యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని,
కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని,
యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛ-
యంబని మహిఁ గొనియాడుచుండ
వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరఁగుచుండఁ జేసె భారతంబు.
(శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వం: 1:32)
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం రామాయణమయితే మన తెలుగు సాహిత్యంలో మొదటి కావ్యం మహాభారతం. రామాయణం వేదార్ధబృంహణం కాగా మహాభారతం పంచమవేదంగానే కీర్తింపబడింది. లోకాన్ని సత్పథంలో నడిపేది ధర్మం. ఆ ధర్మం మనకు వేదం ద్వారానే తెలిసింది. వేదార్థాన్ని భావించిన ఋషులద్వారా వివరింపబడింది. ధర్మబద్ధ సాంఘిక జీవనమే, వ్యక్తికి, సంఘానికి, లోకానికి శ్రేయం కలుగజేస్తుంది. పారలౌకిక శ్రేయాన్ని కూడ కలుగజేస్తుంది. వ్యాసుని మహాభారత రచనోద్దేశాన్ని తిక్కన ఈ విధంగా శ్లాఘించాడు.
పద్విఖ్యాతుఁడు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, గృ-
ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె ధ-
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
(విరాటపర్వం: 1:3)
వేదార్థాన్ని ప్రపంచించిన మహాభారతం లక్షశ్లోకాత్మకమైన బృహద్గ్రంథం, అంతటి బృహద్గ్రంథం రచించాలంటే ఎంతో కవితావేశం ఉండాలి. వేద విజ్ఞానాన్ని ప్రపంచించటం అంటే లౌకిక, అలౌకిక విషయాల నెన్నింటినో వివరించాలి. కావున దానికి పరిమితమైన జ్ఞానం చాలదు. విజ్ఞానసంపద విశిష్టంగా ఉండాలి. అట్టి గుణాలు గలిగిన మహానుభావుడు కృష్ణద్వైపాయనుడు. అతడు లోకహితార్థమై నిష్ఠబూని ఈ మహాభారతమనే లేఖ్యమైన (లిఖించదగిన) అమ్నాయాన్ని అనగా ఈ పంచమవేదాన్ని రచించాడు. (ఆ నాలుగు వేదాలు శ్రుతులు అనగా గురుముఖతః వినియే అధ్యయనం చేయదగినవి) ధర్మాద్వైత స్థితి కలగడానికి అనగా అద్వైతభావనను స్థిరీకరించడానికి రచించాడు. అద్వైతధర్మంలోనే సర్వదేవ సమత్వ భావన ఉంది. దానిచేతనే లోకహితం చేకూరుతుంది. అద్వైత సంప్రదాయంలోని పూజావిధానంలో ఈనాటికి కూడా శాలిగ్రామాన్ని శివపంచాయతనాన్ని కలిపి పూజించడం అనుభవసిద్ధంగా ఉంది.
సంధ్యావందనంలో ప్రతి దినం జపించే ఈ శ్లోకరూప మంత్రాలలో శివకేశవుల అభేదం, సర్వదేవసమభావం ఎంత స్పష్టంగా ఉందో చూడండి:
శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః ॥
యథాఽంతరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషే ॥
సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి ॥
(తైత్తిరీయ సంధ్యావందనం)
విష్ణురూపుడైన శివునకు, శివరూపుడైన విష్ణువునకును నమస్కారము. శివునియొక్క హృదయమే విష్ణువు. విష్ణువుయొక్క హృదయమే శివుడు. శివస్వరూపుడే విష్ణువు. విష్ణుస్వరూపుడే శివుడు – నేను వీరిద్దరిలో భేదం చూడడం లేదు కావున నా ఆయుష్యమునకు క్షేమం కలుగు గాక. ఆకాశంనుండి పడిన నీరు సాగరం చేరుకున్నట్లు దేవతలందరికీ చేసే నమస్కారం ఆ భగవంతునికే చెందుతుంది.
శివకేశవాభేదాన్ని వ్యాసభగవానుడు ప్రకృత భారత కథాంతర్భాగంగా సూచించాడు.
అభిమన్యు వధలో ముఖ్యపాత్రగా భాసించిన సైంధవుణ్ణి వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు పార్థుడు. ఆ రాత్రి తాను కృష్ణునితో కలసి కైలాసంలో శివదర్శనం చేసుకున్నట్లు స్వప్నంలో చూశాడు. అదే రోజు సాయంకాలం వాసుదేవునకు ఏ గంధమాల్యాదులను సమర్పించాడో ఆ గంధమాల్యాద్యుపహారములే శివునిపై దర్శనమిచ్చాయి. దీనిచే కేశవుడే శివుడని, శివకేశవులకు భేదం లేదని వ్యక్తీకరించినట్లు స్పష్టం. ఆ శ్లోకం ఇది — మహాభారతం(సం) ద్రోణపర్వంలోనిది.
దదర్శ త్ర్యమ్బకాభ్యాశే వాసుదేవనివేదితమ్ ॥
(సంస్కృతమహాభారతం-ద్రోణపర్వం: 81:3)
తిక్కన చేసిన వచనానువాదం చూడండి:
మహాభారతం లోకహితార్థం వెలసిన పంచమవేదం. కావున నన్నయ ప్రారంభించాడు దానిని తెలుగులో రచించడానికి, కాని అది రెండున్నర పర్వాల రచనతో ఆగిపోయి చాలా కాలం గడిచింది. ఇప్పుడు ఆ మహాభారతాన్ని తెలుగులో రచించి పూర్తిచేయాలని సంకల్పించాడు తిక్కన. అతనికి సంస్కృత మహాభారతం కరతలామలకం. వాదప్రతివాదాలు చేసి మత సామరస్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు. తిక్కన తాను మహాభారతం రచించాలంటే ఏ గుణాలు వ్యాసునిలో ఉన్నాయని చెప్పాడో తాను, అట్టి గుణాలు, అనగా విద్వత్సంస్తవనీయభవ్యకవితావేశం, విజ్ఞానసంపద్విఖ్యాతి, సంయమిప్రకరసంభావ్యానుభావం, ఈ మూడు గుణాలు తనలో కూడ ఉండనే ఉన్నవి. అతని సంకల్పానికి తోడుగా స్వప్నంలో సాక్షాత్కరించి హరిహరనాథుడు తిక్కనతో-
భేదములేని భక్తిమతి నిర్మలవృత్తిగ జేయుచుండు మ-
త్పాదనిరంతర స్మరణ తత్పరభావముకల్మి నాత్మ స-
మ్మోదము బొందఁ గావ్యరసముం గొని యాడుచునుండు దెప్పుడున్.
భారతమను పేరఁ బరఁగు పంచమవేదం-
బారాధ్యము జనులకు ద-
ద్గౌరవమూహించి నీ వఖండితభక్తిన్.
భవ్య పురుషార్థ తరుపక్వఫలము గాదె
దీనికెడ నియ్యకొని వేడ్కనూని కృతిప-
తిత్వమర్థించి వచ్చితి తిక్కశర్మ !
(విరాటపర్వం: 1:15-18)
తిక్కనకు గల వైదికమార్గనిష్ఠకు, భేదములేని భక్తికి, భగవత్పాద నిరంతరస్మరణ తత్పరభావానికి ముగ్ధుడై ఆ హరిహరనాథుడే స్వయంగా వచ్చి తెలుగు మహాభారతం కృతి ఇమ్మన్నాడు. తిక్కన తన భాగ్యంగా భావించాడు. తన కృతిపతి నానతిచ్చిన తీరులో కావ్యరసాన్ని కొనియాడుతూ, తాను సంతోషించే విధంగా రచించుమన్నాడు. అందుకే తిక్కన మహాకవిత్వ దీక్షావిధినొంది రచిస్తానన్నాడు, మరియు వ్యాస భగవానుని కృతి మహాభారతం పంచమవేదంగా జనులందరికీ ఆరాధ్యం గావున, ఆ భారతానికున్న గౌరవం దృష్టిలో పెట్టుకొని భక్తితో రచించుమన్నాడు. కావుననే ‘సాత్యవతీయ సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ, రచిస్తానని చెప్పాడు. మరియు వ్యాస భారతం జనులకు ఆరాధ్యమైన విధంగా తన తెలుగు భారతం కూడ తెలుగు ప్రజలకు మోదం కూర్చి, ఆరాధ్యమయ్యేటట్లు అమృతప్రాయంగా రచిస్తానని ఈ పద్యంలో ప్రతిజ్ఞ చేశాడు, తిక్కన.
ఇదిగో ఆ పద్యం చూడండి —
ధ్రావళిమోదముం బొరయునట్లుగ సాత్యవతీయ సంస్మృతి-
శ్రీవిభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వదీ-
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ గృతుల్ ॥
(విరాటపర్వం: 1:30)
ఈ పద్యంలో చేసిన ప్రతిజ్ఞ వలన తిక్కన భారతానుసృజన (అనువాద) కౌశలం అనగా సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించటంలో ప్రదర్శించే కౌశలం కైచేసే యత్నం అని స్పష్టపడుతుంది. ఆ అంశాలు ఇవి:
- తెలుగువారు ఈ భారత కథామృతాన్ని ఆస్వాదించి, ఆనందించడానికి కావలసిన నుడికారపు సొంపులు గుప్పించటం.
- చిత్తంలో వ్యాస భగవానుని స్మరించడం అనగా, ఆయా సన్నివేశాల్ని భావాన్ని పెంచినా, కుదించినా త్యజించినా మూల విరోధం లేక ఔచిత్యావహమై ఉండి భారత గౌరవాన్ని కాపాడటం.
- మహాకవిత్వదీక్ష బూనటం అనగా కావ్యమార్గాన్ని అనుసరించి వర్ణనల పెంపు, అలంకారాల ఇంపు, సంభాషణల సొంపు, రసోచిత పదగుంఫనలనేర్పు ద్వారా ప్రదర్శించి మహాకావ్యంగా తీర్చిదిద్దటం.
ఈ మూడు లక్షణాలే భారతానుసృజనంలో కౌశలాన్ని సమకూర్చాయి.
సంస్కృత మహాభారతం లక్ష శ్లోకాత్మకమైనది; 18 పర్వములు. వీనిలో 15 పర్వములు తిక్కన తెనిగించినవి. ఈ పదునైదు పర్వముల శ్లోక సంఖ్య మొత్తము 72 వేలు.
