ఆశనిరాశలు

“ఏమండీ, వాళ్ళు వచ్చి వెళ్ళారు.”

“ఎవరు?”

“ఏమో, ఏదో దుక్కిపాడు వాళ్ళట. ఏదో అర్జంట్ పని అన్నారు.”

“ఏంచేయాలో తెలీటల్లేదు. అందరూ అర్జెంట్ అంటున్నారు. ఊరు వదిలిపోదామన్నా లేదు. చద్దామన్నా పాప గురించే ఆలోచన.”

“పాపని వాళ్ళ అమ్మమ్మగారింటికి పంపేద్దామండి.”

“పాపని వదిలి క్షణమైనా ఉండలేను, అటాచ్మెంట్ వదులుకోలేకపోతున్నాను.”

“మనం ఇలా ఊరుకుండలేము కదా…”

“అర్థమైతుంది నీవు చెప్తున్నది. కానీ… చావడం… అంత సులభం కాదు.”

“మరి? ఇలా అయితే ఈ సమస్యకు పరిష్కారమేముంది? ఎవరికైనా చెప్దామన్నా పలకరించే వాళ్ళే కరువయ్యారు. అన్నిట్లో ఓడిపోయినవారి బ్రతుకే ఇంత.”

“జీవితంలో ఓడిపోయినవాడే జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలడు. చేతిలో పైసా లేనినాడింతే. దిక్కులేనివాళ్ళమే అవుతాము.”

“నిన్న మీ శీనన్న వచ్చారు. చాలా సేపు ఏం మాట్లాడలేదు, తర్వాత, ఏం చేస్తారు మరి అని అడిగారు. నాకు కన్నీళ్ళాగలేదు. నేనేమీ పలుకలేదు.”

“పైపైన పలుకరించేవాళ్ళు చాలా మందే ఉన్నారు. శీనన్నేమో చెప్తాడు. కానీ వాడిదేం జరుగుతుంది ఇంట్లో? పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? పోన్లే, వచ్చి పలుకరించాడు. అంతేచాలు.”

“ఏమండీ, ఆ ..మిగిలిన బంగారం కూడా అమ్మేస్తే?”

“అమ్మితే మీ తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించగలను? వేసవి వస్తోంది. వరుసగా శుభకార్యాలు! అక్కడ నలుగురిలో ఆ సొమ్ములూ లేకపోతే వాళ్ళు బాధపడతారు. అంతకన్నా చావే…”

“అదైనా చేద్దాము. ఊరికే రోజూ ఏడ్చి చచ్చే దానికన్నా ఒకేసారి చావడం మేలు.”

అంతరంగ మృదంగ…

“ఏమండీ, ఫోన్ మ్రోగుతోంది”

“ఎవరండీ ఫోన్లో? మీ గొంతదోలా ఉందనిపించింది.”

“భట్ గారే, డబ్బు చాలా అర్జంటుగా కావాలంటున్నారు.”

“మొన్న మన కొట్టుకూ వచ్చారు. వారంలోగా డబ్బివ్వకపోతే వచ్చి ఇక్కడే కూర్చుంటానని చెప్పు, అన్నారు.”

“రేపే వెళ్ళిపోదాం. ఏమైనా కానీ, ఇంతే మన బ్రతుకింక.”

“ఎక్కడికి వెళ్తామండీ… ఎలా? పాప సంగతో?”

“అనుకున్నట్టే తనను సాగర్ కు పంపేద్దాం. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో చీటీ వ్రాసి పెడితే, ఈ ఇల్లు అమ్మేసి అన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. అన్నీ పోగొట్టుకొని బ్రతికేకంటే చావడమే…”

“అదికాదండీ. మీ వాళ్ళను ఒక్కమాట అడిగి చూడాల్సింది. అంత ఉంది కదా, కొంచెమన్నా సహాయం చేయకపోయేవారా?”

“మా చిన్నన్న ఐదే వేల రూపాయలకు ఆరోజు కొట్టు కొచ్చి అంత గొడవ చేశాడు. ఎవరో ఇచ్చిపోయినది, నేను ఖర్చు చేసుకున్నాను. నాకిప్పుడే కావాలని ఒకటే గొడవ.”

