నింగీ, నీరూ, నికోబార్-1

“అమరేంద్రా, అప్పుడెప్పుడో మనం కాకినాడలో కలుసుకున్నప్పడు ‘నికోబార్ వెళ్ళాలని ఉంది’ అన్నారు గదా. ఇప్పుడు నేను ఆ ఏర్పాట్లు చేయగలను. తప్పకుండా రండి. వీలయినంత తొందరగా రండి. నేనిక్కడ ఎంతకాలం ఉంటానో చెప్పలేం కదా,” పోర్ట్ బ్లెయిర్‌నుంచి రవి ఫోన్ – 2023 అక్టోబర్‌లో.

అంతకు వారం క్రితమే ఐదు వారాల యూకే-ఐర్లాండ్ ప్రయాణం ముగించుకుని ఢిల్లీ చేరాను. మామూలుగా అయితే ‘వద్దులెండి’ అనేవాడినే. కానీ నికోబార్ అంటే అది ఒక అరుదైన అవకాశం. అప్పటికే ఒకసారి అలాంటి అవకాశం కోల్పోయి ఉన్నాను.

అంచేత రవి ప్రతిపాదన నాకు గొప్ప సంతోషం కలిగించింది.

రవి స్వతహాగా కవి. యాత్రా రచయిత. స్నేహశీలి. ప్రజల మనిషి. వృత్తిపరంగా శిరస్సు ఆకాశాన్ని చుంబిస్తున్నా కాళ్ళను నేల మీదనే నిలిపి ఉంచే ప్రవృత్తి అతనిది. యూనియన్ టెరిటరీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రయాణాలు, యాత్రా రచననలు మమ్మల్ని దగ్గరకు చేర్చాయి. 2018 సెప్టెంబర్‌లో, పిల్లలకోసం పనిచేసే ‘క్రియ’ అన్న ఎన్జీవో కాకినాడలో సాహిత్య అకాడమీ తరఫున యాత్రాసాహిత్యం మీద సెమినార్ నిర్వహించినపుడు ప్రత్యక్షంగా కలిశాం – అదిగో అప్పటిది, ఆయన గుర్తు చేసిన నా నికోబార్ ఆకాంక్ష.

కాకినాడలో చెప్పినపుడు – ఆయన అప్పుడు పాండిచ్చేరిలో పని చేస్తున్నారు – “కష్టమండీ. నికోబార్ వెళ్ళడానికి టూరిస్ట్‌లకు అనుమతి ఇవ్వరు. మాలాంటి ఉద్యోగులకు, పరిశోధనలు చేసే స్కాలర్లకు మాత్రమే అక్కడ అడుగుపెట్టే అనుమతి దొరుకుతుంది.” అన్నాడు రవి.

“నేను టూరిస్ట్‌ను కాదు – ట్రావెలర్ని. రీసెర్చ్ స్కాలర్ అన్నంత లేబుల్ తగిలించుకోకపోయినా నికోబార్ వెళ్ళడంలో నా కాంక్ష వేరు. నా అండమాన్ డైరీ చదివారుగదా, నా యాత్రాశైలి మీకు తెలియదూ?” కొంత ఉక్రోషంతోనూ, మరికొంత ఆశతోనూ చర్చ పొడిగించాను.

“తెలుసు… కానీ అధికారగణాల్లో అంత వివరం ఎవరికి అర్థమవుతుంది? వివరించినా అర్థం చేసుకోలేరు. వదిలేయండి.”

వదిలేసాను.

ముందే చెప్పినట్టు నాకు నికోబార్ చూసే అవకాశం చాలాకాలం క్రితమే వచ్చింది. సునామీ తర్వాత పునరుద్ధరణ కార్యక్రమంలో నికోబార్‌లోని ‘కమోర్తా’ ద్వీపంలో సెంట్రల్ పీడబ్ల్యూడీ అధికారిగా పోస్టింగులో వెళ్ళిన యువమిత్రుడొకరు ఇప్పుడు రవి ఇచ్చిన ఆఫరే ఇచ్చాడు. నేనప్పటికింకా రిటైరవలేదు. ఆఫీసు పనులనుంచి పదీ పదిహేను రోజులు విడివడి వెళ్ళడం సమంజసమనిపించక ఆ అవకాశం వదులుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే అది ‘సిరిరా మోకాలడ్డడం’ వంటి నిర్ణయమని స్పష్టమవుతోంది.

ఉద్యోగవిరమణ తర్వాత 2012 లో అండమాన్ వెళ్ళి దాదాపు ఇరవై రోజులు గడిపాను. తనివి తీరక మరోసారి 2020 లో వెళ్ళి, నలుగురూ నడిచే ‘పోర్ట్ బ్లెయిర్ – హేవ్‌లాక్ – నీల్’ దారినుంచి మళ్ళి, పోర్ట్ బ్లెయిర్‌కు ఎనిమిదిగంటల ఓడ దూరాన ఉన్న లిటిల్ అండమాన్ ద్వీపంలో నాలుగయిదు రోజులు గడిపాను. ఆ ద్వీపంలో ఒక నికోబారీస్ విలేజ్ ఉందని తెలిసి, అక్కడికి వెళ్ళి, ఓ పూట గడిపాను. దాని పుణ్యమా అని నా నికోబార్ కాంక్షకు నివురు తొలగి కణకణలాడటం ఆనాడే మొదలయింది.

అదిగో అలాంటి సమయంలో అందింది పైన చెప్పిన రవి ఆహ్వానం.

మరో మాట లేకుండా “తప్పకుండా వస్తాను” అన్నాను.

లేడికి లేచిందే ప్రయాణం కదా – ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనిలో వెంటనే చొరబడ్డాను.

యాత్రలనే కాకుండా అన్ని ఇతర విషయాలలోనూ నాతో సన్నిహితంగా మెలిగే జగన్నాధరావుకు ఈ సంగతి తెలిసింది.

“ఏమాత్రం వీలున్నా నేనూ వస్తాను” అతని ముందంజ.

సందేహిస్తూనే రవికి ఆ మాట చేరవేసాను.

“కాకినాడ జగనా, నాకెందుకు తెలీదూ! క్రియ పిల్లల పండగ జరిపే మనిషే కదా – కాకినాడ సెమినార్లో మీతోబాటు ఆయన్నీ కలిసాను. రమ్మందాం, మరేం పర్లేదు,” రవి భరోసా.

అక్టోబర్ 23, నవంబర్ 3 ల మధ్య 11 రోజుల ప్రయాణమనీ, అందులో ఏడు రోజులు నికోబార్‌కూ, నాలుగు రోజులు అండమాన్లకీ కేటాయించాలనీ ప్రణాళిక సిద్ధమయింది.


స్థూలప్రణాళిక అయితే సిద్ధపరిచానుగానీ దాన్ని సూక్ష్మరూపంలోకి అనువదించి, గెస్ట్‌హౌసులు బుక్ చేసి, హెలికాప్టర్లకూ ఓడలకూ టికెట్లు కొని – మొత్తం కార్యక్రమాన్ని గంటలవారీగా రూపొందించే బాధ్యత రవి తానే తీసుకున్నాడు. అతనితోనూ అతని సహాయకులతోనూ పదే పదే మెసేజీలూ ఫోను సంభాషణలూ జరిపాక సూక్ష్మప్రణాళిక రూపు దిద్దుకుంది.

ఆ ప్రక్రియలో ఒక హంసపాదు: గ్రేట్ నికోబార్ ద్వీపం మాకు అందుబాటులో లేదట. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల మా ప్రయాణాన్ని కార్ నికోబార్ ద్వీపానికీ, దానికి దగ్గరలో ఉన్న కమోర్తా, కచ్ఛల్ అన్న మరో రెండు ద్వీపాలకూ పరిమితం చేసుకోవాలట. అదో నిరాశ. ఇందిరా పాయింట్‌కు హలో చెప్పాలనీ, అక్కణ్ణించి పక్షిమార్గాన వందా నూట యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న ఇండొనీషియా దేశంలోని బండా ఆచే (Banda Aceh) నగరాన్ని ఊహల్లోనే అయినా పలకరించి రావాలనీ అనుకొన్న నాకు, చిన్న నిరాశ.

అన్నట్టు పోర్ట్ బ్లెయిర్‌నుంచి ట్రావెలర్లు అండమాన్ ద్వీపాలలో చేసే ప్రయాణాలన్నీ ఓడల మీదా, బస్సుల మీదా సాగిపోతాయి. నికోబార్‌కు ప్రయాణించడం అంత సులభమైన పని కాదు. రోజూ ఒక షెడ్యూల్ ప్రకారం ఓడలు వెళ్ళడం అన్న సదుపాయం లేదు. పోర్ట్ బ్లెయిర్‌నుంచి అక్కడికి వెళ్ళి వచ్చే అధికారులూ తమ ప్రయాణాలకు ఎక్కువగా హెలికాప్టర్లనే వాడతారు. ఐలాండర్లకు నామమాత్రపు ఛార్జీలు. మాలాంటి అరుదైన అతిథులకు ఐదంకెల రుసుములు!

