నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి

పద్యాలను కంఠస్థం చేయడం వల్ల ఒరిగేదేమిటి? అనే ప్రశ్న కొంతమంది దగ్గర విన్నాను. ఎప్పుడో అచ్చు యంత్రాలు లేని కాలంలో, తప్పక వచ్చిన సంప్రదాయమూ అలవాటూను అది. ఇప్పుడు పుస్తకాలు, కంప్యూటర్లు, సీడీలు, డీవీడీలు, ఇంటర్నెట్టు – యిన్ని వచ్చేశాయి. ఇప్పుడు కూడా పద్యాలను జ్ఞాపకం పెట్టుకోడానికి కంఠస్థం చేయడం ఎందుకుట, చాదస్తం కాకపోతే – అన్నది వాళ్ళ తర్కం. ఈ వాదన అసమంజసమైనదేమీ కాదు. అయితే పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంచడం, భాషాపరిజ్ఞానం పెరగడం, పద్యాల నడకలు – అంటే వాటి ఛందస్సులు బాగా వంటబట్టి పద్యాలు సులువుగా అల్లగలగడం మొదలైనవి.

నా దృష్టిలో వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైన మరొక ప్రయోజనం ఉంది. అది కవిత్వానికి సంబంధించినది. ఒక పద్యాన్ని కంఠస్థం చేయాలంటే దాన్ని చాలాసార్లు చదువుతూ ఉండాలి. ఒకసారి కంఠస్థం అయ్యాక దాన్ని ఎక్కడైనా సులువుగా మననం చేసుకొంటూ ఉండవచ్చు. రద్దీగా ఉన్న యే బస్సులోనో ప్రయాణం చేస్తున్నారనుకోండి, క్షణమొక యుగంగా గడుస్తుంది. ఆ వాతావరణం నుండి మిమ్మల్ని మరొక ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయే శక్తి మంచి పద్యాలకి ఉంటుంది. మీకు కంఠస్థమైన పద్యాలను తిరిగి తిరిగి మననం చేసుకొంటూ, వాటిలోని శిల్పసౌష్ఠవాన్ని గానీ, భావసౌందర్యాన్ని గానీ ఆస్వాదించడం మొదలుపెడితే, అసలు సమయమే తెలియకుండా మీ గమ్యాన్ని చేరుకొంటారు. ఇది నేను అనుభవంతో చెపుతున్న మాట. ఒక మంచి పద్యాన్ని యిలా జ్ఞాపకం చేసుకొన్న ప్రతిసారీ అందులో కొన్ని కొత్త వెలుగులు, జిలుగులు మనకి గోచరిస్తూ ఉంటాయి. మంచి పద్యాన్ని కంఠస్థం చేయడంవల్ల కలిగే పరమ ప్రయోజనం ఇదే. అలాంటి ఒక మంచి పద్యాన్ని మనమిప్పుడు చూద్దాం. మామూలుగా చదువుకొంటూ పోతే అందులో పెద్ద విశేషమేమీ కనిపించదు. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నిర్మాణంలోని సొగసులు మనలను మురిపిస్తాయి. ఒక పాత్రని సజీవంగా మనముందు మూర్తి కట్టిస్తాయి.

శా. దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ, నీ
        ప్రావీణ్యంబులు సూడగోరుదు గదా, ప్రాణేశ! మన్నించి నన్
        నీవెంటన్ గొనిపొమ్ము నేడు కరుణన్, నే జూచి యేతెంచి నీ
        దేవీసంతతికెల్ల జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్

