కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?

[మొదటిసారి నాట్యసుధ విశేష సంచికలో (1986) ప్రచురించబడిన ఈ వ్యాసాన్ని కొన్ని మార్పులూ చేర్పులతో ఈమాట పాఠకులకోసం ప్రత్యేకంగా పునఃప్రచురిస్తున్నాం – సం.]

మనకి పద్యం ఎట్లా అర్ధం అవుతుంది? ఒక పద్యం – ఏదైనా సరే – చదివామనుకోండి. అది చదవడానికి ముందు మనం అస్సలు ఏ పద్యమూ, ఎప్పుడూ చదివి కాని, విని కాని ఎరగమనుకోండి (ఇలాంటి పరిస్థితి దాదాపు అసాధ్యం, కాని వూహించుకోండి), అప్పుడు ఆ పద్యం మనకి వెంటనే అర్థం కాదు. అంతకు ముందు మనకి తెలిసిన భాషలో వున్న మాటల ఆధారంగా క్రమంగా ఈ పద్యం మనకు అర్థం అవుతుంది. ఆ సందర్భంలో పద్యపు ఆకృతి మీద – అంటే వచనం కన్నా భిన్నంగా వుండడమనే లక్షణం మీద – మనకి వల్లమాలిన ఆసక్తి కలుగుతుంది కూడా. నిత్యజీవితంలో ఈ విషయం అనుభవానికి రాదు కాని, కవిత్వపు పుట్టుకను గురించి చెప్పిన పురాగాథల్లో ఈ అనుభవాల జ్ఞాపకాలు కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలో క్రౌంచ పక్షిని చంపిన నిషాదుని కథ చూడండి. ఈ కథ బాగా తెలిసిందే అయినా, పాఠకుల సౌకర్యం కోసం మళ్ళీ చెప్తాను. ఇది వాల్మీకి రామాయణం బాలకాండలో రెండవ సర్గలో వుంది.

అంతకు ముందు కథలో వాల్మీకి నారదుణ్ణి ‘ఈ లోకంలో ఇప్పుడు చాలా మంచివాడూ, చాలా గుణవంతుడూ, ధైర్యవంతుడూ, సత్యవాక్పరిపాలకుడూ (ఇంకా ఇలాటి మంచి గుణాలు ఏకరువు పెట్టి, అవన్నీ) అయినవాడు ఎవరైనావున్నారా’ అని అడుగుతాడు. నారదుడు ఆ ప్రశ్నకి సమాధానంగా, రాముడి కథ సంగ్రహంగా చెప్తాడు (ఈ కథకే బాల రామాయణం అని పేరు). నారదుడు వెళ్ళిపోయిన తర్వాత, వాల్మీకి సావధానంగా తమసానదీ తీరానికి స్నానానికి బయల్దేరతాడు, తన శిష్యుడు భరద్వాజుణ్ని తోడు తీసుకుని.

తమసానదీ తీరానికి వెళ్ళి, ఆ ప్రశాంతమైన వాతావరణంలో చెట్లనీ పక్షుల్నీ చూస్తూ కొంతసేపు వాల్మీకి విహరిస్తాడు. ఆకాశంలో ఒక చక్కని క్రౌంచ పక్షుల జంట పరమానందంతో విహరిస్తూ, విడదీయరాని దగ్గరతనంతో క్రీడిస్తూంటుంది. సంభోగ సమయంలో ఏ ప్రాణినీ హింసించరాదని అడివిలో అందరికీ తెలిసిన నియమం. ఆ నియమాన్ని లక్ష్యపెట్టని, దుష్టబుద్ధి అయిన ఒక నిషాదుడు, అకస్మాత్తుగా అక్కడికి వొచ్చి, ఆ క్రౌంచ మిథునంలో మగ పక్షిని తన బాణంతో చంపుతాడు.

చచ్చిపోతున్న మగ పక్షిని చూసి, ఆడపక్షి హృదయవిదారకంగా ఏడుస్తూ వుంటుంది. అది చూసిన వాల్మీకి చలించిపోయి అప్రయత్నంగా ఈ మాట అంటాడు:

మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమశ్శాశ్వ తీస్సమాః
యత్ క్రౌంచ మిథునా దేక మవధీః కామ మోహితమ్

(నిషాదుడా, నువ్వు వుండవెప్పటికీ స్థిరంగా
గాఢమైన కోరికతో
కలిసివున్న పక్షుల్లో
ఒకదానిని చంపావిపు డన్యాయంగా).

