[కన్నడదేశంలో ‘లలిత ప్రబంధగళు’ అనే పేరుతో స్వగతాలను వ్యాసాలుగా రాసే సాహితీప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. ఆ సాహితీ సంప్రదాయాన్ని వింధ్యవాసిని ఈమాట పాఠకులకు పరిచయం చేస్తూ రాస్తున్న లలిత ప్రబంధాలలో ఇది మొదటిది – సం.]
అందరు అమ్మలూ ఒకటే! వాళ్ళకు జీవితమే వాళ్ళ పిల్లలనెలా పెంచిపెద్ద చేయాలో నేర్పుతుంది. వాళ్ళెక్కువ చదువుకోక పోయినా వాళ్ళ పిల్లలకేమని పాఠాలు చెప్పాలో, వాళ్ళకు తెలుసు! మా అమ్మా అంతే! ఆమెకు ఇంగితజ్ఞానం, తెలివీ ఎక్కువ. వాళ్ళ నాన్న స్కూలు హెడ్మాస్టరు. అందుకని ఆయన స్కూల్లోనే ఐదవ తరగతి వరకూ చదివింది. అయినా తన పిల్లలు ఐదు మంది కనీసం గ్రాడ్యుయేషన్, వీలయితే ఇంకా ఎక్కువ చదవాలని ఆమె ఆశయం.
ఈ వ్యాసం కోసం రచయిత్రి
కుమార్తె గీసిన చిత్రం
ఆవిడకు పిల్లలను ఎక్కువగా దగ్గరికి తీసే అలవాటు లేదు. నేనయితే, ఆమెకు ముప్పయి ఏళ్ళవయసొచ్చిన తర్వాత వద్దనుకుంటూనే పుట్టినందుకేమో ఇంకా దూరం! ఇంట్లో నాయన నుంచీ, అన్నయ్య, అక్కలదాకా అందరికీ చిన్నదాన్నని ముద్దు. అయినా ఎవరూ నన్ను గారాబం చేసి చెడగొట్టే వీలు లేదు. అక్కయ్యల మీద ఆమె విధించే ఆంక్షలు, క్రమశిక్షణా పద్దతులు నాకూ వర్తిస్తాయి అని మాటల్లో చెప్పనక్కర లేదు. కూర్చున్నా, లేచినా ఆమె ఒక కన్ను ఇటే ఉంటుందనీ, అడుగు తప్పిపడిందంటే చంపేస్తుందని తెలుసు!
మా అమ్మ వంటలో దిట్ట. సామాన్యమయిన పదార్థాలు, మితంగా ఉపయోగించినా, కట్టెలతో మండే పొయ్యి మీద మా కందరికీ రుచిగా వండి వడ్డించేది. మా ఇంట్లో చాలా ఏళ్ళ వరకూ అమ్మ వంటకు కుండలు ఉపయోగించేది. పండగ రోజుల్లో ఏవైనా ప్రత్యేకమయిన వంటలు మాత్రం కంచు, ఇత్తడి గిన్నెల్లో చేసేది. దానికి ముందు రోజు పెట్టెలోంచి ఆ గిన్నెలు తీసి శుభ్రంగా కడిగేది. ప్రతి రోజూ జొన్న రొట్టె, ముద్ద పప్పు ఉదయం ఫలహారం. ఎప్పుడో ఒకసారి మా అక్కలతో పిండి రుబ్బించి దోశలు, వేరుశనగపప్పు చట్నీ చేసేది. ఏం చేసినా లొట్టలేస్తూ తినేవాళ్ళం.
