బిల్హణీయము

మొదటి దృశ్యం

(సమయం: పున్నమినాటి రాత్రి ఏడుగంటలు. స్థలము: రాణి మందారమాల అంతఃపురం. గవాక్షము నుండి పూర్ణచంద్ర బింబము స్పష్టముగా కనిపిస్తూ, నిర్మలమైన చంద్రిక అచట గల నాట్యవేదికపై పడుతూ ఉంటుంది. నాట్యవేదిక దీపాలంకృతమై ప్రకాశిస్తూ ఉంటుంది. అచట మందారమాల, ఆమె పరిచారికలు, ఆయత్తమై ఉంటారు. రాణికి పరిచారికలు వీవనలు వీస్తుండగా, యామినీపూర్ణతిలకకు నాట్యము నేర్పించు మయూరిక రాణికి సమీపంలో ఒక వైపు కూర్చుని ఉంటుంది. రాణికి మఱొకవైపు మయూరిక కెదురుగా యామినీపూర్ణతిలక సుసజ్జితవేషంలో కూర్చొని ఉంటుంది.)

రాణి:

ఆచార్యా మయూరికా! నేటికి యామిని నాట్యసంగీతములు చక్కగా నేర్చినదని మీ అభిప్రాయమా?

మయూరిక:

సందేహము లేదు మహారాజ్ఞీ! అందుచేతనే కదా మీముందు నేడామె పటిమను ప్రదర్శింప దలచుకొన్నాను.

రాణి:

ఐతే కానిండు. ముందుగా వీణావాదనం ఆతర్వాత నాట్యప్రదర్శనం – ఇదేగా క్రమం.

మయూరిక:

తమరి ఊహ సరియైనదే. అదిగో ఆ గవాక్షం ద్వారా చూడండి. నేడు పూర్ణిమ. నిండుచంద్రుఁడు లోకాన్నంతా అమృతసేచనంతో పరవశింప జేస్తున్నాడు. ఆచంద్రుని కరలాలనలో ఈయామిని పులకించి పోతున్నది. ఈ సన్నివేశానికి తగినట్టుగా ఒక అపూర్వమైన గీతాన్ని మన యామినీదేవి వీణపై ముందుగా ఆలపిస్తుంది. తరువాత అదే గానానికి భావయుక్తంగా ఆమె నాట్యాభినయం చేస్తుంది. (యామినివైపు తిరిగి) యామినీ! నీవు సిద్ధమే కదా! నా గౌరవాన్ని నిలుపుతావు కదా!

యామిని:

ఆచార్యకు అభివాదములు. నాశక్తివంచన లేకుండ సాధిస్తాను. (నాట్యవేదికపై కూర్చుండి ముందు నాట్యార్థమై పాడఁబోవు పాటను వీణపై శ్రావ్యంగా పలికిస్తుంది.)

రాణి:

(వీణావాదనాంతమున) బాగు బాగు. చక్కగా నేర్చినావమ్మా! కృతజ్ఞతాపూర్వకంగా మఱొకసారి ఆచార్యకు పాదాభివందనం చేయి.

(యామిని మయూరికాపాదాభివందనం చేస్తుంది. తర్వాత యామిని నాట్యకత్తె వేషంతోను, పరిచారికలు నాట్యార్హమైన వాద్యాలతోను ఆయత్తమౌతారు. ఈ క్రింది గీతాన్ని నాట్యోచితమైన గమకాలతో పాడుతూ యామిని నాట్యం చేస్తుంది.)

నిండుపున్నమివేళ నెనరార ద్విజరాజ!
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!

కన్నుల నీజిగి కాంచిన యంతనె
కుసుమించు నెవో కూరిమితలపులు
నీకరములు నను దాకినయంతనె
ఉదయించు నెవో మదిలో వలపులు        |నిండు|

సురుచిరమగు నీకరములు సాచుచు
లోఁగొనుమోయీ తీగె విధంబున
సుందరయౌవనసుమశోభితమౌ
నాదగు మేనును నీదేహంబున        |నిండు|

పాండిత్యంబే వరపాండిమమై
రాసిక్యంబే రమ్యామృతమై
పరగిన విబుధప్రవరుడ వీవే
యామిని వలచిన స్వామివి నీవే        |నిండు|

రాణి:

(యామిని నుద్దేశించి) యామినీ! బాగు బాగు. సానబెట్టిన వజ్రంవలె మయూరిక నీ కళాకౌశలాన్ని ప్రకాశింప జేసినది. నీ అభినయము బాగున్నది, కాని నీకీ గీతానికి అర్థం పరిపూర్ణంగా తెలుసునా?

యామిని:

ఆ! దీనికి ఆచార్య చెప్పిన అర్థం నాకు తెలుసు. ఆ అర్థాన్నే కదా నే నభినయించినది.

