అయ్యగారు – కొత్త డాక్టరు

అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ ఎడతెగక పారే ఏరు, ద్విజుడు ఉన్న ఊళ్ళో నివసించమని సుమతీకారుని హితవు. అప్పు దొరకని వాళ్ళు ఉంటారు కానీ అప్పిచ్చేవాళ్ళూ, ద్విజులూ లేని ఊళ్ళు తెలుగు దేశంలో బహుశా ఉండవు. పుష్కలమైన నీటి వసతీ, నమ్మకమైన వైద్య వసతీ ఉన్న ఊళ్ళు మాత్రం బహు తక్కువ.

మా ఊరు రావినూతలకి నదీ, కాలువలు లేకపోయినా, నేను పుట్టే నాటికే (1959) మా ఊళ్ళో ఓ ఆసుపత్రి ఉండేది. దాని అధిపతి పొత్తూరి యజ్ఞ రామకృష్ణారావు (RMP) గారు. కానీ ఆ పేరు బహుశా పోస్టుమాన్‌కి తప్పించి మరెవరికీ తెలియదు. ఊరంతటికీ ఆయన ‘అయ్యగారే’.

అయ్యగారి దర్బారు

దేవులపల్లి ‘మా ఊళ్లో రావిచెట్టు’ అన్న వ్యాసంలో ఇలా రాశాడు:

“ఆ రోజుల్లో మాకు రావిచెట్టు భారత రామాయణ కాలాలకి మొదటి మెట్టు… ఇవే కావు మా రావిచెట్టుకి కావలసినవీనీ, అది ఆలకించేవీనీ. మా గ్రామంలో గూడా దానికి తెలియని సంగతే లేదు; దాని చెవిబడని గుట్టే లేదు. ఇంట్లో రట్టు హమేషా తప్పుకోలేక, కాస్త ఇవతల పడాలని ఎవరికైనా ఉంటే, రావిచెట్టు కిందికి చేరేవాడు… చేలగట్ల తాలూకువీ, … గొడ్డూ గోదాకు సంబంధించినవీ, తగాదాలు గూడా, మునసబు కరణాల పరిష్కారానికి ముందూ, తరువాతా…. ఇలాటివెన్నో రావిచెట్టు వినేది, కనిపెట్టేది… దానికి ఎరుక ఎక్కువ; రావిచెట్టు బోధివృక్షం. దానికి దయ గూడా ఎక్కువ.”

రావిచెట్టులా కేవలం విని ఊరుకునే తత్వం కాదు అయ్యగారిది.

పొత్తూరి యజ్ఞ రామకృష్ణారావు — ‘అయ్యగారు’పొత్తూరి యజ్ఞ రామకృష్ణారావు — ‘అయ్యగారు’

అయ్యగారి ఆసుపత్రి ఓ పెద్ద పెంకుటింట్లో ఉండేది. వాకిలి పక్కనే ఓ పెద్ద బల్ల; ఎదురుగా ఆయన కుర్చీ; అటూ ఇటూ బెంచీలు. రోగిని పక్కన కూర్చోబెట్టి పరీక్షించేవాడు.

అయ్యగారు ఖద్దరు పంచె, లాల్చీ ధరించి, నుదుట బొట్టు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు. మధ్యమధ్యలో ముక్కుపొడి పీల్చేవాడు. మధ్యాహ్నానికి ఇంటినుంచి అమ్మగారు పంపిన రసం అక్కడే తాగేవాడు. ముక్కుపొడి, రసం, వైద్యం, ఊరి కబుర్లు—అన్నీ ఆ దర్బారులోనే, అందరి కళ్లముందే.

“ఏదీ, బాగా గాలి పీల్చు,” అని స్టెతస్కోప్ పెట్టి విని, మళ్ళీ వెంటనే పక్క బల్ల మీదున్న పెద్దమనిషితో సంభాషణలోకి వెళ్ళిపోయేవాడు.

అది ఊరి రాజకీయాలు కావొచ్చు, ఈ బజారు వాళ్ళు ఆ బజారు వాళ్ళ మీదున్న కక్ష సాధింపులు కావొచ్చు, పంటల విశేషాలు కావొచ్చు — ఆయన తలదూర్చని విషయముండదు. ప్రతిదాని మీదా ఓ చెణుకు, పకపకా నవ్వు.

ఆ కబుర్ల మధ్యలోనే మనల్ని ఆయన ఎప్పుడు పరీక్షించి వైద్యం పూర్తిచేశాడో ఆయనిచ్చిన చీటీ చేతికొచ్చేవరకూ తెలిసేది కాదు.

