చీకటి చందమామ

ఆమె కొంచెం కూడా కదలట్లేదు. కేవలం ఆమె చేతులు మాత్రమే కదులుతున్నాయి. పెదవులు ఏదో పాడుతున్నాయి. ఆమె కళ్ళు – ఆ కళ్ళు మాత్రం నాట్యం చేస్తున్నాయి. ఆమె హావభావాల ముందు నెమలి నాట్యం కూడా చిన్నబోతుందేమో. ఆమె కన్నుల సొగసు ముందు నెమలి పింఛం కూడా ఖంగు తింటుందేమో. నాట్యం మధ్యలో ఆమె తీసుకుంటున్న ప్రతి శ్వాస కూడా ఆ నాట్యంలో భాగంగానే అనిపించింది. ఆమె కదిలించని కనుబొమ్మలు ‘మమ్మల్ని మర్చిపోయావేం?’ అని ఆమె మీద అలిగి, ‘మమ్మల్ని నువ్వైనా చూడమని’ అతన్ని వేడుకున్నాయి. ఆమె ఎలా ఉందో చెప్పడానికి అతనికొచ్చిన మాటలు కానీ, అతను విన్న పాటలు కానీ సరిపోవేమో. కవులు రాసిన కవితలన్నీ అతనికి తెలియవు. కానీ, తెలిసినా అవి కూడా సరిపోవని చెప్పేవాడేమో. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమె కళ్ళు, ఆమె హావభావాలు, ఆమె అందం అన్నీ కలిసి అతని మనసులో ఒక కల్లోలాన్ని రేపాయి. ఆమె అందానికి అతను క్షణాల్లో దాసోహం అయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకోవాలని, కలిసి ప్రయాణం చెయ్యాలని మనసు మురిసింది. ఎంతో అందంగా కదిలిన ఆ కళ్ళను ఇంకా ఇంకా చూడాలని, తెర పడగానే అతని అడుగులు అతన్ని అడగకుండానే ఆమె వైపు సాగాయి.

అక్కడ ఆమె నీళ్ళు తాగుతూ నిలబడి ఉంది. దగ్గరకు వెళ్లి, ఆమె నాట్యాన్ని, ఆమె కళ్ళు పలికించిన భావాలను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అతను ఒక అమ్మాయితో ఇంతలా మాట్లాడగలడు అన్న ఆలోచన అతనికే కొత్తగా అనిపించింది.

ఆమె చాలా ప్రశాంతంగా “చాలా సంతోషం అండి” అంది.

“మీరు ఏమీ అనుకోనంటే, ఒక మాట… మీరు నాతో డేట్‌కి వస్తారా?” అని ధైర్యం కూడగట్టుకుని అడిగేశాడు.
వేయబోయిన అడుగు ఆగింది కానీ, ఆమె అతని వైపు తిరగలేదు. తల కొంచెం వాల్చి, పెదవుల మీద చిన్న, నిరాశాపూరితమైన నవ్వుతో, “నేను బ్లైండ్ అండి…” అని ముందుకు నడిచింది. మెల్లగా ఒక కుర్చీని తడిమి, ఏమాత్రం తడబడకుండా కూర్చుంది.

అతను మాత్రం అక్కడే శిలలా ఆగిపోయాడు.

బ్లైండ్?

తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ కళ్ళలో అంత జీవం, ఆ అడుగుల్లో అంత ఖచ్చితత్వం ఉన్నాయి. ఇది నిజమై ఉండదు. కొంచెం తేరుకొని, ‘బహుశా తనను దూరం పెట్టడానికే ఇలా చెప్తుందేమో’ అనుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని, “మీకు రావాలని లేకపోతే నేరుగా చెప్పేయండి పర్లేదు, కానీ అలా ఎందుకు చెప్తున్నారు?” అన్నాడు.

పక్కనే కూర్చున్న ఆమె స్నేహితురాలు అతని ఆశ్చర్యాన్ని గమనించి, మృదువుగా నవ్వి “నిజంగానే తను బ్లైండ్ అండి. స్టేజ్ మీద తన కళ్ళు పలికించే భావాలు చూసి ఎవరికీ అలా అనిపించదు. కానీ, అది నిజమే.”

