పెద్ద పెద్ద నగరాల్లో జట్కాబండి వాళ్ళ కొరడా వంటి నాలుకతో ఎవరి వీపులు చీరిపోయాయో, చెవులు పగిలిపోయాయో, వారికి – అమృత్ సర్ జట్కాబండి వాళ్ళ పలుకులు చల్లటి లేపనమే నంటే నమ్మండి. అదేంటో, పెద్ద నగరాల్లో అంతంత వెడల్పాటి రహదారుల్లోనూ, గుఱ్ఱాల వీపులూ చిట్లగొడుతుంటారు, వాటి తాతమ్మలతో తమకున్న యౌవనసంబంధాలనూ గుర్తు చేసుకుంటుంటారు, పశువైద్యులకు కూడా తెలియని వాటి గుప్తాంగాల వివరాలను తేటతెల్లం చేస్తుంటారు! అంతేనా, బాటసారుల కాళ్ళకు కళ్ళు లేవని జాలి చూపుతుంటారు, వారి పాదాలపై బండి అలవోకగా జార్చేయడమే కాక ప్రపంచంలోని కష్టాలన్నీ తమకేనన్నట్టు ఏకరువు పెడుతుంటారు, తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.
అదే అమృత్ సర్ జట్కాబండి కుటుంబీకుల మాట తీరే వేరు. వారు దారికడ్డొచ్చిన ప్రతీవాడి తోనూ కొండంత ఓపికతో, జాగ్రత్త ఖాల్సాజీ, తప్పుకో అన్నా, కాస్తాగు తమ్ముడూ, దారివ్వవయ్యా, జరుగు బాబూ అంటూ తోపుడు బండ్లు, చెరకు బండ్లు, బాతులు, గాడిదలు ఇంకెన్నో వచ్చి వెళ్ళే ఇరుకుదారుల్లోనే దారి చేసుకుంటూ వెళ్తుంటారు. జీ, సాహెబ్ అనకుండా ఒక్కరినైనా దారిమ్మనడమే? ఇంకా నయం. అలా అని వాళ్ళు కఠినంగా మాట్లాడలేని వాళ్ళేం కాదు, మెత్తగా మాట్లాడుతూనే పదునైన రీతిలో దెబ్బ కొడతారు. ఏ ముసలమ్మయినా వారికి మాటిమాటికీ అడ్డొచ్చిందంటే, తప్పుకో తప్పుకో పెద్దమ్మా, నీ పిల్లలకు నీవంటే చాలా ఇష్టం, వాళ్ళకోసమన్నా నాలుగురోజులుండవా? నీవు చాలా అదృష్టవంతురాలివి, ఇంకా ఆయుష్షుందమ్మా, నా బండి చక్రాలకింది కెందుకొస్తావమ్మోయ్! ఇలా అంటుంటారు.
ఇలాంటి బండ్లను తప్పుకుంటూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక కూడలిలో ఉన్న కొట్లో కలిశారు. అబ్బాయి పొడుగాటి జుట్టు, అమ్మాయి వదులు పైజమా చూస్తే వాళ్ళు సిక్కులని తెలుస్తూనే ఉంది. అతగాడు వాళ్ళ మామ తలంటుకోడానికి పెరుగు కోసం వస్తే, ఆమె వంటకు వడియాల కోసం కొట్టుకు వచ్చింది. కొట్టువాడు ఎవరో కొత్తవాళ్ళకు సేర్లకొద్దీ అప్పడాలు అమ్మడంలో మునిగి తేలుతున్నాడు.
“మీ ఇల్లు ఎక్కడ?”
“మగర్‌లో. మరి మీది?”
“మాంఝే. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు?”
“అతర్ సింగ్ బ్లాక్‌లో. అక్కడ మా మామ వాళ్ళింటికొచ్చాను.”
“నేనూ మా మామ వాళ్ళింటికి వచ్చాను. వాళ్ళిల్లు గురుబాజార్లో ఉంది.” (నవ్వు.)
ఇంతలో కొట్టువాడు వీళ్ళ సామాన్లు ఇచ్చాడు. తీసుకొని ఇద్దరూ కలిసి నడవసాగారు. కాస్సేపాగి ఆ అబ్బాయి ముసిముసిగా నవ్వుతూ – నీకు పెళ్ళి కుదిరిందా? అనడిగాడు. అమ్మాయి ముఖం చిట్లించి, ఫో! అనేసి పారిపోయింది. అబ్బాయి చూస్తూ ఉండిపోయాడు.
తరువాత కూడా కూరలబండి దగ్గరా, పాలకేంద్రం దగ్గరా రెండు మూడు సార్లు అనుకోకుండా కలిశారిద్దరూ. నెల రోజులపాటూ ఇదే ప్రహసనం జరిగింది. మూడునాలుగుసార్లు అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడగడమూ, అమ్మాయి ఫో! అంటూ పారిపోవడమూ.
ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్ళిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.
2.
“ఇదేం యుద్ధంరా బాబూ, ఖర్మ! పగలూ రాత్రి ఈ కందకాల్లో కూర్చొని కూర్చొని ఎముకలు పట్టేశాయి. లుధియానా కంటే పదిరెట్లు చలి, వాన, పైనుంచి మంచు పడడం! మోకాళ్ళవరకూ బురదలో కూరుకుపోతున్నాము. గెలుపు మాట అటుంచు. ఇక్కడ పరిస్థితి చూడు! గంటగంటకూ చెవులు పగిలేలా పేలుళ్ళతో ఈ కందకాలు కదిలిపోతుంటాయి. భూమి వంద గజాల వరకూ దద్దరిల్లుతుంది. ఈ కందకాల్లోంచి బయటకు పోతే కదా యుద్ధం చేసేది? నాగర్‌కోట్‌లో భూకంపాలు విన్నాము. ఇక్కడ రోజుకు యాభై అరవై అవుతుంటాయి. కందకం బయట కొంచెం అలికిడి అయినా టక్కున తుపాకి పేలుతుంది. ఈ వెధవలు ఏ మట్టిలో దాక్కొనుంటారో, ఏ గడ్డికింద పడుకొని ఉంటారో ఎవరికి తెలుసు?”
