నిసీ షామల్ బాల్లీ షూ టక టక లాడించుకుంటూ ఆపరేటింగ్ రూమ్స్ ఆవరణ లోకి వచ్చింది. డాక్టర్ల లాకర్ల రూమ్ లోకి వెళ్ళి వంటి మీది పై బట్టలూ, చెవుల పోగులూ, చేతి వాచ్ తీసేసి, తనకు కేటాయించిన లాకర్ తెరిచి అందులో పడేసింది. సర్జికల్ గ్రీన్స్ వేసుకుని నెత్తిమీద కేప్ పెట్టుకుని జుట్టు బైటికి రాకుండా దానిలోకి సర్దేసింది. షూ మీద లెగ్గింగ్స్ తొడిగింది. మెళ్ళో మాస్క్ వదులుగా వేళ్ళాడేసింది. పక్కనే ఉన్న డాక్టర్ల వెయిటింగ్ రూం లోకి వెళ్ళి హాయిగా సోఫాలో జేరగిలబడి కూర్చుంది.
కాసేపు కళ్ళు మూసుకు కూర్చుని, ఆ తర్వాత పక్కనే బల్ల మీద పెట్టి ఉన్న ‘ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గైనకలాజికల్ కాన్సర్’ తీసి తిరగవెయ్య సాగింది. కార్సినోమా ఆఫ్ వల్వా ; వల్వెక్టమీ ఆర్ రేడిఏషన్ థెరపీ, కార్సినోమా ఆఫ్ సర్విక్స్ ; రాడికల్ హిస్టెరెక్టమీ వర్సస్ సింపుల్ హిస్టెరెక్టమీ ప్లస్ రేడిఏషన్ థెరపీ, కార్సినోమా వెజైనా – ఇలా ఆర్టికల్స్ చూస్తూ ఉంటే ఆమెకు ఎందుకో లటిక్కిన ఒక తెలుగు కధ ‘ అయోని ‘ పేరు గుర్తుకు వచ్చింది. అయోని అంటే గర్భసంచో, వెజైనానో, వల్వా నో లేని ఆడది . కధ సరిగ్గా గుర్తు లేదు కాని అందులో అమ్మాయి ఎందుకో అయోని ఐపోవాలనుకుంటుంది. కాన్సర్ కాదనుకుంటా. ఏదో ఘోర అత్యాచారం? కధ పేరుని బట్టి చూస్తే సీతతో , రామాయణంతో, శీలంతో ఏవో లింకులు వున్నట్టుంది. ఇండియా ఆడవాళ్ళకు ఈ యోని, మానం, శీలం పిచ్చలు ఎప్పటి నుండి పట్టుకున్నాయో. మగవాడికి లేని ఈ శీలం ఆందోళనలు అవమానాలు ఆడవాళ్ళు తమకే ఎందుకు తగిలించుకున్నారబ్బా? అసలు మానానికి భంగం , శీలానికి సింగినాదం రాకుండా, ముందే ఆడవాళ్ళు – బ్రెస్ట్‌లు, యుటిరస్లు, వెజైనాలు -సర్జన్ల దగ్గరకు పోయి తీసేంచుకుంటే సరి. అప్పుడు శీలం కొడిగట్టకుండా స్త్రీలు పవిత్ర జ్యోతుల్లా వెలిగి పోవచ్చు. ఇలాంటి వ్రాతలు స్త్రీకి తన మీద తనకు జుగుప్స, అధైర్యం కలిగించీ, స్త్రీ బలహినురాలు అని కొంతమంది మగవాళ్ళకు భావన కల్పించీ, ఆమెను లోకువ చెయ్యవా? ఆడ మగ మధ్య అగడ్తలను పెంచి, స్నేహభావం తగ్గించవా? స్త్రీ భద్రతకు హాని జరగదా? ఏమో! కధ వ్రాసిన వారు వాల్మీకి మహర్షిలా కరుణార్ద్ర హృదయులే అయి ఉంటారు. అందులో సందేహం ఎందుకు?
భుజం మీద బరువు పడేసరికి ఉలిక్కి పడి పక్క కి చూసింది డాక్టర్ నిసీ షామల్. భుజం నొక్కుతూ నవ్వాడు సర్జన్ సాయ్ కోహెన్. ” ఏమిటి? డేవిడ్ వ్రాసిన ఈ పేపరు దీక్షగా చూస్తున్నావు. సర్జికల్ రిసల్ట్స్ మంచివి ఒచ్చాయి కదా రేడిఏషన్ కన్నా నిసీ! ” అన్నాడు.
