తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం ఇది: ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల నిండుసభలో మహాకవి ధూర్జటి కావ్యగానం జరిగిందట. నిస్తులమైన ఆ కావ్యమాధురికి విస్తుపోయిన రాయలవారికి ఆ కవిత్వ రసభావాల కూర్పులోని తీయదనానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. విద్యాపరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఈ పద్యపరిప్రశ్నను అడిగాడట:
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”
అని. రాయల వారిచ్చినది చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకు వ్యాపించి, సమస్య వలె కనుపించటంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకు నచ్చుతుందో సద్యఃకృతంగా తోచక పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారట.
అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, ‘రాజా! నాకొక పక్షం రోజులు వ్యవధినిస్తే ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవర వారి చిత్తానికి విన్నవించుకొంటాను,’ అని, మొత్తానికి రాయలవారిని సమ్మతింపజేశాడట.
ఆ రోజునుంచి రామకృష్ణుడు కొలువుకు వెళ్ళటం మానివేశాడు. తెల్లవారుజాముననే మారువేషం వేసుకొని ధూర్జటి గారింటికి బయలుదేరటం, ఆయన దినచర్యను కనిపెట్టటం మొదలుపెట్టాడు. ధూర్జటిగారు ప్రతినిత్యం పంచపంచ ఉషఃకాలాన లేచి, కాలకృత్యాలను ముగించుకొని, శివదీక్షకు కూర్చొని ఒకటొకటిగా స్తోత్రనివేదనం, భస్మస్నానం, భస్మధారణం, రుద్రాక్షధారణం, సంధ్యావందనం, లింగార్చనం, ఇష్టదేవతారాధనం, నైవేద్యం, పూజావిధానమంతా పూర్తికాగానే కొద్దిసేపు విశ్రమించి, ఆ తర్వాత భోజనభాజనాదులను ముగించుకొని, ఆస్థానప్రవేశానికి ఆవశ్యకమైన తీరున పండితవేషాన్ని ధరించి కొలువుకు వెళ్ళి వస్తుండటం, ఇంటికి రాగానే మరుసటినాడు సభలో వినిపించవలసిన గ్రంథభాగానికి సమాయత్తమవుతుండటం మూలాన రామకృష్ణుడికి పెద్దగా తనకు పనికివచ్చే ఆచూకీలేవీ పొడచూపలేదు.
పక్షాంతం కావచ్చే సమయానికి – అన్నాళ్ళుగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై, రాజుగారికిచ్చిన మాట తప్పేట్లున్నదని భయపడుతున్న తరుణంలో రామకృష్ణుడు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ధూర్జటి కొలువు నుంచి తిరిగిరాగానే కొంతసేపు సేదతీరి, మునిమాపు వేళయేసరికి డాబు, దర్పం మీరిన భోగరాయవేషాన్ని ధరించి, ఇంటినుంచి బైటపడి, పదే పదే అటు చూసుకొంటూ ఇటు చూసుకొంటూ – రహస్యంగా నాగవాసం దారి పట్టాడట. రామకృష్ణుడు ఆయనను అనుసరిస్తూ ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళాక, బయట ఆ ఇంటి అరుగుమీదే చేతిని తలక్రింద దిండుగా అమర్చుకొని రాత్రంతా అక్కడే తీరికగా విశ్రమించాడట. ధూర్జటి తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చి, అరుగుమీదున్న రామకృష్ణుణ్ణి చూసి గుట్టు రట్టయిందని గ్రహించి, ఇక చేసేదేమీ లేక, దైవంమీద భారంవేసి ఇల్లు చేరుకొన్నాడట.
ఆ మధ్యాహ్నం రామకృష్ణకవి పేరోలగంలో అడుగుపెట్టి, రాయల వారిచ్చిన సమస్యను పూర్తిచేశాడట:
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”
అని. ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికీ తెలిసినదే కనుక రాయలవారు, రాయలవారిని చూసి సదస్యులు నవ్వారట. చేసేదేమీ లేక ధూర్జటి కూడా నవ్వి తలవంచుకొన్నాడట.
సమస్యలోని పరిశీలనీయాంశాలు
స్మరణోత్సవంగా ఉన్న ఈ కథానకాన్ని ప్రఖ్యాత విమర్శకులు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారు మొట్టమొదట 1876లో ప్రబంధకల్పవల్లి పత్రికలోనూ, ఆ తర్వాత 1893లో వావిళ్ళ వారు అచ్చువేసిన తమ కవిజీవితములు సంపుటంలో కొద్దిపాటి మార్పుతోనూ ప్రకటించారు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని అడిగాడని, ఆయన పాఠం. నేను చిన్నప్పుడు విన్న కథారూపాన్ని నేను ఉదాహరించాను.
పై విధంగా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని పద్యంలోని ఒక పాదాన్నో, ఒకటిన్నర పాదాన్నో; లేక రెండు, మూడు పాదాలను సైతమో పృచ్ఛకుడు అన్వయరహితంగానో, అర్ధోక్తిగానో, ప్రశ్నార్థకంగానో నిలిపి, పరిశిష్టభాగాన్ని అర్థవంతంగా పూరించమని ఇచ్చిన అసమాపకవాక్యాన్ని ‘సమస్య’ అంటారు. సాధారణంగా నాలుగవ పాదాన్ని సమస్యగా ఇవ్వటం ఉంటుంది కాని, నిజానికి పృచ్ఛకుడు ఏ పాదాన్నైనా, పద్యంలోని ఎంత భాగాన్నైనా ఇవ్వవచ్చును.
పైని శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినది ‘సమస్య’ అనుకొంటే, దానికి లాక్షణిక పరిభాషలో, ప్రథమపాదాదిగత కవిజన ప్రతివచనీయము అని పేరు. పద్యంలోని తొలిభాగాన్ని పృచ్ఛకుడు ఇవ్వగా పూరయిత ఆ మిగిలిన భాగాన్ని కొనసాగించి, దత్తార్థాన్ని యథోచితంగా పరిపూర్ణించాలన్నమాట.
‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం
సమస్యను వినగానే మన మనస్సులను ఆకర్షించే ముమ్మొదటి విషయం ధూర్జటిగారిని ఉద్దేశించి కృష్ణరాయల నోట వెలువడిన ‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం. మతి శబ్దానికి – మన్యతే అనయా ఇతి మతిః అని వ్యుత్పత్తి. మన అంటే జ్ఞానం. జ్ఞానము అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనే భేదభ్రాంతికి అధిష్ఠానమై నిత్యము, స్వయంప్రకాశము, సచ్చిదానందస్వరూపము, అద్వితీయము అయిన బ్రహ్మచైతన్యం. ఆ బ్రహ్మచైతన్యము యొక్క ఎరుక దేని మూలాన కలుగుతుందో – అంటే, ఆ జ్ఞానసాధకమైనది మతి. సత్యాసత్యాల, తత్త్వాపతత్త్వాల వివేకాన్ని కలిగించే నిశ్చయాత్మకమైన వృత్తి అది. ఎవరి మూలాన ఆ జ్ఞానము మనకు కలుగుతున్నదని గ్రహించి కృతజ్ఞతతో స్మరిస్తున్నామో, జ్ఞానమూలుడని సన్నుతిస్తున్నామో, ఆ మహనీయుడే స్తుతమతి.
స్తుతమతి అన్నాడు సరే, ఆంధ్రకవి అనటం దేనికి? ఏమీ, ధూర్జటికి సంస్కృతభాషానిరంకుశమహాప్రభుత్వం అలవడలేదా? రాయలు ఆయన సంస్కృతభాషానిరంకుశమహాప్రౌఢిని గుర్తించనే లేదా? తెలుగు కవులకు సామాన్యమైన అష్టభాషావిశారదత్వం ఆయనకు లేదనే ప్రభువు అభిప్రాయమా? శ్రీకాళహస్తిమాహాత్మ్యములో సంస్కృతాంధ్రాలతోపాటు కన్నడపదాలు సైతం చోటుచేసుకొన్నాయి కదా, బహుభాషాకోవిదుడనేందుకు ఆ నూతనసంవిధానం నచ్చకపోయిందా? సకలవాగ్విశారదుడు అనక, వట్టి తెలుగుకవి అన్న విశేషణంతో సరిపెట్టివేశాడా? సంస్కృత తమిళ కన్నడాదిభాషాకవుల మధ్య కేవలం సంజ్ఞాపనకోసం ఆంధ్రకవి అన్నాడా? అని సందేహించేవారు తప్పక గుర్తింపవలసిన విషయం ఇది.
