కోపం

“ఎన్నిసార్లు చెప్పాలి ఈ నెంబర్ పిలవొద్దని,” కాంతం గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసింది.

కాంతానికి పట్టలేనంత కోపం వచ్చింది. ఒళ్ళు పొట్లకాయలా విచ్చిపోడానికి సిద్ధంగా వుంది. మామూలుగా కాంతం శాంతమూర్తే. ఆ మాటే చాలా మంది అంటారు కూడానూ. “మీరెప్పుడూ ఎంచక్కా నవ్వుతూ వుంటారు. మీకు కోపం రాదాండి?” అని. కానీ టెలీమార్కెటీర్ల విషయంలో మాత్రం కాంతం ఉగ్ర నరసింహమూర్తి. కాంతానికి పట్టరానంత కోపం తెప్పించే వారిలో తొలివరుస జనాలు టెలీమార్కెటర్లు. ఎన్ని విధాల ఎన్ని భాషల్లో ఎన్ని స్వరాల్లో విన్నవించుకున్నా పట్టు విడువని భట్టివిక్రమార్కులు. అందుకే నిస్సిగ్గుగా వాళ్ళమీద అరవడం అలవాటు చేసుకుంది. అప్పుడప్పుడు అవాచ్యాలు కూడా తెలుగులోనూ, సంస్కృతంలోనూ, ఇంగ్లీషులోనూ విసుర్తూ వాళ్ళని వదిలించుకోడానికి నానా అవస్థలు పడుతోంది. ఆ చిరాకుతో పావుగంటసేపు మరే పని చెయ్యలేకపోయింది. పరిష్కరించుకోలేని చిక్కుసమస్య అయిపోయింది.

అలాటి సుదినాలలోనే ఒకరోజు ఇండియా నించి తమ్ముడు ఫోన్ చేశాడు కూతురి పెళ్ళి నిశ్చయం అయింది రమ్మని. కారణాలేమైతేనే ఒకటిన్నర దశాబ్దం అయింది తను ఇండియా వెళ్ళి. అంచేత ఓమారు వెళ్ళొస్తే బావుణ్ణనిపించింది. టెలీమార్కెటర్లే కారణం అనడానికి లేదు కాని ఆ సొద కొన్నాళ్ళపాటు తప్పుతుంది కదా అనుకొని సంతోషించకపోలేదావిడ.

అలా కాంతం ఇండియా ప్రయాణం నిర్ణయం అయిపోయింది. తను హైదరాబాదు ఎయిర్‌పోర్ట్‌కు రాలేను కాని జోగిబాబుని పంపిస్తానని వుత్తరం రాశాడు తమ్ముడు. కాంతానికి “జోగిబాబు” ఎవరో అర్థం కాలేదు కాని ఎవరో ఒకరు వస్తారు కదా అని తృప్తి పడి వూరుకుంది.

కాంతం హైదరాబాద్ లో దిగి కష్టములవారిచేత అవుననిపించుకొని బయటపడేసరికి ఓ గంటన్నర పట్టింది. చాలా పెద్దమనిషితరహాగా వున్నారాయన. చేయెత్తు మనిషి. పూర్వ కాలపు పద్ధతిలో పంచె, లాల్చి, కండువా ధరించి నుదుట చిన్న కుంకుమ బొట్టుతో చొక్కాలూ, పాంట్లు వేసుకున్న వారి మధ్య విలక్షణంగా వెలిగిపోతున్నారాయన. ఆయనకి కాంతాన్ని గుర్తు పట్టడం కూడా అంత తేలిక అయింది. ఎంత తెలుగువారి ఆడపడుచైనా అమెరికాలో పదిహేనేళ్ళ నివాసం తాలూకు కళల మూలాన ఇట్టే తెలిసిపోతోంది విదేశీ వాలకం. అలా ఇద్దరూ ఒకర్నొకరు పోల్చేసుకున్నాక బయటకి నడిచారు. చక్రాలున్న సూటికేసుని ఇలా తే అని కాంతానికి సంజ్ఞచేసి అందుకున్నారాయన, ఫరవాలేదండి అంటున్నా వినిపించుకోకుండా.

