చంద్రరేఖా విలాపం – ఎలాటి కావ్యం?

నిజమెంతో మనకి తెలీదు — ఈ కావ్యం పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో వుంది: ఇప్పటి అనకాపల్లికి దగ్గర్లో వున్న దార్లపూడి అనే చిన్న రాజ్యానికి జమిందారు చింతలపాటి నీలాద్రిరాజు; అతను విజయనగరం రాజు విజయరామరాజు చెల్లెలి భర్త; అతని ప్రీతిపాత్రమైన వేశ్య చంద్రరేఖ; పిఠాపురానికి దగ్గర్లో వున్న కందరాడ గ్రామంలో ఇద్దరు డొక్కశుద్ధి వున్న కవులు — కూచిమంచి తిమ్మకవి, అతని తమ్ముడు జగ్గకవి; జగ్గకవి అనేక సంస్థానాల్లో తిరిగి ప్రతిభని చాటి సత్కారాలు పొందాడు; తిమ్మకవి ఆ ఊరి కరణం, పెద్దగా తిరిగినట్టు కనపడడు; నీలాద్రి జగ్గకవిని తన ప్రియవేశ్య చంద్రరేఖనీ, తననీ నాయికానాయకులుగా ఒక శృంగారప్రబంధం రాయమని, దానికి కొంత డబ్బిస్తానని కోరాడు; జగ్గకవి ఒప్పుకుని “చంద్రరేఖా విలాసం” అనే ప్రబంధం రాసి తీసుకెళ్తే ఈలోగా ఆడిమళ్ల వేంకటశాస్త్రి అనే సంస్కృతకవి తనకొక అలంకారగ్రంథం రాసిచ్చాడని, ఇప్పుడు జగ్గకవికి ఇవ్వటానికి తన దగ్గర డబ్బు లేదన్నాడు నీలాద్రి; ఒళ్లుమండిన జగ్గకవి దాన్ని అక్కడికక్కడే చించిపడేసి “చంద్రరేఖా విలాపం” అనే ప్రబంధాన్ని బూతులబుంగగా, కనిపించిన వాళ్లందర్నీ తిడుతూ రాశాడు; అంతటితో ఆగక అతను నిజాం నవాబు దర్బారులో దాన్ని చదివి వినిపిస్తే నవాబు మెచ్చుకుని దాన్ని అతనికి సామంతుడైన విజయరామరాజు కొలువులో కూడ చదవాలని, ఆ సమయంలో నీలాద్రిరాజు అక్కడ వుండి తీరాలని ఫర్మానా జారీ చేశాడు; అలా జరిగిందో లేదో, జరిగితే అక్కడి సన్నివేశం ఎంత రసవత్తరంగా వుందో మనకి తెలీదు.

జగ్గకవి చంద్రరేఖా విలాపాన్ని 1730 ప్రాంతాల్లో రాసి వుంటాడని పరిశోధకులు భావిస్తారు.

దీని గురించి ఇప్పుడు మనకు దొరికే లిఖిత అభిప్రాయాల్లో మొదటిది సి. పి. బ్రౌన్ ది, బహుశా 1830 ప్రాంతంలో. అతను దీన్ని సంస్కరింపజేసి వ్యాఖ్యానం కూడ రాయించాడు. అతని దగ్గరున్న ఒక ప్రతిలో అతను కొంత విపులంగానే నోట్స్ రాశాడు. వాటి ప్రకారం అతను ఈ కథని నమ్మదగ్గదిగా అనుకోలేదు; వట్టి కట్టుకథని అనుకున్నట్టు కనిపిస్తుంది. అతను రాసిన మరో విషయం — దీన్ని సంస్కరించటానికి అతను పెట్టుకున్న ఒక పండితుడు (ఎవరో మనకు తెలీదు) దీన్ని చదువుతూ ఆపకుండా పగలబడి నవ్వాట్ట.