దీనిని 20,000 పద్యములలో తిక్కన తెనుగు చేశాడు. తెలుగు నుడికారంలో ‘స్వతంత్ర కావ్యమా?’ అనేటట్లు దీనిని తీర్చిదిద్దాడు.
ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆ భాషలలోని మెలకువలు తెలియవు. లేకుంటే భాషాంతరానుసృజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్ధార్థ స్ఫూర్తిని కూడ కలుగజేస్తుంది. మూలగ్రంథం దీర్ఘంగా ఉన్నప్పుడు దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి. మూలంలోని పదాల్లో అర్థం అస్పష్టంగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్థం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్పడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి. దానికి కారణం తిక్కన ” ఉభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునం బారగుఁడు” కావటమే. కావుననే దశకుమారచరిత్రకారునిచే తిక్కన – “లలిత నానాకావ్యములు చెప్పు నుభయభాషలయందు ననుట ప్రశంస త్రోవ” అని కీర్తింపబడ్డాడు. ఉభయకవిమిత్ర బిరుదాంచితుడై లోకంలో వెలుగొందాడు. మహాభారత బృహద్గ్రంథాన్ని మూడింట రెండు వంతులకు పైగా స్వతంత్ర కావ్యమా అనేటట్లు రచించి, ఆంధ్రావళికి మోదం కలిగించాడు. మహాభారత గౌరవం అఖండిత భక్తితో భావించాడు. తన రచన ఒక మహాకావ్యం అయ్యే విధంగా దీక్షబూని రచించాడు. ఉత్తర గోగ్రహణంలోని ఈ సన్నివేశం పరికించండి:
సంస్కృత భారతంలో ఉత్తరగోగ్రహణసందర్భంలో ద్రోణుడు భీష్మునితో పలికిన పలుకులు –
ఆగతః క్లీబవేషేణ పార్థో నాస్త్యత్ర సంశయః ॥
ర్నగాహ్వయో నామ నగారిసూనుః ।
ఏషోఽఙ్గనారూపధరః కిరీటీ
జిత్వాఽవ యం నేష్యతి చాద్య గా వః ॥
నాయుద్ధేన నివర్తేత సర్వైరపి సురాసురైః ॥
అమర్షవశ మాపన్నో వాసవప్రతిమో యుధి ।
నేహాస్య ప్రతియోద్ధార మహం పశ్యామి కౌరవాః ॥
కిరాతవేషప్రచ్ఛన్నో గిరౌ హిమవతి ప్రభుః ॥
(సం.మభా. విరాటపర్వం 39:9-13)
ముందుగా ఘట్టానికి తాత్పర్యం తెలుసుకొని, తిక్కన దీనిని భావించి తెలుగుసేసిన తీరెట్లా ఉందో సమీక్షిద్దాం —
“ఈ క్లీబ వేషములో వచ్చుచున్నది ఎవరనగా, సకల శస్త్రధారులలో శ్రేష్ఠుడు, మహాధనుర్ధారియైన వీరుడు పార్థుడనుటలో సందియము లేదు. ఓ గంగాసుతా, భీష్మా! లంకేశుని అశోకవనమును దహించి వైర భావమును కొనితెచ్చుకొన్న ఆంజనేయుని ధ్వజముగా మలుచుకొని, ఒక చెట్టు (అర్జున వృక్షము) పేర ప్రసిద్ధుడైయున్న ఇంద్రకుమారుడగు కిరీటియే, ఇప్పుడు అంగనావేషధరుడై వచ్చుచున్నవాడు. కావున మన గోధనమును, రారాజును కూడ జయించి అపహరించుకొని పోగలడు. సవ్యసాచియు, శత్రుతాపనుడు, పరాక్రమశీలుడు అగు ఈ పార్థుడు దేవదానవులు వచ్చినను యుద్ధము చేయక విడుచువాడు కాడు. వనవాస క్లేశముననుభవించి చాలా క్రోధముతోనున్నాడు. యుద్ధమును ఇంద్రుడంతటివాడు, ఇంద్రునిచే శిక్ష సలుపబడినవాడు, ఇతని నెదుర్కొను ప్రతివీరుడు నాకు కాననగుట లేదు. పూర్వమీ పార్థుడు హిమవత్పర్వతమున కిరాతవేషమున వచ్చిన మహాదేవుని యుద్ధమున సంతసింపజేసినాడని విన్నాము.” — ఇది ఆ శ్లోకతాత్పర్యం.
దీనిని తిక్కన భావించి యనువదించిన తీరు అద్భుతముగా నున్నది. తెలుగుదనముట్టిపడుచున్నది. చూడండి —
చ్చెరు, వొక మ్రానిపేరనిట సేరగఁ వచ్చుచునున్నవాఁ; డహం-
కరణమ కాని యొండొకటి గానడు మూర్తివిశేషమారయన్
సురపతీయట్ల వీని మది చొప్పది యెట్లొ యెఱుంగ నయ్యెడున్!
తని మది సంశయము మాన్పఁదలఁచి నరేంద్రుం
గనుఁగొనుచు నతనిలో జె-
ప్పిన భంగి నిగూఢవృత్తి భీష్ముఁడు పలికెన్!
కొలఁది గడచి వచ్చితిమి; యకుంఠిత బాహా
బలము నెఱపఁ దఱియయ్యెను
జలింపవల దింక మనకు శత్రులవలనన్.
