తన మతమేదో తనదీ- మన మతమసలే పడదోయ్!

అనగనగా ఒక కథ. ఆ కథలో -నా పేరు సీతామహాలక్ష్మి అని పెట్టుకోండి. సీతో, లక్ష్మో, సుబ్బులో, ఎంకో, ఏదో ఒక పేరు అనుకోండి. ఏదైతేనేం. కథలో నేను ఒకప్పుడు తెలుగమ్మాయిని. ఇప్పుడు అమెరికన్ ని కూడాను. అమెరికాలో ఉంటున్నాను.

అమెరికాలో నా ప్రయాణాల్లో నేను ఎన్నో విమానాశ్రయాల్లో ఆగేదాన్ని. కొన్నాళ్ళకి ఒక్కో చోట ఒక్కో రెస్టారెంట్ ని గుర్తు పెట్టుకొని అందులో ఒక్కో తిండి పదార్ధాన్ని గుర్తు పెట్టుకొని అది తెప్పించుకొని తినడం అలవాటయ్యింది.పిట్స్ బర్గ్ విమానాశ్రయంలో ఒక చక్కని ఐరిష్ పబ్ ఉంది. అందులో కూర్చుని ఐరిష్ స్ట్యూ తినడం ఇష్టం నాకు. దానితో పాటు ఒక గ్లాసు ఎర్ర సారా పుచ్చుకొంటే తర్వాత విమాన ప్రయాణం కుదుపులు లేకుండా సాగుతుందని నా నమ్మకం. ఈసారి అలాగే ఒక చక్కటి (అంటే ఎవరూ దగ్గరలో లేని) బల్లను ఎంచుకొని కూర్చున్నాను. వెయిట్రెస్ నా ఆర్డర్ తీసుకు వెళ్ళింది. నేను “తెలుగు కథానిక” పుస్తకం తీసి అందులో కథలు చదూకోడానికి సిద్ధమయ్యాను. కొంచెంసేపు గడిచేసరికి ఏదో గుచ్చుకుంటున్నట్లుగా అనిపించడం మొదలయ్యింది. పుస్తకం దించి చూస్తే ఒక (నిజమైన) అమెరికన్ ఆవిడ కళ్ళు నన్ను తెగ పరిశీలించేస్తున్నాయ్. ఇంతలోకి నా భోజనం కూడా నా బల్ల మీదికి చేరింది.

వెయిట్రెస్:- “మీకింకేమైనా కావాలా?”
నేను: “అక్కర్లేదు. అంతా భేషుగ్గా ఉంది.”
వెయిట్రెస్: “చక్కగా తినండి. నేను మళ్ళీ వచ్చి మీకింకేమైనా కావాలేమో కనుక్కొంటాను.”

నేను మళ్ళీ పుస్తకం చదువుకుంటూ నా తిండి తింటానికి సిద్ధమై పోయాను. కానీ… ఈ లోపలే పక్క బల్ల వద్ద నుంచి నా మీద “ఆమె” కోపంగా చూపుల బాణాలు వదిలింది. ఎప్పుడు వచ్చి అక్కడ కూర్చుందో, ఏమో!

ఆమె: “నువ్వు మాంసం తింటావా?”
నేను: “అవును. నువ్వు?”
ఆమె: “తినను. నువ్వు … బాబాను నమ్మవా?”
నేను: “నమ్ముతానో లేదో? ఇప్పుడు ఆ సంగతెందుకు?”
ఆమె: “నేను రెండు సార్లు ఇండియా వెళ్ళి వచ్చాను. మొదటిసారి ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన మీద చాలా భక్తి కుదిరింది. అందుకే రెండో సారి ఇండియా వెళ్ళాను.”

నాకు నా చిన్నప్పుడు మా నాన్నగారి మిత్రుల బంగళాలో … బాబా విడిది చేసి ఉండడము, మేమంతా ఆయన దర్శనానికి వెళ్ళడము గుర్తుకొచ్చింది. మేము పిల్లలం, ఆయన వస్తున్నాడంటే మేము ఇటు నుండి అటు పారిపొయ్యేవాళ్ళం. ఆయన్ని చూడాలనే కుతూహలం. చూడడానికి భయం.అమ్మో! చూస్తే! ఆయన మన పాపాలన్నీ కనిపెట్టి వేస్తే. కళ్ళో, కాళ్ళో పోతాయనే భయం!