ఇది అనుకోకుండా వాల్మీకి నోటివెంట వచ్చిన శ్లోకం. ఇది మానవజాతికి మొదటి పద్యం. అందుకే వాల్మీకి ఆది కవి.

ఈ మాట అన్న వెంటనే వాల్మీకికి వెంటనే తన శ్లోకం (అది ‘మొట్ట మొదటిది’ కదా!) తనకే ‘అర్థం’ కాలేదు. “కిమిదం వ్యాహృతం మయా” (ఏమిటీ అన్నాను నేను?) అని తనే ఆశ్చర్యపోయాడు (ఇప్పుడు ఆ ‘కవి’ తన శ్లోకానికి తానే శ్రోత అని గుర్తుంచుకోండి). ఆ తర్వాత వెంటనే ఆయన దృష్టికి వచ్చింది తను చెప్పిన శ్లోకానికి వున్న రూపం. “పాద బద్ధోఽక్షర సమస్తంత్రీ లయ సమన్వితః” (ఇందులో నాలుగు పాదాలున్నాయి, ఆ నాలిగింటిలోనూ, అక్షరాలు సమానంగా లయబద్ధంగా వున్నాయి.) అని ఆ రూపాన్ని వివరంగా గమనించాడాయన.

దానికి శ్లోకం అని పేరు కూడా ఆయనే పెట్టాడు.

వాల్మీకి లాగా మనం సృష్టిలో మొట్ట మొదటి పద్యాన్ని మన జన్మలో మొట్ట మొదటి సారిగా వినే స్థితి వుండదు. మనం ఏ పద్యం చదివినా, విన్నా, అంతకు ముందు కొన్ని పద్యాలు వినే వుంటాం. అప్పుడు మనకి ఒక పద్యం అర్థం అయే తీరు, మనం అంతకు ముందు చదివిన, విన్న పద్యాల మీద ఆధారపడి వుంటుంది.

ఒక రచన, అది ఎలాంటిదయినా, దానికి అపూర్వ అస్తిత్వం వుండదు. అది గాలిలో పుట్టదు, గాలిలో పెరగదు. దాని పూర్వ రచనలు కొన్ని ఉండటం వల్లనే ఒక రచనకి అస్తిత్వం ఏర్పడుతుంది. ఒక రచనకి అర్థం ఆ రచనలోని మాటలకీ, దానికి అర్థాన్నిచ్చే పూర్వ రచనల మాటలకి మధ్య వున్న జాగా వల్ల ఏర్పడుతుంది. ఈ జాగా ఖాళీ జాగా కాదు. ఒక అర్థప్రదేశం మరొక అర్థప్రదేశానికి అస్తిత్వాన్ని కల్పించే ప్రాణవంతమైన చోటు. ప్రతి కొత్త పద్యమూ చదవబడగానే, అలాంటి ఒక కొత్త అర్థప్రదేశం తయారవుతుంది. ఈ పని పాఠకుడి మనసులో జరుగుతుందని వేరే చెప్పక్కర్లేదు.

అంతకు ముందు పాఠకుడు చాలా రకాల పద్యాలు చదివి వుండొచ్చు. ఆ పద్యాలలో ఏవో కొన్నిటికి మాత్రమే ఈ కొత్త పద్యపు అర్థప్రదేశం సంవదిస్తుంది. ఇలా ప్రతి పద్యమూ దానికి సంవదించే ఒకటో, కొన్నో రచనలతో జత పడినప్పుడు, ఆ పద్యాల మధ్య ఏర్పడే జాగా వల్ల రెండు పనులు జరుగుతాయి. ఒకటి, కొత్తగా చదివిన పద్యం పాఠకుడికి బోధపడే తీరు ఒకటి కొత్తగా ఏర్పడుతుంది. రెండు, కొత్తగా చదివిన పద్యానికి జమిలిగా జతపడే పాత రచనలు అర్థమయే తీరు కొత్తగా మారుతుంది.