కారుణ్యం

అయ్యగారి దర్బారులో ఊరి కబుర్లకి ఎలాంటి హద్దులూ లేకపోయినా, ఊరి జీవితంలో మాత్రం ఎవరి స్థానం ఏమిటో అందరికీ తెలిసిందే. ఊళ్ళో అంతా అక్కా, అన్నా అని పిలుచుకున్నంత మాత్రాన తరతమ భేదాలు లేవని కాదు. నేను నా స్నేహితులని “ఒరే” అని పిలిస్తే, మా నాయనమ్మ, “ఆసాముల పిల్లల్ని ఒరే అని పిలుస్తావేమిట్రా?” అని మందలించేది.

తెనాలిలో పుట్టి పెరిగిన కొడవటిగంటి, తన దగ్గరి బంధువులంతా పల్లెటూళ్లలో ఉండేవారనీ, అక్కడి ఆచారాలూ, పద్ధతులూ ఆశ్చర్యమూ, అసహ్యమూ కలిగించేవని అంటూ, తన చిన్నతనపు అనుభవాన్ని రాశాడు:

“నేను అయిదేళ్ళవాణ్ణి అయి ఉండగా మా పెత్తండ్రి వెంట వాళ్ళ గ్రామానికి కాలినడకన బయలుదేరాను. రోడ్డు లేదు. పొలాల గట్లమీదుగా నడిచాం. దారిలో కొందరు మనుషులు ఎదురైనప్పుడు మా పెత్తండ్రి, ‘ఒరే, తొలుగు!’ అనేవాడు. అవతలివాడు గట్టుదిగి దూరంగా వెళ్ళేవాడు. ఇది నాకు చాలా ఘోరంగా కనిపించింది. అస్పృశ్యతను ప్రత్యక్షంగా చూడటం అదే నాకు మొదటి అనుభవం. నేను నా జీవితంలో ఎన్నడూ ఒక మనిషికి దూరంగా పోలేదు. ఇంకొకర్ని పొమ్మనలేదు.”

కొడవటిగంటికి మరో రెండు తరాల తర్వాత వాడిని నేను. బడిలో “అంటరానితనం మహాపాపం” అని చదివేవాళ్ళం. ఊళ్ళోకొస్తే హోటల్లో మాల, మాదిగ వాళ్ళకి గ్లాసులు వేరుగా ఉండేవి; వాళ్ళు బల్లమీద కూర్చునే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎండకు మాడి దప్పికతో ఎవరి ఇంటికన్నా వచ్చి నీళ్ళు అడిగితే దోసిట్లో నీళ్ళు పోసేవాళ్ళు.

జాషువా ‘గబ్బిలము’ లో ఆక్రోశించాడంటే ఆశ్చర్యమేముంది:

“ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు”

ఓ రోజు ఒంట్లో బాగుండకపోతే, మా నాన్న పోరు పడలేక అయ్యగారి దగ్గరికి పోయాను. గోడ పక్క బల్ల మీద కూర్చున్నా. నాకంటే వెనుక వచ్చిన వాళ్ళని చూస్తాడు కానీ ఎంతసేపటికీ నన్ను పిలవడే.

“ఆఁ, ఆ పెద్దోళ్ళందరినీ చూసిగాని మనల్ని పిలవడీయన,” అని గొణుక్కుంటూ కూర్చున్నా.

చివరకు నన్ను పిలిచి, పరీక్ష చేసి, మందుల చీటీ రాసిచ్చాడు. మందుల షాపు అంటూ వేరేగా ఏమీ లేదు. పెంకుటింట్లోనే ఓ మూలన కాంపౌండరు చీటీ తీసుకొని మందు ఇవ్వడం; ఖాతాలో ఖరీదు రాయడం.

చీటీ మీద A.P. అని రాసి ఉంది.

కాంపౌండర్ని అడిగా, “A.P. అంటే ఏమిటి?”

“Actual Price,” అన్నాడు. “మీ వాళ్ళందరికీ అయ్యగారు అసలు ధరకే ఇస్తాడు.”

ఇది జరిగి యాభై ఏళ్ళు దాటినా, తలచుకున్నప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తాయి.

కొత్త డాక్టరుగారి కన్సల్టింగ్ గది

డా. ఈడ్పుగంటి హృదయనాథ్డా. ఈడ్పుగంటి హృదయనాథ్

నేను ఎనిమిదో తరగతిలో ఉండగా, 1972లో, తెనాలి ప్రాంతంనుంచి అప్పుడే చదువు ముగించుకొని వచ్చిన ఈడ్పుగంటి హృదయనాథ్ (MBBS) గారు పెద్ద బజారులో పాడుబడిన సత్రాన్ని శుభ్రం చేసి కొత్త ఆసుపత్రి పెట్టారు.

మా ఇంటి గొందినుంచి బజారుకి వచ్చి, కుడివైపు పది అడుగులు వేస్తే కొత్త ఆసుపత్రి, ఎడమవైపు పాతిక అడుగులు వేస్తే పాత ఆసుపత్రి. నాల్రోజుల్లోనే కొత్తా, పాతా వాడుకలోకొచ్చేశాయి. మా నాన్నకు అయ్యగారి మీద ఉన్న గురి, పాత అనుబంధంవల్ల మేం పాత ఆసుపత్రికే వెళ్ళేవాళ్ళం.

కొత్తాసుపత్రి పూర్తిగా భిన్నమైన ప్రపంచం. పంచలో ఓవైపు తడిక కట్టి, డాక్టరు–పేషెంటు మధ్య ప్రైవసీ కోసం కన్సల్టింగ్ రూమ్‌లా ఏర్పాటు చేశారు. కన్సల్టింగ్ ఫీజు కూడా ఉండేది—స్వల్పమే. ఆసుపత్రి ఆవరణలోనే డాక్టరుగారి బంధువొకరు మందుల షాపు పెట్టారు.

ఆపరేషన్లు అవీ చెయ్యాల్సి వస్తే అయ్యగారు ఒంగోలుకో, చీరాలకో పంపేవారు. హృదయనాథ్ గారు ఫిజిషియనే కాక సర్జన్ కూడా కావడంతో పట్టణాలకి పోవాల్సిన అవసరం తగ్గింది.

క్రమక్రమానా అయ్యగారి దగ్గరకొచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది. కానీ ఆయనెప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. అందులోనూ ఊరి బాతాఖానీకి మరింత తీరిక.

ఊరికో భరోసా

హృదయనాథ్ గారి ప్రాక్టీసు బాగా వృద్ధి అయింది. రావినూతల చుట్టుపక్కల ఊర్లనుంచి కూడా జనాలు వచ్చేవాళ్ళు. పగలూ రేయీ అని, పండగ పబ్బాలని, శని, ఆదివారాలని లేదు. ఎవరికి బాగులేకపోయినా వెనువెంటనే చికిత్స అందించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అప్పట్లో ఊళ్ళో ప్రమాదంలో గాయపడో, జీవితాన్ని భరించలేక అఘాయిత్యానికి తలపడో ప్రాణాపాయంలో పడితే, సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోయేవి. హృదయనాథ్ గారు ఊళ్ళో స్థిరపడిన తరువాత అలాంటి అత్యవసర కేసులకూ, ఇతర తీవ్రమైన జబ్బులకూ సకాలంలో చికిత్స అందడం మొదలైంది.

పట్టణాల్లో ఉద్యోగాలు చేసి రిటైరయి తిరిగి రావినూతలలో నివసించాలనుకున్న వాళ్ళకి, ఊళ్ళో హృదయనాథ్ గారు ఉన్నారన్నది పెద్ద భరోసా. ఆసుపత్రి పెట్టి యాభై ఏళ్ళయిన సందర్భంగా 2022లో మా ఊరి ప్రజలే కాక చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళూ కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఇటీవల ఆయన 75వ పుట్టినరోజుని ఊరి ప్రజలు పెద్ద వేడుకగా చేసుకున్నారు.

కొన్నేళ్ళ క్రితం ఊరికి వెళ్ళినప్పుడు బజార్లో నిలబడి ఉంటే డాక్టరుగారు చూసి ఇంటికి రమ్మన్నారు. చాలాకాలం అద్దె ఇంట్లో ఉండి, ఊరి చివర సొంత ఇల్లు కట్టుకున్నారు. చిన్న భవనం, పెద్ద తోట. రకరకాల పూల మొక్కలు.

పిల్లలు నగరాల్లో స్థిరపడ్డారు. భార్య అకాలమరణంతో డాక్టరుగారిది ఒంటరి జీవితం. అయినా తాను కన్నుమూసేదాకా రోగులకి సేవ చేస్తూనే ఉండాలని నిర్ణయించుకుని, ఊళ్ళోనే ఉన్నారు.