ఆ తర్వాత 1897లో వచ్చిన “ఆంధ్ర కవుల చరిత్రము”లో కందుకూరి వీరేశలింగం కూడ పై కథని నమ్మినట్టు కనపడడు — ఈ కథ రాస్తూనే, అన్నటికీ “ట” అని చివర్లో తగిలించటం బట్టి (వచ్చాడట, ఇచ్చాడట, .. ఇలాగ). ఐతే ఆ తర్వాతి తెలుగు విమర్శకులు మాత్రం కథ మొత్తం నమ్మినా నమ్మకపోయినా “ఒళ్లు మండిన ఒక కవి నోటికొచ్చినట్టు రాసిన బూతుపురాణం”గా ఒప్పేసుకున్నారు. 1910లో కె. గోపాలరావు అనే అతను బ్రౌన్ తయారుచేయించిన ప్రతిని తీసుకుని అందులో అతనికి అశ్లీలంగా అనిపించిన పద్యాలన్నిటిని మార్చాడు — కొన్నిటిలో పదాలు మార్చి, మరికొన్నిటిని పూర్తిగా తీసివేసి, ఒక కొత్త కావ్యాన్ని తయారుచేశాడు, అచ్చువేశాడు. ఐతే ఆ తరవాత పాఠకులంతా తన ప్రతినే చదువుతారని, జగ్గకవి రాసిన మూలప్రతిని మరిచిపోతారని ఆశించిన అతని ఆశలు ఫలించలేదు. 1912లో పాండిచేరిలో కామగ్రంథమాల అనే సంస్థ దాని మూలప్రతిని ప్రచురించింది.

ఆ తర్వాత ఆరుద్ర తన “సమగ్ర ఆంధ్ర సాహిత్యం”లో కూడ దీన్ని బూతుకావ్యంగా లెక్కవేశేశాడు, మిగిలిన విషయాలేవీ ప్రస్తావించకుండా, ఒక పూర్తివాక్యం కూడ దీనికి కేటాయించకుండా. 1990లో వెలుదండ నిత్యానందరావు కొంత కొత్తగా చూస్తూ “చంద్రరేఖా విలాపం — తొలి తెలుగు వికట ప్రబంధం” అనే చిన్న పుస్తకం ప్రచురించాడు (అదతని యం. ఫిల్. పత్రం).

ఈ మధ్య 2021లో కర్రి రామచంద్రారెడ్డి, డేవిడ్ షుల్మన్‌లు ఒక పరిశోధనా పత్రం ప్రచురించటంతో, షుల్మన్ శంఖంలో పడి ఇప్పటికిది తీర్థమైంది (ఆ పత్రంలోని విషయాల్ని షుల్మన్ ఒక ప్రసంగంలో వివరించాడు కూడ, అది యూట్యూబ్‌లో దొరుకుతుంది). అతను అదివరకు వినిపించని కొన్ని లోతైన విషయాల్ని బయటపెట్టటమే కాక, తెలుగులో ఇది బహుశా అత్యంత విలక్షణమైన ఏకైక ప్రబంధం అని కూడ సర్టిఫికెట్ ఇచ్చాడు. ఐతే, వాళ్లూ ప్రముఖంగా “ప్రతీకార కావ్యం” కథనే జన్మవృత్తాంతంగా (origin story) స్వీకరించారు.


జగ్గకవి తన కావ్యం ఉపోద్ఘాతంలో చెప్పింది ఇది — నీలాద్రిరాజు జగ్గకవికివ్వటానికి డబ్బు లేదంటూ, ఇలాటి (అంటే జగ్గకవి చించేశాడని పై కథలో చెప్పిన) శృంగార కావ్యాల వల్ల డబ్బు దండగ తప్ప ఒరిగేదేమీ లేదని, తనకో హాస్య ప్రబంధం ఖర్చు లేకుండా రాసిపెట్టమని అడిగాడని, తనూ ఒక హాస్యప్రబంధం రాయలనుకుంటూ ఉండటంతో అలాగేనని “హాస్యరసప్రబంధాన్ని” రాస్తున్నాననీ చెప్తాడు. నీలాద్రి మీద కోపంతో రాస్తున్నదీ లేనిదీ చెప్పలేదు.


ఇక్కడ నేను “చంద్రరేఖా విలాపం”లో హాస్యప్రబంధం కావటానికి కావలసిన సామాగ్రి పుష్కలంగా వుందని చూపిస్తాను. కనుక అది నిజంగా, కవి స్వయంగా చెప్పుకున్నట్టు హాస్యప్రబంధమే అని నా వాదన. (అన్నట్టు ఇక్కడ ఉన్న విషయమంతా నాది, నా సొంతం; ఏ కృత్రిమమేధ సహాయమూ ఈ వ్యాసకల్పనలో లేదు. అలాగే, ఈ వ్యాసంలో ఎక్కడా ఎవరి మనోభావాలని బాధించే పద్యాల్నీ ఉదహరించటం లేదు.)