కొన్ని రచనలు మరీ స్పష్టంగా జమిలిగా జత పడతాయి. అలాంటి రచనలు ఎదురైనప్పుడు, రెండోది మొదటిదానికి అనుకరణ అనో, లేదా దానివల్ల ప్రభావితం అయిందనో, ఆ రెండో రచన మీద మరీ ఇష్టం లేకపోతే రెండోది మొదటిదానికి కాపీ అనో నిర్ణయించడం తెలుగు విమర్శలో రివాజు. (రెండు రచనలు, దాదాపు ఒకే కాలానివో, అసలు కాలం తెలియనివో అయితే, అందులో మనకి ఇష్టమైన కవి పద్యానికి, అంతగా ఇష్టం లేని కవి పద్యం అనుకరణ అని చెప్పడం కూడా వుంది). ఆధునిక సాహిత్యంలో ఇది మరీ ఎక్కువ. ఒక రచయిత రచన అతని సొంతం కాదని రుజువయినా, ఆ రచయిత మరొకరి ప్రభావాన కాని, మరొకరిని అనుసరిస్తూ కాని రాశారని రుజువయినా, రెండో రచయిత రెండోరకం రచయిత అయిపోవడం తప్పనిసరి. ఆధునిక సాహిత్యంలో మౌలికతకీ, ప్రాథమ్యానికీ సాహిత్య విలువలు ఉన్నాయి.

అందుచేతనే మన విమర్శకులు ఆధునిక కవులను చిన్నవాళ్ళుగా నిరూపించవలసి వస్తే, ఆ రచయితల రచనలకి మరో భాషలో మూలాలు ఉన్నాయనో, లేకపోతే ఇంకో రచయిత భావాల, రీతుల ప్రభావం వుందనో చూపించడానికి ప్రయత్నిస్తారు. ఆ దెబ్బతో మరే ప్రయత్నమూ లేకుండా ఆ కవులు చిన్న కవులైపోతారు. అలాంటి సందర్భంలో బాధితులైన కవుల పెద్దతనాన్ని నిలబెట్టడానికి ప్రతి విమర్శకులు అనుసరించగల మార్గాలు రెండే వున్నాయి: 1. లేదు, ఆ ఫలానా కవి మీద ఇతర కవుల ప్రభావం లేదు అని రుజువు చేయ్యడం, 2. అవును, ఆ కవి మీద మీరన్న ప్రభావం ఉంది కాని, అంతమాత్రాన కవి చిన్న కవి అయిపోరు అని వాదించడం.

ఉదాహరణకి, శ్రీశ్రీ రాసిన దేశచరిత్రలు గితానికి బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ఒక జర్మన్ పద్యం మూలం అని, శ్రీశ్రీ ఆ మాట చెప్పలేదనీ నార్ల వెంకటేశ్వర రావు, సి. నారాయణరెడ్డితో అన్నారట (దీని విషయం కొన్ని ఏళ్ళ క్రితం పత్రికలలో కొంత చర్చ జరిగింది). రంగనాయకమ్మ గారు ఈ సందర్భంలో కల్పించుకుని శ్రీశ్రీ గౌరవానికి భంగం రాకుండా చూశారు. శ్రీశ్రీ తన దేశచరిత్రలు రాసేనాటికి బ్రెష్ట్ పద్యం గురించి ఎరగనే ఎరగడు, ఈ ఆరోపణ నార్ల వెంకటేశ్వర రావు బాధ్యతారహితంగా చేసారు అని ఆవిడ వాదం. అలాగే రేవతీదేవి కవితా సంకలనం ‘శిలాలోలిత’ కి విన్యాసం పేరుతో తొలిపలుకు రాసిన సంజీవదేవ్ మాటల్లో, నేను పైన చెప్పిన రెండో మార్గం స్పష్టంగా వ్యక్తమవుతుంది. సంజీవదేవ్ మాటల్లో:

శ్రీశ్రీ గురించి గ్రంథచౌర్యం అనదగిన నార్ల ఆరోపణ

– రంగనాయకమ్మ (18-12-1981 ఈనాడులో రాసిన లేఖ)

1-12-1981 తేదీ ‘ఈనాడు’లో నార్లతో నారాయణరెడ్డి- చూశాను. అందులో నార్లగారు చలం గురించీ, శ్రీశ్రీ గురించీ గ్రంథచౌర్యం అనదగిన ఆరోపణ ఒకటి చేశారు. ఈ విషయం మీద నా దృష్టిలో ఉన్న సమాచారం కొంత పాఠకుల ముందు పెడుతున్నాను.

నార్ల మాటలు: “దేశ చరిత్రలు గేయంలో తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? లాంటి అనేక పంక్తుల మీద ప్రముఖ జర్మన్ కవి బెర్తోల్ద్ బ్రెహ్ట్ (Bertolt Brecht) రాసిన ‘ఎ వర్కర్ హూ రీడ్స్ హిస్టరీ’ అనే గేయం ప్రభావం వుంది. ఐతే ఆ విషయం శ్రీశ్రీ పేర్కొనలేదు.”