“ఆశ ! కాని నిజంగా నేను మీ కత్తుల లోకం లో లేను. ఎక్కడో వేరే నరకాలలో తిరిగి వస్తున్నా.” అంది నిసి.
“అవును మీ రేడిఏషన్ ఆంకాలజిస్ట్ లు ఉండేదే భూమికి ఎంతో లోతున, పాతాళంలో. నరకానికి గేట్ కీపర్లు మీరు. మీ పెద్ద పెద్ద మంటల కింద పెట్టి మానవులను మాడ్చి చంపుతారు. భస్మం చేస్తారు. నిసీ, నువ్వు స్వయానా ఆ హేడ్స్ కి కాపలా దేవతవు.
” అవును లేవయ్యా! నువ్వు మాత్రం జ్యుపిటర్ వి. స్వర్గానికి నిచ్చెన లేసి అందరినీ నిరాకారులను, నిశ్శరీరులనూ చేసి పైకి పంపించే మార్గాలు వేస్తావు. నేనేమో వాళ్ళను కాళ్ళు పట్టి కిందకు లాగి , ఒంట్లో ఏదో నాలుగు ఆర్గన్లు మిగిల్చి, ఇంటికి పంపే మార్గాలు ఆలోచిస్తాను. బ్రతికి ఉన్న నాలుగు రోజులూ దేవుడిచ్చిన అంగాలు అన్నీ సార్ధకంగా వాడుకుంటే మంచిదికాదూ, ఊడగొట్టుకొనో, ఊరబెట్టుకొనో చచ్చే కన్నా.” అంది నిసి కసిగా.
“అబ్బా! అబ్బా! ఎవరి మీద ఈ కోపం . ఈ దెబ్బలన్నీ నాకే? ఇలా ఐతే నేను తర్వాత ఆపరేషన్ లో అన్నీ తప్పులు చేసేస్తా. ఇంతకీ ఇవ్వాళ నువ్వేం ప్రొసీజర్లు చేస్తున్నావు?”
” ఒక బ్రెస్ట్ ఇంప్లాంట్. ఒక యుటిరైన్ టేండెమ్ – కాల్ఫోస్టాట్ ఇన్సర్షన్.”
“నీట్. నీట్.” ( స్కెడ్యూలు చూస్తూ ) “ఐనా నీకు ఇంకా టైమున్నట్లుంది. నిన్ను వెనక్కి జరిపేశారు. నువ్వు చూసుకుని ఉండవు. నాతో స్క్రబ్ చేసుకో. ఒక లంపెక్టమీ చేస్తున్నా. ఆ తర్వాత స్కార్, సరయిన చోట పెట్టలేదు. రేడిఏషన్ సరిగ్గా ఇవ్వడానికి కష్టమయ్యింది, కాస్మెటిక్ రిసల్ట్ మంచిది రాలేదని నన్ను ట్యూమర్ బోర్డ్‌లో నలుగుర్లోనూ కడిగి ఎండేస్తావు. వచ్చి చూపించ రాదూ, సరిగ్గా బ్రెస్ట్ మీద ఎక్కడ ఇన్సిషన్ చెయ్యమంటావో .”
“మంచిది వెళ్దం పద. ఏవో కల్పితపు కధల గురించి అనవసరపు ఆలోచనలు చేస్తున్నా. పనికొచ్చే పని చేద్దాం పదవోయ్.” అని సర్జన్ నడుం చుట్టూ చేయి చుట్టి చకచకా ఆపరేటింగ్ రూమ్ ల వేపుకు అతనితో పాటు నడిచింది నిసి.
***
సర్జరీ అంత సేపూ ఏవో కబుర్లు చెపుతూనే ఉంటాడు సాయ్ కోహెన్. అతని రెండు చేతులూ పేషెంటు ఎడమ బ్రెస్ట్ లో కణితిని తీసివెయ్యడానికి నిదానంగా, నిపుణంగా, పని చేస్తున్నాయి.
“ఓయ్ నిసీ! నిన్న మా ఆవిడను తీసుకుని నువ్వు చెప్పిన రవిశంకర్ కాన్సర్ట్ కి వెళ్ళాను . ఏమిటోయ్ ఇంత గొప్ప అంత గొప్ప అన్నావ్. టుప్పు టుప్పు మంటూ అప్పుడో స్వరం. అప్పుడో స్వరం . ఏముందోయ్ ఆయన వాయిద్యం లో?”