“నికోబార్ ద్వీపాలు అంటున్నారుగానీ అక్కడ మీరు ఏడు రోజులు గడిపేంత అవసరముంటుందనుకోను. తీరా వెళ్ళాక నిరాశ పడతారేమో. పైగా గ్రేట్ నికోబార్ కూడా అందని చందమామ అయింది కదా; పోనీ నికోబార్ సమయాన్ని తగ్గించుకుని అండమాన్లలో ఎక్కువ సమయం గడుపుతారా?” ఎంతో అక్కరతో అడిగాడు రవి. నేను చూసే చూపుకు ఏడు రోజులయినా చాలవని నాకు తెలుసు. ‘వద్దండీ. ఏడును ఏడుగానే ఉంచుదాం,’ అన్నాను.

కార్ నికోబార్ పేరు పదే పదే విన్నది. గ్రేట్ నికోబార్ తర్వాత ఆ ద్వీపసమూహంలో అదే పెద్దది. మరి కమోర్తా, కచ్ఛల్ ద్వీపాలో? వాటి గురించి తెలిసింది శూన్యం. అలా ‘శూన్య’ ప్రదేశాలలోకి వెళ్ళి జ్ఞాపకాలూ అనుభవాల ముత్యాలవేటలో నిమగ్నమవడం నాకు చేతనయిన విద్య. ఎన్నోసార్లు అలా చేసి, మరచిపోలేని ఫలితాలు సాధించిన అనుభవం ఉంది. ఏ అనుభవం దొరికితే ఆ అనుభవాన్నే ఆస్వాదిద్దాం అన్న స్పష్టతతో నేను ముందడుగు వేసాను. మా జగన్‌కు నా మీద కొండంత నమ్మకముంది. ఆశనిరాశలకు చలించే మనిషి కాదు.


అక్టోబర్ 23, 2023, సోమవారం.

బాగా పొద్దున్నే పోర్ట్ బ్లెయిర్ విమానం.

హైదరాబాద్‌నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు రెండున్నర గంటల ప్రయాణం.

ఆరున్నరకు విమానం ఎక్కీ ఎక్కగానే కిటికీలోంచి సూర్యుడు పలకరించి శుభోదయం చెప్పాడు. ఏమన్నా నిద్రమత్తు ఉంటే అది పటాపంచలైంది. విమానంకన్నా వేగంగా మనసు అండమాన్ సాగరతీరం చేరుకుని ఆకాశంలోంచి కనిపించే చక్కని దృశ్యాలకోసం ఎదురుచూడసాగింది.

ప్రయాణాల్లో నేను పడే సంబరం జగన్‌కు అలవాటే. ఇద్దరం కలసి గత పదేళ్ళుగా సగటున ఏడాదికీ రెండేళ్ళకీ ఒకటి చొప్పున ఇలాంటి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళమే. నేను స్వతహాగా సోలో యాత్రల పక్షపాతిని. ఉన్న సమయమంతా నాతో నేనూ, పరిసర ప్రపంచంతోనూ గడపాలని తాపత్రయపడే మనిషిని. తోడుగా ఒక్కరున్నా, మనదంటూ మనకు మిగిలే సమయం సగమేనని తెలుసు.

కానీ జగన్ అందుకు మినహాయింపు. ఇద్దరం కలిసి ఎజెండా అంటూ లేకుండా గంటల తరబడి మాట్లాడుకొన్న చరిత్ర ఉన్నా, ఏ సమయాల్లో మాటలు కట్టిపెట్టి అవతలి మనిషికి పూర్తి సమయం యిచ్చేయ్యాలో మాకు తెలుసు. మాటలే కాకుండా మౌనమూ తెలిసిన వ్యక్తి అతను. ప్రదేశాలనూ, ప్రకృతినీ, మనుషులనూ కళ్ళతోనే కాకుండా మనసుతో చూసే అభిరుచి ఉన్న మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక అతి చక్కని (సోలో) ట్రావెల్ కంపానియన్.

పోర్ట్ బ్లెయిర్ ఇంకాస్త దూరంలో ఉందనగా దిగువన ఐదారు ద్వీపాలు స్పష్టంగా కనిపించాయి. ఆ ద్వీపాల తీరరేఖల్లో రంగురంగుల ఇసుక… ఆ రేఖను దాటి సముద్రంలోకి చూస్తే నీలిరంగూ ఆకుపచ్చా కలగలిసి సృష్టించి ఉన్న, ఆకట్టుకునే వర్ణాలు… ద్వీపాల భూభాగాల్లో దట్టమైన అడవి. తలలు ఊపుతూ స్వాగతం పలుకుతోన్న వేలాది కొబ్బరి చెట్లు… ప్రకృతి పలుకుతోన్న స్వాగతం అందుతోన్న భావన. అండమాన్ నికోబార్ ద్వీపాలలో 87 శాతం ఆడవులే అన్నది పెద్దగా ప్రాచుర్యం పొందని విశేషం.

ఊరుగాని ఊళ్ళో రైలో విమానమో దిగగానే ఎవరో వచ్చి పలకరించి స్వాగతం చెపితే ఎలా ఉంటుందీ? మహాసంతోషంగా ఉంటుంది. ఆ రోజు తొమ్మిదింటికి ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఓ తెలుగు తెలిసిన తమిళ వ్యక్తి వచ్చి పలకరించాడు. అండమాన్ అడ్మినిస్ట్రేషన్లో పబ్లిక్ రిలేషన్స్ చూసే మనిషట. గౌరవం, ఆప్యాయత ప్రదర్శించాడు. ‘అబ్బాయ్, నేనూ మా బెల్ కంపెనీ పీఆర్ వ్యవహారాలు ఎనిమిదేళ్ళపాటు చూసాను,’ అని చెపితే సంబరపడ్డాడు. అంతా కలసి ఓ చక్కని కాఫీ తాగాక మమ్మల్ని రవి పంపిన కారు డ్రైవర్‌కు అప్పజెప్పాడు.


రాజీవ్ గాంధీ విగ్రహం

తెలిసిన ఊరే అయినా రోడ్లూ భవనాలను గుర్తుపట్టడం, పార్కులకూ ప్రతిమలకూ హలో చెప్పడం సాగిపోయింది. మూడేళ్ళ క్రితమే వచ్చి ఉన్నానుగాబట్టి ఊళ్ళో పెద్దగా మార్పులు కనిపించలేదు. అప్పుడు చూసినట్టే ట్రాఫిక్ ఇప్పుడూ నింపాదిగా, క్రమశిక్షణతో సాగిపోతోంది. హారన్ చప్పుళ్ళు అరుదుగా వినబడుతున్నాయి. స్కూటర్లు నడిపేవాళ్ళే కాకుండా పిలియన్లూ హెల్మెట్లు పెట్టుకుని కనిపించారు. కొత్త ప్రపంచంలోకి వచ్చిన భావన. ముఖ్యమైన జెట్టీ దగ్గర సముద్రంలోకి చొచ్చుకుపోయేలా కట్టిన చిరు రహదారి; దాని అవతలి చివర, పూలదండ విసురుతూ చిరునవ్వులు చిందిస్తోన్న రాజీవ్ గాంధీ అలాగే ఉన్నాడు. ఆ పక్కనుంచే మరో అయిదునిముషాలు సాగాక షాదీపూర్ అన్న ప్రాంతంలో ఉన్న మా గెస్ట్ హౌస్ వచ్చింది. మా డ్రైవరే ముందుకు వెళ్ళి చెకిన్ ప్రక్రియ ముగించాడు. మొదటి అంతస్తులో విశాలమైన గది. దగ్గర్లోని సముద్రం ఎంతో చక్కగా కనిపించే సదుపాయం ఉన్న బాల్కనీ. పక్కనే కొబ్బరి చెట్లు. దూరాన ఓడలు. ‘భలే!’ అనిపించింది. ‘మీకు మొదట్లో కింద రూమ్ ఇచ్చారు. మీ అభిరుచి తెలుసు కదా, అంచేత పనిగట్టుకుని ఈ రూమ్‌లోకి మిమ్మల్ని మార్పించాను,’ అని రవి రెండ్రోజుల క్రితం చెప్పడం గుర్తొచ్చింది. విండో సీట్ దొరక్కపోతే ఆ రైలు ప్రయాణమే వృధా అని వ్యధ చెందే నాకు, రవి చేసిన ఈ మేలు ఒక అపురూపమైన బహుమతి.

