అపరోక్షానుభూతి A Love Story

(“ఈమాట”లో వసంతసేన గారి రెండవ కథ ఇది. చక్కని శైలి, విస్మయం కలిగించే కొసమెరుపులు వీరి రచనల్ల్లో ప్రత్యేకతలు. )

ఓ వారం రోజులుగా గమనిస్తున్నాను తెల్లవారుఝామునే లేచి ఇంటి ముందు ముగ్గులు తీర్చే మా పక్కింటి అమ్మాయిని. బ్రష్షు నోట్లో పెట్టుకొని వరండా కిటికీలో కూర్చుని రెప్పవాల్చకుండా చూసే ఎదురింటి కుర్రాడిని. “మరో ప్రేమకథ మొదలవబోతోంది కాబోలు ” నాలో నేనే నవ్వుకున్నాను.


“చేయి చాచితే అందేంత దూరాన గొంతెత్తి పిలిస్తే పలికేంత దూరాన ఉన్న నీకు ఏమని వ్రాయను నేస్తం?

నేస్తం! ఎంత తియ్యని పిలుపు! ఒకదానితోనొకటి పెనవేసుకు పోయిన హృదయాలు ఒకదానినొకటి పలకరించుకునే పిలుపు. అందుకే ఎన్నో ప్రేమకవితల్లో వాడబడుతూ నానుతూ నలుగుతోన్న ఆ సంబోధనను మళ్ళీ వాడటానికి సాహసిస్తున్నాను. నీ పేరైనా తెలియని నేను నిన్ను నేస్తం అని పిలవడం ఆ పిలుపుకు నీ నుంచి ప్రతిస్పందన ఆశించడం… నాకే చాలా ఆశ్చర్యంగా వుంది.

నిన్ను చూసేవరకూ నేనసలు సూర్యోదయం ఎలా వుంటుందో మర్చేపోయాను.

నిజం! మొన్నుదయం నన్ను చూసి నువ్‌ అందంగా నవ్వినంత నిజం!

ఎప్పుడో ఎనిమిదింటికి లేవడం అరగంటలో తయారయ్యి కాలేజీకి బయల్దేరడం ఇదీ నా ఉషోదయ కార్యక్రమం.

కానీ ఆరోజు ఎందుకో అనుకోకుండా పొద్దున్నే లేచాను. అప్పుడే నిన్ను చూసాను!

అరవిరిసిన మల్లెపువ్వులా నువ్వు అందంగా వంగి చుక్కలు పెట్టి, చిత్రంగా వేళ్ళను మెలికలు తిప్పుతూ, మధ్య మధ్య ఆ ముగ్గు అంటిన చేత్తోనే నీ నుదుటన అల్లరి చేసే అలుకలు అలవోకగా సర్దుకుంటూ, ముగ్గంతా పూర్తికాగానే అంతదాకా హమ్మింగ్‌ చేస్తూన్న రాగాన్ని హఠాత్తుగా ఆపి అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోవడం.

ప్రతిరోజూ ఆ అయిదు నిముషాల కాలం నాకో అద్భుతంలా గడుస్తుంది.

ఇదంతా చదవడం నీకెంతో రొటీన్‌ గానూ బోరుగానూ ఉండవచ్చు. కానీ, కళ్ళుమూసుకుంటే చాలు నాకు అలా ముగ్గుపెడుతోన్న నువ్వే కనిపిస్తావ్‌. ఆ దృశ్యం నా మనసులో ఎంతగా ముద్రించుకుపోయిందంటే… అలా కళ్ళు మూసేసుకొని నిన్నే నా ఎదలో చూసుకుంటూ నీతోపాటు ఆ ముగ్గు నేనూ వేసెయ్యగలిగేంత! నీ మీదొట్టు!

అలా నా దినచర్యలో నువ్వొక భాగం అయ్యావు. నువ్‌ ముగ్గు పెట్టే సమయానికి నేను నిద్రలేస్తాను. నేను సైకిలెక్కి కాలేజికెళ్ళే సమయానికి నువ్‌  గుడి నుంచి తిరిగి వస్తూ వుంటావు.

నీ చేతిలో పూజారిగారిచ్చిన పూలు నుదుటన ఆంజనేయస్వామి కుంకుమ. నాకప్పుడప్పుడూ నవ్వొస్తూ వుంటుంది… నిత్య బ్రహ్మచారి దేవుడ్ని నువ్‌  పూజించడం నీ ప్రేమ కోసం ఆ దేవుడ్నే నేను ప్రార్ధించడం!

నాది లవ్ అట్ ఫస్ట్ సైట్ అవునో కాదో గానీ తొలిసారి నువ్‌ కనిపించగానే కలిగిన అనుభూతి చెప్పడానికి నా భాష సహకరించడం లేదు. ఇలాంటి మరదలో మేనకోడలో వుంటే బాగుండుననే ఫీలింగ్‌ ఎందుకూ అంటే ఏం చెప్పను? కొన్ని ఫీలింగ్స్‌ కి లాజిక్‌ వుండదు.