ఈ లోపల నర్స్ తో “స్పంజ్” అని ఆమె అందించిన గాజ్ తో బ్రెస్ట్ లోపల చిమ్మిన రక్తాన్ని అదిమి పెడుతూ నిసి కళ్ళలోకి చూశాడు. అతని నీలి కనుపాపల నిండా ఆటా , అల్లరీనూ.
నిసి ఉడుక్కుంటూ, మాస్క్ లోంచి కొంచెం లోగొంతులో హాహాకారాలు చేసి, కళ్ళు విశాలం చేసి, మెరుపులు మెరిపిస్తూ, అంది. “ఏం చేస్తాం . ఆయన ఎంత గొప్ప సంగీత విద్వాంసుడైనా మా ఇండియన్ల ఏర్పాట్లు అలా ఉంటాయి. హాలు బాగా లేదు. అకూస్టిక్స్ ఏడ్చినట్ట్లు ఉన్నాయి. లోపలికి వచ్చేవాళ్ళూ, పోయే వాళ్ళూ, కచేరీ జరిగినంత సేపూ. ఆయన సితార్ వాయిద్యం ఏం వినపడుతుంది. ”
“అవునవును. ఎందుకోయ్, మీ వాళ్ళు నిమిషం నోరు ముయ్యరు? ఆ శారీలూ , ఆ గరగరలూ. వేరే వాళ్ళను తోసేసుకుని వెళ్ళి పోడం . ఇంకొకళ్ళ స్పృ హే ఉండదు మీ వాళ్ళకు. ఈ ఇండియన్ ఫంక్షన్స్ కి వెడితే సీట్లు కూడా బాగోవు. ఆ తర్వాత మూడు వారాలు ముడ్డి నెప్పి మిగులుతుంది . ఇది మా సర్జన్లకు కుదరదోయ్. నాకు రవి శంకర్ సితారొద్దు . నేనేదో ఆ బాఖ్ , ఆ బీథొవెన్ తోనే ఉంటాలే ఇక ముందు కూడా. ” అన్నాడు సాయ్ కోహెన్, ఇంకా నిసిని ఏడిపించడానికి.
“మీ జ్యూయిష్ వాళ్ళు ఒకరు చెప్పింది వింటారా! మీకు తోచిందే సరి.” అంది నిసీ షామల్, మాస్క్ వెనకాల మూతి ముడుస్తూ. అసలు సంగతి – డాక్టర్ కోహెన్ మంచి వయొలినిస్ట్. ఆయన అప్పుడప్పుడూ హాస్పిటల్ కి విరాళాలు సేకరించడం లో, పేరు పడ్డ సంగీత కళా కారులతో సమ ఉజ్జీగా వయొలిన్ వాయించి శ్రోతల్ని ఆనంద పరచ గలిగిన సమర్ధుడు అని ఆమెకు తెలుసు.
ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ డాక్టర్ కోహెన్ ‘ lumpectomy ‘ సుతారంగా చేసి, ఆ తీసినదాన్ని మొత్తంగా, పెథాలజీ కి పంపడానికి నర్సు కిచ్చేశాడు. నిసీ షామల్ , తన వేలు పెట్టి చూపిస్త్తూ “ఇదిగో, బ్రెస్ట్ లో ఇక్కడా ఇక్కడా…, ఓ రెండు క్లిప్పులు పడెయ్ సాయ్ . ఆపరేటింగ్ నోట్ డిక్టేట్ చేసేప్పుడు నా పేరు పెడతావా నీ అసిస్టెంట్ గా . నా మాల్ ప్రాక్టిస్ ఇంస్యూరెంస్ ఒక్క రేడిఏషన్ ప్రొసీజర్లకే ఉంది .” అంది.
“ఆ. నిన్ను తప్పకుండా ఇందులో ఇరికించే తీరతా” నన్నాడు డాక్టర్ కోహెన్ నవ్వుతూ. “నువ్వు తరవాత ఈ పేషెంట్ కి ఇరిడియం ఇంప్లాంట్ చేసే రోజు నీకు అసిస్ట్ చేస్తా కావాలంటే . కబురంపు డియర్ ! ”
ఇంతలో ఇంటర్ కం లో “డాక్టర్ నిసి! ఓ.ర్. 7 లో నీ పేషెంట్ రెడీగా ఉంది నీ కోసం ఎదురు చూస్తున్నాం” అన్న మాటలు వినిపించగానే పీట దిగి గౌన్లు విప్పేసి మళ్ళీ స్క్రబ్ చేసుకోడానికి వెళ్ళీ పోయింది నిసి. ఆమె ఆపరేటింగ్ రూమ్ లో చెయ్యాల్సిన ప్రొసీజర్లు అన్నీ అయ్యెసరికి లంచ్ టైం అయ్యింది. కేఫెటేరియాలో ట్యూనా సేండ్విచ్ కొనుక్కుని , ఈ ట్యూనా నేను ఇంకెన్నేళ్ళు తినాలో . ఈ చేపకీ నాకూ రుణం . ఐనా చేపలు తినే గదా నా డియరెస్ట్ ఫిక్షనల్ ఫ్రెండు జీవ్స్, అంత తెలివైన వాడయ్యింది. నా క్కూడా కొంచెం బుర్ర పెరుగుతుందిలే -అనుకుంటూ తన ఆఫీసు కేసి నడిచింది బ్లాక్ బాల్లీ షూ టకటక లాడిస్తూ.
***
ఒంటిగంటకు ఒక బ్రెస్ట్ కాన్సర్ పేషెంట్ ను చూడాలి నిసి షామల్ . తన నర్స్, రెసిడెంట్ దగ్గర్నుంచి పేషేంట్ గురించిన వివరాలు విని , ఆమె ఉన్న గది లోకి వెళ్ళింది.
పేషెంట్ వయసు నలభయ్యిల్లో ఉంది. తెల్లావిడ . అప్పటికే హాస్పిటల్ గౌను వేసుకుని పరీక్ష చేయించుకోడానికి రెడీ గా ఉంది. ఆమెను జబ్బు గురించిన ప్రశ్నలు అడుగుతుంటే చాలా అన్య మనస్కంగా ఉంది. అంటీ ముట్టనట్లు సమాధానాలు ఇస్తూ ఉంది.
ఒక ఐదారు ప్రశ్నలయ్యాక “మీరు చాలా అలిసి పోయినట్లుగా ఉన్నారు. వర్క్ నుంది వస్తున్నారు లాగుంది. ” అంది నిసి.
ఆమె ముఖం ఎర్రబడిపోయింది. అంతలోనే అతి తెల్లగా పాలిపోయింది. “నేనిప్పుడు పని చెయ్యటల్లేదు. ” అంది.
“ఈ కాన్సర్ డయాగ్నోసిస్ వల్ల సెలవు తిసుకున్నారా?”
ఆమె ఏడవటం మొదలు పెట్టింది. నిసికి ఏమీ అర్ధం కాలేదు. రోగి బ్రెస్ట్ కాన్సర్ గురించి ఎలా తన రొమ్ములో గడ్డ ఉన్నట్ట్లు చూసుకుందో, ఎక్స్ రేలు బయాప్సీలు, వీటి గురించి ఏమీ బాధ లేకుందా చెప్పింది. సెలవు సంగతి అడిగితే ఏడుస్తుందేమిటా అని లోలోపల ఆశ్చర్య పోయింది.
ఐనా ఇంకేం అడక్కుండా క్లీనెక్స్ టి్ష్యూ బాక్స్ తెచ్చి ఇచ్చి మౌనంగా ఒకటి తర్వాత ఒకటి తీసి ఇస్తూ ఉంది.
ఆమె “నేను ఈ ఊళ్ళో — కంపెనీ లో మొన్నటి దాకా పెద్ద ఎక్సిక్యూటివ్ ను. ” అంది.
“అవును. నాకు తెలుసు. మిమ్మల్ని గురించి పేపర్ల లో చదివాను నేను .”
” ఐతే, మీరు ఈ వార్తా పేపర్లో చదివే ఉంటారు. ఈ మధ్య కంపెనీ రెవెన్యూస్ బాగా లేవు. షేర్ హోల్డర్లు గోల చేస్తున్నారు. అందుకని వెతికి వెతికి — కంపెనీకి కొత్త సి.యి.ఓ. ని పట్టుకు వచ్చారు. ఈ సి.ఇ. వో., తను చేసే మార్పుల్లో మొదటిదిగా ఒక మూడు వేల మంది ఉద్యోగాలు, అన్ని లెవెల్స్ వాళ్ళకీ తీసి వేశాడు. కొంతమందికి ‘ఫోర్స్ డ్ అర్లీ రెటిర్మెంట్ బెనిఫిట్’ లతో. మీరు నమ్మగలరా? అందులో నేనొక దాన్ని.”
