“నాన్నా! మనం ఓ కుక్క పిల్లని పెంచుకుందామా?” కళ్ళు పెద్దవి చేస్తూ తండ్రినడిగింది పన్నెండేళ్ళ డాలీ.
నోట్లో సిగరెట్టు చేతిలోకి తీసుకొని గుప్పని పొగ వదులుతూ, “కుక్క పిల్లా? దేనికి?” అడిగాడు.
“మనం ఓ బుజ్జి కుక్క పిల్లని పెంచుకుందాం! స్కూల్ నుండి వచ్చాకా నాతో ఆడుకుంటుంది..” తండ్రి మొహంలోకి ఆశగా చూసింది.
కూతురి మాటలు విన్నా పట్టించుకోలేదతను. ఆ సిగరెట్టు చివరి వరకూ పీల్చి పారేసాడు. తండ్రి దగ్గరగా వెళ్ళి అడుగుదామనుకున్న డాలీ ఆ వాసనకి దూరంగానే ఉండిపోయింది. తన మాటలు సరిగా వినలేదని గ్రహించి వెనక్కి వెళిపోబోయింది. తిరగ్గానే తండ్రి పిలిచాడు. వెనక్కి వచ్చి అక్కడే నిలబడింది.
“డాలీ! కుక్క పిల్ల కావాలా?”
“అవును. మా ఫ్రెండూ వాళ్ళకి రెండు కుక్కలున్నాయి. భలే ముద్దొస్తూ ఉంటాయవి. మనం కూడా ఓ బుజ్జి కుక్కని పెంచుకుందాం..” కళ్ళలో ఆశ నింపుకొని అడిగింది. డాలీకి కుక్క పిల్లలంటే ఇష్టం. ఎన్నోసార్లు కుక్కపిల్ల కావాలని అడిగినా ఫలితం లేదు. అడిగిన ప్రతీసారీ ఎదురయ్యే జవాబు తెలిసినా, ఎప్పటికయినా సరేననకపోతారా అన్న ఆశ.
తండ్రి మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. “అలాగే…బుజ్జి కుక్క ఎక్కడ దొరుకుతుంది?” ఆఖరి సిగరెట్టేమో చేతిలో పెట్టెని దూరంగా విసిరేసాడు.
“తెలీదు. మా ఫ్రెండు వాళ్ళనడుగుతా! లేదంటే…” ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది. తను రోజూ పార్కులో చూసే కుక్క పిల్ల గుర్తొచ్చింది. డాలీ ఇంటి దగ్గర పార్కుకి తన ఫ్రెండ్సుతో ఆడుకోడానికి వెళుతుంది. ఫ్రెండ్సొచ్చినా రాకపోయినా ఒక తెల్ల బొచ్చు కుక్కని చూడ్డానికయినా వెళుతుంది. ఎప్పుడూ ఆ కుక్కని తాకకపోయినా చూడ్డానికి భలే ముద్దొస్తుంది. తెల్ల బొచ్చు కుక్కని ఒకాయన రోజూ పార్కుకి తీసుకొస్తాడు. “ఆయన్ని అడిగితే?” అనిపించింది డాలీకి. పైకి అనలేదు.
“లేదంటే..?” తండ్రి రెట్టించాడు.
“పార్కులో ఒకాయనకి బొచ్చుకుక్క వుంది. ఆయన్ని అడిగితే..”
“వుత్తినే ఇస్తాడా?… డాలీ, కుక్కని పెంచుకోడం చాలా కష్టమమ్మా? రోజూ కుక్కకి స్నానం చేయించాలి. దానికోసం తిండి కొనాలి. ఎప్పుడయినా ఆయొస్తే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలి. వీటన్నింటికీ చాలా డబ్బులవుతాయి… తెలుసా?”
ఏం జవాబు చెప్పాలో తెలీక బిక్క మొహం వేసింది డాలీ. “డబ్బులు కావాలా? ఎంత?… నా దగ్గర దాచుకున్న డబ్బులు….” తనెంత దాచుకుందో గుర్తుకి రాలేదు.
