అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది.
దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం.