పెద్దోడి వయసు పదకొండేళ్ళకంటే ఎక్కువుండదు. చిన్నోడికి ఆరేళ్ళుండచ్చు. ఆ పిల్లలిద్దరూ ఆ జనసముద్రంలో తేలుతున్న రెండు చిన్న ఆకుల్లా అటూ ఇటూ అల్లల్లాడుతున్నారు. ఇంతలో అక్కడికి బాగా బలిసి భీకరంగా ఉన్న ఆకారం ఒకటి వచ్చింది. కిందవాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా అధికారం చెలాయించడానికి అలవాటుపడిన ముఖం. నల్లరంగులో పెద్ద ఓవర్కోటు, బెల్టు, టోపీతో ఉన్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని తిప్పుతూ ఉన్నాడు. కరకు గొంతుతో ఏదో అరుస్తున్నాడు అప్పుడప్పుడూ. వాడేం చెప్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయినా ఆ జనసమూహమంతా వాడి ఆజ్ఞలకి కట్టుబడింది.

మర్నాడూ ఆ పైరోజూ కూడా స్తిపనీదా ఆలోచనలు ఎవ్‌గెనీని వదల్లేదు. ఏవో పనులున్నా అవన్నీ చేస్తున్నా మనసునిండా ఈవిడే. పెళ్ళితో తన పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయాయనే అతననుకున్నాడు. స్తిపనీదా పొందు అతనిప్పుడు కోరుకోటల్లేదు కానీ ఆమె పైని వ్యామోహం ఇంకా ఉన్నందుకు అతను మథనపడ్డాడు. తరవాత గుర్రాల దగ్గరకి నడుస్తుండగా తనను దాటి పరుగెత్తుకుంటూ పోయిన అదే ఎర్ర గౌనూ తలకు చుట్టిన ఎర్ర రుమాలూ అదే ఆరోగ్యవంతమైన శరీరం అతనికి ఆ పొలాన్నీ ఆ గడ్డివామినీ ఆ మధ్యాహ్నాలనూ గుర్తుకు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టాయి.

పెళ్ళయిన కొత్తల్లో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్త పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.

“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”

రాత్రి నిద్ర పట్టేదాకా నా కళ్ళు బల్ల మీదున్నరజనీగంధ పూలనే చూస్తూ ఉండిపోతాయి. నాకేంటో అవి పువ్వులు కావని, అవన్నీ సంజయ్ ఎన్నోరకాల కళ్ళని, అవి నన్నే చూస్తున్నాయని, నా ఒంటిని నిమురుతున్నాయని, ప్రేమ కురిపిస్తున్నాయనీ భ్రమ కలుగుతుంది. అంతగా అన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయనే కల్పన నన్ను సిగ్గులో ముంచుతుంది.

సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్‌హాడన్‌ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది. దీనికి లైలీ ఒప్పుకోలేదు. “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్‌హాడన్‌తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవి కాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడని, అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది.

ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్ళిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.

“పువ్వులాగా పుట్టకుండా
పండులాగా మారకుండా
ఆకులానే పుట్టినందుకు
ఆకు రూపం దాల్చినందుకు
ఎప్పుడైనా బాధ పడ్డావా?”

మీరు కూసి ఒక కోడిని లేపండి
భుజంమీద ఒక రామచిలుకతో
ఉద్యోగానికి వెళ్ళండి
మీతో అల్లరి ఆటలాడే పిల్లితో కలిసి
ఒక మధ్యాహ్నం భోజనం చెయ్యండి

ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.

వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.

ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.

ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది.

“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.

అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్ళముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

అప్పా ఒక్కసారి నిశ్చేష్టుడయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని మాటల యుద్ధం మొదలు పెట్టాడు. మాస్టారు ఏమాత్రం కనికరం చూపించలేదు. “నావల్ల కాదు,” అంటూ వంద సార్లు అన్నాడు. చివరకి అప్పాకి విసుగొచ్చింది. మాస్టారి నిగ్రహం చూసి ముద్దు పెట్టుకోబోయాడు. కావాలంటే తన కొడుకు బదులు తనే పరీక్ష తీసుకుంటానన్నాడు. బూతు జోకులు చెప్పాడు. మరీ దిగజారుడుగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

అందరూ వెళ్ళిపోయాక ఒక్కడే మిగిలాడు. ఒక్కడే! వెళ్ళినవాళ్ళు వచ్చేవరకూ ఏం నమ్మకం? వాళ్ళొస్తే లక్ష్మి ఇక్కడే ఎక్కడో ఉందని, ఉంటుందని అనిపిస్తుంది. బయటో, లోపలో ఉండే ఉంటుంది. కళ్ళు దించుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వచ్చి ఎదుట నించుంటుంది. వచ్చి నిలబడకపోతే మానె. అసలు లక్ష్మిని మళ్ళీ ఎవరు తీసుకు రాగలరు? ఎవరు తిరిగి వచ్చారు ఇంతవరకూ? ఎవరైనా తీసుకొని రాలేరు. అసలిప్పుడు వాళ్ళకు అమ్మ ఎందుకు? వాళ్ళు పెళ్ళాల సొంతమైపోయారు.