అని చెప్పి ఒళ్ళంతా కదిలి పోయేలాగా ఏడవటం మొదలు పెట్టింది.
“నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా — కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం! ఏమిటా అధికారం? ఒక రోజు మామూలుగా పని లోకి వెళ్ళిన మాకు అకస్మాత్తుగా నోటిసులు. ఎంత అవమానం!”
ఆమె ఎంతో కుమిలి పోతూ ఉంది.
నిసీ షామల్ మధ్య మధ్య “ఓ! మై గాడ్ అలా చేశారా , ఏం బాగా లేదు చేసిన పని ,” అంటూ కొన్ని ఓదార్పు మాటలు అంటూ ఉంది.
పేషెంట్ దుఖావేశం లో ఉంది. ఉక్కిరి బిక్కిరై పోతూ ఉంది. ఆ ఆవేగం తగ్గే చాయలేమీ కనబడ్లేదు ఎంత సేపున్నా.
నిసి “మీరు కొంచెం సేపు ఇలా ఈ బల్ల మీద పడుకోండి. నేను నర్స్ తో మీకు ఒక మందు పంపిస్తాను. నేను 15 -20 నిమిషాల్లో మళ్ళీ వస్తాను” అని చెప్పి బైటకు వచ్చి కాన్ఫరెన్సురూం లో ఉన్న నర్స్ తో చెయ్యవలసిన పని చెప్పి , మధ్యలో ఉన్న బల్ల ముందరి ఓ కుర్చీలో కూర్చుంది.
ఎదురుగా రేడిఏషన్ ఆంకాలజీ కాలీగ్, ఎవరో పేషెంట్ గురించి డిక్టేట్ చేస్తున్నాడు దడా దడా. కళ్ళు ఎగరేశాడు నవ్వుతూ. “ఏమిటీ , రేడిఏషన్ కన్నా ముందు సెడేషన్ మొదలు పెట్టావు? ” అన్నాడు.
జాన్! మనకు పేషెంటును చూస్తానికి ఓ గంట టైముందనుకో, వాళ్ళు పట్టుకొచ్చిన పరీక్షలే చూడాలా, వాళ్ళని మనం పరీక్షలే చెయ్యాలా , రెసిడెంట్లకు పాఠాలే చెప్పాలా , పేషెంట్ల వేరే ఇబ్బందులు కూడా వినాలా. ఇన్నిటికి మనకు టైం ఎక్కడ ఉంది చెప్పు?” అంది.
“మరే, మళ్ళీ మన మీద ఎడ్మినిస్ట్రేషన్ , చైర్మన్, మెడికల్ డిరెక్టర్, హాస్పిటల్ ప్రెసిడెంటు, మెడికల్ కాలేజీ డీన్ -ఎంతమంది అదుపు, నిఘా. మనం తక్కువ పేషెంట్లను చూస్తే అది కుదరదు అని స్కెడ్యూలింగ్, మీద చర్చలకు మనల్ని గంటలు గంటలు మీటింగుల్లో కూర్చో బెడతారు. ఎం. బి. ఏ లను తీసుకొచ్చి మన డాక్టర్ల నెత్తి నెక్కిస్తారు, పెత్తనం చెయ్యమని. ఈ డాక్టర్ పని ఒదిలేసి నేను పోయి ఎక్సిక్యూటివ్ ఎం. బి. ఏ ప్రోగ్రాం లో చేరదామనుకుంటున్నా.” అన్నాడు జాన్.
“ఆహా! అలాంటి ఎక్సికూటివ్ అదిగో అక్కడ గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది ఉద్యోగం ఊడపీకితే. కాన్ఫిడెన్షియల్ ! మనలో మన మాట సుమా! ” అంది నిసి.
“ఓ ! నో యూస్ దెన్! ఐతే పోయి నే మళ్ళీ టీచర్నయి పోతా. సమ్మరంతా సెలవే.” అనేసి గడ గడా మళ్ళీ డిక్టేట్ చేసుకోడం మొదలెట్టాడు జాన్.
నిసీ కూర్చుని ఆలోచించుకుంది. ఈ పేషెంట్ గానీ బ్రెస్ట్ కాన్సర్ డయాగ్నోసిస్ బాధ తట్టుకోలేక ఉద్యోగం ఊడిన బాధ మీదికి మనసు మళ్ళించిందా. నిజంగానే జాబ్ పోయిన బాధ అంత ఎక్కువగా ఉందా. ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళకు కూడా, మామూలుగా మగవాళ్ళకు వాళ్ళు చేసే ఉద్యోగం నుంచి వచ్చే అతిశయాలూ, పరువు ప్రతిష్ట గట్రా, -ఈగో ప్రోబ్లెంస్- అన్నీ లేక పోయినా ఎన్నో కొన్ని ఉన్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం ఊడితే వచ్చే బాధ అంత తొందరగా తగ్గేది కాదు. తగ్గినా ఉండీ ఉడిగీ సెలవేస్తుంటుంది కూడా.
తన వద్దకు వచ్చే రోగులు చాలామంది కాన్సర్ గురించిన భయంతో వణికి పోతుంటారు. వారికి చాలా ధైర్యం, చాలా ఉపశమన వాక్యాలు చెప్పాల్సి ఉంటుంది. ఈమెకు ఒకేసారి వచ్చిన రెండు పెద్ద కస్టాలలో ఒక దాని బాధ ఉధృతంగా ఉన్నట్లుంది. ఏ బాధ నుండి శాంతి చేకూరిస్తే ఏం. ఈమెను ఈ రెండు కస్టాల నుండీ కోలుకోనీ దైవమా! – అనుకుంది.
లోపలికి పోయి రోగితో మాటలు మొదలెట్టింది నిసీ షామల్. ” నాకూ మీకు ఇప్పుడు జరిగిన లాటి అనుభవాలు కొన్ని జరిగాయి ఉద్యోగంలో. ఇంతకు ముందు ఒక పెద్ద డిపార్ట్ మెంట్ కి చీఫ్ గా ఉండేదాన్ని. తీసి పారేశారు. మాట మాత్రం చెప్ప లేదు. కారణం అసలే లేదు. హాస్పిటల్ కి స్వయంగా బోలెడు డబ్బు సంపాదించి పెట్టా కూడా”. అంది .
ఆమె ఆశ్చర్యంగా “నిజంగా! , ఎందుకనబ్బా” అంది.
నిసి కొన్ని వివరాలు చెప్పింది. సొంత బాధ చెప్పటం అంత తేలికైన పని కాదు. అందులోనూ ఎప్పుడూ వేరే వాళ్ళ కస్టాలు వినడం అలవాటు ఐపోయిన వాళ్ళకి.
అయినా తన సంగతులు కొన్ని చెపుతూ, మధ్య మధ్య లో మాట మారుస్తూ నిసీ షామల్ “మనం ఎవ్వరం ఉద్యోగంతో మన సెల్ఫ్ వర్త్ ని, ఆత్మాభిమానాన్ని అంతలా ముడి పెట్టుకో కూడదు. మనందరికీ బ్రతకడానికి డబ్బూ, ఉద్యోగం ఆధారం అవసరమే అనుకోండి. కాని టైటిల్స్, హోదాలూ మీద భ్రమ పెట్టుకుని అవి ఉంటే ఆనందం , పోతే విచారం – ఐన మన లాటి మనుషులకు కష్టమే. మన ఆర్ధిక భద్రత కన్నా మించి , పరువూ ప్రతిష్ఠల తగలాటం , వేరే వాళ్ళు నవ్విపోతారన్న నామోషీ మనిషుల్లో ఎక్కువగా ఉండొచ్చా!
జపాన్ లో ఎంతో మంది ఉద్యోగం పోయిందన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంచడానికి సాయంత్రం వరకూ లైబ్రరీలలో, పార్కు లో అక్కడా ఇక్కడ కూర్చుని సాయంత్రం ఇంటికి వచ్చేవారట. ఈ నలుగురూ నవ్వుతారన్న భయం, నామోషీ ఎంత వ్యర్ధమైన ఆలోచనలు! ఇవి ఊరికే మనిషిని దిగలాగుతాయి. బలహీన పరుస్తాయి. చాలా మంచి ఆర్టికల్స్ వచ్చాయి ఈ విషయాల మీద. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే కలిగే మనోవేదన, ఇతర ఇబ్బందుల గురించి చక్కగా వ్రాశారు. మీకు ఆర్టికల్స్ ఇస్తాను లెండి.
