ఉపోద్ఘాతము
భాషాసిద్ధి లోకంలో జరిగితే, కవిత్వ భాషను కవులు తయారు చేసుకుంటారు. సాధారణభాష కవిత్వ భాషగా మారే క్రమం ఒకటుంటుంది. ఆ క్రమంలో జరిగే పరిణామాలను గుర్తిస్తే కవిత్వ భాషాస్వరూపం అర్థం అవుతుంది.
ఇవి చేరాగారు “కవిత్వభాష” అన్న వ్యాసంలో చెప్పిన మాటలు. వ్యవహారంలో ఉండే మామూలు మాటలనుంచి కవిత్వాన్ని సృష్టించవచ్చు కాని, ఆ మామూలు మాటలే కవిత్వం కాదన్న సంగతి కవిత్వాన్ని రుచిచూసిన ఎవరికైనా తెలిసిన విషయమే. సాధారణ వ్యవహారంలో ఉన్న భాషకీ కవిత్వంలో ఉన్న భాషకీ కొంతైనా వ్యత్యాసం ఉండడం సహజం.
కవిత్వంలో భాషకి స్థూలంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మామూలు విషయాన్నైనా చదివేవాళ్ళ (వినేవాళ్ళ) మనసులకి బాగా హత్తుకొనేట్టు చెప్పడం. మామూలు వ్యవహారంలో మనం వాడే భాషకి యీ ప్రయోజనం సాధారణంగా ఉండదు. మన భావాన్ని ఎదుటివాళ్ళకి వ్యక్తం చెయ్యడం వరకే సాధారణ భాష చేసే పని. ఒకవేళ నొక్కి చెప్పాల్సిన సందర్భం వచ్చినా, ఉచ్చరించే స్వరమూ, హావభావాలూ వంటి భాషేతరమైన ప్రక్రియల సహాయం తీసుకుంటాం (పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించే సందర్భం దీనికి మంచి ఉదాహరణ!). కవిత్వంలో అది కుదరదు. చెప్పే విషయాన్ని హత్తుకొనేట్టు చెప్పడానికి కవికి ఉన్న పరికరం భాష ఒక్కటే. కాబట్టి భాషలోంచి కవిత్వాన్ని పుట్టించే ఆల్కెమీ కవికి తెలిసి ఉండాలి.
రెండవ ప్రయోజనం – ఒకోసారి కవి చెప్పాలనుకున్న విషయం మామూలు విషయం కాకపోవచ్చు. కవి ఊహలోంచి పుట్టిన ఒక విచిత్రమైన కల్పన కావొచ్చు. లేదా మాటలలో చెప్పలేని ఒక గాఢమైన అనుభూతి కావొచ్చు. ఇలాటి సందర్భాలలో సాధారణ భాష పనిచెయ్యకపోవచ్చు. అప్పుడు కవి తనదైన భాషని సృష్టించుకుంటాడు.
కవిత్వభాష వ్యవహార భాషకన్నా ఎందుకు భిన్నమైనదో చేరాగారి “కవిత్వభాష” అన్న వ్యాసం మరింత విస్తృతంగా చర్చిస్తుంది. ఈ రెంటికీ అసలు తేడా ఉంటుందా అన్న అనుమానం ఇంకా ఉంటే, ముందు ఆ వ్యాసం చదవమని నా విన్నపం. వ్యావహారిక కవిత్వ భాషలకి తేడా ఉంటుందన్న విషయాన్ని స్థాపించడమే ఆ వ్యాసంలో చేరాగారి ముఖ్యోద్దేశం. ఆ తేడా ఎలాటిదో విశ్లేషించడం, ఇప్పుడు యీ వ్యాసంలో నా ముఖ్యోద్దేశం. కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
వెయ్యేళ్ళకు పైగా చరిత్రగల మన తెలుగు భాషలో, వస్తు రూపాలలో చాలా వైవిధ్యమున్న కవిత్వసంపదే సృష్టించబడింది. ఆ మొత్తాన్నీ ఈ చిన్న వ్యాసంలో పరిగణించడం అసాధ్యం. అందువల్ల యీ వ్యాసం సమగ్రమైనది కాదన్న సంగతి నొక్కి చెప్పక్కరలేదనుకుంటాను. “కవిత్వ భాష” వ్యాసంలో చేరాగారు ప్రస్తావించిన కవిత్వలక్షణాలు చాలా వరకూ చదువుకున్న వాళ్ళు రాసే/చదివే కవిత్వానికే వర్తిస్తాయి. జానపద కవిత్వానికి వర్తించవు. ఈ వ్యాసంలో కూడా నేను చర్చించేది ప్రథానంగా జానపదేతర కవిత్వాన్ని గురించే. జానపద కవిత్వంలోని భాష గురించి వేరే ప్రత్యేకమైన విశ్లేషణ జరగవలసిన అవసరం ఉంది.
ముందుకి పోయేముందు, నా ఆలోచనలని స్పష్టం చెయ్యడానికి, కొన్ని పదాలకి నాకున్న నిర్వచనాలని ఇవ్వడం అవసరం. ఇవి చాలామందికి తెలిసిన పదాలే అయినా, వీటిని చాలామంది చాలా అర్థాల్లో (సరైన నిర్వచనం ఇవ్వకుండా) ప్రయోగించారు. కాబట్టి వీటిని అర్థంచేసుకోడంలో కొంత గందరగోళం ఏర్పడింది. భాషలోని రకాలని సూచించే పదాలివి – గ్రాంధికభాష, వ్యావహారిక/వాడుక భాష, రాసే భాష, మాట్లాడే భాష, కావ్యభాష, కవిత్వభాష.
ముందు అన్నిటికన్నా సులువైన మాట్లాడే భాష – ఇది సాధారణమైన వ్యవహారంలో, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే భాష.
రాసే భాష – దీన్ని సరిగ్గా చెప్పాలంటే, “రచనా భాష” అనాలి.మనకి సారస్వతంలో అనేక రచనా ప్రక్రియలు ఉన్నాయి కదా – వ్యాసం, ఉపన్యాసం, కథ, కవిత్వం, వార్త… ఇలా. ఇవన్నీ రచనలే. వీటికి ఉపయోగించే భాష రచనా భాష. ఇది మాట్లాడే భాషకన్నా ఎందుకు ఎలా భిన్నంగా ఉండగలదో చేరాగారు తన “మాట్లాడే భాషా, రాసేభాషా ఒకటేనా? అవును/కాదు” అన్న వ్యాసంలో విపులంగా చర్చించారు.