రాణి:

అంతకంటె గూఢార్థమేమైన దీనికున్నదా? ద్విజరాజంటే ఏమిటి?

యామిని:

చంద్రుఁడు.

రాణి:

ద్విజరాజంటే బ్రాహ్మణశ్రేష్ఠుడనే అర్థం కూడ ఉన్నది. అట్లాగే విబుధప్రవరుడు అంటే పండిత శ్రేష్ఠుడనీ, దేవతాశ్రేష్ఠుడనీ అర్థాలు. ఐతే అవి ఇప్పు డప్రస్తుతం. పదాలకుండే అర్థాలన్నీ తెలుసుకుంటే సందర్భానుసారంగా ఒకే గీతాన్ని వివిధరీతులుగా అన్వయించుకొనవచ్చు. ఈ విధమైన జ్ఞానంవల్ల గీతార్థాన్నీ, అది ఆలంబనంగా సాగే నాట్యాన్నీ మఱింత శోభాయమానంగా మలచుకొనవచ్చు.

మయూరిక:

దీనికి నేనూ కొంతవఱకు బాధ్యురాలను. నాకు సంగీతనాట్యాలలో ఉన్నంత పరిజ్ఞానం సాహిత్యంలో లేదు.

రాణి:

అందులో దోషమేమీ లేదు. ఆరెంటిలో మీకున్నంత పరిజ్ఞానం నా గుర్తులో మఱెవ్వరికీ లేదు. (యామిని నుద్దేశించి.) యామినీ! మయూరిక దయవల్ల సంగీతనాట్యాలలో విదుషీమణివైన నీవు సాహిత్యంలోను అట్టి పరిణతి సంపాదించవలెనని నాకున్నది. నీవే మందువు?

యామిని:

నేను కోరేదీ అదే. కాని బాల్యంనుండి సాధించనిదే సాహిత్యం పట్టుపడదంటారు. నాకీ వయస్సులో సాధ్యమేనా?

రాణి:

ముదిరిన వృక్షపు చేవ చతురుడైన వడ్రంగి చేతిలో ఉత్తమశిల్పంగా మారుతుంది. విజ్ఞుడైన సాహితీగురువు చేతిలో నీవుత్తమసాహితీసరస్వతిగా మారుతావు. ఇట్టి సాహితీమూర్తి గవేషణకై నేను మహారాజులవారిని అర్థిస్తాను.

యామని:

కృతార్థురాలను.

రెండవ దృశ్యం

(సమయం: అపరాహ్ణం. పాంచాలదేశప్రభువైన మదనాభిరాముడు మంత్రి విద్యాపతితో సమావేశమై ఉంటాడు.)

మదన:

విద్యాపతీ! నిన్నటి కర్ణసుందరి నాటకం అమోఘంగా ఉండింది. ఈ నాటకకర్త బిల్హణుడు చాలా గొప్ప కవిలాగున్నాడు.

విద్యా:

సందేహం లేదు మహారాజా! అందుకే కదా మీకవార్యమైన కార్యభారమున్నా ఈ నాటకాన్ని చూడవలసిందిగా నేను మీకు విన్నవించుకొన్నది.

మదన:

ముందుగా ఆ కర్ణసుందరి చిత్రమే అలౌకికసౌందర్యశోభితమై ఉన్నదంటే, ఆమె స్వయంగా రంగంలో ప్రవేశించినప్పుడు ఆహా! ఆమె హావభావాలు, ఆహార్యం, సౌందర్యం వర్ణనాతీతంగా ఉన్నవి. మొత్తానికి ఇదొక ఉత్తమమైన నాటకం.

విద్యా:

అందుకే అచిరకాలంలోనే కాశ్మీరం నుండి పాంచాలం దాకా దాని ప్రథ ప్రాకింది. అంతేకాదు మహారాజా! మన రాజధాని భాగ్యం పండింది. బిల్హణకవి దేశాటనం చేస్తూ మన నగరానికి వచ్చినట్లు నాకు తెలిసింది. నిన్న నాటకారంభంలో అతడు వేదికపై కనపడవలసే ఉండింది కాని కనపడలేదట.

మదన:

ఎందుకో?

విద్యా:

విన్నాను. ఆమహాకవి కుష్ఠరోగులంటే కండ్లు మూసుకుంటాడట. పైగా కార్యార్థం వెళ్ళే వేళ కుష్ఠరోగి ఎదురుగా వస్తే అది ఘోరమైన అపశకునంగా భావించి వెళ్ళడం మానేస్తాడట. ఇట్లాంటిదేదో జరిగిందని నా అనుమానం. కాని అంతటి మహాకవి సాహితీరసజ్ఞులైన దేవరవారి దర్శనం చేసికొనకుండా నగరం వీడిపోడని నా నమ్మకం.