(విరాటపర్వం: 4:91-94)
ఈ సన్నివేశం సంస్కృత భారతంలో లేదు – తిక్కన భారతంలో ద్రోణుడు దుశ్శకునాలను చూచి, సైన్యాలను సమాయత్తపరిచాడు. క్లీబ రూపంలో (అంగనావేషంలో) వచ్చేవాడు పార్థుడని గుర్తించాడు. భీష్మునితో చెప్పి – బాహాటంగా అర్జునుని ప్రశంసించాడు. తిక్కన రాజనీతిజ్ఞుడు కదా? సమయభంగం [సమయం = ఒడంబడిక/నియమం]వాటిల్లుతుంది అనే శంక పొడమలేదా ద్రోణునికి? సమయభంగశంకాపరిహారం అపేక్షణీయమే. అది రహస్యంగా తెలియవలసిన విషయం – కావుననే భీష్ముని జూచి ద్రోణుడు ఆ వచ్చే ఎదుటి వ్యక్తిని గూర్చి మాట్లాడినట్లే మాట్లాడుతూ తన సంశయాన్ని రహస్యంగా సూచించటం జరిగింది. ఎట్లాగంటే, “ఆ వచ్చే వ్యక్తిలో ఆకారసౌభాగ్యం మాత్రమే ఉంది కాని, బుద్ధివైభవం లేదు. ఉపాయశీలుడెవడైనా అంతటి ప్రసిద్ధి గల కురువీరులతో పోరుకై వస్తాడా? అహంకారమే తప్ప మరేమీ ఇతనికి తెలియదు. చెట్టువలె పొడవైన ఆకారమే తప్ప, బుద్ధిలో దీర్ఘదర్శిత్వం లేదు.” ఇది ద్రోణుని మాటలలో పైకి తెలిసే అర్థం. ఇక భీష్మునికి సూచించిన అర్థం – మ్రానిపేర వచ్చుచున్నాడని, ఆకారం ఇంద్రుని వంటిదని చెప్పడంచేత ఇతడు అర్జునుడని సూచించాడు. సమయభంగభయం లేక ఈ సమయాన కురువీరులకు కనపడటం యుక్తమా? అని తన సంశయాన్ని ‘వెరవరి గాక’ అనే మాటలో భీష్మునికి సూచించాడు. దీనికి సమాధానంగా భీష్ముడు దుర్యోధనుని చూచి చెప్పుతున్నట్లు పలుకుతూ, ద్రోణునికి అజ్ఞాతవాస సమయం పూర్తి అయినట్లు సూచించాడు. దుర్యోధనునితో చెప్పిన మాటల అర్ధం పైకి ఇట్లా తోస్తుంది — “శత్రువులకు అనుకూలమైన పరిధిని దాటి వచ్చాం. ఇక మనం అకుంఠిత బాహుబలాన్ని చూపవలసిన సమయం ఆసన్నమయింది. శత్రువులకు భయపడవలసిన పని మనకు ఇక లేదు.” దీనివలన దుర్యోధనునకు అర్థమయింది ఏమంటే — “శత్రువులకు అనుకూల పరిస్థితి లేదు కావున శత్రువులకు కాల పరిమితిని భయపడవలసిన పని మనకు లేదు. బలపరాక్రమాలు చూపించి శత్రువులను సులభంగా జయించవచ్చు” — అనేది భీష్ముని మాటల సారాంశంగా దుర్యోధనుడు గ్రహించాడు. ఇక ద్రోణుడు ఈ మాటల సారాన్ని తన సంశయానికి సమాధానంగా ఇట్లా గ్రహించాడు. “శత్రువులైన దుర్యోధనాదులకు సుఖకరమైన కొలదిని — అనగా అజ్ఞాతవాసం దాటి వచ్చాము.” మిగిలిన అర్థం ఉభయత్ర సమానం. దీనిని వస్తుధ్వని అంటారు. ఇది అర్థశక్తి మూలము చెప్పవలసిన వారికి చెప్పక ఆ విషయం మరొకరితో చెప్పి సూచించడమే ఇక్కడ ఉన్న విశేషం, ఈ శేషార్ధమున్నట్లు కవి ‘నిగూఢ వృత్తి’ అనే మాటతో సూచించాడు. ‘వెరవరి గాక’ అనే పద్యంలో రెండంశాలు మాత్రం మూలంనుంచి గ్రహించాడు.
మూలంలోని ‘నగాహ్వయం’ అనుపదానికి “మ్రానిపేర నిట” అనునది తెలుగు మరియు “వానవప్రతిమో అను పదాన్ని “మూర్తి విశేషమారయన్ సురపతి యట్ల” అని తెనిగించాడు. ఈ రెండు పదాలు తెలుగు మాటల కూర్పులో అర్ధాంతర స్ఫూరికి చాలా ఉపయోగపడ్డాయి.
ద్రోణుని సంశయం బాగుంది – పైకి మాత్రం ఆ భావం కనపడనీయక ఇట్లా అన్నాడు.
తంగ స్పూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో-
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ-
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్.
