ఒక పద్ధతి ప్రకా…రం

మహరాణీపేట నుండీ కేజీహెచ్ గోడ వారంట నడిచొస్తుంటే మా నాన్నని చూసి ఇతను రావిశాస్త్రి గారేమోనని కొందరు పొరపాటు పడేవారు. చలసాని ప్రసాద్ చూట్టానికి సుమారు మా నాన్న లాగే ఉంటారు. ఆట్టే తెలీనివాళ్ళు రావిశాస్త్రిగార్నీ ఘండికోట బ్రహ్మాజీ రావుగార్నీ దూరం నుండి చూస్తే ఎవరు ఎవరో పోల్చుకోలేరు; ఇలాగని ఘండికోట బ్రహ్మాజీ రావుగారు కూడా నాతోటి అన్నారు. కేజీహెచ్ గోడెదురుగా రోజల్లా నిలబడి వేచిచూస్తే గనక వీళ్ళు నలుగురూ ఒకేలాంటి పండు జుట్లూ, వెర్రి నవ్వుల్తోటి ఏ గులేబకావళి కథలోనో ఆ ఉన్న ఒక్క ఎన్‌టీఆరే నాలుగు రకాల వేషాలేసుకుని అవుపించినట్టు ఆ మనిషే కూరలు చవగ్గా బేరం చేసుకోడానికో, కరపత్రాలు పంచుకోడానికో, కోర్టు వాయిదా కోసమో, ఖరగపూర్ రైలు కోసమో నాలుగు రకాలుగా హడావిడిగా అటూ ఇటూ తిరుగుతునట్టు అవుపిస్తారు.

చలసాని ప్రసాద్‌గార్ని పోల్చుకోవాలంటే ఆయన పాదాల దుక్కు చూడాలి. అవి ఎల్లప్పుడూ హవాయి చెప్పుల్తోటి, ఒక రెండంగుళాలైనా పొట్టిగా మడమలు దిగని పంట్లాం కుట్టు తోటీ కనిపించేవి. ఎక్కడా నిలకడగా నిల్చోకుండా ఒక ఖాదీ భాండార్ సంచీ నిండా ఏవేవో పుస్తకాలూ, కాయితాల్తోటీ అటు ఇటూ నడుస్తూ కనిపించేవి. వెర్రి నవ్వు అంటే ఏంటో పిల్లలకి బోధపడాలంటే చలసాని ప్రసాద్ నవ్వుతున్న ఫొటో చూపించాలి. ఆయన అలాగ నవ్వుతున్నప్పుడు పెదాలు కార్టూన్ బొమ్మల్లోన డోనాల్డ్ డక్ పెదాల్లాగ, బక్క విల్లు ముడతలు పడిపోతున్నట్టూ ప్రత్యేకమైన వంకర్లు పోతాయి. ఆయనకి ‘బుర్ర దువ్వుకోడం ఇలాగ!’ అని బుగ్గలు చేత్తో నొక్కి పట్టుకుని ఎవరూ నేర్పించి ఉండరు. జిల్లా కేంద్ర గ్రంధాలయం మేడ (అంటే డాబా) మీద నెలకో, రెణ్ణెల్లకో ఒకమాటు విరసం మీటింగులయ్యేవి. ఈ సమావేశాలకి సారధి కాబట్టి అలాంటి సాయంత్రాలు ఉపన్యాసాల్లో మొదటి బోణీ ఆయనదేను. ఉపన్యాసకుడు అని పేరే గాని ఆయన్ని గొప్ప వక్త, ఉపన్యాసకుడూ ఇలాగ ఏమీ అనుకోలేము. ఆయన అప్పటి వరకూ కుర్చీలు దులుపుకుంటూ, టీలు రప్పించడానికి హైరానా పడిపోతూ, ఒక్కొక్కళ్ళే డాబా మీదికి చేరేవాళ్ళని అందర్నీ పలకరించి ప్రముఖులకి మర్యాదాలు చేస్తూ తిరుగుతున్నవాడు సమావేశం ప్రారంభం అని సూచనగా ఆ డాబా గచ్చు మీదే ‘వేదిక’ అన్నట్టు రూపించిన జాగాలో నిలబడి తనలో తనే ఏ కారణం లేకుండానే మురుసుకుపోతున్నట్టు అదే వెర్రి నవ్వుని ఇంకా ముసి ముసిగా నవ్వుతూ మొదలు పెట్టేవారు. ఆయన మాటల్లోన ముఖ్యమైనదీ, నాకు అలా గుర్తుండిపోయిన మాట – ‘… ఒక పద్ధతి ప్రకారం.’ అంటే, “ఒకవైపు శాంతి! శాంతి! అహింస! అని గొంతు చించుకుంటున్న ఇదే వెంగళరావు ప్రభుత్వం ఇంకొక వైపు రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకా… రం…” ఇలాగ. ఆయన ఇలా మాట్లాడుతున్నప్పుడు కుడి చేతి అరచేతిని తలంత ఎత్తున ఒక ఖడ్గం లాగ గాల్లో నిలబెట్టి, దాన్ని ఒక పద్ధతి ప్రకా…రం కింది వరకూ నెమ్మదిగా, పట్టుదలగా విమానం దింపుతున్నట్టు ప్రదర్శిస్తూ ఈ మాటలు అనేవారు. అసలే బొమ్మల దుకాణంలో సంబరంగా అటూ ఇటూ తిరుగుతున్న చిన్ని బాబుకి హఠాత్తుగా వాడికి చాలా ఇష్టమైన బొమ్మలు మూడింటిని తెచ్చి చేతిలో పెట్టేస్తే మరీ పొంగిపోతాడు. శ్రీ శ్రీ, గురజాడ, రావి శాస్త్రి – వీళ్ళు ముగ్గురి పుస్తకాల ఊసూ వస్తే ఆయన వాలకం ఇలాగ ఉండేది. ఈ ముగ్గురి రచనల చుట్టూ ఆయనకి చాల వ్యాసంగం ఉండేది. విరసం సమావేశాల్లోన ఆయన ఎప్పుడూ పరిచయ వాక్యాలే చెప్పేవారు. వాటిలోన తరచు “మీరు అటు వైపా? ఇటు వైపా? మీరెవరి పక్షఁవో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి! ముందు మీకంటూ ఆ స్పష్టతే ఉంటే గనక …” అనీ ఇలాగ ప్రశ్నించేవారు, డాబా మీద కూచుని సమోసాలు తింటున్న మమ్మల్ని.

అప్పట్లోన నేను వక్తృత్వం, వ్యాస రచన పోటీలు పెడితే ప్రైజులిస్తారని అన్ని రకాల కవుల మీటింగులకి వెళ్ళేవాడిని. విరసం సమావేశాల్లాంటి చోట వినిపించే మాటలు కొంత అబ్బురంగా, కొంత అయోమయంగా తోచేవి. మిగిలిన బాల్‌కే బచ్చాల పక్కన పిట్ట గోడ ఊతంగా నిలబడి ఇవన్నీ వింటుండేవాణ్ణి. కథలు, కవిత్వాలంటే సర్దా ఉండే మనుషులకి వెళ్ళి కూచోడానికి ఈ విరసం సమావేశాలూ, ఇవి కాక బుక్ సెంటర్ మేడ మీద సమావేశాలూ, ఇంకా సహృదయ సాహితి, విశాఖ సాహితి అని ఉండేవి. ఎమ్‌సెట్ రేంకి కోసం వెచ్చించగా మిగిలిన సాయంత్రాలు ఎప్పుడైనా ఇలాంటి మీటింగులకి వెళ్ళి కూచునేవాళ్ళమి. ఇవి కాక పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చే సంస్థలు కొన్ని వేరేగా ఉండేవి. ‘వివేకానందుని జీవితము – సందేశము ‘ అని రామక్రిష్ణా మిషన్ వారు, ‘అగ్ని ప్రమాదాల నివారణ – యువత పాత్ర ‘ అనే అంశం మీద జాతీయ అగ్నిమాపక భద్రతా వారోత్సవాల వాళ్ళు, ఇంకా శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం వారు, రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు, పోటీలు పెట్టి ముందు రోజు ఈనాడు పేపర్లోన ప్రకటించేవారు. ఒక్కోసారి ఊళ్ళో కథల పందేలు పెట్టి, దానికి భరాగో గారిని న్యాయ నిర్ణేతగా నియమించేవారు. ఇలాగ ఊళ్ళోని కవుల మీటింగులన్నింటినీ పరిశీలించి, ఓ కాణో పరకో గెలుచుకునే వ్యాపకంలో భాగంగా నేను విరసం మీటింగులకీ వెళ్ళి కూచునేవాణ్ణి. ఎమ్‌సెట్ రేంకు సంపాదించుకున్న తరవాత నేను ‘అటువైపు’ అనీసే ఖాయం ఐపోయింది కాని, ఎందుకో మా నాన లాగుంటారనీసేమో నేను చలసాని ప్రసాదు వైపు కూడానా అనీ అనిపించేది.

విరసం మీటింగుల్లోన ఎప్పుడో ప్రత్యేకమైన పండుగల్లాంటి రోజుల్లోనే టీ ఉండేది. బుక్ సెంటర్ మేడ మీద కవుల మీటింగుల్లోన ఎల్లప్పుడూ టీ ఉండేది. వరాలు చెట్టి గారి తమ్ముడు కవులందరికీ టీలు రప్పించేవారు. త్రిపుర ఎప్పుడేనా పున్నానికో అమావాస్యకో ఈ మీటింగులకి వచ్చేవారు. ఇలాంటి చోట్ల మహా రచయితలు, ప్రముఖ రచయితలు, ఓ సుమారైన రచయితలు, పిల్ల రచయితలూ, తతిమా అనామకులూ – ఇలాగ ఎవరూ విధించకున్నా ఒక అధిక్రమం లాగ ఉండేది. త్రిపుర ఎక్కడో మూల మూలల్లంట నక్కి నిల్చున్నవాళ్ళు, పల్లెటూళ్ళ నుండి వచ్చిన అలగా కలగా కవులతో మాట కలిపి వాళ్ళని అనునయిస్తూ సమయం గడిపేవారు. అప్పట్లో రేడియో, పత్రికలూ, పుస్తకాలూ ఇవే ఉండేవి సమాచారం కోసమైనా, సాహిత్యం కోసమైనా. అచ్చులో వచ్చిన విషయాలకి చాల గౌరవం, మతింపూ ఉండేవి. ఏదైనా రాసి పుస్తకాలు, పత్రికల్లో ప్రచురించిన వాళ్ళకి చాల మప్పితం చేసేవారు. మంచి మంచి భావాలు, ఆలోచనలతో కధలవీ రాసి పుస్తకాల్లో ప్రచురిస్తే, అవి మిగత సమాజంలో అందరి చేతా చదివించితే అలాగ ఆ క్రమంలో ఏదో ఒక గొప్ప చారిత్రక మార్పు కలుగుతుందనీసి తిరుగులేని నమ్మకంగా ఉండేది. ఇలాంటి ఆశావాదులందరికీ తల్లో నాలిక లాగా చలసాని ప్రసాద్‌గారు పుస్తకాల్ని, అవి రాయగలిగిన మనుషుల్ని వెర్రిగా ప్రేమించి, గౌరవిస్తూ ఆ పన్ల మీద కాలేజీ డౌను దగ్గరా, విశాలాంధ్ర దెగ్గిరా అవుపించేవారు. ఆ పుస్తకాల్ని గురించి మళ్ళీ కొన్ని పుస్తకాలు వేయించేవారు. నాకు పుస్తకాల కంటే కూడా ఆయన్లాంటి మనుషులంటే చాల ఇది. “అన్నవరం సచ్నాణ మూర్తీ తండ్రీ! అంతలెఖ్ఖన నీ కొండకి అన్నీసి మెట్లెక్కి నేన్రాలేన్నాయినా, ఇక్కణ్ణుంచే నమస్కారం!” అని మా అమ్మ బస్సులోంచే దండాలు పెట్టి లెంపలేసుకునీటట్టు నేను డాబాల మీద చలసాని ప్రసాద్‌గారికి అటువైపు నుంచే దండాలు పెట్టుకునేవాణ్ణి.

ఒక రోజు విరసం మీటింగుకి చాల పండుగ కళ వచ్చింది. ఎప్పుడూ వచ్చే వాళ్ళకి రెండింతలుగా కవులూ రచయితలూ వచ్చి కూచున్నారు. టీలూ, బిస్కట్లూ కూడా తింటున్నాము. రావి శాస్త్రిగారు ఛలోక్తులు విసురుతుంటే అందరూ వలయాలు వలయాలుగా చేరి నవ్వు మొఖాలు వేసుకుని వింటున్నారు. “వార పత్రికలేఁటి వై? వార వనితల్లాగ పుంఖానుపుంఖాలుగా వొచ్చెస్తునాయి?!” అని ఇలాగ ఆయన ఇగటాలాడుతున్నారు. ఇంతట్లోకి మీటింగు ఎందుకో గ్రంధాలయం డాబా మీంచి కిందన పోర్టికోలోకి దిగిపోయింది. చినుకులు పడుతున్నాయని కాబోలు. ఇంత మంది జనఁవూ ఆ చిన్న పోర్టికో కిందనే సర్దుకుని నిలబడ్డాము. చిన్నపాటి చర్చ లాగ నడుస్తోంది. ఒకావిడ – డిగ్రీ కాలేజీ అమ్మాయి లాగ – లేచి నిలబడి అడుగుతున్నారు. ఆవిడ పేరు మమత, సమత, లేకపోతే నవత – ఇలాగ చాన్నాళ్ళు గుర్తుండిపోయింది. ఆవిడ కొంత కంగారుగా నిలబడి, రావి శాస్త్రిగార్ని ఉద్దేశించి “మేం రాస్తున్నాం! అయినా పత్రికలకి పంపిస్తే సరిగ్గా రిసీవ్ చేసుకోటం లేదు …?!” అని ఫిర్యాదు చేసేరు. రావి శాస్త్రి గారు తొణక్కుండా బెణక్కుండా “ఆళ్ళెవరో పత్రికలో వేసీదేంటమ్మా? రాత పత్రిక పెట్టీసుకోండి. మేం మా రాత పత్రిక మేఁవే నడుపుకునీవాళ్ళం. రాత పత్రిక పెట్టీసుకో!” అని చెప్పేరు. ఆయన మాటాడితే వినాలని అందరూ చెవులు రిక్కించి ఎదురు చూసేవాళ్ళం. ఆ ప్రశ్న అడిగినావిడ చలసాని ప్రసాద్‌గారి అమ్మాయని నా చుట్టూ నిలబడిన వాళ్ళలో ఒకాయన అన్నాడు.

చలసాని ప్రసాద్‌గారి పరిచయ వాక్యాలు, రావి శాస్త్రిగారి ఉపన్యాసం, ఛలోక్తులూ, జవాబులూ అన్నీ అయిపోయేక, వానొచ్చి అందరూ పోర్టికోలో సర్దుకున్నాకా సభలోన ఒక అలజడి, గుస గుసల కెరటం లాగ తలెత్తి ఇటూ అటూ కదుల్తునాది. అందరూ ఉత్కంఠ తోటి “ఎవరు? ఏం జరుగుతునాది?” అన్నట్టు కాసుక్కూచున్నాము. ఒకాయన, సుమారు ముప్ఫయ్యేళ్ళేనా ఉంటాయో లేదో, సన్నంగా పొడూగ్గా గిరజాల జుట్టు, నల్ల దళాసరి ఫ్రేం కళ్ళద్దాలూ పెట్టుకుని చాల మొహమటం పడిపోతూ ఇంక విధిలేక నిలబడినట్టు వెనక్కి జరిగిపోతున్నారు. ఆయన అంత మొహమాట పడుతుంటే చలసాని ప్రసాద్ వాళ్ళు ఆయన మీద, అలాక్కాదు…! మాట్లాడాలి…! అని ‘రిక్వష్ట్’ విధించేరు. రావి శాస్త్రిగారు హెచ్చరికగా తలూపుతూ “ఎళ్ళవై బాల గోపాలు! ఎళు..!! మాటాడు…” అని ఆయన్ని మరీ మరీ ముందుకి తోస్తే ఆయన బలవంతమ్మీద ముందుకొచ్చి నిలబడి ఆ సభలోని మనుషులతో మాటాడుతునట్టు కాకుండా, ఎవరో ఆకాశంలోని యెహోవాతో డైరెక్టుగా తన సొదనంతా వెళ్ళబోసుకుంటున్నట్టు నెమ్మదిగా సణుక్కుంటున్నట్టు మాటాడ్డం మొదలు పెట్టేరు. అవేళ బాల గోపాల్‌గారు ఆ మీటింగుకి రావటమే ఆ పండుగ స్పెషల్ అని మాకు అర్ధమయిపోయింది. ఒకసారి మొదలెట్టేక ఆయన అనర్గళంగా ఆకాశంలోకి చాలా సేపు మాటాడేరు. ఆయన వరంగల్ నుండి వొచ్చేరని, మేక్స్‌లో చాలా జీనియస్ అనీ మా పక్కనున్నాయన అన్నారు. నేను బాల గోపాల్‌గారిని చూట్టం అది ఒక్క మాటేను.

మేము చదువుకునే రోజుల్లోన చుట్టూ ఒక విప్లవ వాతావరణం లాగ ఆవరించుకునే ఉండేది. మా ఊళ్ళోన మాటల్లోన యధాలాపంగా “ఆదిభట్ల కైలాసం! వెంపటాపు సత్యం!” అని ఇలా దొర్లుతుండేవి. ఒక్కోరోజు పొద్దుట లేచి కళ్ళు నులుముకుని చూస్తుండగానే వీధికి అడ్డంగా బెంచీలు పరిచి పరదాలు కట్టీ జననాట్యమండలి వాళ్ళు పాటలు పాడ్డానికి దళ్ళు కట్టేవాళ్ళు. మా సుబ్బులు పిన్నిగారి హరి ఆ పాటలు వినే ఉత్తేజితుడై నుదుటికి ఎర్రటి గావంచా కటుకుని వాళ్ళలోన కలిసిపోయేడు. “ఎమర్జెన్సి ఉద్దేశం – ప్రజాస్వామ్య సంరక్షణ!,” “ఒకటే మంత్రదండం: కఠోర పరిశ్రమ, ధృడ సంకల్పం…” అని ఇలాంటివి పెద్ద పెద్ద బోర్డ్లు చదువుకుంటూ స్కూలుకెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి ఎప్పుడూ కనిపించే పోలీసు జీపులు కాకుండా నిగనిగలాడే ఇనప టోపీల వాళ్ళు నలభై ఏభయ్యేసి మంది మిలట్రీ లారీల్లోన వరాసగా రోడ్డు మీంచి పోయేవారు. సీఆర్పీ వాళ్ళంటే వాళ్ళేనని వీధిలో అనుకుంటునారు. మా వీధిలో చిన్నప్పుడే మొగుడు పోయి విధవరాళ్ళయిపోయిన అత్తలు, దొడ్డలు, మామ్మలూ చాలామందే ఉండేవారు. వీళ్ళు పునిస్త్రీలైన ఇల్లాళ్ళ ఇళ్ళలోన జంతికలూ, చెగోడీలూ చెయ్యడానికీ, వంటలకీ, పురుళ్ళూ పుణ్యాలకి ఆసరాగానూ ఇల్లిల్లూ తిరుగుతుండేవారు. లేనప్పుడు చిన్న చీకటి గుయ్యారాల్లాంటి కొట్టిళ్ళలో ఒక మూల పొయ్యి, ఒక మూల దేవుడు పెట్టితో కనిపించేవారు. “పిల్లలవాళ్ళకో వెధవ ముండా, ప్లీడరుకో గుమస్తా! అలా ఉండాలమ్మా” అనీసి మా అమ్మా వాళ్ళూ అనుకునేవారు. వెధవముండలు చేసే చాకిరీనే ఇప్పుడు విల్లాల్లో, ఎపార్ట్‌మెంట్లలో ఆయమ్మలు వహిస్తున్నారు. అప్పటివరకూ సీఆర్పీ వాళ్ళూ అంటే ఈ వెధవ్వాళ్ళనే అనుకునేవాళ్ళమి. ఎందుకంటే పెద్ద వయసు పిల్లలు ఇగటాలకి ఈ విధవరాళ్ళ వెనక పడి వాళ్ళ గుండూ, పంచెనీ చూపించి “సీఆర్పీ! సీఆర్పీ!” అని వెక్కిరించేవారు. నిజం సీఆర్పీ వాళ్ళు లారీల్లో ఏజెన్సీ అడవుల్లోకి సాయుధ పోరాటాల్ని అణిచెయ్యడానికి వెళ్ళటం ఒకమాటు చూసేను.

ఒక రోజు మిట్ట మధ్యానం ఎర్రటెండలోన ఒకాయన మా జాబిరీ తలుపు కొట్టేరు. ఆయన ఒకేభయ్యేళ్ళ మనిషిలాగున్నారు. ఆయన జాబిరీలోకొచ్చి “మీరు వీరసం లోకి రావాలి!” అనీసి నిలబడ్డారు. అప్పట్లో నాకు పచ్చకామెర్లొచ్చి సచ్చినంత పనయ్యి తగ్గేయి. అదీ కాకుండా తిలక్ కవితలు చదువుకుంటూ తిరుతునట్టుగ – అతని కన్నులలో నక్షత్ర ధూళి… ఆమె కురుల చెరగు విధి సన్నని జాజి అత్తరు తెర… ఆ రాత్రి గాలి కాలం కన్నుల కప్పిన జాలి పొర… అయినా ఎవరున్నారులే నేస్తం? నీకు నేనూ, నాకు నువ్వూ! – ఇలాగుండేది. ఆయన మంచినీళ్ళేనా అడక్కుండా కవులు, రచయితల చారిత్రక బాధ్యత గురించి చెపుతున్నారు. నాకు ఆయన చెమటలు కక్కే నల్లటి మొహం, ఎర్ర కళ్ళజోడే గుర్తుండిపోయేయి. “ఈ తోవ కాకపోతే ఇంకేటున్నాది? గణపతిరాజు అచ్యుతరామ రాజుగారి సాహితీ సభలు రాజు గారి దర్బార్ల లాగుంటాయి. ఏటంటారు?!” అని ఆయన ప్రాధీనపడ్డారు. నేను ఉలుకూ పలుకూ లేకుండా ఉంటే ఆయన ‘నీతోటి సర్లె! వొస్తాను!’ అన్నట్టు మెట్లు దిగి బీచీ వైపు వెళిపోయేరు. ఇలాంటి వెర్రి పట్టుదల ఉన్న సాహితీజీవులు, కళాకారులు ఎప్పుడైనా తారసిల్లేవారు. నేను రోజూ సందులు గొందుల్లోంచి నడుచుకుంటూ కాలేజీకెళ్ళే తోవలోన ఒక సందులో చిన్న కొట్లో ఒకాయన గెడ్డాలు, ఎర్రటి జీరల కళ్ళతో ఒక ఇనప కుర్చీలో కూచుని ఆయిల్ పెయింటింగ్స్ వేసేవాడు. ఆయన బొమ్మల్ని మాత్రమే చూసి, ఆయనతో చూపు కలపకుండా ఉంటే సరే! ఒక్కోరోజు పొరపాట్న చూపులు కలిస్తే ఏక కాలంలోనే చాల ఆప్యాయంగాను, చాలా కర్కశంగానూ నవ్వేవాడు. లోపటికి రమ్మని. ఆయన పెయింటింగ్స్ రెండు రకాలుండేవి – ఒకటి షాపులు, సినిమాలు, ప్రెస్సుల వంటి వాటికోసం వేస్తున్నవి; రెండోవి పిడికిలి బిగించి ఆకాశంలోకి నినదిస్తున్న కార్మికులు, శ్రామికుల గుప్పిళ్ళలోంచీ రక్తాలు కారుతున్నట్టూ. ఒక రోజు ధైర్యం చేసి ఆ కొట్లోకెళితే బొమ్మల్ని సావధానంగా చూణ్ణిచ్చేడు. “ఈ మధ్య పురాణం ఏదో వాగినట్టున్నాడు. అలాంటి ప్రతీప శక్తులకి త్వరలోనే సరైన సమాధానం చెప్తాం…” అని ఇలాటి మాటలంటుంటే నేను గబ గబా మెట్లు దిగి మెయిన్ రోడ్డు మీదికి వెళిపోయేను.

చలసాని ప్రసాద్ ప్రశ్నలడిగేటప్పుడు “మీరు ఇటేపా, అటేపా? ఇదా, అదా??” అని ఇలాగ మల్టిపుల్ ఛోయిస్ ప్రశ్నలే ఆడిగేవారు, అరిచేతుల్తోటి తనకి అటూ ఇటూ రెండు జాగాల్నీ చూపిస్తూ. అవి (A) or (B) – Select a single, correct answer! అన్నట్టుగా ఉంటాయి. చలసాని ప్రసాద్ గనక పేపరు సెట్ చేస్తే అన్నీ ఇలాంటి A/B ప్రశ్నలేననీ, ఫిలిందీ బ్లేంక్స్ టైపు ప్రశ్నలు, ఎస్సే కొస్చిన్లూ ఉండవేమోనని నాకు నవ్వొచ్చేది. త్రిపురకీ, చలసాని ప్రసాద్‌గారికీ స్నేహం ఉండేది. త్రిపుర నాతో కబుర్లు చెప్తూ చలసాని ప్రసాద్‌గారితో సంభాషణల్ని గురించి కూడా చెప్పేవారు. ఆయన నెల, నెలా పదిహేను రోజులకైన తప్పకుండా త్రిపుర దగ్గరికి వచ్చేవారు. వచ్చి – “త్రిపురగారూ? అయితే కీట్స్ కవిత్వం గొప్పదంటారా, షెల్లీ కవిత్వం గొప్పదంటారా?” అని ఇలాంటివి A vs. B ఖరాఖండీగా తేల్చి చెప్పీమన్నట్టు ప్రశ్నలు అడిగేవారు. త్రిపుర “అలా చెప్పటానికి కష్టం …” అని నసుగుతూ నీళ్ళు నమిలేవారు. అలా ఈ మాటా ఆ మాటా అయ్యేక కొంత సేపటికి మర్చిపోయి ఇందాక అడిగిన ప్రశ్ననే చలసాని ప్రసాదు మళ్ళీ అడిగేవారు: “అయితే త్రిపురగారూ? కీట్స్ కవిత్వం గొప్పదంటారా, షెల్లీ కవిత్వం గొప్పదంటారా?” అని మళ్ళీను. వామపక్ష వాదులూ, ఇలాంటి మనుషుల మీద ఆ వాదం అంటే గౌరవం, అవగాహన, సానుభూతీ లేనివాళ్ళు విసుక్కుంటారు, కోపగించుకుంటారు. లేదూ గుంభనంగా ఊరుకుంటారు. నిజానికి ఏ పక్ష భావాలున్న మనుషుల్నైనా ఆ పక్ష భావాలు లేనివాళ్ళు సాధారణంగా ఇలాగే కంటగించుకుంటారు. జై భీం గాళ్ళు! అని, ఛాందస పిలక వాదులు! అని, దేవుని బిడ్డలు! అనీ ఒకళ్నొకళ్ళం కసిదీరా వెక్కిరించుకున్నట్టు. త్రిపుర వైఖరి ఇలాక్కాదు. అలాగని అది పర మత ‘సహనం’ అని అలాగా కాదు. అది – పరా లేదూ, మతం లేదూ, ఎవరు ఎవర్ని సహిస్తున్నారు?? అని కేవలం కళ్ళతోటే అడుగుతునట్టుండేది. మార్క్సిష్ట్ సంప్రదాయాన్నీ, ఖచ్చితమైన నిర్ధారణ, కార్యాచరణ మీద వాళ్ళ పట్టుదలని గురించీ, సిద్ధాంతాన్ని గురించీ త్రిపుర ఒక వకాలత్ లాగ విడమర్చి చెప్పేవారు. త్రిపుర స్నేహం చలసాని ప్రసాద్‌గారికి ఊరడింపుగా ఉండేదనుకుంటాను. తరచు వచ్చి పోతుండేవారు.

చలసాని ప్రసాద్‌గారికి చివర్లోన వినికిడి సమస్య అయ్యింది. ఆయనతో నాకు ప్రత్యక్షంగా పరిచయం ఎప్పుడూ లేదు. ఒకే ఒక్క సారి మాటాడేను. ఓ మాటు నాకు అభ్యుదయ పత్రిక కాపీలు కావల్సి వచ్చింది. వాటిలోన నేను రాసింది కన్యాశుల్కం నాటకానికి తరువాయి (సీక్వెల్) రెండు మూడు సంచికల్లోన ప్రచురించేరు. మెడ్రాస్ నుండి రాంభట్ల కృష్ణమూర్తిగారూ వాళ్ళు ఈ కన్యాశుల్కం కొనసాగింపు పోటీలు పెట్టించి అది రాసినోడికి నాకు బహుమానం ఇచ్చేరు. ఆ సంచికల కాపీలు ఆయన్దగ్గిరుంటాయని ఎవరో అంటే నేను ఆయన్ని అడిగేను. ఆయన తన దగ్గిర లేవు, కృష్ణాబాయిగార్ని అడగండి అని పంపించేరు. అప్పట్లోన కృష్ణాబాయిగారు వాళ్ళు సిరిపురం దగ్గిర యూనివర్సిటీ బంగళాలో ఉండేవారు. ఆ కాపీలు వెతికేరు కాని దొరకలేదు. ఆ ఒక్క మాటే నేను ఆయనతో ముఖతః మాటాడ్డం. కాని మీటింగుల్లోనా, రోడ్ల మీదా, పుస్తకాల షాపుల్లోనూ కనిపిస్తుండేవారు. ఆయన్ని చివరి సారిగా సుమారు నాలుగేళ్ళ కిందట విశాఖపట్నంలో ఒక పెళ్ళిలో చూసేను. లేచి వేదిక మెట్లెక్కబోతూ తొట్రుపడి కింద పడిపోబోతుంటే నలుగురూ రెక్కలు పట్టుకుని లేవనెత్తేరు.

