దుర్గేష్ మోదీ, కళ్ళు తిప్పుతూ, డిపార్ట్‌మెంట్‌లో ‘ఇండియాత్వం’ గురించి మినీ లెక్చర్ మొదలెట్టినప్పుడల్లా, కుర్చీలోకి కుదించుకు పోయేది నిసి. ఆ రోజు భారతీయత గురించి ఏమి ఆణిముత్యాలు ఆమె నోటినుండి రాలతాయో అని. అసలు ఆమె ముఖమే నిసికి నచ్చదు. కాని, హిందీ తారలా నల్లని గుడిసె లాటి బాబ్డ్ హెయిర్ తలకాయిని అటూ ఇటూ తిప్పుతూ, అప్పుడపుడూ జారే సిల్క్ చీర మళ్ళీ భుజం మీదుకు చేరుస్తూ దుర్గేష్ మాట్లాడుతుంటే, లంచ్ టైంలో ట్యూమర్ కాన్ఫరెన్స్ ముందు కొందరికి అది కొంత వినోదం.
ఆ రోజు ఆమె ఇలా సెలవిచ్చింది:
నవీన్ (దుర్గేష్ ఐదేళ్ళ కొడుకు) – “మమ్మీ, మా క్లాస్‌లో అంతా తెల్లగా ఉంటే, నే నల్లగా ఉన్నానేం?” – అన్నాడు. నేను “నిన్న కుక్కీలు బేక్ చేసినప్పుడు, కొన్ని తెల్లగా, కొన్ని బ్రౌన్‌గా, కొన్ని నల్లగా మాడిపోయి రాలా? వాటిలో నీకేం కుక్కీలు బాగున్నయ్? పండూ!” – అని అడిగా. వాడు “బ్రౌన్‌వి మమ్మీ” అన్నాడు.
“చూశావా ! దేవుడు మన మనుషుల బొమ్మల్ని అవెన్లో బేక్ చేసినప్పుడు, సరిగ్గా బేక్ ఐనవి, ఇండియన్లు రా. మన రంగు పర్ఫెక్ట్. కరెక్ట్. పిండి తక్కువ కాలితే, వాళ్ళు తెల్లవాళ్ళయ్యారు. మాడితే నల్లవాళ్ళయ్యారురా పండూ.” అని చెప్పా.
ఇలా, దుర్గేష్ మోదీ ఆ నానా జాతి సైంటిస్టులు, డాక్టర్ల సమితికి వివేకానందినియై, సామరస్యం కలిగిస్తున్నా ననుకుంటూ, రేషియల్ ఇవల్యూషన్ గురించి చిన్ని బోధలు చేసేది.
ఏ కాన్సర్ గురించి గానీ ఆమె చేసిన డిస్కషన్స్ ఒకరికైనా గుర్తున్నాయో లేదో గాని, ఇండియన్ పెళ్ళి పేరంటాల గురించి; చీరల నాణ్యతలు, ధరించే విధానాల గురించి; బొట్టు కాటుకలు, గాజులు, వాటి అర్ధం; కట్నం కానుకలు, వాటి విశిష్టత; భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి ఆమె స్లయిడ్లు లేకుండానే న్యూయార్క్ నగరంలో, ఓ జ్యూయిష్ దాత స్థాపించిన ఒక పెద్ద హాస్పిటల్లో, ఆ అమెరికన్లకు అడపా దడపా చిన్ని కోర్సులు, రిఫ్రెషర్ కోర్సులుగా పరిచయం చేసేసింది.
అమెరికన్లు అంటున్నా అప్పుడు ఆ టేబిల్ దగ్గర సమావేశం అయినది చాలా మంది ఇంకా స్టూడెంట్ వీసాల మీద, జె-1 వీసాల మీద ఉన్న వారే. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కొందరు ఇంగ్లీషు టోఫెల్ పరీక్షలతో, కొందరు ఫ్లెక్స్, మరి కొందరు బోర్డ్ ఎగ్జామినేషన్, ఇలా ఎవరి దీక్షలో వారుండే వారు. అవటానికి, కాన్సర్ పై పరిశోధనలు, ఆ పేషెంట్ల రోగ నివారణ కారణంగానే వారంతా ఒక చోటకే చేరినా, అంతర్లీనంగా చాలామంది సమస్య వారి వీసా, వారి జీవనోపాధి సరిగా ఏర్పరచుకోవటమే. అమెరికా దేశంలో పౌరులుగా స్థిరపడి పోవటమే.