బ్రెహ్ట్ కవిత ఇంగ్లీషులోకి రావడానికి పూర్వమే శ్రీశ్రీ దేశచరిత్రలు రాశాడనడానికి రుజువుంది. బ్రెహ్ట్ ఆ కవితని జర్మన్ భాషలో రాసింది 1935లో. బ్రెహ్ట్ కవితకు ఇంగ్లీషు అనువాదాలు 1947లో ప్రారంభమయ్యాయి. (‘రేపటి కోసం’ అనే బ్రెహ్ట్ అనువాద సంకలనం – పే-103). కానీ శ్రీశ్రీ దేశచరిత్రలు కవిత 1938లోనే అచ్చయింది. (శ్రీశ్రీ సాహిత్యం రెండో సంపుటి, పే-96). శ్రీశ్రీ బ్రెహ్ట్‌ని జర్మను భాషలోనే చదివారనుకోవాలా?

ఒక ఇంటర్వ్యూలో శ్రీశ్రీ ఇచ్చిన జవాబు ఇలా వుంది. “జ్వాల పత్రికలో ముద్దుకృష్ణ రాసిన ఎడిటోరియల్ ప్రేరణతో దేశ చరిత్రలు గేయం రాశాను” (సృజన – 1980, జనవరి పే. 17). తన కవితకి మూలం ముద్దుకృష్ణ ఎడిటోరియల్ కాకుండా బ్రెహ్ట్ కవితే అయితే శ్రీశ్రీ యీ పేరుకు బదులు ఆ పేరే చెప్పి ఉండేవారు కదా?

ఒక రచయిత మీద ఫలానా ఫలానా రచయితల ప్రభావం ఉందని విమర్శకుడు అభిప్రాయపడితే (నిజానికి అలా లేకపోయినా కూడా) అందులో పెద్ద తప్పేమీ లేదు. విమర్శకుడి అభిప్రాయం అంతవరకే అయితే ఫర్వాలేదు. కానీ, ఆ రచయిత ఇతర రచయితల వల్ల ప్రభావితుడై కూడా ఆ విషయం మరుగు పరిచాడనే పద్ధతిలో విమర్శలు చేస్తే మాత్రం అది చాలా పొరపాటు. నార్లగారు బాధ్యతారహితమైన విమర్శలు చేశారు.

[ఈ లేఖకు శ్రీశ్రీ సాహిత్య నిధి (విజయవాడ – 520004) జూన్ 2009లో వెలువరించిన శ్రీశ్రీ బులెటిన్ 10వ సంపుటిలో చేసిన పునర్ముద్రణ ఆధారం. – సం.]

“కొందరి రచనల్లో మరికొందరి ప్రభావాలు గోచరిస్తాయి. ఆ విధంగా గోచరించటంలో అసహజత్వం లేదు. దాని అర్థం ఒకరి భావాలను ఒకరు అనుకరించారని కాని, అనుసరించారని కాని కాదు. అందువల్ల మౌలికతకు కూడా భంగం రాదు. ఒకరి ప్రభావం మరొకరి మీద పడటం అంటే రచయితకు కాని, రచయిత్రికి కాని తెలియకుండానే కొందరి భావాలు వారి మీద ప్రభావం వేస్తాయి” (పదాలలో ఊనిక నేను ఇచ్చినది).

ఈవాదం ప్రకారం ఒక రచయిత ప్రభావం ఇంకొక రచయిత రచనలమీద తనకి తెలియకుండా పడితే, అలాంటి ప్రభావం ఆ రెండో రచయిత రచనలకి న్యూనత కలిగించదు. వాటి మౌలికతకి భంగమూ కలిగించదు. మరి ఒకవేళ ఒక రచయిత కావాలనే, తెలిసే, ఇంకొక రచయిత ప్రభావం తనమీద ఉండేట్టు రచన చేసి ఆ ప్రభావం తనమీద ఉందని ఒప్పుకున్నారనుకోండి. అప్పుడు ఆ రచయిత మరి ఎవరి ప్రభావం తనమీద ఉందని ఒప్పుకుంటున్నారో వారి కన్న తాము చిన్న వారమే అని ఒప్పుకుంటున్నారన్నమాట. ఒకవేళ ఆ ప్రభావం తమమీద వుందని చెప్పలేదనుకోండి. అప్పుడు ఆ రచయిత దొంగ అన్నమాట. ఇది ఇప్పుడు తెలుగు సాహిత్యంలో మర్యాద.