రెడ్డి, షుల్మన్‌లు ఇది ప్రతీకారకావ్యం అని చెప్పటానికి ఇందులోని తొలిపద్యాన్ని ఉదహరిస్తారు.

శా.
శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడ
స్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం
డాకాశోజ్వ్జల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
వీకం జింతలపాటి నీలనృపతిన్‌ వీక్షించు నేత్రత్రయిన్‌

ఈ పద్యం శ్రీకంఠుండు … నీలనృపతిన్‌ వీక్షించు నేత్రత్రయిన్‌ అంటుంది గనక కావ్యం ఖచ్చితంగా అతని మీద కోపంతో శాపాలు పెడుతూ రాసిందని, శివుడి మూడో కన్ను ఎదుట వున్న వాళ్లని భస్మం చేస్తుంది గనక కవి కోరుతున్నది అదేననీ తీర్మానించారు. కాని కొంచెం ఆలోచిస్తే, కవి ఆలోచన అదే ఐతే ఆ మాటే అనొచ్చుకదా, మూడు కళ్ల ప్రస్తావన ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. అంత ముందూ వెనకా ఆలోచించకుండా రాసేపాటి కవి కాదు అతను. పైగా ఈ కావ్యాన్ని బండబూతులు తిట్టేవాళ్లు కూడ అతని కల్పనాశక్తిని, శబ్దం మీద, పద్యం మీద అతనికున్న అధికారాన్ని కాదనలేరు (బ్రౌన్ కూడ అతని దగ్గర పనిచేసే పండితుడు ఈ కావ్యం చదువుతూ దాన్లోని శబ్దశక్తికి ముగ్ధుడయాడని రాసుకున్నాడు). కనుక, “నేత్రత్రయిన్‌” అనేది కవి కావాలని చేసిన ప్రయోగం — మూడో కంటినుంచి మంటలు రావొచ్చుగాని మిగిలిన రెండూ శుభంకరాలే.

ఇలా తొలిపద్యంతోనే, కవి ఈ కావ్యాన్ని ఊరికే పైపైన చూడొద్దని, ఆలోచించి చదువుకోమని సూచిస్తున్నాడు. సాహిత్యం ఆలోచనామృతం అన్నారు కదా.

ఇది హాస్యరసప్రబంధం ఐతే, ఇన్ని బూతులతో పనేమిటి?

జగ్గకవికి వందేళ్ల ముందువాడైన కుందవరపు కవిచౌడప్ప ఇలా అన్నాడు –

కం.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు బుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవిచౌడప్పా

బూతులుంటే తప్ప నవ్వుపుట్టకపోతే మరి ఎంత ఎక్కువగా బూతులైతే అంత నవ్వు అనే ఆలోచన వుండివుండొచ్చు. పైగా,

ఉ.
అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్‌
పూర్ణుడవీవు సత్కవిత; బూతులరీతుల గోరు కొండగా
వర్ణనసేయ నేరుతువు వాతెము జుల్కగ పల్కు మూర్ఖులన్‌
తూర్ణమె తిట్టి చంపుదువు ధూర్తవు, పౌరుషశాలివెంతయున్‌

అని నీలాద్రి తనగురించి అన్నట్టు రాసుకున్నాడు జగ్గకవి. అనేకసంస్థానాల్లో తిరిగాడు కనక ఎలాటి కవిత్వం జనానికి నవ్వు తెప్పిస్తుందో చూసి వుంటాడు. అందులో గొప్ప ప్రావీణ్యత సాధించిన మాట నిజం.

కొంచెం జాగ్రత్తగా చూస్తే అసలు కావ్యం ఉపోద్ఘాతమే హాస్యదాయకం. అనౌచిత్యంవల్ల హాస్యం వస్తుందని, ఊహించిన దానికి జరిగే దానికి వుండే వ్యత్యాసంనుంచి అనౌచిత్యం వస్తుందని సంస్కృత అలంకార శాస్త్రాలు వివరించినయ్. ఈ దృష్టితో చూస్తే నీలాద్రిరాజు కొలువులో జరిగే తతంగమంతా అనౌచిత్యంతో నిండిపోయి కనిపిస్తుంది. జగ్గకవి వెళ్లేసరికి నీలాద్రిరాజు సింహాసనం మీద ఉన్నాట్ట — ఎలా వున్నాడు? వేశ్య చంద్రి (చంద్రరేఖ) ఒళ్లో తలపెట్టుకుని పడుకుని. చుట్టూ వేలకొద్ది వేటకుక్కలు అతన్ని నాకుతున్నయ్. సారాకంపు గుప్పుమంటుంటే తురకనేస్తాలు చెవిలో గుసగుసలాడుతున్నారు.