అందరికీ పెద్ద, ఛార్లీ బెన్సన్ – డిపార్ట్‌మెంట్ చైర్మన్, రష్యన్ పోలిష్ యూదుడు. వైస్ ఛైర్మన్, యూదురాలు – లారా స్పెన్సర్. ఇంకా ఇద్దరు చైనీయులు, ఇద్దరు కొరియన్ అటెండింగ్‌లు, కొందరు రష్యా నుండి దిగిన సుందరీ మణులు, ఒక మిలియనీరు అని చెప్పబడే కిమ్, ఒక బెంగాలీ బాబు రాయ్, మరో పంజాబీ సింగ్, ఇలా, ఇలా ఓ ఇరవై, ఇరవై ఐదు మంది డాక్టర్లు. వారి అనుబంధపు స్టాఫ్‌లో పోలిష్, జ్యూయిష్ వారి సంఖ్య ప్రబలంగా ఉండేది.
ఛార్లీ బెన్సన్ అత్యంత బుధ్దిశాలి. భార్య వేరే హాస్పిటల్లో డాక్టర్. భార్యా భర్తలు ఇద్దరూ ఒక అరవై ఏళ్ళ వయసు వారే. ఛార్లీ బెన్సన్‌కు పెథాలజీ, రేడియాలజీలలో బలమైన బాక్‌గ్రౌండ్ ఉంది. డయాగ్నాస్టిక్ రేడియాలజీ దాటి వచ్చి, థెరపీ లోకి వచ్చేసి, ముఖ్యంగా, గైనికలాజికల్ కాన్సర్ గురించి ఎక్కువ కృషి చేస్తూ, రోగి, వైద్యుల సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాడు. రేడియోఆక్టివిటీ కనుక్కున్న అప్పటి సైంటిస్టులు, మరియా క్యూరీ, బెకరెల్, తదితరులు, రేడియంను జేబుల్లో వేసుకు తిరగటం, చేతులతో పట్టుకోటం వంటి పనులు భయం లేకుండా చేశారు. క్రమేణా వారికి, ఇతర సైంటిస్ట్ లకు రేడియోఆక్టివ్ మెటీరియల్స్ ఉపయోగాలే కాక, అనర్థాలు కూడా తెలియ వచ్చాయి. అనర్థాలతో, తీవ్రమైన బాధలతో యూదులకు అంతా ఇంత పరిచయం కాదు కదా. ఆ పరిచయం, యూదుల లోని తరతరాల వేదన – తోటి మానవుని బాధలు తగ్గించటానికి, జీవించటానికి సరైన వసతులు, ఆరోగ్యం కలిగించటం లోకి మళ్ళింది. ఆసుపత్రులు, విద్యాలయాలు నెలకొల్పటంలో వారు అగ్రగాములు. అందువల్ల, ఆ యూదుడు, ఛార్లీ బెన్సన్ రేడియేషన్ ధెరపీలో, ఆఫ్టర్ లోడింగ్ టెక్నిక్స్ గురించి ఆలోచించి, ఫిజిసిస్ట్ లతో కలిసి కొత్త అప్లికేటర్స్ తయారు చేస్తున్నాడు.
డాక్టర్ నిసి ఆ హాస్పిటల్‌కు ఎలా వచ్చిందంటే: నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు. వారికి ఆయనతో ముచ్చటించటం బహు లాభదాయకం. ఎంత చరిత్ర తెలిసినా, విద్యార్ధులతో ముందుగా కొత్త విషయాలేంటి? అని ప్రశ్నించేవాడు. మెడిసిన్‌లో, పాత పురాణాల పని ఏమిటి? కొత్తగా ఆలోచించటం, ప్రవర్తించటం, నేర్చుకోవాలనేవాడు. నిసి, ఆయనతో అప్పుడప్పుడు తనకు డయాగ్నాస్టిక్ రేడియాలజీ చెయ్యాలని ఉందంటే, నువ్వు షాడోలు చూసేందుకూ కాదు. టిష్యూలు మైక్రోస్కోప్‌లో చూసేందుకూ కాదు. వాళ్ళు దొంగ వైద్యులు. వైద్యులు రోగులతో కలిసి ఉండాలి. నువ్వు నిజం మనుషులుతో ఉండాలి. నీ అవసరం వారికి ఉంది. నువ్వు పరిశోధనలు చెయ్యి. కాని, ఎక్కువ భాగం పని క్లినికల్ మెడిసిన్‌లో, రోగుల రోగ నివారణలో పని చెయ్యాల్సిందే. నీ బలం, తెలివి అక్కడ చూపించు, అని ఖండితంగా చెప్పాడు.
నిసి తన రెసిడెన్సీలో ఉండగానే, ఆమె మెమోరియల్ స్లోయన్ కెట్టరింగ్‌లో ఫెలోషిప్ చెయ్యటానికి వెడుతున్నట్టు తెలుసుకున్న ఛార్లీ తన యూరోపియన్ పద్ధతిలో, ఆమె రెండు చెంపల మీదా చేతులుంచి, అటూ ఇటూ రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టి, అప్పటి కప్పుడే, ఆమె ఫెలోషిప్ కాగానే, తన డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ మెంబర్‌గా చేరాలని, ఆమె ఇంకెక్కడకూ ఉద్యోగం కోసం వెదుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదని చెప్పేశాడు. అది ఒక చక్కని ఆహ్వానం, ఉత్తరువు కూడా.
ఆమె ఆశ్చర్యపోయింది, తనకు ఇలా అప్లికేషన్లు పెట్టకుండానే ఉద్యోగాలు దొరుకుతున్నందుకు. ఛార్లీ దగ్గర పని చెయ్యాలని ఎవరికి ఉండదు. అతని మాటలు వినటం అంటే, అప్పటి వరకూ జరిగిన ప్రపంచ చరిత్ర తెలుసుకోటమే. ఇలియాడ్, ఆడిసీ, తోరా, తాల్మూద్, చదవటమే. అప్పటి వరకూ జరిగిన మెడిసిన్ చరిత్ర విని, రాబోయే కొత్త వైద్యాలకు బాటలు వెయ్యటమే. ఆమె సంతోషించింది. అన్నట్టుగానే, నిసి తన ఫెలోషిప్ అవుతూండగా, ట్రెయినింగ్ వివరాలు, యోగ్యతా పత్రాలతో ఆయనకు సమాచారం అందించింది. ఆయన నిసిని ఫోన్‌లో పిలిచి, జులై నుండి నీ ఉద్యోగం మొదలు, అని చెప్పాడు. నిసి, అలా ఆ జ్యూయిష్ హాస్పిటల్లో, రేడియేషన్ ధెరపీ విభాగంలో, జూనియర్ ఎటెండింగ్ ఫిజీషియన్‌గా పని మొదలెట్టింది. ఆమెకు హాస్పిటల్ జీవితం ఉద్రిక్తంగా, ఆలోచనా ప్రేరకంగా, ఇంట్లో జీవితం రొమాంటిక్‌గా గడిచి పోతున్నది.
అలా సాగిపోతున్న సమయంలో, నిసిని బ్రాంక్స్ లోనే, మరో జ్యూయిష్ యూనివర్సటీ హాస్పిటల్లో పని చెయ్యటానికి వెళ్ళమన్నాడు ఛార్లీ బెన్సన్. ఆమె ఖంగు తిన్నది. అదీ ఒక నోబెల్ ప్రైజ్ పొందిన యూదుని పేరు కలిగిన హాస్పిటల్. కాని, అక్కడి డిపార్ట్‌మెంమెంటుతో వీరికి సత్సంబంధాలు లేవు. అక్కడి ఛీఫ్, డాక్టర్. హుస్సేన్ – ఆడవాళ్ళను, మగవాళ్ళను విరుచుకు తింటాడని, అక్కడ పనిచేసే వాళ్ళు తరచూ, వేరే హాస్పిటల్స్ వెతుక్కుంటూ వెళ్ళి పోతారని వింది. ఎందుకు తనను అక్కడకు పంపటం. ఆమె కొంచెం ఉడుక్కుంది.
అసలు తను చూస్తూ ఉంది, కష్టమైన పనులన్నీ సి. బి. తనకు అప్ప చెపుతాడు. మిగతా ఆడవాళ్ళందరినీ అస్తారుబాతంగా చూసుకుంటాడు. ఒకసారి హుస్సేన్ డిపార్ట్‌మెంట్‌లో ఆడ డాక్టర్లు ఏం బాగుండరు. ఇక్కడ చూడు, ఎంతమంది అందమైన వాళ్ళున్నారో అన్నాడు కూడా. నన్ను పంపటంలో అర్ధమేంటి? అనుకుంది.
మామూలు ప్రకారమే, తన సీనియర్ డాక్టర్, సునీల్ లీ వచ్చి, నిసికి పెద్దాయన ఆంతర్యం విప్పి చెప్పాడు.