ఇద్దరూ ఎక్కాక ఆటో బయల్దేరింది. ఇటు పోనిస్తావేం, ఇక్కడ ఎందుకు ఆపావు, అంటూ ఆయన ఆటోడ్రైవరుతో దారిపొడువునా వాదిస్తూనే వున్నారు. దారి ఆటో డ్రైవరుకు తెలీదో జోగిబాబుకి తెలీదో కాంతానికి అర్థం కాలేదు. ఆటో బిష్ గారి కాంప్లెక్స్ ముందు ఆగింది. బిష్ గారి ఫ్లాట్ అంతా అమెరికా పరిమళాలు విరజిమ్ముతోంది.

విష్ణువర్ధనమూర్తి వురఫ్ బిష్ పదేళ్ళ కిందట ఒక ఏడాది పాటు అమెరికాలో వుండి వచ్చారట. ఆరేళ్ళ క్రితం జీనీ వురఫ్ సరోజినితో పెళ్ళయింది. ఆవిడ అమెరికా వెళ్ళలేదు కానీ బిష్ ఆవిడకి అమెరికన్ జీవన సరళి పాఠాలు గట్టిగా చెప్పేశాడు పెళ్ళైన మర్నాడే కూచోబెట్టి. ఇంటినిండా ప్లాస్టిక్ ఫోర్కుల నించి పాప్ సీడీల వరకూ, కార్నింగ్‌వేర్ (జోగిబాబు భాషలో పింగాణి బొచ్చెలు) మొదలు టార్గెట్ స్టోరు దుప్పట్ల వరకూ ఆ ఇంట్లో గత దశాబ్దం అమెరికా నాటి ఫేషన్లన్నీ కనిపిస్తున్నాయి.

కాంతం జోగిబాబు వెనకాలే హాల్లో అడుగెట్టి అయోమయంగా చూడసాగింది. జోగిబాబు సూట్‌కేస్‌తో కుడివేపునున్న చిన్న గదిలోకి దారి తీసారు. కాంతం అటూ ఇటూ చూసి ఎదురుగా వున్న సోఫా అంచున బిక్కు బిక్కుమంటూ కూర్చుంది. ఓ అరగంటైన తరువాత జోగిబాబు వచ్చి “పద, పడుకో” అన్నారు. కాంతం మాటాడకుండా అటు కదిలింది. అప్పటికి టైం నాలుగవుతోంది. కాంతం పడుకుంది కాని నిద్ర పట్టలేదు. ఆరవుతుంటే అవతల గదిలో మనుషుల అలికిడి విని తను కూడా లేచింది.

జోగిబాబు వంటింట్లో ఫిల్టరులో నీళ్ళు క్ఆచి పోచి, కాంతానికి బాత్‌రూం చూపించారు.

జీనీ కూడా లేచినట్టుంది పడకగ్గదిలోంచే “బంటూ, టైమైపోతోంది” అంటూ కేకేసింది.

కాంతం ఉలిక్కిపడింది ఆ కేకకి.

జీనీ మరో రెండు రౌండ్లు ప్రసారం చేసిన తరువాత బంటు అదే స్థాయిలో అరిచాడు వస్తున్నానని. ఆ తరువాత గంటలోనూ ఆ పిల్లాడిని స్కూలికి సిద్ధం చెయ్యడం జోగిబాబు వంతు. ఆయన మాటలు “స్నానం చెయ్యి”, “టిఫినుకు రా”, “నీ సంచీ ఏదీ” లాటివి ఆ పిల్లాడికే కాదు పక్కవాళ్ళకి కూడా వినిపించి వుంటాయి అనిపించింది కాంతానికి. మొదట ఒకటి రెండు సార్లు వులిక్కిపడింది కాని త్వరలోనే అలవాటయిపోయింది. ఆ హడావుడిలో తానూ జీనీ పలకరించుకోడం లాంటిది జరగలేదు.