నేను సెకెండ్ ఫారం (ఏడో తరగతి) లో ఉండగా మా నాన్న చనిపోయారు. పెద్దక్కయ్యకు పెళ్ళయిపోయింది. చిన్నక్కయ్యలు కర్నూల్లో కాలేజీల్లో చదువుతున్నారు. ఇంట్లో అన్నయ్య, వదినె, అమ్మలతో బాటు నేనొక్కదాన్నే. నాయన ఉన్నప్పుడు ఇంటిక్కావలసిన బయటి పనులన్నీ నాయన ఆఫీసునుంచీ ఇద్దరు ప్యూన్లు రసూలు, ఓబులేసు అనేవాళ్ళు వచ్చి చేసేవారు. అమ్మకు వాళ్ళంటే ప్రేమ. వాళ్ళకు అమ్మంటే గౌరవం. ఇద్దరివీ మతాలు వేరయినా రామలక్ష్మణుల్లా కలిసి ఉండేవారు. ఏపనయినా కలిసి చేసేవారు. కరెంటు బిల్లు కట్టడం దగ్గర్నుంచీ, ఇంటికి కావలసిన సరుకులు తేవటం వరకూ వాళ్ళే చేసేవారు. అందుకని మాకెవరికీ ఆ పనులు చేసే అలవాటు లేదు. నాయన పోయాక అలాంటి పనులన్నీ అన్నయ్య చేయటం అమ్మకిష్టం లేదు. అవిడ ప్రకారం ఆయన చదివిన చదువుకు గవర్నరులా కాలిమీద కాలువేసుకుని ఉండాలి ఆయన. అందుకని అన్నిటికీ తనే వెళ్ళేది. ఆమె వెంట సహాయం నేను. ఎంత దూరంలో ఉన్న రేషన్ షాపుకయినా నడిచే వెళ్ళేవాళ్ళం. గంటలకొద్దీ క్యూలో నిలబడి, నెలకు కావలసిన, గోధుమలు, చక్కెర సంపాదించే వాళ్ళం! వచ్చేటప్పుడు మాత్రం సామాన్ల బరువెక్కితే రిక్షా ఎక్కేవాళ్ళం, అర్ధ రూపాయో, ముప్పావలానో ఇచ్చి.
అప్పట్లో పత్రికలు ఎక్కువ వచ్చేవి కాదు. ఒకరింట్లో ఆంధ్రప్రభ తెప్పిస్తే, మరొకరు ఆంధ్రపత్రిక తెప్పించుకుని అందరూ రెండు చదివేవారు. మా ఇంట్లో పత్రికలకు కూడా ఖర్చు పెట్టిన గుర్తు లేదు. అమ్మ మధ్యాహ్నం తనకు తీరుబాటుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివేది. స్థానిక జిల్లా లైబ్రరీ నుంచీ అన్నయ్య తెలుగు నవలలు తెచ్చి పెట్టేవాడు. ఆవిడ ఆరోజుల్లో ఇంచుమించు తెలుగులో వచ్చిన బెంగాలీ నవలల అనువాదాలన్నీ ఒకసారి చదివేసుంటుంది. బంధువులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలుండాలని ఆమె నమ్మకం! అన్నీ చదవగలిగినా, బంధువుల ఉత్తరాలు మాత్రం, పోస్ట్ కార్డు మీద, ఆమె డిక్టేషన్ చేస్తుంటే మేమెవరయినా వ్రాయాలి. చివర్లో సంతకంగా తనపేరు వ్రాయడానికి మాత్రం తనకు చోటుండాలి!