“చాలా డబ్బులు కావాలి. నెలకి ఓ అయిదొందలవుతాయి. అంత డబ్బు మన దగ్గర లేదు. నువ్వు బాగా చదువుకొని మాంచి వుద్యోగం సంపాదించుకుంటే బోల్డు డబ్బులిస్తారు. అప్పుడు కొనుక్కుందువు గాని…”
తండ్రి చెప్పేది పూర్తిగా అర్థమయ్యీ అవనట్లుగా ఉంది. ఎప్పుడూ అదే సమాధానం చెబుతాడు అక్షరం పొల్లుపోకుండా. పెద్దయ్యేవరకూ ఆగాలా? అప్పటికి ఈ బొచ్చు కుక్క పిల్లా తనలా పెద్దదయిపోదూ? తండ్రి కుక్కని కొనడని అర్థమయ్యింది డాలీకి. పోనీ అమ్మమ్మా, తాతయ్యనడిగితే? వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. రాజమండ్రి నుండి వైజాగ్ చాలా దూరం. అమ్మనడిగితే చెబుతుంది వాళ్ళెప్పుడొస్తారొ?
“పోనీలే…” అంటూ అమ్మని అడగడానికి వెనక్కి తిరిగింది.
“డాలీ… వచ్చే ఏడాది కొంటాలే. నాకో చిన్న పని చేసి పెట్టు”
తండ్రి చేసే ప్రమాణాలు డాలీకి అనుభవమే! వచ్చే ఏడాదంటే ఖచ్చితంగా కొనడని డాలీకి బాగా తెలుసు. పని ఏమిటన్నట్లుగా తండ్రి కేసి చూసింది. అతను జేబులోంచి పర్సు తీసి ఓ ఏభై రూపాయిల నోటు తీసాడు. డాలీ చేతికి ఇస్తూ – “మనింటి పక్క కిళ్ళీ షాపులో ఓ గోల్డ్ ఫ్లేక్ పేకట్టు పట్టుకురా” అని చెప్పాడు.
ఆ నోటు తీసుకొని బయటకు నడిచింది. తండ్రికీ పని చేయడం డాలీకి ఇది మొదటి సారి కాదు.
ఆ రోజు సాయంత్రం పార్కుకి ఒక్కతే బయల్దేరింది డాలీ. వెళుతూనే స్నేహితుల కోసం చూళ్ళేదు. తెల్ల బొచ్చు కుక్కని రోజూ పార్కుకి తీసుకొచ్చే ఆయన కోసం చూసింది. అతను వుయ్యాలా, జారుడు బల్లలలున్న చోటుకి దూరంగా ఒక బెంచీ మీద కూర్చుంటాడు. ఎప్పుడూ అదే బెంచీ మీద కూర్చుంటాడు. కుక్కని తీసుకొస్తాడు. దాంతో ఆడతాడు. అది అతని వొళ్ళెక్కి తైతెక్కలాడుతుంది. అతను దూరంగా బంతి విసిరితే ఒక్క అంగలో వెళ్ళి పట్టుకొస్తుంది. అతను ఆ బొచ్చుకుక్కని ఒక్కోసారి వళ్ళో కూర్చో పెట్టుకుంటాడు. అదీ కదలకుండా, మెదలకుండా అతన్ని అంటి పెట్టుకునే వుంటుంది. ప్రతీ సారీ అవే దృశ్యాలు చూసినా డాలీకి ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటాయి. ఆ కుక్కపిల్ల ఎగురూతూ వుంటే చూడ్డం ఎప్పుడూ ఆనందమే! అసలీ కుక్కని చూసాకే డాలీకి కుక్కపిల్ల మీద మోజు పెరిగింది.
ఆ రోజు అతను ఇంకా రాలేదనుకుంది డాలీ. వచ్చాకా కుక్క పిల్లని ఎక్కడ తెచ్చుకోవాలో అడుగుదామనుకుంది. ఉదయం తండ్రినడిగాక అమ్మకీ విషయం చెబితే ఎవర్నీ అడగద్దని చెప్పిన విషయం గుర్తొచ్చింది. తెలిస్తే అమ్మ తిడుతుంది. వెంటనే ఫ్రెండ్సుండే చోటుకి ఆడుకోడానికి వెళిపోయింది. ఆటలో పడి బొచ్చుకుక్క విషయమే మర్చి పోయింది. ఆట మధ్యలో ఉండగా అనుకోకుండా అతను ఆ బెంచీ మీద కనిపించాడు. ఒక్క సారి ఆట మానేసి అలాగే చూస్తూ ఆగిపోయింది.