ఎంత చిన్న రాజైనా, ఇలాటి కొలువుని ఎవరైనా ఊహిస్తారా? అందులోనే హాస్యం. ఇకపోతే, అక్కడ అలవోకగా పడ్డ ఒక చిన్న ప్రయోగం చూడండి:

అలరు కొప్పాక గ్రామసింహాసనమున
కడక తళుకొత్త పేరోలగమున నుండి

“గ్రామసింహాసనమున” — చమత్కారం గమనించారా?

సరే, కూర్చున్నాడు, బాగానే వుంది. అలాటి సన్నివేశం చూస్తే ఎవరికైనా వెంటనే కలిగే అభిప్రాయం ఈ రాజు మహా పనికిమాలినవాడని కదా! కాని అతని మాటలు చూడండి:

తే.గీ.
సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాగ
నంది రవియెల్ల జగతి నందంద యణగె
ఘనత జగదేకవిఖ్యాతి కలుగదయ్యె
వ్యర్థమయ్యె పదార్థంబు వారిదెల్ల
కం.
అపకీర్తియు కీర్తియు భువి
నెపుడుం పోకుండు; కీర్తి కియ్యగవలయున్‌
విపులముగ ధనము; మాకిపు
డుపకారము గాగ చెప్పు మొకకృతి సరగన్‌

కావ్యాల్ని కొనటం అమ్మటం, దానివల్ల కలిగే లాభనష్టాల గురించి ఎంతో లోతైన అవగాహన వుంటే తప్ప ఇంత చిన్న మాటల్లో ఇంకెవరూ అనని విషయాన్ని అలాటివాడి నోటినుంచి ఊహించగలమా? ప్రతి పద్యాన్ని అనూహ్యంగా తిప్పటంనుంచి హాస్యాన్ని సృష్టిస్తున్నాడు కవి.

ఒకటి రెండు షష్ట్యంతాల్ని కూడ చూసి ముందుకు వెళ్దాం. సామాన్యంగా షష్ట్యంతాలంటే సమాసభూయిష్టంగానూ అవతలి వ్యక్తిని ఆకాశానికెత్తేస్తూనూ వుంటాయి కదా, ఇవి చూడండి –

కం.
నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్‌
ప్రాచుర్యవికారునకున్‌
రాచినృపకులాబ్ధి గరళరససారునకున్‌
కం.
అతిమూఢశీలునకు సం
తత మృగయాఖేలునకున్‌ దాసీవనితా
వితత రతిలోలునకు ఘన
పతిత కుజన పాలునకును పతయాళునకున్‌

అదివరకు చూసిన కావ్యాల షష్ట్యంతాల నుంచి మనం ఏం ఊహించుకుంటామో దానికీ దీనికీ ఏమైనా పోలిక వుందా — సమాసాలు తప్ప? కాని ఒక్కో సమాసమూ చిరునవ్వైనా పుట్టించకమానదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ముందుకు కదుల్దాం. ప్రబంధాల్లో ఒక లక్షణం, దూరంగా వున్న ప్రేయసీప్రియులు విరహంతో ప్రకృతిలోని అందమైన వస్తువులు జంతువుల్లో వాళ్ల ప్రియుల రూపాల్ని చూసుకోవటం, వాటితో మాట్లాడటం. నిజానికి భాగవతంలోని ఈ పద్యం ఎంతో ప్రఖ్యాతం (భాగవతం ప్రబంధం కాకపోయినా గుర్తుచేసుకోదగ్గ పద్యం) –

ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పై
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!

