ఎదురు నడక
“ఉత్కృష్టమైన కళాకార్యాలు అన్నింటికీ ఒక symmetry అంటే సౌష్ఠవము ఉంటుంది. ఐతే సౌష్ఠవము వున్నవన్నీ ఉత్కృష్టరచనలు కావు” – శ్రీశ్రీ.
నా ఉద్దేశంలో శ్రీశ్రీ ప్రవేశ పెట్టిన ఛందస్సులోని ఉత్కృష్టమైన మార్పు (పాత తెలుగు ఛందస్సుకు వ్యతిరేకంగా ఒక విప్లవాత్మకమైన మార్పు) ఎదురు నడక. తెలుగులో, కన్నడములో దేశి ఛందస్సులో పద్య పాదం లఘువు (I) గురువు (U) కలయికలతో ఎప్పుడూ ఆరంభమవదు. దీనికి కారణము దేశిఛందస్సుకు కావలసిన సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు (కన్నడములో బ్రహ్మ, విష్ణు, రుద్ర గణాలు) రెండు మాత్రలైన U, II నుండి పుట్టినవి. అందువలన IU నడకకు ఈ భాషలలో అవకాశమే లేదు. కానీ తమిళములో ఇట్టి నడక నిషిద్ధము కాదు. తెలుగు సంగీత కృతులలో కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు. త్యాగరాజ కీర్తనలలో కూడా ఇట్టివి వ్రేళ్ళపైన లెక్కించవచ్చు. లఘుగురువుల పదాలను మొదట ఉచ్చరించేటప్పుడు బహుశా లఘువును ఊది పలకడం సాధ్యపడదేమో?
ఏది ఏమైనా, జ-గణము, య-గణము, లగము పాదానికి ముందు దేశి ఛందస్సులో ఉండవు. దీనిని ఎదురు నడక అంటారు. సంస్కృత వృత్తాలలో దీనికి ఆక్షేపణ లేదు. పంచచామరము, భుజంగప్రయాతము, ఉపేంద్రవజ్ర, శంభునటనము వంటి వృత్తాలలో ఇవి కనిపిస్తాయి. శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది. ఇలా వ్రాస్తే ఆద్యక్షరాలు తేలిపోతూ ద్వితీయాక్షరాల ఊనికచేత ఉచ్చారణ గౌరవం పొందుతూ గీతానికి ద్రుతగతిని ఆపాదిస్తాయని సంపత్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ తానే ‘జగణంతో జగడం కోరగా దగదు గానీ’ అని చమత్కరించాడు. ఎదురు నడక గీతాలకు ఎన్నో ఉదాహరణలు (స్విన్‌బర్న్ కవికి) ఉన్నాయి.
విషం క్రక్కే భుజంగాలో
కదం త్రొక్కే తురంగాలో
మదం పట్టిన మాతంగాలో
కవీ నీ పాటల్
కొన్ని చమత్కారాలు
కుమ్మరి మొల్ల చిత్రంలో అష్టావధానాలలోని దత్తపదిలా ఒక పద్యం కూడా శ్రీశ్రీ వ్రాశాడు. ఇందులోని పదాలు అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు, కాని ఈ పదాలకు ఈ అర్థాలు ఉండవు ఈ పద్యంలో. ఆ పద్యం –
అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విడిచె శివకార్ముకమున్
ప్రాసాక్షరములో అచ్చును ఉపయోగించి కూడా ఒక పద్యాన్ని శ్రీశ్రీ వ్రాశాడు-
ఓ అంతా కవులే, అ
ఆ ఇయ్యీలయిన రాని యంబ్రహ్మలె, మే-
మూ ఋషులం అంటూ
ఛీ ఎంతటి సిగ్గు చేటు సిరిసిరిమువ్వా
స్వరయతులను వర్ణిస్తూ రేచన కవిజనాశ్రయములోని మరొక పద్యము మాత్రమే ఇట్టి ప్రాసకు నాకు తెలిసిన ఉదాహరణ. అంతేకాదు, శ్రీశ్రీ ఒక కంద పద్యములో ర అక్షరానికి ఠ అక్షరానికి రూపసామ్యం ఉండడంబట్టి యతి చెల్లించాడు!