మాటల్లోనే రవినుంచి ఫోన్. క్షేమసమాచారాలు. ‘ఆ కారూ డ్రైవరూ రేపు ఉదయం కార్ నికోబార్ హెలికాప్టర్ ఎక్కేదాకా మీకోసమే ఏర్పాటు చేసాను’ అన్న సూచన. మధ్యాహ్నం కలసి లంచ్ చేద్దామన్న ప్రణాళిక. ‘మీతో రెండు మూడు రోజులు కలసి నికోబార్‌లో గడుపుదామనుకున్నాగానీ రేపే బయల్దేరి గ్వాలియర్ వెళ్ళాలి. ఆ ప్రాంతపు ఎన్నికల పరిశీలకునిగా వెళ్ళవలసిన పని నాకప్పజెప్పారు,’ అన్న సమాచారం.

నేనే కాకుండా జగన్ కూడా అండమాన్‌కు పాతకాపే. అంతకు ముందు రెండు మూడేళ్ళ క్రితం వచ్చి ఓ వారం గడిపి వెళ్ళాడు. అంచేత ఇద్దరికీ పోర్ట్ బ్లెయిర్‌లో కొత్తగా చూడవలసినవేమీ లేవనే చెప్పాలి. అయినా ‘తెలిసిన ప్రదేశాలనే మరోసారి పలకరించి వద్దాం,’ అని ఇద్దరం అనుకున్నాం. సెల్యులర్ జైలు, కార్బిన్స్ కోవ్ (Corbyn’s cove), వాండూర్, చిడియా టాపూ – అలా మా వడపోతలో నిగ్గు తేలిన ప్రదేశాలు.


ప్రశాంతత, పచ్చదనం

అండమాన్ ద్వీపశ్రేణిలో ముఖ్యమైన ద్వీపాలు మూడు: నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్. ఆ సౌత్ అండమాన్ ద్వీపపు దక్షిణభాగంలో, ఆ ద్వీపసమూహపు రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఉంది. ఆ ఊరికి దక్షిణాన ఎయిర్‌పోర్ట్ ఉంటే ఉత్తరాన అబర్డీన్ బజార్, జెట్టీ, ఫీనిక్స్ బే, సెల్యులర్ జైల్‌వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. కార్బిన్స్ కోవ్ బీచ్ తూర్పుదిశలో నాలుగు కిలోమీటర్లు. ఊరు దాటి పశ్చిమంగా ఇరవై పాతిక కిలోమీటర్లు వెళితే మహాత్మా గాంధీ నేషనల్ మెరైన్ పార్క్‌కు ముఖద్వారంలా నిలచే వాండూర్ అన్న పల్లెటూరు. బాగా దక్షిణాన పాతిక కిలోమీటర్ల దూరాన చిడియా టాపూ అన్న విహార స్థలం. సౌత్ అండమాన్ ద్వీపపు దక్షిణ కొస అది. సూర్యాస్తమయ సుందరదృశ్యాలకూ స్కూబా డైవింగ్‌లాంటి జలక్రీడలకూ ఈ చిడియా టాపూ ప్రసిద్ధి.

గెస్ట్‌హౌస్‌లోంచి బయటపడి ముందుగా ఇద్దరం కార్బిన్స్ కోవ్ వేపు వెళ్ళాం. మూడేళ్ళ క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఆధునికత పెరిగినా, దుకాణాలు ఎక్కువయినా, ప్రశాంతత చెదరలేదు. ఆ తర్వాత సెల్యులర్ జైలు ప్రాంగణం వైపు వెళ్ళాం. ఎన్ని విషాదగాథలను తనలో దాచుకున్నా దాని గాంభీర్యం సడలలేదు. లోపలికి వెళదామా వద్దా అని ఇద్దరం కళ్ళతో మాట్లాడుకొని, వద్దని తేల్చుకున్నాం. వెళ్ళి క్షుణ్ణంగా చూడాలంటే కనీసం రెండు గంటలు. లోపలికి వెళ్ళవద్దనుకున్నా ఆ ప్రాంగణం బయటే ఓ అరగంట గడిపాం. కొత్తగా వెలసిన — ఆ జైల్లో గడిపిన ప్రముఖుల — విగ్రహాలు చూసాం. ఆకట్టుకొనే ఆసక్తికరమైన ప్రదేశమది. కాసేపు జెట్టీ దగ్గర ఆగి రాజీవ్ గాంధీని పలకరించి వచ్చాం. లంచ్ టైమ్ అయ్యేసరికి డ్రైవర్ మమ్మల్ని రవి చెప్పి ఉంచిన రెస్టారెంటుకు తీసుకు వెళ్ళాడు.

రెస్టారెంటు లోపల అడుగుపెట్టగానే గుర్తు పట్టాను. పధ్నాలుగేళ్ళ క్రితం — 2012 లో — అప్పటి మా హోస్ట్, కమాండర్ బిందు ప్రకాష్‌తో కలసి వచ్చి ఓ పూట లంచ్ చేసిన నికోబార్ రెస్టారెంటే అది. కాస్తంత ఎత్తైన ప్రదేశంలో, చేరువనే సముద్రం, కాస్తంత దూరాన ద్వీపాలు – కొండలు, దూరాన కనిపించే లైట్ హౌస్ -– జ్ఞాపకాలు ముంచెత్తాయి. ఈలోగా రవి వచ్చి మాతో చేరాడు. 2018 లో కాకినాడలో కలిసాక మళ్ళా అతణ్ణి ఇదే కలవడం. అవే మాటలు, అదే స్నేహం.


రవిప్రకాష్ తో

కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్ ప్రయాణం ఉన్నా, వెళ్ళేముందు చక్కదిద్దాల్సిన పనులు ఎన్నో ఉన్నా, ఆ ఒత్తిడి ఏ మాత్రం కనిపించనివ్వకుండా మాతో గంటా గంటన్నర గడిపాడు రవి. ఆ మధ్యే యానాంనుంచి దాట్ల దేవదానం రాజు, ఇతర కవిమిత్రులు వచ్చి వెళ్ళిన వైనం చెప్పుకొచ్చాడు. తన రెండు మూడేళ్ళ అండమాన్ తీపీ వగరూ అనుభవాలు పంచుకున్నాడు. “నాకూ నికోబార్ ఓసారి చూడాలని ఉంది. మీతోబాటు రెండు మూడు రోజులైనా వద్దామనుకున్నాను. ఈలోగా ఈ బాధ్యత –- మీరు మీ బాణీలో ఆ ద్వీపాల జీవితాన్ని ఆస్వాదించండి. నాకు తెలిసినంతవరకూ మీకు కార్ నికోబార్‌లో కన్నా కమోర్తా, కచ్ఛల్ ద్వీపాలలోనే మరింత సంతృప్తి కలిగించే అనుభవాలు ఎదురవుతాయి. మనుషుల జాడతో కలుషితం కాని ద్వీపాలవి,” అంటూ శుభం పలికాడు. విడివడేముందు, జ్ఞాపికగా ఫోటో తీసుకుందాం అని గుర్తు చేసాడు. లంచ్ ముగిసాక అండమాన్ పరిపాలనాసముద్రంలో ఉరికి దుమకడానికి సాగిపోయాడు.

అతనితో గడిపిన ఆ రెండు గంటల పరిమళం అండమాన్ నికోబార్ ద్వీపాలలో గడిపిన పది రోజులూ మా మనసునుంచి తొలగలేదు.


నికోబార్ రెస్టారెంట్‌నుంచి బయటపడేసరికి మూడయింది. “మనం లంచ్ తర్వాత వెళదామనుకున్నది వాండూర్, చిడియా టాపూ. ఒకటి దక్షిణం ఒకటి పడమర – అంతా కలసి 60-70 కిలోమీటర్ల రౌండ్ ట్రిప్ అవుతుంది. కాస్సేపు గెస్ట్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుని, రెండింటిలో ఒకదానికి వెళ్ళి రావడం ఒక పద్ధతి. తిన్నగా వెళ్ళిపోయి రెండూ చూసి, ఎనిమిది గంటల ప్రాంతంలో గూటికి చేరడం రెండో పద్ధతి. మీ ఆలోచన ఏమిటీ?” జగన్‌ను అడిగాను.

“గెస్ట్‌హౌస్‌కు వద్దు. తిన్నగా వెళ్ళిపోదాం,” అన్నాడు. అతను ఆ మాట అంటాడని నేను ఊహించాను.

“చిడియా టాపూ నేనింతకు ముందు వెళ్ళాను. వాండూర్ నాకు కొత్త. ఏముందక్కడా?” అడిగాడు జగన్.

