మనకు తెలియని మన త్యాగరాజు – 5

వేదాద్రిసదశ ముదిలియార్

గోవింద మరారూ, త్యాగరాజుల సమావేశం గురించి ఎన్నో వివరాలు ఎం.ఎస్ రామస్వామి అయ్యర్ సేకరించారు. ఈ గోవిందమరారుతో పాటు వడివేలూ, మరో ట్రావెన్ కోర్ ఆస్థాన విద్వాంసుడు నల్లతంబి ముదిలియార్ వెళ్ళినట్లుగా రాసారు. నల్లతంబి ముదిలియార్ అన్న కొడుకు సులోచన ముదిలియార్ నడివయస్సులో ఉండగా త్యాగరాజుని కలిసాడు. సులోచన ముదిలియార్ తంజావూరు బ్రిటీషువారి దగ్గర పనిజేసేవాడు. ఇతను రహదారులు వేయించేవాడు. వంతెనలు కట్టించేవాడు. ఇతని కొడుకు వేదాద్రిసదశ ముదిలియార్ ట్రావెన్ కోర్ హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా పనిజేసాడు. తండ్రితో పాటు కలిసి ఇతని చిన్నతనంలో త్యాగరాజుని దర్శించినట్లుగా ఎం.ఎస్. రామస్వామి అయ్యర్‌కి స్వయంగా చెప్పాడనీ రాసారు.


త్యాగరాజు తపాలా బిళ్ళ

ఈ వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా త్యాగరాజు గురించి రామస్వామి అయ్యర్‌ వివరాలెన్నో సేకరించారు. ఈ సందర్భంలోనే త్యాగరాజు వేదాంత వైఖరి గురించి ఒక ఆసక్తి కరమైన సంఘటనొకటి రాసారు. ఈ సులోచన ముదిలియార్ కి బ్రిటీషు వాళ్ళు తిన్నివెల్లి (తిరునల్వేలి) వంతెన పని అప్పగించారు. ఈ పని మీద తండ్రీకొడుకులిద్దరూ తంజావూరొచ్చారు. అప్పటికే గోవింద మరార్, త్యాగరాజుల సమావేశం గురించి ఎంతగానో విని వుండడంతో తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని సందర్శించారు. అప్పటికే గోవింద మరారు పండరీపుర యాత్రలో చనిపోయి కొన్ని నెలలయ్యింది. సులోచన ముదిలియార్ ద్వారానే ఈ విషయం త్యాగరాజుకి తెలిసింది. అతిపిన్న వయసులో పోయాడని, “దేవుడు అతని ప్రార్థనలని వినలేదా?” అని త్యాగరాజు బాధపడుతూ ప్రశ్నిస్తే, “సృష్టి సూత్రాలని ఎవరూ మార్చలేరనీ, వాటినెవరూ ఆపలేరనీ చెబుతూ, కేవలం ప్రార్థన వల్ల నియమాలు మారవనీ “- వేదాద్రిసదశ ముదిలియార్ వేదాంత వైఖరిని చెప్పి సులోచన ముదిలియార్ ఊరడించాడనీ, త్యాగరాజు ఆ సందర్భంలో చక్రవాక రాగంలో ఈ క్రింది కృతి చెప్పినట్లుగా రామస్వామి రాసారు.

పల్లవి. సుగుణములే చెప్పుకొంటి
            సుందర రఘురామ

అనుపల్లవి. వగలెరుంగ లేకయిటు
            వత్తువనుచు దురాశచే (సుగుణములే)

చరణం. స్నానాది సు-కర్మంబులు
            వేదాధ్యయనంబులెరుగ
            శ్రీ నాయక క్షమియించుము
            శ్రీ త్యాగరాజ నుత (సుగుణములే)

ఇదే భావన స్ఫురించేలా వనాళి (లేదా వనావళి) రాగంలో ‘అపరాధములనోర్వ’ కృతినీ కూడా స్వరపరిచినట్లుగా అయ్యర్ చెప్పారు.

ఇలా త్యాగరాజుని సందర్శించిన ఎంతోమంది ద్వారా ఎన్నో వివరాలు సేకరించిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ చరిత్ర తేదీలకీ, సాంబమూర్తి చెప్పిన వాటికీ ఎక్కడా పొంతన లేదు. త్యాగరాజూ, గోవిందమరారూ 1838లో కలిసారన్నట్లుగా రామస్వామి అయ్యర్ రాసారు. రామస్వామి అయ్యర్ చెప్పిన సంవత్సరం కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తుంది. ఒక పక్క సులోచన ముదిలియార్ కలిసింది 1843 ఆగస్టులో అని చెబుతూ, ఆప్పట్లోనే వారిద్దరి కలయిక వార్తా అనేకమంది ఎంతగానో చెప్పుకున్నారనీ, మరోవైపు గోవిందమరారూ, త్యాగరాజు కలిసిన సంవత్సరం 1838 అని చెప్పారు. సాంబమూర్తి మాత్రం ఈ సంఘటన 1843లోనే జరిగిందని రాసారు తప్ప ఆధారాలివ్వలేదు. ఇది 1843 సంవత్సరం మొదట్లో జరిగినట్లు భావించడానికి ఆస్కారమెక్కువగా వుంది.. ఎందుకంటే అదే సంవత్సరం సుమారుగా జూన్, జులై కాలంలో గోవింద మరార్ పండరీపుర యాత్రలో చనిపోయాడు. ఈ సంగతి ట్రావెన్కోర్ రాజాస్థాన చరిత్ర ప్రతుల్లో ఉంది. ఇదే విషయాన్ని తిరువనంతపురానికి చెందిన టి. లక్ష్మణ పిళ్ళై త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో ప్రస్తావించారు. అందులో ఈ వేదాద్రిసదశ ముదిలియార్ త్యాగరాజుని కలిసినట్లుగా వుంది. ఈయన చెప్పిన తేదీలూ, సంవత్సరాలూ రామస్వామి అయ్యర్ చెప్పిన వాటితో సరిపడ్డాయి. ఇద్దరూ 1838 అని తప్పుగా పొరబడ్డారు.

అలాగే గోవిందమరార్ తో పాటు వడివేలు కూడా వెళ్ళినట్లుగా రామస్వామి అయ్యర్ రాస్తే, సాంబమూర్తి మాత్రం ఇద్దరూ విడివిడిగా కలిసినట్లు రాసారు. రామస్వామి అయ్యర్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు. ఈయనేమో వీణ కుప్పయ్యర్ శిష్యుడు. కాబట్టి రామస్వామి అయ్యర్ చెప్పిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశముంది. వాలాజపేట శిష్యులు పొందుపరిచిన త్యాగరాజు జీవిత వివరాల్లో గోవింద మరారు గురించుంది. గోవింద మరారుని ప్రస్తుతించే సందర్భంలో ఎందరో మహానుభావులు కృతిని త్యాగరాజు పాడినట్లుగా చెప్పారు. సులోచన ముదిలియార్, త్యాగరాజు కలిసిన సందర్భాన్ని ఆసక్తికరమైన సంభాషణలతో రామస్వామి అయ్యర్ ఎంతో నాటకీయంగా రాసారు.

వికటకవి కృష్ణయ్యర్

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో వికటకవి కృష్ణయ్యర్ అనే ఒక విదూషకుడుండేవాడు. త్యాగరాజన్నా, ఆయన పాటన్నా ఈయనకి ఎంతో ఇష్టం. ఈయన వచ్చినప్పుడల్లా త్యాగరాజు శిష్యులతో కలసి కచేరీ ఇచ్చేవాడు. ఓ సారి కచేరీలో హరికాంభోజి రాగంలో ‘దినమణి వంశ తిలక లావణ్య’ కృతిని స్వరపరచి త్యాగరాజు పాడుతుంటే, అక్కడే కూర్చున్న ఒక ప్రేక్షకుడు ఈ ప్రయోగం తప్పనీ, లావణ్య అన్న పదం విశేషణమనీ, కాబట్టి అది ఒక వస్తువు ముందుండాలనీ, కచేరీలో పక్కనున్న వారితో గట్టిగా చెబితే అది త్యాగరాజు చెవిన పడింది. ఆ పాట ముగించేక, ‘దినమణివంశ లావణ్య తిలకా’ అని సాహిత్య పరంగా అర్థం చేసుకోవాలని త్యాగరాజు వివరణిచ్చాడంటూ కృష్ణయ్యర్ తంజావూరు రాజదర్బారులో ఎంతో హాస్యంగా చెప్పాడని, వేదాద్రిసదశ ముదిలియార్ చెప్పినట్లుగా టి.లక్ష్మణ పిళ్ళై రాసారు. సాంబమూర్తి కథనంలో వికటకవి కృష్ణయ్యర్ రావడమూ పాట కచేరీ విషయమూ వేర్వేరుగా రాసారు.

ఒక ఉత్తర దేశపు విద్వాంసుడు

ఓసారి ఉత్తరదేశం నుండి ఒక హిందూస్తానీ సంగీత విద్వాంసుడు తంజావూరు సందర్శించినపుడు, అతని అభ్యర్థనపై, కళ్యాణి రాగంలో ‘సుందరి నీ దివ్య స్వరూపమును’ కృతిని ధర్మసంవర్ధినీ ఆలయంలో పాడితే, తన వద్దనున్న బంగారమూ, కానుకలూ అన్నీ త్యాగరాజుకి కానుకగా ఇచ్చాడనీ సాంబ మూర్తి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాసారు, కానీ పేరు చెప్పలేదు. ఏవరికైనా పేరు ప్రఖ్యాతులొచ్చాక వారిమీద అనేక కథలు పుట్టుకు రావడం సహజం. అలాంటిదే ఈ కథ అని అనుకోవాలి.