వచన గేయాలు
అనంతుని ఛందములో గద్య లక్షణము ఈ విధముగా చెప్పబడినది-
కనుఁగొనఁ బదరహితమై
పనుపది హరిగద్దెవోలె బహుముఖరచనం-
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్
అట్టి వచనములలో చూర్ణగంధి లక్షణాలు ఇలాగుంటాయి-
ఛందోగణముల నియతిం
బొందక తాళప్రమాణమునఁ గడుఁ జెలువై
కొందఱిచేఁ దచ్చూర్ణం
బందముగాఁ దాళగంధి యనఁ బొగడొందున్
అంటే పొడిపొడి మాటలతో అందముగా తాళబద్ధముగా వ్రాయబడే వచనములు ఇవి. తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు (అన్నమయ్య మనుమడు) ఈ గతిలో శ్రీవేంకటేశ్వర వచనములను వ్రాసినాడు. అదే విధంగా మారుతుండే లయలతో, గతులతో, గమనములతో పాడుకోటానికి వీలుగా వచన గేయాలను శ్రీశ్రీ సృష్టించాడు. ఇట్టి వచనాలలో గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో పద్యాలను కూడా చొప్పించినాడు. ఇట్టి వచనములలో కొన్ని చోట్ల ఒక పద్యపు పోలిక మరి కొన్ని చోట్లలో వేరొక పద్యపు నడక మనకు కనబడవచ్చు. ఇవి ఆంగ్లములోని vers libreను, సంగీతములోని medleyను పోలినవి. ఇందులో నిశ్వాస విరామస్థానానికి ప్రాధాన్యత ఎక్కువ. ఒక విధముగా ఇది సంస్కృతములోని పాదాంతయతి లాటిది. ఆద్యక్షర ప్రాసలు, ద్వితీయాక్షర ప్రాసలు, అంత్యప్రాసలు ఇట్టి గేయాలకు ఆభరణాలు. శ్రీశ్రీ ఈ ప్రయోగాన్ని విద్యున్మాలికలతో ఆరంభిస్తాడు. ‘దెబ్బ తిన్న లేళ్ళ కళ్ళు’ లోని క్రింది పంక్తులను ఒక ఉదాహరణగా భావించవచ్చును.
కావవి, వేటకాని కోలలకు కూలి వేదనల తూలు హరిణాల కండ్లు, జాలికి పురిటిండ్లు దిక్కుదిక్కుల కంపిన దీనంపు చూడ్కులే ఆనాటి ప్రళయతాండవ భయంకర సౌదామినులు
ఈ వచనగీతాలకు పతాకము ‘కవితా, ఓ కవితా’ వచన గేయము. ఇందులో ఎన్నో ఛందస్సుల ఛాయలున్నాయి, అనుప్రాసల మాయలున్నాయి, ప్రాసలు రాసుకొని క్రీడిస్తున్నాయి, పదజాలాలు తీయగున్నాయి, అలంకారాలు అందెలవలె మ్రోగుతున్నాయి, భావాలు సమాసాలలో కౌగిలించుకొంటున్నాయి, పలు భంగుల రంగులు సింగారించుకొంటున్నాయి. వచనగేయాలలో కూడా గణాలు ఉన్నాయి. కాని ఈ గణాలలో ఒక నిర్దిష్ట క్రమము (అన్నీ పంచమాత్రలు లేక మూడు, నాలుగు మాత్రల మిశ్రగతులు, ఇలాటివి) ఉండదు, ఒక నిర్దిష్ట సంఖ్య ఉండదు (ప్రతి పాదములో నాలుగు గణాల లాటివి). అక్షరగణాలతో, మాత్రాగణాలతో నడిచే పద్యాలు మానవులు నిర్మించిన కాలువలవంటివి ఐతే, వచన గేయాలు నిసర్గములో ఒక చోట తక్కువ వెడల్పుతో మరొక చోట ఎక్కువ వెడల్పుతో ప్రవహించే చిన్న సెలయేరులాటిది. దేని అందము దానిది. ఇట్టి గణాలతో పద్యాలను కూడా వ్రాయవచ్చునని నేను ఈ మధ్య వివరించాను. ఈ శైలి ఖడ్గసృష్టిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని వచనగేయాలు అనేకన్నా వచనములని చెప్పవచ్చును.