“లహనాసింగ్! ఇంకా మూడు రోజులుంది. నాలుగు రోజులు ఈ కందకంలోనే గడిపేశాము. ఎల్లుండి రిలీఫ్ ఆర్ఢర్ వచ్చేస్తుంది. వారం రోజులు సెలవూను. మన కిష్టమైనట్టు హాయిగా కడుపునిండా తిని దర్జాగా పడుకోవచ్చు ఆ ఫ్రెంచ్ ఆమె తోటలో వెల్వెట్ లాంటి మెత్తని పచ్చికబయలుంది కదా. పండ్లు, పాలు కావలసినన్ని తెచ్చిస్తుంది. ఎంత చెప్పినా డబ్బు తీసుకోదు. వద్దు, నా దేశాన్ని కాపాడడానికి వచ్చిన రాజువి నీవు అంటుంది.”
“నాలుగు రోజుల్నించీ కంటిమీద కునుకు లేదు. పారలేక గుఱ్ఱమూ, పోరు లేక సిపాయీ పనికి రాకుండా పోతారు. ఈ తుపాకీ పట్టుకుని మార్చ్ చేయమని కమాండ్ ఒక్కటి వస్తే చాలు, కనీసం ఏడుగురు జర్మన్లనైనా ఒక్కణ్ణే చంపి రాకపోతే నాకు దర్బార్ సాహెబ్ గడప మీద సాష్టాంగపడే అదృష్టం రాకుండుగాక! ఈ గుఱ్ఱాన్నీ ఈ తుపాకులనూ చూసి, ఆ తుచ్ఛుల మొగాలు వెలవెల బోతాయి, కాళ్ళ బేరానికొస్తారు. చీకట్లో అయితే మూడు మూడు మణుగుల గుండ్లు విసురుతారు! ఆరోజు దాడి చేశానా, నాలుగుమైళ్ళ వరకూ ఒక జర్మన్‌ను కూడా వదిలిపెట్టలేదు. వెనకనుంచి జనరల్ సాహెబ్ వచ్చేయమన్నాడు, లేకపోతేనా…!’
“ఔనౌను. నేరుగా బెర్లిన్‌కే వెళ్ళిపోయేవాడివి! కదా!” సుబేదార్ హజారాసింగ్ చిన్నగా నవ్వాడు. “యుద్ధాలు జమాదారో, సోల్జరో చెప్పినట్టు జరగవందుకే. పెద్ద ఆఫీసర్లు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయిస్తారు. మూడు వందల మైళ్ళ దారి! ముందుకే వెళ్ళిపోతుంటే ఎలా?”
“సుబేదార్, నిజమే చెప్పారు. కానీ ఏం చేస్తాం చెప్పండి. కదలకుండా ఉంటే ఎముకలు పట్టేస్తున్నాయి చలికి. సూర్యుడి జాడే లేదు. ఈ గొయ్యికి అటూ ఇటూ పిచ్చి పట్టినట్టుగా అస్తమానం దుమికే జలపాతాలు! ఒక్క దాడి చేసినామంటే వేడి పుట్టదూ!”
“సరేనయ్యా యోధుడా! లే. ఆ చలి కాచుకునే బట్టీ చూడు, బొగ్గులు ఇంకొన్ని తెచ్చివేయి. వజీరా! మీరు నలుగురూ చేద తీసుకొని గోతిలో నీళ్ళన్నీ ఎత్తిపోయండి. మహాసింగ్! సాయంత్రమైంది, ఈ గోతికి కాపలా వాళ్ళను మార్చు.” ఆదేశాలిస్తూ సుబేదారు కందకం అంతా కలియతిరుగుతున్నాడు.
వజీరాసింగ్ ఆ బృందానికే విదూషకుడు. బాల్టీతో నీళ్ళెత్తిపోస్తూ, “ఇదిగో నేను పంతుల్ని. జర్మన్లకు తర్పణం వదుల్తున్నా!” అనగానే కందకం అంతటా గలగలా నవ్వులు! ఉదాసీనత దూదిపింజెలా ఎగిరి ఎటుపోయిందో! లహనాసింగ్ ఇంకో బాల్టీతో నీళ్ళు తోడి అందిస్తూ, “ఇదో, నీ తోటలో కరబూజ మొక్కలకు నీళ్ళు పెట్టు. ఇక్కడున్న నీళ్ళు పంజాబ్ అంతటా కూడా దొరకవు,” అన్నాడు.
ఆహాఁ! మన దేశమే స్వర్గం. నేనైతే ఈ యుద్ధం తర్వాత సర్కార్ ఏ పది సెంట్ల భూమో ఇస్తే పండ్లతోట పెంచుకుంటా!”
“పెండ్లాన్ని పిలిపించుకుంటావా లేక ఆ పాలు పోసే ఫ్రెంచ్ దొరసానితో…”
“ఛ ఛ, ఆపవోయ్. ఇక్కడివాళ్ళకు సిగ్గూ శరం ఉండవు.”
“దేశానికి తగినట్టు అలవాట్లు. ఈ రోజు వరకూ సిక్కులు పొగ తాగరనే విషయాన్ని వాళ్ళు నమ్మనే నమ్మరు. ఆ ఫ్రెంచ్ ఆమె సిగరెట్ తీసుకొమ్మంటుంది. తానే నోట్లో పెడతానంటుంది. నేను వద్దని తప్పుకుంటే రాజు క్కోపం వచ్చిందా, ఇంక నా దేశం కోసం యుద్ధం చేయడం మానేస్తావా అంటుంది.”
“ఔనూ, బోధాసింగ్ కెట్లుంది ఇప్పుడు?”
“బాగుంది.”
