Edward Hirsch, “How to read a poem”

1999లో ప్రచురించబడి, చాలా పేరు తెచ్చుకున్నదీ పుస్తకం. ఇంతవరకు దీన్ని చూడనివారి కోసం ఈ పరిచయం.

“పద్యం ఎలా చదవాలి?” అనే విషయాన్ని కూలంకషంగా వివరించిన ఈ పుస్తకం కవిత్వం గురించి ఏ మాత్రం కుతూహలం ఉన్నవాళ్ళైనా చదివి తీరాల్సినంత బాగుంది. ముఖ్యంగా తెలుగు కవిత్వాస్వాదకులకు ఇది రసాలమామిడి రసం, సుగంధాల బెల్లపుపానకం.

ప్రస్తుతం తెలుగు కవితారంగాన్ని శాసిస్తోన్న “సుప్రసిద్ధ కవుల్లో” చాలా కొద్దిమందికి మాత్రమే కవిత్వం అంటే ఏమిటో తెలుసు. మామూలు భాషని ఏం చేస్తే అది కవిత్వభాషగా మారుతుందో అవగాహన

అస్థిమూలాల్లోకి ఇంకిన వాళ్ళు ఒకరిద్దరు కూడ వున్నట్లు కనిపించదు వీళ్ళ రచనలు చూస్తోంటే. ఏదో పదాలతో విచిత్రవిన్యాసాలూ గారడీలూ చేసి అద్భుతమైన కవిత్వం చెప్పామని చంకలు గుద్దుకుని బాకాలు వూదుకునే వారూ, రాజకీయ నినాదాల్ని చిన్న చిన్న పాదాలుగా నరికి పేర్చి ఇదే కవిత్వం అని వాదించే రకరకాల వాదాల వారూ, ఏవో అయోమయపు భావాల్ని ప్రయోగాత్మకమైన భాషలో రాస్తున్నామనుకుంటూ గందరగోళపు సంకీర్ణపదాల దొంతర్లని పేర్చే మహానుభావులూ వీరూ మనకిప్పుడు కవితామూర్తులు. సొంతంగా పుస్తకం అచ్చువేసుకోగలిగిన ప్రతి వ్యక్తీ ఓ మహాకవే!ఇకపోతే విమర్శకులని చూద్దామా అంటే చాలావరకు కవుల వ్యక్తిపూజా భజనలే కవిత్వ విమర్శగా పత్రికల్లోనూ, పుస్తకాలుగానూ ఎదురౌతున్నాయి తప్ప, వీరి కవిత్వావగాహన కూడ కవులతో పోటీపడే స్థాయిలోనే వుంది. మౌలికమైన పరిశోధనలు చేస్తోన్న వెల్చేరు నారాయణరావు వంటి వారి పరిశీలనల్ని ఆంధ్రదేశపు కవులు గాని విమర్శకులు గాని పట్టించుకోకపోతే మానె, కనీసం చదువుతున్న దాఖలాలు కూడ సరిగా కనిపించవు. ఇలాటి వాతావరణంలో కవిత్వ పాఠకులు కవులు కాక మరెవరైనా వున్నారా అనేది అస్తినాస్తి విచికిత్సా విషయం కావడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

తెలుగు భాష మీదా, కవిత్వం మీద ఇంకా ఆశ, అభిమానం వున్నవారు తమంత తామైనా “కవిత్వం అంటే ఏమిటి, అది ఎలా వుంటుంది?” అన్న ప్రశ్న వేసుకోవటం, దానికి సమాధానాలు వెదుక్కోవడం, తెలుగు భాష భవిష్యత్తుకు చాలా అవసరం. మన సంప్రదాయ కవిత్వం విషయంలో ఈ ప్రశ్నకి సమాధానాలున్నాయి కాని ఇటీవలి కాలంలో వస్తోన్న కవిత్వం వస్తువులో, భావాల్లో, భాషలో, రూపాల్లో సంప్రదాయ సాహిత్యం కన్న భిన్నమైనది గనుక దీనికి కొత్త ప్రమాణాలు, కొత్త దృష్టిమార్గాలు, కొత్త సిద్ధాంతాలు అవసరం. ఐతే ఇప్పుడు కవులమని చెప్పుకుంటున్న వాళ్ళు గాని, వాళ్ళని ఆదరిస్తోన్న వారు గాని, పొగుడుతున్న వాళ్ళు కాని ఆ ప్రమాణాలని, దృష్టిమార్గాలని మనకు అందించడం లేదు.