సంగీత త్రిమూర్తులు

త్యాగరాజు కాలం (1767 – 1847) లోనే సంగీతంలో అనేకమంది ప్రజ్ఞావంతులు ప్రపంచం నలుమూలలా జన్మించారు. తంజావూరు రాజ్యంలో 1700 – 1850 కాలంలోనూ, దక్షిణాదిన కొన్ని రాజ్యాల్లోనూ కర్ణాటక సంగీతం వెల్లి విరిసింది. కర్ణాటక సంగీతానికొక రూపూ, పద్ధతీ వచ్చిందీ కాలంలోనే! త్యాగరాజు జన్మించిన కాలంలోనే తిరువారూర్లో మరో ఇద్దరు సంగీత దిగ్గజాలు పుట్టారు. ఒకరు శ్యామ శాస్త్రి, రెండో వారు ముత్తు స్వామి దీక్షితార్. త్యాగరాజుతో కలిపి ఈ ముగ్గుర్నీ ‘సంగీత త్రిమూర్తులు’ (మ్యూజికల్ ట్రినిటీ) అని అంటారు. శ్యామశాస్త్రి 1762 లో పుడితే, 1776 లో ముత్తుస్వామి దీక్షితార్ పుట్టాడు. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తిరువారూర్లోనే పుట్టారు. దాదాపు ఒకే సమయంలోనే జీవించారు. త్యాగరాజు చిన్నతనంలోనే తిరువయ్యారు మకాం మారిస్తే, శ్యామశాస్త్రి కుటుంబీకులు తంజావూరు వెళ్ళారు. చిన్నతనం అంతా తిరువారూర్ లోనే గడిపిన ముత్తుస్వామి దీక్షితార్ యుక్త వయసులో ఉండగా కొంతకాలం కాశీ లో గడిపాడు.

ఈ ముగ్గురూ ఒకే కాలం వారయ్యుండడం వల్ల “వీరు కలిసారా?”, “ముగ్గురికీ ఒకరికొకరు పరిచయముందా?” అన్న ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు శ్యామశాస్త్రీ, ముత్తుస్వామి దీక్షితార్ల గురించి కొంత తెలుసుకోడం సముచితంగా ఉంటుంది.

శ్యామశాస్త్రి

శ్యామశాస్త్రి పూర్వీకులు తెలుగు వాళ్ళు. వీరు తంజావూరు రాజ్యానికి వలస వచ్చారు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాధ అయ్యర్ వృత్తిరీత్యా అర్చకుడు. అప్పటి తంజావూరు రాజు తుల్జాజీ పిలుపు మీద విశ్వనాధ అయ్యర్ తంజావూరు కామాక్షి మందిరంలో అర్చకుడిగా నియమింపబడ్డాడు.

శ్యామశాస్త్రి కుటుంబంలో ఎవరికీ సంగీతంలో ప్రవేశం పెద్దగా లేదు. కాశీ నుండి సంగీత స్వామి అనే సాధువొకాయన చాతుర్మాస దీక్షకై తంజావూరొచ్చినపుడు శ్యామశాస్త్రికి సంగీతంలో వున్న ఆసక్తి చూసి సంగీతం విద్య నేర్పాడు. కేవలం మూడు నెలల్లోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం చూసి సంగీతస్వామి, తంజావూరు ఆస్థాన విద్వాంసుడైన ఆదియప్పయ్య దగ్గర సంగీతం నేర్చుకోడానికి కుదిర్చాడు. తండ్రి తదనంతరం శేష జీవితమంతా బంగారు కామాక్షి దేవాలయ అర్చకుడిగానే గడిపాడు. సుమారు రెండు వందలకి పైగా కీర్తనలు తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో స్వరపరిచాడు. ఈయనకి అతి తక్కువ మంది శిష్యులున్నారు. వీరిలో ఈయన కొడుకు సుబ్బరాయ శాస్త్రీ, పెరంబూర్ కృష్ణయ్యర్, అలుసూర్ కృష్ణయ్యర్, దాసరి ముఖ్యులు. పంజుశాస్త్రి, సుబ్బరాయ శాస్త్రీ ఈయన కొడుకులు. పెద్దకొడుకు పంజుశాస్త్రి కామాక్షి ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. రెండో కొడుకు సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు చివరి దశలో ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు.

త్యాగరాజులా కొత్త కొత్త రాగాలు కనుక్కోకపోయినా శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన రాగాల్లోనే కృతులు స్వరపరిచాడు. ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’ వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.

ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు. శ్యామకృష్ణ అన్నది వీరి కృతి ముద్ర. శ్యామశాస్త్రి పుదుకుట్టయి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడే బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ జరిగిందని కొంతమంది రాస్తే, ఆ కథని మరి కొంతమంది త్యాగరాజుతో జరిగినట్లుగా రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!


శ్యామశాస్త్రి తపాలా బిళ్ళ

శ్యామశాస్త్రి 1827లో కన్నుమూసాడు. తండ్రి పోయిన తరువాతే సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యుడిగా చేరాడు. త్యాగరాజు అంత్య దశలో తిరువయ్యార్ లోనే ఉన్నాడు. పంజుశాస్త్రి ముగ్గురు కొడుకుల్లో ఒకడైన రామకృష్ణ శాస్త్రి కొడుకు, నటేశ శాస్త్రి ద్వారా శ్యామశాస్త్రి కృతుల ప్రతులు దొరికాయి. పిల్లలు లేని సుబ్బరాయ శాస్త్రి అన్నగారి ఆఖరి కొడుకు అన్నస్వామి శాస్త్రిని పెంచుకున్నాడు. ఈయన దగ్గర నటేశశాస్త్రి తాతగారు స్వరపరిచిన కృతులన్నీ నేర్చుకున్నాడు. ఈ నటేశ శాస్త్రి దాదాపు 94 ఏళ్ళు బ్రతికాడు. ఈయన 1950 లో చనిపోయాడు. ఈయన ద్వారా శ్యామ శాస్త్రి గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంబమూర్తి ఈయన్ని అనేకసార్లు కలిసి శ్యామశాస్త్రి కృతుల వివరాలు సేకరించినట్లుగా రాసారు. అందువల్లే శ్యామశాస్త్రి రచనలు 1915 దాటాకే పదిమందికీ తెలియడం మొదలు పెట్టాయి.

శ్యామశాస్త్రి, త్యాగరాజు మంచి స్నేహితులని సాంబమూర్తి గారు ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాస్తూ ఓ కథ చెప్పారు. శ్యామశాస్త్రికి తాంబూలం అలవాటు ఎక్కువగా ఉండేది. అస్తమానూ ఉమ్మి వేయడానికి కూర్చున్న చోటునుండి లేచి బయటకు వెళ్ళేవాడు. త్యాగరాజుకి ఎంతో శుభ్రతా నియమాలున్నా శ్యామశాస్త్రి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు మినహాయింపుండేదని చెబుతూ కథలా రాసారు. ఇలాంటి కథలకి ఆధారాలేమిటో తెలీదు. శ్యామశాస్త్రి ఆలయ అర్చకుడు. అలా పదిమంది ముందూ తాంబూలం నమిలినా, అక్కడే ఉమ్మి వేసే ప్రవర్తనుంటుందని ఎవరూ భావించరు. ఇలాంటి కథలు పదిమందికీ చెప్పడంలో ఆంతర్యమేమిటో తెలీదు. ఈ కథ ఇద్దరు వాగ్గేయకారుల్నీ ఓ మెట్టు క్రిందకే దింపుతుందని నా అభిప్రాయం. ఈ ఒక్క సంఘటనా తప్ప, సంగీత పరంగా వేరే సంఘటనలు ఎవరూ ఉటంకించలేదు. త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మిగతా శిష్యులు కానీ ఎవరూ శ్యామశాస్త్రి గురించి రాయలేదు.

ముత్తుస్వామి దీక్షితార్

కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసాడు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట 1776 లో జన్మించాడు ముత్తుస్వామి దీక్షితార్. హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయిపోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువదమర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు. ముత్తుస్వామి దీక్షితార్ పుట్టింది తిరువారూర్లోనే!


ముత్తుస్వామి తపాలా బిళ్ళ

ఓసారి మనాలి ముత్తుకృష్ణ ముదలియార్ అనే ఒక యతీంద్రుడు వచ్చినపుడు ఆయన కోరికపై ముత్తుస్వామి దీక్షితార్ని పదిహేడేళ్ళ వయసులో మిగతా కొడుకులిద్దరితోనూ తండ్రి కాశీ పంపించాడు. సుమారు పదేళ్ళు దీక్షితార్ అక్కడే గడిపాడు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ పెళ్ళయ్యింది. అన్నలిద్దరూ, చిన్న స్వామి దీక్షితార్, బాలస్వామి దీక్షితార్ ఏడాదిలో తిరువారూరు వెనక్కి తిరిగొచ్చేసినా ముత్తుస్వామి దీక్షితార్ మాత్రం కాశీ లోనే ఉండిపోయాడు. కేవలం గాయకుడు మాత్రమే కాదు, ముత్తుస్వామి దీక్షితార్ మంచి వైణికుడు కూడా.

సుమారు 1801 ప్రాంతంలో తిరిగి తిరువారూరొచ్చాడు. అప్పటికే బాలుస్వామి, చిన్నస్వామిలిద్దరూ జంట విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వీరికి మదురై ఆస్థానం నుండి పిలుపు రావడంతో అక్కడకి వెళిపోయారు. అక్కడుండగానే చిన్నస్వామి దీక్షితార్ చనిపోయాడు. అన్నగారి మరణంతో కలత చెందిన బాలుస్వామి కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఎత్తియపురం రాజాస్థానంలో చేరాడు. అప్పటివరకూ అవివాహితుడుగానున్న బాలస్వామికి ఎత్తియపురం రాజుగారు దగ్గరుండి పెళ్ళి జేసారు. ఈ వార్త ముత్తుస్వామి దీక్షితార్ చెవినపడి అన్నగార్ని చూడ్డానికని వెళ్ళాడు. అన్నగార్ని కలిసాక ఎత్తియపురం ఆస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం ముత్తుస్వామి దీక్షితారుకొచ్చింది.

ముత్తుస్వామి దీక్షితార్ తమిళ, సంస్కృత భాషల్లో ప్రవీణుడు. ఈయన స్వరపరిచిన కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఒక్క రచనా తెలుగులో లేదు. ముత్తుస్వామి దీక్షితార్ సముదాయ కృతులెక్కువగా రచించాడు. సముదాయ కృతులంటే ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ వుద్దేశించి రచించినవి. ఇవి గుంపుగా 5 లేదా 6 కృతులు కలిపుంటాయి. నవగ్రహ కీర్తనలు, నవరత్న కీర్తనలూ, పంచలింగ స్థల కృతులూ వీటిలో కొన్ని చెప్పుకోదగ్గవి. ముత్తుస్వామి దీక్షితార్ కృతి ముద్ర – ‘గురు గుహ’. సాధారణంగా కృతుల ఆఖరి చరణంలో వాగ్గేయకారుల ముద్ర కనిపిస్తుంది. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లో మాత్రం ఈ ముద్ర పల్లవిలో కానీ, అనుపల్లవిలో కానీ, చరణంలో కానీ వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతుల్లో ‘త్యాగరాజ’ అన్నది కనిపిస్తుంది. ఇది చూసి వాగ్గేయకారుడు త్యాగరాజు పై గౌరవంతో రాసిందిగా కొందరు అపోహపడే అవకాశముంది. ఇక్కడ త్యాగరాజు అంటే తిరువారూర్ గ్రామ దైవం ‘త్యాగరాజ స్వామి’ నుద్దేశించని అనుకోవాలి.

ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది. దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశ పెట్టాడు. ఎత్తియపురం రాజాస్థానం ద్వారా బ్రిటీషు పాలకుల పరిచయంతో పాశ్చాత్య సంగీతం తెలిసింది. తెలుగులో నిఘంటువు కూర్చిన సి.పి. బ్రౌన్ కి అంకితమిస్తూ 1832లో ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతులు స్వరపరిచాడు. అప్పటికి సి.పి. బ్రౌన్ చిత్తూర్ జిల్లాకి కలక్టర్ గా పనిజేసేవాడు. ఈ కృతుల వివరాలూ, ఈ విషయమూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో ఉన్నాయి. పశ్చిమ సంగీతాధారంగా దీక్షితార్ ‘నొట్టు స్వరములు’ అనేవి స్వరపరిచాడు. ఇంగ్లీషులో నోట్ కాస్తా తమిళంలోకి నొట్టుగా తర్జుమా అయ్యింది. శంకరాభరణంలో ‘సంతతం పాహిమాం’, ‘రామ జనార్ధన’ వంటి నొట్టుస్వర గీతాల్లో కర్ణాటక సంగీతంలో ఉండే గమకాలుండవు. ముత్తుస్వామి దీక్షితార్ సుమారు 400 పైగా కృతులు 120 రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాలన్నీ వేంకటమఖి సంప్రదాయాన్ననుసరించి వాడుకున్నవే తప్ప కొత్త రాగాలు కావు.

తిరుక్కడైయూర్ భారతి, తేవూర్ సుబ్రహ్మణ్యయ్యర్, శుద్ధ మద్దాళం తంబియప్ప, వీణ వెంకట్రామయ్యర్, కోర్నాడ్ రామస్వామి, తిరువారూర్ అయ్యస్వామి, తంజావూరు చతుష్టయం పొన్నయ్య, చిన్నయ్య, శివనందం, వడివేలు, తిరువారూర్ కమలం, వళ్ళలార్ కోయిల్ అమ్మణి ఈయనకున్న శిష్యగణం. 1935 లో యత్తియపురం రాజ బంధువుల వివాహానికెళ్ళి అక్కడే దీక్షితార్ చనిపోయాడు. ఎ.ఎం.చిన్నస్వామి ముదిలియార్ ‘ఓరియంటల్ మ్యూజిక్’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. “త్యాగరాజ కృతులు చెవిన పడగానే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలాకాదు. ఒకటికి పదిమార్లు విని, శోధిస్తే కానీ ఆ కృతుల్లో గొప్పదనం తెలీదు”.

ఈ త్రిమూర్తులు ఎప్పుడైనా కలిసారా?

శ్యామశాస్త్రీ, త్యాగరాజు మంచి స్నేహితులని చెబుతూ తరచు వీళ్ళిద్దరూ కలిసే వారన్నట్లుగా అనేకమంది రాసారు. ఈ విషయం 1930 తరువాతొచ్చిన రచనల్లోనే ఇది ఎక్కువ భాగం కనిపిస్తుంది. త్యాగరాజు శిష్యులు పొందుపరిచిన వివరాల్లో ఇది లేదు. ఇద్దరూ దగ్గరూళ్ళలోనే ఉండడం వల్ల ఒకరి గురించొకరికి ఖచ్చితంగా తెలిసే అవకాశముంది. అది కేవలం ముఖ పరిచయమేనా లేక సంగీత పరిచయం కూడా ఉందన్న విషయం రూఢిగా చెప్పలేము. సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు శిష్యుడవడం వలన, ఇద్దరి వాగ్గేయకారులకీ ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవముందనీ, అందుకే శ్యామశాస్త్రి తన కొడుకుని త్యాగరాజు వద్దకు పంపాడనీ చెప్పారు. పరస్పర గౌరవం మాటటుంచి, సుబ్బరాయ శాస్త్రిని మాత్రం శ్యామశాస్త్రి పంపే అవకాశం లేదు. ఎందుకంటే శ్యామశాస్త్రి 1827 లో చనిపోయాడు. త్యాగరాజు 1829 లో ఉత్తరాది యాత్రలు ముగించుకొచ్చేకే సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యరికం జేసాడు.

ఇహ ముత్తుస్వామి దీక్షితార్ విషయమూ ఇలానే వుంది. త్యాగరాజూ, ఈయన కలిసినట్లు ఎక్కడా మచ్చుక్కి ఒక్క ఆధారమూ దొరకలేదు. కలిసారంటూ కథలున్నా వాటికి విశ్వసనీయత లేదు. తిరువయ్యారు గ్రామదేవత ధర్మసంవర్ధిని దేవాలయానికి ముత్తుస్వామి దీక్షితార్ వచ్చి అక్కడ కచేరీ ఇచ్చిన సమయంలోనే, త్యాగరాజు రామాయణ పారాయణ ముగింపు ఉత్సవమూ జరిగిందనీ, అప్పుడే త్యాగరాజు ఇంటికి దీక్షితార్ వెళ్ళాడనీ, అక్కడే మణిరంగు రాగంలో ‘మమవ పట్టాభి రామ’ కృతిని పాడాడనీ – సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఇదొక్క సంఘటనే తప్ప త్యాగరాజు శిష్యులు వెంకటరమణ భాగవతార్ కానీ, కృష్ణ భాగవతార్ కానీ, సుందరేశ శర్మా ఎవరూ వీరిద్దరూ కలిసినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. రామస్వామి అయ్యర్ కూడా ఎక్కడా రాయలేదు. వడివేలూ, గోవింద మరారూ, గోపాలకృష్ణ భారతీ వంటి ప్రముఖులు త్యాగరాజుని కలిసినట్లుగా రాసిన శిష్యులు, సంగీత స్రష్టలైన శ్యామశాస్త్రీ, దీక్షితార్ల గురించి ఒక్క మాటా రాయకుండా వుండరు. ముగ్గురూ ఇంచుమించు 30 కిలోమీటర్ల పరిధిలో వున్నారు. ఒకరి గురించి మరొకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నా నమ్మకం.