గ్రాంధిక భాష – గ్రంధాలలో ఉపయోగించే భాష అన్నది యీ పదానికి వ్యుత్పత్తి అయినా, ఇక్కడ గ్రంథాలంటే, ప్రాచీన గ్రంథాలే (పందొమ్మిదవ శతాబ్దానికి పూర్వం వచ్చిన గ్రంథాలు). మరో విధంగా చెప్పాలంటే, ప్రౌఢ బాల వ్యాకరణాలకి నిబద్ధమైన భాష.
కావ్య భాష – వ్యావహారిక భాషోద్యమ కాలంలో దీన్ని గ్రాంధిక భాషకి పర్యాయపదంగా వాడారు. ప్రాచీన గ్రంధాలన్నీ ప్రథానంగా కావ్యాలే అయినందువలనా, అప్పటికి ఆథునిక భాషలో కావ్యాలు రానందువలనా, యీ పదాన్ని గ్రాంధికభాషకి పర్యాయపదంగా ఉపయోగించడం వల్ల ప్రమాదమేమీ జరగలేదు. కాని యిప్పుడు మనకి ఆధునికభాషలో వచన కావ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి యీ పదాన్ని గ్రాంధికభాషకి పర్యాయపదంగా ఉపయోగించడం సమంజసం కాదు. అసలీ పదాన్ని ఉపయోగించడమే యిప్పుడు అనవసరం.
వ్యావహారిక/వాడుక భాష – ఇది కూడా వ్యావహారిక భాషోద్యమ కాలంలో సృష్టించబడిన పదమే. అయితే ఆ కాలంలోనే దీనికి సరైన నిర్వచనం లేక కొంత గందరగోళాన్ని సృష్టించింది. ఇది మాట్లాడే భాషా? రాసే భాషా? ఎవరు మాట్లాడేది, ఎవరు రాసేది? దీనికీ గ్రామ్యభాషకీ ఉన్న తేడా ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి. చాలా రకాలైన సమాధానాలూ వచ్చాయి. ప్రస్తుతం యీ వ్యాస పరిధిలో వాటన్నిటి గురించీ చెప్పే అవసరం లేదు. నేనీ వ్యాసంలో వ్యావహారిక/వాడుక/సాధారణ భాష అంటే “కవిత్వ భాష” కాని భాష అనే అర్థంలో ఉపయోగించాను. ఇది మాట్లాడే భాష కావచ్చు, కవిత్వేతరమైన రచనా భాషా కావచ్చు.
కవిత్వ భాష – కవిత్వంలో కనిపించే భాష. ఈ కవిత్వం పద్య కవిత్వం కావచ్చు, వచన కవిత్వం కావచ్చు, ప్రాచీన కవిత్వం కావచ్చు, ఆధునిక కవిత్వం కావచ్చు. జానపద కవిత్వమూ కావచ్చు కానీ, నేను పైన చెప్పినట్టుగా యీ వ్యాసంలో నేను ప్రస్తావించిన విషయాలు జానపద కవిత్వానికి వర్తించకపోవచ్చు.
మరొక్క విషయం. కవి నిరంకుశుడు కాబట్టి, కవిత్వంలో మనకి కనిపించే భాషని సూత్రీకరించడం అసంభవం. అంచేత యీ వ్యాసంలో నేను చెయ్యదలచుకున్న పని అది కాదు. కవిత్వ భాషలో కనిపించే కొన్ని సామాన్య ప్రయోగరీతులని (common patterns of usage) కనిపెట్టే ప్రయత్నం మాత్రమే యిది. భాషలోని కొన్ని విశేష అంశాలని తీసుకొని, కవిత్వ భాషలో వాటికున్న ప్రయోజనాన్ని పరిశీలించి, అవి వాడుకభాష కన్నా ఏలా భిన్నమో గమనించి, తద్వారా కవిత్వ భాష ప్రత్యేకతలని గుర్తించే ప్రయత్నమే యీ వ్యాసం.
కవిత్వ భాషలో విశేష అంశాలు
1. పర్యాయపదాలు – మన ప్రయాణాన్ని పదాలనుంచి మొదలుపెడదాం. ఒకే అర్థాన్ని యిచ్చే అనేక పదాలు పర్యాయపదాలని అందరికీ తెలిసిన విషయమే. వీటిని కవిత్వభాషలోనే ఎక్కువగా చూస్తాం. ప్రాచీన కవిత్వం చాలావరకూ పద్యకవిత్వం కాబట్టి, పద్యాలలో ఛందస్సుకోసం యీ పర్యాయపదాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. కొన్ని చోట్ల అలంకారాల కోసం (ముఖ్యంగా శబ్దాలంకారాల కోసం) తగిన పర్యాయపదాన్ని ఏరుకుంటాడు కవి. ఉదాహరణకి “పొలాలనన్నీ, హలాల దున్నీ” అన్నప్పుడు శ్రీ శ్రీ నాగలికి హలం అన్న పదాన్ని వాడింది ఛందస్సు కోసం, ప్రాస కోసమే కదా.
చెప్పే విషయానికి బలాన్ని చేకూర్చడానికి కూడా ప్రత్యేకమైన పదాలని వాడిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకి “వరమున బుట్టితిన్…” అన్న తిక్కన పద్యంలో, “సహజన్ముల ప్రాపుగాంచితిన్, సరసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కినదాననెంతయున్” అని ద్రౌపది అంటుంది. ఇక్కడ కృష్ణుడికి వాడిన పర్యాయపదం “సరసిజనాభ” – అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తే నాకు సోదరుడై కూడా నాకీ గతి పట్టిందే అన్న ద్రౌపది వేదనని యీ పదం స్ఫురింపజేస్తుంది. వాడుకభాషలో కూడా ఒకే అర్థాన్నిచ్చే అనేక పదాలుండ వచ్చు. కానీ సాధారణంగా అవి రకరకాల మాండలికాలకి చెందినవవుతాయి. ఒకే మాండలికంలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఒకటి కన్నా ఎక్కువ ఉండడం అరుదు.