అయ్యగారి ఇంగ్లీషు

అయిదో తరగతినుంచే నాకు తెలుగు దినపత్రికలు చదివే అలవాటు అయ్యింది. వనమాల భూషయ్యగారి హోటల్‌కో, తమ్మన ఆంజనేయులుగారి హోటల్‌కో పోయి చదువుకునేవాణ్ణి. అప్పట్లో ఇడ్లీ దోశలు కొనుక్కునే స్తోమతు నాకు లేదు కానీ, ఊరికే వచ్చి పేపరు చదువుకుంటున్నానని హోటల్ యజమానులు ఎప్పుడూ నామీద విసుక్కోలేదు.

నేను ఇప్పటికీ పొద్దున్నే పేపరు చదవకుండా పని మొదలెట్టను.

బహుశా ఊళ్ళో అయ్యగారికొక్కరికే ఇంగ్లీషు న్యూస్‌పేపర్ వచ్చేది — హిందూనో, ఇండియన్ ఎక్స్‌ప్రెసో. నేనది చూసి, మనకున్న ఇంగ్లీషు పుస్తకం సంవత్సరమంతా చదివినా పూర్తి చెయ్యలేమే, ఈయన ప్రతిరోజూ ఇన్ని పేజీల ఇంగ్లీషు పేపరు ఎలా చదువుతాడా అని ఆశ్చర్యపోయేవాణ్ణి.

ఊళ్ళోకి అప్పుడప్పుడూ మెడికల్ రిప్రెజెంటేటివ్స్ వచ్చేవాళ్ళు. మా పల్లెటూరిలో వాళ్ళు కనిపించడమే ఓ విశేషం—చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంటూ షర్టూ, షర్టు టక్ చేసి, మెడకి టై, కాళ్లకి మెరిసే బూట్లు, చేతిలో నిగనిగలాడే మందుల బ్యాగు. వాళ్ళు అయ్యగారి దర్బారులో కూర్చుని ఇంగ్లీషులో మాట్లాడుతుంటే, నేను పక్కనే నిలబడి కుతూహలంగా వినేవాణ్ణి. అయ్యగారు కూడా వాళ్ళతో ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడుతుంటే మరీ ముచ్చటేసేది.

నేను ఇంటర్మీడీయట్‌కి విజయవాడ లయోలా కాలేజీలో చేరినప్పుడు ఇంగ్లీషు మీడియంనుంచి వచ్చిన పిల్లలు లావాటి ఇంగ్లీషు నవలలు చదవడం, అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడటం చూసి భయపడేవాణ్ణి. ఎవరూ లేనప్పుడు రీడింగ్ రూంకి వెళ్ళి ఇంగ్లీషు పేపరు నెమ్మదిగా చదువుకునేవాణ్ణి.

The Road Not Taken

పసివయసులోనే డాక్టర్లు నన్నింతగా ప్రభావితం చేసినా, నేను డాక్టర్ని ఎందుకు కాలేదు?

నేను తప్పకుండా డాక్టరునవుతాననుకున్నాను.

పదో తరగతి అయిపోయి ఇంటర్‌కు అప్లై చేస్తుండగా మా అన్నయ్య అడిగాడు:

“ఏం గ్రూప్ పెడుతున్నావ్?”

“BiPC.”

“BiPCనా? ఏం చేస్తావ్?”

“MBBS.”

“సీటు రావడం కష్టం.”

“కష్టపడితే అదే వస్తుంది.”

“తరవాత ఏం చేస్తావ్?”

“MD.”

“దాని తరవాత?”

“హాస్పిటల్ పెడతా.”

“పెట్టడానికి మనకి డబ్బులెక్కడున్నాయి?”

దానికి నా దగ్గర సమాధానం లేదు.

MPCలో చేరాను. ఇంజనీరునయ్యాను.

ఇంజనీరింగ్ మేధోపరంగా నాకు సంతృప్తినిచ్చిన మాట నిజమే. ఇప్పటికీ గణితం, భౌతికశాస్త్రం నాకు అభిమాన విషయాలే. కానీ వైద్యం వేరు, ఇంజనీరింగ్ వేరు.

చెదిరిన గుండెలను చక్కదిద్దడం

1997లో మా అన్నయ్యకి గుండె ఆపరేషన్ చేశారని తెలిసి, గుండె గురించి తెలుసుకుందామని చక్కటి బొమ్మలున్న ఓ పుస్తకం [1] చూస్తుండగా ఒక పేజీ నన్ను ఆకర్షించింది. దాని శీర్షిక “Mending Broken Hearts.”