అసలు సంగీత త్రిమూర్తులంటూ వీరికెలా పేరొచ్చిందన్న విషయం చూస్తే, ఇది 1920 తరువాతనే అన్నది స్పష్టమవుతుంది. త్యాగరాజు ఆరాధనోత్సవానికి బహుళ ప్రాచుర్యం లభించినప్పుడు శ్యామశాస్త్రి మనవడు నటేశశాస్త్రి ద్వారా అనేక కృతులు లభించాయి. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ కృతులు చాలామందికి పరిచయముంది. వీరు కూడా త్యాగరాజులా వాగ్గేయకారులే కాబట్టి ముగ్గుర్నీ కలిపి సంగీత త్రిమూర్తులు (మ్యూజికల్ ట్రినిటీ) అని వ్యవహరిస్తూ వచ్చారు. త్యాగరాజుతో సమంగా ఆయన పక్కనే పీటవేసి శ్యామశాస్త్రినీ, దీక్షితార్ని కూర్చో బెట్టడాన్ని చూసి మంచాళ జగన్నాధరావూ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అభ్యంతరాలు తెలిపారు. త్యాగరాజుతో సమంగా క్షేత్రయ్య, అన్నమయ్య ఉండాలని వారి అభిప్రాయం. మంచాళ జగన్నాధ రావు ‘కర్ణాటక సంగీత వికాసానికి త్యాగరాజు చేసిన సేవ’ అన్న వ్యాసంలో ఇలా రాసారు:

ఈనాడు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులని అందరూ అనుకుంటూ వున్నట్లు త్యాగరాజస్వామీ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రుల వారూ కాకుండా క్షేత్రజ్ఞులవారు, దీక్షితుల వారూ, త్యాగరాజ స్వామి అని అనుకోవడం న్యాయమేమో అనిపిస్తుంది. కారణం శ్యామశాస్త్రుల వారి యందు నిరాదరణ కాదు. మహాభక్తులు సంగీత రచయితలు ఎందరో వున్నారు. వారిలో శ్యామ శాస్త్రి వారొకరు. కర్ణాటక సంగీతానికి ఒక స్వరూపాన్ని తీర్చి దిద్దడానికి నేను చెప్పిన సంగీత త్రిమూర్తులు చేసిన సేవ వివరిస్తాను….”

“ప్రాచీన గ్రంధకర్తలు ఉదాహరించిన రాగాల స్వరూపాలు ఇదమిత్థంగా తెలుసుకునే అవకాశం ఎప్పుడో పోయింది. కొంతవరకూ అన్నమాచార్యుల వారు వాడిన రాగాల తాలూకు స్వరూపాలు అక్కడా, అక్కడా దొరుకుతున్నాయి. వాటిలో చాలా రాగాలకి గమకాలను తొలగించడంవల్ల వాటి స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. ఇలామారిన రాగాలకి కొన్ని సందర్భాలలో వేరే వేరే నామకరణాలుకూడా జరిగిపోయాయి. ఇకపోతే ఈ గమకాల తొడుగులు అలంకరించుకోలేని రాగాలు చాలా వరకూ నామరూపాలు లేకుండా పోయాయి. అటువంటి వాటికి ఉదాహరణ: పాడి, టక్క, కొండమలహరి, గుమ్మ కాంభోజి, మెంచ బౌళి, ఆబాలి, అమరసింధు, సాళంగ, హిజ్జిజ్జి, గజ్జరి, తెలుగు కాంభోజి, ముఖారిపంతు, రేవగుప్తి, ఖండె, గౌరీపంతు మొదలయినవి. కొన్ని రాగాలు కొంతవరకు గమకాల పొందికలు అలంకరించుకున్నా అంతంతమాత్రం గానే ఉండి పోయాయి. వీటికి ఉదాహరణ: గౌళిపంతు, మలహరి, నవరోజు, నీలాంబరి, ఆహిరి, ఘంటా, బౌళి కురంజి, ఎరుకల కాంభోజి. వీటిలో చాలా క్లుప్తమైన సంచారాలలో సకృత్తులుగా రచనలు కనబడుతున్నాయి. కాని కొన్ని రాగాలు మాత్రం చాలా చక్కగా గమకాలు అలంకరించుకొని పేర్లు కూడా మార్చుకోకుండా వస్తూ వున్నాయి. కళ్యాణి, శంకరాభరణం, భైరవి, సౌరాష్ట్ర మొదలయినవి.

ఇప్పుడు ఈ పరిశీలనా దృష్టితో గమనిస్తే క్షేత్రజ్ఞుల వారు రచించిన 4200 పదాలను ఎన్ని రాగాలలో పాడి ఉంటారో చెప్పలేము. కానీ ఈ నాడు లభ్యమయిన మువ్వ గోపాల పదాలు పరిశీలిస్తే సుమారు 49 రాగాలు మాత్రమే వాడినట్లు తెలుస్తోంది. ఈ నలభై తొమ్మిది రాగాల్లోనూ క్సేత్రజ్ఞులవారికి తరువాత వారైన దీక్షితుల వారు, త్యాగరాజస్వామి వారు ఎన్నెన్ని రచనలు చేసారు అన్నది గమనిస్తే వారు ముగ్గురు విరాజమానులైన సమయాలలో ఏ రాగం ఎంతెంత మనోరంజకంగా ఉండేదో స్పష్టం అవుతుంది.”

… సంప్రదాయ సిద్ధంగా వాడుకలో వున్న రాగాలన్నిటిలోనూ ముత్తుస్వామి దీక్షితుల వారు రచనలు చేసారు. క్షేత్రజ్ఞులు 49 రాగాలే వాడినా అవి ఎంతో గంభీరతనిండుకొని వున్నాయి. ముత్తుస్వామి దీక్షితులవారు సుమారు 160 రాగాలలో రెండు వందలకు పైగా కీర్తనలు రచించారు. …ఇప్పటి డెబ్భైరెండు మేళకర్తలను మినహాయిస్తే నూటతొంభై రాగాలు సుమారుగా మిగులుతాయి. వీటిలో చాలా వరకూ త్యాగరాజ స్వామీ రచించారు. అసలు వీరు వాడిన రాగాలు సుమారు 220. ఇందులో 45 మేళకర్తల జన్య రాగాలు వీరు ఉపయోగించారు. శ్యామశాస్త్రి రచనల్లో ఇన్ని రాగాలు విస్త్రుతంగా వాడినట్లుగా అగుపించదు…

సుమారుగా ఇదే అభిప్రాయాన్ని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారూ వ్యక్తీకరించారు. కాకపోతే ఆయన అన్నమయ్య వాడినన్ని రాగాలు మిగిలిన వాగ్గేయకారులెవరూ వాడలేదని తిరుపతిలో లభ్యమైన రాగిరేకులు చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అలాగే శ్యామశాస్త్రి సాహిత్యం కూడా భక్తి సాహిత్యమే తప్ప, వేరే ఏ ప్రత్యేకతలూ సంతరించుకోలేదని అభిప్రాయపడ్డారు. సాహిత్యమయితే పుస్తకరూపంలో దొరుకుతుంది. సంగీతమలా కాదు. ఎంత ధాతు, మాతువులతో రాసినా, గమకాలూ వంటివి ప్రత్యేకంగా చూపించినా పదిమందికీ చేరేది సంగీత రూపమైన పాట ద్వారానే. ఈ సంగీతం ముందు తరాలకందేది శిష్యుల వల్లనే! త్యాగరాజుకీ, ముత్తుస్వామి దీక్షితార్ కీ, శ్యామశాస్త్రికీ శిష్యులు బాగానే వున్నారు. క్షేత్రయ్యకీ, అన్నమయ్యకీ లేరు. బాగున్న కీర్తనలు అంటే వినికిడి యోగ్యంగా వున్నవి ఒకరి ద్వారా మరొకరికి చేరాయి.

ముత్తుస్వామి దీక్షితార్ కృతులూ, శ్యామశాస్త్రి కీర్తనలూ తమిళ సంగీత పరిశోధకులకి లభ్యమవ్వడం వలననూ, వారికి క్షేత్రజ్ఞ, అన్నమయ్యల అన్ని రచనలూ అందుబాటులో లేనందువల్లనూ సంగీత త్రిమూర్తులుగా వారి ముగ్గుర్నీ అభివర్ణించారని నా విశ్వాసం. ఇప్పటికీ క్షేత్రజ్ఞుల వారి పదాలు పూర్తిగా లభ్యం కాలేదు. అన్నమయ్యవి కొన్ని లభ్యమయినా వేలకొద్దీ లభ్యం కాలేదు. ఏదైతేనేం అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగరాజులు ముగ్గుర్నీ తెలుగు వారు త్రిమూర్తులుగా స్వీకరించి, వారు కర్ణాటక సంగీతానికి చేసిన సేవని గుర్తుంచుకుంటే అదే పదివేలు.

ఇహ ఈ త్రిమూర్తులూ ముగ్గురూ, అంటే త్యాగరాజూ, శ్యామశాస్త్రీ, ముత్తుస్వామీ దీక్షితార్ ఒకే సారి ఎక్కడైనా కలిసారా అని ప్రశ్నిస్తే, లేదనే జవాబొస్తుంది. వీరు ముగ్గురూ కలిసుండే అవకాశం వుందని భావించినా, ఎక్కడా ఒక్క చిన్న చారిత్రాత్మక ఆధారమూ దొరకలేదు. కొన్ని కథలు విడివిడిగా రాసారు కానీ, వాటికి ఆధారాలు మాత్రం చెప్పలేదు. అందువల్ల ఏది స్తవమో, ఏది వాస్తవమో తెలియకుండా పోయింది.

చివరి రోజులు

త్యాగరాజుకి మనవడు పంచాపకేశానికి తంజావూరుకి చెందిన గురువమ్మాళ్‌తో సుమారు 1930 ప్రాంతంలో వివాహం జరిగింది. త్యాగరాజు కూతురూ, మనవడూ త్యాగరాజు ఇంట్లోనే ఉండేవారు. 1943 ప్రాంతంలో పంచాపకేశానికి అనారోగ్యం చేసి చనిపోయాడు. దాంతో త్యాగరాజు వంశం అతనితోనే ఆగిపోయింది.

1830 ప్రాంతంలోనే వీణకుప్పయ్యర్ మద్రాసూ, వెంకట రమణ భాగవతార్ వాలజపేటా వెళిపోయారు. ఉమయాల్పురం కృష్ణ భాగవతారూ, సుబ్బరాయశాస్త్రీ వంటి కొత్త శిష్యులొచ్చారు. 1844 సంవత్సరాంతంలో వయసు పైబడి త్యాగరాజు ప్రధాన కార్యదర్శీ, అనుంగు మిత్రుడూ, తంజావూరు రామారావు చనిపోయాడు. ఇతను చనిపోవడానికి రెండేళ్ళముందు (1842 లో) త్యాగరాజుకి తన శిష్యులందర్నీ కలవాలని కోరిక గలిగింది. ఈ కొరిక తీర్చడానికి నడుం కట్టింది తంజావూరు రామారావే! త్యాగరాజుకున్న సుమారు 200 మంది శిష్యుల్నీ, ప్రశిష్యుల్నీ అందర్నీ పిలిచారు. తిల్లైస్థానం రామ అయ్యంగార్, మనంబుచవాది వెంకటసుబ్బయ్యర్ తదితరులు అందరూ వచ్చారు.అనారోగ్యంతో బాధపడుతూ, ప్రయాణం చేయలేక వెంకట రమణ భాగవతార్ త్యాగరాజష్టకం రాసి, కొడుకు కృష్ణభాగవతార్ చేతికిచ్చి ఈ సంగీత సమావేశానికి పంపాడు. శిష్యులందరూ త్యాగరాజు స్వరపరిచిన తలో కృతీ పాడి, గురువు ఆశీర్వచనాలు పొందినట్లుగా సాంబమూర్తి చెప్పారు. ఇదే విషయాన్ని టి.లక్ష్మణ పిళ్ళై కూడా ప్రస్తావించారు. చివరిరోజుల్లో ఎవరైనా సందర్శుకులొచ్చి త్యాగరాజుని పాడమంటే, తననే పాడమని అడిగేవాడనీ తిల్లయిస్థానం రామ అయ్యంగార్ రాసుకున్నాడు.

తంజావూరు రామారావు చనిపోయాక త్యాగరాజు కొత్తగా ఏవీ స్వరపరిచలేదని చెబుతారు. సహానా రాగంలో ‘గిరిపై నెలకొన్న’ కృతొక్కటీ తప్ప. త్యాగరాజు చనిపోడానికి పదిలోజుల ముందు రామదర్శన మయ్యిందనీ, పదిరోజుల్లో తనువు చాలిస్తానని చెప్పాడనీ అంటారు.

పల్లవి. గిరిపై నెలకొన్న రాముని
            గురి తప్పక కంటి
అనుపల్లవి. పరివారులు విరి సురటులచే
            నిలబడి విసరుచు కొసరుచు సేవింపగ (గిరి)
చరణం. పులకాంకితుడై ఆనందాశ్రువుల
            నింపుచు మాటలాడ వలెనని
            కలవరించ కని పది పూటలపై
            కాచెదనను త్యాగరాజ వినుతుని (గిరి)


త్యాగరాజు సమాధి

తను చనిపోవడానికి ముందు రోజు త్యాగరాజు సన్యాసం స్వీకరించాడు. ఆ సందర్భంలోనే చనిపోతే తననెక్కడ సమాధి చేయాలో చెప్పాడనీ, అలాగే సన్యాసులని దహనం చేయరు కనుక తనని సమాధి చేస్తే ఎన్నడుగుల లోతు వరకూ ఉప్పు వేయాలో చెప్పాడనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ రాసిన ‘త్యాగరాజ స్వామి’ పుస్తకం 1904లో అచ్చయ్యింది. ఈ సుబ్బరామ దీక్షితార్ తన ఎనిమిదో ఏట, త్యాగరాజు ఇంకో నెల్లాళ్ళల్లో చనిపోతాడనగా ఆయన్ని దర్శించాడు. సన్యాసం స్వీకరించినప్పుడు ‘పరమహస పరివ్రాజక శ్రీ బ్రహ్మానంద స్వామి’ గా పేరు మార్చారు. సన్యాసం స్వీకరించిన మరుసటి రోజు పూజానంతరం మనోహరి రాగం లో ఈ క్రింది కృతిని పాడుతుండగా, ఆ తన్మయత్వంలోనే సిద్ధి పొందాడనీ కృష్ణ భాగవతార్ రాసాడు.

పల్లవి. పరితాపము కనియాడిన
            పలుకుల మరచితివో నా (పరి)

అనుపల్లవి. సరి లేని సీతతో
            సరయు మధ్యంబున నా (పరి)

చరణం. వరమగు బంగారు వాడను
            మెరయుచు పది పూటలపై
            కరుణించెదననుచు క్రే-
            కనుల త్యాగరాజుని (పరి)

‘గిరిపై నెలకొన్న’ కృతే చివరిదని కొంతమంది వాదిస్తే, ‘పరితాము కనియాడినే’ చివరి కృతని మరికొందరు రాసారు. త్యాగరాజు మరణించే సమయానికి మరణశయ్య మీదున్న వెంకటరమణ భాగవతారుకి కలలో త్యాగరాజు సమాధి చెందినట్లుగా కనిపించిందని తండ్రి తనతో చెప్పినట్లుగా కృష్ణ భాగవతార్ రాసారు. చనిపోయే ముందురోజు త్యాగరాజు తన గురించి కలత చెందవద్దని శిష్యులకి చెబుతూ, తిరిగి అరవైఏళ్ళ తరువాత తన సంగీతం ప్రాచుర్యంలోకి వస్తుందని చెప్పినట్లుగా చాలా మంది రాసారు.

త్యాగరాజు 1847 జనవరి 6వ తేదీన బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల కాలంలో సిద్ధి పొందాడు. ఆయన పార్థివ శరీరాన్ని తిరువయ్యారుకి తూర్పున కావేరీ నదీ తీరాన శిష్యులందరూ కలసి సమాధి చేసారు. అక్కడే తులసి మొక్కలు సమాధి చుట్టూ నాటి తులసి బృందావనం అని అప్పట్లో వ్యవహరించేవారు.

త్యాగరాజు జాతకం

త్యాగరాజు చనిపోయిన తేదీ ఖచ్చితంగా తెలిసింది కానీ, ఆయన జన్మదినం మాత్రం సుమారు 1920 వరకూ ఇదమిత్థంగా తెలీదు. ఎవరికి తోచిన లెక్కలు వారు కట్టారు. త్యాగరాజు 84 ఏళ్ళు బ్రతికాడనీ కొంతమంది రాస్తే, కొంతమంది 89 ఏళ్ళని రాసారు. మరికొంతమంది 74 ఏళ్ళని చెప్పారు. అసలు త్యాగరాజు జన్మదినం తాలూకు పలువురి సిద్ధాంతాలూ ఏలా వచ్చాయో, అసలు సరైన తేదీ ఎలా తెలిసిందో పరిశీలిద్దాం. అసలు త్యాగరాజు జన్మదినం గురించి కాస్త వివరంగా చెప్పింది ‘త్యాగరాజ – ది గ్రేట్ మ్యుజీషియన్ సైంట్’ రాసిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్. ఈయన తనకి లభించిన వివరాలన్నీ శాస్త్రీయంగా పరిశీలించి త్యాగరాజు జన్మదినాన్ని నిర్ధారించారు.

త్యాగరాజు శిష్యుల్లో ఒకడైన తిల్లైస్థానం రామ అయ్యంగార్ శిష్యుడు పంజు భాగవతార్ ‘త్యాగరాజ చరితం’ అనే పుస్తకంలో – “త్యాగరాజు పుష్య బహుళ పంచమి, ప్రభవ నామ సంవత్సరం కలియుగం 4948న సిద్ధిపొందారు” అని రాసారు. ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్, పి.వి క్రిష్ణ స్వామి అయ్యర్ మొదలగు వారు ఇదే తేదీని సంగ్రహించారు. కానీ తంజావూరు ప్రభుత్వ ప్రతుల్లో 1842 అనుంది. దీన్ని వి.నాగమయ్య అనే అధికారి పొందుపరిచారు. ఈయనకీ సమాచారం వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా వచ్చింది. టి.లక్ష్మణ పిళ్ళై మాత్రం జనవరి 6, 1847 అని త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో చెప్పారు. ఈ తేదీననుసరించి ఒక్కొక్కరూ ఒక్కో వయసు చెప్పారు. త్యాగరాజు వయసు, సి.తిరుమలయ్య నాయిడు 75 గానూ, సుబ్బరామ దీక్షితార్ 77 గానూ, నాగమయ్య 82గానూ, లక్ష్మణ పిళ్ళై 80 గనూ, ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్ 89 గానూ, పంజు భాగవతార్ త్యాగరాజు వయసు 88 గా చెప్పారు. వేదాద్రిసదశ అయ్యంగార్ ద్వారా రామస్వామి అయ్యర్కి త్యాగరాజు 88 ఏళ్ళు బ్రతికినట్లు చెప్పినందువల్ల, ఆయన పుట్టిన ఏడు 1759 అయ్యుంటుందనీ నిర్ధారించేసారు. చాలాకాలం వరకూ త్యాగరాజు వయసు 88 గానే అందరూ అనుకున్నారు.


