ప్రతీకగా శరీరం

ఈ క్రింది అన్నమయ్య పదం విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది:

నిత్య పూజలివిగో నేరిచినవో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి

పల్లవి చూస్తే మామూలు సంకీర్తనలాగే అనిపించవచ్చు. నిత్య పూజ అనే ముఖ్య పదం తప్పించి ఇందులో విశేషమేమీ లేదు. ఇక మొదటి చరణం:

తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమట

ఈ రెండు పాదాలు వినగానే మొత్తం సంకీర్తనని ఎలా రూపొందించబోతున్నాడో మనం ఊహించవచ్చు. మొదటిసారి విన్నప్పుడు, శరీరాన్ని మాత్రమే ప్రతీకగా చేసి మిగతా సంకీర్తననంతటిని ఎలా నిర్వహిస్తాడో చూడాలని నాకు అత్యంత ఉత్సాహం కలిగింది. ఈ సంకీర్తన మిగతా భాగం ఇలా నడుస్తుంది:

కనుగొన చూపులే ఘనదీపములట
తనలోపలి అంతర్యామికిని.
పలుకే మంత్రమట పాదైననాలుకే
కలకలమను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకు
గమన చేష్టలే అంగరంగ గతియట
తమిగల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయనికిని

దేహాన్ని దేవాలయంగా అనేకమంది ఊహించిఉండవచ్చుగాని, అలా అని ఊరుకోకుండా, ఇన్ని వివరాల్లోకి పోవటం వాటిని సమర్థవంతంగా చెప్పటం చాలా గొప్ప విషయం. ఇందులో వాడిన పోలికల్లో ఒక్కటికూడా అసమంజసంగా అనిపించదు. చూపుల్ని దీపాలని, హృదయాన్ని పీఠమని, నాలుకని ఘంటని, ఊర్పుల్ని ఆలవట్టములని చెప్పటం – ఇవన్నీ ఎంతో సముచితమైన పోలికలు. అంతేగాక, దీనిలో మరొక విశేషం కూడా ఉంది. సాంప్రదాయకంగా భగవంతుణ్ణి అర్చించేటప్పుడు, పాటించే క్రమం ఒకటుంటుంది. అది గుడైనా, ఇల్లైనా మొదట నివాసం, తరువాత కూర్చోవటానికి పీట, దీపారాధన, మంత్రం, నైవేద్యం అటుపిమ్మట ఇతర సేవలు. ఇదే క్రమాన్ని పై సంకీర్తనలో ఎంత నిర్దిష్టంగా పాటించాడో మనం గమనించవచ్చు.

పాటమొత్తానికి ఒకే ఒక ప్రతీక, అందులోనూ విధిగా పాటించవలసిన ఒక క్రమం, వీటికి తోడు పద సంకీర్తనల నిర్మాణంలో సహజంగాఉండే పదాల పరిమితి, యతిప్రాసల నియమం – ఇన్ని పరిమితులతో ఇంత చక్కటి రచన చెయ్యటం అనితరసాధ్యమనిపిస్తుంది.

ప్రముఖ మళయాళీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.సచ్చిదానందన్ కవితల అనువాదాల సంపుటి ఒకటి ఇటీవల ప్రచురింపబడింది. ఈ సంకలనం పేరు “శరీరం ఒక నగరం”. ఈ శీర్షికతో ఇందులో ఒక కవిత ఉంది. పేరునుబట్టే, కవి దేనిని సంకేతిస్తున్నాడో మనకు స్పష్టమౌతోంది. శరీరాన్ని నగరంగా ఎందుకు భావిస్తున్నాడనే సందేహం మనకు కలుగుతుంది. కేవలం వైచిత్రి కోసమే చేస్తున్నాడా, ఇంకేదైనా గూఢార్థం ఇందులోఉందా? బహుశ నగరజీవితంతో మమేకమైన కవి, నగరానికి తన శరీరానికి అభేదాన్ని పాటిస్తున్నాడేమో.

నా శరీరమొక నగరం
నా కళ్ళు కాపలా శిఖరాలు
అక్కడ నిరంతరం జాగ్రత్త
నా చెవుల మధ్య పొగబండి స్టేషన్
అక్కడ ఎప్పుడూ జనఘోష

ఇలా మొదలై సుదీర్ఘంగా సాగే ఈ కవితలో లెక్కలేనన్ని పోలికలు చెప్పబడ్డాయి. నాడులు నదులని, నరాలు సంగీతాలు ప్రసరించే తీగలని, పళ్ళు కర్మాగారాలు, గ్రంధులు నిద్రలేని కర్మాగారాలని, చర్మం నిరీక్షణా కేద్రమని, జుత్తులు సూర్యోదయాలు లేని ఉద్యానవనాలని – ఇంకా అనేకమైనవి. మరీ ఎక్కువ పోలికలు చెప్పటం వలన, కొన్ని అతికినట్టు సరిపోయినా, మరికొన్ని అంతగా నప్పలేదేమోనని నా కనిపించింది. పోలికలెక్కువైతే, పునరుక్తి చోటుచేసుకునే అవకాశం కూడాఉంది. ఉదాహరణకి, ఒక చోట నదులని చెప్పిన నాడుల్నే, మరొక చోట కూడలులని చెప్తాడు. అన్నమయ్య పదంలో ఉన్న బిగువు, క్లుప్తత ఈ పద్యంలో లేవు. ఐతే, శరీరాన్ని నగరంగా భావించటం ఒక కొత్త ఊహ. ఆధునిక మానవునికి నగరంతోఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ కవిత సూచిస్తుంది. ఈ సంబంధం కవిత చివరి పంక్తుల్లో మరింత గాఢంగా వ్యక్తమౌతుంది:

ఈ శరీరాన్ని చితిపై వేసినప్పుడు
నువ్వు కాల్చేది ఒక నగరాన్ని
గుర్తుంచుకో! ఈ శరీరాన్ని పాతేసేటప్పుడు
మీరు పాతేది ఒక జనతని

ఫై రెండు ఉదాహరణల్లోనూ ఒక సామ్యం ఉంది. వీటిలో శరీరాన్ని వేరొక దానికి ప్రతీకగా చెప్పటానికి వివిధ అవయవాలు ఆధారంగా తీసుకోబడ్డాయి. రెంటిలోనూ జీవించిఉన్న మనిషి గురించే చెప్పబడింది. ఐతే, ఇప్పుడు నేను తీసుకోబోతున్న మూడవ ఉదాహరణలో మాత్రం శరీరమే ప్రతీక అయినప్పటికీ, మిగతాదంతా భిన్నంగా ఉంటుంది. అది గ్రీకు మహాకవి, నోబెల్ ప్రైజు గ్రహీత Odysseus Elytis రాసినది ప్రసిద్ధ కవిత The Autopsy. ఈ కవితకు నేనుచేసిన అనువాదం క్రింద ఇస్తున్నాను:

ఇంకా ఆలివ్ వేళ్ళ బంగారురంగు
అతని గుండె మూలల్లో ఇంకిఉందని
వాళ్ళు కనుగొన్నారు.

ఉదయం కోసం ఎదురుచూస్తూ
కొవ్వొత్తి వెలుగులో ఎన్ని సార్లు గడిపాడో
ఇంకా ఒక విచిత్రమైన వెచ్చదనం
అతని ప్రేవుల్నావరించిఉంది.

చర్మం అడుగున నీలిరంగు క్షితిజరేఖ
స్పష్టంగా గీయబడిఉంది.
రక్తంనిండా నీలిరంగు అవశేషాలు.

గొప్ప ఏకాంతం నిండిన గంటల్లో
అతను మననంచేసుకున్న పక్షుల అరుపులన్నీ
ఒక్క సారిగా ఒలికినట్టున్నాయి
-మరింత లోతుకి దిగటం కత్తికి గగనమైపోయింది.

బహుశ సంకల్పమే జరిగిన చెడుకి సరిపోయి ఉండవచ్చు.

అది అమాయకత్వం నిండి భయంగొలిపే అతని భంగిమలో స్పష్టమౌతూనేఉంది.
గర్వంతో తెరుచుకొన్న అతని కళ్ళు
మచ్చలేని కంటి రెటీనామీద ఇంకా కదులుతున్న అడవి.

గతించిన ఆకాశపు ప్రతిధ్వని తప్పించి మెదడులో మరేమీలేదు.

అతని ఎడమ చెవి రంధ్రంలో మాత్రం, శంఖంలో మాదిరి స్వల్పంగా సన్నటి ఇసుక.
అంటే తరచు గాలి హోరులో ప్రేమ బాధతో
సముద్రతీరం వెంట అతను నడిచిఉంటాడు.

ఇక అతని ఊరువుల్లో కనుగొన్న నిప్పురవ్వల గురించి చెప్పాలంటే,
అతను ఒక ఆడదాన్ని కౌగలించినప్పుడల్లా కాలాన్ని కొన్ని గంటలు ముందుకు నెట్టేవాడని అవి సూచిస్తాయి.

మనకీ ఏడాది పండ్ల రుతువు ముందే వస్తుంది.

ఇది ఒక కవి గురించి గాని, “ఉన్మత్త భావశాలి” గురించి గాని చెప్పిన పద్యమైఉంటుందంకుంటాను. ఈ పద్యం గొప్పతనమంతా ఒక మృతుడైన మనిషి గురించి , అదీ ఒక పోస్టుమార్టం రిపోర్టు లాగా చెప్పటంలోనేఉంది. ఇందులో కూడా వివిధ అవయవాలగురించిన ప్రస్తావనేఉన్నా, కేవలం అవయవాన్నే ప్రతీకగా తీసుకోకుండా, అక్కడ లేనిదాన్ని కవి ఊహిస్తున్నాడు. తను ఊహించినవాటి అధారంగా మరణించిన భావుకుని స్వభావాన్ని వర్ణిస్తున్నాడు. చర్మంకింద క్షితిజరేఖ ఉండటం, కళ్ళ రెటీనాపై అడవి కదులుతూఉండటం వంటి బలమైన ప్రతీకలద్వారా, మరణించిన మనిషి ఎంత ఉద్వేగపరుడో, ప్రకృతిలో అతనెంతగా మమేకమైపోయాడో కవి మనకు తెలియజేస్తున్నాడు. రూపకల్పనలో, ఎత్తుగడలో ఇంకా నిర్వహణలో అత్యంత ప్రతిభాసంపత్తి నాకీ పద్యంలో కనిపిస్తుంది. ఏరకంగా చూసిన ఇది ఒక అద్భుతమైన పద్యంగా మనం చెప్పుకోవచ్చు.

భక్తి, భావుకత,నాగరికత – ఇవేవీ శరీరానికి సంబంధించిన అంశాలుకావు. మనిషి ఏ భావనాస్థితిలోఉన్నా, అవయవాలు, వాటి విధులు మారవు. శరీరానికతీతమైన స్వభావాన్ని వర్ణించటానికి శరీరాన్ని ప్రతీకగా తీసుకోవటంలోనే ఒక ప్రత్యేకత ఉంది.అదీ, వివిధ కాలాలకి, దేశాలకి చెందిన కవులు ఈ ప్రతీకను వాడుకున్న సందర్భాలను ఒకచోట చేర్చి పరిశీలిస్తే, అందులోని వైవిధ్యం మనకు ఆశ్చర్యం కలిగించకమానదు.