కల చెదిరింది

వినయ్‌ ఉద్యోగం లో చేరి అప్పుడే ఆరు నెలలైంది..
అది ఊడి కూడా రెండు రోజులు కావొస్తోంది.

ఈ దేశం కాని దేశంలో, ఈ కాలం కాని కాలంలో తనకున్న క్వాలిఫికేషన్‌కి ఉద్యోగం వేటలోనే దాచిన డబ్బంతా ఐపోయేట్టు కనిపిస్తోంది. తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నట్టు ఈ ముసురు తగ్గేవరకు ఇండియా గూట్లో తలదాచుకుంటే ఎలా ఉంటుంది?
తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వినయ్‌.
ఇది చావు బతుకుల సమస్య.

ఇంతలో
ఎప్పుడూ లేనిది ఇండియా నుంచి నాన్న ఫోను చేసి, వెంటనే తిరిగి చెయ్యమని చెప్పి ఫోన్‌  కట్‌ చేశాడు.
అలాగే చేశాడు వినయ్‌.

“హల్లో, నాన్నా నేను, వినయ్‌ని”
“ఆ..ఏరా బాగున్నావా..”
“నేను బాగానే ఉన్నా.. అమ్మెలా ఉంది?”
“బాగానే ఉంది గానీ నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్‌ చేశాన్రా”
“డబ్బేమన్నా కావాలంటాడా?” గతుక్కుమన్నాడు మనసులోనే.
“అదేరా.. మీ కృష్ణమూర్తి మామయ్య వాళ్ళ అమ్మాయ్‌ ని నీకిస్తానంటున్నాడు .. ఓ నలభయ్‌  లక్షల దాకా ఇస్తాడంట ..ఏ విషయం చెప్పమని ఫోన్‌  చేశాడు. నిన్నడిగి చెప్తామని చెప్పా .. తెలిసిన సంబంధం, మేనరికం! అదీ కాక అమ్మాయి కూడ చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల. ఏమంటావ్‌ ?” నాన్‌ స్టాప్‌ గా చెప్పుకుంటూ పోతున్నాడు..

ఆలోచనలో పడ్డాడు వినయ్‌.

“నేననే దేముంది గాని అమ్మేమంటుంది?” అంతిస్తామంటే అమ్మ మాత్రం వద్దంటుందా?!
“మీ అమ్మ ఓ .. సంబరపడి పోతున్నది. సొంత అన్నకూతురే కదా! ఒద్దంటుందా?”
“అది సరే, బైటైతే ఇంకా ఎక్కువిస్తారేమో?”
“అదీ నిజమే ననుకో! కాకపోతే చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాం కదా! ఇంకో విషయం వాళ్ళ కొడుకు రాంబాబు గాడెటూ అమెరికా లోనే సెటిల్‌ ఐపోయే! వీళ్ళిక్కడ సంపాయించింది అంతా ఇంక ఆ అమ్మాయికే కదా వస్త? ఇప్పుడు నలభై ఇచ్చినా, తరవాత చాలానే వస్తుంది..”
“అమ్మ నా నాన్నా … ఎంత దూరం అలోచించావ్‌ ? ఈ ఐడియా నాకు తట్టనేలేదు” మనసులో అనుకున్నాడు.
“ఏమాలోచిస్తున్నావ్‌?” సమాధానం రాకపోవడంతో రెట్టించాడు తండ్రి.
“ఆలోచించేందుకు ఏముంది? మీ ఇష్టం!”
“మరి నువ్వు రావడానికి ఎప్పుడు కుదురుతుందో చెప్తే, అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం”
“ఒక నెల రోజుల్లో ఇక్కడ నా కాంట్రాక్ట్‌ ఐపోతుంది. అప్పుడు రావటానికి కుదురుద్ది”
“కాంట్రాక్ట్‌ ఏమిటి? పరిమినెంట్‌ ఉద్యోగం కాదా?”
“ఇక్కడలా ఉండదు”
“ఐతే తరవాత వెంటనే ఇంకో ఉద్యోగం దొరుకుద్దా?”
“ఏదొకటి దొరుకుద్దిలే!”
కొద్ది సేపు ఊర్లో విషయాలు మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు.