బహుశా అదే ప్రేమేమో? నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో? అలా అనుకోగానే నాలో ఏదో గగుర్పాటు, ఏదో భయం, అదో రకమైన గమ్మతైన ఇబ్బంది.

ప్రశాంతంగా ఆలోచిస్తే అర్ధమయ్యింది నా ఇబ్బందికి కారణం. నే భయపడుతోంది నువ్‌ నాకు నచ్చావు అన్న ఆలోచన వల్ల కాదు నువ్‌ నన్ను అంగీకరించలేవేమోనన్న అనుమానం వల్ల.

పోనీ నా బాధ ఎవరికన్నా చెప్పుకొని సహాయం తీసుకుందామా అంటే? ఏమని చెప్పను కనీసం పేరైనా తెలియని అమ్మాయిని నే ప్రేమించానని చెప్పనా? ముగ్గుపెడుతూ ఆమె తీసే కూనిరాగం నాకు అమృతవర్షిణిలా వినిపిస్తోందని చెప్పనా? గుడి నుంచి తిరిగివస్తూ నావైపు పలకరింపుగా విసిరే ఆ చిరునవ్వు నా గుండెల్లో గుచ్చుకుంటోందని చెప్పనా? ఏ క్షణం కళ్ళు మూసుకున్నా కనురెప్పల ముందుకు అదే రూపం అనాలోచితంగా కనిపిస్తోందని చెప్పనా? ఏం చెప్పను?

ఇలా లాభం లేదని కాగితం కలం పట్టుకొని నీకే వ్రాయడం ప్రారంభించాను. నిజం చెప్పొద్దూ… మొదట నిన్నింప్రెస్‌ చేద్దామని కీట్స్‌ లెవెల్లో కవిత్వం వ్రాయబోయాను. కానీ, poetry is not my cup of tea  అని అర్ధమయ్యే సరికి ఆ ఆలోచనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాను.

అయినా ఎంతసేపూ నీ గురించీ, నువ్‌ వేసే ముగ్గుల గురించీ, కిటికీలో కూర్చుని బ్రష్‌ చేసుకుంటూ నిన్నే చూసే నా గురించీ తప్ప ఏం వ్రాయాలో తోచలేదు. పైగా నిన్ను నిన్నుగా వర్ణించగలిగేంత భాషాజ్ఞానం నాకులేదని తెలిసిపోయింది.

ఇలా లాభం లేదనిపించింది.

నీ గురించి నేనేం ఆలోచిస్తున్నానో నిజాయితీగా నీకు తెలియజేయాలనిపించింది. అంతే పదానికి పదం కలుస్తూ ఆలోచనకాలోచన అల్లుకుంటూ ఇదిగో… ఈ ఉత్తరం తయారయ్యింది (దీనిని అలా పిలవచ్చు అని అంటే).

దీనిలో పొగడ్తలు లేవు స్వోత్కర్షలు లేవు ప్రాసలు లేవు పదబంధాలు అంతకంటే లేవు. అసలిది ప్రేమలేఖే కాదు. ఇది కేవలం నా భావనలు నీ దాకా చేరవేసే సాధనం. అంతే.

ఈ లేఖపై నీ అభిప్రాయం అంగీకారమే అయితే ఆ విషయాన్ని నాకు తెలియజెయ్‌! ఒకవేళ నా ప్రేమ నీకు ఆమోదయోగ్యం కాకపోతే మాత్రం నాకా విషయం తెలియనివ్వకు.

ఏది ఏమైనా నాకనంతమైన ప్రేరణనిస్తూన్న నీ పలకరింపు దరహాసం నుంచి మాత్రం నన్ను దూరం చెయ్యకు… అది చాలు నాకు ఈ జీవితకాలం గడిపెయ్యడానికి!

సెలవ్‌ ముగ్గు సుందరీ.

నీ
నేను”


గుడిమెట్లు దిగుతూ తనను చూసి సిగ్గుతో ఆగిన ఆమెను చూడగానే ఉత్సాహంగా సైకిల్ని గుడివైపుకు త్రిప్పిన అతను మరో ప్రక్కనుంచి దూసుకు వస్తున్న లారీని గమనించలేదు.

స్ప్లిట్‌ సెకెండ్‌.

ఆమె వారించే లోపే జరుగకూడనిది జరిగిపోయింది!

ఆ క్షణాన కొండల్నీ లోయల్నీ కదిలించివేయగల ఆర్తనాదం ఒకటి ఆమె గుండెలోతుల్లోనుంచి బయల్దేరి గొంతు దాటి రాలేక ఆ మధ్యలోనే … ఎక్కడో నిక్షిప్తమైపోయింది.

ఆమెకు స్పృహ తప్పింది!

నాకు తెలిసి ఆ తర్వాత మరెన్నడూ ఆమె ముగ్గు వేసినట్లు లేదు!