త్యాగరాజు జాతకము

వెంకటరమణ భాగవతార్కి కవి వెంకట సూరి అనే శిష్యుడొకాయన ఉండేవాడు. ఇతను త్యాగరాజుదీ, వెంకటరమణ భాగవతార్ల జాతకాలు భద్రంగా పొందుపరిచాడు. నౌకా చరిత్రాన్ని సంస్కృతంలోకి అనువదించిందీ కవి వెంకటసూరే! 1910 తరువాత వెంకటరమణ భాగవతారూ, తంజావూరు రామారావు పేర్లతో వున్న త్యాగరాజు కృతుల తాళపత్ర గ్రంధం వాలజపేట శిష్యులు పొందుపరిచిన వాటిల్లో దొరికింది. ఈ కృతుల చివర్న త్యాగరాజు జాతకం వుంది. ఆ జాతకంలో ఈ క్రింది విధంగా ఉంది.

“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన గత శకాః, 1689 గత కల్యబ్దః 4858 వ్యవహారిక సౌర చంద్రమానాభ్యాం సర్వజిన్నామ సంవత్సర మేష మాసం 25వ తేదీ వైశాఖ శుద్ధ 6 సోమవారం 14-50 పునర్వసు 6-8 శూల 21-29 తైతుల 14-50 దివి 26-29 ఈ శుభ దినమందు సూర్యోదయది ఘ. 14-56 విఘడియలకు భరద్వాజ గోత్రోద్భవుండునూ శ్రీ మద్రామాయణాది ప్రసంగ నిపుణులగు శ్రీ రామ బ్రహ్మస్వామి వారికి శ్రీమత్ పుణ్య తృతీయ పుత్ర జననం”.

ఈ త్యాగరాజు జాతకాన్ని 1947 లో త్యాగరాజు శతాబ్ది సంచికలో వాడ్రేవు సూర్యనారాయణ సవివరంగా చర్చించారు. శ్రీరాముడి జన్మ నక్షత్రాన్నే (పునర్వసు) త్యాగరాజూ జన్మించాడు. ఇది యాదృచ్చికంగా అనిపిస్తుంది. పైన చెప్పిన ‘1689 గత కల్యబ్దః 4858’ వివరం ఇంగ్లీషు సంవత్సరాల ప్రకారం మే 4, 1767 అవుతుంది.
ఈ వివరాలు లభించాక రామస్వామి అయ్యర్ పరిశోధన సరికాదని తేలిపోయింది.

త్యాగరాజు ఆరాధనోత్సవం

త్యాగరాజు సిద్ధి పొందిన తరువాత ఉమైయాల్పురం శిష్యులు ప్రతీ ఏటా పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారొచ్చి సమాధిని సందర్శించేవారు. ఇది మాత్రం విధిగా 40 ఏళ్ళు పైగా చేసారు. ఆ తరువాత ఎవరి ఊళ్ళల్లో వాళ్ళే కచేరీలు చేసేవారు. దాదాపు 1905 వరకూ ఇలాగే జరిగింది. సమాధి శిధిలావస్థలో ఉండడం చూసి ఉమైయాల్పురం సుందరేశ భాగవతారూ, కృష్ణ భాగవతారూ సమాధికి మరమ్మత్తులు చేయాలని సంకల్పించారు. సంగీత ప్రియుల వద్దనుండి విరాళాలు సేకరించి ఒక్కడ ఒక పూజార్ని పర్యవేక్షకుడిగా నియమించారు. 1907 తరువాత నుండీ త్యాగరాజు సమాధికి కొత్త రూపొచ్చింది. కొత్త శకమొచ్చింది. త్యాగరాజ ఆరాధన పేరుతో ఉత్సవంగా భజనలూ, సంగీత కచేరీలూ జరపడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో తిల్లయిస్థానం నరసింహ భాగవతార్ త్యాగరాజు కృతులు సేకరిస్తూ తిరువయ్యారు వచ్చాడు. అక్కడ పంజు భాగవాతార్నీ, తిరుచురాపల్లి గోవిందస్వామి పిళ్ళైని కలిసి త్యాగరాజ ఆరాధనోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. అది చూసి 1908 లో ఉమైయాల్పురం శిష్యులు పంచాపకేశ అయ్యర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంగీత విద్వాంసుల్ని రప్పించారు. దాంతో తిల్లైస్థానం వారికీ, ఉమైయాల్పురం వారికీ విబేధాలొచ్చాయి. నరసింహ భాగవతారంతలా పెద్ద ఎత్తున చేయలేకపోయినా, సమాధి బాగోగులు మాత్రం ఉమైయాల్పురం శిష్యులే చూసేవారు.

ఇద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి, తిల్లైస్థానం వాళ్ళు తిరువయ్యారు కళ్యాణ మహల్లోనూ, మరో వర్గం ఉమైయాల్పురం వాళ్ళు తిరువయ్యారు సంస్కృత పాఠశాలలోనూ జరపడం మొదలెట్టారు. ఇలా దాదాపు పదేళ్ళు పైగా నిర్వహించారు. మెల్ల మెల్లగా త్యాగరాజు ఆరాధనోత్సవ విషయం పలువూళ్ళకీ ప్రాకింది. పదిమంది చెవినా పడింది. జనాలు రావడం మొదలెట్టారు. సుమారు 1920 ప్రాంతంలో బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒకావిడ ప్రవేశంతో మరో కొత్త మలుపు తిరిగింది. అదేమిటో తెలుసుకునే ముందు ఈ నాగరత్నమ్మ గురించీ కాస్త తెలియాలి. ఈ క్రింద చెప్పబోయే కథ 1947లో ‘త్యాగరాజు శతాబ్దిసంచిక’లో, అచ్చ తెలుగులో, బెంగుళూరు నాగరత్నమ్మే స్వయంగా రాసుకుంది.


బెంగుళూరు నాగరత్నమ్మ

బెంగుళూరు నాగరత్నమ్మ మైసూరు సంస్థానంలో దేవదాసీగా ఉండేది. ఈవిడకి కర్ణాటక సంగీతం బాగా వచ్చు, కృష్ణ భాగవతార్ శిష్యుడైన బెంగుళూరు మునుస్వామప్ప శిష్యురాలు. త్యాగరాజు కృతులూ నేర్చుకుంది. అప్పట్లో మద్రాసు సంగీత విద్వాంసులకి నిలయంగా ఉండేది. చివరికి ఈ బెంగుళూరు నాగరత్నమ్మ మద్రాసులో స్థిరపడి సంగీత కచేరీలు ఇచ్చేది. ఓ రోజున ఉమైయాల్పురం పంచాపకేశ భాగవతార్ సంగీత కచేరీకని మద్రాసు వచ్చినపుడు నాగరత్నమ్మ వారిని కలిసింది. ఆయన వద్ద త్యాగరాజు చిత్రపటాన్నొకటి ఏడు రూపాయిలకి కొనుక్కుంది. ఓ రోజు రాత్రి నాగరత్నమ్మకి కలలో త్యాగరాజు కనిపించాడు. ఈ విషయాన్ని సంగీత సమాజ కార్యదర్శి మునుస్వామి నాయుడుకి చెప్పింది. సరిగ్గా అదే సమయానికి తంజావూరు నాగరాజ భాగవతార్ హరికథా కాలక్షేపం నిమిత్తమై మద్రాసు వచ్చారు. ఆయనతో ఈ విషయం చెబితే తిరువయ్యారులో త్యాగరాజు సమాధిని సందర్శించమని చెప్పారు. వారితో కలిసి నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళి, సమాధిని సందర్శించింది. సమాధి సమీపంలో తుప్పలూ, మొక్కలూ పెరిగి అస్తవ్యస్తంగా కనిపించి, ఇక్కడ త్యాగరాజు మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసి, పదిమందినీ సంప్రదించింది. తన దగ్గరున్న కొంత ధనాన్ని వెచ్చిచి త్యాగరాజు వంశీకుడైన రాముడు భాగవతార్ కి సమాధి చుట్టూ ప్రాకారం కట్టే పనులు పురమాయించి మద్రాసొచ్చేసింది. ఇది 1925లో జరిగింది.

సుమారు మూడేళ్ళకి సమాధి చుట్టూ ఓ చిన్న ప్రాకారం కట్టారు. దాదాపు పదమూడేళ్ళ వరకూ ప్రతీ ఏటా నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళొచ్చేది. 1939లో త్యాగరాజు సమాధి మందిరం నిర్మించాలన్న ఆశయమొచ్చింది. సమాధి కెదురుగా వున్న తోట భూములు తంజావూరు రాజబంధువులైన రాజారాం సాహిబ్ విరాళంగా ఇచ్చారు. ఒక కార్య వర్గాన్ని నియమించి సమాధి మందిరాన్ని కడదామనుకుంది. సమాధిపై రామ విగ్రహం పెట్టాలా? త్యాగరాజు విగ్రహం పెట్టాలా? అన్న సందేహం వచ్చి పదిమందినీ సంప్రదిస్తే, త్యాగరాజు విగ్రహం పెడితే బాగుంటుందనీ తీర్మానించారు. ఈలోగా తిల్లైస్థానం వర్గానికీ, ఉమైయాల్పురం వర్గానికీ మరలా గొడవలొచ్చాయి. నాగరత్నమ్మ ప్రవేశంతో ఇద్దరి మధ్యా గొడవలు సమసిపోయి అందరూ కలిసిగట్టుగా సమాధి మందిర నిర్మాణానికీ, త్యాగరాజు విగ్రహ స్థాపనకీ కృషి చేద్దామని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా 1939లో త్యాగరాజు విగ్రహ స్థాపన జరిగింది.