2. నానార్థాలు – ఒకే పదానికి ఉన్న అనేక అర్థాలని నానార్థాలంటాం కదా. కవిత్వంలో నానార్థాలు వాడుకభాషలో కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. అసలీ నానార్థాలు ఎలా పుడతాయన్నది గొప్ప పరిశోధనాంశం. సంస్కృతంలో చాలా పదాలు కొన్ని మూల ధాతువులనుంచి ఏర్పడతాయి. వేర్వేరు ధాతువులనుంచి (లేక ఒకే ధాతువునుంచయినా!) వేర్వేరు వ్యాకరణ కార్యాల ద్వారా ఒకే పదం ఏర్పడినప్పుడు, అలా పుట్టిన పదానికి నానార్థాలు ఏర్పడతాయి. తెలుగులో యిలాటి నానార్థాలు కలిగిన పదాలు చాలా తక్కువ. ఉన్నా అవి మాండలిక భేదం వల్ల వచ్చినవే తప్ప వ్యుత్పత్తి భేదం వల్ల కాదు. ఉదాహరణకి, “గుంట” అన్న పదానికి “గొయ్య” అని అర్థం. దీనికే “ఆడపిల్ల” అని మరో అర్థం ఉంది, ఉత్తరాంధ్ర మాండలికంలో. “చుక్క” కూడా యిలాటిదే.
కవిత్వంలో యీ నానార్థాలని ఎక్కువగా శ్లేష కోసం వాడుకున్నారు పూర్వ కవులు. చిత్రకవిత్వంలో కూడా యీ నానార్థాల ఉపయోగం కనిపిస్తుంది. ఆధునిక కవులు నానార్థాలని ఉపయోగించడం చాలా అరుదైన విషయమే అని చెప్పాలి. దీనికి సినిమా”కవులు?” కొందరు మినహాయింపనుకోండి!
3. సంధి – వాడుకభాషలో ఎక్కువగా కనిపించక, కవిత్వభాషలో (అందులోనూ పద్య కవిత్వంలో) ఎక్కువగా కనిపించే, మరో భాషాంశం “సంధి”. వీటి ప్రయోజనం ముఖ్యంగా కవిత్వానికి ఒక ధారని, ప్రవాహ గుణాన్ని ఇవ్వడం అని నాకనిపిస్తుంది. మన ప్రాచీన కావ్యాలు ప్రథానంగా శ్రవ్య కావ్యాలు. అంటే చదివి ఆనందించడానికి కన్నా, విని ఆనందించడానికి ఎక్కువ అనువైనవి. అందువల్లనే ప్రాచీన కవిత్వంలో శబ్దానికి (ఇప్పటికన్నా) ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. చదివేటప్పుడు పదాలు ఒకదానితో ఒకటి చేరువై ధారగా సాగినప్పుడు శ్రవణ సుభగంగా ఉండి కవిత్వం శ్రోతలను ఆకట్టుకునేది. వాడుక భాషలోనూ సంధులు జరుగుతాయి, కానీ వాటి ప్రయోజనం వేరు. వాడుకభాషలో ఉచ్చారణా సౌలభ్యం కోసమే సంధులు జరుగుతాయి. తెలుగులో జరిగే అచ్సంధిని (అ + అ = అ), సంస్కృతంలోని సవర్ణదీర్ఘ సంధితో (అ + అ = ఆ) పోలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక వచన కవిత్వంలో కూడా ధారాధారితమైన కవిత్వంలో సంధులు ఎక్కువగానే కనపడతాయి. కృష్ణశాస్త్రి, తిలక్, సోమసుందర్ వంటి కవుల కవిత్వంలో వీటిని ఎక్కువ గమనించవచ్చు.
4. సమాసం – సంధి వెంటనే వచ్చేది సమాసం. ప్రాచీన కవిత్వంలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేవి సమాసాలు. తెలుగు పద్యాలలో విరామ యతి లేకపోవడం వల్ల పాదాలకి పాదాలే ఆక్రమించుకున్న సమాసాలు తరచూ దర్శనమిస్తాయి. కవిత్వంలో వీటి ప్రయోజనం ఏమిటీ అని ఆలోచిస్తే, ముఖ్యంగా కనిపించేది ధారే. సంధి కలిగించే శ్రవణ సుభగత్వాన్ని పరిపూర్ణంగా వినియోగించుకొని అనేక పదాలని ఒక సమాసంలో కూర్చినప్పుడు ఒక అప్రతిహత ధార శ్రోతలని ఆకట్టుకొంటుంది. నన్నయ్యలోనూ, శ్రీనాథుడిలోనూ, పెద్దనలోనూ, కొంత వరకూ పోతనలోనూ ఈ పద్య ధార కనిపిస్తుంది. శ్రీనాథుడిని “పద ప్రసిద్ధ ధారాధుని” అని కావ్యాలంకార సంగ్రహకారుడు పేర్కొన్నదిందుకే.
తిక్కనకి మాత్రం పద్య ధార మీద అంత మోజున్నట్టు కనిపించదు. అతడు పెద్ద పెద్ద సమాసాలు వేసిన చోటల్లా, చెప్పే విషయాన్ని ఉద్దీపింపచెయ్యడానికే ఉపయోగించుకున్నాడు, ఎక్కువగా. ఉదాహరణకి ధర్మరాజు గొప్పదనాన్ని చెపుతూ ద్రౌపది చెప్పిన ప్రసిద్ధ పద్యంలో,
“అతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణివేష్ఠి తాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మ సుతుడు“
అని పెద్ద సమాసం ప్రయోగించాడు. ఇది ధర్మ సుతుడు “కేవల మర్త్యుడు” కాదు అన్న భావానికి ప్రోద్బలంగా వేసిన సమాసం.
అయితే యిలా అనేక పదాలతో పెద్ద సమాసాలని కూర్చడం సంస్కృత పదాలతోనే సాధ్యం. తెలుగులో మహా అయితే రెండు మూడు పదాలకన్నా ఎక్కువ కలిసి సమాసంగా రూపొందవు. పూర్వ కవులు సమాసాలని మరొక ప్రయోజనం కోసం కూడా వాడుకొన్నారు, క్లుప్తత కోసం! అదేమిటి చాంతాడంత సమాసాలు క్లుప్తత నెలా యిస్తాయని ఆశ్చర్యపడకండి. ఈ ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది :
తల బక్షఛ్చట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర
స్థలి నిద్రింపనుజూచి, యారెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా
వళి పిండీకృత శాటులన్ సవి దదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గన్ వెస బాఱు వానిగని నవ్వున్ శలిగోప్యోఘముల్
ఇక్కడ “ఉషస్స్నాత ప్రయాత ద్విజావళి” అన్నది ఒక సామాసం. దీని అర్థం ఉషఃకాలంలో (పొద్దున్నే) స్నానంచేసి వెళ్ళిన బ్రాహ్మణులు అని అర్థం. దీన్ని సమాస రహితంగా చెప్పాలంటే పెద్ద వాక్యం అవుతుంది. అలాగే “పిండీకృత శాటులు” అన్న పదానికి పిడచబడిన అంగవస్త్రాలు అని అర్థం. పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిన బ్రాహ్మణులు పిడిచి వదిలివేసిన అంగవస్త్రాలు అన్న భావాన్ని రెండు సమాసాలలో ఎంత క్లుప్తంగా చెప్పాడు రాయలు!