“ఇంత కష్టం మనకే ఎందుకు వచ్చిందండీ! కావాలని మనమేం చేసుకోలేదు. అల్లం రేట్లు ఇంతగా పడిపోతాయని కలగన్నామా? మన తలరాత, మన కష్టానికి ఫలితమే దక్కలేదు.”

“అదేనే, జీవితమన్నాక ఏమైనా జరుగుతుంది. ఇది మనకొక గొప్ప పాఠం అనుకో.”

“ఏమండీ, ఎవరో తలుపు తడుతున్నారు చూడండి.”

“నాన్నా! నాన్నా! ఆట ఎంత బాగుండిందో, రేపు కూడా వెళ్ళనా?”

“ఏ ఆటమ్మా? దాగుడుమూతలా?”

“కాదు నాన్నా, ప్రక్కింటి మేష్టారు గారమ్మాయికి ఫోన్లో అదేదో పెద్ద టాబ్ అని ఉంటుంది కదా అది కొనిచ్చారు. దాంట్లో ఆటలున్నాయి, పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి నాన్నా. నాన్నా, మరి నాకూ కొనిస్తావా?”

“తప్పకుండా కొంటానమ్మా. ఇప్పుడు నా పరిస్థితి అంతగా బాలేదమ్మలూ. కొన్ని రోజులాగు. తప్పక కొనిపెడతాను. అలుగవుగా?”

“నాన్నా, నేనింకేమీ అడగను. ఇదొక్కటీ కొనిపెట్టవా? ఆ మేష్టరు గారమ్మాయి దాన్ని నా చేతికే ఇవ్వదు. తాకొద్దు అంటూ దూరం నించే చూపిస్తుంది.”

“ఏమండీ, పాపం నా చిట్టితల్లి. మా అమ్మానాన్నకు ఏదో చెప్పుకోవచ్చు. ఎలాగైనా దీనికి అది కొనివ్వాలి. ఒక్కగానొక్క బిడ్డ. దీనికే లోటూ రాకూడదు.”

“చూద్దామన్నానుగా. ఒక రెండుమూడు రోజుల్లో ఎక్కడైనా కొంత మొత్తమయినా దొరుకుతుందేమో చూస్తాను.”

“ఎలాగండీ, ఇప్పుడే ఇంత ఉండగా మళ్ళీ అప్పెక్కడ దొరుకుతుంది? భట్ గారు, బాంకు వాళ్ళు… నాకయితే పిచ్చి పట్టేటట్లుంది.”

“ఏం చేస్తాం చెప్పు, మనం చేతులారా చేసుకున్నది కాదు. మన తలరాత! ఎవరికి చెప్పుకుంటాం? దేవుడు ఎలా ఆడిస్తాడో ఆడించనీ.”

“ఏమండీ, నాకిదంతా చూస్తుంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది. అంతే చేద్దాం. రేపు ముందు పాపని వదిలేసి రండి.”

“ఈమధ్యే నాకీ ఆలోచనలు. రాన్రానూ బతుకు భారమౌతోంది. ఎవరన్నా ఏమన్నా అన్నా తట్టుకోలేక పోతున్నాను. నా చదువు, ఎం.ఎ.లో వచ్చిన రాంకు, గోల్డ్ మెడల్, నా సాహిత్యం ఇచ్చిన గౌరవం ఇవన్నీ గుర్తొస్తాయి.”

“ఏ బహుమానాలు, ఏ పతకాలు ఇప్పుడు దేనికీ పనికిరావడం లేదు. మనిషి చేతిలో డబ్బుంటేనే విలువ. ఇప్పుడు ఎవరూ పలుకరించే వాళ్ళే లేరు.”

“నాన్నా, నాకు టాబ్ కొనివ్వకపోతే నేను బడికి పోను. నాకింకేమీ వద్దు. ఇదొక్కటీ కొనివ్వు చాలు.”

