తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే…

తెలుగు అంతర్జాతీయ భాష అవడం గురించి మనకి గత కొన్ని సంవత్సరాలుగా తరుచూ వినిపిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం, అందులో ఉపన్యాసాలు తీర్మానాలు ఆ సభల ఫొటోలు పత్రికల్లో ప్రకటించబడటం మనం చూస్తున్నాం. తెలుగు మీద ఆత్మీయమైన అభిమానం వున్న రాజకీయవేత్తలు, న్యాయాధిపతులు, అక్షరాలా రాజకీయవేత్తలు కాకపోయినా వారితో అనుబంధం వున్న అనేకమంది సాహిత్యవేత్తలు, సాహిత్య అభిమానులు, వీళ్ళకి పొడిగింపుగా కవులు, రచయితలు, కేవలం సభా ప్రాంగణాన్ని నింపే భాషాభిమానులు మనకి కొల్లలకొద్దీ వున్నారు.

తెలుగువాళ్ళు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లోనూ వున్నారు. అందులోను ఇంగ్లీషు దేశభాషగా వున్న అమెరికా లోను, ఇంగ్లాండు లోను చాలా ఎక్కువమంది వున్నారు. కెనడా లోను, ఆస్ట్రేలియా లోను అంత ఎక్కువమంది కాకపోయినా తగినంతమంది వున్నారు. ఆఫ్రికా దేశాల్లోనూ, చైనా, జపాన్, స్కాండినేవియన్ దేశాల్లోనూ అంత ఎక్కువమంది లేకపోయినా, మొత్తం మీద చెప్పాలంటే తెలుగువాళ్ళు ప్రపంచమంతటా వున్నారు. అంచేత ప్రపంచంలో చాలా చోట్ల మాట్లాడబడుతున్న భాష కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!

అమెరికాలో తానాలు, ఆటాలు, ఇలా రకరకాల ‘టా’లతో వున్న సంస్థలన్నీ తెలుగు భాషకి అపారమైన సేవ చేస్తున్నాయి. ఇది కాక అమెరికా లోనే స్థానికంగా డెట్రాయిట్ లోను, న్యూజర్సీ లోను, డాలస్ లోను తెలుగు సాహిత్యం పట్ల చెప్పుకోదగ్గ ఆసక్తి ఉన్నవాళ్ళు దాదాపుగా ప్రతి నెలా సమావేశమై సాహిత్య చర్చలు, పుస్తక విమర్శలు ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ ఔత్సాహికులు ప్రచురణ రంగంలో కూడా తమ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డెట్రాయిట్ లోని డి.టి.ఎల్.సి. (D.T.L.C.) వారు ప్రచురించే పుస్తకాలు, చిట్టెన్ రాజుగారు వంగూరి ఫౌండేషన్ తరపున ప్రచురించే తెలుగు పుస్తకాలు, తానా ఫౌండేషన్ ప్రచురించే తెలుగు పుస్తకాలు సంఖ్యా పరంగా తక్కువేమీ కావు.

దీనికి తోడు అమెరికాలో తెలుగు కుటుంబాల చిన్న పిల్లలకి పాటలు, పద్యాలు, ఆటలు, నాటకాలు నేర్పే ప్రయత్నం విస్తృతంగా జరుగుతోంది. కొన్ని వందలమంది, బహుశా వేలమంది తెలుగు పిల్లలు ఇలా తెలుగు నేర్చుకుంటున్నారని పత్రికల నిండా బొమ్మలతో సహా మనకి వార్తలు కనిపిస్తున్నాయి.

ఇది ఒక రకమైన అంతర్జాతీయత. ఈ అంతర్జాతీయతకి కారణం తెలుగు భాష తెలుగు దేశంలో వుండగానే నేర్చేసుకుని, ఆ భాష ఒక్కటే నిజంగా బాగా వచ్చి, ఉద్యోగ రీత్యానో వ్యాపారం కోసమో అవసరమైనంత ఇంగ్లీషు నేర్చుకుని, ఇంగ్లీషు మాతృభాష అయిన దేశాలకి తెలుగు వాళ్ళు వెళ్ళడం. ఇలా వెళ్ళిన వాళ్ళు అమెరికా లోనూ ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియాల లోనూ వున్నా వాళ్ళు సాంస్కృతికంగా తెలుగువాళ్ళే. వీళ్ళలో కొంతమందికి కవులుగా, రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, సంగీతజ్ఞులుగా పేరు తెచ్చుకోవాలనే కోరిక వుంది. ఇవాళ అమెరికా లోను, ఇంగ్లాండు లోను జరిగే తెలుగు సాహిత్య సమావేశాలన్నీ వీళ్ళకి కావలిసిన సదుపాయాలిచ్చాయి. అవసరమైన తెలుగు వాతావరణాన్ని కూడా ఇచ్చాయి. ఆశ్చర్యకరంగా వీళ్ళల్లో కొంతమంది నిజంగా మంచి కవులు, మంచి సంపాదకులు, మంచి సాహిత్యజ్ఞులు కూడా అయ్యారు.

కాని, ఈ సాహిత్య సమావేశాలు డెట్రాయిట్‌లో జరిగినా, న్యూయార్క్‌లో జరిగినా, వాషింగ్టన్‌లో జరిగినా, అట్లాంటాలో జరిగినా, ఇంకే ఊరిలో జరిగినా కూడా విజయవాడలో జరిగినట్లే ఉంటాయి. లేదా హైదరాబాదులో జరిగినట్లు ఉంటాయి. తమ చుట్టూ వున్న ఇంగ్లీషు ప్రపంచం మీద ఇవి ఏ రకమైన ప్రభావాన్నీ కలిగించవు. ఆ ప్రపంచ ప్రభావం కూడా వీటి మీద ఏమీ వుండదు. తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు, తెలుగు భోజనాలు, కూరలో కరివేపాకు లాగా కాస్త సాహిత్యము, ఇవే తెలుగు తనమైతే ఇవి ఈ సమావేశాల్లో పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాక ఇంకా ముందుకు వెళితే తెలుగుదేశంలో వున్న రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు, వాటి అనుయాయ నాయకులు ఈ సమావేశాల వల్ల మరి కొంచెం బలపడతారు. వ్యాపారమూ, వ్యాపారానికి కావలిసిన రాజకీయ ప్రాబల్యమూ పుంజుకుంటాయి.

పైకి కనిపించే స్పష్టమైన విషయమేమిటంటే ఇక్కడ తెలుగు కుటుంబాలలో తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు, వాళ్ళ పిల్లలు అమెరికా వాళ్ళు. తల్లిదండ్రుల ఆసక్తి కొద్దీ వాళ్ళ తాతల, అమ్మమ్మల ముచ్చట కొద్దీ ఇక్కడి పిల్లలు నాలుగు తెలుగు మాటలు మాట్లాడొచ్చు. అంతకు మించి తెలుగు పాటలు పాడొచ్చు. కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కొంత సమర్ధంగానే నేర్చుకోవచ్చు కూడా. కాని, ఈ విద్యలు వీళ్ళ ప్రపంచంలో సాంస్కృతిక వాతావరణాన్ని మారుస్తాయా?

ఇప్పుడు అమెరికాలో యూరోప్ నుంచి వచ్చి స్థిరపడిన జర్మనీ, ఇటలీ, ఐర్లండ్, స్పెయిన్ మొదలైన దేశాల వాళ్ళు చాలామంది వున్నారు. వాళ్ళు చాలా తరాలుగా అమెరికాలో వుండి అమెరికన్లు అయిపోయారు. వాళ్ళలో ఎవరికీ వాళ్ళ పూర్వభాషలు రావు. కాని వాళ్ళు తాము తమ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు. అందులో చాలామంది భిన్న వారసత్వాలున్న వారితో అంతర్వివాహాలు చేసుకుని, ‘నేను కొంత జెర్మన్‌ని, కొంత స్విస్‌ని, కొంత స్కాండినేవియన్‌ని’ – అంటూ వారి సంకీర్ణ వారసత్వాన్ని చెప్పుకుంటారు కూడా.

ఈ దేశంలో మతం కారణంగా తమ ప్రత్యేకతని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ముఖ్యంగా యూదులు. వాళ్ళు కూడా అందరూ హీబ్రూ భాష మాట్లాడరు. వాళ్ళు సాంస్కృతికంగా కొంచెం అమెరికన్లు, కొంచెం యూదులూను.

ఇదంతా ఎందుకు రాస్తున్నామంటే, ఎవరూ అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలకి వొచ్చిన తరవాత వాళ్ళ పూర్వ సాంస్కృతికతని ఉన్నది ఉన్నట్టుగా నిలబెట్టుకోలేదు అని చెప్పడానికి. కాని అందులో కొందరు – ఉదాహరణకి, యూదులూ జెర్మన్‌లూ ఫ్రెంచ్ వాళ్ళూ, తమ భాషలనీ సాహిత్యాలనీ అమెరికా లోని యూనివర్సిటీలలో ప్రవేశపెట్టి నిలబెట్టడం మూలంగా వాళ్ళ సంస్కృతికి ఒక అంతర్జాతీయ స్థితి సంపాదించగలిగారు. ఈ అంతర్జాతీయత ఎలాంటిది — అది తెలుగుకి వొస్తుందా అన్నది ప్రశ్న.

ముందు ఒక భాష అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది అనే ప్రశ్న మరొకసారి వేసుకుని చూద్దాం. ఒక భాషలో వున్న విజ్ఞానం ప్రపంచం విజ్ఞానంలో భాగం అయి, ప్రపంచంలో విజ్ఞానులు దానిని గుర్తించవలసిన అవసరం కలిగితే, అప్పుడు అది ప్రపంచ భాష అవుతుంది. ఆ రకంగా ప్రపంచ భాషలయినవి గ్రీకు, రోమన్, లాటిన్, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, …ఇలాంటి భాషలు. తను పుట్టి పెరిగింది ఏ భాషలోనైనా సరే ఈ భాషల్లో వున్న విజ్ఞానం తన భాష లోకి అనువదించుకుని చదివి తీరాలి. సాధ్యమైతే ఆ భాషలు నేర్చుకుని, ఆ పుస్తకాలు మూలంలో చదివి ఆ విజ్ఞానం మీద పట్టు సంపాదించాలి. గ్రీకు భాష రాకుండా లేదా ఆ భాషలో నుంచి అనువదించబడిన పుస్తకాలు చదవకుండా సాహిత్య శాస్త్రంలో, రాజకీయ శాస్త్రంలో, నీతి శాస్త్రంలో చెప్పుకోదగ్గ పాండిత్యాన్ని ఎవరూ పొందలేరు. ప్లేటోని, అరిస్టోటిల్‌ని, పైథాగరస్‌ని చదవని, వాళ్ళ గురించి వినని, విజ్ఞానులు వుండడానికి వీల్లేదు.

ఈ విజ్ఞాన ప్రపంచం లోకి సంస్కృతం ప్రవేశించింది. సంస్కృతంలో వున్న శాస్త్ర విషయాలు చదవకుండా తప్పించుకోవడానికి ఇప్పుడు వీల్లేదు. సంస్కృతం యూరోప్‌లో ప్రవేశించిన నాటి నుంచి, అంటే పందొమ్మిదవ శతాబ్దపు తొలిరోజుల నుంచి, ప్రపంచ జ్ఞానం ఎంత పెద్దదయిందో కొంచెం చూచాయగా చూసినా తెలుస్తుంది. ప్రపంచం లోని భాషావేత్తలకి పాణిని కొత్తవాడు కాదు. అభినవగుప్తుడు, అశ్వఘోషుడు అపరిచితమైన పేర్లు కావు. ఈ రకంగా చూస్తే సంస్కృతం ప్రపంచభాష. భారతదేశంలో సంస్కృతం అంతరించి పోయినా కూడా ప్రపంచ విజ్ఞానంలో ఇమిడిపోయిన భాషగా అది ప్రపంచంలో బతుకుతుంది. సంస్కృత విజ్ఞానవేత్తలు రాసిన పుస్తకాలు ఇంగ్లీషు లోను, జర్మన్‌ లోను, ఫ్రెంచ్‌ లోను, ఇంకొంచెం ముందుకి వెళితే ఇటాలియన్‌ లోను క్రమక్రమంగా పెరుగుతాయి. ప్రపంచం లోని ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో సంస్కృతం నేర్పబడుతోంది. దానిలో పరిశోధనలు జరుగుతున్నాయి. మీరు నేర్చుకున్న సంసృతం సరైనది కాదని, ఆ పుస్తకాల అర్థం మీకు సరిగా బోధ పడలేదనీ భారతదేశ సాంప్రదాయిక పండితులు విమర్శించడం, అప్పటినుంచీ రకరకాల విజ్ఞానులు వివాదాలు పడడం, వాదోపవాదాలు చేసుకోవడం ఈ విజ్ఞానానికి బలమే కాని లోపం కాదు. సంస్కృతం మూలంగా గ్రహించిన విజ్ఞానం ప్రపంచంలో స్థిరంగా వుంటుంది.

ఇలాంటి విజ్ఞానం తెలుగులో వుందా? తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమా? అలా పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే ఇదిగో నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, ఆ మాట విని వాళ్ళు తెలుగు నేర్చుకున్న రోజున, లేదా తెలుగు పుస్తకాల అనువాదాలు వాళ్ళు చదివిన రోజున, చదివి అందువల్ల వాళ్ళు గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — అప్పుడు తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

తెలుగు ఇలాంటి ప్రపంచ భాష కావాలంటే తెలుగు వాళ్ళు పది మంది తెలుగు వాళ్ళ మధ్య కూర్చుని తెలుగు చాలా అందమైన భాష అని, చాలా మృదువైన భాష అని, చాల తియ్యని భాష అని సరదాగా పొగుడుకుంటే చాలదు. అమెరికాలో ఇవాళ ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘాలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టి సమావేశమై, సరదాగా కబుర్లు చెప్పుకుని, తెలుగు భోజనాలు చేసి, ఇంటికెళ్ళి తమ ఉద్యోగాల్లో పడిపోతే తెలుగు ప్రపంచ భాష అవదు.

ఈ సందర్భంలో తెలుగు దేశంలో తెలుగు స్థితి ఎలా వుంది అన్నది ముందు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణా లోనూ వున్న అనేక విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు ఏంచేస్తున్నాయి? విశ్వవిద్యాలయాలకి బయట వున్న అనేకమంది తెలుగు పండితులు ఏంచేస్తున్నారు? తెలుగులో ప్రపంచం గుర్తించదగిన పుస్తకాలు ఉన్నాయా? ఆ పుస్తకాలలో వున్న జ్ఞ్ఞానం ప్రపంచం గుర్తించదగినదైతే అది ఇప్పుడు ప్రపంచంలో ప్రచారంలో వున్న భాషల్లోకి అనువాదం కావాలి. అలా అనువదించదగ్గ పుస్తకాలు తెలుగులో ఎన్ని వున్నాయి? వాటి గురించి మన తెలుగు దేశపు మేధావులు చేస్తున్న ఆలోచనలు ఏమిటి?

ఆ ‘మనం’లో కూడా తెలుగు సాహిత్యాన్ని గురించి ఒక ఉమ్మడి అభిప్రాయం లేదు. ఒక దృక్పథంలో మహాభారతం నుంచి గురజాడ అప్పారావు వరకు వున్న సాహిత్యమంతా పండితులకి కూడా కొరకడానికి వీల్లేని, ప్రజా జీవితంతో సంబంధం లేని ఒక అయోమయపు ముద్ద*. ఆ సాహిత్యమంతా ఎవరూ చదవక్కర్లేదు. గురజాడ అప్పారావే తెలుగు సాహిత్యానికి ప్రజా జీవితంతో సంబంధం కలిపి ప్రాణం పోశాడు. కట్టమంచి రామలింగారెడ్డి కాలం నుంచి ప్రబంధ సాహిత్యంలో రాజుల సంతోషం కోసం కవులు వర్ణించిన శృంగారం తప్ప మరేమీ లేదనే అభిప్రాయం కొంతమంది సాహిత్య విజ్ఞానుల్లో బలంగా యేర్పడిపోయింది, ఈ దృష్ట్యా. మరొక దృక్పథం దృష్ట్యా మన సాహిత్యంలో నన్నయ దగ్గర్నుంచి మొన్నటి వరకూ వున్న సాంప్రదాయిక సాహిత్యం చాలా గొప్పది. ఎందుకో సరిగ్గా చెప్పలేకపోయినా ఆ సంగతి మన సాహిత్య విమర్శ గ్రంథాలలో పొగడ్తలుగా బోలెడు పెద్ద పెద్ద మాటల్లో కనిపిస్తుంది. సి. ఆర్. రెడ్డిగారు మొదలు పెట్టిన సాహిత్య భావాలకి, పండితులు రాసిన సాంప్రదాయిక సాహిత్య విమర్శలకి కేవలం ఒక్కచోటే సంబంధముంది: మన పాత పుస్తకాలలో శృంగారం అశ్లీలం అవునా? కాదా? అని. ఇక, శ్రీనాథుడు ఏ పుస్తకం ఎప్పుడు రాశాడు, క్రీడాభిరామం శ్రీనాథుడు రాసిందా కాదా, పల్నాటి చరిత్రని శ్రీనాథుడు నిజంగా రాశాడా లేదా — వంటి కాలకర్తృత్వ సమస్యలు చర్చించడం తోటే మన సాహిత్య విమర్శ నిండిపోయి వుంటుంది. తరవాతి కాలంలో, ఒక తేలికపాటి నేలబారు మార్క్సిస్టు సాహిత్య విమర్శ మనలో చాలా మందికి నచ్చి, దాన్ని అన్ని పుస్తకాలకి పట్టించి, ఆ పుస్తకాల విలువని చర్చించే పద్ధతి ఒకటి మనకు అలవాటయ్యింది. ఇంకొంచెం పక్కకు వెళ్ళి చూస్తే విశ్వనాథ సత్యనారాయణగారి అనూయాయులు ఆయన్ని నన్నయ్య అంత గొప్పవాడు అని కీర్తించడం కనిపిస్తుంది.

*[“పందొమ్మిదో శతాబ్దం చివర్లో, అంతకు ముందరి తీరు తెన్నుల్ని పూర్తిగా వొదిలిపెట్టి రాసిన మహా కావ్యం, కన్యాశుల్కం; కొత్త భాషా సాహిత్యాలకు వొరవడి అయిన ఆదికావ్యం.

పుక్కిటి పురాణ గాధల యితివృత్తాలు, పండితులకే కొరకరాని కొయ్యగా వున్న భాషా శైలి, ఉచితానుచితాల్ని పట్టించుకోని సంవిధానం, అవాస్తవాలూ, అహేతుకాలు యధార్ధ జీవితానికి పొసగనివి; కాబట్టి వాటిని పూర్తిగా వదిలిపెట్టి, యథార్ధ జీవిత యితివృత్తంతోనూ, సహజం, సులభం అయిన వాడుక భాషతోనూ, ప్రగతి చింతనతోనూ– విలువైన సాహిత్య ప్రమాణాల్ని జతచేసి రాసిన కన్యాశుల్కం, కొత్త భాషాసాహిత్యాలకు నాంది అయ్యింది. ఆ విధంగా అది ఆధునిక యుగానికి ఆదికావ్యమయ్యింది.(sic)” — కన్యాశుల్కం: ఒక అపూర్వ సృష్టి (మలిపలుకు నుండి.) శెట్టి ఈశ్వరరావు, విశాలాంధ్ర ప్రచురణ.]

తెలుగు విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు పిహెచ్‌డి.ల పేరుతో గత యాభై యేళ్ళుగా తయారు చేయిస్తున్న సిద్ధాంత వ్యాసాలలో ఏ రకమైన విజ్ఞానం కనిపిస్తుందో చెప్పడానికి పట్టుమని పది వాక్యాలు కూడా అక్కర్లేదు. పిహెచ్‌.డి. అనే బిరుదు, ‘డా.’ అనే గౌరవనామం మనకి ఎంత సునాయాసంగా అలవాటయాయో మీరు ఏ రోజు పత్రికలు చూసినా తెలుస్తుంది. కవులు కూడా ఒక వేళ వాళ్ళకి పిహెచ్‌.డి. వుంటే ‘డా.’ ముందు పెట్టుకోకుండా కవిత్వం రాయరు. ఇంతా చేస్తే మనం తయారు చేసిన విజ్ఞానం బయటి దేశాలవాళ్ళు తెలుగు సాహిత్యాన్ని గురించి తెలుసుకోడానికి పనికొస్తుందా?

‘తెలుగు సాహిత్యం మనం చదవకపోతే మన విజ్ఞానానికి ఫలానా రకంగా నష్టం వస్తుంది’ అనే అభిప్రాయం కలిగించడానికి మన తెలుగు శాఖలు ఇంతవరకు ఏమీ చెయ్యలేదు. ఈ పరిస్థితుల్లో తెలుగు సాహిత్యం అంతర్జాతీయ రంగంలో ప్రవేశించాలంటే ఏ దారీ కనిపించదు.

తెలుగు రాష్ట్రాలలో వున్న తెలుగు శాఖలు దాదాపుగా నిర్జీవంగా వున్నాయి. వీళ్ళు చెప్తున్న పాఠాలు, ఇస్తున్న పిహెచ్‌.డి. డిగ్రీలు ఎవరికీ ఏ రకంగాను పనికిరాని స్థితిలో వున్నాయి. కష్టంగా తోచవచ్చు కానీ తెలుగు శాఖలకి అంతర్జాతీయ ప్రమాణాలలో పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం రాయించగలగడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. పైగా గత 50ఏళ్ళలో ఈ శాఖలు చేసిన పని స్థూలంగానైనా అంచనా వేయాలని, దాన్ని బిరుదులు, డిగ్రీలు, ఉద్యోగాలు ప్రధానంగా కాకుండా విజ్ఞానాన్ని ఎంత ముందుకు తీసుకుని వెళ్ళాయి అని చూడాలని, ఎవరూ ఆలోచించడం లేదు.

విశ్వవిద్యాలయాలు అన్న పేరుతో మనం యేర్పరుచుకున్న సంస్థల ఆకారం పాశ్చాత్య దేశాల నుంచి అరువు తెచ్చుకున్నది. లాంఛనాల దృష్ట్యా, పరిపాలనా విధానాల దృష్ట్యా, నియమాల దృష్ట్యా కాగితం మీద ఇవన్నీ చాలా పకడ్బందీగా కనిపిస్తాయి. కానీ ఇదంతా ఆకారపుష్టి మాత్రమే. అందులో వున్న అంతస్సారం చూస్తే డొల్ల తప్ప మరేమీ కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వున్న తెలుగు శాఖలు నిరంతర నిర్జీవస్థితిలో ఎన్నాళ్ళు వుంటాయో అక్కడి వాళ్ళు నిబ్బరంగా ప్రశ్న వేసుకోగలగాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాం. ప్రభుత్వాలకి, విశ్వవిద్యాలయాలకి అందులో పని చేసే తెలుగు శాఖల్లో వుండే అధికారులకి ఇవి పనికొచ్చే ఆలోచనలు అవుతాయని మా ఆశ.

ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య వ్యవస్థలకి ప్రతిరూపాలే కాబట్టి అవి ఎలా పని చేస్తున్నాయో అక్కడి పరీక్షా విధానాలు, పఠన పాఠన పద్ధతులు, డిగ్రీల వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో సాధ్యమైనంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఎక్కువశాతం రాజకీయ అవసరాల కోసం యేర్పడ్డవి. అవి విద్యావసరాలకోసం పని చేసే పరిస్థితి కల్పించాలంటే ఆ పని లోపలి నుంచే జరగాలి. తెలుగు శాఖల్లో ప్రస్తుతం ప్రధాన స్థానాల్లో వున్నవాళ్ళు ఒక స్వఛ్ఛంద కూటమిగా యేర్పడి, ఏ ప్రభుత్వ సహాయం, ఏ రాజకీయ ప్రబోధం అక్కర లేకుండా, ఇంగ్లండ్ లోను, అమెరికా లోను, కెనడా లోను ఉన్న ఇండియన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్లలో పని ఎట్లా జరుగుతోందో, వాళ్ళు విద్యార్ధుల్ని ఎలా ఎంపిక చేసుకుని చేర్చుకుంటున్నారో, ఆ విద్యార్ధులకి ఏ రకమైన ప్రోత్సాహాలు కల్పిస్తున్నారో – ఆ సమాచారం సంపాందించాలి. ఆ విద్యార్ధులు పిహెచ్.డి. కోసం పరిశోధన చేసే ముందు ఏ విధమైన శిక్షణ పొందుతారో, ఏ ఏ విధానాలు, భాషలు నేర్చుకుంటారో, వాళ్ళు తమ పరిశోధన ప్రణాళికని ప్రతిపాదించడం కోసం ఏ రకమైన పరిశ్రమ చేస్తారో, ఎలా తర్ఫీదు పొందుతారో తెలుసుకోవాలి. పరిశోధన ప్రణాళిక తయారు చేసిన తరువాత ఆ విద్యార్ధులు తమ పథకాన్ని అధ్యాపకుల ముందు ఎట్లా సమర్ధించుకుంటారో, వాళ్ళ ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్తారో గమనించాలి. ఆ శాఖల్లో తెలుగు ఉండకపోవచ్చు. తరుచూ ఉండదు కూడా. కానీ వాళ్ళ విధానాలు, శిక్షణలు తెలుసుకోవడానికి తెలుగే అక్కర్లేదు. అది అంత తేలికయిన పని కాదని మాకు తెలుసు. కానీ, తెలుగుని నిజంగా అంతర్జాతీయ భాషగా చేయాలన్న పట్టుదల వుంటే ఏదయినా సాధ్యమే.

తెలుగులో ప్రచురణ సంస్థల స్థితి పరమ విషాదకరంగా వుంది. వ్యాపార రంగంలో వున్న ప్రచురణ కర్తలకి పుస్తక నిర్మాణ ప్రమాణాల గురించి ఏ రకమైన పట్టుదలా లేదు. లాభాల కోసం పని చేసే సంస్థలు కాబట్టి వాటిని మనం ఏమీ అనలేం. కొనేవాళ్ళ దగ్గర నుంచి వచ్చే వత్తిడి మూలంగా వాళ్ళు క్రమక్రమంగా మారవచ్చును. మన ప్రచురణ రంగంలో ఆధునిక కవిత్వమూ కథలూ వేసేవాళ్ళకి పుస్తకం ఆకారం మీద కొంత శ్రద్ధ వుంటోంది. ప్రాచీన కావ్యాలు, పండిత గ్రంథాలు వేసేవాళ్ళ దగ్గరి కొచ్చేసరికి ఈ ప్రమాణాలు దిగజారుతున్నాయి. వీటి ప్రచురణల్లో మనం కాలక్రమంలో ఎంత వెనక్కి వెళితే అంత మంచి పుస్తకాలు, అచ్చు తప్పులు లేనివి మనకి కనిపించడం మనం ఈ రంగంలో సాధించిన అభివృద్ధిలో భాగం. ఇప్పటికీ వావిళ్ళ వారు వేసిన పాత పుస్తకం దొరికితే అదే వున్నవాటిలో కల్లా మంచి పుస్తకం. ఈ మధ్య పండితుల పట్టుదల వల్ల కొన్ని మంచి పుస్తకాలు వస్తున్నాయి. ముఖ్యంగా పుల్లెల శ్రీరామచంద్రుడు అనే మహానుభావుడు ఏది రాసినా అది పండితులకి ప్రామాణికంగా ఉండటమే గాక ఒక్క అచ్చుతప్పు కూడా లేకుండా వుంటోంది. కాని, ఆయన చేసే పని అంతా సంస్కృతంలో వుండటం వల్లనేమో తెలుగులో పని చేసేవాళ్ళు ఆయన్ని ఆదర్శంగా పెట్టుకున్నట్టు లేదు.