ఒక వైపు ఆనందం. మరో వైపు బాధ. ఎంతలో ఎంత మార్పు!

పుట్టగొడుగుల్లా లేచిన డాట్కాంలు కాంగా సర్దుకుంటున్నయ్‌. ఇప్పట్లో ఉద్యోగం దొరక్కపోతే? తలచుకోవడానికే భయంగా ఉంది.

ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, తన లాటి వాళ్ళే! ఒకళ్ళకొకళ్ళు వీళ్ళే పోటీ ఏ ఉద్యోగానికి వెళ్ళినా! చూస్తుంటే తనే అందర్లోకీ ఆలస్యంగా వచ్చినట్టున్నాడు!

నాలుగైదేళ్ళ క్రితం చేపల చెరువులు వేసిన వాళ్ళు లక్షలు, కోట్లు సంపాయిస్తున్నారని ఊర్లో పొలాలన్నీ చెరువులుగా మార్చి చివరకు ఇళ్ళు కూడా అమ్ముకున్నారు జనం. ఆ తరవాత కోళ్ళ ఫారాలు .. ఆ తర్వాత రొయ్యల చెరువులు .. ఆపైన నాపరాళ్ళు .. ఆ అన్నిట్నీ మించింది ఈ కంప్యూటర్‌ పిచ్చి. డిమాండ్‌ బాగా ఉన్నప్పుడు అందరూ అదే చెయ్యబోవటం మనవాళ్ళ స్వభావంలా ఉంది. ఎవరో ఒకడు ఏదో కొత్తదాన్లో ఎంతోకొంత సంపాయిస్తే ఓ వంద మంది అదే బిజినెస్‌ చేసి మనం కూడా సంపాయిద్దాం అనుకుంటారే గాని దాన్లో ఇంతమందికి అవకాశం ఉందా లేదా అని ఆలోచించరు.

కాకపోతే తండ్ర్రితో మాట్టాడిన తరవాత వినయ్‌కి కొంత ధైర్యం వచ్చింది. ఉద్యోగం దొరక్కపోయినా, కట్నం డబ్బుతో ఏదో బిజినెస్‌ ఐనా పెట్టుకోవచ్చు! తిరుగు ప్రయాణం వైపుకి మళ్ళినయ్‌ ఆలోచనలు.

వినయ్‌ తండ్రి శేషగిరి రావు కూడ అదే సమయంలో ఆలోచనల్లో విహరిస్తున్నాడు.
ఎంతలో ఎంత మార్పు! నిన్న గాక మొన్నలా ఉంది వినయ్‌ కాలేజ్‌ డిగ్రీ పూర్తిచేసి పనేం లేక ఊళ్ళ మీద తిరగటం.
ఆ రోజు ..

కాలింగ్‌  బెల్‌  మోగుతుంటే, నిద్రలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు తను. గోడ గడియారం మూడు గంటలైనట్టు చూపిస్తోంది. ఇప్పుడెవరై ఉంటారబ్బా అనుకుంటూ కలేమో నని ఆలోచిస్తుంటే మళ్ళీ బెల్‌ మోగిన శబ్దం. పక్కనే ఉన్న భార్యను నిద్ర లేపబోయాడు. బెల్‌ మోగిన శబ్దం కూడా వినిపించనంత గాఢ  నిద్రలో  ఉంది. కళ్ళు  నలుపుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ అతికష్టం  మీద తలుపు వైపు నడిచాడు. తన  ప్రమేయం  లేకుండానే కుడిచేతి చూపుడు వేలు స్విచ్‌  మీద  పడింది. లైటు వెలిగింది. తలుపు  తెరిచి ఎదురుగా నిల్చుని వున్న కొడుకుని చూడగానే కళ్ళల్లో ఆనందం..