“ఆఁ, నాకు తెలీదూ, రాత్రంతా నీ రెండు కంబళ్ళూ వాడికే కప్పావు. నీవా బట్టీ దగ్గరే కాలం గడిపావు. వాడి డ్యూటీ కూడా నీవే చేశావు. నీవు బాగా ఎండ బెట్టుకున్న చెక్కమంచం మీదా వాడిని పడుకోబెట్టావు. నీవీ బురదలోనే తిరుగుతున్నావు. జాగ్రత్త, నీవు జబ్బు పడేవు! ఇక్కడి చలికి న్యుమోనియా గాని వస్తే చావాల్సిందే. చస్తున్నా మురబ్బా కూడా దొరకదు.”
“నా గురించి బెంగెందుకు? నేను బులేలకీ కాల్వ ఒడ్డునే చచ్చేది. కీరత్‌సింగ్ ఒళ్ళో తల పెట్టుకొని ఉంటాను, నా చేతుల్తో నాటిన మా పెరటి మామిడి చెట్టు నీడలో. తెలుసా?”
వజీరా సింగ్ కనుబొమలు ముడేసి తీక్షణంగా “ఎందుకీ చావు మాటలు! ఆ చావేదో శత్రువులైన జర్మన్ తురకలకు రానీ! ఆఁ, భయ్యా, ఏంటదీ,” అంటూ పాట ఎత్తుకున్నాడు.
“ఓహో దిల్లీ కెళ్ళే పిల్లాదానా!
నగలూ నట్రా మాత్రం కాదు,
లవంగాలు గట్రా కొని తేవాలే,
వగలమారీ! గుమ్మడి కూరా
రుచిగా వండి తినిపించావా,
లొట్టలు వేస్తూ తినిపెడతానే.”
ఎవరనుకుంటారు ఈ గడ్డాలవాళ్ళు, సంసారపక్షం వాళ్ళు ఇటువంటి ఒక అల్లరిచిల్లర పాట పాడతారని! కానీ కందకంలో ఈ పాట మళ్ళీ మళ్ళీ పలికింది. సిపాయిలందరూ ఎంత హాయిననుభవించారో! నాలుగు రోజులనుంచీ వాళ్ళు సెలవుల్లో మజా చేస్తూన్నారేమో అన్నంతగా తేరుకున్నారు.
3.
అర్థరాత్రి కావస్తోంది. అంతా చీకటి. స్తబ్ధంగా ఉంది. బోధాసింగ్ ఖాళీ బిస్కట్ల డబ్బాలు మూడు పరచుకొని వాటి మీద తన రెండు కంబళ్ళనూ పరచుకొని పైన లహనాసింగ్ ఇచ్చిన రెండు కంబళ్ళనూ, ఓవర్ కోట్‌నూ కప్పుకొని నిద్రపోతున్నాడు. లహనాసింగ్ కందకానికి కాపలా డ్యూటీలో ఉన్నాడు. ఒక కంట కందకపు ప్రవేశద్వారాన్నీ, ఇంకో కంట బోధాసింగ్ బక్కచిక్కిన దేహాన్నీ చూస్తున్నాడు. బోధాసింగ్ గట్టిగా అరవడం విన్నాడు.
“ఏంటి బోధాసింగ్, ఏమయింది?”
“కాసిని నీళ్ళు ఇస్తావా?”
లహనాసింగ్ లోటాతో నీళ్ళు తెచ్చి తాగిస్తూ, “ఎలా ఉంది ఇప్పుడు?” అని అడిగాడు.
నీళ్ళు త్రాగి బోధా, “వణుకు తగ్గింది. కానీ వళ్ళంతా చలి పాకుతున్నట్టుంది. నోట్లో పండ్లు ఇంకా టకటక కొట్టుకుంటున్నాయి.” అన్నాడు.
“అయ్యో అవునా! సరే, నా జెర్సీ కూడా కప్పుకో.”
“మరి నీవు?”
“నేను బట్టీ దగ్గరే ఉంటాను కదా, వేడిగా అనిపించి చెమటలు పోస్తున్నాయి నాకు.”
“వద్దొద్దు. నేను తీసుకోను. నాలుగురోజుల్నించీ నీవన్నీ నాకే…”
“ఆఁ! అన్నట్టు గుర్తొచ్చింది. నా దగ్గర ఇంకొక జెర్సీ కూడా ఉంది. ఈరోజే వచ్చింది. విదేశాలనుంచీ ఎవరో అల్లి పంపుతున్నారంట అందరికీ. దేవుని దయవల్ల వాళ్ళు బాగుండాలి.” అంటూ తన కోటు, జెర్సీ విప్పసాగాడు.
“నిజమేనా?”
“మరి! అబద్ధమనుకుంటున్నావా?” అంటూ బోధా వద్దంటున్నా జెర్సీ కప్పి మళ్ళీ తన ఖాకీ కోటు, చొక్కా తొడుక్కొని కాపలా కాయడానికి తిరిగి వచ్చాడు. విదేశాలనుంచి ఎవరో జెర్సీలు అల్లి పంపడం అంతా కథే.
అరగంట గడిచింది. ఇంతలో బయటనుంచి పిలుపు వినిపించింది. “సుబేదార్ హజారాసింగ్!”
“ఎవరూ? లపటన్ సాహెబ్ గారా! నమస్తే సర్.” సైనిక వందనం చేసి నిటారుగా నించున్నాడు సుబేదార్.
“చూడు, ఇప్పుడే మనం దాడి చేయాల్సుంది. ఒక మైలు దూరంలో తూర్పు వైపు ఒక మూలకు ఒక జర్మన్ దండు ఉంది. అక్కడ ఒక యాభైకి మించి జర్మన్లు లేరు. ఇటు ఈ చెట్లదారినే వెళ్తే, రెండు పొలాల సరిహద్దులు దాటి ఒక దారి కనిపిస్తుంది. రెండు మూడు మలుపులున్నాయి. ఒక్కొక్క మలుపులో పదహైదుమంది సిపాయిలను ఉంచి వస్తున్నాను. నీవు ఇక్కడ ఒక పది మందిని మాత్రం ఉంచి అందర్నీ తీసుకొని బయల్దేరు. వాళ్ళను కలు. ఆ జర్మన్ల కందకాన్ని ఆక్రమించండి. మళ్ళీ ఆదేశాలందేవరకూ అక్కడే ఉండండి. ఇక్కడ నేనుంటాను.”