త్యాగరాజు విగ్రహం

ఆ సమాధి దగ్గరలోనే త్యాగరాజ ఆరాధనోత్సవం జరపాలని నిర్ణయించారు. సుమారు 1940 నుండి నేటి వరకూ సమాధి వద్దనే ఆరాధనోత్సవం జరుగుతుంది. సమాధి మందిరం కట్టే సమయంలో లోపల గోడలపైన పాలరాతి ఫలకాలపై త్యాగరాజు కృతులు చెక్కిస్తే బావుంటుందన్న ప్రతిపాదన శ్రీరంగం సుందరం అయ్యర్ చేస్తే అందరూ ఆమోదించారు. అందులోనే వాల్మీకి మంటపాన్ని కట్టి వాల్మీకి విగ్రహాన్నీ ప్రతిష్టించారు. ఈ పన్నెండేళ్ళ వివరాలన్నీ అప్పట్లో కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ప్రోద్బలంతో నాగరత్నమ్మ ఆంధ్రపత్రికలో ధారావాహికంగా వ్యాసాలు రాసింది.

1940 నుండీ ఆరాధనోత్సవాలు పెద్ద యెత్తున జరిగేవి. అందులో భాగంగా త్యాగరాజు పంచరత్న కీర్తనలని సమాధి వద్ద పాడే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడే హరికథలూ, అన్నదానాలూ జరిపేవారు. 1945 లో రేడియో ప్రసారం కూడా చేసారు. 1946లో చిత్తూరు నాగయ్య ఆయనే స్వయంగా నటించి ‘త్యాగయ్య’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఆ సినిమా విజయవంతమైన సందర్భంగా నాగయ్య బెంగుళూరు నాగరత్నమ్మని కలిసినప్పుడు తిరువయ్యారులో త్యాగరాజు భక్తులకోసం ఓ వసతి గృహాన్ని చిత్తూరు నాగయ్యే కట్టించారు. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర అనేకమంది రాసారు. ఈవిడ 1952లో చనిపోయింది. ఈవిడ సమాధి త్యాగరాజు సమాధి ప్రాంగణంలోనే కట్టారు.

తిరుమంజన వీధి – త్యాగరాజు ఇల్లు

త్యాగరాజు తదనంతరం ఆయనున్న ఇంట్లో మనవడి భార్య గురువమ్మాళ్ కొంతకాలముంది. ఆ తరువాత తన బంధువులున్న తంజావూరెళ్ళిపోయింది. ఈవిడ ఆ ఇల్లు ఎవరికీ అమ్మలేదు. 1900 మొదట్లో పోయేవరకూ ఆమె పేరే ఉండేది. ఆవిడ తదనంతరం దాన్ని పంచనదయ్య మునిమనవలు త్యాగరాజ ఆరాధోత్సవ కమిటీ కప్పగించారు. అన్నగారి వాటాని 1828 ప్రాంతంలో ఇద్దరు మహారాష్ట్ర మహిళలకి అమ్మడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు 1940 ప్రాంతంలో వెలుగులోకొచ్చాయి. దానిపై హిందూ పత్రిక వారు వ్యాసం కూడా రాసారు.

త్యాగరాజూ, ఆయన అన్నయ్య పంచనదయ్య ఇల్లయితే వాటాలు వేసుకున్నారు కానీ, చట్ట పరంగా పంచుకోలేదు. అది కూడా తిరువయ్యార్ మెజిస్ట్రేట్ ముందర ఒక పత్రం రాసుకున్నారంతే! త్యాగరాజుది రెండంతస్థుల ఇల్లు.


త్యాగరాజు ఇంటి అమ్మకపు పత్రము

సుమారు 1929 ప్రాంతంలో త్యాగరాజుంటున్న పై భాగాన్ని లగూ బాయి, పయమ్మ బాయి అనే ఇద్దరు మరాఠీ స్త్రీలకి అమ్మేసారు. ఈ అమ్మకాల పత్రంలో త్యాగరాజు స్వదస్తూరీతో ఆయన సంతకముంది. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. హిందూ పత్రిక వారికిది లభ్యమయ్యింది.

సర్వధారీ సంవత్సరం 1828 డిశంబరు 18 వ తేదీ, మార్గశిర మాసం పదకొండో రోజున, తంజావూరు వాస్తవ్యులైన శ్రీమతి లాగు బాయి, పయమ్మ బాయీ, తిరువయ్యారు వాస్తవ్యులైన కీ.శే. రామబ్రహ్మం అయ్యర్ కుమారుడు త్యాగబ్రహ్మ ఆయ్యర్, పంచనదబ్రహ్మం ఆయ్యర్ కుమారుడు సుబ్బబ్రహ్మ్మ అయ్యర్ ల మధ్య జరిగిన ఒప్పంద అంగీకార పత్రమిది. త్యాగబ్రహ్మం ఇంటి పై అంతస్థు నివాసాన్ని ముందు చెప్పిన వారికి చెందేలా రాసిన పత్రమిది. ఈ అమ్మకంలో భాగంగా 32 – 3 3/4 వంతుల బంగారమూ, 50 6/16 వెండీ ఇంటి ధరగా నిర్ణయిస్తూ, తిరువయ్యారు మహలు మహారాణి అభయ, అయ్యలు నాయకన్ సమక్షంలో జరిగిన ఒడంబడిక. ఇది ప్రభుత్వ ముద్ర కలిగిన అమ్మక పత్రము.

(త్యాగబ్రహ్మ అయ్యర్ వ్రాలు) (సుబ్బబ్రహ్మ అయ్యర్ వ్రాలు)

సాక్షులు:
1. తిరుమంజన వీధి నివాసస్థులు – రామశాస్త్రి
2. తిరుమంజన వీధి నివాసస్థులు – సాంబశివ అయ్యర్
3. తిరువధి వెంకటరామ అయ్యర్
4. సామ గురుక్కల్ తనయుడు, పంచనద గురుక్కల్
5. పంచాయితీ అధికారి – అయ్యలు నాయకన్

ఈ మూలప్రతి ప్రస్తుతం మదురై సౌరాష్ట్ర సభ వారి ఆధీనంలో ఉంది. ఇదొక్కటే త్యాగరాజు సంతకంతో లభ్యమైన ప్రతి. త్యాగరాజు వాడిన పోతన భాగవత ప్రతి కూడా వుంది కానీ, అది త్యాగరాజు స్వదస్తూరీయో కాదో తెలీదు. అది త్యాగరాజు షష్టి పూర్తి సమయంలో వెంకట రమణ భాగవతార్ కానుకగా ఇచ్చిన ప్రతని కొంతమంది భావిస్తారు. ప్రస్తుతం తిరుమంజన వీధిలో ఇంటిని త్యాగరాజు స్మారక చిహ్నంగా మలచాలని త్యాగరాజ ఆరాధనోత్సవ కమిటీ నిర్ణయించీ, కూలిపోతున్న గోడలకీ, ఇంటి లోపలా మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. అందులో త్యాగరాజు సంబంధిత వస్తువులుంచి ఒక మ్యూజియంలా తయారు చేద్దామని వారి ఆలోచన. ఈ మరమ్మత్తు పనుల్లో ఉండగా ఎవరో ఈ కమిటీపై కోర్టులో కేసు వేసారు. అందువల్ల మరమ్మత్తు పనులు నిలిపి వేసారు. ప్రస్తుతం ఆ కోర్టు కేసు నడుస్తూ వుంది.

త్యాగరాజు సమాధిపై వివిధ అంశాలను ప్రస్తావిస్తూ విలియం జాక్సన్ ఈ విధంగా అన్నాడు.

“సమాధి వద్ద తన శిష్యులు వర్గభేదాలూ, అసూయలూ, కొట్లాటలూ ఇవన్నీ త్యాగరాజు చూస్తే ఎంతో ఆవేదనచెందుండేవాడనీ కొంతమంది దక్షిణాదులు అనుకుంటారు. సమాధి దగ్గర ప్రశాంతంగా ఉండాలి. త్యాగరాజు తను రామభక్తుణ్ణి గానే చెప్పుకున్నాడు కానీ ఒక సాధువుగా పరిగణించుకోలేదు. ఆయన మీదుండే గౌరవంతో ‘అయ్యవారు’ అంటూ అందరూ సంబోధించేవారు. త్యాగరాజు జీవించిన విధానాన్ని చూసి ఆయన మరణానంతరం త్యాగరాజ స్వామిగా అందరూ పిలుస్తున్నారు.

త్రిమూర్తులుగా పిలవబడుతున్న శ్యామశాస్త్రినీ, ముత్తుస్వామి దీక్షితార్ ని సద్గురు అని పిలవరు. ఎందుకంటే త్యాగరాజు సంగీత కళ ద్వారా దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలో చెప్పాడు. భక్తి మార్గాన్ని పాటలో చూపించాడు. త్యాగరాజుని కొంతమంది ‘సద్గురు త్యాగరాజ స్వామి’గా అనుకుంటే, ఆర్.కృష్ణస్వామీ, వెంకటరమణ భాగవతారూ, బెంగుళూరు నాగరత్నమ్మా ఒక దైవంలా భావించారు…”

ఇప్పటికీ ప్రతీ ఏడూ జనవరిలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు తిరువయ్యారులో జరుగుతాయి. అక్కడే కాకుండా దేశం నలుమూలలా సంగీత ప్రియులు జరుపుకుంటున్నారు. త్యాగరాజు సంగీతం పదిమందికీ తెలిసినా సంగీత శాస్త్ర పరంగా మరింత పరిశోధనలు జరగాల్సుంది. ఇది విశ్వవిద్యాలయాలవల్లే సాధ్యపడుతుంది. తమిళనాట ఈ పరిశోధనలు జరుగుతున్నా, ఆంధ్రదేశంలో సంగీతమ్మీద ఆశించినంతగా జరగట్లేదనే చెప్పుకోవాలి.