ఆధునిక కవులు సమాసాలని (వీటినిప్పుడు పదబంధాలని అంటున్నారు) మరో విశేషమైన ప్రయోజనానికి కూడా వాడుకున్నారు. విచిత్రమైన పద సంయోజనంతో ఒక నూతన భావాన్ని ఆవిష్కరించే పదబంధాలని సృష్టించడం వీటి ప్రయోజనం. ఈ పదబంధాలు ఆయా కవుల కవిత్వభాషకి ముడిసరుకు కూడా అయిన సందర్భాలున్నాయి. “చిరునవ్వు వెన్నెల”, “మంజువాటి”, “విరహగీతిక” మొదలైన పదబంధాలు భావకవిత్వంలో కనిపిస్తే, “శ్రమైక జీవన సౌందర్యం”, “యంత్రభూతములు”, “నవీనగీతం” మొదలైనవి అభ్యుదయ సాహిత్యంలో కనిపిస్తాయి. “విషాద సుఖము”లాంటి Oxymoronsని కూడా భావ కవిత్వం సృష్టించింది.
5. ఛందస్సు – సంధులూ సమాసాల తర్వాత చెప్పుకోవలసింది ఛందస్సు. ఈ కాలంలో ఛందోబద్ధమైన కవిత్వం చాలా అరుదుగా వస్తోంది కాని, ఒకప్పుడు ఛందస్సే కవిత్వానికి ప్రధానమైన వాహికగా నిలిచింది. ఛందస్సుకీ, కవిత్వానికీ ఎంతలా అనుబంధం ఏర్పడిందంటే, ఛందస్సులో రాస్తేనే అది కవిత్వమవుతుందనీ, ఛందస్సులో రాసేది ప్రతీదీ కవిత్వమే అనీ చాలామంది చాలాకాలం అపోహ పడేంత! ఆధునిక కాలంలో యీ అపోహలు మెల్ల మెల్లగా తొలగిపోయాయనుకోండి. కాకపోతే యిప్పుడు, వాడుక భాషలో రాస్తేనే అది కవిత్వమనీ, వాడుకభాషలో రాసింది ప్రతీదీ కవిత్వమేననీ మరొక అపోహ చాలామందిలో ఏర్పడింది, అది వేరే సంగతి.
ఇంతకీ, ఛందస్సు కవిత్వానికి ఒనగూర్చేదేమిటి? చాలామంది ఠక్కున చెప్పే సమాధానం “లయ”. లయంటే ఏమిటి? దానికీ కవిత్వానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇది గేయాలలో ఉండే గతి (త్రిశ్ర గతి, మిశ్ర గతి, ఖండ గతి మొదలైనవి) అనుకుంటే, అన్ని ఛందస్సులకీ ఇలాటి గతి ఉంటుందా అన్న అనుమానం వస్తుంది. ఆక్షర బద్ధమైన వృత్తాలలో (మత్తకోకిల వంటి వాటిని మినహాయిస్తే) ప్రస్ఫుటమైన లయ ఉండదు. మాత్రాఛందస్సులో లయ ఉంటుంది. వృత్తాలు ఒక ప్రత్యేకమైన నడకని మాత్రం కలిగి ఉంటాయి. ఈ నడక, లయ, కవిత్వానికి శాబ్దికమైన ఒక సొగసును చేకూరుస్తాయి. ఒక పాట ఎలా శ్రోతలకి ఆనందాన్నిస్తుందో, అలాగే ఇదీ శ్రవణానందాన్ని కలిగిస్తుంది.
భాష కవిత్వానికి కేవలం దోహదకారే కాని భాషే కవిత్వం ఎలా కాలేదో, అలానే ఛందస్సు కూడా. ఆధునిక కవిత్వంలో కూడా, మొదట్లో మాత్రా ఛందస్సు ప్రాబల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, గురజాడనుంచి శ్రీశ్రీ వరకూ కూడా. నిజానికి మొదట్లో, వచన కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవిత్వంలో (ప్రత్యేకమైన మాత్రాఛందస్సు లేక పోయినా) ఒక ప్రత్యేకమైన నడకని గమనించ వచ్చు. ఇది ఇంగ్లీషుభాషలోని free-verse (దీనికి “స్వఛ్ఛంద కవిత్వ” మని కొందరి అనువాదం). అంటే నియమితమైన ఛందస్సు లేకపోయినా, వచనంలో ఉండని ఒక ప్రత్యేకమైన నడక ఉన్న కవిత్వం. తరవాత్తరవాత అది పూర్తి వచన కవిత్వంగా మారింది. దీన్ని ఇంగ్లీషులో prose-poetry అంటారు.
ఛందస్సుకి మరొక ప్రయోజనం కూడా ఉంది. అది గుర్తుండిపోయే స్వభావం. ఇది కూడా ఒకప్పుడు కవిత్వానికి చాలా అవసరమైన గుణమే. ఈ కాలంలో చాలామందికి, కవిత్వం మిగిల్చే అనుభూతి మాత్రమే ముఖ్యం, కవితలోని పదాలూ, వాక్యాలూ గుర్తుండాల్సిన అవసరం లేదు.
6. వాక్య శైలి – ఇప్పటి వరకూ చర్చించిన భాషాంశాలన్నీ ఎక్కువగా ప్రాచీన కవిత్వంలో కనిపించేవి, శబ్ద ప్రధానమైనవి. ఈ మధ్య వచ్చిన, వస్తూన్న వచన కవిత్వంలో యివేవీ ప్రస్ఫుటంగా కనిపించవు. ఈ రకంగా చూస్తే, ఆధునిక కవిత్వ భాష, వాడుక భాషకి చాలా దగ్గరగా వచ్చింది అనుకోవచ్చు. అయినా వాక్య శైలిలో మాత్రం ఆధునిక కవిత్వ భాషకీ, వాడుకభాషకీ మధ్య తేడా గమనించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆధునిక కవిత్వంలో కన్నా, ప్రాచీన కవిత్వంలోని వాక్య నిర్మాణం, వాడుక భాషకి దగ్గరగా ఉంటుంది! బహుశా దీనికి కారణం ప్రాచీన కావ్యాలు కథా కావ్యాలవడం కావొచ్చు.