అమ్మ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మా కెవరికీ చదువులో ఏవిధంగానూ తోడ్పడలేదని అనుకున్న నన్ను కూడా ఆశ్చర్యపరిచిందీ సంఘటన. కర్నూలు మెడికల్ కాలేజిలో చదువుతున్న మా అక్క ఒకసారి ఫోన్ చేసింది. అప్పట్లో ఇళ్ళలో ఫోన్లుండేవి కావు. పోస్ట్-ఆఫీసుకు ట్రంక్-కాల్ చేసి మా చిరునామా చెప్తే, పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి పిలుస్తాడు. ఒక ఆదివారం ఉదయం, పోస్ట్‌మాన్ మా ఇంటికొచ్చి “బాలనాగమ్మ ఎవరమ్మా?” అని అడిగాడు. మా అమ్మ బయటికొచ్చి విషయం తెలుసుకుంది. కర్నూలు నుంచీ మా అక్క ఫోన్ చేసి అమ్మను అడుగుతోంది. అమ్మ రిక్షా ఎక్కి వెళ్తుంటే నేనూ వెంటబడ్డాను. పాతూర్లో ఉన్న ఒకే పోస్ట్ ఆఫీసుకు వెళ్ళాము. మా అక్క మళ్ళీ రెండుగంటల తరువాత ఫోన్ చేస్తే మేమక్కడున్నాము. నన్ను లోపలికి ఫోను దగ్గరికి రానివ్వలేదు. అప్పట్లో ఇలా ఫోను వస్తే మామూలుగా కీడేగానీ మేలు శంకించరు. అందుకని కాలు కాలిన పిల్లిలా అమ్మ బయటికొచ్చేవరకూ, పోస్ట్ ఆఫీసు చుట్టూ ఉన్న స్థలంలో ప్రదక్షిణలు చేస్తున్నాను. అరగంట తర్వాత బయటికొచ్చిన అమ్మ, “దానికి రేపు పెద్ద పరీక్షలు గదా? భయమవుతుందంట! నేను పోవాలి ఊరికి” అని తనలో తను అనుకున్నట్లుగా చెప్పింది.
ఇంటికెళ్ళాక, లోపలికెళ్ళి చిన్న బ్యాగులో కొన్ని బట్టలు సర్దుకుని అదే రిక్షాలో బయల్దేరింది. అక్క పరీక్షలకు భయపడటానికి, ఈవిడ హుటాహుటీ బయల్దేరడానికీ సంబంధం అప్పట్లో నాకర్థం కాకున్నా, నిదానంగా తెలిసింది – అమ్మ అక్కకు ధైర్యం చెప్పి తోడుండి పరీక్షలు వ్రాయించడానికి వెళ్ళింది. అది అక్క మొదటి సంత్సరం. తరువాత ప్రతీ సంవత్సరం ఈ టైములో ఫోను వచ్చేదాకా ఆగకుండా తనే ప్లానేసుకుని ప్రయాణం కట్టేది కర్నూలుకు. ఇది మరో నాలుగేళ్ళు కొనసాగింది. అక్క బెదురు గొడ్డు, నేనయితేనా అనుకున్నాను! కానీ బిఎస్సీ మూడు సంవత్సరాల కోర్సు ఒకేసారి పరీక్ష వ్రాయవలసి వచ్చేసరికి, నాకూ భయమేసింది. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఆవిడ పక్క గదిలోనే ఉంది కాబట్టి సరిపోయింది! (అప్పట్లో సెమిస్టర్ పద్ధతి లేదు! మేము మూడేళ్ళు కలిపి ఒకేసారి వ్రాశాము!)
అక్కయ్యలు, అన్నయ్య ఆవిడ వల్ల చదువు మీద మాత్రం శ్రద్ధ పెంపొందించుకుంటే, నాకు మాత్రం నేనే వ్రాయాలనే ఆసక్తి, అమ్మ చదివే పుస్తకాలను తిరగేస్తున్నప్పుడే కలిగింది. పత్రికల్లో అప్పుడప్పుడు చదివే సత్యమూర్తిగారి కార్టూన్ స్ట్రిప్స్, హాస్య కథానికలు నాకు ఎక్కువ నచ్చేవి. నేను స్కూల్లో ఫోర్త్ ఫారం (తొమ్మిదో క్లాసు) చదివేటప్పుడు నా మొదటి కథ వ్రాశాను. ఆ అనుభవమే ఒక కథగా అయింది.