ఎయిర్‌పోర్ట్ నించి ఇక్కడికెందుకొచ్చారో, గుంటూరుకు రైలెప్పుడో కాంతానికి జోగిబాబు చెప్పలేదు. తానే అడగటానికి బెరుగ్గా వుంది. జోగిబాబు పన్నెండు గంటలకి బయటికి వెళ్ళి ఆరు గంటలకు వచ్చారు. మొత్తమ్మీద ఆయన మామూలుగా మాట్లాడ్డం వినలేదు తను. అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!

సాయంత్రం జీనీ ఆఫీసునించి రాగానే తిన్నగా వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి కాంతానికీ జోగిబాబుకీ చెరో కప్పు అందించి పడగ్గదిలోకి వెళ్ళిపోయింది. పది నిమిషాల తరువాత “బంటూ, కమాన్ హరీ అప్” అంటూ కేకేసి, ఏ గోడకో చెప్తున్నట్టు “ఇదొక్కటే నేను వాడితో గడుపగల సమయం” అంది ఇంగ్లీషులో.

“నువ్వు కూడా వెళ్ళు” అన్నారు జోగిబాబు కాంతంతో

“ఎక్కడికి?”

“పార్కుకి” అన్నారాయన.

జీనీ మాట ఆయన విన్నారో, లేదో ఆయనకి అర్థం అయిందో లేదో కాంతానికి అర్థం కాలేదు. ఆవిడ పిల్లాడితో గడిపే సమయం అంటుంటే, తను వెంటబడడం ఏం బావుంటుంది. పైగా “మీరూ రండీ” అని ఆవిడ అన్లేదు.

కాంతం మాటాడలేదు, కదల్లేదు.

“లే, వెళ్ళమంటే కదలవేం?” కసురుకున్నాడాయన.

“తలనొప్పిగా వుంది. పడుకుంటాను” అనేసి పక్కగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

ఒక రోజంతా గడిచిపోయింది. తాము గుంటూర్ ఎప్పుడు వెళ్తారో అసలు వెళ్తారో వెళ్ళరో కూడా తెలీడం లేదు ఈ జోగిబాబు వరస చూస్తుంటే.

ఆఖరికి తనే తెగించి “గుంటూరికి రైలెన్ని గంటలకి” అని అడిగింది.

“రైళ్ళకేమిటి చాలా ఉన్నాయి” అన్నారాయన.

“మనం ఏ రైల్లో వెళ్తాం?”

“ఏం, ఇప్పుడే వెళ్తావా? పద రైలెక్కించేస్తాను” అన్నారాయన కసురుకుంటూ.

కాంతం తెల్లబోయి తేరుకొని “అది కాదు” అంటూ నసిగింది.

ఇంటావిడకి తన రాక చిరాగ్గా వుందన్న సంగతి స్పష్టంగానే తెలుస్తోంది. జోగిబాబుకి అది అర్థం అయిందా, లేదా అవనట్టు నటిస్తున్నారా అన్నదే కాంతానికి తెలియడం లేదు.

చిన్న నాటి స్నేహితురాలు రాధ వుంది. పోనీ వాళ్ళింటికెళ్ళి ఓ పూట గడిపినా బావుండునని వుంది. కానీ ఎలా? జోగిబాబుని అడగాలి. ఆయనతో మాటాడడమే ఒక యజ్ఞం.

ఆఖరికి గుండె చిక్కబట్టుకుని “ఈ వూళ్ళో మా ఫ్రెండుంది” అంది ఆయనతో.

ఆయన సరే అన్నట్టు తలూపేరు. ఓ గంట తరువాత “వాళ్ళెక్కడుంటారు?” అని అడిగారు.