అతను ఎప్పటిలాగే ఆ బెంచీ మీదే కూర్చున్నాడు. అతనికేసీ, ఆ కుక్కకేసీ తదేకంగా చూస్తూ ఉండిపోయింది డాలీ. అతను ఒక చేత్తో పుస్తకం చదువుతూ రెండో చేత్తో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తెల్ల బొచ్చు కుక్క అతని మీద పడి అల్లరి చేస్తోంది. అతను పుస్తకం పక్కన బెట్టి బంతిని దూరంగా విసిరాడు. చేతిలో సిగరెట్ తీసి రింగు రింగులా పొగొదుల్తూ కనిపించాడు. వాటికేసి ఆశ్చర్యంగా చూసింది డాలీ. తండ్రీ సిగరెట్ కాలుస్తాడు కానీ ఎప్పుడూ ఈ రింగులుండవు. అతనా రింగులెలా తెప్పిస్తాడో డాలీకెప్పుడూ అంతుపట్టదు.
ఈ లోగా ఆ బొచ్చు కుక్క బంతిని వెనక్కి తెచ్చిచ్చింది. మళ్ళీ విసిరాడు. అది తెచ్చింది. కొంతసేపయ్యాక విసుగొచ్చిందేమో బంతిని తీసి పేంటు జేబులో పెట్టేసుకున్నాడు. అంతే, ఆ కుక్క పిల్ల అతని వళ్ళో దూరింది. ఒక చేత్తో దాని బొచ్చుని సవరిస్తూ రెండో చేత్తో సిగరెట్ తాగుతూ కళ్ళు మూసుకొని అతను ఏదో ఆలోచిస్తున్నాడు. చాలా సేపట్నుండీ డాలీ కళ్ళు అక్కడే తచ్చాడుతున్నాయి.
కొంతసేపయ్యాక అతని దగ్గరగా వెళ్ళింది. డాలీని చూడగానే బొచ్చు కుక్క చిన్నగా మొరిగింది. అతను కళ్ళు తెరిచి చూసాడు. సిగరెట్ చివరి దమ్ము లాగి, డాలీ కేసి చూసి నవ్వాడు.
“హలో! ” నవ్వుతూ అన్నాడు. హలో చెప్పినా డాలీ ఆ బొచ్చు కుక్క కేసే చూస్తోంది.
“ఆడుకుంటావా మా టామీతో?”
ఉహూ అన్నట్లుగా తలాడించింది. కుక్క పిల్లనడుగుదామనుకుంది. ఎందుకో భయమేసింది. అమ్మ గుర్తుకొచ్చింది. పైకి ఏమీ అనలేకపోయింది.
“ఓ సారి కుక్కని ముట్టుకోవచ్చా?” బెరుకుగా అడిగింది. అతను సరేనంటూ టామీని ఆ పిల్ల చేతికిచ్చాడు. “హబ్బా! ఎంత మెత్తగా ఉందో కదా ఈ కుక్క పిల్ల?” అనిపించింది డాలీకి. గట్టిగా దగ్గరకి తీసుకుంది. అతను జేబులోంచి మరో సిగరెట్ తీసి వెలిగిస్తూ అడిగాడు.
“నీ పేరేంటి?”
“డాలీ” తలెత్తకుండానే చెప్పింది.
“నాకు ఇలాంటి కుక్క పిల్ల కావాలి…” ఆపుకోలేక అడిగింది. అతను గట్టిగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు డాలీకి.
“నీక్కూడా టామీ కావాలా? ఇదంటే నా వైఫ్‌కి చాలా ఇష్టం. నాక్కూడా. మీ నాన్నని కుక్కపిల్లని కొనమని అడుగు” అతని మాటలు విని ఆశ్చర్యంగా చూసింది. కుక్కపిల్లల్ని అమ్ముతారా!
“కుక్క పిల్లని కొనుక్కోవాలా? ఏ షాపులో అమ్ముతారు?” అతను విరగబడి నవ్వితే అతనికేసే చూస్తూ ఉండిపోయింది డాలీ. అతనెందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు.
“నీకు హైద్రాబాదు తెలుసా? అక్కడనుండి తెప్పించుకున్నాం”
“ఎక్కడుందో తెలుసు. ఎప్పుడూ వెళ్ళలేదు.”