“ఇక్కడ ఎవరూ నువ్వు చదివినంతగా జర్నల్స్ చదవరు. వీళ్ళలో ఎవరిని పంపినా అక్కడి ఛీఫ్, ఇక్కడి జూనియర్ స్టాఫ్ సరిగా చదవటల్లేదని బైట డాక్టర్ల దగ్గర యాగీ చేస్తాడు. నువ్వు హుస్సేన్‌తో నెగ్గగలవు. అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలున్నయ్యి. ఈ రెండు హాస్పిటల్స్ ఎలా కలపాలనే విషయాల్లో, రెసిడెన్సీ ట్రెయినింగ్ స్టాండర్డ్స్ విషయాల్లో, మాటలు ఇప్పుడే మొదలయినయ్యి. కాని రెండూ బలమైన సంస్థలనీ, రెండు చోట్ల మేధావంతులున్నారంటంలో సందేహం లేదుగా.
ఇద్దరు ఛీఫ్ లకూ, ఛీఫ్ టెక్నాలజిస్టులతో -యూ నో వాట్ సంబంధాలున్నయ్యి. ఇక్కడ విషయం మొదట్లో నీకు చెప్పినట్లే, అక్కడి సంగతి కూడా చెపుతున్నా. మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈ స్త్రీలు చాలా జెలసీతో బాధ పడుతుంటారు. ముఖ్యంగా ఇతర ఆడవాళ్ళు, డాక్టర్‌లు, పని లోకి వచ్చినపుడు. పోటీ వస్తుందేమో, డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళ పెత్తనం తగ్గుతుందేమో అని. వాళ్ళను మోరల్ తక్కెట్లో తూచి, వాళ్ళను ఇతరులు చిన్న చూపు చూస్తారేమో అని, ఇలా. వాళ్ళతో తగవు పడితే, ఛీఫ్ లకు గాభరా కలుగుతుంది. జాగ్రత్తగా ఉండూ.”
“వీళ్ళంతా ఎదిగిన స్వతంత్ర వ్యక్తులు. వాళ్ళ స్లీపింగ్ హేబిట్స్‌తో ఎవరికి పని!” అంది నిసి.
డాక్టర్ లీ ముఖం లొద్దిగా ంలానమయింది. “నీ అంత లిబరల్ కాదు, లిబరేటెడ్ కాదు ఈ విషయాల్లో నేను, ఇంకా కొందరు. నువ్వు సమ్ హౌ వాటిని కాండిసెండింగ్గా చూడవు.” అన్నాడు.
“వెల్! ఇండియాలో, మా వైపు పల్లెటూళ్ళలో ఇది చాలా కామన్.” అంది నిసి.
“మరి దుర్గేష్ చెప్పే కబుర్లన్నీ?”
“అదంతా హోక్స్. అవన్నీ ఆమె తనను తాను నమ్మించుకునే కట్టు కథలు. షి ఈజ్ ఏన్ ఏక్ట్.” అంది నిసి.
“ఎనీ వే. గుడ్ లక్ ఇన్ ది అదర్ డిపార్ట్‌మెంట్. ఇక్కడకు వస్తూనే ఉంటావు కదా. దట్స్ నైస్.” అన్నాడు డాక్టర్ లీ.
నిసి, శ్యామ్, ఆ మధ్యే అక్కడ ఇర్వింగ్టన్‌లో చిట్టి ముత్యం లాటి ఇల్లు కొనుక్కున్నారు. చరిత్రాత్మకమైన ఊరు. రిప్ వాన్ వింకిల్, లెజెండ్ ఆఫ్ స్లీపీ హాలో, రాసిన వాషింగ్టన్ ఇర్వింగ్ నుండి, ఆ ఊరికి ఆ పేరు ఉంచారు. హడ్సన్ నది పక్కన ఉండే చిన్ని ఊళ్ళలో అది ఒకటి. కళకళ లాడే ప్రకృతి శోభ కలిగిన ఊరు. న్యూయార్క్ సిటీకి, ఆ వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుండి హడ్సన్ లైన్ తీసుకుని రోజూ ఉద్యోగాలకు వెళ్ళి వస్తుంటారు.
నిసి, ఆ రోజు, ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ ఆలోచించుకుంటున్నది.