నాకు చిన్నప్పుడు ఇలాటి భయాలు కొన్ని ఉండేవి. ఆడపిల్లని కావడం వల్ల, మిషనరీ స్కూలుకి వెళ్ళినందువల్ల, తెలుగు పురాణాలు విన్నందువల్ల , ఊళ్ళో సినిమాలన్నీ చూడడంవల్ల ఎందువల్లైతేనేం – ఇంకో భయం ఎక్కువగా ఉండెది. నాకు సన్నిహితులుగా ఉండే మా కసిన్స్ ని – అప్పుడప్పుడూ నాకు గర్భిణీ అని అనుమానంగా ఉందని చెప్పేదాన్ని. అప్పుడు నాకు 8-9 ఏళ్ళు ఉండవచ్చు. వాళ్ళు నాకన్నా కొన్ని ఏళ్ళు పెద్దవాళ్ళవటంతో అలాంటిదేమీ లేదని నన్ను ఓదారుస్తూ ఉండెవాళ్ళు.

ఆ గోలెందుకు లెండి మధ్యలో. ప్రస్తుత కథలోని- నా ఫ్లాష్ బాక్ కొనసాగిస్తాను.

ఈ స్నేహితుల బంగళాలో బాబా విడిది చేసి ఉన్నప్పుడు ఆయన దర్శనానికి భక్తులు వస్తూ పోతూ ఉండేవారు. ఇంటివారికి, వారి ఇష్ట సఖులకూ, విడిగా ఆయన దర్శనం లభించేది. మా పెద్దవాళ్ళు అప్పుడప్పుడూ కూర్చొని ఆయన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన ఇంకో బాబా అపరావతారమనీ, ఆయనేమో విష్ణువు అపరాపరావతారమనీ. ఇక్కడ మాయమయ్యి అక్కడెక్కడో ప్రత్యక్షమవ్వ గలరనీ. చేయి ఇలా తిప్పితే వీభూదీ, అలా తిప్పితే కుంకుమా, రాలి పడుతుందనీ- ఇలాగు. ఈ అద్భుతాలు వింటే మాకు ఎందుకో భయం కలిగేది.

ఒకరోజు మా స్నేహితురాళ్ళమంతా కూర్చొని ఉండగా బాబా గబుక్కున మేమున్న గది లోకి వఛ్ఛారు. మేమంతా లేచి నుంచున్నాము. మాకు ఠారు పుట్టింది. మేము చూచీచూడనట్ట్లు, కుంతి, సూర్యున్ని చేతులు అడ్డం పెట్టుకుని , వేళ్ళ సందుల్లోనుంచి చూచినట్లు, ఎలాగొలాగు ఆయన్ని చూచాము. పొట్టి స్వరూపము. కాషాయ వస్త్రాలు. కానీ సిల్కువి. జుట్టు ఇంత ఎత్తున, అంత వెడల్పున గిరజాలు తిరిగి పెద్ద గుడిసెలా ఉంది.అంతకు ముందు ఆయన్ని గురించి విన్న కథల వల్ల, వారి వేషం విలక్షణం గా ఉన్నందువల్లా చాలా భయం కలిగింది. అసలు ఏమీ వినకుండా ఊరికే మేము చూసి ఉంటే భయం ఉండేది కాదేమో మరి. ఆయన ఏమీ అనకుండా ఊరికే గిర్రున తిరిగి వేరే గది లోకి వెళ్ళి పోయాడు. మేము పిల్లలం, మళ్ళీ ఈ ప్రపంచం లో పడ్డాం.

ఆయన సంగతేమో కాని ఆ బంగళా తోట ఎంతో అందంగా ఉందని గుర్తు. గులాబీల తోట, లిల్లీల తోట, ఎన్నో రకాల తీగెలు, చక్కగా కత్తిరించిన పొదల గుమ్మటాలు. ఏమి అందం! నా స్నేహితురాళ్ళు నాకు తోట అంతా చక్కగా తిప్పి చూపించడం గుర్తు. ఆ బంగళా! ఏమి బంగళా!బాబా ఆ బంగళా ఆయన విడిదిగా ఎంచుకున్నారంటే మరి ఊరికే ఎంచుకున్నారా! ఎంతోమంది నౌకర్లు, చాకర్లు ఇంటివాళ్ళకి. వంటవాళ్ళు రకరకాల వంటలు వండి పెట్టే వాళ్ళు. ఆ తర్వాత లేత తములపాకులు, అందులోకి ప్రత్యేకంగా గులాబి రంగు సున్నమూ. నాకు ఏమాత్రం తెలివున్నా సన్యాసి నవడం లో ఎంత సుఖముందో అప్పుడే తెలిసేది. డాక్టరు ఐతే సుఖమా! శుద్ధాంతమా! నా తప్పు లేదు లెండి. చిన్న వయసయ్యే!