బంజారాహిల్ల్స్ అని తెలుసు గానీ వివరాలు తెలీవు. “ఫోన్నెంబరుంది” అంది. తీరా పిలిస్తే ఆ నెంబరు పని చేయలేదు.

“మీ ఫ్రెండు ఇంటాయన పేరేమిటి?”

“సుబ్బారాయడు”. అప్పటికి అంతే. ఆ తరువాత బయటికి వెళ్ళి రాత్రి తొమ్మిదిగంటలకి వచ్చారు.

“సుబ్బారావు నెంబరు కనుక్కోబోతే, ఆ పేరుతో డైరెక్టరీలో పాతికున్నాయి,” అన్నారాయన కాంతంతో. “సుబ్బారావు కాదండీ, సుబ్బారాయుడు.” “సరిగ్గ చెప్పకపోతే నా కెల్లా తెలుస్తుంది?” “నేను సుబ్బారాయుడనే చెప్పానండీ,” అంది కాంతం నెమ్మదిగా. “నేను మందబుద్ధిని. నాకు స్పష్ఠంగా చెప్పాలి. నీకు తెలుగు అర్థం అవుతుందా?” అన్నారాయన విసురుగా. కాంతం తెల్లబోయి వూరుకుంది. ఎందుకొచ్చిన సంత; మాటకి మాట తెగులు….

మొత్తం మీద మర్నాటి సాయంత్రానికి కనుక్కున్నారు. ఈ లోపున కనీసం పదిసార్లు జోగిబాబు కాంతం తెలుగు భాషా జ్ఞానం గురించి ప్రశ్నించారు. ఆఖరికి అసలు ఆయనకి తెలుగు వచ్చునా అని అనుమానం వచ్చింది,తనకి. తనేకాదు, ఎవరు చెప్పిందీ ఆయన వినిపించుకుంటున్నట్టు లేదు.

బిష్ ఏకళనున్నాడో, ఫోను తీసి, మరెవర్నో పిలిచి సుబ్బారాయుడి నెంబరు కనుక్కొని, వాళ్ళని పిలిచి, ఫోను జోగిబాబుకిచ్చాడు. ఆయన కాంతం గురించి చెపితే వాళ్ళు మర్నాడు రమ్మన్నారు. “పది గంటలకల్లా వచ్చెయ్యండి, కబుర్లు చెప్పుకొని, భోంచేసి వెళ్ళుదురుగాని,” అన్నాడు సుబ్బారాయుడు చనువుగా. రెండుగంటలకి, వాళ్ళు మరెక్కడికో వెళ్ళాలిట.

రాధ తొమ్మిది గంటలకే తయారయి పోయింది కాని జోగిబాబు పదిన్నర వరకూ తెమల లేదు. “బయటికి వెళ్తున్నారు కదా, మా చంద్రం ఇంట్లో ఈ సీడీలు ఇచ్చేసి రండి,” అంది జీనీ ఉదయం ఆఫీసుకి బయల్దేరుతూ. “ఇన్నాళ్ళెందుకు పెట్టుక్కూచున్నావూ?” అన్నారాయన, సీడీలు సంచీలో పడేసుకుంటూ. ఆ మాట ‘అనలేదూ తనకలవాటైన ధోరణిలోనే కసురు కున్నారు. కానీ ఎవరూ పట్టించుకున్నట్టు లేదు.

ఇద్దరూ బయల్దేరి, ఆటో స్టాండుకి వెళ్తే, అక్కడ ఒక్కటే ఆటో వుంది. మలక్ పేట వెళ్ళి, ఒక పదినిమిషాలాగి, బంజారాహిల్స్ వెళ్ళాలి, అన్నారు బంజారా హిల్స్ ఇటూ, మలక్పేట అటూ కదా అన్నాడు ఆటో డ్రైవరు హిందీలో. ఆ తతరువాత వాళ్ళిద్దరూ హిందీలో కొంతసేపు వాదించుకున్నారు. కాంతం ఫారిన్ సినిమా చూస్తున్నట్లు వాళ్ళని చూస్తూ నిలుచుంది, జోగి బాబు “ఎక్కు” అనే వరకూ. దాదాపు అరగంట ఆటోలో తిరిగింతర్వాత అర్థం అయ్యింది తాము మలక్ పేట ముందు వెళ్తున్నట్టు. తాననుకున్నట్టు రాధ ఇంటికి పది గంటలకి కాదు సరికదా పన్నెండుకైనా చేరుకుంటామోలేదో అనుకుంది.