ఆంధ్రకవి అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. పుట్టినప్పటి నుంచి నేర్చుకొన్న సంస్కృత భారతిని కాదని, అందులో ఎన్ని కావ్యాలనో చెప్పినప్పుడు చెందిన సంతృప్తిని కాదని, ఆమూలచూడంగా అభ్యసించిన ప్రాకృతాలను కాదని, తరతరాలుగా ఇంటిలో నెలకొన్న తుళు వాక్తతిని కాదని, కమనీయమైన కన్నడ కస్తూరిని కాదని, విష్ణుచిత్తీయ తమిళాన్ని కాదని, తనకెంతో ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, భగవదిచ్ఛానుసారం ఆ భాషలో ఆముక్తమాల్యదా మహాప్రబంధాన్ని విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది. కళింగ జైత్రయాత్రకు బయలుదేరి శ్రీకాకుళంలో విడిదితీరినప్పుడు ఆయనకు రాత్రి కలలో సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువు సైతం ఆయన పలుకు నుడికారంలో, అంధ్ర జలజాక్షుఁడు కదా. ఆ అంధ్రజలజాక్షుడే స్వయంగా ‘అంధ్రభాష యసాధ్యంబె! యందు నొక్క, కృతి వినిర్మింపు మింక మాకుఁ బ్రియంబు గాఁగ’ అన్నాడు కదా. అంతే కాక,
“తెలుఁ గ దేల? యన్న, దేశంబు తెలుఁ; గేను
తెలుఁగు వల్లభుండ; తెలుఁగొ కండ;
యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి,
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.”
అని – (1) నేనున్నది తెలుగు దేశం, (2) నేను తెలుగుదేశంలో వెలసి, తెలుగువారిని అభిమానించి, వారి అభిమానాన్ని పొందిన తెలుగు వల్లభుణ్ణి, (3) తెలుగు భాష మధురాతిమధురం, (4) నా మాట సరే, నీ కొలువులోని సర్వరాజన్యులు నానా భాషాభణితులను భాషిస్తుండగా – ఆ దేశభాషలలో తెలుగు లెస్స అని నీకు మాత్రం తెలియలేదా? అని స్వయంగా ఆ భగవంతుడే నాతో అన్నాడు – అని చెప్పుకొన్నాడు కదా, స్వప్నగతమైన ఆ భగవద్వాక్యాన్ని అమిత ప్రీతిపాత్రంగా తన ఆముక్తమాల్యదలో నిలుపుకొన్నాడు కదా, ఆయన దృష్టిలో ఆంధ్రకవి అన్నది అంతటి మహనీయమైన విశేషం అన్నమాట. అంతే కాదు. ఆయనే ఒకప్పుడు నిండుసభలో అల్లసాని పెద్దన గారిని పిలిచి, పెద్దను చేసి, స్వారోచిష మనుసంభవానికి కృతిపతిత్వాన్ని అర్థించినపుడు ఆ మహాకవిని గురించి ఒకదానికంటె ఒకటి ఉత్తరోత్తరబలీయంగా విశేషణాలను పేర్కొంటూ, ‘(1) హితుఁడవు (2) చతురవచోనిధివి, (3) అతులపురాణాగమేతిహాసకథార్థ, స్మృతియుతుఁడవు (4) ఆంధ్రకవితా, పితామహుఁడవు – ఎవ్వ రీడు? పేర్కొన నీకున్’ అని, తనయెడ ఆయనకు గల ఆప్తభావానికంటె, ఆ మహామహుని చతురవచఃకౌశలికంటె, నిఖిలపురాణశాస్త్రకోవిదత్వానికంటె బలీయస్తరంగా ఆంధ్రకవితాపితామహత్వాన్ని సాహితీమేరుశిఖరాగ్రాన అధివసింపజేశాడు కదా. నంది తిమ్మన గారు తనకు పారిజాతాపహరణము కావ్యకుసుమాన్ని ‘పారిజాత, హరణ మను కావ్య మొనరించె నంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ’ అని సమర్పించినపుడు ఎంతో సంతోషంగా అందుకొన్నాడు కదా. స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి – అన్న బిరుదాంకనంలో రాయలకు తెలుగు భాష అంటేనూ, ధూర్జటి గారంటేనూ అంతటి గౌరవం ఇమిడి ఉన్నదన్నమాట.
పాఠాంతరాల క్లిష్టసమస్య
ముద్రితప్రతులలో కృష్ణరాయలు అడిగిన ప్రశ్నకు రెండు మూడు పాఠాంతరాలు కనబడుతున్నాయి. వాటి అర్థచ్ఛాయలలో కొంత వ్యత్యాసం ఉన్నది:
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”
అన్నది గురజాడ శ్రీరామమూర్తి గారు చూపిన తొలినాటి పాఠం.
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
యతులితమాధురీమహిమ?”
అని దీనికే కొద్దిపాటి మార్పుతో పాఠాంతరం ఉన్నది.
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”
అని మరొక పాఠం.
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో
యతులితమాధురీమహిమ?”