(విరాటపర్వం: 4:95)
సంస్కృతమూలంలో “క్లేశితశ్చ వనే” అని “అమర్షవశమాపన్నః” అని మాత్రం ఉంది. ఆ రెండు పదాల అర్ధం భావించి వివరించిన తీరు ఈ పద్యంగా రూపుదిద్దుకుంది. ఆకలి గొన్న సింహం గజయూథాన్ని చూచి వేటకై బయలుదేరిందంటే అది చంపక విడుస్తుందా? ఆ సింహంతో కుంతీసుత మధ్యముణ్ణి పోల్చి చెప్పడం ఉపమాలంకారం. దీనిచే “తప్పక కురువీరులను జయించగలడు పార్థు”డనే వస్తువు వ్యంగ్యం. ఇది అలంకారంచే కలిగిన వస్తుధ్వని. ఈ కల్పన అంతా తిక్కన భావనాబల విలసితమే కదా?
సంస్కృత భారత శ్లోకభావాన్ని తెలుగు తియ్యదనంతో నింపి రచించిన ఈ పద్యం చూడండి –
యాతత సేనలోఁ గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో-
వ్రాత నివర్తనంబు నుకరంబ కిరీటి; కితండు రుద్రునిం
బ్రీతునిఁజేసె నా వినమె! పెంపెసలారెడు బాహుసంపదన్.
(విరాటపర్వం: 4:96)
“నేహాస్య ప్రతియోద్ధారం” (39:12) అనే సార్థ శ్లోకానికి తెలుగుసేత. “గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటికి” అనునది మాత్రం “జిత్వాఽవ యం నేష్యతి చాద్య గా వః” అనే 10వ శ్లోకంలోని భావం.
ఇలా ఆయా సన్నివేశాలను తిక్కన మనస్సులో భావించి మెరుగులు దిద్ది రచించడం చేతనే తిక్కన కవితావేశం విద్వంత్సంస్తవనీయమై భాసించింది. ఇది సన్నివేశ భావన.
ఇక అలంకారిక భావనలో కనపరచిన నేర్పు — భీష్మకథను విని ధృతరాష్ట్రుడు సంజయునితో పలికిన ఈ పలుకులలో భీష్ముని మేఘంగా, శిఖండిని కృత్రిమ వాయువుగా చిత్రీకరించిన తీరు మూలానికి మెరుగులు దిద్దుతోంది, చూడండి.
యించుట గర్జ చందముగ నేచి విరోధి దవానలంబు మా-
యించు శితాస్త్రవర్షమున నిట్టిది భీష్మమహాభ్రమ; మెట్లడం-
గించెనొకో శిఖండి యను కృత్రిమవాయువు దాఁకి దైవమా.
(భీష్మపర్వం: 1:52)
ఆ భీష్ముడొక మహామేఘం. తాళధ్వజ కరములు మెరుపులు. మౌర్వీధ్వనియే గర్జనం.వైరివీరులు అనే దావాగ్నిని తీక్ష్ణములైన అస్త్రాలనే వర్షంతో అడ్డగించటమే మేఘస్వభావం. అటువంటి మేఘాన్ని ఈ శిఖండి అనే కృత్రిమ వాయువు — అనగా అల్పవాయువు — ఎలా అడ్డగించిందో కదా, దైవమా? ఇది దైవ విలసితమే కాని, ఇట్లగుట సంభావ్యమా? అని ధృతరాష్ట్రుని విలాపాన్ని మూలానుగుణంగా వర్ణించినట్లే ఉన్నప్పటికీ, ఎంతో విశేషం కానవస్తుంది; ఈ సంస్కృతమూలం చూడండి.
ధనుర్హ్రాదమహాశబ్దో మహామేఘ ఇవోన్నతః ॥
నిఘ్నన్ పరరథాన్ వీరో దానవానివ వజ్రభృత్ ॥
(సం.మభా. భీష్మపర్వం: 14:27-28)
మౌర్వీఘోషస్తనయిత్నుః (అల్లెత్రాటి ధ్వని ఉరుముగా గలది) ధనుర్హ్రాదమహాశబ్దః (ధనుస్సు ధ్వని గొప్ప శబ్దముగా గలది) – ఈ రెంటి తాత్పర్యమొకటి కదా? మహామేఘః అను ఉపమాలంకారం ప్రకృతానుగుణంగా లేదు. ఇట్లే శ్లోకంలో అలంకార సౌష్ఠవం కొరవడింది. దీనిని సర్వాంగసుందరంగా తీర్చి రూపకాలంకారాన్ని గ్రంథించిన తీరు తిక్కన అలంకారిక భావనాపటిమకు నిదర్శనం. భీష్మపర్వంలోని ఈశ్లోకం చూడండి:
సంధ్యా సమభవద్ఘోరా నాపశ్యామ తతో రణమ్॥
(సం.మభా. భీష్మపర్వం: 107:1)
[భావానువాదం: సూర్యుడు అస్తమించగా, ఘోరమైన చీకటి కమ్ముకొన్నది. అప్పుడు, పోరాడుతూనే ఉన్న వీరుల యుద్ధాన్ని చూడలేకపోయాము.]
ఈ సూర్యాస్తమయాన్ని ప్రకృతకథానుగుణంగా ఉత్ప్రేక్షించి చెప్పిన తీరు ఎంత కరుణార్ద్రంగా స్ఫురింపజేశాడో, ఆస్వాదించండి.
బోని యపుడు పాండురాజపుత్ర విరాజ-
త్సేన పొడవడుగుఁ ననుకృప-
నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా!