“పోనీ గాజువాక తెలుసా? అక్కడొకాయన కుక్కపిల్లల్ని అమ్ముతాడు”. తనకి తెలీదని చెప్పింది డాలీ. ఇంకా రెండు మూడు ప్రశ్నలేసాడు. కొన్ని డాలీకి అస్సలు అర్థం కాలేదు. చివరకి అతనే అన్నాడు.
“రేపు మీ అమ్మగారిని తీసుకొని రా! ఎక్కడ దొరుకుతుందో చెబుతాను.”
అమ్మ పేరెత్తగానే డాలీకి భయమేసింది. అమ్మ కుక్క పేరు చెబితేనే తిట్టిపోస్తుంది. అలాగే అని టామీని మరోసారి గట్టిగా ముద్దెట్టుకొని, అక్కడనుండి వెళిపోయింది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది. ఒక చేత్తో సిగరెట్ పట్టుకుని, రెండో చేత్తో టామీ వీపుని రుద్దుతూ ఆ బెంచీ మీద కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. కాసేపు అలాగే నిలబడి టామీ కేసి చూస్తూ ఉండిపోయింది డాలీ. టామీ కూడా తనకేసే చూస్తోంది. అతను మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మధ్య మధ్యలో రింగు రింగులుగా పొగొదులుతున్నాడు.
ఎప్పుడూ చూసే దృశ్యమయినా డాలీ మస్తిష్కంలో అదెప్పుడూ కొత్తగానే రూపు దిద్దుకుంటుంది.
వాళ్ళమ్మకి బొచ్చు కుక్క గురించి చెప్పింది డాలీ. పెంచుకుంటే అలాంటి కుక్కనే పెంచుకోవాలనీ, ఎలాగయినా కొనమని పేచీ పెట్టింది. డాలీ పోరు భరించలేక వాళ్ళమ్మ పార్కుకొచ్చి అతన్ని ఎక్కడ కొన్నాడో అడగడానికి ఒప్పుకుంది. ఆ ఒప్పుకోడానికి డాలీ బాగా చదువుతాననీ, చెప్పినమాట వింటాననీ, టీవీ చూడననీ ఒకటేమిటి చాలా ప్రామిస్సులు చేసింది. ఆ రోజు సాయంత్రం తల్లిని తీసుకొని పార్కుకొచ్చింది డాలీ. అతని కోసం చూసింది. ఎంత సేపు చూసినా అతను రాలేదు. ఎదురు చూసి చూసి విసుగు పుట్టి, తల్లితో తిరిగెళ్ళి పోయింది.
ఈ లోగా డాలీ తాతయ్యకి అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేర్చారని కబురొస్తే వాళ్ళందరూ రాజమండ్రి వెళ్ళారు. డాలీకి వాళ్ళతో వెళ్ళక తప్పలేదు.
డాలీ తాతయ్య కోలుకున్నాక, ఓ నెల్లాళ్ళ తరువాత వైజాగ్ తిరిగి వచ్చింది. వచ్చీ రాగానే ఆ సాయంత్రం వాళ్ళమ్మని పార్కుకు రమ్మనమని పోరేసింది డాలీ.
“వచ్చే వరకూ పీక్కు తినేస్తావు కదే?” అంటూ వాళ్ళమ్మ తిట్టుకుంటూనే బయల్దేరింది.
వస్తూనే అతను ఎప్పుడూ కూర్చునే బెంచీ వైపు చూసింది డాలీ. ఎప్పటిలాగే అతనికి ఒక చేతిలో పుస్తకం, రెండో చేతిలో సిగరెట్టుతో కనిపించాడు. వెంటనే టామీ కోసం కళ్ళు వెతికాయి. కనిపించలేదు. ఆ బెంచీకి కాస్త దూరంగా ఓ నల్ల కుక్క గడ్డిలో దేనితోనో ఆడుతోంది. బంతేమో అనుకుంది డాలీ. కానీ అలా అనిపించలేదు. బెంచీ మీద అతన్ని చూసి ఒక్క ఉదుటున పరిగెత్తుకెళ్ళింది డాలీ. ఆ పిల్ల పరుగు చూసి ఆ బెంచీ మీదున్న వ్యక్తి తలతిప్పాడు. డాలీని గుర్తుపట్టి నవ్వుతూ పలకరించాడు. ఇంతలో డాలీ వాళ్ళమ్మ అక్కడికొచ్చింది. వాళ్ళిద్దరూ పరిచయాలు చేసుకున్నారు. డాలీ వాళ్ళమ్మ టామీ ప్రస్తావన తెచ్చింది.