“అలాగే సర్జీ!”
వెంటనే అందరూ సిద్ధమయ్యారు. బోధా కూడా కంబళి పక్కకు పెట్టి లేచాడు. లహనాసింగ్ అతన్ని ఆపి తను వెళ్ళాలనుకున్నాడు. అంతలో బోధా తండ్రి సుబేదార్ బోధా వైపు వేలు చూపి సైగ చేయగానే, లహనాసింగ్ ఆగిపోయాడు. ఇంక దాడికి వెళ్ళకుండా కందకంలో ఉండి పోయేదెవరని చాలా చర్చ జరిగింది. ఎవరూ ఆగిపోడానికి ఇష్టపడలేదు. ఎలాగోలా నచ్చజెప్పి సుబేదార్ మార్చ్ బయల్దేరదీశాడు.
లపటన్ సాబ్ బట్టీ దగ్గరే నిలబడి సిగరెట్ బయటకు తీసి వెలిగించుకున్నాడు. పది నిముషాలయ్యాక లహనాసింగ్‌కు కూడా సిగరెట్ ఇదిగో, తీసుకొమ్మని ఇవ్వబోయాడు. రెప్పపాటులో లహనా బుఱ్ఱ వెలిగింది. తన ముఖంలో ఏ మార్పూ కనిపించకుండా, ఆఁ, ఇవ్వండి, అంటూ సిగరెట్ తీసుకోవడానికి ముందుకు వంగాడు. బట్టీ మంట వెల్తురులో సాబ్ ముఖం చూశాడు. జుట్టు చూశాడు. లపటన్ సాహెబ్ కున్న ఒత్తైన జుట్టు పోయి ఒక్కరోజులో ఇలా ఖైదీలకున్నట్టు చిన్నగా కత్తిరించిన జుట్టు ఎలా వచ్చింది?
సాహెబ్ తాగి ఉన్నాడా? లేక అతనికి జుట్టు కత్తిరించుకునే వీలు దొరికిందేమో? లహనాసింగ్ పరీక్షించాలనుకొన్నాడు. లపటన్ సాహెబ్ ఐదేళ్ళనుంచీ అతని రెజిమెంట్లో ఉన్నాడు.
“సాహెబ్, మనం హిందూస్తాన్ ఎప్పుడు వెళ్ళగలమంటారు?”
“యుద్ధం ముగిశాకే. ఏం, ఈ దేశం నచ్చలేదా?”
“అదికాదు సాబ్, వేటకెళ్ళడం ఆ మజా అవన్నీ ఇక్కడెక్కడ? గుర్తుందా మీకు, పోయినసారి తప్పు సమాచారంతో యుద్ధానికి సిద్ధమైనపుడు ఒకసారి వేటకు వెళ్ళాం, జగాధారీ జిల్లాలో!”
“అవునవును. అప్పుడు మీరంతా గాడిద మీద వెళ్తుండగా దార్లో మీ వంటవాడు అబ్దుల్లా ఒక గుడిలో అభిషేకం చేయించాలని ఆగాడు. కదా!”
సందేహం లేదు, వీడు ఆ బద్మాషే అనుకున్నాడు లహనాసింగ్.
“అప్పుడు ఆ పెద్ద దుప్పి ఎదురొచ్చింది. అసలంత పెద్ద దుప్పిని నేనెక్కడా చూడలేదు. మీరు గురిపెట్టి కాల్చేసరికి దాని భుజం మీద తగిలి మూపు లోంచి బయటికొచ్చింది. మీ వంటి ఆఫీసర్లతో కలిసి వేటాడ్డంలో మజానే వేరు. ఔను సర్, దాని తలను రెజిమెంట్ మెస్‌లో అలంకారంగా తగిలిస్తామన్నారు కదా, అది తయారై వచ్చిందా సిమ్లా నుంచి?”
“ఓ, అదా! దాన్ని నేను విదేశాలకు పంపేశాను…”
“ఎంత పెద్ద పెద్ద కొమ్ములు! రెండ్రెండు అడుగులుంటాయేమో!”
“ఆఁ! రెండడుగుల నాలుగంగుళాలు. నీవింకా సిగరెట్ వెలిగించలేదే?”
“ఇప్పుడే తాగుతా సర్, అగ్గిపెట్టె తీసుకొస్తా.” అంటూ లహనాసింగ్ కందకం లోపలివైపుకు వెళ్ళాడు. ఇంక సందేహం లేదు. ఏం చేయాలో క్షణాల్లో నిర్ణయించుకున్నాడు లహనాసింగ్. చీకట్లో లోపల పడుకున్నవారి కాలు తగిలింది.
“ఎవరూ, వజీరా?”
“ఔను, లహనా! ఏం, ఏం ముంచుకొచ్చింది? ఇప్పుడే కునుకు పడుతోంది.”
4.
“మేలుకోవయ్యా! మేలుకో! నిజంగానే ఆపద ముంచుకొచ్చింది. లపటన్ సాహెబ్ కాదు యూనిఫారంలో వచ్చింది.”
“ఏ…ఏంటీ!”
“మన లపటన్ సాహెబ్‌ను చంపేసన్నా ఉండాలి లేదా ఖైదు చేసన్నా ఉండాలి. ఆయన యూనిఫార్మ్ వేసుకొని ఎవడో జర్మన్ వచ్చాడు. సుబేదార్ ఇతని ముఖం సరిగ్గా గమనించినట్టు లేదు. నేను చూశాను, మాట్లాడాను. ఆ బద్మాష్ తడబడకుండా ఉర్దూ మాట్లాడుతున్నాడు, కానీ సహజంగా లేదు వాని భాష. నాకయితే సిగరెట్ ఇచ్చాడు తాగమని.”