“ఏరా. ఇదేనా  రావడం..”
నవ్వుతూ  “అవును” అంటూ లోనికి నడిచాడు, “ఏమేవ్‌ . అబ్బాయొచ్చాడు లే..” తట్టి లేపాడు పార్వతమ్మను. చివుక్కున లేచి కూర్చుంది. ఆమె కళ్ళు కొడుకుకోసం వెతికాయి.
కుర్చీలో కూర్చుని షూస్‌  విప్పుతున్న అతన్ని చూడ్డం తోనే, “ఏరా..భోజనం చేసే బయల్దేరావా?” అని అడిగింది.

“ఆ, తిన్నానమ్మా”
“ఏరా ఇలా చిక్కి పోయావు .. వేళకి తింటున్నావా లేదా?”
“నేను చిక్కి పోవడం ఏమిటమ్మా?”   “ఏం తింటున్నవ్‌ రా? రోజు రోజుకూ తెగ బలిసిపోతున్నావ్‌ ?” నవ్వుతాలుగా రోజూ ఫ్రెండ్స్‌ అనే మాటలు గుర్తొచ్చినయ్‌ .

ఉదయం తొమ్మిది గంటలైంది. అసలు విషయం మెల్లగా బయటపెట్టాడు వినయ్‌.
శేషగిరి రావుకి తిక్కరేగింది. “చదువు అయిపోయి రెండేళ్ళయింది. ఆ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యీ కావటంతోటే ఉద్యోగం వొచ్చేస్తుంది, ఆ తర్వాత, ఓ.. వొరగ  బెట్టేస్తా నన్నావ్‌ .. సరే అని వేలకు వేలు పోసి ఆ డిగ్రీ పూర్తిచేయించా! ఆ తరవాత మళ్ళీ ఏవో జాంగ్రీలనీ గీంగ్రీలనీ ఇంకో లక్ష వాటిమీద తగలేశావ్‌! ఇప్పుడు అమెరికా పోవటానికి వాడికెవడికో రెండు లక్షలివ్వాలని వచ్చి కూర్చున్నావ్‌! ఇక్కడ డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నయ్యా? ఇక నా వల్ల కాదు. ఒక్క పైసా కూడ ఇవ్వను. నీ తరవాత చదువులు ఐపోయిన వాళ్ళు బోలెడు మంది పైసా ఖర్చు పెట్టకుండా అమెరికా వెళ్ళి లక్షలు సంపాయిస్తున్నారు. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో.”

“ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నాకులేదు, నా ఇండివిడ్యువాలిటీ నాకుంది..” మెల్లగా అన్నా అవి శేషగిరి రావు చెవుల్ని చేరినయ్‌.
“ఆ.. తల్లి దండ్రుల్ని పోషించాల్సిన ఈ వయసులో కూడా వాళ్ళ మీద ఆధారపడడమేనా నీ ఇండివిడ్యువాలిటీ? …ఇంతవరకు తగల బెట్టింది చాలు, పెట్టే బేడా సర్దుకోనొచ్చెయ్‌ , ఇక్కడే వ్యవసాయం చేసుకుని బతకొచ్చు”.

అప్పటి దాకా మాట్లాడకుండా అన్నీ వింటున్న పార్వతమ్మ ఇక తప్పదని రంగం లోకి దూకింది.