ఇప్పుడు జగ్గకవి రాసిన ఈ పద్యం చూడండి. ఇది పైపద్యం సరళినే అనుసరిస్తుంది:

ఉ.
పోడులమ్రోడులార కడు పూచిన పీతిరితుమ్మలార బల్‌
బాడిదచెట్టులార ఫలభాగ్‌ విషముష్టికుజంబులార ఆ
వేడుకకత్తె చిత్తమున వేడుకమీరగ వేగిరంబు మీ
నీడకు నీడకొక్కసరణిం పరతెంచదుగా వచింపరే

సరే, నీలాద్రి చంద్రికోసం పరితపిస్తూ వుంటే బాపన్న అనే పండితుడు అతన్ని ఇది తగని పని మానుకోమని సలహా ఇస్తాడు. ఆ బాపన్న ఎలాటివాడో కవి ఇలా చెప్తాడు:

“పండితుండును నిష్టాగరిష్ఠుండును సుజ్ఞాననిపుణుండును హితుండును బ్రాహ్మణాగ్రగణ్యుండును శాంతుండును సకలజన సమ్మతుండును చతురుండును ప్రయాగవంశోత్తంసుండును అగు బాపన్న ఆపన్నుండై ఆ పగిది వాపోవుచు కన్నులు తేలవైచుచున్న ఆ నీలాద్రి మన్నురేనిం కనుంగొని వినయ విసంభ్ర గాంభీర్యంబులు గుంభింప గంభీర భాషంబుల మెల్లమెల్లన యిట్లనియె-”

ఇప్పటికిది బాగుంది. ఐతే ఆ మాటలకి నీలాద్రి ప్రధాని ఆదుర్తి భీమయ్యకి మహాకోపం వచ్చింది:

“అప్పు డప్పలుకులు విని కటకటంబడి కటమదర పండ్లు పెటపెటం గొరికి చటుల క్రోధ కుటిలారుణలోచనుండై తదీయ ప్రధాన ప్రధానుండగు ఆదుర్తి భీమ నామ మంత్రి అతని కిట్లనియె”

ఇప్పుడు చూడండి: ఇతను ప్రధానమంత్రి; అవతలివాడు పండితుడు, నిష్టాగరిష్టుడు. ఆ భీమమంత్రి ఏమంటాడు?

కం.
ఓంభూలు చేసికొంచును
జంభంబులు కొట్టుకొనుచు జడమతి నశుభా
రంభము లరయుచు తిరిగెడి
దంభపు విప్రునకు నీకు తగదిది చనుమా
ఆ.వె.
పప్పుదప్పళంబులొప్ప తప్పొప్పులు
సెప్పుకొంచు తడక విప్పుకొంచు
చదువుకొంచు తిరుగ ఛాందసుల్‌ మీరలు
రాచకార్యములకు రాగ తగునె

ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో గమనించారా?

ఆ నిష్టాగరిష్టుడి సమాధానం వినండి:

కం.
నిష్ఠవిహీనుండవు ఘన
నిష్ఠుర మాయాప్రలాపనిపుణుడ వీవే
జేష్ఠ వితని నియోగి
జ్యేష్ఠుల లోపలను చేర్చి చెప్పగనేలా

మొత్తానికి వ్యవహారం కుల శాఖల కొట్లాటల్లోకి దిగిపోయింది కదా! ఇదేనా మనం ఆశించేది మంత్రులూ పండితులనించి?

ఇలాటి అసంబద్ధ సంఘటనలు, సంభాషణలు, ప్రవర్తనలు కావ్యం నిండా కనిపిస్తయ్. ఈ కొద్దిపాటి ఉదాహరణలు ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగానే చూపించాయనుకుంటాను — ఈ కావ్యంలో మనం గమనించవలసింది పాత్రల ప్రవర్తనలు వాటినుంచి మనం ఆశించే ప్రవర్తనలనుంచి ఎంత దూరంగా, ఎంత విచిత్రంగా వుంటాయనేది. తనకి శృంగారప్రబంధం రాసిచ్చిన కవిని “దీనికి నేను డబ్బులివ్వలేనుగాని నాకు ఇంకోటి ఉచితంగా రాసిపెట్టు” అనడటం ఎంత అసంగతమో, “నిష్టాగరిష్టుడు, శాంతమూర్తి ఐన బ్రాహ్మణోత్తముడు” నియోగీ వైదీకీ అని కొట్లాడుకోవటం అంత అసంగతంగానూ లేదూ? నీలాద్రికి సంస్కృతంలో అలంకారశాస్త్రం రాసిచ్చిన వేంకటశాస్త్రి చంద్రి తల్లికి ప్రియుడై చేసే పనులూ మనకి పిచ్చెక్కిస్తయ్. అలాగే చంద్రీ ఆమె తల్లీ వివాదాలు, అడవికి పోయిన నీలాద్రి కోసం వెదుకుతూ చెలికత్తెలు అతని గురించి హడావుడిపడే విధానం — ఒక్కొక్కటి ఒక నవ్వుల గని.