“మరేం చేద్దాం?”
“చచ్చాం మనం. బాగా మోసపోయాం. సుబేదార్ అక్కడ బురదలో తిరుగుతుంటాడు. ఇక్కడ కందకం మీద దాడి జరుగుతుందిక. అక్కడ వాళ్ళ మీదా దాడి చేయకుండా ఉండరు. పద, ఒక పని చేయి. సుబేదార్‌తో వెళ్ళి చెప్పు వెంటనే తిరిగి రమ్మని. వాడు చెప్పిందంతా అబద్ధమని చెప్పు. వెంటనే బయల్దేరు. కందకం వెనుక వైపు నుంచి వెళ్ళిపో. భద్రం, ఒక్క ఆకు చప్పుడు కూడా కాకూడదు. ఆలస్యం చేయవద్దు!”
“ఇలా చేయడానికి మనకు ఆదేశాలు రాలేదు కదా, మరి…?”
“ఆదేశం రావాలా, ఇంకా నయం. నేనే ఆదేశిస్తున్నాను! జమాదార్ లహనాసింగ్! ప్రస్తుతం ఇక్కడున్న వారందరికీ పెద్ద అధికారిని. నేను చెప్పిన పని చేయి. ఇక్కడ ఈ లపటన్ సాహెబ్ సంగతి నేను చూసుకుంటా.”
“కానీ ఇక్కడ అంతా కలిసి ఎనిమిది మందే ఉన్నారు.”
“ఎనిమిది కాదు, ఎనిమిది లక్షలమంది! ఒక్కొఖ్ఖ సిక్కు ఒక లక్ష మందితో సమానం. ఊఁ, వెళ్ళు.”
మళ్ళీ మెల్లగా వచ్చి కందకం ప్రవేశద్వారం వద్ద మౌనంగా గోడకంటుకొని నించున్నాడు లహనాసింగ్. జాగ్రత్తగా గమనించసాగాడు. ఆ లపటన్ సాబ్ తన చొక్కా లోంచి మూడు చిన్న ఉండల్లా ఉన్న వాటిని తీసి కందకంలొ అక్కడక్కడా గోడలో దిగేశాడు. వాటినన్నిటినీ కలుపుతూ ఒక దారపుఉండతో కలిపి కట్టాడు. ఆ ఉండ చివరి భాగాన్ని బట్టీ దగ్గరే పెట్టాడు. తాను బయటివైపుకు వెళ్తూ, అగ్గిపుల్లను తీసి ఆ ఉండ మీద పెట్టబోతుండగా…
చప్పున కదలి మెరుపు వేగంతో తన తుపాకి వెనక్కి తిప్పి రెండు చేతులతో పట్టుకొని అతని తల మీద లహనాసింగ్ బలంగా మోదాడు. అతగాడి చేతిలో అగ్గిపెట్టె జారి పడింది. మెడమీద ఇంకొక దెబ్బ వేసే సరికి అబ్బా అంటూ పడిపోయాడతను. లహనాసింగ్ వెంటనే ఆ మూడు ఉండల్నీ గోడల్లోంచి పీకేసి బయట పడేశాడు. అతన్ని బట్టీ దగ్గరికి లాక్కుంటూ తీసుకొచ్చాడు. జేబులన్నీ వెదికాడు. మూడు నాలుగు కవర్లు, ఒక డైరీ దొరికాయి. తీసి తన జేబులో పెట్టుకొన్నాడు.
అంతలోనే వాడికి మెలకువ వచ్చింది. లహనాసింగ్ నవ్వుతూ – “ఏంటి లపటన్ సాహెబ్! ఎట్లుంది వంట్లో? ఈరోజు నేనెంత నేర్చుకొన్నానే చెప్పలేను. ఒకటా, రెండా? సిక్కులు సిగరెట్ తాగుతారని తెలుసుకొన్నాను. జగాధారీ జిల్లాల్లో దుప్పులుంటాయి. వాటికి రెండడుగుల నాలుగంగళాల కొమ్ములుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ముస్లింలు గుళ్ళోని మూర్తులకు అభిషేకం చేయాలనుకుంటారని, లపటన్ సాబ్ గాడిదనెక్కుతారని. సరే గానీ నీవు ఇంత వేగంగా ఉర్దూ మాట్లాడడం ఎలా నేర్చుకున్నావు? మా లపటన్ సాబ్ అయితే డామిట్ అనకుండా నాలుగైదు పదాలు కూడా మాట్లాడడు.” అన్నాడు.
లహనాసింగ్ పాంటు జేబులను వెదుకలెదు. సాహెబ్ తన చేతులను చలి ఉన్నట్టుగా తన రెండు చేతులను జేబులో పెట్టుకొన్నాడు.
లహనాసింగ్ – “ఊఁ! టక్కరివే. కానీ ఈ మాంఝే లహనాసింగ్ లపటన్ సాబ్‌తో ఇన్నేళ్ళ బట్టీ ఉంటున్నాడు. వీణ్ణి మోసగించడానికి రెండు కాదు నాలుగు కండ్లు కావాలి. మూడు నెలల క్రిందటనుకుంటా. ఒక తురక మౌల్వీ మా ఊరికి వచ్చాడు. పిల్లలు కాలేదని వచ్చే ఆడవాళ్ళకు తావీజులిచ్చేవాడు. పిల్లలకు మందులిచ్చేవాడు. చౌదర్ల ఇంటి మఱ్ఱిచెట్టు క్రింద మంచమేసుకొని కూర్చొని హుక్కా పీల్చేవాడు. జర్మనీవాళ్ళు గొప్ప పండితులని చెప్తుండేవాడు. మన వేదాలన్నీ చదివీ చదివీ వాళ్ళు విమానాలు తయారుచేసుకున్నారని చెప్పేవాడు. వాళ్ళు గోవుల్నీ చంపరనీ, హిందూస్తాన్‌కు వచ్చారంటే గోహత్య నిషేధిస్తారనీ చెప్పేవాడు. మండీ లోని వర్తకులకు పోస్టాఫీసుల్లోని మీ డబ్బు తీసేసుకొమ్మని, త్వరలో ఈ సర్కార్ రాజ్యం పోతుందని రెచ్చగొడుతుండేవాడు. అక్కడి పోస్ట్‌మాన్ పోల్హూరామ్ నిజమేననుకొని హడలిపోయాడు కూడా. నేనా ముల్లా గారి గడ్డం గీయించి ఊరి నించి తరిమేశాను. మళ్ళీ ఊర్లోకి అడుగుపెట్టావంటే…”
సాహెబ్ జేబులోంచి పిస్తోలు పేలింది. లహనాసింగ్ తొడలోకి దూసుకుపోయింది. లహనా తన హెన్రీ మార్టినీ రైఫిల్ రెండు రౌండ్లు కాల్చేసరికి సాహెబ్ కపాలక్రియ ముగిసింది. శబ్దాలు విని అందరూ పరుగెత్తి వచ్చారు.
