తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు వసంతవాడకి, ఈనాటికీ వాడకంలో ఉన్న కేన్సర్ ఔషధం మిత్రమైసీన్కీ (Mithramycin), అమెరికాలో ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక విచిత్రమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం తెలుసుకోవాలంటే, కొప్పాక విశ్వేశ్వర రావుగారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.
కొప్పాక విశ్వేశ్వర రావు (1925-1998), సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు. వాళ్ళది వసంతవాడలో ఒక పేదకుటుంబం. విశ్వేశ్వర రావు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన ఇరవమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో మరొక డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకున్నారు. 1954లో ఆయన, భార్య సీతగారితో సహా – అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ ఫైజర్ (Pfizer) కంపెనీలో పరిశోధకుడిగా చేరారు. సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలు కేన్సర్ నివారణకి ఔషధాలుగా ఉపయోగించడానికి ఆయన చేసిన పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన మిత్రమైసీన్ అనే మందు ఇప్పటికీ కేన్సర్ నివారణకి వాడుతున్నారు.
విశ్వేశ్వర రావుగారికీ, సీతగారికీ ప్రాచీన తెలుగు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం. ఆయన తిక్కన్ననీ, పోతన్ననీ తన పిల్లలకీ ఆప్యాయంగా వినిపించేవారు. ఆయన జీవితం చివరి రెండు సంవత్సరాలలో, తెలుగు, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం –- అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆ పని చెయ్యడానికి విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని స్థిరంగా నిశ్చయించుకున్నారు. కాని, అది ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు.
ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత, పిల్లలు విజయలక్ష్మీరావు, వెంకట రామారావు, జయ రావు 2000 సంవత్సరంలో కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్ స్థాపించారు. అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు) కావాలి. అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు. కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా వున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ — ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది. అప్పుడు, కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్ వారే కల్పించుకొని, ఆ రెండవ భాగం కూడా తామే ఇస్తామని వాగ్దానం చేశారు.
ఇప్పుడు, మార్చ్ 26, 2015న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది. దాని పేరు ఆధికారికంగా The Visweswara Rao and Sita Koppaka Professorship in Telugu Culture, Literature, and History. విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం.
ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంస్థలకీ, తెలుగు మీద నిజమయిన అభిమానం ఉన్న వ్యక్తులకీ, ఇది ప్రేరణ అవాలని వాంఛించడం అనుచితం కాదు.
ఇది కాక కొప్పాక ఫౌండేషన్ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి అమెరికాలోను, తెలుగునాటా విరాళాలు ఇస్తున్నారు.
విశ్వేశ్వర రావుగారికి 1998లో గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లలకు – ఇద్దరు వైద్యులు -— వైద్య వ్యవస్థలో ఉన్న లోపం చాలా బాధ కలిగించింది. డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ మధ్యన అన్యోన్యత పెంపొందిMచడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటి వరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం విరాళాలు ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి శాశ్వత నిధి నెలకొల్పారు. (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు కలిసి రాసిన వ్యాసం, ‘శాంతి’ అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య శాఖ పత్రిక (Annals of Internal Medicine, Volume 137, Number 10, 19 November 2002) లో ప్రచురితమయ్యింది. అంతే కాకండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌండేషన్ నిధులు కేటాయిండానికి ప్రయత్నిస్తున్నారు.
విశ్వేశ్వర రావు గారు సహజ వనరుల ఔషధ పరిశోధనలో ప్రపంచ ప్రసిద్ధులు. ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీదా ఉన్న అధికారం, మమకారం ప్రపంచానికి తెలియదు గాని, ఆయన పిల్లలకి తెలుసు. వారు ఇప్పుడు, కొప్పాక ఫౌండేషన్ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.
(ఆంధ్ర జ్యోతి – మార్చ్, 25, 2015 సౌజన్యంతో.)