ముగింపు
ఛందస్సును గురించి శ్రీశ్రీ ఇలా అంటాడు – “కవికి కావాల్సింది కవిత్వ స్వరూపం కాదు; స్వభావం. ఛందస్సేదైనా సామాజిక స్పృహ ముఖ్యం. మాత్రాఛందస్సులోనే మళ్ళీ రామాయణం రాస్తే అది ఆధునిక కవిత్వం అనిపించుకోదు. ఎంత ప్రతిభావంతుడికైనా ఎంతోకొంత వ్యుత్పత్తి కూడా వుంటుంది. ప్రతిభ కూడా నూటికి పది శాతం inspiration, తతిమ్మాదంతా perspiration అన్నదాంట్లో చాలా నిజం వుంది. నా అనుభవం కూడా ఇదే. ఇక ఆదేశం అంటారా అది ఎవరికివారు తేల్చుకోవల్సిందే”. సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు. నాడు పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ఎంత ధీమాతో ‘వాణి నా రాణి’ అని చెప్పాడో అంతే ధీమాతో శ్రీశ్రీ ‘ఒక విధంగా చూస్తే నేను వాడిన ఛందస్సులన్నీ శ్రీశ్రీయాలే’ అన్నాడు. మాత్రాఛందోప్రయోగాల్లో శ్రీశ్రీ “ఈ శతాబ్దానికి పర్యాయపదం, కవితాసృష్టికి పరిశోధన కేంద్రం”.
ఉపయుక్త గ్రంథసూచి
- అనంతుని ఛందము, అనంతామాత్యుడు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1921.
- ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక, సం. తిరుమల, సేకరణ మద్దాళి రఘురాం. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1981.
- ఆధునికాంధ్ర కవిత్వము, సి. నారాయణ రెడ్డి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1967.
- ఖడ్గ సృష్టి, శ్రీశ్రీ,
- నవగీతి – ఆధునిక కవితలకు ఛందస్సు నమూనాయేమో?, జెజ్జాల కృష్ణ మోహన రావు, 2009.
- పాడవోయి భారతీయుడా – సినిమా పాటలు, శ్రీశ్రీ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1983.
- భారతీయ సాహిత్య నిర్మాతలు – మహాకవి శ్రీశ్రీ, బూదరాజు రాధాకృష్ణ. సాహిత్యా అకాడెమీ, న్యూ ఢిల్లీ, 1999.
- మాత్రిక ఛందోం కా వికాస్, శివనందన ప్రసాద్, బిహార్ రాష్ట్రభాషా పరిషద్, పట్నా, 2000.
- రగడలు, జెజ్జాల కృష్ణ మోహన రావు.
- శ్రీశ్రీ కవితావైభవం, మిరియాల రామకృష్ణ. యువభారతి, సికిందరాబాదు, 1981.
- శ్రీశ్రీ కవిత్వం, మిరియాల రామకృష్ణ (This is the long doctoral thesis of Ramakrishna. After obtaining his PhD, Ramakrishna sent a telegram to SrISrI and SrISrI quipped back famously – Congratulations, yours patiently!)
- “శ్రీశ్రీ కవిత్వంపై మరొక వ్యాసం, శంఖవరం రాఘవాచార్యులు. ఈ మాట, మే 2007.
- శ్రీశ్రీ వచన విన్యాసం, రాపోలు సుదర్శన్. అనన్య ప్రచురణలు, హైదరాబాదు, 1997.
- శ్రీ వేంకటేశ్వర వచనములు, తాళ్ళపాక పెద తిరుమలాచార్య, పరిష్కర్త వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్, తిరుపతి, 1945.
- సులక్షణ సారము, లింగమగుంట తిమ్మకవి.
(ఈ వ్యాసములోని కొన్ని భాగాలు శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ శత జయంత్యుత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో చదువబడినవి.)