రెడ్డి, షుల్మన్‌లు గమనించిన మరో విషయం ఈ కావ్యంలో వాడిన “గ్రామ్య” భాష — చాల పాత్రలు అతి స్వాభావికమైన, పల్లెటూరి మాటలు మాట్లాడతయ్. మామూలుగా కావ్యాల్లో గ్రామ్య భాష నిషిద్ధం. మరి జగ్గకవి దాన్ని ఇంత విరివిగా ఎలా వాడినట్టు? దానికి సమాధానం మనకు ఇక్కడ దొరుకుతుంది:

ఆంధ్ర భాషా భూషణం అనే తెలుగు అలంకారగ్రంథంలో మూలఘటిక కేతన (ఇతను తిక్కన ప్రియశిష్యుడు) ఇలా అంటాడు:

ఆ.వె.
తత్సమంబు దక్క తక్కిన నాలుగు
నచ్చతెలుగులందు రఖిల జనులు
నందులోన గ్రామ్యమనగ నెవ్వరు నొప్ప
రొరుల దెగడు చోట నొప్పు నదియు

చివరి పాదం చూశారుగా — అది ఒకే ఒక్క సందర్భంలో గ్రామ్యభాష సాధువే అని ఒప్పుకుంది. ఏ సందర్భంలో? ఎవరినైనా తిట్టేటప్పుడు! జగ్గకవి తనను తను పరిచయం చేసుకుంటూ మొదల్లోనే తను అలంకారశాస్త్రంలో ప్రవీణుడినని ఎందుకు చెప్పుకున్నాడో ఇప్పుడర్థమైంది కదా, దీనికీ దానికీ లంకె!

మ.
సరసాగ్రేసరు కూచిమంచికుల భాస్వద్వార్థి రాకావిధున్‌
చిరకీర్తిన్‌ బహుళాంధ్రలక్షణవిదున్‌ శ్రీమజ్జగన్నాథ సు
స్థిర కారుణ్యకటాక్షలబ్ధ కవితాధీయుక్తునిన్‌ జగ్గరా
డ్వరనామాంకితు నన్ను చూచి పలికెన్‌ వాల్లభ్యలీలాగతిన్‌

ఈ దృష్టితో చూసినప్పుడు అసలు ఉపోద్ఘాతంలో ఉన్న కథంతా ఉత్తుత్తిదేనా అన్న అనుమానం కలక్క మానదు. మీరు తిట్లూ బూతుల్తో లక్షణశాస్త్ర సమ్మతంగా ఒక కావ్యం రాయాలనుకున్నారనుకోండి, దానికి కావలసిన పూర్వరంగం ఏమిటి? కేతన ప్రకారం తిట్టటానికి దారి తియ్యగలిగిన పరిస్థితుల్లో మీకు అనుమతి దొరుకుతుంది. కనుక, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు, ఇక్కడ కావ్యం ఆలోచన ముందా డబ్బెగ్గొట్టిన కారణం ముందా అన్న సందేహం కలక్క మానదు.