ప్రాచీన కావ్యాల కథాకథనంలో వివిధ శైలులనీ, ఆ శైలులలో వాక్య నిర్మాణ భేదాలనీ మన విమర్శకులు గుర్తించి విశ్లేషించారు. పురాణ (కథన) శైలి ఎక్కువగా ఒక వక్త శ్రోతలకి కథ చెపుతున్నట్టుగా సాగే శైలి. నాటకీయ (సంభాషణా) శైలి దృశ్య కావ్యాలకి దగ్గరగా, అంటే ఎక్కువ సంభాషణలతో సాగుతుంది. ప్రబంధ (ఆలంకారిక) శైలిలో అలంకారాలతో కూడిన వర్ణన ఎక్కువగా ఉంటుంది. నన్నయ్యగారి వాక్యాలు (వచనంలో కూడా) ఎక్కువగా గొలుసుకట్టుగా సాగుతూ ఒక ధార కలిగి ఉంటాయనీ, అదే తిక్కనగారి పద్యాలలోని వాక్యాలు కూడా ఎక్కువ సమాపక క్రియలతో, ఎక్కడికక్కడ తెగిపోతాయనీ మధునాపంతులవారు తన సాహిత్య వాసాలలో వివరించారు.
వీటన్నిటికి భిన్నమైన ఒక విచిత్ర శైలి మనకి కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. దీనికి ఆధునిక కవిత్వ భాషతో కొంత పోలికకూడా ఉందనిపిస్తుంది! చెప్పదలుచుకున్న విషయం ఎంత విస్తృతమైనదైనా, స్వల్ప పదాలలో, ఛందోబద్ధంగా చెప్పే ప్రయత్నంలో రాయలు భాషలో క్లుప్తతని సాధించిన విధానం విచిత్రమైనది. దీనికి రాయలు వాడుకొన్న ఒక పనిముట్టు ఇంతకుముందు చెప్పుకున్న సమాసాలు. ఆది మాత్రమే సరిపోలేదు. అతని పద్యాలలో చాలా చోట్ల వాక్యానికీ వాక్యానికీ మధ్య సంబంధం (భాషాపరంగా) కనిపించదు. ఆ ఖాళీలని తమ ఆలోచనాశక్తి ద్వారా పాఠకులే పూరించుకోవాలి! అందుకే ఇతని పద్యాలకి అన్వయం చాలా కష్టం. ఉదాహరణకి ఓ కథ మొత్తాన్ని ఒక్క పద్యంలో ఎలా చెప్పాడో చూడండి.
విల్లుం దానును భిల్లుడొక్కడరుగన్, విందింట – దుగ్ధాన్నమున్
భిల్లుండన్యుడు పెట్ట, నారయుడుకన్ వీక్షించి దొబ్బంచు వా
డెల్లన్ వమ్ముగ జేసి తన్ననుపరా నెందే దెగం జూడగా
నుల్లంబై చననంపు నార చెడు నా నూహించి పోనంపడే
ఇది వచనంలో రాస్తే, ఇలా ఉంటుంది :
ఒక భిల్లుడు తన వింటితో వెళితే, విందు జరిగిన ఇంట్లో పరమాన్నాన్ని వెరొక భిల్లుడు పెడితే, నార ఉడుకుతూ ఉంటే చూసి మాంసమనుకొని, వాడు మొత్తమంతా వమ్ముచేసి, తనని పంపించడానికి వచ్చినప్పుడు ఎక్కడైనా చంపుదామని అనుకుంటే, “నార చెడుతుంది తిరిగి పంపు” అని అంటే, అర్థంచేసుకొని పంపించేసాడు కదా.
ఏమైనా అర్థమవుతోందా! ఖాళీలు పూరించుకుంటే తెలిసే అసలు కథ ఇది:
ఒక భిల్లుడు మరొక భిల్లుడింటికి వెళ్ళాడు. అక్కడా భిల్లుడు పెట్టిన పరమాన్నాన్ని తిని, వంటింట్లో ఉడుకుతున్న నారని చూసాడు మొదటి భిల్లుడు. దాన్ని మాంసం అనుకున్నాడు. “అరే! నన్నింటికి ఆహ్వానించి, మాంసం పెట్టకుండా వీడొక్కడే తినేద్దామనుకున్నాడు. ఎంత అన్యాయం!” అని, ఇచ్చిన ఆతిథ్యమంతా మరచిపోయి ఆ రెండవ భిల్లుడు మీద పగ పెంచుకున్నాడు. ఆ కోపంతో, తనకు వీడ్కోలు చెప్పడానికి రెండవ భిల్లుడు వచ్చినప్పుడు, వాడిని కొంత దూరం తీసుకువెళ్ళి చంపేద్దామనుకున్నాడు! తోవలో వెళుతూ, “ఇంక నేను వెనక్కి పోవాలి. ఇంట్లో ఉడుకుతున్న నార చెడిపోతుంది” అని ఆ రెండవ భిల్లుడు అనేసరికి మొదటి భిల్లుడికి తను పొరబడ్డానన్న విషయం అర్థమై, చంపకుండా వాణ్ణీ వెనక్కి పంపించేసాడు.
ఇదీ అసలు కథ! ఇలా రాస్తే కవిత్వమైపోతుందని నా ఉద్దేశం కాదు కాని, తన కావ్యంలో రాయలు ఉపయోగించిన ఒక ప్రత్యేక శైలి యిది. ఆధునిక కవిత్వంలో కూడా యిలా వాక్యాల మధ్య ఖాళీలు ఉండడం, వాటిని పాఠకులే పూరించుకోవడం మనం చూడవచ్చు. రాయల శైలి సాధించే ప్రయోజనం భాషలో క్లుప్తత, ఛందోబద్ధత. ఆధునిక కవిత్వంలో ఈ శైలికి క్లుప్తతతో బాటు, మరో ప్రయోజనం కూడా ఉంది – కవి చెప్పదలుచుకున్న విషయం మాటలలో చెప్పలేనప్పుడు, దాని చుట్టూ ఉన్న విషయాన్ని చెప్పి, ఆ చెప్పలేని విషయాన్ని పాఠకుల ఆలోచనకీ, అనుభూతికీ వదిలివెయ్యడం ఉదాహరణకి ముకుంద రామారావుగారి “ఏకాంత వేళ” అన్న యీ కవితలో, చెప్పినదాని కన్నా చెప్పనిదే ఎక్కువ:
గతాగతాలు
ఊహాతీత ఉదయాలు
ఆలోచనంతా పాకిన
అల్లకల్లోల ప్రశాంతం
దినాంతపు ఏకాంతం చీకటి.