“మా డాలీ రోజూ మీ టామీ గురించే చెప్పి బుర్ర తింటుంది. మీరు ఈ టామీని ఎక్కడ కొన్నారు? ” నవ్వుతూ అడిగింది వాళ్ళమ్మ.
” హైద్రాబాదునుండి తెప్పించుకున్నాం. నా వైఫ్‌కి అదంటే ప్రాణం.”
“అలాగా! ఈ వైజాగులో ఎక్కడ దొరుకుతాయి?”
“గాజువాకలో ఒకాయన కుక్కపిల్లల్ని తెప్పిస్తాడు. మీకెలాంటి కుక్క కావాలంటే అది ఆయన్ని అడగొచ్చు.”
డాలీ వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటోంది. ఇంతలో దూరంగా ఉన్న నల్లకుక్క పిల్ల వచ్చి అతని కాళ్ళని నాకింది. ఆ కుక్క పిల్లని చూసి కాస్త ఎడంగా జరిగింది డాలీ.
“మీ టామీ భలే బావుంది.” నవ్వుతూ అంటున్న అమ్మకేసి చూసింది. టామీ పేరెత్తగానే అతని మొహంలో రంగులు మారాయి.
“ఇది టామీ కాదు. జూలీ!”
“టామీని ఇంటి దగ్గరొదిలేసారా?”
లేదన్నట్లు తలాడించాడతను. “టామీ మూడు వారాల క్రితం చనిపోయింది. మా వైఫ్ టామీ లేందే ఉండలేదు. దాంతో ఆవిడ బెంగ పెట్టుకుంది. టామీ బదులు ఈ జూలీని తెచ్చుకున్నాం. మా వైఫ్ ఇంకా టామీని మర్చిపోలేకపోతోంది…” నెమ్మదిగా అన్నాడతను.
“ఐ యాం సారీ! దీన్ని చూసి టామీ అనుకున్నాను.”
“పరవాలేదు.” అతను సర్దుకున్నాడు. డాలీ మనసంతా ఒక్కసారి వెలితిగా అయిపోయింది. ఏం అనాలో తెలీడం లేదు. ఒక్క మాట పెగల్లేదు.
“టా..మీ..ఎలా..పోయింది?” డాలీ ఒక్కొక్క మాటా కూడదీసుకుంటూ అడిగింది.
“టామీకి వంట్లో బాగాలేకపోతే డాక్టరుకి చూపించాం. కేన్సర్ అని చెప్పాడు. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందని అన్నారు. ఈలోపలే పోయింది.” చెబుతూంటే అతని గొంతు జీరబోయింది.
“కేన్సరా…?”
“అవును. లంగ్ కేన్సర్!”
“అయ్యో పాపం. మా ఫాదరిక్కూడా నెల క్రితం లంగ్ కేన్సరొచ్చింది.. ఎర్లీ స్టేజి లోనే కనుక్కున్నారు. ప్రస్తుతం పర్వాలేదు. కుక్కలకి కూడా కేన్సరా..?”
అవునన్నట్లుగా తలూపాడతను. డాలీ వాళ్ళ మాటలు వింటోంది. టామీ చచ్చిపోయిందన్న విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వాళ్ళమ్మ గాజువాకతని అడ్రసు తీసుకొని వెళ్ళొస్తామని చెప్పింది. దిగాలుగా వాళ్ళమ్మని అనుసరించింది డాలీ. ఆమె మనసులో టామీ రూపమే మెదులుతోంది. తెల్లటి తెలుపు రంగులో, విపరీతమైన బొచ్చుతో ఉండేది. చిన్నగా బొద్దుగా ఉండేది. డాలీ స్నేహితులతో ఆడుకోడానికెళ్ళ లేదు. డాలీని తీసుకొని ఇంటి ముఖం పట్టింది వాళ్ళమ్మ. వెళుతూ, వెళుతూ ఒక్క సారి వెనక్కి తిరిగి చూసింది డాలీ. అతను ఎప్పటిలాగే బెంచీ మీదే పుస్తకం తిరిగి చదువుతూ కనిపించాడు. మరో చేతిలోలో సిగరెట్టు. రింగు రింగులుగా అతను గాలిలో పొగూదుతున్నాడు.టామీ చచ్చిపోయిందని గుర్తొచ్చి భయమేసింది. దూరంగా ఆ నల్ల కుక్క ఎముక నాకుతూ కనిపించింది. మొదటి సారి ఆ కుక్క పిల్లని చూసి ఏవగింపు కలిగింది డాలీకి.