ఆ తర్వాత మా నాన్నగారు ఆయన బాబా దర్శనం అనుభవం గురించి మాకందరికీ ఆయన సహజ శైలిలో చెప్పారు. “సన్యాసులకు కూడా డబ్బున్న వాళ్ళంటేనే ఇష్టం. నేను డబ్బులేని వాడినని, ఆయన దబ్బునే పట్టేశాడు. జమీందారులకు జమిందారీ బహుమతులు, పేద వాళ్ళకు పేద బహుమతులు. ఆ జమీందారు గారి భార్యకు డైమండ్ లాకెట్ తీసి ఇచ్చాడు. ఆయన చెల్లెలు కూతురికి చక్కని ముత్యాల ఉంగరం. నాకు మాత్రం విభూది.”

మా అమ్మ- “అయ్యో భయం భక్తీ లేని మాటలు. మీరట్లా నవ్వుతారు కాబట్టే మనమిట్ట్లా ఉన్నాం. ఆయన బొమ్మలున్న లాకెట్ట్లిచ్చారుగా. అవి మంచి బంగారంలో పెట్టి పిల్లలకు గొలుసులు చేయిస్తాను.” అని భయం భయంగా మందలించింది. (మా అమ్మకు మా నాన్నగారన్నా భయ భక్తులుండేవి . మేము అలా కాదు. ఆ వినయం, వందనం రాలేదు. పైపెచ్చు మా నాన్నగారి వ్యంగ్యం, వెటకారం వచ్చినట్లుంది). నాకు బాబా గురించి ఆ పాత సంగతి అంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆయనకు ఎన్నో ఆశ్రమాలు, యూనివర్సిటీలు, విద్యార్ధులు, ఎన్నో మేడలు, ఇంకా ఎక్కువ భక్తులు, దేశ దేశాలనుండి వచ్చి ఆయన ఉపన్యాసాలు విని ఉపదేశాలు తీసుకొని పోయేవాళ్ళు ఉన్నారట.

మళ్ళి అమెరికా -విమానాశ్రయం – నా ఇప్పటి కథ లోకి అందులో మా సంభాషణ లోకీ వద్దాం. అప్పటికే నా పక్క బల్లావిడ మీద- ఆమె కొంచెం పిచ్చి వాలకంగా ఉంది, నన్ను తిననివ్వడం లేదు. చదువుకోనివ్వదూ – అని నాకు కోపం వస్తూ ఉంది.

నేను: ” ఓ! నీవు … బాబా భక్తురాలివా? నేను ఈ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన దగ్గరనుండి నేనెక్కడకు వెళ్తే అక్కడ నీవు కనిపిస్తుంటే నువ్వు నా భక్తురాలివని అపార్ధం చేసుకొన్నాను. ఇప్పుడర్ధమయ్యింది. ఆ స్వామి గారు నాకు తెలుసు. చిన్నప్పుడే ఫలానా ఊళ్ళో చూశాను.

ఆమె: “నేను ఆయన్ను చాలా సార్లు కలిశాను. ఆయన చెప్పినవన్నీ పాటిస్తుంటాను.”

నేను: “చాలాసార్లు ఇండియా వెళ్ళి వస్తావా?”

ఆమె: “ఇంక వెళ్ళక్కర్లేదు. ఆయన నేను ఎప్పుడూ మాట్లాడు కుంటూనే ఉంటాము.”

నేను: “ఆయన భక్తులకు ఫోను కూడా చేస్తుంటారా అప్పుడప్పుడు?”

ఆమె: “భలేదానివి! ఫోనెందుకు? ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి నా దగ్గరికి వస్తారు. మేమిద్దరం ఒకరికి ఒకరం కనిపించగలం. మా ఆత్మలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకుంటాయి. కలుస్తాయి.”

“మంచిది . చాలా బాగుంది !” అన్నాను నేను. పుస్తకం అడ్డం పెట్టుకొని నా తిండి నే తినసాగాను.కోంచెం సేపు చూసి లేచి వెళ్ళిపోయిందామె.

తర్వాత ఒక షాపు ముందు పలకరించింది మళ్ళీఆమె “బొట్టెందుకు పెట్టుకోలేదు? విధవ్వా?” అంది.

నేను: “కాదే?”

