొంచెం సావకాశంగా తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. సమిష్టిగా మనకి తెలిసినదేమిటో తెలియనిదేమిటో తేల్చుకోవాలి.
సాహిత్యానికీ భౌతిక అస్తిత్వానికీ (ఒక అర్థంలో – న్యాయం కోసం చేసే పోరాటాలకీ) ఉన్న సంబంధం గురించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ సంబంధం తేలికగా కొట్టి పారేయగలిగినదీ కాదు. అట్లాగే అదేంటో మనకి తెలుసునని బుకాయించితేనూ చెల్లదు. సాహిత్యానికీ (సంస్కృతికీ) స్వయం ప్రతిపత్తి ఉంటుందా, దాన్ని వర్గ స్వభావానికి లోబడి ఉండే చైతన్య రూపంగానో భావజాలంలో భాగం గానో అర్థం చేసుకోవటం సమంజసమేనా కాదా అన్న ప్రశ్నలని తరువాత ఆసక్తి ఉంటే తేల్చుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ మొదటగా సాహిత్యమూ సంస్కృతీ ఆచరణ రూపాలే అని ఆలోచించటం, అవి సృజనాత్మక శ్రమనించి పుట్టుతాయని అర్థం చేసుకుంటే చేతస్సు చైతన్యం అనే బ్రహ్మ పదార్థాల బారి నించి బయట పడవచ్చును. బాల గోపాల్ ప్రశ్నలు లేవనెత్తటం మొదలు పెట్టి ఇరవై సంవత్సరాలు గడిచి పోయాయి. ఇప్పుడు ఇంకా వీటిని పట్టించుకుని శ్రమించటానికి ఆయనే లేడు. తెలుగు సమాజంలో ఈ ప్రశ్నల పట్ల ఉండవలసినంత ఆసక్తి లేదు.
ఏ వాదమైనా, ఏ ఉద్యమమైనా – తాము ఇతరులకన్నా ఎంత భిన్నంగా ఉన్నామని చెప్పుకున్నా – అన్నిటికీ మూలమయిన విషయాల గురించి నిర్దుష్టంగా ఉపయోగకరంగా ఉండేలా మాట్లాడుకోలేకపోతే సంభాషణలు ఎటు గాలి వీస్తే అటే కొట్టుకు పోతాయి. నా దృష్టిలో ఇటువంటి చర్చలు మన మధ్యన ఉండే వ్యక్తుల గురించీ, మనకు బాగా తెలిసిన వ్యక్తుల గురించీ మాట్లాడుకొనే క్రమంలో సాహిత్యేతర, సిద్ధాంతేతర విషయాల వలన వచ్చే ఆవేశాలకు లోనై కుప్ప కూలుతుంటాయి. అట్లా అని పూర్తిగా మనకు లోతుగా పరిచయం లేని సందర్భాలనుంచి – ఆఫ్రికాలోనో అమెరికాలోనో చిలీ లోనో పుట్టుకొచ్చిన సృజనతో మొదలు పెట్టుకుంటే పడికట్టు రాళ్ళ విశ్వ జనీనత తప్ప మనకు నిజానికి మాట్లాడుకోవడానికి ఎక్కడా పట్టు చిక్కదు. ఇతర భారతీయ భాషల్లో కవుల గురించి మాట్లాడుకోవడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. వారి జీవితానుభవాలూ, వాటి సందర్భాలూ మనకి దగ్గరగా ఉంటాయి. నాగార్జుననే ప్రత్యేకంగా ఎన్నుకోవటానికి ఒక కారణం, ఆయన నాకు కవిగా , వ్యక్తిగా చాలా ఇష్టుడు కావటం ఒకటైతే, ఆయన కవిత్వంలో నేను ప్రస్తావించిన విషయాలు స్పష్టంగా కనపడతాయని అనిపించడం రెండవ కారణం.
గ్రంథసూచి
- Partha Chatterjee – Nationalist thought in the colonial world: A derivative discourse. University of Minnesota Press, 1986.
- కె. బాలగోపాల్ – చరిత్ర మనిషి మార్క్సిజం, అరుణ తార, సెప్టెంబర్ సంచిక, 1993.
- కె. బాలగోపాల్ – చివరి మాట, కల్లోల కథా చిత్రాలు, పెర్స్పెక్టివ్స్ ప్రచురణ, 1997.
- K. Balagopal – Democracy and the fight against communalism, Economics and Political Weekly, January 7, 1995.
- కె. బాలగోపాల్ – చీకటి కోణాలు (ఇన్) ‘మూడు దశాబ్దాల నక్సల్బరి ఉద్యమం, గమనం. పెర్స్పెక్టివ్స్ ప్రచురణ, 1998.
- కె. బాలగోపాల్ – ఖాళీలను పూరించడమే సాహిత్యం పని. కే శ్రీనివాస్ తో ఇంటర్వ్యూ ప్రజాతంత్ర సాహిత్య ప్రత్యేక సంచిక, మార్చి 2001.
- బాబా నాగార్జున కవిత్వం కవితాకోష్.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి. కవితాకోష్.ఆర్గ్ లో నాగార్జున కవిత్వం పేజీ ఉంది. నాగార్జున కవిత్వానికి వీడియో లింకులు – మంత్ర కవిత, గులాబీ చూఢియాఁ.