మా ఇంటి వెనకాల ఒక ఔట్‌హవుస్ ఉండేది. అందులో ఒక చిన్న కుటుంబం బాడుగకు ఉండేవారు. భార్య శివమ్మ సర్కారు ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. భర్త రామయ్య ఏం పనిచెయ్యడు. ఇంట్లో ఊరికే కూర్చుని బీడీలు తాగుతూనో, వాళ్ళ రెండేళ్ళ పాపను చూసుకునే శివమ్మ తల్లితో పోట్లాడుతూనో, లేదా బయటికెళ్ళి తనలాంటి పనిలేని స్నేహితులతో బలాదూరు తిరుగుతూనో గడుపుతాడు. ఇంట్లో ఉన్నంతసేపూ తన పనికిరాని పాత సైకిల్‌ను నిలబెట్టుకుని, రిపేరు చేస్తూ కూర్చోవడం అతనికి చాలా ఇష్టమయిన వ్యాసంగం! వీళ్ళందర్నీ కలిపి ఒక హాస్యకథానిక వ్రాస్తే అది ఆంధ్రపత్రికలో వచ్చేసరికి, ఇంట్లో ఉన్న కుటుంబం ఇల్లు మారారు. పత్రికవారు కాంప్లిమెంటరీ కాపీతో బాటు యాభయి రూపాయలు మనీఆర్డర్ పంపారు. కథ నేననుకున్నట్లే చక్కగా కార్టూన్‌లాంటి రామయ్య బొమ్మ అతని సైకిల్‌తో బాటు వచ్చింది. చూసి చాలా గర్వ పడ్డాను. మొదటి కథ ప్రచురణ కదా మరి! గొప్పగా వదినెకు చూపాను. సాయంత్రమయ్యేసరికి ఈ గాలి నిండిన బెలూను పగిలిపోతుందని తెలియలేదు.
సాయంత్రం స్కూల్లో ఎన్.సి.సి ఉండి ఇంటికి రావడం ఆలస్యమయింది. మా ఇంటి ముందర పెద్ద వరండా ఉంటుంది. అక్కడ మా అమ్మ, వదినె కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. మొదట అక్కడ కూర్చుని ఉన్న జంట వాళ్ళు వేసుకున్న కాస్త మంచి బట్టలవల్ల, వాళ్ళను రామయ్య, శివమ్మ అని గుర్తు పట్టలేకపోయాను. మునుపెప్పుడూ రామయ్యను నేను మాసిన అడ్డపంచె, బనియనులో తప్ప చూడలేదు మరి. వాళ్ళిద్దరి ముఖాలు, మా వాళ్ళ ముఖాల్లో భావం చూసిన ఆ ఒక్క క్షణంలో, అక్కడ పరిస్థితి గంభీరంగా ఉందని కనుక్కున్నాను. వదినె ‘మాట్లాడకుండా లోపలికెళ్ళు’ అన్నట్లు సైగలు చేసింది. వెళ్ళి కాళ్ళు, ముఖం కడుక్కుని, నా గదిలోకెళ్ళి చదువుకుంటున్నట్లు నటించసాగాను. మధ్యలో ఒకసారి వదినె లోపలికొచ్చి బీరువాలోంచి డబ్బు తీయటం గమనించాను. కొంచం సేపటికి రామయ్య, శివమ్మ వెళ్ళిపోయారు.
తర్వాత చెప్పింది వదినె అసలేం జరిగిందో. సాయంత్రం నాలుగ్గంటలకు పత్రిక తీసుకుని రామయ్య, శివమ్మ మా ఇంటికొచ్చారు. అంతకుముందే బాడుగకు ఉండి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అమ్మ సంభ్రమంగా వాళ్ళను అహ్వానించి కూర్చోబెట్టింది. “మీ అమ్మ ఆరోగ్యం బాగుందేమప్పా?” అని అడిగింది. “పిల్లను ఎత్తుకుని రాలేదేం?” అని అడిగింది. “మా అత్త దగ్గర ఆడుకుంటుందమ్మ!” అని క్లుప్తంగా జవాబిచ్చింది శివమ్మ, భర్త కోపమూ అతని ముఖభావమూ గమనించి. అతని చేతిలో చుట్ట చుట్టి ఉన్నది ఏదో పత్రిక అని తెలుస్తోంది. కానీ విషయమేమిటో వీళ్ళకు అర్థం కాలేదు. రామయ్య పత్రిక చుట్ట విప్పదీసి, నా కథ ఉన్న పేజీ తెరిచి “చూడమ్మా, మీ బిడ్డ చేసిన పని?” మా వాళ్ళిద్దరికీ అది నాకథా అని తెలుసు. కానీ తప్పేం జరిగిందో మాత్రం అర్థం కాలేదు. వదినె పుస్తకం చేతికి తీసుకుని రామయ్య, శివమ్మ అన్న పేర్లవయిపు చూపించింది అమ్మకు. కథలో వాళ్ళ పేర్లు, రచయితగా నాపేరు ఉన్నందుకు నేనే వాళ్ళమీద ఈ కథ వ్రాశానని వాళ్ళకు అవమానం అనిపించి కోపమొచ్చింది.