వెయ్యేళ్ళుగా సాగుతోన్న తెలుగు సాహితీప్రవాహ మార్గంలో ఓ యాభై యేళ్ళ అడ్డంకుల్ని పెద్దగా లక్ష్యపెట్టక్కర్లేదు ఆ అడ్డంకుల్ని దాటిన తరవాతనైనా మళ్ళీ అది అవిచ్ఛిన్నంగా సాగే అవకాశం వుంటే. అలాటి అవకాశం కలిగించటానికి ఇలాటి పుస్తకాలు ఎంతో ఉపకరిస్తాయి. తెలుగులో ఎలాగూ ఇలాటివి లేవు కనుక, అవి వచ్చేలోగా ఇంగ్లీషులో వున్న వాటిని మనం ఆశ్రయించక తప్పదు.

ఈ పుస్తకం వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో వున్నాయి. మచ్చుకు ఎన్నో అద్భుతమైన కవితల్ని ఒకచోట చేర్చిందీ పుస్తకం, వాటికి విపులమైన, లోతైన వ్యాఖ్యానాలతో సహా! వందేసి రచనలుండే తెలుగు “కవితాసంకల”నాల్లో రెండు, మూడు ఆద్యంతమూ పటిష్టంగా వున్న కవితలు దొరికితే సంబరపడి ఆనందించాల్సిన దౌర్భాగ్యస్థితి మనది. ఈ పుస్తకం సరిగ్గా అందుకు వ్యతిరేకం. ఇదొక్క కారణం చాలు ఈ పుస్తకాన్ని ఆప్యాయంగా చదువుకోవటానికి. అలాగే, ఈ హర్ష్‌కి కవిత్వం మీద వున్న ప్రేమ, అందులో అతను పొందే నిండైన ఆనందం, పాఠకులకు కూడ కొంతైనా అంటుకుంటాయి యీ పుస్తకం చదివితే. ఇది మరో ముఖ్యమైన కారణం. ఇలాటి పుస్తకాలు చదివాక పద్యాల్ని ఓ కొత్త దృష్టితో చూడగలం, అప్పటివరకు కనపడని లోతుల్నీ (ఇప్పుడొస్తున్న తెలుగు సాహిత్యం విషయంలో బహుశా లోతు లేకపోవటాన్ని), కోణాల్ని, ధ్వనుల్ని (మన సాంప్రదాయికార్థంలో కూడ) కనగలం, వినగలం.

ఐతే, కవిత్వం రాయాలనుకునే వాళ్ళకి దీని వల్ల కలిగే వుపయోగం బహుశా పరోక్షంగా కలిగేదే ఏ రచయితైనా, తన రచనలకి తొలిపాఠకుడు తనే కనుక ఒకసారి రాశాక పాఠకుడిగా దాన్ని చదివి ఈ పుస్తకంలో ఇచ్చిన లాటి విశ్లేషణల ద్వారా దానికి మరింత పదును పెట్టే అవకాశం దొరుకుతుంది. అంతేకాని, మంచి కవిత్వం ఎలా రాయాలో చెప్పదీ పుస్తకం. ఇది ఒక లోపం కింద లెక్కపెట్ట కూడదేమో గొప్ప కవి కావడానికి మొదటిమెట్టు గొప్ప పాఠకుడు కావటం కదా!