“అలాగేనమ్మా. రెండ్రోజులాగు.”

“నాన్నా, ఫోన్!”

….

“ఎవరండీ, ఏంటంత సేపు మాట్లాడారు ఫోన్లో?”

“భట్ గారే. డబ్బు రేపే కావాలంట. ఇంక ఆగలేను అంటున్నారు. రేపు వస్తారంట. నేను రేపే సాగర్‌కు వెళ్తాను. కొట్లో సామానేం లేదు. కొనడానికి డబ్బూ లేదు. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు.”

“వద్దండీ, ఇంకా మర్యాద పోయేవరకూ ఉండొద్దు మనం.”

“సరే, రేపే పాపని వదిలిపెట్టి వస్తాను. కానీ, మనకెవ్వరూ దిక్కే లేరు అని బాధగా ఉంది. మీవాళ్ళు ఇప్పటికే చాలా ఇచ్చారు. ఇంకా ఎంత ఇస్తారు? మనమూ ఏ ముఖం పెట్టుకు అడుగగలం? పోనీ, అనుకున్నట్టే చేద్దాం.”

“పాపా రామ్మా, నాన్న నిన్ను తాతగారింట్లో వదిలేసి వస్తారు. కొత్త బట్టలేసుకుందుగాని, రా. అక్కడ మొండి చేయద్దేం! మామతో పోట్లాడకు. చక్కగా బుద్ధిగా ఉండాలి. ఏమన్నా కావాలని అల్లరి చేయకు. అక్కడే బడిలో చేర్పిస్తాము. ఏడవకూడదు. అమ్మ, నాన్న కావాలని మొండిపట్టు పట్టకూడదు. సరేనా?”

“అమ్మా, నేనక్కడే ఉండాలా? నేను నాన్నను వదిలి ఉండలేను. నాన్నే గుర్తొస్తారమ్మా. నాకేడుపు వస్తుంది. నాన్నతో వెళ్ళి మళ్ళీ రేపే వచ్చేస్తా. అక్కడే ఉండాలంటే మాత్రం ఉండను. అమ్మా, నాన్న నాకు టాబ్ కొనిస్తారు కదా?”

“కొనిస్తారమ్మా. కానీ నీవు అక్కడుంటేనే కొనిస్తారు. ఇక్కడైతే లేదు.”

“నాన్నా, పోదామా? బస్ వచ్చింది.”

“పాపా, పరికిణీ పైకి పట్టుకోమ్మా, కాలికి అడ్డం పడుతోంది. అల్లరి చేయకుండా ఉండాలి. ఏం? ఏమండీ, త్వరగా వచ్చేయండీ.”

“అలాగే, కానీ భట్ గారు కానీ, ఇంకెవరైనా వస్తే రేపు కలుస్తానని చెప్పు. త్వరగా వస్తాలే.”


“ఎక్కడ? ఎక్కడున్నాడు?”

“ఆయన సాగర్ వెళ్ళారండి. వచ్చేస్తారు సాయంకాలం.”

“సాయంకాలం రానీ, రేపు రానీ. నేనిక్కడి నుంచి కదలను. నాకు డబ్బు కావాలి. కావాల్సిందే ఇవాళ. నిన్ననే ఫోన్ చేశాను. కావాలనే తప్పించుకున్నట్టున్నాడు.”

“అయ్యో, లేదండీ. మా పాపకు బాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఔను, మీరు ఫోన్ చేశారని నాతో అన్నారు కూడా. మాదగ్గర బొత్తిగా… ఏమీ లేదు. కొంత సమయమివ్వగలరా?”

“నాకు నా డబ్బు కావాల్సిందేనమ్మా. లేదంటే మీ ఇంటికే వచ్చి కూర్చుంటాను. మీ దగ్గర లేదూ అంటే మీ ఇల్లు మీ వాళ్ళే అడుగుతున్నారుగా, అమ్మేసి ఇవ్వచ్చుగా?”

“అలాగేనండీ. ఏదో విధంగా ఏర్పాటు చేస్తాము. కొంచెం సమయమివ్వండి దయచేసి.”