ఈ శైలికి పరమావధి హైకు అని చెప్పవచ్చు.
ఆధునిక కవిత్వంలో ఎక్కువగా కనిపించే మరొక వాక్య నిర్మాణ పద్ధతి – సమాపక క్రియ లేని వాక్య ప్రయోగం. క్రియ విశేషణంలో భాగంగా మారవచ్చు లేదా పూర్తిగా లోపించవచ్చు. కవిత్వాన్ని మామూలు వచనంతో వేరు చేసే సాధనంగా దీన్ని వాడుకున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి అఫ్సర్ “డె జా వూ” కవితలోని యీ పంక్తులు చూడండి:
నిన్న రాత్రే
మీతో కూర్చున్నట్లుగా,
మాట్లాడినట్లుగా,
మీతో కలిసి అన్నం తింటున్నట్టుగా,
మీతో మేడమీద బిచానా వేసినట్టుగా,
ఏది అవునో ఏది కాదో?
ఇక్కడ అయిదవ పాదం తరవాత “అనిపిస్తోంది” లాంటి క్రియా పదం ఉండాలి, వ్యాకరణ రీత్యా. లేకపోయినా అర్థమవుతోంది కాబట్టి అది అనవసరమైన పదం అని తీసేసారేమో.
ఆధునిక కవిత్వంలో ఉన్న విస్తృతి, వైవిధ్యం కారణంగా, ప్రాచీన కవిత్వంలో లాగా శైలీ రీతులని వింగడించడం కష్టమైన పని. అయినా, ఆత్మాశ్రయ ధోరణి, ఉపన్యాస ధోరణి, అధిక్షేప ధోరణి, అన్యాపదేశ ధోరణి మొదలైన రకాలగా విభజించే ప్రయత్నం చెయ్యవచ్చు. ఆత్మాశ్రయ ధోరణి అంటే కవి తన గురించి మాత్రమే చెప్పడం కాదు, తనలో తాను మాట్లాడుకున్నట్లు రాయడం. ఉదాహరణకి శ్రీశ్రీ “కవితా ఓ కవితా” ఈ ధోరణిలో సాగుతుంది. ఉపన్యాస ధోరణి అంటే పాఠకులని నేరుగా ఉత్తేజ పరుస్తూ, ఉద్బోధిస్తున్న రీతులో సాగే కవిత్వం. ప్రసిద్ధమైన శ్రీశ్రీ కవితలలో చాలా కవితలు యీ కోవకి చెందుతాయి – “మరో ప్రపంచం”, “జగన్నాథ రథచక్రాలు”, “ప్రతిజ్ఞ” ఇలా చాలా. అధిక్షేప ధోరణిలో ఉండేది అధిక్షేపం, అది ఎవరిగురించయినా కావొచ్చు. ఇందులో తీవ్రతబట్టి అది హేళన కావచ్చు, తిట్లూ కావచ్చు. చెప్పే విషయాన్ని అన్యాపదేశంగా, వ్యంగ్యంగా చెప్పడం అన్యాపదేశ ధోరణి.
ఒకొక్క ధోరణికి అనువైన వాక్య శైలిని గురించి విశ్లేషించవచ్చు. ఉదాహరణకి ఉపన్యాస ధోరణిలో ఉండే కవిత్వం శబ్దాన్ని ఆశ్రయించ వలసి వస్తుంది. లేకపోతే, ఉపన్యాసానికీ ఉపన్యాసధోరణిలోని కవిత్వానికి తేడా గుర్తించడం కష్టం. ఇలా ఆధునిక కవిత్వంలోని విభిన్న ధోరణులని పరిశీలించవచ్చు.
వచన కవిత్వంలో వాక్య నిర్మాణాన్ని గురించి “కవిసేన మేనిఫెస్టోలో” శేషేంద్ర శర్మ గారు కొంత చర్చించారు. మామూలు భాషలోని వాక్యం కవితలో ఎలాటి మార్పు పొందగలదో ఇచ్చిన యీ వివరణ ఆలోచనార్హం:
కవిత్వంలో వాక్యరచన మొదట శబ్ద సమూహ సంక్షేప ప్రక్రియను అమలు జరుపుతుంది. వాక్యాన్ని ఎంత సంక్షేపం చెయ్యడానికి వీలుంటుందో అంతవరకూ శబ్దాలు తీసివేస్తూ పోతుంది ఈ ప్రక్రియ. అట్లాగే చివర, మొత్తం పద్యంలో ఉన్న వాక్యబృందాన్ని కూడా ఎంతవరకు వీలుంటే అంతవరకూ తగ్గించుకుపోతుంది – ఇక తీసివేస్తే మూలపదార్థానికే దెబ్బ తగులుతుందన్నంత వరకూ శబ్దాలనూ, వాక్యాలనూ జారవిడుస్తూ పోవాలి.
రెండవది వాక్య రచనా వ్యూహం – అంటే వాక్యంలో కర్త కర్మ క్రియలు తదితర శబ్దాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే కవి ఊహలోకి దిగిన చిత్రం సమగ్రంగా భాష అనే బ్రోమైడ్ పేపర్ మీదికి దిగుతుందో ఆ రచనా వ్యూహం. దీనికి శబ్దతత్వ వైదుష్యం కావాలి. (ప్రబంధ భాష అనుకోకండి, కొంపదీసి – ఇదంతా వర్తమాన భాషను గురించే). శబ్దాలూ వాటి స్థానాలూ స్వరూపాలూ వాటి శ్రవ్యస్వభావ ప్రభావాలూ వాటి పరంపరాగత ప్రయోగ వ్యవహారం చేత వాటికి సమాజంతో ఉన్న సాంస్కృతిక సంబంధబాంధవ్యాలూ ఇత్యాది కుశాగ్రవత్ సూక్ష్మాలు, కవి, అధ్యయన అనుభవ ఊహశాలితల చేత గ్రహించి ఉండాలి.