మలక్ పేటలో చంద్రం చాలా ఆనందపడిపోయింది జోగిబాబుని చూసి. ఎంతకాలానికి, ఎంతకాలానికి అంటూ ఎంతో మురిసిపోయింది. అమెరికా నించి వచ్చిన కాంతం అంటే మరీ సరదా పడిపోయి, భోంచేసి వెళ్ళండి అంది. జోగిబాబు ” ఎందుకండీ మీకు శ్రమ,” అన్నారు, నెమ్మదిగానే (ఆశ్చర్యం)

“లేదండీ, నా స్నేహితురాలికి వస్తాం అని చెప్పాం,” అంది కాంతం ధైర్యం చేసి, జోగిబాబు శాంతంగా వున్నందుకు ఆశ్చర్య పోతూ. “వంటయి పోయింది. ఎంతసేపు. తినేసి వెళ్ళిపోండి,” అందావిడ. కాదండీ అనబోయింది కాంతం. “వంటయిపోయింది అంటుంటే ఆవిడ, పోతాం పోతం అంటూ గోలపెడతావేమిటి,” “రాధ మనల్ని ….” “నీకు తెలుగర్థమవుతుందా,” ఆయన మళ్ళీ అరిచారు. “కాంతం నోరు ఠక్కున మూతపడింది. తనకి తెలుగు బాగానే అర్థమవుతుందిగానీ, అర్థం కానిది ఈయన గారి వ్యవహారమే.

చంద్రం ” వంటయిపోయింది” అన్న తరువాత వాళ్ళని ముందు హాల్లో కూచోమని చెప్పి పొయ్యిమీద కుక్కరులో పప్పూ, అన్నం పడేసి, పక్క వీధిలో కూరలు కొనుక్కో రావడానికి వెళ్ళింది. అంతసేపూ, వీళ్ళిద్దరూ హాల్లోనే కూచున్నారు. జోగిబాబు చంద్రం జీవిత చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. కాంతానికి సగం అర్థం అయ్యింది, సగం కాలేదు. కానీ ఏం అడగాలనిపించలేదు. వింటున్నట్టు మొహం పెట్టుకు కూచుంది, రాధని గురించి ఆలోచిస్తూ. అక్కడ భోజనాలవుతుండగా, మాటల సందర్భంలో రాధ ప్రసక్తి వచ్చింది. “బంజారా హిల్సా?” మా పింతల్లి కూతురు అక్కడే వుంది. పాపం, ఈ మధ్య అల్లుడు పోయాడు. ఓ మారు చూసొద్దామనుకుంటున్నాను కాని పడడమే లేదు,” అంది చంద్రం. “రండి. మేం అటే వెడుతున్నాం కదా,” అన్నారు జోగిబాబు. కాంతం గుండె మరో రెండడుగులు దిగజారి పోయింది. భోజనాలు ముగించుకుని చంద్రంతో కదిలేసరికి టైము రెండున్నర. కాంతం ఏం చెప్పబోయినా, జోగిబాబు కసురు కోవడం, ” నీకు తెలుగర్థమవుతుందా?” అంటూ సతాయింపు. చంద్రం వద్దంటున్నా వినకండా ఆవిడతో వాళ్ళపినతల్లి కూతురు ఇంటిగుమ్మం వరకూ వెళ్ళారు. ఆ పినతల్లి కూతురు రండి రండి అంటూ ముగ్గురినీ ఆహ్వానించింది. అక్కడ మళ్ళీ మరో గంటన్నర. సరే వెళ్తాం అంటూ జోగిబాబు కాంతం లేవబోతుంటే, వాళ్ళతో పాటు చంద్రం కూడా లేచింది. కాంతానికి అయోమయంగా వుంది కాని మాటాడ లేదు.