“సమయమివ్వచ్చమ్మా. అయితే ఎవరైనా పూచీ పడాల్సి ఉంటుంది. మీ బావ నడిగితే నాకే సంబంధమూ లేదంటారు. అందుకే ఇంత కటువుగా ఉండాల్సొచ్చింది.”

“అలాగేనండి. బావగారిటొస్తే నేనే మాట్లాడుతాను. ఇల్లమ్మయినా సరే మీ డబ్బు కట్టేస్తాం.”

“సరే, ఇప్పటికి వెళ్తున్నా. మళ్ళీ వచ్చేవారం వస్తాను. అప్పుడు ఇవ్వకపోతే ఇక్కడే ఉండిపోతాను.”


“హలో! ఏమండీ! భట్ గారు వచ్చి వెళ్ళారు. చాలా మాటలన్నారు. ఇల్లమ్మి డబ్బిచ్చేయచ్చు కదా అన్నారు. మీ అన్న, ఇల్లు తాను తీసుకుంటానన్నారంట. అతనికి అమ్మి నాకు డబ్బు ఇవ్వండి అన్నారు. ఏమైనా సరే మీరు వచ్చేటపుడు విషం సీసా కొనుక్కొని రండి. ఇంక ఉండి చేసేదేముంది? వెళ్ళిపోదాం మనం.”

“అంతే అంతే. తెస్తాను. పాప ఇక్కడ బాగానే ఉంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాను.”


“హలో! అమ్మా! పాప ఎలా ఉంది? బయట ఎండలో తిరగనివ్వకమ్మా. ఏమైనా అల్లరి చేస్తుందేమో, దాన్నేమీ అనకమ్మా. కొట్టబోకు.”

“లేదే, పాప చక్కగా ఉంది. ఇప్పుడే భోంచేసింది. ఆడుకుంటోంది. నీవు కంగారుపడకు.”


“తలుపు తీస్తావా? నేను వచ్చేశా. ఏంటి కరెంట్ లేదా? ఏం చేస్తున్నావు?”

“వస్తున్నా, వంటింట్లో ఉన్నా. ఇంతకీ తెచ్చారా?”

“ఊఁ… ఎందుకో మనసేం బాలేదు. పాపే గుర్తొస్తోంది. వదలి వస్తూంటే త్వరగా రా నాన్నా అని పదేపదే చెప్పింది. నాకు కన్నీళ్ళాగలేదు. గుండె రాయి చేసుకొని వచ్చాను.”

“నాకూ ఏడుపొస్తోందండీ, ఇంకేం చెప్పొద్దు. మన జీవితాలు ఇవాళ్టితో ముగిసే పోతున్నాయి కదా.”

“పోనీ, ముగిసిపోనీ. భోజనమయ్యాక తీసుకుందాం. పాప తో ఒకసారి మాట్లాడదాం. నాకేమిటో ఎలాగో ఉంది.”

“భోజనాలు చేసి అన్నీ ముగించుకొని ఫోన్ చేస్తా. నాకుమాట్లాడాలంటేనే జంకు గా ఉంది. మన బ్రతుకు ముగిసిపోయింది. అమ్మాయినైనా దేవుడు చల్లగా చూడాలి.”

“ఆ,ఆఁ… ఏడవకే, ఏడవకు. జీవితంలో వేసారిపోయాను. నా తలరాత ఎటూ బాలేదు. నాతో పాటు నీ జీవితాన్నీ నాశనం చేశాను. నీవు సుఖంగా పెరిగినదానివి. పోనీ చూడు నీకు చనిపోవాలని ఉందా? ఆలోచించు… లేకుంటే…”

“అంటే, మిమ్మల్ని పోగోట్టుకొని నేను మాత్రం బ్రతికేదా? చస్తే కలిసే, బ్రతికితే కలిసే. నాకూ ఈ బ్రతుకు మీద విరక్తి పుట్టింది. డబ్బే సర్వస్వం అని నమ్మే ఈ ప్రపంచం నాకూ వద్దు. అందరికీ మనం భారం అయిపోయాం. సరే, పదండి భోంచేద్దాం.”