7. వ్యంజన – ఇన్ని భాషాంశాలని పరిశీలించి, ముఖ్యమైన లక్షణాన్ని గురించి ఇప్పటిదాకా ముచ్చటించనే లేదు! ప్రాచీన కవిత్వం నుండి ఆధునిక కవిత్వం దాకా, ఏ కవిత్వమైనా ఉపయోగించుకొనే ప్రాథమిక భాషా లక్షణం ఇది. ఒక పదానికి, అది ప్రయోగించబడిన సందర్భాన్నిబట్టి, వాక్య నిర్మాణాన్నిబట్టి, రచించిన కవిబట్టి, చదివే పాఠకునిబట్టి, సాధారణ అర్థానికి మించిన విశేష అర్థస్ఫురణ కలిగే శక్తి ఉంది. దీనినే మన పూర్వ ఆలంకారికులు వ్యంజన అన్నారు. భాషలో ఉండే అక్షరాలూ పదాలూ పరిమితమైనవైనా, ఆ భాష ద్వారా అనంతమైన సాహిత్యాన్ని సృష్టించ గలిగే అవకాశం ఈ వ్యంజన శక్తి వల్లనే సాధ్యం. అసలు ఒక పదానికే అనంతమైన వ్యంజనార్థాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇంతకుముందు పేర్కొన్న నానార్థాల వంటిది కాదిది. వ్యంజన, పదం ప్రయోగించబడిన సందర్భం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక మాష్టారు అల్లరిచేసే కుర్రాడితో, “ఒరేయ్ ! నీకు నా బెత్తంతో పెళ్ళిచేస్తాను.” అన్నప్పుడు, అక్కడ పెళ్ళికి ఉన్న అర్థం సాధారణార్థం కాదు కదా!
భాషకున్న యీ లక్షణమే కవిత్వ భాషకి పునాది. వాడుక భాషలో కూడా వ్యంజనని వాడుతూ ఉంటాం. కవిత్వంలో అది చాలా విరివిగా ఉంటుంది. ఈ శక్తి పదాలకే పరిమితం కాదు. వాక్యాలకి కూడా వ్యంజనా శక్తి ఉంది. ఉదాహరణకి “ఆమె బతికే ఉంది కానీ చనిపోయి జైలు శిక్ష అనుభవిస్తోంది” అనే వాక్యం విడిగా చూస్తే అర్థరహితం. అదే కొప్పర్తి రాసిన “తల్లి” అనే యీ కవితలో ఎంత గొప్ప అర్థాన్నిస్తోందో గమనించండి!
ఆమెకు
ఇద్దరు కొడుకులు
తమ్ముడు
అన్నను తుపాకీతో కాల్చాడు
అన్న మరణించాడు
తమ్ముడు జైలుకెళ్ళాడు
ఆమె
బతికే ఉంది
కానీ చనిపోయి
జైలు శిక్ష అనుభవిస్తోంది
ఇలాటి వ్యంగ్యవైభవం ప్రాచీన కవిత్వంలో తిక్కన భారతంలో ఎక్కువ చూడవచ్చు. కీచక వధ ఘట్టంలో భీముడి సంభాషణ దీనికి చక్కని ఉదాహరణ:
ఇట్టివాడవు కావున నీవు నిన్ను
బొగడి కొనదగు నకట నా పోల్కి యాడు
దాని వెదకియు నెయ్యడనైన నీకు
బడయ వచ్చునె యెఱుగక పలికితిట్లు
నా యొడలు చేర్చినప్పుడు
నీ యొడలేట్లగునొ దాని నీవెఱిగెదు, న
న్నే యబలలతోడిదిగా
చేయ దలంచితివి, తప్పు సేసితి కంటే
నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి బోవు వాడవె! యయినం
దనువే బడసిన ఫలమే
కనియదవిదె చిత్తభవ వికారములెల్లన్
దీని గురించి వివరిస్తూ బేతవోలు రామబ్రహ్మంగారు తన “పద్యకవితా పరిచయం – నన్నయ్య నుంచీ కంకంటి దాకా” అన్న పుస్తకంలో ఇలా అన్నారు:
శ్లేషలు లేవు. సంస్కృతపదాలు లేవు. సమాసాలు లేవు. అన్నీ పొడిమాటలు. కానీ వాక్యనిర్మాణంతోనూ, కాకుస్వరంతోనూ – ఉచ్చరించే విధానం – వ్యంగ్యార్థం సులభంగా స్ఫురిస్తోంది. రంగస్థలం మీద మూడుపాత్రలుంటే అందులో మొదటి పాత్ర అంటున్న మాటలు రెండవ పాత్రకి ఒకలాగా, మూడవపాత్రకి మరోలాగా అర్థమవ్వడం, ఎవరికి స్ఫురించింది వారికి సరిపోవడం గొప్ప నాటకీయత. దీన్ని వక్రోక్తి అంటారు. డ్రెమెటిక్ ఐరనీ అంటారు. సన్నివేశాన్ని బట్టి సంభాషణలలో ఇది స్ఫురిస్తుంది.
వ్యంజనని అర్థం చేసుకోలేని పాఠకులు కవిత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి “పైటని తగలెయ్యాలి” అని జయప్రభగారు అన్నప్పుడు దాని వాచ్యార్థాన్ని (సాధారణ అర్థం) తీసుకుంటే, చాలా గందరగోళానికి దారితీస్తుంది.నిజానికి అక్కడ పైట పైటా కాదూ, తగలెయ్యడమంటే నిప్పుపెట్టి కాల్చడమనీ కాదు! అయితే యీ విషయాన్ని జయప్రభగారు తన కవితలో వాచ్యంగానే చెప్పారనుకోండి, అది వేరే సంగతి.
భాషకున్న యీ వ్యంజన శక్తిని ఉపయోగించుకొనని కవిత్వం అసలు కవిత్వమే కాదని చెప్పవచ్చు.