(భీష్మపర్వం – 3:271)
ఇది భీష్ముని తొమ్మిదవనాటి యుద్ధం. అతని ధాటికి పాండవుల సైన్యం ఆగలేకపోయింది. అప్పటి సూర్యాస్తమయ వర్ణన ఇది. సూర్యుడస్తగిరికి చాటయి అంధకారం సృష్టించి, యుద్ధం ఆపకపోతే పాండవుల సైన్యం భంగపడవలసిందే. అది అట్లు కాకూడదు. ధర్మానికి విజయం కావాలి కదా? కావున దయ దలచియా అనేటట్లు సూర్యుడు అస్తమించాడు. అని ఈ హేతూత్ప్రేక్షాలంకార భావన కావ్యదృష్టితో ప్రదర్శించిన కౌశలమే కదా!
ఇలా వర్ణనలను ప్రకృతకథా సన్నివేశానుగుణంగా మలచి యుత్ప్రేక్షించుట అనంతరకవులకు ఆదర్శప్రాయమైంది.
మనుచరిత్రలోని ఈ వర్ణన చూడండి.
భరవివశాంగి నంగభవు బారికి నగ్గము చేసి క్రూరుఁడై
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ-
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్.
(మనుచరిత్రము – 3:10)
“‘ప్రవరుని చేతకు సూర్యునికి కోపం వచ్చిందా?’ అనునట్లు ఎఱ్ఱబారాడు.” అని చెప్పడం మనుచరిత్రకారుడు ప్రకృత సన్నివేశానికి చేసిన వ్యాఖ్యానం వలె ఉంది. సూర్యుడు వరూధినీ పక్షపాతం వహించాడు. అందుకు కారణం ఆయమ అనన్యకాంత యగుటయే. ఉత్తరకథాంశం దీనితోనే ముడిపడి ఉంది కదా. కావున ప్రకృతానుగుణంగా మనుచరిత్రకారుని కల్పన సాగింది. ఇట్లెన్నో ప్రబంధకారుల వర్ణనలు కానవస్తాయి.
మరొక ఉదాహరణం తిక్కన భారతంనుండి —
దానికి సంస్కృత మూలం ఇట్లా ఉంది”ప్రాప్తే చాస్తం దినకరే న ప్రాజ్ఞాయత కిఞ్చన” (సం.మభా. భీష్మపర్వం: 49:52)
ఇది సూర్యాస్తమయమయినట్లు సూచన మాత్రమే. దీనిని తిక్కన కావ్య దృష్టితో పెంచిన తీరు ఇట్లా ఉంది.
ర్దాంతుండై నా వెలుంగు ధరకెల్లను జా-
లింతు నినుడఁస్తశైలో-
పాంతమునకుఁ జనిన నేమి యని నట్లుండెన్.
డీ మెయిఁ దేజోవిశేష మెసకం బెసగం-
గా మెఱయుట గనుఁగొని సి-
గ్గై మఱువడు మాడ్కు గ్రుంకె నర్కుండంతన్.
గంబు లట్టుల విన్ననై కాంతి దఱిఁగె
వాని మనముల భీత్యంధకారమడరు
కరణిఁ జీఁకటి యెడనెడఁ గవియుఁదెంచె.
(భీష్మపర్వం: 1:298-300)
ఇది మొదటి రోజు యుద్ధం నాటి సాయంకాలవర్ణన – భీష్ముని యుద్ధమానాడు శత్రుదురాధర్షమై ఉంది. అతడు సూర్యుని వలె వెలుగుచున్నాడు. ఈ యంశాన్నే కవి మొదటి పద్యంలో ఉత్ప్రేక్షాలంకారం ద్వారా వ్యక్తీకరించాడు. “సూర్యుడు అస్తాద్రికి వెళ్ళినా వెళ్ళనీ — ఎందుకంటే తేజోదుర్దాంతుడై శాంతనవుడు (భీష్ముడు) వెలుగుచునే ఉన్నాడు కదా? ఇదే ఈ ధరకు చాలదా?” అని ప్రజలు భావించిన తీరుగా ఆ సాయంసమయ సూర్యాస్తమయం జరిగిందట.
ఇక రెండవ పద్యంలో – “చంద్రవంశ ప్రదీపకుడైన భీష్ముడి తేజోవిశేషం అతిశయించగా వెలుగుట చూచి సిగ్గుపడ్డాడా?” అనేటట్లు సూర్యుడు మరుగుజొచ్చాడు. ఇదియు సూర్యునికంటె భీష్ముడే ప్రతాపశాలియై వెలుగొందాడు అనే ప్రకృతార్ధాన్ని సూచిస్తుంది. ఇది ఉత్ప్రేక్షాలంకారంచే కలిగిన వస్తుధ్వని. ఇక మూడవ పద్యంలో ప్రతీపాలంకారం ఉంది. పాండవుల సైనికుల ముఖాల వలె కమలాలు కాంతి విహీనాలయినాయట. ఆ సైనికుల మనస్సులలో భయం క్రమ్మినట్లు చీకటి అంతట వ్యాపించిందట. భీష్ముని యుద్ధం ఆనాడు పాండవసైన్యానికి మహాభయాన్ని కలిగించిందనే సూచన ఇందులో ఉండనే ఉన్నది. వర్ణనలను ప్రకృతానుగుణంగా మలుచుకోవటం తిక్కన అనుసృజనంలో ఆలంకారిక భావనాశిల్పం.