“ఇది మన ఊరి ప్రక్క వంట. బాగా వేసుకొని తిను. ఈరోజుతో తిండికీ మనకూ ఋణం తీరింది.”

“ఏమండీ, నాకొక్క సారి మీ ఒళ్ళో తల పెట్టుకొని తనివిదీరా ఏడవాలని ఉంది. ఇంక ఈ బంధం స్వర్గంలోనో నరకంలోనో, మీరు… మీరేడవకండి. మీరు మారాజులు. మీ కంట్లో నీరు రాకూడదు. ఇప్పుడు మీరేడిస్తే ఎలా? మీ అమ్మ పోయేటపుడు ఏమన్నారో గుర్తుందా? ఎవరిముందూ తల దించవద్దని చెప్పలేదూ? మర్చిపోలేదుగా? ఏడవకండి.”

“నిన్న అక్కను కొంత డబ్బిమ్మని అడిగాను. మేమే అప్పుల్లో ఉన్నామంది.”

“వాళ్ళివ్వలేదని తప్పుగా అనుకోకండి. మన ఖర్మ బాలేనపుడు దేవుడు వాళ్ళ నోటినుండి అలా అనిపిస్తాడు.”

“పోనీ.

మాట ఇచ్చి తప్పలేను.
చేటు నెపుడు తలపెట్టను.
మాట కోసం పులిని చేరగ
పోదునే నా చిన్ని దూడా!

పాట గుర్తొస్తోంది.”

“ఏమండీ! నా ఫోన్ మ్రోగుతున్నట్టుంది!”

“హలో! హలో! ఆఁ.. అవునా? సరే, సరే, నేను రేపే వస్తాను.”

“ఎవరు చేశారు?”

“మీ అమ్మ. పాప అమ్మ, నాన్న కావాలని ఏడుస్తోందట. నేనిక్కడ ఉండనంటూ అన్నం కూడా తినలేదట.”

“ఇలా అయితే రేపు మనం చస్తే? ఎలా ఉంటుంది? దానిదే ఆలోచన అయిపోయిందండీ! దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామంటారా?”

“వద్దొద్దు . ఈ రోజు తాగేది వద్దు. నాకు పాపే గుర్తొస్తోంది. రెండ్రోజులాగి ఆలోచిద్దాములే.”


“ఈ ఇల్లు మీ అన్నకే ఇచ్చేద్దాము. కొంతయినా అప్పు తీరుతుంది.”

“నీవే చూడు. మా అన్న దగ్గర ఈ ఇల్లు కొనడానికి డబ్బు ఉంది. అయితే ఆరోజు ఐదు వేలకు నాతో గొడవ పడ్డాడు. సరే, నీవు కొట్లో కూర్చో. నేనెళ్ళి పాపను తీసుకు వచ్చేస్తాను. ఎందుకో పాపను వదిలి ఉండబుద్ధి కావడమే లేదు.”

“పోనీ, మీకొక ఉద్యోగమన్నా దొరికితే బాగుండు. ఎంత కష్టపడినా అదీ కుదరట్లేదు. ఏ ఊరి కాలేజ్ లో దొరికినా సరే, ఇక్కడ ఉండేదే వద్దు. గంజినీళ్ళు త్రాగి బ్రతికినా చాలు.”

“సాగర్ కాలేజ్ లో రావచ్చు. భట్ గారు మాట్లాడి చూస్తానన్నారు.”

“ఏమండీ ఫోన్!”

“భట్ గారా, అలాగేనండీ. ఇల్లు మా అన్నకే అమ్మేసి ఒక వారంలో మీకిచ్చేస్తాను. హ హ మీరు రావొద్దు. నేనే వచ్చి ఇస్తాను.”

“ఔనండీ, అదే చేయండి. అప్పున్నప్ప్పుడు ఇల్లు పెట్టుకొని మాత్రం ఏం చేస్తాం? ఎవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చేయండి. ఎవరూ ఇంకా బాకీ ఉన్నామనకూడదు. ఉన్నదంతా పోతే పోనీ. అప్పు మాత్రం ఉండకూడదు.”