“అబ్బో, అదో పెద్ద కథ. స్థూలంగా చెప్పాలంటే గాంధీ మెరైన్ పార్క్‌కు ప్రవేశద్వారమది. జెట్టీ ఉంది. దానికి ఐదూ పది కిలోమీటర్ల దూరంలో నాలుగైదు అందమైన చిన్న చిన్న ద్వీపాలున్నాయి. మనిషి స్థిరనివాసం ఏర్పరచుకోని ద్వీపాలవి. మహాసుందరమైన బీచ్‌లు, రంగురంగుల కోరల్స్‌కు వాండూర్ పార్క్ ప్రసిద్ధి. 2012 లో నేను వెళ్ళాను. రోజంతా పట్టే అండమాన్ టూరిజం వాళ్ళ ట్రిప్పది. కానీ మనం వెళుతోంది అక్కడి ద్వీపాలు చూడాలనీ కాదు, కోరల్స్ అసలే కాదు. ఆ పాతిక కిలోమీటర్ల ప్రయాణమూ చక్కని పల్లెటూళ్ళ మధ్యనుంచి వెళుతుంది. జనజీవనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎక్కడన్నా ఆగి టీ తాగుతూ అక్కడి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవచ్చు,” వీలయినంత క్లుప్తంగా వివరించాను.

సంతోషపడ్డాడు జగన్. రోగి కోరినదీ వైద్యుడు చెప్పినదీ ఒకే పథ్యం అయితే మరి సంతోషమే కదా!

ముందుకు సాగాం. రోడ్లు అంత బాగోలేవుగానీ ట్రాఫిక్ అన్న మాటే లేదు. వాండూర్ ప్రాంతం అలా వచ్చి ఇలా వెళ్ళే టూరిస్టుల ప్రదేశం కాదు. ఒకింత అవగాహన, కొండంత అభిరుచి ఉన్నవాళ్ళే అక్కడికి రావడం, రోజంతా గడపటం జరుగుతుంది. ఏదేమైనా ఆ గంట ప్రయాణమూ హాయిగా సాగింది. మేం వెళుతున్న దారిలో నా పూర్వజ్ఞాపకాలను అనుసంధించే ప్రయత్నం చేసానుగానీ అంతగా ఫలించలేదు. పదకొండేళ్ళంటే పరిసరాలూ మారతాయి, జ్ఞాపకమూ మసకబారుతుంది.

కానీ ఒకసారి వాండూర్ జెట్టీ చేరగానే జ్ఞాపకాల మసక చెల్లాచెదురైంది. అదే చెకింగ్ కాబిన్. అదే జెట్టీ దారి. అవే పచ్చని పొదలు. రంగురంగుల పూలు. మధ్య టీ దుకాణం. పూర్వం ఆ షాపును చూసి, ‘బాపుగారు చూస్తే రామాయణం సినిమాలో పర్ణశాలకు నమూనాగా తీసుకుంటారు’ అని ముచ్చట పడ్డ దుకాణం అదే. కానీ ఒక్కటే తేడా: పోయినసారి దుకాణం తెరచి ఉంది. ఈసారి — మరి, పర్యాటకులు వచ్చే సమయం కాదుగదా -– మూసివేసి ఉంది.

అప్పటికే నాలుగు దాటింది. అయిదున్నరకల్లా సూర్యాస్తమయం అయిపోతుంది. బాగా తూర్పున ఉన్న ప్రాంతం కదా – మెయిన్‌లాండ్‌తో పోలిస్తే భౌగోళికంగా సమయం కనీసం గంట ముందు ఉంటుంది. వెంటనే బయల్దేరకపోతే చిడియా టాపూలో సూర్యాస్తమయం చూడలేం.

కరెక్టుగా గంట పట్టింది. చివరిదాకా రథంలా సాగిన కారు చివరి అరకిలోమీటరు మేరా ఎడ్లబండి నడక నడిచింది. విపరీతమైన జనసందోహం. కార్లు. కేకలు. దుకాణాలు. దూరాన అందాలు ఎప్పట్లానే ఉన్నా పరిసర నాగరిక వాతావరణం శ్రుతి తప్పిన రాగం అయిపోవడంవల్ల, ఏదో చూసాం అంటే చూసాం అనుకొంటూ, సూర్యాస్తమయం షో ముగిసీ ముగియగానే, జనమంతా పొలోమని ఎగబడేలోగా, కారును ముందుకు దాటించి, ‘హమ్మయ్య’ అని తెప్పరిల్లాం.

గెస్ట్‌హౌస్ చేరేసరికి ఏడున్నర దాటింది. స్నానాలు ముగించి డైనింగ్ రూమ్‌కు వెళితే ఈశాన్యరాష్ట్రాలనుంచి వచ్చిన పిల్లలు కనిపించారు. ఏదో కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొనడానికి అంత దూరంనుంచి వచ్చారట. వారిలో గొప్ప ఉత్తేజం కనిపించింది. ముందు వాళ్ళతోబాటు వచ్చిన టీచర్లను పలకరించాను. చక్కగా స్పందించారు. ఆ తర్వాత పిల్లలతో సంభాషణ సులభమయింది. ఉన్న ఊళ్ళో పరాయి వాళ్ళతో సంభాషించడానికి అంతగా ముందుకు రాని మనిషి అండమాన్‌లాంటి ప్రదేశాల్లో, పలకరింపు అందగానే ఆనందంగా స్పందించి కబుర్లాడడానికి ముందుకు రావడం నాకు పదే పదే అనుభవంలోకి వచ్చిన విషయమే.

రూమ్‌కు చేరాక అలసట అలుముకుంది. ఎప్పుడో తెల్లారుఝామున మూడింటికి లేచిన వాళ్ళం దాదాపు 18 గంటలు లేళ్ళలా పరుగులు పెట్టాం. ముసుగు తన్నే సమయంలో జగన్ “చిడియా టాపూ గందరగోళం సంగతి ఎలా ఉన్నా, ఒక్కసారిగా నికోబార్ ద్వీపాల నట్టనడుమన వాలిపోకుండా ఇలా తెలిసిన చోట ఒక పూట రిలాక్సవుతూ గడపటం బావుంది. ఇది చక్కని బఫర్ మనకు,” అన్నాడు.

పాపం, నా అల్పసంతోషం అతనికీ సోకుతోందన్నమాట!


హెలికాప్టర్ ప్రయాణసరళి వింతగా, ఆసక్తికరంగా ఉంటుంది.

’70లు ’80ల్లో విమానాల్లో ఇచ్చినట్టుగా (ఇంటర్ ఐలాండ్ హెలికాప్టర్ సర్వీసెస్ వాళ్ళు) టికెట్ బుక్‌లెట్ ఇచ్చారు – లోపల కార్బన్ కాపీలతో సహా!

హెలికాప్టర్ స్టేషన్లో బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడానికి ముందే మనుషుల బరువులు తూచి ఆ తర్వాత లగేజీని తూచారు. బహుశా లోపల సీటింగ్ ఏర్పాటు కూడా ఆయా మనుషుల ‘బరువుల’ మీదే ఆధారపడి ఉంటుందనుకుంటాను. హెలికాప్టర్లు ఎగిరినప్పుడు బరువుల సమతూకం ఎంతో ముఖ్యం. ఆ సంగతి ఎలా ఉన్నా జగన్‌కు హెలికాప్టర్ అనుభవం ఉందో లేదోనని అనుమానం వచ్చి, దిగువ దృశ్యాలు బాగా కనిపిస్తాయని ‘కిటికీ’ సీటులో కూర్చోమన్నాను.

“వద్దండీ, నాకు బెరుకుబెరుకుగా బితుకుబితుకుమంటూ ఉంది,” అన్నాడు. మొదటిసారి ఎక్కినపుడు నాకూ అలానే అనిపించడం గుర్తొచ్చింది.

ఫార్మాలిటీలన్నీ ముగించి హెలికాప్టర్ కోసం ఎదురుచూస్తున్నపుడు వెయిటింగ్ రూమ్‌లో ఉన్న ఒక కుటుంబంతో మాట కలిసింది. దంపతుల వయసు ముప్ఫయికి అటూ ఇటూగా ఉండవచ్చు. ఆమె చేతుల్లో ఏడాది నిండీ నిండని పాప. ఆయన బీహార్ కేడర్ ఐయేఎస్ అట. ఆమె సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్నారు. తన ఉద్యోగం గురించీ, అందులో ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించీ ప్రశ్నలు అడిగాం. స్నేహంగా సమాధానాలు చెప్పాడు. “ఇదిగో ఈవిడ చూడండి. నాకన్నా ఎక్కువ జీతం. సవాళ్ళు మాకు – జీతాలు వీళ్ళకి,” అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈయనా, కార్ నికోబార్‌లోని జిల్లా అధికారీ ట్రైనింగ్ సమయంలో స్నేహితులయ్యారట.

పైలెట్లతో కలిసి అంతా ఎనిమిదిమందిమి. అలవాటు ప్రకారం పైలెట్లతో మాట కలిపే ప్రయత్నం చేసానుగానీ వారిది పలుకే బంగారం బాణీ. మాజీ వాయుసేన ఉద్యోగులట.