“అయిందేదో ఐంది. చెట్టంత కొడుకుని పట్టుకుని ఎందుకండీ అలా అంటారు? మనకున్నది వాడొక్కడే. రేపైనా వాడికివ్వాల్సిందే కదా? మీ మాటలకు నొచ్చుకుని రేపు వాడేమన్నా చేసుకుంటే?”
“చాలు ఆపు. దరిద్రపు నోరూ నువ్వూ!”
“ఆ.. నాది దరిద్రపు నోరే.. మరి మీ ఆలోచనలు ఏమయ్యాయ్‌? ఒక్కసారి ఆలోచించండి.. వీడు ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టి ఉద్యోగంలో చేరాడంటే చాలు.. వీడి  రేటు  ఇప్పుడున్న  దానికి  నాలుగు  రెట్లవుతుంది.”
“ఆ.. ఇక్కడ  రెండేళ్ళుగా  రాని  ఉద్యోగం  అక్కడకెళ్ళగానే ఒచ్చి ఒళ్ళో పడుతుందా? వీడు అక్కడకు వెళ్ళాక కూడ  ఖర్చులకు  మనం  పంపాల్సిందే. ఇక్కడైతే  నెలకు రెండు మూడు వేలు అక్కడైతే, ఒకటి రెండు లక్షలు. అంతే తేడా!”

“మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి.. మా అన్న కొడుకు రాంబాబు . వాడేం పెద్ద తెలివైనోడా.. అమెరికా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదూ? వాడికిచ్చినోళ్ళు మనోడికివ్వరా? ఆరునెల్ల  క్రితం  వాడికి పిల్లనివ్వడానికే రానివాళ్ళు, ఇప్పుడు ఇరవై లక్ష లిస్తామంటున్నారు.. మనోడికి ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తామని బోలెడు మంది అడుగుతున్నారు.. వీడొక్క సారి అమెరికా వెళ్ళాడంటే… ఇంకేమన్నా ఉందా!”

“నీ మొహం.. వీడికి పిల్లనిస్తామంటున్నది వీడి ముఖం నీ ముఖం చూసి కాదు! వీడికి ఉద్యోగం లేకపోయినా, నేను సంపాయించింది ఉందిగా, దాన్ని చూసి”

“అంటే, మీ ఆలోచనలు మీవేగానీ వాడి భవిష్యత్తు గురించి ఆలోచించరన్న మాట! ఒరే.. వినయ్‌  ఆయన మాటలు నువ్వేమి పట్టించుకోకు”
“ఆ . వాడినట్లా వెనకేసుకో నొచ్చే ఎందుకూ పనికిరాని వెధవని చేశావ్‌ ..” పైకలా అన్నా తను ఓడిపోయానని ఆయనకీ అర్థమై పోయింది.

సాఫ్ట్‌ వేర్‌ కి బోలెడు డిమాండ్‌ ఉందన్న విషయం విని కూడా ఇంతకు ముందెప్పుడూ దాన్ని గురించి ఆలోచించ లేదు వినయ్‌.. అనుకోకుండా ఇంకేదో పని మీద ఓ సారి హైదరాబాద్‌ వెళ్ళటం జరిగింది. అక్కడ దిగగానే ఎక్కడ చూసినా ముప్ఫై రోజుల్లో అది నేర్పుతాం, ఇది నేర్పుతాం అంటూ పెద్ద పెద్ద బానర్లు! పేపర్‌ తీస్తే ఫ్రీ ప్రాసెసింగ్‌ అంటూ కన్సల్టెన్సీల యాడ్స్‌! అంతా చూస్తుంటే ఏదో ఓ కన్స్ర్టక్షన్‌ కంపెనీలో చేరి ఎండలో మాడే కంటే ఓ రెండు మూడు నెలలు కష్టపడితే ఎంచక్కా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరై పోవచ్చు ననిపించింది. బాగా డిమాండ్‌ ఉన్న జావా ఐతే బెటర్‌ .. ఆలోచన రావడమే తరువాయి. ఇంటికి బయల్దేరటం, తండ్రి దగ్గర డబ్బు సంపాయించి తిరిగిరావటం, ఫీజు కట్టడం, అన్నీ చకచక జరిగి పోయినయ్‌ ..