“మొత్తం మీద ఇల్లమ్మేసి అన్నీ కట్టేశాము. అన్నతో బాంక్ లోను సగం కడదామంటే నా పూచీకత్తు ఉందిలే అన్నాడు.”

“పోనీలెండి. అంతా బాగైంది. ఇంక మన బ్రతుకు బాగుపడితే అంతే చాలు. మీరు కొట్టుకెళ్ళండి. నేను పాపకు నీళ్ళు పోస్తాను.”

“సరే, నేను వెళ్తున్నా. తలుపేసుకో.”

“మధ్యాహ్నం త్వరగా వచ్చేయండి.”


“హాయ్ సురేశన్నా! ఏం కావాలి? ఇంకేంటి విశేషాలు?”

“మీ ఇల్లు మీ అన్న కమ్మేశారంట కదా! నిన్న మీ అన్న అన్నాడులే. మరి మీకెలా?”

“ఔనన్నా, కాస్త ఇబ్బందిగా ఉండింది…”

“మీకూ మీ అన్నగారికీ మధ్య పడట్లేదా? ఇద్దరూ ఒకే ఇంటివాళ్ళు కదా, అతనెలా తీసుకున్నాడు మీ ఇంటిని?”

“అదంతా ఇప్పుడెందుకు లేన్నా? నా మనసుకు కష్టంగా ఉంది.”

“సరే, భోజనానికి ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళు, వెళ్ళు.”


“ఏమండీ? అలా చప్పబడిపోయి ఉన్నారు? ఏమైంది?”

“ఏం లేదు. చావు తప్పదు.”

“పాప…?”

“చూద్దాం. పాపను ఎక్కడైనా వదిలొద్దాము. లేకపోతే మనమే లేకుండా, దాన్నెందుకు అనాథలా ఎవరిదగ్గరో వదిలిపెట్టడం? ముగ్గురం కలిసే…”

“ఏమైంది? ఎందుకు మళ్ళీ ఈ నిర్ణయం?”

“మా అన్న ఇల్లు కొన్నానని అందరితో చెప్పుకున్నట్టున్నాడు. ప్రతివాళ్ళూ అడుగుతున్నారు… నేను బ్రతికీ చచ్చినట్టే.”

“సరే, అందరూ వెళ్ళిపోదాం. కానీ, పాపకు ఎలాగండీ? మనసు రావడం లేదు.”

“చూడూ, ఇంక వదిలేయ్. పాపను ఎవరిమీదో పెట్టి వెళ్ళిపోడం కన్నా ఇదే మేలు. ఈరోజే తీసుకుందాం. సాయంత్రం త్వరగా వంట చేయి. పాపకు అన్నంలో కలిపేయ్. లేకపోతే కష్టం అవుతుంది.”

“కొట్టు నుంచి త్వరగా వచ్చేయండి. మీకేమన్నా చేయాలా?”

“వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.”


అంతరంగ మృదంగనాద…

“ఏమండీ, వస్తున్నారా? రండి మరి. ఎనిమిదవుతోంది. పాప పడుకుంటుందిక. నాకెందుకో మనసేం బాలేదు. దానికి మీరే తినిపించండి. నా వల్ల కావడం లేదు… ఏడుపోస్తోంది. మన జీవితం ముగిసే పోబోతుంది. నేనందరితో మాట్లాడుతాను. ఫోన్లో కొద్దిగా డబ్బు వేయించండి. అమ్మతో చాలా మాట్లాడాలి. ఇదే లాస్ట్. కదా? మీరూ మీ ఇంటికి ఫోన్ చేయండి. ఫోన్ పెట్టేస్తున్నా.”


“పాపా, తలుపు తియ్యమ్మా!”

“నాన్నా, టాబ్ తెచ్చావా మరి?”

“లేదమ్మలూ, రేపు తెస్తానుగా.”