కథాకావ్యాలకు పాత్రచిత్రణ ప్రాణప్రదమైన అంశం. పురాణేతిహాసాలను కూడా గొప్ప కావ్యాలుగా తెలుగు కవులు తీర్చిదిద్దారంటే అందుకు కారణం, పాత్రలకు ప్రాణప్రతిష్ఠను చేయగల వారి నైపుణ్యం. ఇది కవిత్రయంలోనే కాకుండా భాగవతాన్ని తెలుగు చేసిన పోతనలో కూడా పుష్కలంగా కనిపిస్తుంది. పోతనగారు తీర్చిదిద్దిన పాత్రలలో ప్రముఖంగా తెలుగువాళ్ళ మనసుల్లో నిలిచిపోయిన పాత్ర సత్యభామ. ఈ చిత్రణలో నాచన సోమన స్ఫూర్తి స్పష్టంగానే కనిపిస్తుంది కానీ, దానితోపాటు పోతనకే ప్రత్యేకమైన కవిత్వపటుత్వం కూడా అంతే స్పష్టంగా ప్రకాశిస్తుంది. అలాంటి పద్యాలలో యిది ఒకటి. ఇది భాగవతం దశమస్కంధంలో నరకాసురవధ ఘట్టంలో వచ్చే పద్యం. పాత్రచిత్రణలో కవులు అనేక మార్గాలు తొక్కుతారు. ‘రాకేందుబింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగమ్ము’ అంటూ అలంకారసౌందర్యంతో వర్ణించడం ఒక మార్గం. ‘అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢపాదంబుతో, అలికస్వేద వికీర్ణకాలికలతో’ అంటూ పాత్ర రూపురేఖలనూ హావభావాలనూ సహజంగా మూర్తికట్టించడం మరొక విధానం. ‘వేణిన్ జొల్లెము వెట్టి, సంఘటిత నీవీబంధయై’ అంటూ చేష్టితాలను సునిశిత దృష్టితో దృశ్యమానం చేయడం ఇంకొక త్రోవ. ఇవన్నీ ఒక రకంగా బాహ్యదృష్టితో చేసే చిత్రణలు. పాత్ర స్వభావాన్ని పూర్తిగా ఆవిష్కరించడానికి బహుశా సంభాషణల కన్నా మేలైన మార్గం లేదు. ఈ రహస్యం నన్నయ్యకి తెలుసు. తిక్కన్నకి అంతకన్నా బాగా తెలుసు. మరి పోతన్నకి మాత్రం ఆ రహస్యం తెలియకుండా ఉంటుందా!

శ్రీకృష్ణుడు దేవేంద్రుని విన్నపాన్ని విని నరకాసురుని సంహరించేందుకు అతనిపై యుద్ధానికి సన్నద్ధుడై గరూడవాహనమెక్కి బయలుదేరుతాడు. తాను కూడా అతని వెంట యుద్ధానికి వెళ్ళాలని సత్యభామకి కోరిక. ఇంతకుముందెప్పుడూ అలా వెళ్ళిన సందర్భం లేదు. ఇష్టంలేని పెళ్ళి నుండి తనను రక్షించి తీసుకువెళ్ళే సందర్భంలో శ్రీకృష్ణుని సమరవీరాన్ని రుక్మిణీదేవి కొంత చూసి ఉంది, రథాన్ని నడిపి సహకరించింది కూడా. బహుశా మరి ఆ విషయం సత్యభామ మనసులో ఉందేమో! సత్రాజిన్మహారాజు కూతురైన తను మాత్రం సమరాంగణ సంరంభాన్ని కళ్ళారా చూడకుంటే ఎలా! పైగా అది దేవకార్యం, దేవదానవ సంగ్రామం, చేసేది సాక్షాత్ విష్ణుస్వరూపుడైన తన భర్త. అయితే అంతటి మహాసంగ్రామానికి తనను వెంట తీసుకువెళ్ళమని అడగడం ఎలా? తన కోరికని సమర్థించుకోడం ఎలా? శ్రీకృష్ణుని ఒప్పించడమెలా?