మదన:

ఆ మహాకవిని ఆహ్వానించి సత్కరించవలసిందే. ఐతే విద్యాపతీ! మీరొక్క ప్రకటన చేయవలసి ఉన్నది. అమ్మాయి యామినికి సంస్కృతం నేర్పడానికి సాహిత్యాలంకారవిదుడైన ఒక పండితునికై.

విద్యా:

మన నగరంలో జగత్ప్రసిద్ధులైన వైయాకరణులు, తార్కికులు, ఇంకా మీమాంసకులూ ఉన్నారు. సంస్కృతం చక్కగా రావడానికి వ్యాకరణం, తర్కం అవసరం కదా! ఇవి వచ్చి తాత్త్వికదృష్టి ఉంటే కాని మీమాంసకులు కాలేరు. ఇట్టి గాఢమైన విజ్ఞానం ఆలంబనంగా చేసికొని అటుపై సాహిత్యసౌధం నిర్మించు కొనవచ్చు.

మదన:

అది కొంతవఱకు సత్యమే కాని, పెద్దలు వైయాకరణి సాహితీకన్యకు తండ్రి వంటివాఁడనీ, తార్కికుడు తోబుట్టువు వంటివాడనీ, మీమాంసకుడు కేవలం షండుని వంటివాడనీ, అందుచేత వీరెవ్వరూ వరణీయులు కారని చెపుతుంటారు. అందుచేత ఈ చదువులు యథావసరముగా నెఱిగి కావ్యనాటకచ్ఛందోలంకారాదులందు పండితుడైన కవీంద్రుడున్నచో అతడీ కార్యమునకు తగినవాడని నాయభిప్రాయము.

సరసుఁడు, కావ్యశాస్త్రములఁ జక్క నెఱింగినవాఁడు, స్వీయసుం
దరకవితావిదగ్ధుఁ డయినట్టి కవీంద్రుఁడు గాక యన్యు లౌ
దురె బుధవర్య! యామినికిఁ దూర్ణముగా వరసాహితీమనో
హరవిదుషీత్వకౌముదిని నంటఁగఁజేయ నఖండితంబుగన్.

ప్రతీహారి:

(ప్రవేశించి) రాజా! కాశ్మీరపండితుడంట. మీదర్శనార్థమై వచ్చినాడంట.

మదన:

వెంటనే ప్రవేశపెట్టు. మాసన్నిధి పండితుల కెప్పుడైనా సన్నిహితంగానే ఉంటుంది.

ప్రతీహారి:

చిత్తం. (వజ్రకుండలభూషితుడైన మహావర్చస్వియైన పాతికవత్సరాల ప్రాయము గల బిల్హణుని ప్రవేశపెట్టును.)

బిల్హణుడు:

స్వస్తి పాంచాలప్రభువులకు.

విద్యా:

అయ్యా!తమరెవ్వరు?

బిల్హణుడు:

నాపేరు బిల్హణుడు. కాశ్మీరదేశకవిని. కర్ణసుందరీనాటకకర్తను.

విద్యా:

కాశ్మీరంనుండి ఇక్కడికి రావడానికి కారణం.

బిల్హణుడు:

విద్య పూర్తియైనది. కవిగా కొంత ప్రశస్తి కూడ వచ్చినది. బ్రహ్మచారిని. బాధ్యతలు పెరుగక ముందే వివిధదేశాలనూ ఆస్థానాలనూ సందర్శించాలనే కుతూహలమే దీనికి కారణం.

మదన:

బిల్హణమహాకవీ! నేడు సుదినం. మీ రాకవల్ల మా ఆస్థానం పవిత్రమైనది. మీ నాటకాన్ని మా నగరంలో నిన్ననే చూచినాను. నాకు బాగా నచ్చింది. అందులో మీకవిత్వం అత్యద్భుతం.

బిల్హణుడు:

కృతార్థుడను. మీ సాహిత్యాభిలాషను, మీ వదాన్యతను దేశం నలుమూలలా వ్యాపించిన మీ కీర్తియే తెల్పుతూ ఉన్నది.

రాజట గాని శూన్యమట రాజ్యము, వైభవలేశ మున్నచో
భ్రాజిలునంట యద్ది యొకపక్షముమాత్రమె రాత్రులందు, ఆ
రాజొక రాజె? శ్రీమదనరాజ! అహర్నిశలందు లోకవి
భ్రాజితకీర్తివైభవము రాజిలు మీరలు రాజు గాకిలన్?

మదన:

ఆహా! అద్భుతం మీకవనం. మాలోకవిభ్రాజితవైభవం మేమున్నంతకాలమే కాని, మీ లోకవిభ్రాజితవైభవం ఎల్లకాలమూ మాయకుండా ఉంటుంది.

విద్యా:

కవిగారూ! మీరెంతకాలం మా నగరంలో ఉంటారు?

బిల్హణుడు:

నేను భ్రమరం లాగున దేశదేశాలపండితసభలలో విజ్ఞానరసాస్వాదనం, వినిమయం చేస్తూ తిరుగుతున్నాను. ఎంతకాల ముంటానో చెప్పలేను.

మదన:

మీరు మానగరంలో కొంతకాలం స్థిరంగా ఉండి, మీకవితారసపానం చేసే అవకాశాన్ని మాకు ప్రసాదించాలని మా అభిలాష. మీవిడిదికై మా రాజోద్యానం ప్రక్కనే ఉన్న భవనం ఏర్పాటు చేస్తాము. మా ఉద్యానవన సౌరభాలు మీకవితాసౌరభాన్ని ద్విగుణీకృతం చేస్తాయని మా ఆశ.

బిల్హణుడు:

మీ ఆదరణకు కృతజ్ఞుడను.

మదన:

(చప్పట్లు చఱచి) ఎవరక్కడ? (ఒక రాజసేవకుడు ప్రవేశించును). ఇదిగో ఈబిల్హణకవీంద్రులను నగరాధికారి కడకు తీసికొని పోయి రాజోద్యానం ప్రక్కనే ఉన్న ఉన్నతభవనంలో వారు కోరినంతకాలం వారికి విడిది నేర్పాటు చేయించు. (బిల్హణుడు సేవకునితో నిష్క్రమించును)

విద్యా:

ఈకవీంద్రుడు యామినికి తగిన గురువుగా నాకు దోచుచున్నాడు.

మదన:

అందులో సందేహం లేదు. ఇతడు మహావర్చస్వియే కాక మన్మథుని దలపించే స్ఫురద్రూపి. తప్త కాంచననిభమైన తనువుతో నితడు బంగారువిగ్రహం వలె వెలుగొందుచున్నాడు. అంతే కాక,

బ్రహ్మవర్చస్సుతోఁ గడు పరిఢవిల్లు
నితని వదనంబు వాగ్దేవి నెంతగాను
మోహపెట్టెనొ యామె తన్ముఖమునందె
వాసమొనరించు నెప్పుడు వదలకుండ.

విద్యా:

ఇంకెందుకు సందేహం. ఆడఁబోయిన తీర్థం ఎదురే అయింది గదా!

మదన:

కాని నన్నొక సందేహం పీడిస్తున్నది. అమ్మాయి వింశతివర్షాల పరిపూర్ణయౌవనవతి. అత్యంత సౌందర్యవతి. సంగీతనాట్యకళాసరస్వతి. అతడో పుంభావభారతి. రూపజితరతిపతి. బోధించే విషయం శృంగారరస భూయిష్ఠం. యౌవనమత్తత చిత్తచాంచల్యమునకు హేతువు. ఈ శిష్యురాలు గురువుల సంబంధం మనమూహింపని సంబంధానికి దారి తీస్తుందేమో అని నా భయం.

విద్యా:

ఇట్టి సందేహం కల్గడం దేవరవారి విస్తృతలోకానుభవానికి నిదర్శనం. ఐనా… బిల్హణునివంటి గురువు ఆమెకు లభించడం పూర్వజన్మసుకృతఫలం. (కొంచెం ఆలోచించి) నాకొక ఉపాయం తోస్తున్నది. గురువు కుష్ఠులను జూడలేడు. అంతేవాసిని అంధుల నవలోకింపదు. అందుచేత యామినీదేవికి ఆచార్యు డంధుడని చెప్పి, యామినీదేవికి కుష్టురోగ సంపర్కం ఉందని ఆచార్యునికి చెప్పి, వారికి మధ్య నొక దట్టమైన తెరను గట్టి పరస్పరాలోకనం జరుగకుండా మనం జాగ్రత్తపడవచ్చు. అంధుడైనను మహాపండితుడు, కవీంద్రుడు, శ్రావ్యతరవాగ్భూషణుడైన అతని కంఠస్వనశ్రవణమాత్రాన సంస్కృతం చక్కగా నేర్చుకొనవచ్చని రాజపుత్త్రిని ఒప్పించి ఈ కార్యాన్ని నెరవేర్చవచ్చు. మఱి మీరేమందురో?

మదన:

నాకిది సాధ్యమే అనిపిస్తున్నది.

విద్యా:

మహారాజా! మీరు యామినీదేవిని ఒప్పించండి. బిల్హణమహాకవి విషయం నేను చూచుకుంటాను.

మదన:

అట్లే కానిండు.