“బీరువాలో ఉన్న బాటిల్ తీసుకో. ముందు పాపకు కలిపి పెట్టేయ్. కొంచెం… చక్కెర కలుపు. చేదుగా ఉంటుందేమో. తర్వాత మనమూ తీసుకుందాం.”

“ఎవరు లోపల? కొంచెం తలుపు తీస్తారా?”

“రండి, కృష్ణన్నా. రండి. ఈ మధ్య ఇటువైపు రానే లేదు!”

“ఔను, ఏదీ తీరనే లేదు. ఔనూ, ఏమిటి ఇల్లమ్మేశావా? మీ అన్నే కొన్నాడట కదా, చెప్పాడు. దాని బదులు ఆయన నీకు డబ్బే ఇచ్చి ఉండవచ్చు కదా, మీ ఇంటివాళ్ళకు మరీ ఇంత స్వార్థం పనికిరాదు. నీవు ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదించుకోగూడదా? ఇంత చదువుకొని ఇక్కడకు రాకుండా ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రయత్నించు.”

“ఔనన్నా, నేనెన్నో సార్లు చెప్పి చూశానీయనకు. ఊరికే కాలహరణం చేశారు. ఉద్యోగానికి పోనన్నారు. ఇప్పుడదీ లేదు, డబ్బూ లేదు. దిక్కులేని వాళ్ళమయినాము.”

“కాలమే అట్లుందమ్మా. అయినా మనమే బలహీనపడిపోతే మిగతావారూ బరువనుకుంటారు. ఇప్పుడేమైంది. మేమంతా ఉన్నాము మీకు. సహాయం చేయకపోము. ఒక నిర్ణయం తీసుకోండి. వస్తానింక పదవుతోంది.”


“పాప పడుకొని నిద్రపోయింది. భోజనమే చేయలేదు. ఏంచేద్దామంటారు? ఇప్పుడు లేపినా తినదు. దానికి పెట్టకుండా మనము…?”

“ఉండనీలే. ఇప్పుడు లేపినా తినలేదు. రేపు చూద్దాం లే. పండగ వస్తోంది. దానికీ సామానుకి డబ్బులేమీలేవు. అంతలోపల వెళ్ళిపోదాం. ఛ, ఏం జీవితమో, విసుగ్గా ఉంది. ఎన్ని సమస్యలో!”

అంతరంగ…

“హలో! ఔనా, అలాగా సర్! చాలా సంతోషం సర్! నా జీవితమే మారిపోతుంది సర్! మీ ఋణం ఎలా తీర్చుకోగలను? చాలా చాలా థాంక్స్ సర్! రేపు మీ ఇంటికి వస్తాను. ఉంటానండి.”

“ఈ రోజు చూసే భాగ్యం ఇంకా ఉంది మనకు. ఏంటండి ఫోన్లో విషయం? ఎవరు చేశారు?”

“అదే, ఆ భట్ గారే!”

“ఔనా, ఏమన్నారు? ఉద్యోగం దొరికే వీలుందంటనా?”

“అది కాదే, దాల్పేట్ కాలేజ్ లో ఉద్యోగం ఖాయమైంది. త్వరగా వెళ్ళి చేరమన్నారు. నాకెంత సంతోషంగా ఉందో తెల్సా!”

“అబ్బ! ఏమండీ, ఇన్నాళ్ళకైనా మన కష్టాలు తీరబోతున్నాయన్నమాట. ఆ దేవునికి ఇప్పటికైనా మన మీద దయ కలిగింది. ఇల్లూ, బంగారం పోతే పోయాయి. కనీసం పాప అయినా దక్కింది. మా అమ్మకు ఒక ఫోన్ చేస్తాను.”

“ఇన్నాళ్ళకు హాయిగా నిద్ర వస్తోంది. పరుపులు వేద్దాం. మనం ఇతరులకు చేసిన మేలు ఈరోజు మనలను కాపాడింది. పోన్లే, మన ఇంటివాళ్ళందరూ బాగుండనీ. నిజంగా… చావడం అంత సులభం కాదుకదా!”