మా వాహనం తూనీగలా గాల్లోకి లేచింది. హెలిపాడ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక పక్కన ఉన్నట్లు గుర్తు. ఆటో రిక్షాల్లో ఉన్నట్లు తగుమాత్రపు తలుపులు. విమానాలతో పోలిస్తే ఎంతో దిగువన ప్రయాణం. దారంతా స్పష్టంగా కనిపించింది. ద్వీపాల తీరరేఖలలో వివిధ గాఢతలు సంతరించుకున్న నీలి రంగు సముద్రం… అదిగో చిడియా టాపూ, అదిగో రట్లాండ్ ఐలాండ్, అదిగో సింక్వీ అంటూ నా వినిపించీ వినిపించని కేరింతలు. 2020 లో లిటిల్ అండమాన్‌నుంచి ఈ తూనీగ ప్రయాణం చేసా గదా – అదిగో అప్పుడు ఈ ద్వీపాలతో గగన పరిచయం. ఈలోగా దిగువన లిటిల్ అండమాన్ కనిపించనే కనిపించింది – హట్ బే జెట్టీ, ఛాటమ్ బీచ్, కాలా పత్థర్ లగూన్ – నేను నాలుగు రోజులు పదే పదే తిరుగాడిన ప్రదేశాలు.

సరిగ్గా గంటసేపట్లో కార్ నికోబార్‌లో హెలికాప్టర్ దిగాం.

పక్షి మార్గాన 275 కిలోమీటర్లట. ఓడలో వస్తే సగటున పదిహేను పదహారు గంటల ప్రయాణమట. మధ్యలో ఏ లిటిల్ అండమాన్‌లోనో ఆగితే, అది అదనం. గతంలో నేను వంద కిలోమీటర్ల దూరాన ఉన్న లిటిల్ అండమాన్‌కు పోర్ట్ బ్లెయిర్‌నుంచి ఓడలో వెళ్ళినపుడు ఏడుగంటలు పట్టిన గుర్తు. ఏదేమైనా చక్కని ఆకాశయానం. వడ్డింపు మాత్రం భారీగా ఉంది: దాదాపు 11 వేలు.

కార్ నికోబార్‌లో దిగీ దిగగానే మాకు సహాయపడటానికి రమేష్ అన్న ఉద్యోగికి చెప్పి ఉంచాడు రవి. స్థూలంగా తాను ఏర్పాట్లు చేస్తూనే రోజువారీ సహాయాలకోసం జాన్సన్ అన్న ఉద్యోగిని నియోగించాడు రమేష్. హెలికాప్టర్ ఎక్కగానే జాన్సన్‌కు ఫోన్ చేసి చెప్పాను. దిగీ దిగగానే ఎదురొచ్చి పలకరించాడు. ‘మాకు కార్లూ జీపులూ వద్దు; ఒక టూ వీలర్ చాలు’ అని పదే పదే చెప్పినా కారు తీసుకుని రానే వచ్చాడు జాన్సన్. మేము అభ్యంతరపెడితే, “ఈ ఒక్క రోజుకు కారు ఉండనివ్వండి. ఈ ప్రదేశం మీకు కొత్తగదా – మెరికలాంటి కుర్రాణ్ణి డ్రైవర్‌గా పెట్టాను. ద్వీపంలోని ముఖ్యమైన ప్రదేశాలూ రోడ్లూ పరిచయం చేస్తాడు. రేపు మీరన్నట్టు బైక్ మీదే తిరుగుదురు గాని,” అని సమాధానపరచాడు. సరేనన్నాం.

అయిదు నిముషాల్లో గెస్ట్‌హౌస్ చేరాం. ఎంతో సంసారపక్షంగా, మిలిటరీ బారక్స్ శైలిలో ఉందా గెస్ట్‌హౌస్. మళ్ళీ శుభ్రతకూ సదుపాయాలకూ కొదవు లేదు. అన్నట్టు, ఉదయం హెలికాప్టర్లో మాతోపాటు వచ్చిన దంపతులు కూడా మా గెస్ట్‌హౌస్‌లోనే స్థిరపడి కనిపించారు. పలకరించాం.

‘సాయంత్రం కలసి భోంచేద్దాం ర’మ్మని జాన్సన్‌ను పిలిచాం. అదే ఊపులో ఫోన్ చేసి రమేష్‌నూ ఆహ్వానించాం. ఇద్దరూ ఒప్పుకున్నారు – ‘కొంచెం లేటుగా వస్తాం’ అన్నారు. ‘డ్రైవర్ కుర్రాడు కాస్తంత చురుకు’ అని హెచ్చరించాడు జాన్సన్. ‘నికోబారీస్ గ్రామాల్లో మరీ చొరవ చేయకండి – అంత త్వరగా కలిసే మనుషులు కాదు’ అని కూడా చెప్పాడు.


అండమాన్ నికోబార్ ద్వీపసమూహంలో అంతా కలసి 572 ద్వీపాలున్నాయని ఇప్పటిదాకా వినవచ్చిన లెక్క. ఈ మధ్యనే డ్రోన్ల సాయంతో ఆ జలాలలోని చిట్టి ద్వీపాలనూ, నీటిలోంచి బయటకు తొంగిచూసి ప్రపంచాన్ని పలకరించే రాతి బండలను (Rocky outcrops) కూడా కలుపుకుని ఆ సంఖ్య 836కు చేరింది. అందులో మనుషులు నివసించేది 38 ద్వీపాల్లోనే. మొత్తం జనాభా సుమారు నాలుగు లక్షలు – అందులో లక్షన్నరమంది నివాసం రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లోనే. ఈ అండమాన్ల జనాభాలో మూలవాసుల సంఖ్య అతి స్వల్పం. ఈ మొత్తం ద్వీపాల విస్తీర్ణం 8250 చదరపు కిలోమీటర్లు. పోల్చి చూస్తే సిక్కిం విస్తీర్ణంకన్నా పదిహేను శాతం ఎక్కువ.

అండమాన్ ద్వీపాలకు దక్షిణాన, 10 డిగ్రీల అక్షాంశానికి దిగువన కూడి ఉన్న 22 ద్వీపాల సమూహాన్ని స్థూలంగా నికోబార్ ఐలాండ్స్ అని వ్యవహరిస్తూ ఉంటారు. భౌగోళికంగానూ, మూలవాసుల పరంగానూ, విద్య-అభివృద్ధుల పరంగానూ జనాభాపరంగానూ, ఈ నికోబార్ ద్వీపాలు అండమాన్ ద్వీపాలకన్నా బాగా భిన్నమయినవి. అంతా కలిసి 40 వేల జనాభా – మళ్ళా అందులో దాదాపు 70 శాతం మూలవాసులు. 22 ద్వీపాల్లోనూ మనుషులు నివసించే ద్వీపాల సంఖ్య 12. అన్నీ కలిసి 1841 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం – అంటే గోవాలో సగం. మనుషులు నివసించే పన్నెండు ద్వీపాలలోనూ జనాభాపరంగా కార్ నికోబార్ పెద్దది: దాదాపు 20 వేలు. మూలవాసుల పరంగానూ ఈ ద్వీపం అతి ముఖ్యమయినది – 17 వేలు; అంటే 85 శాతమన్నమాట. ఆ తర్వాత వచ్చేవి కమోర్తా (4000 జనాభా), కచ్ఛల్ (2700), లిటిల్ నికోబార్ (300). అన్నట్టు మా యాత్రాప్రణాళికలో లేని గ్రేట్ నికోబార్, వైశాల్యం రీత్యా అన్నిటికన్నా పెద్దది – 910 చదరపు కిలోమీటర్లు. జనాభాపరంగా రెండవది (8500). మొత్తం అండమాన్ నికోబార్ ద్వీపాలలో మూడు జిల్లాలు ఉంటే ఆ మూడవ జిల్లా నికోబార్ ఐలెండ్స్ – కార్ నికోబార్‌లోని పెర్కా అన్నది ఈ మూడవ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాకు డెప్యూటీ కమీషనర్ అధినేత. సహాయకులుగా ముగ్గురు అసిస్టెంట్ కమీషనర్లు. వీళ్ళంతా ముందు చెప్పుకున్న డానిక్స్ కేడర్ అధికారులు. మేం వెళ్ళినపుడు నికోబార్ జిల్లా డెప్యూటీ కమీషనర్‌గా ఓ మహిళా అధికారి ఉన్నారు. అన్నట్టు ఇక్కడి డెప్యూటీ కమీషనర్ అన్న పదవి మనకు బాగా పరిచయమైన డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ అన్న పదవులకు సమానమైనది. పైన చెప్పిన ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్లు నికోబార్ ఐలాండ్స్ జిల్లాలోని కార్ నికోబార్, నాన్ కోవె ద్వీపసమూహం, గ్రేట్ నికోబార్ అన్న మూడు తహసీళ్ళకు బాధ్యులు.


కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ద్వీపం కార్ నికోబార్.