అతని ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అది జాలి కాదు. కొద్దిసేపటి క్రితం స్టేజ్ మీద తనను మంత్రముగ్ధుణ్ని చేసిన అమ్మాయి… ఇప్పటికీ తన ముందే ఉంది. మారింది నిజం మాత్రమే. ఆమె కాదు. ఆమె పట్ల అతనికి ఉన్న గౌరవం మరింత పెరిగింది.

అతను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. “మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి? నిజంగా డేట్‌కి వెళ్దాం,” అన్నాడు, ఈసారి మాత్రం అతని స్వరంలో ధైర్యం స్పష్టంగా వినిపించింది.

ఆమె చిరాకుగా తల ఎత్తింది. “మీకు వినపడలేదా? నేను చూడలేను.”

“నాకు అర్థమైంది.”

“మరి ఎందుకు? జాలితోనా? పాపం అనుకుంటున్నారా? లేదా ఇప్పుడే వదిలేస్తే మీరు మనసు లేని వారు అయిపోతారనా? చూసిన వాళ్ళు మిమ్మల్ని గొప్పవాడని అనుకోవాలనే కదా ఈ కూనిరాగాలు? నాకు తెలుసు. ఇలాంటివి నాకు కొత్త కాదు. మిమ్మల్ని ఏం తప్పుగా అనుకోను. మీరు వెళ్ళొచ్చు.” ఆమె ముఖంలో కోపం, మాటల్లో పదును. కానీ అతను తొణకలేదు.

“జాలితో మిమ్మల్ని పిలిచి ఉంటే… మీరు ఇలా కోప్పడేలోపే నేను వెళ్లిపోయేవాడిని. కానీ, నేను ఇప్పటికీ ఇక్కడే ఉన్నానంటే కారణం అది కాదు. మీ కళ్ళు పలికించిన భావాలు చూసినప్పుడు… ఆ భావాలను పలికించిన అద్భుతమైన కళాకారిణిని కలుసుకోవాలనిపించింది. స్టేజ్ మీద మీ నాట్యం చూసినప్పుడు… మీతో కాసేపు మాట్లాడాలనిపించింది. మిమ్మల్ని ఇంకా దగ్గరగా తెలుసుకోవాలనిపించింది. మీ అనుభవాలు, మీ అలవాట్లు, మీ ఇష్టాలు, మీ కష్టాలు పంచుకోవాలనిపించింది. అందుకే మిమ్మల్ని డేట్‌కి రమ్మని అడిగాను. అయినా మిమ్మల్ని చూసిన తర్వాత కూడా మీ గురించి తెలుసుకోవాలనిపించకపోతే… ఆ కళ్ళకు అర్థమే ఉండదు. ఆ కళ్ళు నన్ను చూడగలుగుతాయా లేదా అనేది నాకు అనవసరం… నేను మిమ్మల్ని చూశాను, నాకు మీరు నచ్చారు.”

“మీరేం చెప్పినా నాకు మీతో రావడం ఇష్టం లేదండి.” ఈసారి ఆమె మాటల్లో మునుపటి పదును లేదు, గొంతులో ఆ కరకుదనం లేదు.

“మీ కళ్ళు, మీ కళ… ఈ రెండూ నన్ను ఆకట్టుకున్నాయి. నన్ను మాత్రమే కాదు, ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మీ అందమైన కళ్ళు పలికించే హావభావాలు మీ నాట్యానికి ప్రాణం పోస్తున్నాయి. మీ కళలోని అద్భుతమంతా ఆ కళ్ళలోనే దాగి ఉందంటే నమ్మండి. ఆ కళ్ళు చేసే నాట్యాన్ని చూసేందుకు నా రెండు కళ్ళు సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. నాట్యం మీకు దేవుడిచ్చిన వరం… మీరు ఎప్పుడూ ఇలాగే నాట్యం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. క్షమించండి.” కొంచెం దిగాలుగా అన్నాడు.

అతను ఇంకేమీ మాట్లాడలేదు. ఆమె సమాధానం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూశాడు.