మైకేల్ డిబేకీ (Michael DeBakey, 1908– 2008) రక్తనాళాల శస్త్రచికిత్సలో కొత్త మార్గాలు తెరిచిన గొప్పశస్త్రవైద్యుడు. దెబ్బతిన్న రక్తనాళం స్థానంలో అమర్చడానికి మృతదేహాలనుంచి తీసిన నాళాలకన్నా మన్నికైన, సులభంగా దొరికే కృత్రిమ ప్రత్యామ్నాయంకోసం ప్రయత్నించాడు.

డా. మైకేల్ డిబేకీడా. మైకేల్ డిబేకీ

అప్పటికి Orlon, Nylon, Dacron వంటి కొత్త కృత్రిమ వస్త్రాల్లో ఏది మంచిదో ఎవరికీ తెలియదు. డిబేకీ హ్యూస్టన్‌లోని దుకాణాలకు వెళ్ళి దొరికిన రకరకాల వస్త్రాలను కొనుక్కొచ్చి ప్రయోగాలు చేశాడు.

చిన్నప్పుడు తల్లి పక్కన కూర్చుని కుట్టుపని నేర్చుకున్న డిబేకీ, తన భార్య కుట్టుమిషన్‌పై ఆ వస్త్రాలను కావలసిన పరిమాణంలో కత్తిరించి అంచులు కుట్టి గొట్టాలుగా తయారుచేశాడు. అవసరాన్ని బట్టి వాటిని నేరుగా, వంపుగా, రక్తనాళం రెండుగా చీలే చోట Y ఆకారంలోనూ కుట్టేవాడు. మొదట వాటిని జంతువులపై పరీక్షించాడు. అమర్చిన తరువాత రక్తం ప్రవహిస్తుండగా, ఆ వస్త్రపు అల్లికలో సజీవ కణజాలం పెరిగేది. [2]

ఈ ప్రయోగాల తరువాత డాక్రాన్‌తో చేసిన కృత్రిమ నాళాలు రక్తనాళ శస్త్రచికిత్సలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. వాటితో గుండె నుంచి బయలుదేరే ప్రధాన రక్తనాళంలో దెబ్బతిన్న భాగాలను మార్చడంవంటి శస్త్రచికిత్సలకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. మూసుకుపోయిన రక్తనాళాల చుట్టూ బైపాస్ మార్గాలు వేయడంవంటి పద్ధతులను కూడా డిబేకీ అభివృద్ధి చేశాడు. [1]

ఒక రోగిని కోల్పోతే ఆ బాధ తనను ఎప్పటికీ వదలదని డిబేకీ అన్నాడు:

“You never get over that. Never.”

ఒక రోగి కృతజ్ఞతతో ఇలా రాశాడు:

“రెండు రోజులపాటు నా గుండెను మీ చేతుల్లో పెట్టే అదృష్టం నాకు కలిగింది. అప్పుడు బ్లేక్ మాటలకు — ‘కరుణకు మానవ హృదయం, జాలికి మానవ ముఖం’ — అర్థమేమిటో తెలిసింది.”

విలియం బ్లేక్ (William Blake) ‘The Divine Image‘ లో ఇలా రాశాడు:

“For Mercy has a human heart,
Pity, a human face:
And Love, the human form divine,
And Peace, the human dress.


And all must love the human form,
In heathen, Turk, or Jew.
Where Mercy, Love, & Pity dwell,
There God is dwelling too.”

కరుణ ముఖ్యం,” అన్నాడు ఇస్మాయిల్ క్లుప్తంగా. తుమ్మల మరింత కవితాత్మకంగా చెప్పాడు:

“కోవెలలో గంగానది
రేవులలో రామకోటి రేఖలలో లే
డేవాని యెడద కరుణకు
నావాలంబతని యంద హరి వసియించున్.”

— తుమ్మల సీతారామమూర్తి, ఉదయగానము

అయ్యగారికీ, హృదయనాథ్ గారికీ—వారిలాంటి వైద్యులందరికీ నా నమస్సులు.

మూలాలు:

  1. Goode P. Davis Jr. and Edwards Park, The Heart: The Living Pump, U.S. News Books, 1981, p. 124.
  2. Craig A. Miller, A Time for All Things: The Life of Michael E. DeBakey, Oxford University Press, 2019, p. 307.

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి:

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది వాషింగ్‌టన్ రాష్ట్రంలో సియాటల్ నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు నలభై యేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత కొంతకాలంలో కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.

 ...