నిజానికి అవి మీకెందుకు. మీరు తలుచుకుంటే మీరే సొంత కంపెనీ పెట్టుకోగలరు. మీకంత శక్తి ఉంది. ఇదిగో ఈ ట్రీట్మెంట్ ఆరు వారాలు రెస్ట్ తీసుకుంటున్నాను అని అనుకోండి. సెలవు లో ఉన్నారనే అనుకోండి. నేనూ మీరూ మధ్య మధ్య కబుర్లు చెప్పుకుందాం. మన కిష్టమైన సంగీతం పుస్తకాలూ గురించి మాట్లాడుకుందాం. మీ వైద్యం నా చేతుల్లో వదిలి పెట్టండి. ఒక్కసారి ఓపిగ్గా మీ వైద్యం గురించి నే చెప్పేది విని నాకు మీ పర్మిషన్ ఇస్తే చాలు. ”
పేషెంట్, అప్పుడు చాలా నిదానంగా వైద్యం గురించిన వివరాలన్నీ విని, సంతకం చేసింది.
ఆ తర్వాత ఆరు వారాల వైద్యం లో, నిసి షామల్, ఆమెను కలిసినప్పుడల్లా అంతకు ముందు తను చేసిన హాస్పిటల్ ఉద్యోగాల గురించి, తన పరాభవాల ఘన మర్యాదల గురించీ, నవ్వుతూ నవ్వుతూ, ఆమెకు చాలా ముచ్చట్లు చెప్పింది. అంతకు మించి అమెరికా నవలాకారులు, కధా రచయితలు, గురించి ఎంతో ఆసక్తిగా ఆమెతో కబుర్లు చెప్పేది. రోగీ, డాక్టరూ, ఇద్దరూ భారతీయ, అమెరికన్ సంగీతాల గురించి ఒకరి అభిరుచులు మరొకరికి ఇచ్చి పుచ్చుకున్నారు.
వైద్యం ముగిసే లోపల ఆమె, ఆ ఎర్లీ రిటైర్మెంట్ ఎక్సిక్యుటివ్ ఒక్క నాడు కూడా తనకు జరుగుతున్న వైద్యం గురించి , తన కాన్సర్ గురించి మాట్లాడలేదు.
మూడు నెల్ల తర్వాత ఆమె మొదటి ఫాలో అప్ పరీక్ష కు వచ్చినప్పుడు , ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకు విశ్రాంతి , దానిలో ఉన్న సుఖం తెలుస్తున్నట్లుంది. . గడియారమూ, స్కెడ్యూలూ లేకుండా రోజు గడపటం కొంచెం అలవాటవుతూ ఉన్నట్లుంది.
“నెమ్మదిగా నా సొంత కన్సల్టింగ్ పెట్టుకుంటాను. తప్పకుండా నాకు సరిపడా పని దొరుకుతుంది. డబ్బుకు సంబంధించిన బాధలు లేవు. హెల్త్ కేర్ అంతా ఉంది. ఇల్లు ఉంది. ఉద్యోగంతో పాటు వచ్చే స్నేహితులు ఉండరు. తెలిసింది. ఉద్యోగం పోగానే ఒక్కళ్ళూ మాట్లాడరు. ముఖం చాటు చేస్తారు. అంతెందుకు! కుటుంబం లోనే తేడా చూస్తున్నా. ” అంది.
“స్వాగతం! ఇది నాకు బాగా తెలిసిన వ్యవహారమే! చాలా మందికి జరిగే సత్కారమే! కాని అందులో ఎవరి తప్పూఉండదు కొన్నిసార్లు ” అంది డాక్టర్ షామల్ . ” ఏమీ భయం లేదు. ప్రపంచంలో మనుషులకు కరువా? చెప్పండి. మీకు మళ్ళీ కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీ పాత స్నేహితులతో కూడా మీరు చక్కగా పిలిచి మాట్లాడండి. వాళ్ళూ ఎక్కడకీ పోరు.”