వదినె, అమ్మ ఏం మాట్లాడలేదు మొదట. రామయ్యను అతని కోపాన్ని వెళ్ళగక్కనిచ్చారు. “ఏమమ్మా! మీ బిడ్డకు బుద్ధుందా లేదా? మేమే దొరికినామా కథ రాయడానికి? మా వాళ్ళంతా మమ్మల్ను గేలి చేస్తున్నారు …” అని నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!” అని వదినెకు సైగ చేసి లోపలికి పంపింది. వదినె లోపలికొచ్చి యాభయి రూపాయల (అప్పట్లో యాభయి రూపాయల విలువ కనీసం ఐదు వందలనుకోవచ్చు!) నోటొకటి తీసుకుని వెళ్ళి అమ్మకిచ్చింది. అమ్మ, “పాపకు మంచి గౌను కొనుక్కోండి!” అని ఇంకా వదినె తెచ్చిచ్చిన తాంబూలం, టెంకాయతో బాటు నోటును పెట్టి ఇచ్చింది. రామయ్య ఆశగా నోటు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మరొక అరగంటలో ఆనోటు ఏమయిపోతుందో అందరికీ తెలుసు. అసలు వాళ్ళు వచ్చిందే అందుకు అన్న విషయంలో కూడా రహస్యమేం లేదు.
చిత్రమేమిటంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను పిలిచి, “ఏమే బుద్ధిలేని గాడిదా! నీకు కథ రాస్తే పేర్లు మార్చాలని కూడా తెలీదా?” అని అడిగింది. ఆవిడ మాటల తీరే అది! అందులో ఎక్కువ కోపమేం నాకు కనిపించలేదు. ఔత్సాహిక సాహిత్య పాఠకురాలయిన ఆవిడ తన కూతురు సౄజనాత్మక శక్తికి పడుతున్న సంతోషం మీద రామయ్యలాంటి వాళ్ళు చన్నీళ్ళు పోయగలరా? ఒకటిమాత్రం అర్థమయింది. నిజ జీవితంలోని పాత్రలు ఉపయోగించి కథలు వ్రాస్తే, పేర్లు మార్చి వ్రాయాలి! అంతే కాదు నాపేరు కూడా మార్చేసి కలంపేరు పెట్టుకుంటే మంచిదని అనుకున్నాను. అందువల్ల నా మొదటి కథ మాత్రమే నా స్వంత పేరుతో ప్రచురించబడింది. తర్వాత అంతా అజ్ఞాతవాసమే!
తర్వాత అమ్మ, వదినె ఇచ్చిన ప్రోత్సాహంతో కొన్ని కథలు వ్రాశాను. కొన్ని తిరుగు ప్రయాణం కట్టినా పది దాకా ప్రచురించబడ్డాయి. అప్పుడొచ్చిందొక కొత్త సమస్య! మా రెండవ అక్క అప్పుడు కర్నూలు మెడికల్ కాలేజిలో చదువు ముగించి హవుస్ సర్జన్సీ చేస్తోంది. తనతో ఒకసారి సరదాగా కర్నూలుకెళ్ళాను. తను కాజువల్‌గా వాళ్ళ ప్రొఫెసర్ కంటి డాక్టరు దగ్గర పరీక్ష చేయిస్తే నాకు కొద్దిగా దీర్ఘ దౄష్టి లోపం ఉన్నట్లు తెలిసింది. అంతే దాంతో తను అప్సెట్ అయిపోయి ఇంటికొచ్చి అందరికీ చెప్పింది. అయిపోయింది. అన్నయ్య, “కథలూ కాకరకాయలూ” వ్రాయడం మానేసి చదువుమీద మాత్రం ధ్యాస పెట్టాలని కట్టుదిట్టం చేశాడు. ఆయన భయానికి, రహస్యంగా కథలు వ్రాసినా, పత్రికల ఉత్తరాలు వచ్చినప్పుడు ఆయనకు తెలుస్తుందని భయం!