బోధా, “ఏమయింది?” అంటూ లేచాడు.
లహనాసింగ్ – ‘ఏం లేదు ఒక పిచ్చి కుక్క వస్తే వేసేశా’నని చెప్పి అతన్ని పడుకోమన్నాడు. మిగిలినవారితో విషయమంతా చెప్పాడు. అందరూ తుపాకులను సిద్ధం చేసుకున్నారు. లహనాసింగ్ తలపాగా చింపి గాయానికి గట్టిగా బిగించి కట్టు కట్టుకున్నాడు. గాయం కండరానికే తగిలింది. గట్టిగా బిగించి కట్టు కట్టాక రక్తం ఆగింది.
ఇంతలో ఒక డెబ్భై మంది జర్మన్లు కందకం లోకి గట్టిగా అరచుకుంటూ దూరారు. సిక్కుల తుపాకీ వర్షం ఆక్రమణ మొదటి రౌండును ఎదుర్కోగలిగింది. రెండవ రౌండునూ ఆపగలిగింది. కానీ, అక్కడున్నది ఎనిమిదిమంది. (లహనా ఉండుండి తుపాకి పేలుస్తున్నాడు. నిలబడే ఉన్నాడు. మిగిలిన వారు నేల మీద పడుకొని పేలుస్తున్నారు.) వచ్చినవాళ్ళు డెబ్భై మంది. తమ సహచరుల శవాలపైనుంచి దాటి వాళ్ళింకా ముందుకొస్తున్నారు. కొద్ది క్షణాల తర్వాత…
ఉన్నట్టుండి వినిపించింది – “వాహె గురూజీ జయ్ హో। వాహె గురూజీ ఖాల్సా!”
ధడధడమంటూ తుపాకిగుండ్ల వర్షం జర్మనుల వెనుకవైపు నుంచి మొదలైంది. జర్మన్ల పరిస్థితి రెండు తిరగలి రాళ్ళమధ్య ఇరుక్కున్నట్టు అయిపోయింది. సుబేదార్ హజారాసింగ్, అతని బృందం వెనుకనుంచి నిప్పులు కురిపిస్తుంటే, ముందునుంచి లహనాసింగ్ తన వాళ్ళతొ కలిసి తీవ్రంగా పోరాడుతున్నాడు.
కేకలు మిన్నంటాయి. అకాల్ సిక్కుల ఫౌజు వచ్చింది! వాహె గురూజీ జయ్ హో! వాహెగురూజీ దా ఖాల్సా! సత్ శ్రీ అకాల్ పురుఖ్! – యుద్ధం ముగిసింది. అరవై ఏడుగురు జర్మన్లలో కొందరు మట్టి కరిస్తే, కొందరు గాయాలతో అరుస్తున్నారు. పదిహైదు మంది సిక్కులు అమరులయినారు. సుబేదారు కుడిభుజాన్ని గుండు గీసుకుపోయింది. లహనాసింగ్ పక్కటెముకల్లో ఒక గుండు తగిలింది. గాయానికి కందకంలో ఉన్న తడి మట్టి రాశాడు. పాగాలో మిగిలిన ముక్కని చుట్టూ తిప్పి కట్టుకున్నాడు. ఇతని రెండో గాయమూ పెద్దదేనని ఎవరూ గమనించలేదు.
యుద్ధం జరుగుతున్నప్పుడే చంద్రోదయమూ అయింది. సంస్కృత కవులిచ్చిన క్షయీ బిరుదుకు తగినట్టు చంద్రుడు తన పేరు సార్థకం చేసుకున్నట్టున్నాడు. బాణభట్టకవి వర్ణించిన దంతవీణోపదేశాచార్య స్థాయిలో చల్లగాలి వీస్తోంది. వజీరా సింగ్ తాను సుబేదారును తిరిగి తీసుకురావడానికి వెళ్తూంటే టన్నులకొద్దీ బురద తన బూట్లకు అంటుకొందొ వర్ణిస్తున్నాడు. సుబేదారు, లహనాసింగ్ ద్వారా జరిగిందంతా విని, అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని పొగడుతూ, ఈరోజు నీవు లేకుంటే మేమంతా చచ్చిపోయే వాళ్ళం అన్నాడు.
ఈ తుపాకీ చప్పుళ్ళు కుడివైపు మూడుమైళ్ళ దూరంలో ఉన్న రెజిమెంట్‌కు వినబడినట్టుంది. వాళ్ళ నుంచి టెలిఫోన్ వెళ్ళినట్టుంది. వెంటనే గంట, గంటన్నర లోపల ఇద్దరు వైద్యులతో సహా రెండు బండ్లు కూడా గాయపడిన వారికోసం పంపించబడ్డాయి. దగ్గర్లో ఫీల్డ్ వైద్యశాల ఉంది. తెల్లవారే సరికి చేరుకోవచ్చు. అందుకే ప్రాథమికచికిత్సల అనంతరం ఒక బండిలో గాయపడిన వాళ్ళను, ఇంకో బండిలో శవాలను ఎక్కించారు. సుబేదారు వచ్చి లహనాసింగ్ తొడకయిన గాయానికి కట్టు కట్టించుకోమన్నాడు. లహనాసింగ్ పట్టించుకోకుండా చిన్న గాయమే, పొద్దున చూడచ్చంటూ దాటవేశాడు. బోధాసింగ్ జ్వరంలో మూలుగుతున్నాడు. వాడినీ బండిలో పడుకోబెట్టారు. లహనాను వదిలి సుబేదార్ వెళ్ళలేదు. అది చూసి లహనాసింగ్ అతన్నీ ఎక్కమన్నాడు. బోధాసింగ్ మీద, సుబేదార్ భార్య మీద ఒట్టుపెట్టి ఎక్కమన్నాకే కదిలాడు.