“టామీ చచ్చిపోయాక ఏమవుతుంది?” దారిలో అమ్మనడిగింది.
“ఏమవుతుంది. పైకెళిపోతుంది..” అంటూ ఆకాశం వైపు చూపించింది.
“పైకెళితే మళ్ళీ తిరిగి రాదా?”
“రాదమ్మా”
“కేన్సరొస్తే చచ్చిపోతారా? కేన్సరంటే ఏంటి?”
“కేన్సరంటే పెద్ద కురుపులా వస్తుంది. అయినా ఏంటీ పిచ్చి ప్రశ్నలు?”.
డాలీకి వాళ్ళమ్మ మొహంలో చాలా విసుగు కనిపించింది. ఇహ డాలీ ఇంకేమీ అడగలేదు. ఆలోచిస్తోంది. తాతయ్యకీ లంగ్ కేన్సరని ఇంట్లో అందరూ చెప్పుకోడం వింది.
తల్లినడిగితే తాతయ్య చుట్ట కాల్చడం వల్ల కేన్సరొచ్చిందని చెప్పడం గుర్తొచ్చింది డాలీకి. చుట్టకాలిస్తే కేన్సర్ వస్తుంది కానీ, సిగరెట్ కాలిస్తే రాదు కదా? అయినా అతను సిగరెట్టు కాల్చాడు కానీ కుక్క సిగరెట్టు కాల్చలేదు కదా? మరి కుక్క ఎలా చచ్చిపోయింది? అతను ఒకదాని వెంబడి మరొకటి కాల్చడం చూసింది తను. ఎప్పుడూ టామీ అతని ఒళ్ళోనే ఉండేది. ఆ పొగ ఘాటు దూరంగా ఆడుకుంటున్న వాళ్ళకీ వచ్చేది. అయితే ఆ కుక్క కూడా అతనొదిలిన పొగని తాగిందా? తల్లినడుగుదామంటే తిడుతుందనుకొని మౌనంగా ఉండిపోయింది. అర్థంకాని ఎన్నో ఆలోచన్లతో ఇంటికొచ్చింది.
తండ్రి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. రెండో చేతిలో సిగరెట్ వెలుగుతూ కనిపించింది. డాలీని చూడగానే అతను సిగరెట్ పక్కన పడేసి కూతుర్ని దగ్గరకి తీసుకున్నాడు. డాలీకి పొగ వాసనొచ్చింది.
“ఏయ్ డాలీ! నీకో సర్ప్రైజ్!” అంటూ డాలీని సోపాలో కూర్చోబెట్టి, లోపలికెళ్ళి తిరిగొచ్చాడు.
అతని చేతిలో ఓ తెల్ల బొచ్చు కుక్క పిల్లుంది.
“నీకోసమే! మా ఫ్రెండొకాయిన ఇచ్చాడు. ఏం పేరు పెడదాం?”
డాలీ ఆ కుక్క పిల్ల కేసే చూస్తూ ఉండిపోయింది. కుక్క పిల్లని చూడగానే ఎగిరి గంతేస్తుందనుకున్నాడు. కూతురు ఏం మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యపోయాడతను.
“నిజంగా! నీ కోసమే…” అంటూ కుక్క పిల్లని డాలీ చేతిలో పెట్టాడు.
డాలీ కుక్కపిల్లని ఒదిలించుకొని పక్కనబెట్టేసింది. ఏం మాట్లాడలేదు. అర్థంకాక తండ్రి తనవైపే చూస్తున్నా తలదించుకునే వుంది. రింగు రింగులుగా పొగలొదుల్తూ పార్కులో అతను గుర్తొకొచ్చాడు డాలీకి. ఆ పొగల మధ్య తెల్లటి బొచ్చుతో టామీ తలాడిస్తూ గుర్తుకొచ్చింది.
“నాకు కుక్క పిల్ల వొద్దు. వెనక్కిచ్చేసెయ్యి నాన్నా” అంటూ ఒక్కుదుటున తల్లి దగ్గరికి పరిగెత్తింది డాలీ.