కవిత్వంలో పెద్ద చిన్నల తారతమ్య నిర్ణయంలో ప్రతి సమాజమూ కొన్ని లాంఛనాలని ఏర్పాటు చేసుకుంటుంది. ‘లాంఛనం’ అంటే ఒక గుర్తు. సాంప్రదాయిక సాహిత్యంలో కవి సమాజంలో గొప్ప కవిగా గుర్తింపబడటానికి ఏనుగూ, పల్లకీ ఎక్కడం, తన పుస్తకం రాజుగారు అంకితం పుచ్చుకోవడం, ఇలాంటివి లాంఛనాలు. అలాగే ఒక కవి అంత గొప్ప కవి కాదనడానికి పనికొచ్చే లాంఛనాలు కూడా కొన్ని వుండేవి. ఆ కవి పండితుడు కాదనీ, ఆయన పుట్టిన కులం మంచిది కాదనీ, ఇలాంటివి. ఈ లాంఛనాలు సామాజిక వ్యవహారంలో ఒప్పుదల పొందడమే కాకుండా, ఆనాటి సాహిత్య విమర్శ పరిభాషలోకి కూడా చేరాయని కొంచెం పరిశీలనగా చూస్తే తెలుస్తుంది.

ఆధునిక సమాజంలో కూడా ఇటువంటి లాంఛనాలు వున్నాయి. అలాంటి లాంఛనాలలో కొన్ని ఆధునిక విమర్శ పరిభాషలో చేరిపోయాయి కూడా. ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి – స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ – ఇలాంటి మాటలన్నీ.

నిజానికి కవిత్వ వివేచనలో ఈ లాంఛనాలకి ఏ ఉపయోగమూ లేదు, ఉండకూడదు. అందుచేత, ఒక కవి రచనకీ అంతకు పూర్వం వున్న కవిత్వానికీ ఏర్పడే సంబంధం ఎలాంటిది – కొత్తగా రాయబడిన రచనకి అంతకు ముందున్న రచనల నేపథ్యం ఏ పద్ధతిలో ఏర్పడుతుంది – అందువల్ల ఇటు కొత్త రచనా, అటు పాత రచనా కూడా ఎలాంటి మార్పులకు లోనవుతాయి, అన్న అంశాలు పరిశీలించవలసి వుంది. ఈ రకం పరిశీలన ద్వారా ‘ప్రభావం’, ‘అనుకరణ’ లాంటి మాటలకి కవితా వివేచనలో ఎలాంటి ఉపయోగం వుందో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

ఈ పనిలో భాగంగా రెండు వచన పద్యాలు వివరంగా పరిశీలిస్తాను. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 1963లో రాసిన ‘ప్రార్థన‘. తెలుగులో చాలా మంచి పద్యాల్లో ఇది ఒకటని అందరూ ఒప్పుకుంటారు. దరిమిలా, 1981లో ప్రచురించబడిన రేవతీదేవి శిలాలోలిత అనే పుస్తకంలో ‘దేవుడూ‘ అనే పద్యం ఆ పుస్తకం చదివిన వారందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. ఇది కూడా తెలుగులో మంచి కవిత్వం అని చదివిన వారందరూ ఒప్పుకుంటారు.

ప్రార్థన

దేవుడా!
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారి పూజారులనుండి
వారివారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురు పరంపరనుండి

దేవుడా!
నలభై కోట్ల నిజమైన ప్రాణం వున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగా వున్న విచిత్రసౌధం మాది
కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేషం
బ్రతుకు పొడుగునా స్వాతంత్ర్యం
కొంచెం పుణ్యం కించిత్ పాపం
కాస్త కన్నీరూ మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయి హాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు

దేవుడా!
కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాలని వివరించు
రహస్య సృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావుపుట్టుకల మధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం
మలుపు మలుపుకీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాన్పుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని
ఆదమరచి కాసేపు విశ్రమించడాని కనుమతించు తండ్రీ!

-దేవరకొండ బాలగంగాధర తిలక్, అమృతం కురిసిన రాత్రి సంకలనం (1968) నుంచి.

ఈ రెండు పద్యాలూ ఒకదానితో ఒకటి చాలా పోలికున్న పద్యాలు. రేవతీదేవి రాసిన పద్యం తిలక్ రచన కన్నా తరవాత ప్రచురించబడింది కాబట్టీ, తిలక్ రచన రేవతీదేవి చదవకుండా వుండడం అసంభవం కాబట్టీ, రేవతీదేవి మీద తిలక్ ‘ప్రభావం’ వుందనాలి.

దేవుడూ

దేవుడూ
నన్ను రక్షించు
నీ భక్తుల్నుంచి
నన్ను రక్షించు

దేవుడూ
నన్ను రక్షించు
గాంధీ భక్తుల్నుంచి
మార్క్స్ భక్తుల్నుంచి
ఫ్రాయిడ్ భక్తుల్నుంచి
సార్త్ర భక్తుల్నుంచి
బాబాల భక్తుల్నుంచి
సైన్సు భక్తుల్నుంచి
విశ్వనాథ భక్తుల్నుంచి
శ్రీశ్రీ భక్తుల్నుంచి
చలం భక్తుల్నుంచి
నన్ను రక్షించు

దేవుడూ
నన్ను రక్షించు
నానారకాల భక్తకోటి నుంచి
నన్ను రక్షించు
ఇందర్నుంచి రక్షించినందుకు
నేన్నీ భక్తిలో పడితే
ఒద్దు దేవుడూ
నువ్వు నన్ను రక్షించొద్దు
నన్ను నేనే రక్షించుకుంటాను

అప్పుడు
నన్ను రక్షించు అని
నువ్వే నన్ను అడగాల్సొస్తుంది

(రేవతీదేవి, శిలాలోలిత సంకలనం (1981) నుంచి.

ఈ రెండు పద్యాలూ పరిశీలించి చూద్దాం. రేవతీదేవి పద్యం, తిలక్ పద్యం ఎరగని వాళ్ళు చదివినా మంచి పద్యమే అంటారు. తిలక్ పద్యం, రేవతీదేవి పద్యం రాకముందు కూడా ఎలాగూ మంచి పద్యమే కదా. కానీ, ఈ రెండు పద్యాలూ ఒకదాని ‘ప్రభావాన’ మరొకటి అంతకు ముందు కన్నా మంచి పద్యాలు అవుతాయి. ఒక దాని అర్థప్రదేశం మరొకదాని అర్థప్రదేశం వల్ల సంపన్నతరం అవుతుంది. ఈ రెండింటిలో ఏ పద్యం లేకపోయినా రెండో పద్యం అర్థం కాస్త సన్నగిలుతుంది.

బహిరంగ కవిత్వం, అంతరంగ కవిత్వం అని కవిత్వంలో ఒక విభాగం చెయ్యొచ్చు.. ఒక పద్యంలో వినిపించే గొంతును బట్టి ఈ విభాగం ఏర్పడుతుంది. శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ పద్యం బహిరంగ కవిత్వం. ఆయనదే ‘నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా’ పద్యం అంతరంగ కవిత్వం. బహిరంగ కవిత్వం ఒక్కరూ ఏకాంతంలో చదివితే అది ఆ మర్నాడు ఇవ్వబోయే ఉపన్యాసానికి తర్ఫీదు యత్నంలాగా ఎబ్బెట్టుగా వినిపిస్తుంది. అంతరంగ కవిత్వం చాలా మంది ముందు బిగ్గరగా చదివితే నడి బజారులో ప్రేమిస్తున్నట్టు చిరాకుగా వుంటుంది. (అయితే, ఒక్క సభలో కూర్చున్న వందలాది మందిని కూడా, చదివే గొంతుక ద్వారా, విడదీసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మానసిక ఏకాంతాలలోకి పంపించి, పదిమంది కలిసి కూర్చున్నామనే స్పృహ లేకుండా చెయ్యడం సాధ్యం).

ఈ విభాగాల దృష్ట్యా చూస్తే, తిలక్ పద్యం బహిరంగ కవిత్వం, రేవతీదేవి పద్యం అంతరంగ కవిత్వం.

తిలక్ పద్యం గొంతుక పెద్దది. తిలక్ దేవుడు దూరంగా వున్నాడు. అందుకే ‘దేవుడా!’ అనడం. పద్యం కోరేది కూడా ‘రక్షించు నా దేశాన్ని’ అని. ‘నా’ అని ఏకవచనం వాడినా ఇది మన కర్థమయ్యేది ‘మా’ అనే. (నా దేశం అనే మాటలో ‘నా’, ఆంగ్ల సంప్రదాయపు ఫలితం. తెలుగులో, మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న మొదలైన మాటల్లోలా ఉమ్మడి ఆస్తులుగా పరిగణించబడే వాటికన్నిటికీ బహువచనం ‘మా’ వాడటమే అలవాటు. ఆ ఇంటికి తానొక్కడే యజమాని అయినా, ఆ తల్లికీ, తండ్రికీ తానొక్కడే కొడుకయినా సరే, ‘మా’ వాడటమే తెలుగు పద్ధతి. అయినా, కవితా సందర్భ బలం వల్ల ఈ పద్యంలో ‘నా’ ఎబ్బెట్టుగా వినిపించదు). పద్యంలో తరవాత వచ్చే మాటలన్నీ హేళనతో నిండినవీ, నిందల్లా వినిపించేవీ. గంభీరమైన నడకతో కూర్చినవి ఈ మాటలు:

“పవిత్రుల నుండి పతివ్రతల నుండి
పెద్దమనుషుల నుండి, పెద్ద పులుల నుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపా సర్పాల నుండి
లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి
శ్రీ మన్మద్గురు పరంపర నుండి”

ఇందులో పైకి గౌరవంగా వినిపించే మాటలన్నీ పరమ హేళనగా వుండే మాటలు. వీటిలో కనిపించే హుందా అంతా కపటపు హుందా. నిజంగా వుండే అర్థం, ఇక్కడ వేళాకోళంగా వుండే సందర్భానికి వెనకాతల వుంది. పూర్వం ఈ మాటలు గౌరవంగా వాడబడినవి. అవి అలా వాడబడబట్టే ఇక్కడ ఈ మాటలకి హేళనార్థం రావడానికి వీలయ్యింది. ఆ గౌరవ నేపథ్యం ఈ హేళనార్థానికి అస్తిత్వం కల్పించింది.

రేవతీదేవి పద్యంలో దేవుడు పక్కనే వున్నాడు. అందుకనే ‘దేవుడూ’ అని పిలవటం. ఈ పద్యపు గొంతుక చిన్నది. ‘నీ భక్తుల్నించి రక్షించు’ అని ఒక మనిషి కోరిక లాంటి చిన్న కోరిక. ఈ మాటకి తిలక్ పద్యంలో వున్నంతగా హేళనార్థం వుండక్కరలేదు. ఇందులో ‘భక్తులు’ అనే మాటలో హేళనార్థం వుందా అంటే లేదు, లేదా అంటే వుంది. పూర్వం ‘భక్తులు’ అనే మాటకి వున్న గౌరవార్థం సాగి అందులో ఈ హేళనార్థం చోటు చేసుకుంటుంది. తిలక్ పద్యంలో ఆ పెద్ద మాటలకి పూర్వం వున్న హుందాను దూరంగా నెట్టేసి ఆ స్థానంలో హేళనార్థం వచ్చి కూర్చుంటుంది.

“దేవుడూ
నన్ను రక్షించు
నీ భక్తుల్నించి
నన్ను రక్షించు”

అన్న మాటల్లో దేవుడితో చనువూ, దగ్గిరతనమూ తిలక్ పద్యంలో దేవుడి దూరం వల్లా, గౌరవం వల్లా మరింత పదును దేలతాయి. (తిలక్ పద్యంలో “పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి” అని పుస్తకాల భాషలో వుండే ‘నుండి’, రేవతీదేవి పద్యంలో మనం మాట్లాడుకునే ‘నుంచి’ గా మారిపోతుంది). ఈ మాటల్లో వుండేది మామూలుతనం, తిలక్ మాటల్లో వుండేది గాంభీర్యం. ఈ మామూలుతనం ఆ గాంభీర్యపు నేపథ్యంలో పద్యత్వాన్ని పొందుతుంది. తిలక్ పద్యపు పెద్ద గొంతుక ఆవరణలో రేవతీదేవి పద్యపు మామూలు గొంతుక కవిత్వం అవుతుంది. ఇంకో మాటల్లో చెప్పాలంటే తిలక్ పద్యపు అర్థప్రదేశం రేవతీదేవి పద్యానికి ఒక అర్థప్రదేశాన్ని కల్పిస్తుంది.