సంభాషణ మొదలుపెట్టీపెట్టడమే దేవా! అన్న సంబోధనతో. ఈ పదానికి భర్త, దైవము అన్న రెండర్థాలూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు వెళ్ళేది దేవకార్యం మీదనే కాబట్టి ఆ సంబోధన అక్కడ ఎంతో ఉచితంగా ఉంది. భర్తపై సత్యభామకున్న గౌరవాన్ని సంపూర్ణంగా ధ్వనించే పిలుపు. నువ్వు చేసే యుద్ధాన్ని చూడాలనుకొంటున్నాను, అనలేదు. ‘నీవు నిశాట (నిశ + అట – రాత్రి సంచరించేవారు – రాక్షసులు) సమూహాలను, ఉద్దీపించి (అతిశయంతో ప్రకాశిస్తూ), బంతాట ఆడుతూంటే (చెండాడు = చెండు + ఆడు) నీ ప్రావీణ్యాలను చూడాలని’ ఉందంటోంది. ప్రావీణ్యంబును జూడగోరుదు అన్నా ఛందస్సు సరిపోతుంది. అయినా ప్రావీణ్యంబులు అని బహువచన ప్రయోగం చేయించారు పోతనగారు. అంటే శ్రీకృష్ణుని యుద్ధచాతుర్యం అనేక రకాలుగా ఉంటుందన్న మాట. ఆ వింతలన్నిటినీ చూడాలని ఆమె కోరుకొంటున్నది. ఈ సంభాషణ భర్త శౌర్యపరాక్రమాలపై సత్యభామకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, మిక్కిలి గౌరవాన్ని చక్కగా ప్రకటిస్తోంది. అలా సాగిన వాక్యసరళి అక్కడొక మలుపు తిరిగుతోంది. చూడగోరుదు కదా! అంటోంది. చూడగోరుదును నే/చూడగోరెదను నే అనవచ్చు కదా, అప్పుడు కూడా ఛందస్సు సరిపోతుంది. కానీ అలా అంటే, అది ఒక గుమాస్తా తన పై అధికారికి పెట్టుకొన్న అర్జీపత్రంలా ఉంటుంది తప్ప పెళ్ళాం తన పెనిమెటిని అడుగుతున్నట్టుగా ఉండదు. ‘కోరుదు కదా!’ అనడంలో ఎన్నాళ్ళనుండో నాకా కోరిక ఉందనే భావమే కాకుండా, నీకది తెలుసు కూడానూ అనే ముందరికాళ్ళ బంధమూ ఉంది. కోరుదు అన్న మామూలు క్రియాపదానికి కదా అన్న కొనసాగింపు గొప్ప గోముని చేకూరుస్తుంది. అదే కాకువు. ఆమెకి భర్త దగ్గరున్న చనవు గారాబమూ అందులో ధ్వనిస్తుంది. ఆ గోముదనం, ఆ దగ్గరితనం తర్వాత వచ్చే ప్రాణేశ! అనే పిలుపులో పారమ్యాన్ని పొందుతున్నాయి.

గౌరవమూ, గారాబమూ తర్వాత సత్యభామ వేస్తున్న మూడో బాణం వేడుకోలు. ‘నన్నీవెంటన్ గొనిపొమ్ము నేడు కరుణన్’ అని ప్రార్థన. ఇక, ఆమె ప్రయోగిస్తున్న ఆఖరి అస్త్రం, మనకి ఊహకందని అస్త్రం, చివరిపాదంలో తళుక్కున మెరిసి పద్యాన్ని మిరుమిట్లు గొలిపిస్తుంది. తనను యుద్ధరంగానికి తీసుకువెళితే ప్రతిఫలంగా శ్రీకృష్ణునికి తానొక మేలు చేస్తానని నచ్చజెపుతోంది సత్యాదేవి. భర్త ప్రావీణ్యాలను కళ్ళారాచూసి తిరిగి వచ్చి, ఆయన దేవేరులందరికీ అతని ప్రతాపాల గొప్పదనాన్ని వర్ణించి మరీ చెపుతుందట! భార్య దృష్టిలో తన పరపతి పెరుగుతుందంటే ఏ భర్త మాత్రం సంబరపడడు! అంచేత అది తిరుగులేని అస్త్రమని అనుకొన్నదేమో సత్యభామ.

ఇందులో మరొక కోణం కూడా ఉంది. భర్తతో స్వయంగా దేవదానవ సంగ్రామానికి వెళ్ళి, అతని యుద్ధవీరాన్ని కళ్ళారా చూసే అదృష్టం తనకే దక్కిందని మురిసిపోతూ సవతుల ముందు తన స్వాతిశయాన్ని చాటుకోడం దీని వెనుకనున్న ఆంతర్యం కావచ్చు. అయితే జాగ్రత్తగా ఆ విషయాన్ని, శ్రీకృష్ణునికి మేలు చేస్తున్నట్లుగా మార్చి చెప్పడం, ఆమె జాణతనం. పద్యమంతా ఇంచుమించు విడివిడి తెలుగు పదాలతో నడిపించిన పోతన చివరన మాత్రం భవద్దీప్తప్రతాపోన్నతుల్ అనే సంస్కృత సమాసప్రయోగం చేశాడు. ‘నీ దీపించు శౌర్యమ్ములన్’ అని గాని, లేదా ‘నీ దివ్య ప్రభావమ్ములన్’ అని గాని పూర్తి చేయవచ్చు, ఛందస్సు సరిపోతుంది. కానీ అందులో, శ్రీకృష్ణుని ప్రతాపం కాని, సత్యభామ మాటల్లో డాంబికం కాని, పూర్తిగా స్ఫురించవు. దిట్టమైన సంస్కృత సమాసం ఆ పట్టుని అందిస్తుంది. పైగా, భవత్, దీప్త, ప్రతాప, ఉన్నతుల్ – అనడంలో ప్రతి పదంలో ఆవృత్తమైన త-కారం మరికొంత తీవ్రతకి దోహదం చేస్తోంది. ‘ప్రావీణ్యంబులు’ అన్న దగ్గర చేసిన బహువచన ప్రయోగాన్ని మళ్ళీ యిక్కడ ‘ఉన్నతుల్’ దగ్గర చేయడం ద్వారా మంచి ఔచిత్యాన్ని చూపాడు పోతన. చూసేందుకు చిన్నవైనా, ఇలాంటి అంశాలే పద్యానికీ, అందులోని సంభాషణకూ సౌష్ఠవాన్ని అందిస్తాయి.

ఇలా, ప్రతి పదాన్నీ ఎంతో జాగ్రత్తగా ఏర్చి కూర్చి, యిన్ని చాయలలో, సత్యభామ వాక్చాతుర్యాన్నంతటినీ ఒక చిన్న పద్యంలో ప్రదర్శించడం పోతన పద్యశిల్పానికి చక్కని ఉదాహరణ.

సత్యభామ జాణ అయితే శ్రీకృష్ణుడు జగజ్జాణ! ఆమె మాటలకి అంత సులువుగా చిక్కుతాడా అతను. ఆమె సంకల్పాన్ని కొద్దిగా పరీక్షిద్దామనుకొని ఉంటాడు, లేదా ఆమె వాక్చాతుర్యాన్ని మరికొంత రుచి చూద్దామనుకొన్నాడో! యుద్ధబీభత్సాన్ని వర్ణించి, రణరంగమంటే విలాసప్రదేశం కాదని, ‘కన్య! నీ వేడ రణరంగ గమన మేడ! వత్తు వేగమ, నిలువుము, వలదు వలదు,’ అని ఆమె కోరికని త్రోసిపుచ్చుతాడు. అయినా సత్యభామ పట్టంటే పట్టే!