ఈ ఆలోచనకి బలాన్నిచ్చే రెండు ఆధారాలు మనకి కనిపిస్తున్నయ్. ఒకటి — ఈ కావ్యంలో “అశ్లీలతల్ని” కడిగేస్తూ తిరగరాసిన గోపాలరావు మరో పని కూడ చేశాడు. దీన్లో ఉన్న పాత్రల పేర్లన్నీ మార్చేశాడు. ఉదాహరణకు చింతలపాటి నీలాద్రిరాజు కాస్తా చీమలకొండ సింగరాజుగా, వేంకటశాస్త్రి సంకరశాస్త్రిగా … ఇలా నామాంతరాలు చెందారు. దానికి అతను ఇచ్చిన కారణం: మూలంలో ఉన్న పేర్లు కావ్యం అసలు విషయాన్ని మరుగున పరుస్తాయని (అతని దృష్టిలో ఇదొక గొప్ప సంఘసంస్కరణ కావ్యం. పదవుల్లో వున్న వాళ్ల ప్రవర్తనల్ని బాహాటంగా అత్యంత స్వాభావికంగా కళ్లకు కట్టించింది గనుక). కావ్యనిర్మాణానికి మూలం నిజంగా జరిగిన ఒక కథ అనుకుంటే, ఆ కథ లేకుండా కావ్యానికి అర్థమే వుండదు కదా! రెండవ ఆధారం దీన్లో నీలాద్రిరాజుని చిత్రించిన విధానం. జగ్గకవికి అతని మీద అంత కోపమే వుండి, అందుకోసమే ఈ కావ్యం రాసి వుంటే, అతన్ని ఇంకా ఘోరంగా చిత్రించి వుండొచ్చు. అసలా దృష్టితో చూస్తే ఈ కావ్యంలో అత్యంత నీచమైన పాత్ర నీలాద్రిది కాదు, వేంకటశాస్త్రిది. అతన్ని మరీ జుగుప్సాకరంగా ఇక్కడ చెప్పటానికి వీల్లేని విధంగా చిత్రించాడు జగ్గకవి. కనుక జగ్గకవి ఎవరిమీదనైనా పగతీర్చుకుంటూ వుంటే అది నీలాద్రి కాకుండా వేంకటశాస్త్రి కావటానికి ఎక్కువ అవకాశం వుంది. అలా ఐతే మళ్లీ “డబ్బివ్వని రాజుని తిట్టిపోసిన కథ” కథ నిలబడదు.

ఏమైనా, పైపైకి కనిపించే బూతుమాటల్ని చూసి, అధునాతన క్రైస్తవ-విక్టోరియన్ నీతి భావాల్ని వంటబట్టించుకున్న కొందరు విమర్శకులు ఈ కావ్యాన్ని చదవకుండానే బూతుకావ్యమనే ముద్ర వేసేసి ఆంగ్లేయుల చేత నిషేధింప జేసి ఆ తర్వాత వచ్చే వాళ్లు కూడ పెద్దగా పట్టించుకోకుండా చేశారని నా అనుమానం.

లోతుగా చూస్తే దొరికే మరో ఆణిముత్యాన్ని చూపించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

నీలాద్రిరాజు జగ్గకవి మొదట రాసిన కావ్యానికి ఇవ్వటానికి డబ్బు లేదని, మరో హాస్యప్రబంధాన్ని ఊరికే రాసిపెట్టమని అడగాడు కదా. అందుకు అతని కారణం డబ్బు లేకపోవటం ఒకటేనా? అలా ఐతే డబ్బు వచ్చాక ఇవ్వొచ్చు కదా, ఇంత గొడవెందుకు?

ఈ పద్యాలు చూడండి:

నీలాద్రి ఏమంటున్నాడు? ఆ పద్యాల క్రమం గమనించండి.

కం.
అని మున్ను సత్ప్రబంధం
బొనరింపుమటంచు చెప్పియుంటిమి వెస న
ట్లనె రసముగ చెప్పితి వది
గొన నిపుడు ధనంబు లేదు కొదువ లభించెన్‌
సీ.
విను మదియెట్లన మనుజులు నామీద
బిట్టుగ చలమూని విజయరామ
ధరణీశుతో చెప్ప దండుగ పన్నెండు
వేలరూపాయలు వేగగొనియె
నిచ్ఛాపురంబులో నేనొక్క లంజతో
భోగించి నిద్దుర బోవ చోరు
లెలమి డేరా చొచ్చి బలువైన గుఱ్ఱంబు
వెండిపల్లము పదివేలవరాల
తే.గీ.
సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి
సాటిదేశంబు రాయభూషణుడు ద్రొబ్బె
తప్పె భాగ్యంబు నిర్భాగ్యదశ లభించె
తవిలి సత్కృతి గొన పదార్థంబు లేదు

ముందుగా, నువ్వు నేనడిగినట్టుగా “సత్ప్రబంధం” రాసిచ్చావు; ఆ తర్వాత నా డబ్బంతా పోయింది; ఇప్పుడేం మిగల్లేదు. అంటే, అతను ఆ రెంటికీ ముడిపెట్టి నువ్వు రాసిన కావ్యం మూలాన నా డబ్బంతా పోయింది అంటున్న ధ్వని స్పష్టంగానే వుంది కదా! అందువల్ల ఆ పోయిన డబ్బుకి నీదే బాధ్యత, అది తీర్చటానికి నాకు మరో కావ్యాన్ని ఊరికే రాసిపెట్టమని అడుగుతున్నాడన్న మాట.