ఆమె ఇటు కూరగాయలు తరుగుతుంది. పొయ్యి మీది కూరలు ఉడుకుతుండగానే, వేరే గదిలో తన పుస్తకాలు కాగితాలు సవరిస్తుంది. హాస్పిటల్లో అప్పుడప్పుడూ పుస్తకాల ఆక్షన్లూ అమ్మకాలూ జరిగినపుడు, పాత పుస్తకాలు ఎన్నో డాలర్ కొకటి కొంటూ ఉండేది. అలా ఎప్పటికప్పుడు ఇంట్లో ఆమెకు సొంత రిఫరెన్స్ లైబ్రరీలు ఏర్పడ్డాయి. బైటి ఋతువులను చూస్తూ అప్పుడప్పుడూ గీసే స్కెచ్‌లనూ, వాటర్ కలర్స్‌నూ చిన్న ఫ్రేమ్స్‌లో పెట్టి, తను తిరిగే చోట్ల కంటికి ఆహ్లాదం కలిగేలా ఉంచుతుంది. చలనం ఆమె స్వభావం. ప్రవహించి పోయే నది ఆమె. మధ్యలో బైటికి వెళ్ళి రెండు కొమ్మలో పూలో తెచ్చి వేజుల్లో అమర్చుకుంటుంది. తోటలో గులాబీలు పూస్తున్నయ్యి. ఒక రోజు ఆ గులాబి మొక్క దగ్గర నుంచుని గులాబీలు దట్టంగా చీరలో ఉన్న ఫొటో, ఒకటి ఇండియాలో ఉన్న తండ్రికి పంపింది. ఇండియా ట్రిప్ వెళ్ళి వచ్చిన బంధువులు, నీ ఫొటో ఆయన గదిలో ఉంది. మాకు చూపించారు అని చెపుతారు. ఆమె సంతోషిస్తుంది.
నిసి పనులు చేసుకుంటూనే ఆలోచిస్తున్నది. ఏదో, ఒక ఆడవాళ్ళ మేగజీన్‌లో పాత చెత్త చదివి, ఆమెకు కోపం కలిగినందున చెలరేగిన ఆలోచనలు.
తనెవరు? ఒక సైంటిస్టేనా? అవును. కాక ఏమిటి! కందిపప్పా. తను డాక్టర్. సైంటిస్ట్. రేడియమ్ కనిపెట్టిన మేడమ్ క్యూరీ సైంటిస్టా కాదా అని సందేహించే వారు ఈ రోజుల్లో ఎవరన్నా ఉంటారా? ఆమెకు ఫిజిక్స్‌లో ఒకసారి, కెమిస్ట్రీలో ఒకసారి నోబెల్ ఇచ్చారు. రెండు సార్లు నోబెల్ ప్రైజ్, ఒక స్త్రీకి వచ్చింది.
1977లో బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటలో పనిచేస్తున్నప్పుడు, పక్క డివిజన్ లోనే పనిచేసే ఫిజిసిస్ట్, రోసలిన్ యాలోకి (Rosalyn Yalow) ‘రేడియో ఇమ్యునోఎస్సే’ టెక్నిక్‌కి నోబెల్ ప్రైజ్ వస్తే, తామంతా లైన్లలో నుంచుని ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోలేదూ. హాస్పిటల్ పని కట్టుకుని, అక్కడ పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్ లందరికీ ఆ అవకాశం ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు సభ్యత్వం ఇవ్వటం నిరాకరించిన మెడికల్ సొసైటీలు, హాస్పిటల్స్, ఆమెకు ఆహ్వానాలు పంపించాయి. అది సరైన పద్ధతే. సైంటిఫిక్ విషయాల్లో పరిశోధన సరైనదని, ఫలితాలను సరిగా గమనించి, బిరుదులు, బహుమతు లివ్వటమే మర్యాద.
అదే సమయంలో కొన్ని మెడికల్ కాలేజ్‌ల నుండి, ప్రైవేట్ సంస్థల నుండీ ‘సైన్స్ అండ్ వుమెన్’ గురించి మాట్లాడమని కూడా యాలోకి ఆహ్వానాలు వచ్చాయి. కాని ఆమె నేను చేసిన పరిశోధన, స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తించేదే. సమానంగా పనికొచ్చేదే. అందువల్ల స్త్రీలతోనే, స్త్రీల గురించే ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు. సైన్స్ విషయాల్లో నాతో పని చేస్తున్న వారెవరూ నన్ను స్త్రీ అని నేను చేసే పరిశోధనలని ఎక్కువగా చూడలేదు, అణగ తొక్కనూ లేదు. లాబ్‌లో నాతో పని చేసే వారి మనసుల్లో ఆ వివక్షతలు లేవు, అంది.