మొగ్గ
తొడగదన్న
చింతలేదు
ఓపిగ్గా తోటనంతా
కోవెల చేరుస్తుంది
పలుకులు
చిలకవన్న
బాధలేదు
వేళ్ళతో పలకరిస్తే
వేణువై శ్వాసిస్తుంది
తోడు లేదన్న
ధ్యాస లేదు
లోక కళ్యాణానికై దేహాన్ని
పందిరిగా మారుస్తుంది
పెరట్లో
చోటులేదన్న
పట్టింపు లేదు
ఊగే పుట్టుకనీ
విశ్రమించిన ఊపిర్నీ
బంధువై మోస్తుంది.
అడవి
మనిషినన్న
గొడవ లేదు
దేహాన్ని గోడ చేసి
అక్కున చేర్చుకుంటుంది.
నిలువునా చీల్చినా
నిలువెల్లా కోపం రాదు.
మెరుపు తారాజువ్వలా
ఆనందాన్ని
ఆకాశానికి అతికిస్తుంది.
ప్రాణం తీసారని
కన్నీరై విలపించదు.
గుండెపై చెక్కిన
అక్షర శిల్పాన్ని
కవన కోవెల్లో
భద్రంగా దాస్తుంది.