మొదటి రోజు క్లాసులో అడుగు పెట్టాడు. క్లాసు రూం చూడగానే ఆశ్చర్యం.. ఓ పెద్ద హాలు. మూడొందల దాకా చైర్స్‌ . హాల్‌లో నాలుగు వైపుల స్పీకర్లు.. మధ్యలో ఓ కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి ఓ చిన్న ప్రొజెక్టర్‌.. గోడకు వేలాడుతూ ఓ స్క్రీన్‌. చూస్తుంటే చిన్నతనంలో డేరా హాల్లో సినిమా రోజులు గుర్తొచ్చినయ్‌ ..

క్లాసు మొదలయ్యే టైంకి హాలంతా నిండిపోయింది.. కొందరైతే కూర్చునేందుకు చోటు లేక నిల్చునే క్లాసు వింటున్నారు.. ఇంతకుముందు కొంచెం కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నా వాళ్ళు చెప్పేదేవీ అర్ధం కావడం లేదు. “ఇలా ఔతోంది నాకేనా?” అని అనుమానం వచ్చి ఓ ఇద్దరు ముగ్గురిని అడిగాడు.. వాళ్ళూ తన టైపే! మనసు కాస్త కుదుట పడింది.

క్లాసు ఐపోగానే లాబ్‌ లోకి వెళ్ళి చూస్తే.. అక్కడ ఓ యాభై కంప్యూటర్‌ లున్నై. ఓ రెండొందల మంది జనం. ఒక్కో సిస్టమ్‌ ముందు నలుగురైదుగురు. ఏదేదో చేసేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో!

ఓ ఐదు నిమిషాల తరవాత వాళ్ళ టైం ఐ పోయింది. వెళ్ళి ఓ సిస్టం ముందు కూర్చున్నాడు. ఏమి చెయ్యాలి? చేసేదేమీ లేదు. ఇంతలో చుట్టూ ఓ ముగ్గురు చేరారు. ఓ అరగంట టైం పాస్‌ తరువాత నలుగురూ కలిసి బైటకు నడిచారు. అదీ ఆరోజుకు ట్రైనింగ్‌!

రోజుకు ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగైదు బాచ్‌లు. బాచ్‌ కి రెండు మూడొందల మంది. రెణ్ణెళ్ళకో కొత్త బాచ్‌.

ఓ వారం తరువాత ఉదయం క్లాసు టైంలో గేటు దగ్గర టికెట్లు చింపే వాడొకడు ప్రత్యక్షమయ్యాడు. వాడి పేరు నరేంద్రట. వాడి పని మొత్తం ఫీజు కట్టిన వాళ్ళను మాత్రమే లోపలికి పంపడం…

మెల్లగా నరేంద్రతో పరిచయమైంది. దాని వల్ల ఎన్ని లాభాలున్నాయో తొందర్లోనే అర్థమైంది ఇన్‌స్టిట్యూట్‌కి కొంత మాత్రం ఫీజు కడితే, మిగిలిన దాంట్లో సగం ఫీజుకే రాత్రి వేళల్లో లాబ్‌లోకి పోనివ్వటం నరేంద్ర సైడ్‌ బిజినెస్‌!

రోజులు గడుస్తున్నయ్‌, కోర్సులు ఐపోతున్నయ్‌. నరేంద్ర పుణ్యమా అని ఫీజు కట్టకుండా ఒకదాని తరవాత మరొకటిగా ఇన్‌స్టిట్యూట్‌ మార్చకుండా రెండు సంవత్సరాల పాటు పది వేల ఫీజుతోటే చాలా కోర్సులు పూర్తిచేశాడు, సర్టిఫికెట్లు సంపాయించాడు. ఇంటి దగ్గర తెచ్చుకున్న డబ్బుతో బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేశాడు.

ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి ఉపయోగం కనపడక ఇక లాభం లేదని ఓ తెలిసిన కన్సల్టెన్సీ ని ఆశ్రయించాడు. రెండు లక్షలు కడితే పేపర్లు ఫైల్‌ చెయ్యడానికి ఒప్పుకున్నారు వాళ్ళు.
ఆ విషయం నాన్నతో చెప్పి డబ్బు తీసుకెళ్దామని వచ్చాడు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంది. ఆయననే మాటల్లో కొంత నిజం వున్నా, ఇలా అమెరికా వెళ్ళే అవకాశం చేతి దాకా వస్తే ఎలా వొదులుకోవటం?