ఇట్లే విరాటపర్వంలోని తృతీయాశ్వాసంలో “తన మనుమలు…” (198) “సమరంబున…” (194) అను రెండు పద్యాలలోని సూర్యాస్తమయ వర్ణనాచమత్కృతి కూడా గమనించాలి.
కీచకుడు సైరంధ్రితో నర్తనశాలలో కలియుటకు సమయమేర్పరచుకొనిన నాటి సూర్యాస్తమయవర్ణనలో శృంగారరసం ఒలికించిన తీరు ఎంత హృదయాహ్లాదకరంగా ఉందో చూడండి –
చిన రాగముఁ బొందు టిది యుచిత మనఁగాఁ గెం-
పున మెఱసి పశ్చిమాశాం-
గన జనసంభావనముల గౌరవమందెన్.
(విరాటపర్వం: 2:318)
ఇచ్చట రాగ శబ్దానికి ఎఱుపు, అనురాగం అని రెండర్థాలు. నాయకుడేతెంచిన, నాయిక రాగాన్ని ప్రదర్శించడం ఉచితం కావున ఇనుడు (తన విభుడు – సూర్యుడు) తనను సమీపించగానే పశ్చిమ దిశాంగన మెఱసి పోయిందట. ఇట్టి ఉచిత వర్తనకు జనులు సంతసించారట. ఇదియంతా తిక్కన భావనాపటిమకు తార్కాణం.
ఇక మూలంలోని ఆయా పదాలను విశదీకరించే సందర్భంలో తెలుగు నుడికారం ఉట్టిపడేటట్లు తిక్కన ప్రదర్శించిన నేర్పు నితాంతం హృద్యం. ఈ పద్యం చూడండి –
జమ్మి వెసం బ్రాఁకి విడిచి చాపము నాకం-
దిమ్మనుఁడుఁ చేయునది లే-
కమ్ముగ్ధుం డమ్మహీజ మలసత నెక్కెన్.
(విరాటపర్వం: 4:112 పద్యం)
ఉత్తరునితో బృహన్నల, శమీవృక్షం ఎక్కి అమ్ములు తెమ్మనిన సందర్భంలోనిదీ పద్యం. ఇచ్చట మూలంలో
ఆరురోహ శమీవృక్షం వైరాటిరవశస్తదా ॥
(సం.మభా. విరాటపర్వం: 41:6)
ప్రకృతసన్నివేశానుగుణంగా సంభాషణల కల్పనాచాతురితోపాటు తెలుగు నుడికారపు సొంపు నింపుట కూడ ఈ పద్యంలో కనిపిస్తుంది. “అవశః” అనే సంస్కృతమూలానికి అనువాదం “చేయునది లేక” అను తెలుగు జాతీయం. అలసత అనునది తిక్కన చేర్చిన మాటయే. ఇష్టం లేని పని అని సూచించుటకై ఆ మాట వాడాడు. శ్లోక పూర్వార్ధం విడిచాడు. పద్యంలోని మిగిలిన భాగం తిక్కన సంభాషణ సంగ్రంథన చమత్కృతియే. సాభిప్రాయ విశేష్య విశేషణ వాచక పదాలను వాడటం తిక్కన సొత్తు. మూలంలో ఉత్తరుని తెల్పుటకై “కుండలీ’ అని వాడగా, తిక్కన “అమ్ముగ్ధుండు” అని ఉత్తరుని తెల్పుటకై వాడిన పదంలో ఎంతో సాభిప్రాయత చూపాడు. విశేష్యాలను సాభిప్రాయంగా వాడటం ‘పరికరాంకుర’ మనే అలంకారం అని అలంకారికులు చెప్పారు. తిక్కన ఆలంకారిక భావన మహోదాత్తమై ఉంటుంది. మూలానికే మెరుగులు దిద్దిన అలంకారిక భావన ఇంతకు ముందే ఉదహరించాను. స్వయంగా — అనగా అమూలకంగా — చేసిన ఆలంకారిక భావనలో సునిశిత ఆలంకారతత్త్వావగాహన కనపడుతుంది. చూడండి – ద్రోణాచార్యుడు అర్జునుని ప్రశంసించిన తీరు ఈ పద్యంలో ఉంది:
నలఘుస్ఫార కపిధ్వజ ధ్వని సముద్యద్గర్జ చందంబుగా
జలదాకారత నొందె దే; రితఁడు పర్జన్యాకృతిం బొల్చెఁ; దో-
ర్బలతీవ్రారినిదాఘదుర్విషహగర్వస్ఫూర్తి నిర్మూర్తిగాన్.
(విరాటపర్వం: 4:251)
ఇది సావయవ ఉపమాలంకారం. ఇందులో రథాన్ని మేఘంతో పోల్చాడు. రథాధిష్ఠితుడైన అర్జునుణ్ణి పర్జన్యునితో పోల్చాడు. పర్జన్యుడనగా వర్షాధిష్ఠానదేవతయగు ఇంద్రుడు. ఇంద్రుడు మేఘవాహనుడు కదా? నిదాఘంవలె సహింపరాని శత్రుగర్వాన్ని నిర్మూర్తిగా, అనగా ఆకారశూన్యంగా, – అనగా, లేకుండా, చేశాడు. ఎంతటి కల్పనయో? సహృదయులే అర్ధం చేసుకోవాలి.