ఆమె: “మరి ఒక్క దానివే ప్రయాణం చేస్తున్నావు. కొంపతీసి అమెరికనుల్లాగా, పిచ్చి పుట్టి మొగుడికి విడాకులు గాని ఇవ్వలేదు కదా?”

నేను:( లోపల్లోపల – “అత్త పోరు లేదు ఆడ బిడ్డ పోరు లేదు. ఈమె ఎక్కడ దాపురించింది నాకు”) బైటకు.- “అలాటిదేమీ లేదు. మేము బాగానే ఉంటాము. నువ్వు భర్త కోసం చూసుకుంటున్నావా? కావాలంటే మా ఆయన్ను సంతోషంగా తీసుకోవచ్చు” అన్నాను నవ్వుతూ.

అది ఆమెకు నచ్చలేదు. “నేను సన్యాసినిని, Abstinence (బ్రహ్మచర్యం? ) పాటిస్తున్నాను” అంది.

అదృష్టవంతులు, మగవాళ్ళు బతికి పోయారు. అనుకున్నాను నేను. పీచు జుట్టూ, గుంట కళ్ళూ, పిచ్చి ధోరణీ! క్రితం పుష్కరం అప్పుడు స్నానం చేసినట్లుంది. ఎవరికి కావాలి ఈ కంపు శరీరం! ఆ బాబా కే అర్పించుకో – అనుకున్నా.

తర్వాత కాసేపటికి నేను ఎస్కలేటర్ మీద నిల్చుని ఉంటే మళ్ళీ వీపు మంట పుట్టినట్ట్లుగా అనిపించింది.తిరిగి చూస్తే ఆమే. నన్ను కిందికి తోస్తుందేమో అని కొంచెం ఆందోళన కలిగింది.

ఆమె: “నువ్వేమి హిందూవి. నిన్ను శివుడు క్షమించడు గాక క్షమించడు. మూడో కన్ను తెరిచి మండిస్తాడు” అంది.

నాకు మూడో కన్ను తెరుచుకుంది. కోపం శివుని మెళ్ళో పాములా బుసలు కొట్టింది. ఐనా ఏమాత్రం ఆవేశ పడకుండా, మెత్తగా, మధురంగా,”అవతలకు పో పిచ్చి కుక్కా! లేకపోతే సెక్యూరిటీని పిలుస్తాను” అన్నాను.ఆమె ఇంక మాట్లాడ లేదు. ఎస్కలేటర్ దిగాక కొంచెం దూరం నా వెనక నడిచి ఆ తర్వాత ఆగి పోయింది. నేను ఇంక పట్టించు కోకుండా నా దారిని నేను వెళ్ళి పోయాను.

ఇంటికి వచ్చాక అందరికీ ఈ సంగతి చెప్పాను. వాళ్ళకు నవ్వు వచ్చింది. అందరికన్నా మా అల్లుడు, జ్యూయిష్ అమెరికన్, కి మహా నవ్వు వచ్చింది. ఇండియన్ అత్తకు బాబా భక్తి లేదు. అమెరికన్ హిందూ గారు భక్తితో తలమునకలయి పోయి అత్తను సతాయిస్తే , జ్యూయిష్ అల్లుడికి నవ్వు రాదా మరి!తర్వాత ఎందుకైనా మంచిదని తగిన సానుభూతి వెల్లడించాడు. “ప్రపంచంలో రక రకాల వాళ్ళు ఉన్నారు మమ్మీజాన్. నువ్వు వాళ్ళతో తగువు పడవొద్దు. జాగ్రత్తగా ఉండు. కత్తులూ, గన్నులూ కూడా ఉండవచ్చు మమ్మీజాన్!” అని నాకు జాగ్రత్తలు చెప్పాడు.

నేను “రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదా? అమెరికా వచ్చినా ఐరిష్ స్ట్యూ తింటానికి లేదా? ఇండియాలో పుట్టినందుకు, అక్కడి నుండి వచ్చినందుకు బూడిద పూసుకొని గాలి భోంచెయ్యాలని అనుకుంటున్నారో? అమెరికా నుండి అమర లోకం వెళ్ళినా ఈ మతం నుండి నాకు విముక్తి లేదో. ముక్తి రాదో” అని మరొక్క సారి మండిపడ్డాను.

కథ సమాప్తి. ఈ కథ విన్న వారికీ, “ఈమాట” లో చదివిన వారికీ పుణ్యము, పురుషార్ధమూ తప్పక లభిస్తాయ్!