సా విరహే గీతపు అనువాదాలు

(సావిరహే తవదీనా – ఈ అష్టపది పై జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసానికి అనుబంధంగా ఈ అనువాదాలు ఇక్కడ సంకలించబడినాయి.)

గీతగోవిందము – బొమ్మకంటి వీరరాఘవాచార్యుల అనువాదము, 1940 వావిళ్ళ ప్రెస్.

ఇటు శ్రీకృష్ణుఁడు యమునా
తటి ప్రబ్బలి నీడ వేడ్క తలఁగిన మది మి-
క్కుటమైన ప్రేమ నుండగ
నట కల్లన రాధ చెలియ యరుదెంచి యనున్

కాముని ఢాకకు భయపడి నీలో తా మది లీనత నొందున్
ఆమె విరహమునఁ గుందున్ కృష్ణా ఆమె విరహమునఁ గుందున్ (పల్లవి)

చందురు కిరణము గంధము వలదను చాలగ ఖేదముఁ గాంచున్
మంద సమీరము పాముల నెలవున చెందు గరళ మనియెన్ (1)

విరివిగ పైబడు సుమశరములు మది వెలయు నినుఁ దగులు నంచున్
నెరకవచమువలె తామరరేకుల నెలత హృదయమున నించున్ (2)

అలరు కలామతి సుమశరములు గల నంపశయ్య నట కూర్చున్
లలన భవ త్పరిరంభముఁ గోరి చలంబుగ వ్రతమును దీర్చున్ (3)

కోరల రాహువు చీరగ నమృతము గారు సుధానిధి లీలన్
తీరౌ మోమున మబ్బు కన్నులను నీరు నించి వెతఁ దేలన్ (4)

మగువ చాటుగా కస్తురితో నీ మన్మథ రూపము వ్రాయున్
చిగురు బాణములు మొసలి వాహనము చేర్చి నమస్కృతి సేయున్ (5)

అందని నిను మును ధ్యాన లయంబున నతివ నిల్చుకొని పొంగున్
చెందును తాపము తిరుగును నవ్వును చింతిలు వెతలోఁ గ్రుంగున్ (6)

అడుగడుగున కిటులను మాధవ నేనంటితి నీ చరణములన్
పెడమో మౌదువొ సుధానిధియు శశి పేల్చు నా తనుమనములన్ (7)

హరివిరహము గను రాధిక వలపును ఆమె చెలి తెలుపు లీలన్
విరళించిన జయదేవుని వాక్కుల విని కని మదిఁ గొనఁ బోలున్ (8)

తోరంబౌ తన యిల్లె కారడవిగా, తోడౌ చెలుల్ చుట్టు దు-
ర్వారంబౌ వలగా, తపించు తన నిశ్వాసంబె కార్చిచ్చుగా,
శౌరీ నీ విరహార్తి నాయె కటా సారంగియై భీతిలెన్,
మారుండింక యముండుపోలె కవిసెన్ మర్దించు శార్దూలమై

శ్రీమదాంధ్ర గీతగోవిందకావ్యము – చల్లా పిచ్చయార్య, ఓంకార్ ప్రెస్, గుంటూరు, 1950.

యమున చెంగటఁ బ్రబ్బలి యలరుఁ దీవె
యింట వెడఁ గట్టు లొకరీతి నెసఁగుచున్న
కృష్ణుఁ గని రాధ చెలికత్తె యిట్టు లనియె
నున్న దున్నట్లు మధురమయోక్తి నెఱఁగి

ఎడయుటఁ దాఁ గడునడలు
ఒడయ మరుని ముల్కుల కుల్కినయటు లెడద హత్తు నీయొడలు (పల్లవి)

దూఱు మంచి గందంబును వగమై దూలి పండువెన్నెలలన్
సారెఁ దలఁచుఁ బాముల కలయిక విసమ్ముగఁ జిఱు పయ్యెదలన్ (1)

తఱచుగఁ బైఁబడు పలు మరువమ్ముల తాకువ నినుఁ గాపాడన్
పఱచు నెదఁ గవచముగఁ దామరపాకుజలము దోగాడున్ (2)

వెలయు వివిధ శిల్పకళారీతుల వెడదపూల తలిమంబు
మలిచె దీక్ష శరతల్పంబుగ విస్మయముగఁ గొని నియమంబు (3)