అని ఇంకొకటి. ఈ నాలుగు పాఠాలలో అర్థసన్నివేశాన్ని బట్టి మొదటిది, రెండవది ఒక తీరున; మూడవది, నాలుగవది ఒక తీరున ఉన్నాయి. రెండవ దానిలో ‘అతులితమాధురీమహిమ ఏల కల్గెనో?’ అన్నప్పుడు నిజానికి ధూర్జటి రాజసభలో ప్రత్యక్షంగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన పరోక్షంలో కూడా రాజు, ధూర్జటి గారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని ప్రసంగవశాన అడగటానికి అవకాశం ఉన్నది. మొదటి పాఠం ప్రకారం, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె – ఈ, యతులితమాధురీమహిమ? అని ప్రశ్నించినపుడు, ‘ఈ’ అన్న నిర్దేశార్థకం అప్పుడే చదువబడిన మధురమైన సన్నివేశంలోని రసప్రతీతికి స్ఫోరకం. భువనవిజయ మహాసభలో కావ్యగానం జరిగినప్పుడు ధూర్జటి కవి సమక్షంలోనే ఆ సంభాషణ సాగినదనుకోవాలి. అందువల్ల ‘ఏల కల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె, ‘ఏల కల్గె నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మెరుగు.
పాఠాన్ని మరికొంత సూక్ష్మంగా విమర్శించి చూద్దాము. ‘ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎలా వచ్చింది?’ అని కృష్ణరాయలు ప్రశంసాపూర్వకంగా అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో అది సందర్భోచితమైన ప్రశ్న. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో, యతులితమాధురీమహిమ? లేదా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనటంలో రాజుకు కలిగిన గౌరవాతిశయం ధ్వనిస్తున్నది. ఆ విధంగా దానిని ప్రథమపాదాదిగతంగా ప్రశ్నించినప్పుడు ధూర్జటిగారి కవిత్వంలో అంతటి తీయదనం ఏ సంస్కారం వల్ల ఉప్పతిల్లిందో కవులు సార్థకంగా వివరింపవలసి ఉంటుంది.
కాని, అందుకు విపరీతంగా, ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని కృష్ణరాయలు అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో మెచ్చుకోలుకైన ప్రశ్న అనిపించదు. ‘ఎలా వచ్చిందో?’ అని గాక, కవులు ‘ఎందుకు వచ్చిందో?’ సమాధానం చెప్పాలి. ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అన్న ప్రశ్నలోనే పరిహాసానికి తగిన పునాది ఉన్నది. అటువంటి సూచన అక్కడ లేదని అనుకోవటం సాధ్యం కాదు. ‘ఎందుకు వచ్చింది?’ అన్న ప్రశ్నలో ఉన్న ఆక్షిప్తి ధూర్జటి వ్యక్తిగతజీవితాన్ని కొంత స్పృశించేదిగానే కనబడుతుంది. అందరికీ తెలిసిన ఆ విధమైన స్వాభావికోదంతాన్ని ప్రసక్తించటం దేనికని కవులు నిరుత్తరంగా ఉండిపోవటం సహజమే. పైగా రాజు ఆ వ్యక్తిగతవిమర్శకు ఎటువంటి సమాధానాన్ని ఎంతవరకు అనుమతించేదీ ఊహించటం కష్టం. ఆ శంకాసంకోచం లేని రామకృష్ణుడు కవి శృంగారవర్తనను వెలిపెట్టడం రాజు ప్రశ్నకు పరిణామస్వరూపమే. అనుమతి తీసికొని పదిహేను రోజులు ఆగి చెప్పినా, అప్పటికప్పుడే సద్యఃస్ఫురితంగా ఆశుగతిని చెప్పినా – రాజు సూచ్యంగా సూచించినదే కనుక, వ్యక్తిగతజీవితాన్ని వెల్లడించే పూరణను వెలికి చెప్పటం భావ్యమే. కానప్పుడు అది నిండుసభలో మహాకవిని నిష్కారణంగా అవమానించినట్లే అవుతుంది. రాజుకు ఎంత మాత్రమూ సమ్మతిలేని కల్పనను ప్రవేశపెట్టినందుకు తదాగ్రహానికి గురికాకనూ తప్పదు.
అందువల్ల కృష్ణదేవరాయలు ధూర్జటికి అవమానాస్పదం కాగల విధంగా సమస్యను రూపొందించి, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో, యతులితమాధురీమహిమ? అని భువనవిజయ మహాసభలో అడిగి ఉండటం నిజమై ఉండదు. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనే అడిగి ఉంటాడు.