ముగింపు

సంగీతంలో రాగాలు అనంతాలనీ చెబుతూ వుంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విద్వాంసులు వెళ్ళేవారు. ఆయా ప్రదేశాల్లో వున్న సంగీత కళల వైవిధ్యాలు ఇతర ప్రాంతల వారికి కొత్తగా ఉండేవి. కొత్త సాంప్రదాయాలకు ఆకర్షితులై ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం సాగుతుండేది. దానికి దోహదం చేస్తూ త్యాగరాజు సుమారు 120 పైగా కొత్త కొత్త రాగాల్లో కృతులు స్వరపరిచాడు. వింతరాగాల పేరుతో ఒకటీ లేదా రెండు కృతులే స్వరపరిచినా, భైరవీ, సావేరి, సౌరాష్ట్ర, తోడి, శంకరాభరణం, కళ్యాణి, మధ్యమావతి రాగాల్లో పదిహేను పైగా కృతులున్నాయి. ముఖ్యంగా శంకరాభరణంలో 38 పైగా కృతులునాయి. ఆ తరువాత తోడి రాగంలో ఉన్నాయి. ఈ మేళ కర్త రాగాలు కాకుండా వందపైగా జన్య రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాల్లో చాలా భాగం హరికాంభోజి లేదా ఖరహర ప్రియ జన్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. త్యాగరాజు ద్వారా ఎన్నో కొత్త కొత్త రాగాలు వెలుగులోకొచ్చాయి. కొన్ని సృష్టించబడ్డాయి. సంగీత శాస్త్ర పురోగవృద్ధికి త్యాగరాజు కూర్చిన రాగాలు ఎంతో దోహదం చేసాయి. ఈ విధంగా త్యాగరాజు కర్ణాటక సంగీతాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. వ్యవహారిక భాషా సాహిత్యాన్ని సంగీతంలో అమర్చి తెలుగు భాషకీ వన్నె తెచ్చాడు.


త్యాగరాజు భాగవత ప్రతి

చివరగా – మన జాతీ, మన సంస్కారమూ, మన కళలూ, విద్యలూ కొంతవరకైనా మనం తెలుసుకోవాలి. తరువాత తరాలకి అందజేయాలన్న విధితో ఎంతోమంది గతంలో చేసారు. ఇప్పుడూ చేస్తున్నారు. ముందు ముందు చేస్తారు కూడా. అందువల్లే ఎన్నో వందల సంవత్సరాలనుండీ, ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంతమంది విమర్శించినా, ఖండించినా, మన కళలు మహా ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. ఇది అన్ని దేశాల వారికీ వర్తిస్తుంది. అలా కాకపోతే వాల్మీకి రామాయణమూ, నన్నయ భారతమూ, కాళిదాసు కావ్యాలూ, అన్నమయ్యా, త్యాగరాజుల కీర్తనలూ ఈ రోజున మనకి తెలిసుండేవి కావు. మంచి వస్తువూ, విలువలూ ఉన్న విషయాలెప్పటికీ నశించవు. విలువలు లేని విషయాలు ఎప్పటికప్పుడే కాలగర్భంలో కలిసిపోతాయి.

కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.

(సమాప్తం)


ఎందరో మహానుభావులు…

ఎంతటి మహాగాయకుడైనా ఒక్కరే పాడితే అది అంతగా రక్తి కట్టదు. అదే పక్క వాయిద్యాలున్నాయనుకోండి. ఆ పాట వినసొంపుగా వుంటుంది. అదే విధంగా రాయడమనే పనికి నేను పూనుకున్నా, ఎంతో మంది చేయూతనిచ్చారు. అమెరికాలో ఉండడం పెద్ద లోటన్న భావనే రానీయకుండా, ఎదురొచ్చి సహాయం చేసారు. అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మీ అందరికీ వ్యాసం నచ్చి, కొత్త విషయాలు తెలిసాయనిపిస్తే నేను పడ్డ శ్రమ వృధా కాలేదనుకుంటాను. లేదంటారా, తెలుగువాడైన త్యాగరాజు కర్ణాటక సంగీతానికి చేసిన సేవని మరోసారి స్మరించుకున్నామనుకోండి. ఈ వ్యాసం బావుందనిపిస్తే ఆ ఘనత నాకు సహాయం చేసిన వారికి చెందుతుంది. ఎక్కడైనా తప్పులు దొర్లితే అవి మాత్రం ఖచ్చితంగా నావే!

– ముందుగా త్యాగరాజు గురించి వ్యాసం రాస్తానని విషయం చెప్పగానే నన్ను ప్రోత్సహించిన వేలూరి గారికీ, ఎంతో శ్రద్ధగా, శ్రమ కూర్చి, సమీక్ష చేసిన ఈమాట సంపాదక వర్గానికీ,
– త్యాగరాజు పై వ్యాసం రాస్తున్నానని చెబితే, తను దాచుకున్న పుస్తకాలూ, వ్యాసాలూ పంపి తన చేతలతోనూ, పుస్తకం వేయండంటూ బొమ్మేసిచ్చి తన గీతలతోనూ, నాపై ఎంతో ఆత్మీయత చూపించిన ప్రముఖ చిత్రకారులు బాపు గారికీ,
– సంగీత పరంగా నాకొచ్చిన సందేహాలన్నీ తీర్చి, నన్ను ప్రోత్సహించిన వైణిక గురువు శ్రీమతి సీత నిష్టల గారికీ,
– సుమారు అరవైఏళ్ళ క్రితం నాటి వ్యాసాలు పంపిన హిందూ వార్తా పత్రిక యాజమాన్యానికీ, తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో ఫొటోలు తీసుకోడానికి అనుమతిచ్చిన ఎస్.రాఘవన్ గారికీ,
– త్యాగరాజు సమాధి వద్ద ఫొటోలకి అనుమతిచ్చిన త్యాగరాజు కుటుంబీయులకీ,
– ఎంతో శ్రమగూర్చి పుస్తకాలు పంపిన మిత్రుడు వెంకట రత్నానికీ,
– వ్యాసం మొదటి భాగం చదివి, ప్రముఖులు రాసిన వ్యాసాలు పంపిన మేడేపల్లి శేషు గారికీ,
– ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుండి మ్యూజికల్ జర్నల్స్ తెప్పించిపెట్టిన స్కాట్ రిచ్ కీ,
– అడగ్గానే సహాయం చేసిన కె.పగల్‌వాన్‌కీ, ఆంధ్రజ్యొతి విలేకరి జి.ఎల్.ఎన్ మూర్తిగారికీ,
– నన్ను ప్రోత్సహించిన మిత్రులు గుండ శివచరణ్‌కీ, వేమూరి వెంకటేశ్వరరావు గారికీ, కందాళం రామానుజాచార్యులకీ,
– పుస్తక ప్రచురణలో సహాయమందిస్తున్న కేతు విశ్వనాధరెడ్డి గారికీ,
– నన్ను ప్రోత్సహించిన మా బావ జొన్నలగడ్డ శేష నారాయణరావుకీ,
– ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాకు సహయం చేసిన అనేకమంది మిత్రులకీ,
– వ్యాసంలో తప్పులు సరిదిద్దిన వారికీ, తమ అభిప్రాయాలతో నన్ను ప్రోత్సహించిన ఈమాట పాఠకులకీ

…అందరికీ వందనములు.

యాదృచ్చికమో, అదృష్టమో తెలీదు – అయ్యో ఈ పుస్తకం దొరకలేదే అననుకుంటే చాలు, రెండ్రోజుల్లో నాకవి లభించాయి. ఈ త్యాగరాజు వ్యాసం పేరు చెప్పి అనేక కొత్త అనుభవాలు కలిగాయి. మరచిపోలేని అనుభూతులు మిగిలాయి. ఇది మాత్రం నేనూహించలేదు. ఈ వ్యాసం రాయడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను.
– సాయి బ్రహ్మానందం గొర్తి


Additional References:

  1. పుట్టపర్తి నారాయణా చార్యుల వారి ఇంటర్వ్యూ – ఆరాధన పత్రిక 2004
  2. త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947: ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి
  3. హిందూ దినపత్రిక సంగీత వ్యాసాలు – 1948
  4. కర్ణాటక సంగీత వికాసానికి త్యాగరాజు చేసిన సేవ – మంచాళ జగన్నాధ రావు – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  5. శ్రీ త్యాగరాజ స్వామి సమాధి – విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  6. త్యాగరాజు జాతకం – వాడ్రేవు సూర్యనారాయణ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  7. Samgita Sampradaya priyadarSini – Subba Rama Dikshitar, Ettiyapuram, 1904 (Reprinted in 1960 by Madras Music Academy)
  8. Sri Tyagaraja – M.VenkaTramayya, Madras Press, 1963 –
  9. The Oriental Music in Europian Notation – A.M.Cinaswami Mudiliyar, Pudupet, Madras 1893 –
  10. Sri Tyagaraja: A Monograph – Vidya Sundari Bangalore Nagaratnamma Trust. Madras, 1976.