తెలుగు పరిశోధక గ్రంథాలలో ప్రామాణికత ఏర్పడటానికి, తెలుగులో వైజ్ఞానిక గ్రంథాల ప్రకటన సమర్ధంగా వుండటానికి విశ్వవిద్యాలయాలు చాలా పని చెయ్యగలవు. తెలుగులో ముఖ్యమైన విశ్వవిద్యాలయాలకి బలమైన ప్రచురణ విభాగం ఉండాలి. ఇప్పుడు వున్న ప్రచురణ విభాగాల్ని బలపరచి తెలుగులో చేసిన పరిశోధన గ్రంథం విశ్వవిద్యాలయం ప్రచురిస్తే దానికి గౌరవం ఉంటుంది అనే సంప్రదాయం ఏర్పడేలా చూడాలి. ఎవరి పుస్తకాన్ని వాళ్ళే ప్రచురించుకునే ఇప్పటి పద్ధతి నుంచి పరిశోధకులకి విముక్తి కలిగించాలి. వ్యాపార గ్రంథాల ప్రచురణకర్తలకి, వైజ్ఞానిక గ్రంథాల ప్రచురణకర్తలకి, మన ప్రాంతంలో తేడా లేదు. ఆ తేడా ఏర్పడటానికి విశ్వవిద్యాలయాలు పరిశ్రమించాలి. ఈ పని లాభాపేక్షతో కాకుండా విజ్ఞాన ప్రచురణాపేక్షతో చేయాలి. విశ్వవిద్యాలయాల ప్రచురణ సంస్థలు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పుస్తక ప్రచురణలో ఏ పద్ధతులు అనుసరిస్తాయో గమనించి అవసరమైతే అక్కడ కొన్ని నెలల పాటు శిక్షణ పొంది రావడానికి తగినవాళ్ళని పురమాయించి తమ ప్రచురణలని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలి.

పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్ళందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఉదాహరణకి, అమెరికన్ ఆంత్రొపాలజికల్ సొసైటీ (A.A.S.), అమెరికన్ హిస్టారికల్ సొసైటీ (A.H.S.), అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్(A.E.S.), జెర్మన్ ఓరియంటల్ సొసైటీ (D.M.G.), రాయల్ ఏషియాటిక్ సొసైటీ (R.A.S.) ఇలా. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పడాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణా లోను, భారతదేశం లోని ఇతర ప్రాంతాల లోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అందరూ సభ్యులుగా చేరాలి. వాళ్ళు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ ముఖ్యంగా రెండు పనులు చేయాలి.

  1. సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్ళు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించాలి. ఈ పని తెలుగు దేశంలో అప్పుడప్పుడు యు.జి.సి (University Grants Commission) ఇచ్చిన డబ్బులతో జరగడం, అక్కడి పత్రాలు పుస్తకంగా బయటకు రావడం కూడా కనిపిస్తుంది. కానీ ఈ పని ప్రతి సంవత్సరం జరగాలనీ, ఆ సదస్సుల్లో ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు అందరూ పాల్గోవాలని, అలా పాల్గోవడం వాళ్ళ పరిశోధనా సామర్ధ్యానికి ఒక ప్రమాణంగా ఏర్పడాలని మా సూచన.
  2. దానితో పాటు ఈ సంస్థ సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపాలి. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించాలి. ఇలాటి పత్రికలను ఇతర దేశాలలో ఇతర వైజ్ఞానిక సంస్థలు ఎలా నడుపుతున్నాయో, వారు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో క్షుణ్ణంగా చూసి వాటిలో పనికొచ్చే పద్ధతులు మనం అనుసరించాలి. ఇలాంటి పత్రికలు ఇండియాలో కూడా ఇంగ్లీషులో వున్నాయి. ఉదాహరణకి, ఇండియన్ ఎకనమిక్ అండ్ సోషల్ హిస్టరీ రివ్యూ (IESHR) ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (EPW), కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ సోషియాలజీ (C.I.S.) వంటివి. ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తున్నాయి. ఈ ప్రమాణాలలో తెలుగు పరిశోధన పత్రిక ఒక్కటి కూడా లేదు. బయటివాళ్ళు పత్రికా రంగంలో అవసరాల కొద్దీ, సరదాల కొద్దీ, ఉత్సాహాల కొద్దీ, సాహిత్య రంగాన్ని ఉద్ధరించాలని ఏదో కోరికతో నానా కష్టాలు పడి సాహిత్య పత్రికలు నడుపుతున్నారు. వాళ్ళని మనం ఆమోదించాలి, హర్షించాలి, ఉత్సాహపరచాలి. ఈ పత్రికల్లో ప్రచురించబడే వ్యాసాలు అప్పుడప్పుడు బాగుంటాయి కూడా. కానీ ఈ పత్రికల ప్రధాన దృష్టి పరిశోధన ప్రమాణాలు కాదు. పైగా ఈ పత్రికల్లో సాహిత్య వ్యాసాలతో పాటు కథలు కవిత్వం కూడా వుంటాయి. మేము మాట్లాడేది కేవలం పరిశోధన కోసం నడపబడే వైజ్ఞానిక పత్రిక గురించి. ఇది కొనేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువ మందే వుంటారు. తెలుగు దేశంలో వున్న తెలుగు శాఖల అధ్యాపకులు అందరూ ఈ పత్రిక కొనాలని, చదవాలని, అందులో తమ పరిశోధన వ్యాసం ప్రచురించబడితే అది తమకొక అర్హతగా భావించాలని, అలాంటి అర్హతల ఆధారంగానే వాళ్ళ పదోన్నతులు ఉండాలని ఒక సంప్రదాయం ఏర్పరచాలి. ఏమీ ప్రచురించని వ్యక్తికి ఉద్యోగంలో ఎదుగుదల వుండకూడదు.

ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలలో భారతదేశాన్ని గురించి చెప్పుకోదగ్గ పరిశ్రమ జరుగుతోంది. ఈ దేశాల విశ్వవిద్యాలయాలలో ఇప్పుడిప్పుడే తెలుగు గురించి జిజ్ఞాస మొదలవుతోంది. అమెరికా లోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ఒక ఆచార్య స్థానం ఏర్పడింది కూడా. ఇది తెలుగుకి ప్రపంచంలో మొదటి ఆచార్య స్థానం. మరికొన్ని సంవత్సరాలలో ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్య స్థానాలు ఏర్పడతాయి. అప్పుడు తెలుగు పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఆ పని ముగిశాక ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయే ఆటాలు, తానాలు మనసు మార్చుకొని తమ డబ్బుని అమెరికా లోని విశ్వవిద్యాలయాలకి ఇవ్వడం మంచిదని గ్రహిస్తారు. అలా అక్కడ ఏర్పడబోయే ఆచార్య స్థానాలకి తగిన వారిని తయారు చేసే పని ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణా లోను వున్న విశ్వవిద్యాలయాల మీద పడుతుంది. తెలుగు దేశంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా తయారు కాకుండా ఒట్టి డొల్ల పిహెచ్.డి.లు ఇచ్చి కాలం గడుపుతామంటే తెలుగుకి అంతర్జాతీయత ఏర్పడదు.

కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగు ఆధునిక విద్యని తయారుచేసే స్థానం కోల్పోయింది. చేతనైనంతవరకూ ఆధునిక విజ్ఞానులకి సమాచారాన్ని అందించే స్థానంలోనే వుంది. ఈ పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణం మనలో వున్న బుద్ద్ధిమంతులు, మేధాశక్తి కలవాళ్ళు, ఊహశాలులు, చాలామంది తెలుగుకి దూరమై, ఇంగ్లీషు చదువులకి ఎగబాకడం. తెలివైన వాళ్ళందరు, ఇంజినీరింగో, మెడిసినో, బిజినెస్ అడ్మినిస్ట్రేషనో, కంపుటర్ సైన్సో తీసుకుంటూంటే, తెలుగు శాఖల్లో అంత తెలివైన వాళ్ళు కాని వాళ్ళే చేరేవాళ్ళు. ఇది ఒకరకమైన మేధోవలస. ఈ స్థితి ఎలా మారుతుందో ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదు కాని, తెలుగు విద్యార్థులు ఇంగ్లీషు చదవకుండా ఆధునికులం కాగలమని అనుకోడానికి ఇప్పుడు వీల్లేదు. తెలుగులొ పిహెచ్.డి. చేసే విద్యార్థులు ఇంగ్లీషు కూడా బాగా నేర్చుకుని వుండాలి. వ్యాపారానికీ, ప్రభుత్వ ఉద్యోగాలకీ సరిపడే ఇంగ్లీషుతో ఆపకుండా, ఇంగ్లీషులో కొత్త ఆలొచనలూ, సైద్ధాంతిక విధానాలూ నిర్మించే పుస్తకాలు చదివి, వాటినీ విశ్లేషించి, వాటిని విమర్శించే స్థాయికి ఉద్యమించాలి. ప్రపంచ విజ్ఞానం పశ్చిమ దేశాల్లో ఎలానూ తయారవుతుంది కదా, మనం దానిని ఎరువు తెచ్చుకుని వాడుకుంటే చాలు, అదే గొప్ప! అనే స్థాయి నుంచి, మన దగ్గిర ఆధునిక ప్రపంచం నేర్చుకోవలసిన ఆలోచనలూ, విధానాలూ ఉన్నాయని మనం వారికి చెప్పగలిగేలా ఎదగాలి. ప్రపంచీకరణ అంటే ఎరువు తెచ్చుకోవడమే కాదు, ఎరువు ఇవ్వడం కూడా అని తెలుగు విద్యార్థులూ, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలూ గుర్తించాలి.

తెలుగు అంతర్జాతీయ భాష అవడానికి మనం చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణం విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో మొదలవాలి.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...