” అవును. నిజమే. ఎందుకీ బేల మాటలు. వాళ్ళేం చేశారు. ఎవరి ఉద్యోగం పోయినా చెయ్యవలసింది వెంటనే ఇంకో దానికోసం వెతుక్కోటం. పోయిందాని కోసం ఏడవటం తెలివి తక్కువ. వేరే వాళ్ళని నిందించడం అనవసరం . నిజమే! ” అందామె.
మీ బ్రెస్ట్ కాన్సర్ నయమైనట్లే. నా ఉద్దేశం లో. చక్కని కాస్మెటిక్ రిసల్ట్ కూడా. ఇంక కొన్నాళ్ళ లో చర్మం మీద ఈ కొంచం నల్లని మాసికలు కూదా ఉండవు. మీరు ఈతకు వెళ్ళినా, ఈవెనింగ్ డ్రెస్సులు వేసుకున్నా స్కార్ కూడ కనపడదు. కొన్నాళ్ళకు మీకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చి వెళ్ళిన గుర్తులే ఉండవు. చాలా బాగా హేండిల్ చేశారు. ఇంత కూడా భయపడలేదు వ్యాధి అన్నా, ట్రీట్మెంట్ అన్నా మీరు. ” అంది డాక్టర్ షామల్.
“నిజంగా” అందామె. “అసలేం గుర్తు లేదు. అంతా కల లాగా ఉంది.”
“అలాగే ఉండనీండి. అంతే నేమో. మీరు అవసరమైన రియాలిటీ నుండి అంత దూరంగా లేరు లెండి. ఏం ఒక్క రోజు తప్పకుండా వైద్యం పూర్తి చేశారు. మీ జబ్బు నయం చేయించుకున్నారు. మళ్ళీ ఈ రోజు పరీక్ష కీ వచ్చారు. ఇకనుండీ క్రమం తప్పకుండా చెక్ అప్ లకు వస్తారు కూడా. ” అంది నవ్వుతూ నిసి షామల్.
ఆమె సంతోషంతో నిసితో కరచాలనం చేసి, బిగి కౌగిలిచ్చి వెళ్ళి పోయింది.
నిసి, ఆమె బ్రెస్ట్ కాన్సర్ నేను నయం చేశానా , మనో వ్యాధి నయం చేశానా, లేక పోతే నాలో ఉన్న ఉద్యోగాల బాధను – నా సొంత రాచపుండును నేను నివారించుకున్నానా అనుకుంది. ఆలోచిస్తూ కారిడార్‌లో నడుస్తూ ఉంటే డాక్టర్. సాయ్ కోహెన్ ఎదురు వచ్చాడు. మెయిల్ చూసుకున్నావా మెడికల్ డిరెక్టర్ నించి -అని అడిగాడు.
అయ్యో! మళ్ళీ నా ఉద్యోగానికి తిప్పలు వచ్చాయా! అనుకుంది నిసి. అదే పైకీ అనేసింది.
“లేదులే! నిన్ను ఉద్యోగం నుండి తీసివేయడానికి ఎన్ని గుండెలు! ” అని నవ్వాడు. ” నీకూ నాకూ ఇద్దరికీ ఒకే ఉత్తరం వచ్చింది. ఉద్యోగం పోయిన మన ఎక్సిక్యు టివ్ పేషెంట్ మనిద్దరి గౌరవార్ధం హాస్పిటల్ కు చాలా పెద్ద డొనేషన్ ఇచ్చింది. ఆ విషయం ఆమెకు వైద్యం చేసిన మనిద్దరికీ తెలియ చెయ్యటానికి మనకు ఉత్తరం రాసారు. క్రితం వారం ఆమెను చూసినప్పుడు నాతో ఒక్క మాట అన్లేదు హాస్పిటల్ కు డబ్బు ఇస్తున్నట్లు. నా క్లినిక్ లో ఉన్నంత సేపూ నువ్వెంత బాగా చూశావో చెప్పింది. నా ఎక్సెలెంట్ సర్జెరీ గురించి విందామన్నా , ఒక్క సారి పొగడదే!
సరే గాని నిసీ, ఈ పేషెంటు నాకు రవిశంకర్ సితార్ సి. డి లిచ్చిందేంటొయ్ . ఖర్మ . నన్ను కార్లోనూ , ఓ.ఆర్ లోనూ పెట్టుకుని వినమంది. ఎందుకో? మేమంతా నిద్దర పోడానికా. ఈ సారి నీకు ఇంకో పేషెంటును పంపేది లేదు ” అని అనేసి, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ కోహెన్.