ఎందుకో ఆ మాటలు వినగానే ఆమె కాసేపు స్తంభించిపోయింది. చేతిలోని వైట్ కేన్‌ని మరింత గట్టిగా పట్టుకుంది. ఉప్పొంగుతున్న భావోద్వేగాన్ని దాచుకోవడానికి ఆమె తల కిందకి వాల్చింది. తనకు చూపు లేదని తెలిసిన క్షణం నుంచే చాలామంది తనను వేరేలా చూడటం మొదలుపెట్టారు. కానీ ఇతను మాత్రం… తన కళ్ళలోని అందాన్నే ముందుగా గుర్తించాడు. తాను ప్రపంచాన్ని చూడలేకపోయినా, ఈ ప్రపంచం తనను ఎంత అందంగా చూడగలదో అతడి మాటలు మళ్ళీ గుర్తుచేశాయి. ఆ ఆలోచనల నిశ్శబ్దంలో ఆమె మనసు మెల్లగా కరిగిపోయింది. కేన్ మీద ఆమె వేళ్ళ పట్టు సడలింది. పెదవుల మీద ఒక సన్నని నవ్వు వికసించింది.

“ఫ్రైడే చూద్దాం లేండి…” అంది నెమ్మదిగా. ఈసారి ఆమె స్వరం మునుపటికంటే మరింత సున్నితంగా మారింది. ఆమె ఇంకా ఏదో చెప్పబోతుండగానే, అప్పటిదాకా ఇదంతా గమనిస్తున్న ఆమె స్నేహితురాలు “ఆగవే,” అంటూ మధ్యలో కల్పించుకుని “ఈ రోజు సాయంత్రం ఏడున్నరకి కుదురుతుందా మీకు?” అని ఉత్సాహంగా అడిగింది.

“నిజంగానా!” అన్నాడు అతను ఆశ్చర్యంగా.

అవునన్నట్టుగా ఆమె స్నేహితురాలు చిరునవ్వుతో తల ఊపింది. దానికి ఆమె కూడా ఏం అడ్డు చెప్పకపోవడంతో, “పర్ఫెక్ట్! అయితే నేను ఏడుకి పిక్ చేసుకుంటా,” అని చెప్పి, ఆమె స్నేహితురాలి దగ్గర అడ్రస్, నంబర్ తీసుకుని ఉత్సాహంగా వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోగానే స్నేహితురాలు ఆమెను ఆటపట్టిస్తూ, “చూస్తున్నా… చూస్తున్నా… అంతా గమనిస్తూనే ఉన్నా. నీ మాట తీరు, హావభావాలు రెండూ మారిపోయాయ్. అందుకే అంత నమ్మకంగా అతనికి సరే అని చెప్పేశా. అయినా ఎన్ని రోజులు ఆ హాస్టల్ రూమ్‌లోనే కాలం వెళ్ళదీస్తావ్? అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు. నీకు నచ్చకపోతే చెప్పు… నేను సెట్ చేసుకుంటాలే!” అంది. ఆ మాటకు ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.


సాయంత్రం ఏడు గంటలకు ఇద్దరూ తయారై హాస్టల్‌ బయట వేచి ఉన్నారు.

“నీతో పాటు నేనెందుకే?” అడిగింది స్నేహితురాలు.

“అప్పుడేదో పర్లేదనిపించింది కానీ… ఇప్పుడు కాస్త భయంగా ఉందే. అందుకే నిన్ను కూడా తోడు రమ్మంటున్నాను,” కంగారుగా తన వేళ్లను మెల్లగా నలుపుకుంటూ అంది.

“సర్లే కానీ… అక్కడ నన్ను మీ మధ్యలో కూర్చోబెట్టి నా బుర్ర తినొద్దు ప్లీజ్. అసలే వచ్చాక నాకు బోలెడు పని ఉంది,” బుంగమూతి పెడుతూ అంది.

“ఓకే, బంగారం!”

ఇంతలో క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన అతన్ని చూసి ఆమె స్నేహితురాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతని కళ్ళకు గంతలు. స్నేహితురాలు ఒక్కసారిగా సైలెంట్ కావడంతో, తన ఊహకు అందని విషయం ఏదో ఎదురైందని ఆమెకు అర్థమైంది. “ఏమైంది?” అని అడిగింది.

అంతలోనే స్నేహితురాలి ఫోన్ మోగింది. అతనే. “నేను వచ్చేశాను, కాస్త క్యాబ్ వరకూ వస్తారా?” అని అడిగాడు.

“ఆ, చూశానండీ, వస్తున్నాం,” బదులిచ్చింది స్నేహితురాలు. దగ్గరికి వెళ్లగానే, “కళ్ళకు గంతలు కట్టుకున్నారేంటండీ?” అడిగింది ఆశ్చర్యంగా.

“ఏం లేదండీ… ఇప్పుడు వెళ్లే రెస్టారెంట్‌ లోపలికి ఇలాగే వెళ్ళాలి. అందుకని ఇక్కడినుంచే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా,” అంటూ అడుగు తప్పి వెనక్కి తూలబోయాడు.

అతని మాటలు విన్నాక, నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆమె మనసులో మిగిలి ఉన్న ఆ చిన్న సందేహమూ కరిగిపోయినట్టుగా పెదవుల మీద తెలియకుండానే ఒక చిరునవ్వు మెరిసింది.

“జాగ్రత్తండీ… ఇలాగైతే కష్టమే,” అంది స్నేహితురాలు.

“పర్లేదండీ… ఏమైనా అయితే ఆమె తోడున్నారుగా…” అంటూ సరదాగా నవ్వటానికి ప్రయత్నించాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను కాస్త తడబడ్డాడు. “అంటే… ఆమె ఉన్నారు కదండీ? ఇంతవరకూ ఆవిడ మాటే వినిపించలేదు. అందుకే…” అంటూ మాట మధ్యలోనే ఆగిపోయాడు.

“ఉంది, ఉంది. సరే, పదండి వెళ్దాం,” అంది స్నేహితురాలు.

“ఓ… మీరు కూడా వస్తున్నారా?” అని కొంచెం కంగారుగా అడిగాడు.

“ఏం? నేను రాకూడదా?” ఎదురు ప్రశ్నించింది స్నేహితురాలు.

“అంటే అదీ…” అతను నీళ్ళు నమిలాడు.

ఇంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న ఆమె, “ఇంతకీ ఎక్కడికి వెళుతున్నామో కొంచెం చెప్తారా?” అని తటపటాయిస్తూనే అడిగింది. ఆందోళనతో ఆమె కాళ్ళు అప్రయత్నంగా కదులుతుండటం తెలుస్తోంది.

“ఇప్పుడే చెప్పాలా? సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నానే,” అని కొంచెం సేపు ఆగి, “పర్లేదులెండి. మీకు ముందే చెప్పడం కూడా మంచిదే. ‘డైలాగ్ ఇన్ ది డార్క్’ అని, హైటెక్ సిటీలో ఒక రెస్టారెంట్‌ ఉంది. అక్కడికే వెళ్తున్నాం,” అన్నాడు.

ఆ పేరు వినగానే ఆమె బిగుసుకున్న వేళ్లు మెల్లగా సడలాయి. ఆమెలో ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది. స్నేహితురాలు ఇంకేదో చెప్పబోతుంటే, వెంటనే ఆమెను వారిస్తూ… “అవునూ, నీకేదో పని ఉందన్నావు కదా! ఇబ్బంది పడకు, నేను వెళ్లొస్తాలే,” అంది.

స్నేహితురాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ‘అంతేలే’ అన్నట్టుగా వాళ్ళవైపు చూసింది. కానీ వాళ్ళిద్దరికీ తన ముఖంలో భావం కనిపించదని గుర్తొచ్చి… “సరే అయితే… జాగ్రత్తగా వెళ్ళి రండి. ఏమైనా ఉంటే కాల్ చెయ్యండి,” అని చెప్పి నవ్వుకుంటూ హాస్టల్‌లోకి నడిచింది.


వాళ్ళు ‘డైలాగ్ ఇన్ ది డార్క్’ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. లోపలికి అడుగుపెట్టే ముందు, వెలుతురు ఇచ్చే ఫోన్లు, గడియారాలలాంటి వస్తువులన్నింటినీ నియమంగా బయటే లాకర్లలో ఉంచేశారు.

అంతా కటిక చీకటి. చూపు ఉన్నవాళ్ళకు, ఇతర ఇంద్రియాల విలువను కూడా అనుభవంలోకి తెచ్చే విలక్షణమైన ప్రపంచం అది. అక్కడి సేవలను అందించేది కూడా చూపు లేని వ్యక్తులే. వచ్చిన అతిథులు కేవలం వాసన, స్పర్శ, రుచి ద్వారానే ఈ ప్రపంచాన్ని అనుభవించేలా ఆ చీకటిలోనే భోజనం చేస్తారు.