కార్ నికోబార్

అంతా సమతల ప్రదేశం. పరిణతిగల రహదారి వ్యవస్థ. ఎటు చూసినా బీచ్‌లు. అంతా కలసి 16 గ్రామాలు. ఆ మారుమూల ద్వీపాలలో మనుషుల్ని ఆకర్షించి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోమని ప్రేరణ కలిగించే శక్తీ వనరులూ కలది కార్ నికోబారే. అందుచేతనే 20 వేల జనాభాను సమకూర్చుకోగలిగింది. నికోబార్ ద్వీపాల్లోని మూలవాసులలో 60 శాతం మందినీ, సెటిలర్లలో 40 శాతంమందినీ తనలో నిలుపుకోగలిగింది. కానీ ఆ భౌగోళిక సౌభాగ్యమే 2004 సునామీ సమయంలో కార్ నికోబార్ ద్వీపానికి శాపంగా పరిణమించిందట. అండమాన్ ద్వీపాల్లోని మూలవాసులకు గుట్టలెక్కి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఆ అవకాశం లేక, తీరరేఖలోని వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారట. ఇరవై యేళ్ళుగా ఆ కన్నీటి చుక్కల తడి ఆరలేదు అన్న విషయం, కాస్తంత మనసు పెట్టి గమనిస్తే అర్థమవుతుంది. ప్రయత్నించి చూస్తే ఆ జలప్రళయంలో ఆప్తులను కోల్పోయిన వారు చెప్పే విషాదగాథలు వినిపిస్తాయి. వారి వివరాలు కనిపిస్తాయి.

మా డ్రైవరు కుర్రాడు – జాన్సన్ చెప్పినట్టే – హుషారైన మనిషి. జిల్లా ఆఫీసుతో ముడిపడి ఉన్నాడుగాబట్టి లోకజ్ఞానం బాగా ఉంది. వచ్చిన అతిథులకు తమ ద్వీపవిశేషాలు చూపించాలన్న తపనతోబాటు, వీళ్ళంతా తెలిసీ తెలియని అతి ప్రవర్తనతో తమ గ్రామాల్లోని జీవనసరళిని చెదరగొట్టే ప్రమాదముందనీ, అలా జరగకుండా కాపాడవలసిన బాధ్యత తన మీద ఉందనీ భావించే మనిషి. జాన్సన్ ఆ విషయంలో ముందే హెచ్చరించడం నాకు బాగా మంచిదయింది.

మాకోసం రమేష్ – జాన్సన్‌లు పెద్ద ప్రణాళికే రచించి ఉంచారు. ఖ్యాతి వహించిన నికోబారీస్ నివాసగృహాల నమూనా, అందమైన సాగరతీరాలు, సునామీ స్మారక చిహ్నం, ఊళ్ళోని దీపగృహం – వీటితోపాటు కోరల్స్ ఉన్న ఒక బీచ్‌లో స్నోర్కెలింగ్ – అబ్బో రోజంతా తీరికలేని కార్యక్రమం.


నికోబారీస్ హట్

మొట్టమొదట చుక్‌చుకా అన్న ప్రముఖ గ్రామంలో నిర్మించిన నికోబారీస్ హట్ చూడడానికి వెళ్ళాం. విశాలమైన రెండంతస్తుల కుటీరమది. నిర్మాణమంతా వెదురుగడలతోనే – అయినా దిట్టంగా కట్టిన కట్టడమది. తనకు చేతనైన రీతిలో తమ గృహాల గురించి మా మిత్రుడు వివరించాడు. వివరాలు చెప్పే ఫలకాలు ఆ కుటీరం ముందు ఉండనే ఉన్నాయి. అలవాటు ప్రకారం ఆ ప్రాంగణంలో కనిపించిన ఓ నికోబారీ పెద్దాయనను పలకరించాను. మా వాడి కళ్ళల్లో కాస్త అసంతృప్తి. ఆ పక్కనే మనుషులుండే నీలి రంగు నివాసాలు, అందమైన ఆటస్థలం కనిపిస్తే అటు నాలుగడుగులు వేసాను. ఈసారి స్పష్టమైన మౌన నిరసన ఎదురయింది. తమాయించుకున్నాను. మొత్తానికి నా యువమిత్రుడు నన్ను బాగానే అదుపు చేస్తున్నాడే అనిపించి నవ్వొచ్చింది.

మా తర్వాతి గమ్యం పాసా బీచ్ అన్న బహుసుందరమైన సాగరతీరం. ఏడు కిలోమీటర్ల దూరం – దారి పొడవునా పచ్చదనం. కొబ్బరి చెట్లతో నిండిన అతి చక్కని చిరు రహదారి… చకచకా ఫోటోలు.

సందర్శకుల తాకిడి సోకని సాగరతీరాలు ఎంత అందంగా ఉండగలవో నాకు తెలుసు. లిటిల్ అండమాన్ ద్వీపంలో అలాంటి ఆయా బీచ్‌లలో పదే పదే తిరిగిన అనుభవముంది. అయినా ఈ కార్ నికోబార్ బీచ్ నా అంచనాలకు అందనంత ఎత్తున నిలబడి ఎంతో మురిపించింది. నా విస్మయం చూసి సంబరపడిన మా యువమిత్రుడు, ‘మాకు ఇలాంటి బీచ్‌లు కనీసం పది ఉన్నాయి,’ అంటూ మురిపెం నిండిన మాట కలిపాడు. అంత అందం ఊహించని జగన్ కుడివేపు చూడాలా, ఎడమవేపు చూడాలా, లలితంగా విస్తరిస్తూ మా పాదాలను తడుపుతోన్న తెల్లని కెరటాలను పలకరించాలా, వెనక నిలచి ఉన్న పచ్చని అడవిని చూడాలా – ఏం చేయాలో దిక్కు తోచక అలా నిలబడి పోయాడు. ‘ఇవాళంతా ఇక్కడే గడిపేద్దాం అన్నా అందుకు నేను సిద్ధం’ అని ప్రకటించాడు. దాదాపు గంటన్నర గడిపామక్కడ.

‘పదండి, మీకోసం మరో మంచి ప్రోగ్రామ్ ఎదురుచూస్తోంది,’ అంటూ మమ్మల్ని లేవదీసాడు మా యువమిత్రుడు. ‘వెళదాంగానీ కాసేపు సునామీ మెమోరియల్ దగ్గర ఆగుదాం’ అన్నాను.


సునామీ మెమోరియల్

చక్కని అభిరుచితో గాంభీర్యం నిండేలా రూపకల్పన చేసిన ప్రాంగణమది. ‘2004 సునామీలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళిగానూ, అప్పటి తరం వాళ్ళు ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నారో ముందు తరాల వారికి గుర్తు చేయడానికీ, ఎన్ని సునామీలు వచ్చినా నికోబార్ ద్వీపాలు కృతనిశ్చయంతో అభివృద్ధి పధంలో సాగుతూనే ఉంటాయి అని చెప్పడానికీ ఈ స్మారక ప్రాంగణం నిర్మించాం’ అని వివరించే శిలాఫలకం నా మనసును ఆకట్టుకుంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాను.

సునామీ మెమోరియల్ దగ్గర ఓ కొత్తమనిషి వచ్చి మాతో చేరాడు. తనతోపాటు ఒక బ్యాక్‌ప్యాక్ – అంతా కలసి దగ్గర్లోనే ఉన్న టీటాప్ బీచ్ అన్న ప్రదేశం చేరాం. సముద్రం ఒడ్డున రెండు మూడు కట్టడాలు. అక్కడి చెట్లకు తగిలించి ఉన్న లైఫ్ జాకెట్లు. ‘ఏవిటీ సంగతీ’ అంటూ మా డ్రైవర్ మిత్రుణ్ణి కళ్ళతో క్రొశ్నించాను. ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘ఆయన మీకు స్నోర్కెలింగ్ అనుభవం సమకూర్చడానికి ప్రత్యేకంగా వచ్చాడు,’ అని వివరించాడు. ఊహించని అతిధి సత్కారమది. బోలెడు సంతోషం, కొంచెం ఇబ్బంది. అక్కడి కట్టడాలు బట్టలు మార్చుకునే సౌకర్యం ఉన్న వాష్‌రూమ్‌లట. అటు వెళుతోంటే మాతోపాటు హెలికాప్టర్లో వచ్చి, గెస్ట్‌హౌస్‌లో మా పొరుగున ఉన్న దంపతులు కనిపించారు. హలోలు చెప్పుకునేలోగానే కార్ నికోబార్ డెప్యూటీ కమీషనర్ కారు దిగారు. తిరిగి తిరిగి అలసి ఉన్న మా కాజువల్ అవతారాలతో వెళ్ళి పలకరించడం సబబేనా అనిపించినా, చివరికి వెళ్ళి ఆమెతో పరిచయం చేసుకున్నాను. ‘ఓ మీరేనా, రవి చెప్పారు,’ అని స్పందిస్తూ ఆమె మళ్ళీ తన మిత్రులతో కబుర్లలో పడిపోయారు. తన బీహార్ మిత్రులు స్నోర్కెలింగ్ కోసం నీళ్ళలోకి వెళ్ళినపుడు ఆమె వాళ్ళ పసిపాపను తన దగ్గర ఉంచుకుని ఆలనా పాలనా చూసారు.