మూడు నెలల తరువాత అమెరికా వెళ్ళే ఫ్లైట్‌లో ఉన్నాడు వినయ్‌. వెళ్ళిన పదిహేను రోజులలోనే పెద్దగా కష్టపడకుండానే జాబ్‌ దొరికింది. కల ఫలించింది!
ఇక్కడ జాబ్‌ రావడం ఇంత సులభంకాబట్టే అమెరికా, అమెరికా అంటారందరూ! అనుకున్నాడు ఆనందంగా.
తన అదృష్టానికి మురిసిపోయాడు వినయ్‌.

ఇంట్లో తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇన్నాళ్ళూ ఎక్కడున్నారో కూడా తెలియని చుట్టాలకి కూడా హఠాత్తుగా వాళ్ళు గుర్తుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలున్న వాళ్ళకి!

శేషగిరి రావుకి నిజమైన పుత్రోత్సాహం అంటే ఏమిటో ఇప్పుడు అనుభవమయ్యింది!

వినయ్‌ మేనమామ కృష్ణమూర్తి ఇంట్లో ఫోన్‌ మోగింది.

“హల్లో నాన్నా! నేను, రాంబాబు ని..”
“ఏరా బాగున్నావా?”
“ఆ..బాగానే ఉన్నా.”
“ఎలా ఉంది నీ ఉద్యోగం?”
“అది చెపుదామనే ఫోన్‌ చేసా. నిన్ననే ఓ పెద్ద కంపెనీలో చేరా. ఓ ఆరునెల్ల దాకా పరవాలేదు.”
“మరి అందరూ ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నా రంటున్నారు నిజమేనా?”
“ఏమీ నేర్చుకోకుండా డబ్బుల్తోటే సర్టిఫికెట్లు సంపాయించిన వాళ్ళ పని అలాగే అయిందిలే! అన్నట్టు చెల్లి పెళ్ళి విషయం ఏమౌతున్నదీ?”
“ఏమయ్యేదేముంది! వినయ్‌ రాగానే ముహూర్తాలు పెట్టుకోవడమే!”
“దాని గురించే ఆలోచించమంటున్నా.. వాడికిక్కడ జాబ్‌ పోయిందని ఎవరో అంటే విన్నా. అలా ఐతే మళ్ళీ ఇప్పట్లో రావటం కూడా కష్టం. అసలు వాడు ఇండియా వస్తున్నది అందుకనుకుంటా!”
“నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు.”
“వాడు అక్కడ జాబ్‌ రాక వీసాకి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి కొచ్చాడు. ఇక్కడ కూడ జాబ్‌ పోవడంతో అక్కడి కొస్తున్నాడు. వాడు మనం ఇస్తామన్న డబ్బుల్తో ఏదో బిజినెస్‌ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు స్నేహితుడొకడు చెప్పాడు..”
“అంటే మళ్ళీ వాడు అమెరికా రాడా?”
“అదే కదా నేను చెప్పేది! అక్కడే బిజినెస్‌ చేసుకునేట్టయితే
వాడికే ఇవ్వాలనేముంది? మీరు ఊ అనండి, ఇక్కడ కాస్త దిట్టంగా సంపాయించి మంచి ఉద్యోగంలో ఉన్న వాణ్ణి నేనే చూస్తాను.. నిదానంగా ఆలోచించండి. ఈ విషయంలో తొందరపడొద్దు”

ఐతే కృష్ణమూర్తికి నిదానంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ కనపడలేదు ఈ విషయంలో.
వెంటనే శేషగిరి రావుకి ఫోన్‌ చేశాడు ఈ మోసం తేల్చేసి సంబంధం మానేస్తున్నామని చెప్పటానికి.