“మరి నీవు!”
“మీరు వెళ్ళి నాకోసం బండి మళ్ళీ పంపండి. జర్మన్ శవాల కోసం కూడా బండి వస్తుంది. నాకు పర్వాలేదు. చూస్తున్నారు కదా ఎలా నిలబడినానో! వజీరాసింగ్ కూడా నాతోనే ఉన్నాడు.”
“సరే. కానీ…”
“బోధాకు బండిలో పడుకోడానికి ఉంది కదా! మంచిది. మీరూ ఎక్కండి. ఆఁ, ఇంట్లో వాళ్ళకు ఉత్తరం వ్రాస్తే నా నమస్కారాలు తెలియచేయండి. ఇంటికి వెళ్ళినపుడు చెప్పండి — వారు చెప్పినట్లు చేశానని.”
బండ్లు బయల్దేరబోతున్నాయి. సుబేదారు బండెక్కుతూ, లహనా చేయి పట్టుకొని, “నీవే బోధాను, నన్ను రక్షించావు. ఉత్తరం ఎందుకు? ఈసారి ఇంటికెళ్ళినపుడు నా కూడా వచ్చి నీవే చెప్పురాదూ ఆమెకు! ఇంతకీ ఏం చెప్పింది?”
“ఎక్కండి, ఎక్కండి మీరు. నేను చెప్పింది తప్పక వ్రాయండి. చెప్పండి.”
బండ్లు బయల్దేరగానే లహనా కూలబడ్డాడు. “వజీరా! కాసిన్ని నీళ్ళు పట్రా. ఈ నడుంకట్టు విప్పు. అంతా రక్తంతో తడిసిపోయింది.” అన్నాడు.
5.
మరణం సమీపించినపుడు కొంచెం సేపు గతస్మృతులు తాజా అవుతాయి. జీవనగమనమంతా ఒక్కసారి కళ్ళముందు చక్రంలా తిరుగుతుంది. పేరుకున్న కాలధూళి తొలగుతూ ఉంటే దానితో కప్పబడిన రంగులన్నీ బయటపడి, స్పష్టంగా గోచరిస్తాయి.
6.
లహనాసింగ్ కప్పుడు పన్నెండేళ్ళు. అమృత్ సర్‌లో మేనమామ యింటికి వచ్చాడు. పెరుగో కూరలో కొనేటపుడు, అక్కడా ఇక్కడా అతగాడికి ఒక ఎనిమిదేళ్ళమ్మాయి కనిపించేది. నీకు పెళ్ళి కుదిరిందా? అని అడగ్గానే ఫో! అంటూ పారిపోయేది. ఒకరోజు అలా అడగ్గా, ‘ఆఁ, కుదిరింది. చూడు ఈ పట్టు పూల దుపట్టా వాళ్ళిచ్చిందే!’ అన్నది విని లహనాసింగ్‌కు ఎంత దుఃఖం వచ్చిందో! ఎంత బాధ కలిగిందో! ఎందుకు కలిగింది?
“వజీరాసింగ్, కాసిన్ని నీళ్ళు ఇస్తావా?”
పాతికేళ్ళు గడచిపోయాయి. ఇప్పుడు లహనాసింగ్ 77 నం. రైఫిల్స్ దళంలో జమాదార్ అయినాడు. ఆ ఎనిమిదేళ్ళ అమ్మాయి సంగతే మనసులో లేదు. మళ్ళీ ఎప్పుడైనా కలిసిందో, లేదో! ఒక వారం రోజులు సెలవు పెట్టి పొలం తగాదా వాయిదా ఉంటే ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే రెజిమెంట్ ఆఫీసరు నుంచి ఉత్తరం వచ్చింది – ఆర్మీ లామ్‌కు వెళ్తుంది, వెంటనే రావాలని. అంతలో సుబేదారు హజారాసింగ్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ‘నేనూ మా వాడు బోధాసింగ్ కూడా లామ్‌కు వెళ్తున్నాము. నీవు వెళ్ళేటప్పుడు ఇటు మా ఇంటికి రా. కలిసి వెళ్దాము,’ అని. సుబేదార్ వాళ్ళ ఊరు ఎలాగూ దార్లోనే ఉంది. సుబేదారుకు లహనాసింగ్ అంటే చాలా ఇష్టం కూడా. లహనాసింగ్ ప్రయాణమై సుబేదారు ఇంటికి చేరుకున్నాడు.
బయల్దేరేముందు సుబేదార్ జనానా నుంచి బయటకొస్తూ, “లహనా, ఇంటావిడకు నీవు తెలుసంట. పిలుస్తుంది వెళ్ళు,” అని చెప్పాడు. లహనాసింగ్ లోపలికెళ్ళాడు, ఆమెకు నేనెలా తెలుసబ్బా అనుకుంటూ. రెజిమెంట్ క్వార్టర్స్‌లో కూడా సుబేదారు కుటుంబం ఎప్పుడూ నివసించి ఉండలేదు. తలుపు దగ్గర నిలబడి నమస్తే అన్నాడు. బదులు విన్నాడు. లహనాసింగ్ మౌనంగా నిలబడ్డాడు.
“నన్ను గుర్తు పట్టలేదా?”
“లేదే!”