10. భాషా వైఫల్యం – ఇంతవరకూ కవిత్వ భాషకుండే విశేషాలని చూసాం కదా. కొన్ని సందర్భాలలో ఇంత ప్రత్యేకమైన కవిత్వభాషా కూడా నిరుపయోగం అయిపోయే అవకాశం ఉంది. అతి సున్నితమైన భావాన్ని కానీ, అతి గాఢమైన అనుభూతిని కానీ వ్యక్తం చెయ్యవలసి వచ్చినప్పుడు ఒకోసారి భాష విఫలమవుతుంది. అప్పుడు ప్రత్యేకమైన భాషేదీ పనికిరాదు. అతి సహజంగా, అతి సాధారణమైన భాషలో ఆ అనుభూతి వ్యక్తమైతేనే అది గుండెను తాకుతుంది. అనుభూతిలో ఉన్న గాఢత కారణంగా ఇది జరుగుతుంది. ఏదైనా విశేషంగా చెప్పే ప్రయత్నం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే యిది అరుదైన విషయమనే చెప్పాలి. దీనిగురించి ఆలోచించినప్పుడల్లా నాకు గుర్తుకువచ్చేది భారతంలో ద్రౌపది ఆవేదనా, కసీ చిత్రించే, “ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన ఆ చేయి తొలుతగా…” అన్న తిక్కనగారి పద్యం. ఇందులో కవిత్వ భాష ఏమీ లేదు. ఉన్నది అతి సహజమైన, గాఢమైన భావోద్వేగం.
ఆధునిక కవిత్వంలో ఇలాటి కవిత్వాన్ని చూసిన గుర్తు నాకు లేదు.
11. విధ్వంసం – ఇంతవరకూ భాషనీ, అందులో ఉన్న విశేష లక్షణాలనీ కవిత్వంలో ఎలా ఉపయోగించుకోవచ్చునో పరిశీలించాము. కవిత్వభాషా పరిమితిని కూడా గమనించాము. ఆఖరుగా, భాషని ధ్వంసం చెయ్యడం ద్వారా కూడా కవిత్వాన్ని సృష్టించవచ్చని నేనంటే మీరు నమ్ముతారా? నమ్మాలి! ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి భాషా విధ్వంసం ద్వారా కవిత్వాన్ని సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. లేదు, అసలు అలాటిది కవిత్వమే కాదు పొమ్మంటే నేననగలిగేదేమీ లేదనుకోండి!
భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసిన పఠాభి “ఫిడేల్ రాగాల”లో యీ భాషా విధ్వంసాన్ని చూడవచ్చు. పఠాభి తిరుగుబాటు పూర్తి అవహేళనా ధోరణిలో సాగింది. అందులో భాగంగానే భావకవిత్వంలోని భాషని కూడా అవహేళన చేసారతను. అయితే యిది పేరడీ కాదు. తన అపహాస్యమనే దుడ్డుకఱ్ఱతో భావకవిత్వంలో కనిపించే గ్రాంధికభాషా పోకడల నడ్డి విరగ్గొట్టినట్టే అనిపిస్తుంది అతని కవిత్వాన్ని చదివితే.
“అనుసరిస్తాను నవీన పంథా; కానీ
భావకవిన్మాత్రము కాన్నే; నే
నహంభావకవిని”
అని అన్నా,
“తగిలింపబడియున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన ; పయిన
అనవసరంగా అఘోరంగా! ”
అని అన్నా, అతను చేసిన గ్రాంధిక భాషా విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది!
మొత్తం భాషనీ, భాషా సూత్రాలనీ విధ్వంసం చేసిన కవిత్వం అధివాస్తవిక (surrealist) కవిత్వం. వ్యక్తిని బంధించే ప్రపంచ వాస్తవికత మీద తిరుగుబాటుకి సూచనగా, భాషా వ్యాకరణాల మీద తిరుగుబాటు చేసి, అధివాస్తవిక కవిత్వం పుట్టింది. కాని, తెలుగులో యిది అంతగా ప్రచారం పొందలేదు.
ఉపసంహారం
వేల్చేరు నారాయణరావుగారు తన “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న వ్యాసంలో చెప్పిన యీ కింది మాటలు గుర్తుచేసుకోకపోతే యీ వ్యాసం అసంపూర్ణమవుతుంది.
కవిత్వం కూడా భాషే. కాకపోతే అదొక విశేష రూపంగల భాష. నిత్య వ్యవహారంలో ఉన్న భాషవల్ల కలగని విశేష ఫలితాలు యీ భాషవల్ల కలుగుతాయి. భాషకి నియమాలున్నాయి. వాటిని వ్యాకరించ వచ్చు. కవిత్వం కూడా వ్యాకరించడం సాధ్యమనీ, మామూలు భాషకిలేని కొన్ని అదనపు లక్షణాలు కవిత్వానికి ఉన్నాయనీ నిర్ధారించ వచ్చుననీ ప్రతిపాదించడం సహేతుకం.
కవిత్వభాషని వ్యాకరించడం సాధ్యమని నేననుకోను కానీ, కవిత్వ భాషలోని ఆ అదనపు లక్షణాలని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. ఆ దిశగా వేసిన చిన్న అడుగే యీ వ్యాసం. కవిత్వంలో భాష గురించి యింకా విపులమైన పరిశోధన జరగాల్సి ఉంది. ముఖ్యంగా, ఆధునిక కవిత్వంలోని భాష గురించి చాలా పరిశీలన జరగాలి. వివిధ కవిత్వ ధోరణులలోని భాషా ప్రయోగ వైవిధ్యము, కవిత్వంలో మాండలిక పద ప్రయోజనము, కవిత్వంలో క్లుప్తత సాధించే విధానము, వచన కవిత్వంలో పాద విభజన ప్రయోజనము (నాకు తెలిసి దీనికి ఎలాటి ప్రయోజనమూ లేదు), శబ్దం నుంచి నిశ్శబ్దం దిశగా ప్రయాణిస్తున్న కవిత్వంలో మారుతున్న భాషాప్రయోజనము మొదలైన అనేక విషయాలగురించిన పరిశీలన విశ్లేషణ అవసరం. ఆధునిక కవిత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకొనే దిశగా విమర్శకులకూ, మరింత మంచి కవిత్వాన్ని సృష్టించే దిశగా కవులకూ కూడా యీ పరిశోధన ఉపయోగపడుతుందని నా నమ్మకం.
ఉపయుక్త గ్రంధాలు
- భాషాంతరంగం – ఆచార్య చేకూరి రామారావు
- కవిత 2006 – కవితా సంకలనం
- కవిసేన మేనిఫెస్టొ – గుంటూరు శెషేంద్ర శర్మ
- పద్య కవితా పరిచయం, నన్నయ నుంచి కంకంటి దాకా – బేతవోలు రామబ్రహ్మం
- సాహిత్య వ్యాసాలు – మధునాపంతుల సత్యనారాయణ
- తెలుగులో కవితా విప్లవాల స్వరూపాలు – వేల్చేరు నారాయణ రావు
- నేటి కాలపు కవిత్వం, తీరుతెన్నులు – తమ్మినేని యదుకుల భూషణ్