స్నోర్కెలింగ్ సన్నాహాలు

అండమాన్ నికోబార్ ద్వీపాలు పగడాల నిధులు. నిన్న వెళ్ళిన వాండూర్‌లో ఉన్నంతగా కాకపోయినా నికోబార్ ద్వీపాలలోనూ కోరల్స్ ఉన్నాయి. కార్ నికోబార్‌లో వాటిని చూడటానికి అనువైన ప్రదేశం ఈ టీటాప్ సాగరతీరం. కోరల్స్ అందాలను చూడటానికి స్కూబా డైవింగ్ అతి ఉత్తమ మార్గమయితే, ఈ స్నోర్కెలింగ్ రెండవ బెస్ట్ పద్ధతి. అక్కడ ఉన్న లైఫ్ జాకెట్ తగిలించుకుని, నీటి ఉపరితలం మీద మన శరీరాన్ని తేలి ఉండేలా చేయడానికి లైఫ్‌బోయ్‌లను కూడా తగిలించుకుని, నీళ్ళల్లో చూడటానికి అనువుగా ఉండే వాటర్ టైట్ గాగుల్స్ పెట్టుకుని, తలను నీళ్ళలో ఉంచి కోరల్స్‌ను చూస్తున్నపుడు ఊపిరి పీల్చుకోడానికి ఉపయోగపడే ఆరంగుళాల పరికరాన్ని ముక్కూ నోళ్ళకు తగిలించుకుని, నీళ్ళలోకి దిగాం. ఓ అరగంట కోరల్స్ మధ్య గడిపాం. ఏమాటకామాట చెప్పుకోవాలి – అంతకు ముందు హేవ్‌లాక్ ద్వీపంలో చూసిన కోరల్స్‌తో పోలిస్తే ఈ టీటాప్ కోరల్స్ ఏ మాత్రం సరితూగవు…

అంతా ముగిసేసరికి కడుపులోని ఎలుకలు పరుగులు పెట్టసాగాయి. గెస్ట్‌హౌస్‌కు వెళ్ళి ఆ పని ముగించుకుని మళ్ళా ద్వీపాల చుట్టూ తిరగడం కొనసాగించాం. అప్పుడే కార్ నికోబార్ బాగా తెలిసిన ప్రదేశంలా అనిపించసాగింది. గెస్ట్‌హౌస్ ఉన్న ప్రాంతం, ఆ పక్కనే ఉన్న ఎడ్వర్డ్ కచర్ పార్క్, దుకాణాలు, శబ్దాలు – గుర్తు చేసుకుంటే తప్ప అది నికోబార్ అని గుర్తు రాని వాతావరణం. ఎప్పుడో తిరుగాడిన శ్రీకాకుళం జిల్లాలోని గార-శ్రీకూర్మం ప్రాంతం ఎందుకనో గుర్తొచ్చింది. కొత్త ప్రదేశం అన్న బెరుకు, ఉత్తేజం మంత్రం వేసినట్టు మాయమై పోయి, ఊరికి పాతకాపుల్లా అడుగులు వేయసాగాం. ఆ భావనను జగన్‌తో పంచుకుంటే, “మీరే అంటూ ఉంటారు గదా, ట్రావెలర్‌కి ఎక్కడికి వెళ్ళినా క్షణాల్లో అది స్వంత ఊరు అయిపోతుందని… అదే జరుగుతోంది,’ అని నా పాఠం నాకే అప్పజెప్పాడు.

“ఇప్పుడెక్కడికోయ్ మన పయనం?” అడిగాను డ్రైవర్ని.

“కుసు బీచ్, లైట్‌హౌస్,” సూటి సమాధానం.

“లైట్‌హౌసా – పై దాకా ఎక్కనిస్తారా?” నాలోని బాలుడు సంబరపడ్డాడు.

“ఎక్కనివ్వరు. ఊరికే చూడనిస్తారు,” నీళ్ళు చల్లాడు.

గూగుల్‌ని అడిగాను. అదే మాట చెప్పింది. ఆ లైట్‌హౌస్ ప్రాంగణంలోనే గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌కు సంబంధించిన సెంటర్ ఒకటి ఉందని కూడా గూగుల్ చెప్పింది.

వెళుతోంటే దారిలో ముందు చూసిన చుక్‌చుకా గ్రామం ప్రాంతంలో అందమైన బీచ్ కనిపించింది. మనసటు లాగింది. జగన్ సై అన్నాడు. ‘చీకటి పడుతోంది. టైమ్ చాలదు,’ అభ్యంతరం చెప్పాడు కుర్రాడు. గబగబా ఆలోచించి, ‘అలా అయితే అదేదో కుసు బీచ్ అన్నావు కదా – అది వదిలేద్దాం,’ అని బేరం పెట్టి, ఒప్పించాం.

ఆగినందుకు అవధులు లేని అందాలు ఒలికిస్తూ సాగరతీరం పలకరించింది. మురిపించే నీలాల జలాలకు తోడుగా వెనక వేపున చిక్కని జీడిమామిడి అడవి. మూడ్ వచ్చి నేనూ జగన్ ఫోటో సెషన్ పెట్టుకున్నాం. దాచుకోదగ్గ ఫోటోలు తీయగలిగాం.


లైట్‌హౌస్

ఏ దేశం వెళ్ళినా ఎక్కడ కాలు పెట్టినా లైట్‌హౌస్‌లు లైట్‌హౌస్‌లే. ఒకటే బాణీ. ఒకటే నిర్మాణం. అవే రంగులు – మరి ఒకే ప్రయోజనం కోసం నిర్మించిన కట్టడాల్లో ఆ సారూప్యాలు సహజం కదా! అవసరం కదా – ఈ ఆలోచనల మధ్య తెలుగు మాటలు వినిపించాయి. వాళ్ళు అక్కడి అధికారులట. గబగబా వెళ్ళి పరిచయం చేసుకున్నాం. సంతోషపడ్డారు. ఉమ్మడి విషయాలు, ఉమ్మడి కబుర్లు కాసేపు మాటల్లో దొర్లాక మేము ఆడగక ముందే వాళ్ళు తలుపు తాళాలు తెరచి ‘పైకి ఎక్కండి’ అని సూచించారు. అడగకుండానే వరం – కొండంత సంబరం!

ఎక్కి దిగేసరికి అయిదవవచ్చింది. సూర్యాస్తమయ సమయంలో గడిపేందుకు ‘దగ్గరలో ఏమన్నా సన్‌సెట్ పాయింట్ ఉందా’ అని మా కొత్త తెలుగు మిత్రుల్ని అడిగాం. “ఇక్కడనుంచే చూడొచ్చు. కానీ ఇక్కడకు బాగా దగ్గరలో ఉన్న నికోబార్ జెట్టీ ఇంకా అనువైన ప్రదేశం. జెట్టీ ఇప్పుడు ఉపయోగంలో లేదు. అంచేత వాచ్‌మన్ అందర్నీ వెళ్ళనివ్వడు. అయినా వెళ్ళి ప్రయత్నించండి,” అన్నారా మిత్రులు.

ఛలో జెట్టీ అంటూ కారును ఆ దిశగా మళ్ళించాం. ఐదారు నిమిషాల్లో చేరుకున్నాం.

నిజమే – సూర్యాస్తమయం చూడటానికి అదే సరైన ప్రదేశం.

జెట్టీలో భాగంగా అప్పట్లో ఓడల్లోకి ఎక్కడానికి కట్టిన విశాలమైన కాలిబాట ఇంకా దిట్టంగా నిలచి ఉంది. సంరక్షణ అంటూ లేకపోయినా నడచి కొస దాకా వెళ్ళడానికి ఏ ఇబ్బందీ లేదు.


సూర్యాస్తమయం

మా కారునూ, మమ్మల్నీ చూసి ఆశ్చర్యపడిన చౌకీదార్ డ్రైవర్ని చూసి తలూపాడు. ఆ కాలిబాట మీద బాగా లోపలి దాకా సముద్ర జలాల మధ్య నడచి వెళ్ళాం. తీరా చూస్తే పశ్చిమ ఆకాశమంతా మబ్బుల మయం. నీలి మేఘాలు. మామూలు సమయమయితే చూసి సంతోషపడదగ్గ ఆకృతీ విన్యాసాలు ఉన్నా, విశ్రమించడానికి వెళుతోన్న సూర్యుడికీ మాకూ అడ్డంగా నిలబడ్డ ఆ మబ్బులు కాస్తంత అసహనం కలిగించాయి. తమాయించుకొని చూస్తే ఆ నీలిమేఘాల ప్రతిబింబాలు సముద్రపు నీలజలాల మీద సృష్టిస్తోన్న అరుదైన వర్ణాల మేళవింపు కూడా చూడదగ్గదే, మనసులో నింపుకోదగ్గదే అనిపించింది.