దగ్గరగా వున్న దేవుడితో సమానంగా మాట్లాడే మనిషి దేవుణ్ణి దాదాపు తనతో సమానంగా చూస్తాడు (లేదా చూస్తుంది). అందుకే రేవతీదేవి పద్యం చివర:

“ఇందర్నుంచి రక్షించినందుకు
నేన్నీ భక్తిలో పడితే
ఒద్దూ దేవుడూ
నన్ను నువ్వు రక్షించొద్దు
నన్ను నేనే రక్షించుకుంటాను”

అని చెప్పి, గొంతు మార్చి, ఇంకా చిన్న గొంతుకతో,

“అప్పుడు
నన్ను రక్షించు అని
నువ్వే నన్ను అడగాల్సొస్తుంది”

అంటుంది. అంటే, దేవుడి స్థానంలో మనిషి, మనిషి స్థానంలో దేవుడూ వుంటారన్న మాట. రేవతీదేవి పద్యంలో ఇంత దగ్గర తనానికీ, దేవుడూ మనిషీ ఒకరి ఇబ్బందులు మరొకరు పొందడానికీ బలం ఇచ్చేది తిలక్ పద్యంలో దేవుడికీ మనిషికీ నిత్యసత్యంగా వుండే దూరమే. ఆ దూరమే లేకపోతే తిలక్ పద్యం లేదు. ఆ పద్యంలో దేవుడు ఎప్పుడూ దేవుడే. మనుషులు ఎప్పుడూ మనుషులే. ఆ దేవుడు సర్వశక్తి మంతుడూ, పరమ దయాళువూ అయిన తండ్రి. రేవతీదేవి దేవుడు మనిషికి దగ్గరగా వున్న, మనిషికున్న ఇబ్బందులే పడగల స్నేహితుడు.

ఇకపోతే, రేవతీదేవి పద్యం వచ్చాక తిలక్ పద్యం కూడా మారుతుంది. దాని అర్థప్రదేశం అంతకు ముందు అందులోని పదాలకున్న గౌరవ గాంభీర్యాల నేపథ్యంలో ఏర్పడిందని ఇంతకు ముందు చూశాం. తిలక్ పద్యం బహిరంగ కవిత్వంలోకి చేరుతుందని కూడా గమనించాం.

రేవతీదేవి పద్యం వచ్చి, తిలక్ పద్యంలో బహిరంగ కవిత్వపు వైశాల్యాన్ని ఏమీ మార్చకుండా, దానిలో ఒక విలక్షణమైన అంతరంగ కవిత్వపు ఛాయని అదనంగా చేరుస్తుంది. తిలక్ పద్యం జనులందరి ఉమ్మడి ప్రార్థనగా వుంటునే, ఒక్కడి ప్రార్థనగా మారుతుంది. ఇంతకు ముందు ‘మా’గా బహువచనపు ప్రజా సమూహపు గొంతుతో వినిపించే పద్యం, ‘నా’ అనే అర్థాన్ని కూడా ఇముడ్చుకొని, చదివే వారి ఒక్క గొంతుకలా కూడా భాసిస్తుంది.

తిలక్ పద్యం ఒకవేళ లేదనుకోండి. లేదా పాఠకుడు ఆ పద్యాన్ని చదవలేదనుకోండి. రేవతీదేవి పద్యం అప్పుడు కూడా కవిత్వమే, సందేహం లేదు. అయితే అప్పుడు అది కవిత్వం అవడానికి తెలుగు భాషలో వున్న ఇతర పద్యాల అర్థప్రదేశాలు నేపథ్యాన్ని కల్పిస్తాయి. అపుడు ఆ పద్యపు అర్థం, తిలక్ పద్యం చదివిన పాఠకుడికి అనుభవమయే రూపంలో వుండదు. ఇంకోరకంగా వుంటుంది.

మొదటి దాని ప్రభావం రెండో దాని మీద వుందని మనం చెప్పుకునే రెండు పద్యాలు – రెండూ మంచి పద్యాలే అయినప్పుడు – ఒకదానికొకటి ప్రవర్ధకాలు అవుతాయి. మరీ ముఖ్యంగా, అప్పటికే రాసేయబడిన పద్యం, ఆ తరవాత రాయబడిన పద్యం వల్ల పెరగడం గుర్తించవలసిన విషయం. అలాగే, తరవాత రాయబడిన పద్యం, ఆ పూర్వ పద్యపు నేపథ్యంలో, అది లేకుండా వుంటే దానికి వుండాని ఒక కొత్త అర్థప్రదేశానికి ఆకృతి కల్పించుకోవడం కూడా గుర్తించవలసిన విషయం.

‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం ఇది. ఈ క్లిష్టతని గమనించని అర్థంలో వాడే ‘ప్రభావం’ అనే మాట, దానికి తోబుట్టువులైన ‘అనుసరణ’, ‘అనుకరణ’, ‘కాపీ’ ఇత్యాదులతో సహా, మంచి సాహిత్య విమర్శలో వాడవల్సిన ఊహలు కావు.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...