అక్కడి సిబ్బందిలో ఒకతని సహాయంతో అతను తడబడుతూ అడుగులు వేస్తుంటే, ఆమె మాత్రం తన ముందు నడుస్తున్న వాళ్ల అడుగుల చప్పుళ్లను అనుసరిస్తూ నెమ్మదిగా వాళ్ల వెనకే నడిచింది.

వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాక ఇద్దరి మధ్య కాసేపు మౌనం. అతని శ్వాసలోని చిన్న తడబాటు ఆ నిశ్శబ్దంలో ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. చూపు పనిచేయని ఆ చీకటిలో, అతడి మిగతా ఇంద్రియాలు పూర్తిగా మేల్కొన్నాయి. బయట కురిసిన తొలి వర్షపు తడి మట్టి వాసన అతని ముక్కును మెల్లగా తాకుతోంది. లయబద్ధంగా కదులుతున్న ఆమె పాదాల శబ్దం అతనికి స్పష్టంగా వినిపిస్తోంది.

దానికి తగ్గట్టుగా అతను టేబుల్ మీద వేళ్ళతో వేసిన దరువు ఆమెకు అర్థం కాగానే, ఆమె పాదాల కదలికలు అప్రయత్నంగా ఆగిపోయాయి.

అది గమనించిన అతను “మీ అణువణువునా నాట్యం కదలాడుతూనే ఉంటుందనుకుంటా? ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు?” అని అడిగాడు.

“రెండు దశాబ్దాలుగా. బాగా అలవాటైన పని కదా, అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండానే అలా వచ్చేస్తుంటుంది.”

“ఓ! మీకు ఇంకా ఇష్టమైనవి ఏంటి? నాట్యం కాక?”

“చాలా ఉన్నాయండి. కాటన్ చీరలు, కోన్ ఐస్‌క్రీమ్‌లు, వేసవి తర్వాత వచ్చే తొలకరి జల్లు, వీటన్నిటికీ మించి ఆకాశం… ఆకాశం అంటే నాకెంతో ఇష్టం.”

“ఎందుకని? ఆకాశానికి మాత్రమే అంత ప్రత్యేకత?”

“ఆకాశం ప్రశాంతతకూ, ఆశకూ చిహ్నమని నమ్ముతాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, మెరుపులు… ఇలా ఎన్ని వచ్చినా పోయినా, అది మాత్రం ఎప్పుడూ నిర్మలంగా, నిశ్చలంగానే ఉంటుంది కాబట్టి. దిక్కు తోచనప్పుడు, తెలియకుండానే ఆకాశం వైపు చూస్తాడు మనిషి. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ, ఆకాశం మాత్రం ఎప్పుడూ ‘నీ కోసం నేనిక్కడే ఉన్నాను, ఉంటాను కూడా’ అనే భరోసాని, ఆశని ఇస్తుంది.”

“అయితే నేను చదివింది నిజమే.”

“ఏం చదివారు?”

“ఇక్కడికి వచ్చే ముందు మీతో వెతుక్కోకుండా మాట్లాడగలగాలని, కూచిపూడి గురించి కొంచెం తెలుసుకునేందుకు ప్రయత్నించాను. కానీ అందరూ అభినయం, తరంగం, ముద్ర, జతి అంటూ భారీ పదాలు వాడారు. అప్పుడు నాకు అర్థమైందేంటంటే, కూచిపూడి నేర్చుకున్నవాళ్ళు తమ భావాలను చాలా చక్కగా వ్యక్తీకరించగలరని. మీ మాటలు విన్నాక అది అక్షరాలా నిజమే అనిపించింది. ప్రతిదాన్నీ చాలా లోతుగా ఆలోచిస్తున్నారు.”

“ఓహో… నాతో మాట్లాడటం కోసం అంత కష్టపడ్డారన్నమాట! పర్లేదే…” నవ్వుతూ అంది.