ఈలోగా బైక్ మీద ఇద్దరు పెద్దమనుషులు వచ్చి ‘ఎవరు మీరు?’ అంటూ నిలదీసారు. బాడీ లాంగ్వేజ్‌ను బట్టి చూస్తే అలా అడిగే అధికారం ఉన్నవాళ్ళే అని అర్థమయింది. మా తరఫున మా యువమిత్రుడే కాస్తంత పదునుగా వివరాలు అందించాడు. ఆ పదును వారికి నచ్చలేదు. చిన్నపాటి వత్తిడి. ఈలోగా ఆ వచ్చిన వాళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడుకోవడం గమనించి మేము జోక్యం చేసుకున్నాం. అందులో ఒకాయన మఫ్టీలో ఉన్న పోలీస్ ఎస్సై – రెండో అతను కానిస్టేబుల్. ఒత్తిడి వాతావరణం చల్లబడింది. ‘ఓ, గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారా, మా ఇల్లు ఆ పక్కనే; ఓసారి రండి,’ అని ఆహ్వానించాడు ఆ సబిన్స్‌పెక్టర్.


సాయంత్రం డిన్నర్ సమావేశం చక్కగా సాగింది.

రమేష్ జాన్సన్లు వచ్చేసరికి ఎనిమిది దాటింది. కబుర్లు ముగిసేసరికి పది.

రమేష్ వృత్తి అవసరాలకు మించిన నిబద్ధత కల మనిషి. ‘హాయిగా మెయిన్‌లాండ్ పోస్టింగ్ సాధించుకుని వెళ్ళిపోదాం,’ అని తాపత్రయపడే మనిషి కాడు. నికోబార్ ద్వీపాల పూర్వాపరాలు బాగా తెలిసిన మనిషి. నికోబారీలు అంటే అక్కర ఉన్న వ్యక్తి. సహజంగానే నేనా సాయంత్రం ప్రశ్నల పుట్టనయాను.

“ఈ నికోబారీలు ఇండొనీషియా మూలాలు గల వాళ్ళా? నికోబార్ ద్వీపాలలో వీళ్ళే కాకుండా ఇంకా ఏమైనా తెగల వాళ్ళున్నారా?”

“నికోబారీలే ఎక్కువ. పాతిక వేలు మించిన జనాభా వీరిది. వీళ్ళే కాకుండా, షోంపెన్ అన్న మంగోలాయిడ్ జాతికి చెందిన తెగల వాళ్ళూ ఉన్నారు. వారి సంఖ్య మూడు వందలకు మించదు. ఇంకా వేట – ఆహార సేకరణ దశలోనే ఉన్న తెగ అది. వాళ్ళంతా గ్రేట్ నికోబార్ ద్వీపపు అడవుల్లో ఉంటున్నారు. ఈమధ్యే మన సంపర్కాన్ని సహిస్తున్నారు.”

“మరి నికోబారీల మూలాలేమిటి?”

“ఆగ్నేయాసియా ప్రాంతాల ఆస్ట్రో ఏషియాటిక్ మూలాలు వీరివి. జెనెటిక్ స్టడీస్ ద్వారా వీళ్ళంతా ఐదువేల సంవత్సరాల క్రితం ఇప్పటి థాయ్‌లాండ్ – లావోస్ ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని తేలింది. సముద్రం – చిట్టి పడవలు – చేపల వేట వీళ్ళ అనాది బలాలు. వలస దొరలు అడుగుపెట్టక ముందు – అంటే పంతొమ్మిదో శతాబ్దం దాకా చేపలు పట్టుకోవడం, కొబ్బరి తోటలు, పందుల పెంపకం – ఇలాంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు. అంతా కలసికట్టుగా బ్రతికే వాళ్ళు.

“రెండో ప్రపంచ యుద్ధం వీళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొబ్బరి తోటలు ధ్వంసమయ్యాయి. బానిసత్వానికి గురి అయ్యారు. అందుకే ఈ మధ్యవరకూ బయటి మనిషి కనబడితే పారిపోయి దాక్కునే వారు… వారి అవసరాల గురించీ, అభద్రతల గురించీ స్పృహా అవగాహనా కలిగాక, 1974లో మన ప్రభుత్వం నికోబార్ ద్వీపాలను ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించింది.

“ఇపుడు కనిపిస్తోన్న అభివృద్ధి అంతా సునామీ తర్వాత జరిగిందే అని వింటున్నాను – నిజమేనా?”

“నిజమే. 2004 సునామీవల్ల నికోబార్ ద్వీపాలన్నీ దారుణంగా దెబ్బ తిన్నాయి. తీరప్రాంతపు గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మూలవాసులూ, సెటిలర్లూ వందలాదిమంది మరణించారు. రెట్టింపుమంది అజ లేకుండా పోయారు. ఆస్తి నష్టాలూ, జీవనోపాధి కోల్పోవడాలూ సరే సరి”.

“ఇపుడింతగా కళకళలాడుతున్న కార్ నికోబార్ సమీపగతంలో అంత విధ్వంసానికి గురి అయిందని నమ్మడం కష్టం,” నా వ్యాఖ్య.

“ఆ విషయంలో ప్రభుత్వం చూపించిన చొరవ చెప్పుకోదగ్గది. ముందుగా అందరికీ పునరావాసం కల్పించడం మీద దృష్టి పెట్టింది. అది ముగిసాక విద్య, వైద్యం, నీళ్ళు, కరెంటు, రోడ్లు – ఇలాంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టింది. ఫలితాలు సాధించింది. అందరికీ చదువు చేరువయింది. మెల్లగా ఉద్యోగాల్లో కుదురుకుంటున్నారు. పోర్ట్ బ్లెయిర్‌దాకా వెళ్ళి చదువుకునే వాళ్ళూ, ఉద్యోగాలు చేసేవాళ్ళూ ఇపుడు మనకు ఇక్కడ విరివిగా కనిపిస్తారు. పదో క్లాసువరకూ ఆడపిల్లలూ మగపిల్లలూ చదవడం అన్నది సామాన్యమై పోయింది. అన్నట్టు ఈ నికోబార్ ద్వీపాలలోని వాళ్ళకు పోర్ట్ బ్లెయిర్ వెళ్ళడం అంటే మెయిన్‌లాండ్‌లోని దక్షిణాది చిన్నపట్టణంనుంచి న్యూ ఢిల్లీ వెళ్ళినంత గొప్ప. జీవితమంతా పోర్ట్ బ్లెయిర్ చూడకుండా గడిపేసే సెటిలర్లూ మనకు ఈ నికోబార్ ద్వీపాలలో కనిపిస్తారు.”

సంభాషణ మా మర్నాటి కార్యక్రమం వేపు మళ్ళింది.

అప్పటికే మాకోసం మోటారు సైకిల్ వచ్చి గెస్ట్‌హౌస్ ఆవరణలో నిలబడి ఉంది. కోడికూతకన్నా ముందే లేచి సాగరతీరం చేరుకోవడానికి రంగస్థలం సిద్ధమయిందన్నమాట.

“నిన్నంతా మీ కుర్రాడు ఊరంతా తిప్పి పరిచయం చేసాడు. తూర్పు తీరమంతా తిరిగినట్టే లెక్క. దక్షిణ భాగం, పడమటి తీరం మిగిలాయి. రేపు ఆ ప్రాంతాలు తిరిగి వద్దామనుకుంటున్నాం. సముద్రాన్ని అంటిపెట్టుకుని దక్షిణదిశలో బయల్దేరి అన్ని దిక్కులూ చూసుకుని సాయంత్రానికి గెస్ట్‌హౌస్ చేరుకుందామన్నది మా ఆలోచన. అది సాధ్యమేనా? ఎంత దూరమవుతుందీ? అన్నట్టు ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్న విలేజ్ కౌన్సిళ్ళు ఉన్నాయనీ విన్నాను. అలాంటి ఒక కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడే వీలుంటుందా?” అడిగాను.

“సాధ్యమే. అంతా కలసి 50-60 కిలోమీటర్లు. కానీ దక్షిణాన కిమోస్ బే అన్న చోట ఒక వంతెన కూలిపోయింది. అక్కడ మీకు దారి దొరకదు. విలేజ్ కౌన్సిల్ అంటారా – ప్రయత్నిస్తాను.”

“బైకేగదా – ఎలాగో ఒకలా దాటేస్తాం. ప్రయత్నించనివ్వండి.”

“సరే మీ ఇష్టం,” అనిష్టత ధ్వనించింది రమేష్ గొంతులో.

(సశేషం)


దాసరి అమరేంద్ర

రచయిత దాసరి అమరేంద్ర గురించి:

దాసరి అమరేంద్ర పేరుపొందిన యాత్రా కథన రచయిత, అనువాదకుడు.

 ...