రాధ కాంతాన్ని చూడగానే పరమానందపడిపోయింది. కాంతం, ” సారీ, ఆలస్యం అయ్యింది. మీరిద్దరూ వెళ్ళాలేమో,” అంది కళ్ళు చిట్లించి. “ఫరవాలేదు లెద్దూ, పనులెప్పుడూ వుండనే వుంటాయి.”

హాల్లో జోగిబాబు, సుబ్బారాయుడు, చంద్రం మాటాడుతూ కూచున్నారు కొంతసేపు. కాంతానికి చిన్ననాటి ముచ్చట్లు రాధతో కలబోసుకోవాలని వుందికాని అందరూ గల గల మాటాడుతుంటే తనకి మాట తోచడం లేదు. తన కోరిక తీరేలా లేదు. పావుగంటయిందేమో, జోగిబాబు లేచారు, పద అంటూ. కాంతానికి స్నేహితురాలితో గడిపినట్టే లేదు. రాధ కూడా ” అదేమిటండీ, ఇప్పుడే కదా వచ్చారు. మధ్యాన్నం భోజనానికి వస్తారనుకున్నాం. ఎలాగా రాత్రి భోజనాల టైం అవుతోంది. కూచోండి, భోంచేసి వెడుదురు గాని,”అంది. జోగిబాబు విసుక్కుంటారేమో అనుకుంది కాంతం. ఆయన వినిపించుకున్నారో లేదో, చిన్న దగ్గు దగ్గి, గుక్కెడు నీళ్ళు తాగి, సుబ్బారాయుడితో మరేదో చర్చ మొదలెట్టారు. కాంతం బతుకు జీవుడా అనుకొని రాధతో వంటింటివేపు దారి తీసింది. భోజనాల దగ్గిర కూడా అదే తంతు. రాధ నాలుగు కంచాలు పెట్టి,వడ్డించింది. “మీరుకూడా కూచోండి” అంటూ పదే పదే చెప్పడంతో, సుబ్బారాయుడికీ కాంతానికీ మధ్య మరోకుర్చీ లాక్కొని కూచుంది. జోగిబాబు అన్నం మారు వడ్డించుకో బోతే, గరిటెతో పాటు గిన్నె కూడా జరిగింది. సుబ్బారాయుడు గిన్నె పట్టుకున్నాడు కదలకండా. “అక్ఖర్లేదు వదిలెయ్యండి,” అన్నారు జోగిబాబు తల విసురుతూ. “అన్నం వేడిగా వుంటే తేలిగ్గా వస్తుంది గరిటెకి. చల్లారిపోయిందికదా.” “ప్చ్. మీరు పట్టుకోనక్కర లేదంటుంటే.” సుబ్బారాయుడు కాంతం వేపు చూసి గిన్నె వదిలేశాడు. తనకా చూపు బలంగా తగిలింది. చిరాకేసింది. గిన్నె కదలకండా పట్టుకున్నంత మాత్రాన ఆయన గారి పరువేం పోయిందో అర్థం కాలేదు. అంత చిన్న విషయానికి కూడా విసుక్కోవాలా? ఆమాటే అడుగుదామనుకుంది కాని పొరుగింట్లో మళ్ళీ రభస ఎందుకని వూరుకుంది. భోజనాలయాక, రాధతో పాటు గిన్నెలు వంటింట్లో పెడుతూ, ఆమాట అనకండా వుండలేకపోయింది. “జోగిబాబు గారికి కోపం ఎక్కువ. మీ ఆయన ఏమనుకున్నారో ఏమో.” రాధ తేలిగ్గా నవ్వేసింది. “ఏం, నీకేమీ అనిపించలేదా, అన్నంగిన్నె మీద చెయ్యేసినందుకు అలా విసుక్కుంటే?” అంది కాంతం మళ్ళీ. “నీకు అమెరికా నీళ్ళు వంటబట్టి, ఇక్కడ మనవాళ్ళ తీరుతెన్నులు మర్చిపోయినట్టున్నావు. మేం ఈ కసుర్లూ విసుర్లూ సీరియస్ గా తీసుకోం. ఎవరి కోపతాపాలు వారివే.” “నీ కాయన్ని తెలుసేమిటి?”

ఆయన్నే తెలియక్కర్లేదు. మా మావగారున్నారు. చూస్తున్నాను కదా. హెడ్మాస్తరుగా చేసి రిటైరయ్యారు. పదేళ్ళయ్యింది. ఇప్పటికీ ఆయనకి మనం అందరం తొమ్మిదో క్లాసు పిల్లల్లాగే కనిపిస్తాం. ఆయన బోధించేవారు, మనం బోధింపబడేవాళ్ళమూనూ. ఏం చేస్తాం. కొందరి తత్వాలు అవీ. ఆయన చెప్పేవి ఆయన చెప్తుంటారు, మనం చేసేవి మనం చేస్తూంటాం. గిన్నె కదలకండా పట్టుకోడం లాంటివి సమయాన్ని బట్టి … పట్టుకున్నా ఒకటే, వదిలేసినా ఒకటే. అదేదో అంతర్జాతీయ సమస్యలా బాధ పడిపోతున్నావు నువ్వు,” అంది రాధ నవ్వుతూ. “అత్తెసరు మార్కులతో క్లాసుమీద క్లాసు తోసుకుంటూ వచ్చావు. నీకింత తెలివితేటలెలా వచ్చాయి?” అనేసి, నాలుక్కరుచుకుంది కాంతం.

రాధ మళ్ళీ అదే నవ్వుతో, ” ఫరవా లేదులే. నేనేం అనుకోను. చెప్పాను కదా. ఇక్కడ మేం పెద్ద విషయం చిన్నవిషయం జానేదేవ్ అనేసి వూరుకుంటాం. అన్నీ తేలిగ్గానే తీసుకుంటాం. మమ్మల్నేవీ బాధించవు. అక్కడ మీరేమో take it easy అంటారు, వట్టి మాటలే,” అంది హేళన చేస్తున్నట్లు కళ్ళు చిట్లించి.

కాంతం కళ్ళు విప్పారాయి. తృటికాలం చిన్ననాటి స్మృతులు గుప్పున ఎగిశాయి, మనో ఫలకం మీద.

చంద్రంగారిని మలక్ పేటలో వాళ్ళింట్లో దింపి, ఇల్లు చేరేసరికి రాత్రి పదకొండు. నిద్రకళ్ళతో జీనీ హాల్లోకొచ్చి మీకోసం అన్నం వండాను అందినిష్ఠూరంగా. కాంతం గబుక్కున చిన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది వారి సంభాషణ వినే ఓపిక లేక.

ఇది ఆర్నెల్లనాటి మాట. ఇండియానించి తిరిగొచ్చింతర్వాత ఇంతవరకూ కాంతం మళ్ళీ ఎవరిమీదా అరవలేదు. ఆశ్చర్యం! టెలిమార్కెటర్లమీదకూడా! వాళ్ళ తత్వం అదీ అనుకుంటుంది ఇప్పుడు. బహుశా వాళ్ళ ట్రైనర్ చెప్పి వుంటాడు సైనప్ చేసిన వాళ్ళని తప్ప మిగిలినవాళ్ళు ఏం అన్నా పట్టించుకోనక్కరలేదని అనుకుంది.

ఎవరైనా అంతసుళువుగా మారిపోతారా అని అడక్కండి. కాంతాన్ని చూసేవరకూ నేనూ నమ్మ లేదు.