‘అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి’, యిలా అంటుంది:

దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానిత బాహుదుర్గముల మాటున నుండగ నేమి శంక? నీ
తో నరుదెంతు నంచు గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టి జూడగన్

ఇది కూడా జాగ్రత్తగా చదవవలసిన పద్యమే. దనుజేంద్రుడైన నరకాసురునితో రణమంటే ఎంత భయానకమో వర్ణించిన కృష్ణునికి, తిరుగులేని జవాబు చెపుతోంది సత్యభామ. దానవులైతే ఏమిటి, దైత్యసమూహాలైతే నాకేమిటి? నీ బాహువులనే కోటల మాటున ఉన్న నాకు ఎలాంటి జంకుగొంకు ఉండనక్కరలేదు కదా, అంది. ఇక మరి మారుమాటాడగలడా ఏ ప్రియుడైనా! ఇక్కడ పోతన ప్రయోగించిన ‘దుర్గములు’ అన్నది చాలా సార్థకమైన పదం. గమింప శక్యము కానిది దుర్గము, అంటే శత్రు దుర్భేద్యమైనది అని. అలాంటిది ఒకటి కాదు, రెండు దుర్గాల మాటున ఉన్నది తను. ఇంకెంత రక్షణ! అలా అని ఊరుకోలేదు. నీతో వస్తానంటూ చేతులు జోడించి మరీ వేడుకొంది. ఇక్కడ సత్యభామకి వాడిన పదం ‘మానిని’. ఇది కూడా చాలా సార్థకమైన పదమే. మానిని అంటే చాలా అభిమానం కలది అని అర్థం. సత్యభామ గొప్ప స్వాభిమానం గల స్త్రీయే కదా. అంచేత ఆ పదం ఆమెకి సరిగ్గా తగినదే. పైగా, అంతటి అభిమానవతి చేతులు జోడించి మరీ వేడుకుంటే కరిగిపోకుండా ఉంటాడా ఆ దేవదేవుడు! ఆ మానిని అభిమానానికి ఏ మాత్రం లోటు రానీయకుండా, పైగా ఆమె సమ్మానం ఇనుమడించేలా ‘బహుమాన పురస్సర’ (అంటే గొప్ప సమ్మాన పూర్వకమైన) దృష్టిని సారించాడు ఆ సత్యాపతి.

ఈ పద్యం చివరనున్న వాక్యనిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మరొక విశేషం స్ఫురిస్తుంది. చూడగన్ అనేది అసమాపక క్రియ. అంటే ఆ క్రియతో వాక్యం పూర్తికాదు. ఇంకొక క్రియకి అనుసంధానంగా వాడబడే క్రియ అన్నమాట. ఆ వాక్యంలోని సమాపక క్రియ – మ్రొక్కె. తనని భర్త బహుమానపురస్సర దృష్టితో చూడగా, ఆమె మ్రొక్కింది. సత్యభామ చేతులు జోడించి మ్రొక్కింది, అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెని బహుమానపురస్సరంగా చూశాడు – అని చెప్పి ఉంటే, ఆ రెండు క్రియల మధ్యా కొంత వ్యవధానం ఉన్నట్టు తోస్తుంది. అలా కాకుండా రెండూ ఒకేసారి జరిగాయన్నది స్ఫురించే వాక్యనిర్మాణాన్ని పోతన చేశాడిక్కడ. అంటే ఆమె మ్రొక్కే సమయానికే శ్రీకృష్ణుని మనసు కరిగిందన్న మాట. లేదా ఆ రెండు కార్యాలూ ఒకే క్షణంలో జరిగిపోయాయి. వారిరువురి మధ్యనున్న గాఢమైన అనుబంధాన్ని అది సూచిస్తుంది.

భాష తెలియడమంటే నిఘంటువులో పదాలు, వ్యాకరణ సూత్రాలూ తెలియడం మాత్రమే కాదు. వాక్యవిన్యాస రహస్యాలు తెలియాలి, నుడికారంలోని సొగసులు తెలియాలి, పలుకులోని కాకువు తెలియాలి. అవి తెలియాలంటే పండితుడయితే సరిపోదు, జనవ్యవహారంలో నిత్యం ప్రవహించే పలుకుబడి వంటబట్టాలి. అందుకే విశ్వనాథ ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అన్నది. పోతన కన్నా గొప్పగా తెలుగులోకపు పలుకుబడిని పట్టుకొన్న కవి ఎవరున్నారు!