సన్నివేశభావనలో ప్రకృతానుగుణకథాశోన్నయనం, దానికి తగిన సంభాషణల కూర్పు ఉదాహరించాను. ఆలంకారిక భావనలో మూలానికి మెఱుగులు, స్వయంగా భావించిన తీరులోని సొగసులు ఉదాహరించాను. ఇదంతా తిక్కన భారతం ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దడంలో కనపరచిన తీరు. మహా కవిత్వదీక్షబూనానని చెప్పాడు కదా! అంతేగాక, నన్నయ కూడ “కవి వృషభులు మహాకావ్యమని” భావిస్తారని సంస్కృత మహాభారతాన్ని గూర్చి చెప్పిన అంశం తన మహాభారతానుసృజనానికి తిక్కన అన్వయించుకొన్నాడు. మహాకావ్యంగా తెలుగు భారతాన్ని తీర్చిదిద్దాడు. ఆంధ్రులకు మోదం కూర్చాడు.
ఇంకా ఒకటి రెండు అంశాలు ప్రస్తావించవలసి యున్నది. ఒకటి రసోచిత భావన, రసములు స్థాయీ భావములు. వ్యభిచారిభావములు. ఇవి వాచ్యాలు కాకూడదు. కోపం వచ్చింది అని చెప్పే బదులు, కన్నులెఱ్ఱబారినవని అనుభావముఖంగా చెప్పాలి. ఇట్టి రసోచితభావన తిక్కన అనుసృజనంలో ఎడనెడ కానవస్తుంది. మచ్చునకొకటి —
సైరంధ్రికి కూడ తనయెడ అనురాగం ఉన్నట్లు కీచకుడు భావించిన తీరు ఎంత హృద్యంగా వర్ణించాడో, చూడండి:
షించిన నొండొండ చెమట వొడమ
ననుచిత కృత్యంబు లాచరించు విధాతృ
బలిమికి నివ్వెఱపాటు దోఁప,
నిచ్చట దిక్కులేరెవ్వరు నా కను
భయమున మేనఁ గంపంబు పుట్టఁ
జేయంగనేమి యుపాయంబు లేమి నా-
ననమున వెల్లఁదనంబు గదుర-
ముఁడు వివేకవిహీనుడై ముదితుఁడగుచు
మదనవికృతియకాఁ దన మదిఁ దలంచి
రాగసాగరపూరనిర్మగ్నుఁ డయ్యె.
(విరాటపర్వం: 2:32-33)
స్వేదం, కంపం, స్తంభం, మొదలైనవి శృంగారానుభవములే, కాని, సైరంధ్రికవి కలగడానికి భయం కారణం కాన, అవి ఇచ్చట భయానకరసానుభావములు. కీచకుడు ఆ స్వేదాదులకు తనయందు సైరంధ్రి అనురక్తురాలాయెనని భావించాడు. ఇచ్చట కీచకుడట్లా భావించడానికి కారణం – అతనికి గల కాముకత్వపరాకాష్ఠయే – అందుకే కాళిదాసు శాకుంతలంలో అన్నాడు, “అహో ! కామీ స్వతాం పశ్యంతి’- కాముకులు తాము కామించిన యువతి చేష్టలు అన్నీ కూడా తమను గురించి చేసినట్టుగా భావిస్తారు, ఎంత ఆశ్చర్యము? అని యన్నాడు. ఇట్లు అన్యరసానుభావాలను అన్యరసానుభావాలుగా మలచి, భ్రాంతి కలిగించటం రసనిర్వహణలోని భావనకు పరాకాష్ఠ.
మహాభారత గౌరవానికి భంగం కలుగకుండా ప్రకృతానుగుణంగానే అనుసృజనం చేశాడని చెప్పటానికి, భగవద్గీతను అవసరానికనుగుణంగా సంగ్రహించటం – సనత్సుజాతీయం వేదాంత తత్త్వబోధకం కావున, దానికి ప్రకృతోపయోగం లేకపోవడంచే త్యజించడం, ఉదాహరణలు. అవి రెండు – ఉపనిషత్త్వఖ్యాతి గడించాయి.
ఇట్లు తిక్కన తాను ప్రతిజ్ఞ బూనినట్లు, తెలుగువారికి సంతోషం కూర్చునట్లు, తెలుగు నుడికారాలతో మహాకావ్యత్వ దీక్షబూనటానికనుగుణంగా రసాలంకార సన్నివేశాదులను భావించి దీర్చిదిద్ది, మహాభారత గౌరవాన్ని తరగనీయక, అవసరమైన వాటిని సంగ్రహించి, పెంచి, విడిచి, మహాభారతానుసృజనం చేశాడు. దీని ద్వారా ఎడనెడ ఎట్టి కౌశలం ప్రదర్శించాడో దిఙ్మాత్రంగా ప్రదర్శించాను.
[హైద్రాబాద్ కేంద్రవిశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు తిక్కన భాషా సాహిత్యాలపై నిర్వహించిన జాతీయ సదస్సు (20, 22 మార్చి 1992) లో చేసిన ప్రసంగవ్యాసం, వారే ప్రచురించిన “తిక్కన భారతి” (మార్చి 2001) లో ప్రకాశితం.]