రెండేళ్ళ కిందట జిల్లా గ్రంధాలయం డాబా ఎక్కి కూచుందామని అక్కడికెళ్ళేను. అక్కడ ఆ గ్రంధాలయం ఉండే జాగాలో నున్నగా చదును చేసి, మట్టి మెత్తీసి ఉంది. ఎదురుగా సాయిబుల శ్మశానం కొండ మీదికి పాకే చోట గుంపులు గుంపులుగా సాయిబులు తెల్లటి టోపీలూ లాల్చీలతో ఇటూ అటూ తిరుగుతున్నారు. వాళ్ళ వాళ్ళు ఎవరో చనిపోయేరు. ఆ బయట చాల దయనీయమైన మనుషులు, రోగులు ఎవర్నీ ఎటూ నడవనియ్యకుండా ఆపి ముష్టెత్తుకుంటున్నారు. ఆ గుంపులోంచి నేను చాల ప్రయత్నం మీద బయట పడ్డాను. నా వాలకం చూసి దయ తల్చి మా డ్రైవరుగారు “ఏఁటి చూస్తనారు?” అనడిగేడు. “ఇక్కడ జిల్లా గ్రంధాలయం ఉండాలి, పచ్చ రంగు డాబా!” అనడిగేను. “అదా, అదెప్పుడో కొట్టీసేరు. ఇప్పుడీ జాగాలో షాపింగ్ మాలో ఏదో కట్టెస్తారు! మీకు అప్పటి వొర్జినాల్టీ చెక్కు చెదరకుండా చూడాలంటే ఒకే ఒక్క జాగా – రెల్లి వీధి!” అనీసన్నాడు. జిల్లా గ్రంధాలయం మీంచి మహారాణీ పేట సైణ్ణుండి రెల్లి వీధిలోంచి నడిచెళ్తే అక్కడే మా ఇల్లు. మా నాన్న, రావి శాస్త్రిగారూ, చలసాని ప్రసాదూ ఈ దారంటే నడిచెళ్ళేవారు. రావి శాస్త్రిగారు చచ్చడి బాజా అంటే చాలా లైక్ చేసేవారు. నేను రెల్లి వీధిలోంచి అలవాటైన తోవంట నడుచుకోనెళ్తుంటే ఒకావిడ నడి వయసు మనిషి, ఇంటి ముందర సిమెంట్ గచ్చు వీధిలోన ఒక ఇనప రేకుల పొయ్యి, పెద్ద పెనం పెట్టి అట్లు పోస్తున్నాది, అమ్మకానికి. అక్కడ ఆగి నిల్చుంటే ఇంతట్లోకి ఒకైదుగురారుగురు గుంట్నాకొడుకులు నా వెనక పడ్డారు. “హేయ్! హెయ్ మిష్ఠఱ్!! గివ్ మి టెన్ రుప్పీస్? గివ్ మి..!!” అని అమిరికావోడి భాష లోన నన్ను దబాయిస్తున్నారు. రెల్లి వీధి వొర్జినాల్టీ అలాగే ఉంది కాని, నేనే ఇంక అక్కడివాణ్ణి కానని నాకే ఎత్తి చూపిస్తున్నట్టు. చప్పున వెనక్కొచ్చీసేను.

చలసాని ప్రసాద్‌గారు వామ పక్ష భావాలు కలవారు. ఏ పక్షాల వాళ్ళైనా కష్టంలో ఉన్న మనుషుల్ని ఎంతో కొంతా పట్టించుకోకుండా ఉండరు. నువ్వు అటువైపా? ఇటువైపా? మీరెటువైపు? A or B? అనడిగితే ఎటూ ఏమీ చెప్పలేకపోయినా. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నల్నే బుద్ధిజీవులు రకరకాలుగా పరిశోధిస్తున్నారు. వాళ్ళు కొత్తగా చెప్తున్నది ఏమిటంటే ప్రపంచంలోని నూటా తొంభయ్యారు దేశాల్లోన ఒక్క పాతిక దేశాలే బాగా డబ్బున్న దేశాలు. మిగతావి ఎంతో కొంత బీద దేశాలు. ఆ పాతిక గొప్ప దేశాలూ గొప్పవై ఉండడానికి, అలాంటి గాలీ నీరూ నేలా మనుషులే ఉన్నా ఈ మిగిలిన బీద దేశాలు బీదవిగా ఉండాడానికీ ముఖ్యం మూడు కారణాలు. మొదటిది – గొప్ప దేశాల్లోన గొప్ప సంస్థలు, వ్యవస్థలూ ఉంటాయి – స్కూళ్ళు, యూనివర్శిటీలు, న్యాయస్థానాలు, పత్రికలు, గ్రంధాలయాలూ, కవుల మీటింగుల వంటివి. అవి రోజూ తెల్లార్లెగిసి నిష్టగా తమ పని తాము చేసుకుపోతుంటాయి. తమ తమ ఇష్టాలు, ఆశలు, కష్టం సుఖం ప్రకారం వాటిలో చేరి జనం తమ బుర్రల్ని, బతుకుల్ని ఓదార్చుకుంటారు; తమ సంఘాల్నీ, దేశాల్నీ బావు చేసుకుంటారు. ఇలాంటి వ్యవస్థలు లేనివి, ఉన్నా ఖరాబు చేసుకుని ధ్వంసం చేసుకున్నవీ బీద దేశాలుగా మిగిలిపోతాయి. పౌర గ్రంధాలయాల మేడలు (డాబాల) వంటి యప్పస్ జాగాల మీద చలసాని ప్రసాద్ లాంటి మనుషులు ఇలాంటి సంస్థల్ని తమకి చాతనయినట్టు నిర్మించి, నిలబెట్టుతారు. ఒక పద్ధతి ప్రకా…రం.