ఇంతలో టేబుల్ మీద నీళ్ళ గ్లాసు కోసం వెతుకుతుండగా, అనుకోకుండా అతని చేయి ఆమె వేళ్ళను తాకింది. చూపులు కలవని ఆ చీకటిలో, ఆ చిరు స్పర్శ ఇద్దరి మనసుల్లోనూ ఒక మౌన ప్రకంపనను రేపింది. అతను వెంటనే “సారీ…” అన్నాడు. ఆ గొంతులోని చిన్న వణుకు అతనిపై ఆమె నమ్మకాన్ని మరింత పెంచింది.

మళ్ళీ ఇద్దరి మధ్యా కొనసాగిన మౌనం. ఆ నిశ్శబ్దం ఆమెను ఆలోచనల్లో పడేసింది… ‘ఎవరితను? తన కళ్ళు చూసి నచ్చానన్నాడు. డేట్ అన్నాడు. సరేనన్న వెంటనే కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చాడు. తనను అతని లోకంలోకి రమ్మనడం కాకుండా, అతనే తన లోకంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒక మనిషి అసలైన రూపం కళ్ళకు కాదు, మనసుకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందంటారు. అతని మనసును చదవడానికి తనకు కంటిచూపు లేకపోవడం ఏమాత్రం అడ్డంకి కాదు…’

‘ఆర్డర్ ప్లీజ్!’ అన్న పిలుపుతో వాళ్ళ మధ్య మౌనం మాయమైంది. ‘ఏం తింటారు?’ అనే ప్రశ్నతో మొదలైన వాళ్ళ సంభాషణ, ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టుగా చాలా సహజంగా సాగింది.

ఆమె తన నాట్యం గురించి, తన స్నేహితురాలి గురించి చెబితే, అతను తనకు ఇష్టమైన పుస్తకాల గురించి, ప్రతి అడుగులోనూ అండగా నిలిచే తన తల్లి గురించి, ఆమెవల్ల తెలుగు భాష మీద తనకు పెరిగిన మక్కువ గురించి ఎంతో ఇష్టంగా పంచుకున్నాడు. ఆ కటిక చీకటిలో భోజనం చేయడం అతనికి కొత్తగా ఉంది కానీ, పెద్ద అసౌకర్యంగా అనిపించలేదు. అతని మాటల్లో ఎక్కడా ఆమె పట్ల జాలి లేదు, అలాగని పొరపాటున ఏమైనా అనేస్తానేమో అన్న అతి జాగ్రత్త కూడా లేదు.

ప్రపంచపు వెలుగు మొత్తాన్ని పక్కనపెట్టి, తను అనుభవించే ప్రపంచంలోకి వచ్చి కూర్చుని, ఏ దాపరికం లేకుండా తన గురించి పంచుకుంటున్న అతని తీరును గమనిస్తుంటే… ఆమె మనసులో ఏళ్ళ తరబడి గూడు కట్టుకున్న అభద్రతా భావం మెల్లగా కరిగిపోతున్నట్టు అనిపించింది. చుట్టూ ఉన్నవాళ్ళ ప్రతిస్పందనలవల్ల, ఎప్పుడూ తన చుట్టూ ఒక గోడను కట్టుకుని ఉండే ఆమెకు… ఇప్పుడు ఆ అవసరం లేదనిపించింది.

“మా నాన్నకు కూడా మీలాగే, నేను నాట్యం చేస్తే చాలా ఇష్టం,” అంది మెల్లగా. “చిన్నప్పడు నాకు చూపు మామూలుగానే ఉండేది. కొంత కాలంపాటు. ఆ తర్వాత మెల్లమెల్లగా చీకటి అలుముకుంది. కానీ స్టేజ్ ఎక్కితే చాలు. నా చుట్టూ ఉన్న ఆ చీకటంతా మాయమైపోయేది. నేను ధైర్యం కోల్పోయిన ప్రతిసారీ, నాట్యం నాకు దేవుడిచ్చిన వరమని, దాన్ని ఎప్పుడూ వదలొద్దని నాన్న ప్రోత్సహించేవారు. అంతెందుకు? నేను ఈ డేట్‌కి ఒప్పుకోవడానికి కూడా ఒక రకంగా మా నాన్నే కారణం. నా కళలోని అందమంతా నా కళ్ళలోనే ఉందని, అవి పలికించే భావాలు చూడటానికి తన రెండు కళ్ళూ సరిపోవని అనేవారు ఆయన ఎప్పుడూ. ఈ రోజు మీరు కూడా, అచ్చం ఆయనలాగే చెప్పారు. అందుకే, ఎందుకో తెలియకుండానే… మీరు నాకు చాలా దగ్గరి వ్యక్తి అనిపిస్తోంది.”