రాహువుకోఱల గంటులఁ దొడి వడి రసము తొఱఁగు చంద్రుని పగిది
మోహన ముఖమునఁ గన్నీ రొలుకఁగఁ బొడఁగాంచు నిను సొరిది (4)

ఏ కతమునఁ గస్తురిచే నిను రచియించును బూవిలుతునిగన్
జోఁకను గ్రిందుగ మొసలిని గై నవచూతంబిడి యెఱఁగును పనిగన్ (5)

సొగియు ధ్యానయోగంబున దుర్లభుఁ జూచుచు నినుఁ దన మ్రోలన్
వగచు నవ్వుఁ బొగలును దుఃఖించును నగు మొగిఁ దాపము వ్రీలన్ (6)

పెడమొగ మిడనీ వొడయఁడ నెలయును నొడలిని జిచ్చులు గురియున్
పడితిని నడుగుల దాసురాల నడుగడుగున నను గుఱి విరియున్ (7)

కవి జయదేవుని పలు కమృత మ్మని జ్ఞానులు మీరెదఁ దలుపన్
చవిఁ గొనుడీ హరివిరహాకుల వ్రజసతి చెలి నుడి సిరి గొలుపన్ (8)

ఏడంతస్థుల మేడ కానగుములై యిర్వంకలన్ దోచుఁ బూఁ
బోఁడుల్ పెన్వలలట్లు చిక్కుపఱుపన్ ముక్కూర్చు కార్చిచ్చుతో
డ్తోడం జూడెను గాముఁ డన్యముఁడు శార్దూలంబటుల్ గాండ్రిలెన్
లేడింబోలిన రాధ నీ వెడయ నేలీలన్ మనున్ శ్రీహరీ

ఆంధ్రగీతగోవిందము – తిరువేంగళ సూరి (యతిశ్రీ), విశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాదు, 1996.

రాగభయములు రెండును రగులగ యము-
నా నదీతీర వానీర నవ నికుంజ
గతుడగు మురారితో రాధికా సఖి నయ
వినయము లెనగ నిట్లని విన్నవించె

నీ విరహంతో దీనయైనదిరా కృష్ణా
మదన బాణముల బెదరున నీలో లీనమైనదిరా (పల్లవి)

గంధము జాబిలి గాలిని గనుగొని నిందించుచు తానున్నది
పాముల తాకిడి నన్నియు విషమని బాముల నొందుచు నున్నది (1)

మదిగల నిను కాపాడుటకొఱకై మదనుని శరముల మార్కొన
తడిసిన తామరరేకుల నెడదన కవచము జేయుచు నున్నది (2)

కాముని ములుకులు కలువలు తమ్ముల పువ్వుల శయ్యను వ్రతముగ
నీదగు కౌగిలి నిశ్చల సుఖముకు నెనరున జేయుచు నున్నది (3)

రాహువు కాటుల రాలెడు నమృతపు ధారలుగల రేవెలుగులా
కళ్ళను నీళ్ళను గారెడు గొనమగు నెమ్మొగముతో తానున్నది (4)

మారసమానుని నిను కస్తూరితో మహిపై వ్రాసియు కరముల
మామిడి చివురుల మకరము నిడుచును మరిమరి మ్రొక్కుచు నున్నది (5)

చిక్కని నిను ధ్యానంబున నెదుటను నున్నటు కల్పన జేయుచు
కుములుచు నవ్వుచు సొలయుచు తిరుగుచు కొందలమందుచు నున్నది (6)

విముఖుడవైనను మాధవ నీపదముల బడితిని మఱి చంద్రుడు
తాపము రేపుచు నున్నాడనుచును తానట బలుకుచు నున్నది (7)

యతి జయదేవ ఫణితమగు రాధా సఖిచే బలికిన గీతం
అందఱి మనముల నధికానందము గలుగగ జేయును నిత్యం (8)

ఆవాసంబు నరణ్య మయ్యెను, సఖీ హల్లీసక క్రీడలున్
భావింపన్ వలలయ్యె, నిశ్వసనతాపంబుల్ మహోగ్రంబులౌ
దావజ్వాలలు నయ్యె త్వద్విరహ బాధాతప్తయౌ రాధకున్
పూవిల్తుండు కృతాంతు డయ్యె నకటా పూబోడి యెట్లోర్చెడిన్