“నీకు పెళ్ళి కుదిరిందా? ఫో! నిన్నే కుదిరింది, ఈ పట్టుపూల దుపట్టా చూడు- అమృత్ సర్!”
ముప్పిరిగొన్న భావోద్వేగాల మధ్య తెలివిడి వచ్చింది. పక్కకు తిరిగి పడుకొన్నాడు. పక్కటెముకల గాయం సలుపుతోంది.
“వజీరా, నీళ్ళు ఇస్తావా? – తన మాట కోసం.”
కలా మెలకువా కాని స్థితి. సుబేదారిణి చెప్తోంది – “నిన్ను చూస్తూనే నేను గుర్తు పట్టాను. నీకొక పని అప్పగిస్తున్నాను. సర్కారు బహద్దూర్ అని బిరుదిచ్చింది, లాయల్పూర్‌లో భూమి ఇచ్చింది. ఈనాటికి విశ్వాసం చూపించే అవకాశం వచ్చిందంట. ఆ సర్కారు ఆడవాళ్ళనూ సైన్యంలో ఎందుకు చేర్చుకోదో? నేనూ సుబేదార్‌ను వెంట ఉండి చూసుకొనే దాన్ని. ఒక్క కొడుకున్నాడు. పోయినేడే సైన్యంలో చేరినాడు. వాడి తర్వాత కూడా నాలుగు కాన్పులైనా ఒక్కరూ దక్కలేదు.” గొంతులో ఏడుపు.
“ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ యుద్ధానికి బయల్దేరుతున్నారు. నా తలరాత ఎట్లుందో?
నీకు గుర్తుందా, ఒకరోజు జట్కాబండి నుంచి నా ప్రాణాలు కాపాడావు కొట్టు దగ్గర. గుఱ్ఱం దెబ్బలు నీవు తిన్నా, నన్ను మాత్రం జాగ్రత్తగా గట్టుమీదకెక్కించావు. ఈ సారి వీళ్ళిద్దరినీ కాపాడాలి నీవు. నిన్ను వేడుకుంటున్నాను. కొంగు పరచి భిక్ష అడుగుతున్నాననుకో.”
ఏడుస్తూ సుబేదారిణి లోపలికెళ్ళిపోయింది. లహనా కండ్లు తుడుచుకొని బయటికొచ్చాడు.
“వజీరాసింగ్, నీళ్ళు కొంచెం… తన మాట కోసం.”
లహనాసింగ్ తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు వజీరాసింగ్. అడిగినపుడల్లా నీళ్ళు గొంతులో పోస్తున్నాడు. అర్ధగంట వరకూ లహనా మౌనంగా ఉండిపోయాడు. తర్వాత –
“ఎవరూ? కీరత్‌సింగా?”
వజీరా కొంచెం ఆలోచించి, “ఔను,” అన్నాడు.
“భయ్యా, కొంచెం నా తల పైకెత్తు. నీ తొడమీద పెట్టు.”
వజీరా అలాగే చేశాడు.
“ఆఁ! ఇప్పుడు సరిగ్గా ఉంది. కొంచెం నీళ్ళు పోస్తావా? ఆఁ! చాలు. ఈ వేసవిలో మామిడిపండ్లు బాగా వచ్చేటట్టున్నాయి. అందరూ ఇక్కడే కూర్చొని తినండి. నీ మేనల్లుడు ఎంత ఉన్నాడో అంతున్నాయి పండ్లు. వాడు పుట్టిన నెలలోనే ఇక్కడ ఇవి నాటించినాను నేను.”
వజీరా కండ్లు తడి అయ్యాయి.
కొన్నాళ్ళ తరువాత ప్రజలు పత్రికల్లో వార్త చదివారు.
ఫ్రాన్స్, బెల్జియం. 68వ సూచి: ఫీల్డ్‌లో గాయాల పాలై మరణించినవారు – 77 నం. సిఖ్ రైఫిల్స్ – జమాదార్ లహనాసింగ్.
(చంద్రధర్ శర్మా గులేరీ 1915లో రచించిన కథ ఉస్ నే కహా థా (उस ने कहा था). ఈ కథ మొదటి ప్రపంచయుద్ధం నేపథ్యంలో ఆ కాలపు ముఖ్యఘట్టాల మధ్య పవిత్రప్రేమ, ఆత్మబలిదానం వీటిని ఆదర్శంగా తీసుకొని ఉదాత్తంగా చిత్రించిన విధానం విలక్షణంగా ఉండి విమర్శకుల మన్ననలందుకుంది. కథా వస్తువుకు అనుకూలమైన శిల్పవిధానము, భాషాప్రౌఢిమ, ఆ కాలంలోని కథ యొక్క శైశవకాలపు అపరిపక్వతను విడిపించి కథకు ఒక గౌరవనీయమైన స్థానాన్ని చేకూర్చిందని విమర్శకులంటారు. హిందీ కథల వికాసానికి సాక్షిగా నిలిచిన సరస్వతి పత్రికలో ప్రచురింపబడిన ఈ కథ కథల స్వతంత్రగమనానికి తొలి అడుగుగా మెప్పుపొందింది. గులేరీ వ్రాసినవి మొత్తం మూడే కథలు. కానీ మిగతా రెండు గాని, వేరే రచయితల నాటి, నేటి కథలు గాని, ఏవీ ఈ కథకు పోటీ ఇవ్వలేవని ముందుమాటల్లోనూ, సాహిత్యచర్చల్లోనూ ప్రముఖంగా వినబడే మాట. వందేళ్ళ క్రితం నాటి ఈ కథ పఠనీయతను గానీ, వస్తుగతమైనప్రాసంగికతను కానీ కళాత్మకతను గానీ కోల్పోలేదని హిందీ సాహిత్యకారుల నమ్మకం. 1883లో పుట్టి, 1922లో మరణించిన గులేరీ ఒకే ఒక్క కథ ఇచ్చిన కీర్తితో ఇప్పటివరకూ హిందీ సాహిత్య చరిత్రలో నిలబడిపోవడం గమనార్హం. )