ఈ సమస్యకూ ఒక సమాధానం దొరికింది. మా ఇంటినుంచీ అరమైలు దూరంలో మా మామయ్య ఇల్లుంది. వాళ్ళను ఒప్పించి ఆయన ఇంటి చిరునామా ఇచ్చి కథలు పంపటం మొదలుపెట్టాను. నా రచనా వ్యాసంగానికి అడ్డంకుల్లేకపోయాయి. మా బావ నా పోస్ట్‌మాన్. నా కొచ్చే ఉత్తరాలన్నీ తెచ్చిచ్చేవాడు.
నా పెళ్ళయి, నేను ప్రసవానికి అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఇల్లు హైదరాబాదులో అనుకూలంగా లేదని నన్ను నాకూతురును అమ్మ అనంతపూరుకు తీసుకొచ్చేసింది. ఆవిడ అప్పటికే మోకాళ్ళ నొపులతో బాధపడుతున్నా ఓర్చుకుని వంట చేసి పెట్టి మా ఇద్దర్నీ ఏ లోటూ లేకుండా చూసుకుంది. తమాషా ఏమిటంటే నా మొదటి కథావస్తువు అయిన అవుట్‌హవుస్‌లో నే ఇప్పుడు అమ్మ వంట చేస్తుంది. పాపను కాళ్ళమీద పడుకోబెట్టి స్నానం చేయిస్తుంది. ఇల్లంతా అద్దెకిచ్చి, ఈ అవుట్‌హవుస్ మాత్రమే ఉంచుకుంది అన్నయ్య హైదరాబాదుకు మారిపోయిన తర్వాత. అప్పుడు మళ్ళీ అమ్మ చేత చిన్నప్పుడు తిని రుచులు గుర్తున్న వంటలు జొన్న రొట్టె, గోంగూర పప్పు, నూనె వంకాయ కూర అడిగి మరీ చేయించుకుని తిన్నాను.
రాత్రుళ్ళు పాప నిద్రపోకుండా ఏడిస్తే, ఒళ్ళో ఊరుకోబెట్టి, అలాగే కూర్చుని ఒక కథ, ఒక నవల వ్రాశాను. “బాలింత రాలివి. ఎక్కువ సేపు కూచ్చోవద్దమ్మా!” అని అమ్మ మందలించినా నా పాటికి నన్ను వదిలేసేది. ఎందుకంటే, పగలంతా ఒక్కతే మా సేవ చేసి అలసిపోయిన ఆమె తప్పనిసరిగా గుర్రుపెట్టి నిద్రపోయేది.
తరువాత, నెలకొకసారయినా మమ్మల్ని చూడటానికి వచ్చేది.
మా పాప శివానికి అవ్వ వస్తే సంబరం! ఆవిడేం ఎక్కువగా ముద్దు చెయ్యటం గానీ, అతిగా దగ్గరకు తియ్యటం గానీ చెయదు. అయితే దీనికున్న ఆకర్షణేమిటి? ఆవిడ వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా వెంట వచ్చేవి బోలెడన్ని స్వీట్లు! అంత కన్న ముఖ్యమయింది ఆట సామాన్లు. వచ్చిన ప్రతీ సారీ, ఎలా వెతుక్కొస్తుందో నాకయితే తెలీదు, ఒక సారి రాగి అయితే, ఇంకొకసారి అల్యూమినియం చొప్పున చిన్న పిల్లల వంట పాత్రలు మాత్రం, తప్పక తెచ్చేది. పాపకు ఐదేళ్ళ వయసు వచ్చేసరికి, తన దగ్గర లేని వంట పాత్రల రకం లేదు.
ఆమెకు ఆర్త్రిటిస్ వల్ల మోకాళ్ళు నొప్పి. రాను రాను నొప్పులెక్కువయి అనంతపురానికి రావటం తగ్గించి అన్నయ్యవాళ్ళతో హైదరాబాదులో సెటిల్ అయిపోయింది. నొప్పితో చాలా మటుకు పడుకునే గడిపేది. అప్పటికి అన్నయ్య కొడుకు గోవిందు ఇంజనీరింగ్ డిగ్రీ ముగించి అమెరికాలో ఎం.ఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వాడు అక్కడినుంచీ ఫోన్ చేసి మాట్లాడించినప్పుడల్లా ఒకేమాట ఉండేది ఆవిడ నోట్లో. “అమెరికాలో మోకాలి చిప్పలు మారుస్తారంట గదరా! నాకు నువ్వు తీసుకొచ్చి మార్పించు. ఈ నొప్పిని తట్టుకోలేకుండా ఉన్నాను.” “అట్ల తేవడానికి కాదవ్వా! నిన్నే ఇక్కడికి తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తాలే!” అని ధైర్యం చెప్పేవాడు. అలాంటిదొక చికిత్స ఉందనీ ఆవిడకెవరు చెప్పారో అని ఆశ్చర్యపోయేదాన్ని. పడుకునే ఉండాల్సినప్పుడు అస్తమానం టివీ చూస్తూ ఉండేది అందులో సగందాకా అస్పష్టంగా కనిపించినా సరే, ఆమె గదిలో ఒక టీవీ పెట్టించుకుంది. బహుశా అందులో ఎక్కడయినా చూసి కనుక్కుందేమో ‘టోటల్ నీ రీప్లేస్‌మెంట్’ గురించి.
నాకు విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా మొదటిసారి అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఎందుకో వెళ్ళే లోపల అమ్మనొకసారి చూద్దామనిపించింది. ముందు హైదరాబాదుకు వెళ్ళి వచ్చాను.
అప్పట్లో ప్రయాణం ఇంకా దీర్ఘంగా ఉండేది. 42 గంటల ప్రయాణం తర్వాత ఆస్టిన్, టెక్సాస్ చేరుకుని, ఒక సహోద్యొగి సహాయంతో మరొక ఉద్యోగి కుటుంబం సెలవుల్లో ఇండియాకు వెళ్ళుంటే వాళ్ళింట్లో దిగాను. ఆవేళ శనివారం. ఆదివారం విశ్రాంతి తీసుకుని సోమవారం ఆఫీసుకు వెళ్ళొచ్చని ప్లాను. ఇంట్లో కాస్త సర్దుకున్న తర్వాత, సియాటిల్ లో ఉన్న మా మేనల్లుడు గోవిందుకు ఫోన్ చేశాను.
ఉభయ కుశలోపరి అయింతర్వాత అసలు విషయం చెప్పాడు! “అవ్వ నిన్న ఇండియాలో శుక్రవారం ఉదయం పోయిందటత్తా!” అన్నాడు. ఒక్క నిముషం మాట్లాడలేకపోయాను. మనసులో ద్వైదీభావం! బయలుదేరే ముందు వెళ్ళి ఆమెను చూసి రావటం ఏదో అర్థానికి అందని ఒక సిక్స్త్ సెన్స్. కానీ నన్ను ఈ భూమి మీదికి తెచ్చిన అమ్మ ఇక లేదు అనుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాస్సేపుండి, “అత్తా! ఏడుస్తున్నావా?” అని అడిగాడు. చిత్రం! నా కళ్ళు చెమ్మగిల్లను కూడా లేదు. “లేదు గోవిందూ!” అన్నాను క్షీణ స్వరంతో. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో “రేపు మళ్ళీ ఫోన్ చేస్తాలే,” అని పెట్టేశాడు.
ఆ పరదేశంలో పరాయి వాళ్ళ ఇంట్లో ఏం చెయ్యాలో తోచక శూన్యంలోకి చూస్తూ కూర్చుండి పొయ్యాను.