ఆమె మాటలు ముగిశాక అటువైపునుంచి ఎలాంటి బదులూ రాలేదు. ఆమెలో సన్నని కంగారు మొదలైంది. ‘తొందరపడ్డానా? అనవసరంగా ఇవన్నీ చెప్పేశానా?’ అన్న సందిగ్ధంలో పడిపోయింది.

“అంటే మీ నాన్నగారి రూపంలో నాకు పెద్ద పోటీదారుడు ఉన్నాడన్నమాట! కచ్చితంగా అంకుల్‌ని, ఆంటీని కూడా ఒకసారి కలిసి తీరాలి,” ఉత్సాహంగా అన్నాడు.

“నేను పుట్టినప్పుడే అమ్మ చనిపోయింది… నా పదిహేనేళ్ళ వయసులో నాన్న కూడా…” ఆమె గొంతు కొద్దిగా వణికింది.

“ఐయామ్ సారీ… అసలేమైంది?” అన్నాడు సున్నితంగా.

“ఒక ప్రమాదంలో నాన్న, కొద్దిగా మిగిలిన నా చూపు – రెండూ నన్ను శాశ్వతంగా వదిలేశాయి. ఇప్పుడు నేను నాట్యం చేస్తున్నప్పుడల్లా, నాన్న ఎక్కడినుంచో నన్ను చూస్తూ ఉంటాడనే నమ్మకం… అందుకేనేమో నా కళ్ళలో కదిలే భావాలకు అంత ప్రాణం వస్తుంది,” అని చెప్పి ఆగిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపించింది.

అతను ఏమీ మాట్లాడలేదు. ఆ పూర్తి చీకటిలో అతని బరువైన నిట్టూర్పు మాత్రమే ఆమెకు స్పష్టంగా వినిపించింది. అతని మనసులో ఏమి జరుగుతుందో, అతను ఏం చెబుతాడో అనుకుంటూ ఆమె ఎదురుచూపులో ఉద్విగ్నత.

కొద్ది మౌనం తర్వాత అతనే గొంతు సవరించుకుని… “అయితే మీకో విషయం చెప్పాలి. మీకు హీరో అబ్బాస్ ఎలా ఉంటాడో తెలుసు కదా… నేను అచ్చం అలాగే ఉంటానని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది,” అన్నాడు. క్షణం ఆగి, “కంగారు పడకండి. చేతిలో హార్పిక్ పట్టుకుని రానులెండి” అన్నాడు.

ఆ చీకటిలో ఇద్దరూ మనసారా నవ్వేశారు. ఆ నవ్వుతో ఆమె మనసు మీదున్న బరువు చాలావరకూ దిగిపోయినట్లయింది. తన గతం చెప్పగానే ‘అయ్యో పాపం’ అంటూ సానుభూతి చూపించే మనుషుల మధ్య అలసిపోయిన ఆమెకు, అతని మాటల్లోని సహజత్వం, అతను పండించిన ఆ సున్నితమైన హాస్యం ఎంతో ఊరటనిచ్చాయి. తనను కూడా ఒక సాధారణమైన మనిషిగా చూసే వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడన్న భావన, చాలా కాలం తర్వాత ఆమె మనసుకు ఒక కొత్త ప్రశాంతతను తీసుకొచ్చింది.
ఇద్దరూ భోజనం ముగించి బయటకు వస్తున్నప్పుడు అతను ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె ఏం అనకముందే “పడిపోతానేమోనని…” అన్నాడు. ఆమె కాదనలేదు. “మీరేం అనుకోకపోతే, కొంచెం క్యాబ్ వరకు కూడా సాయం చేస్తారా?” అడిగాడు.

“వచ్చేటప్పుడు ఇంత సాయం అడగలేదే! నిజంగా భయమా? లేక నా చెయ్యి పట్టుకోవాలనా?” ఇప్పుడామె గొంతులో కొంటెతనం మోగింది.

“అయ్యో, అప్పుడు కూడా బోలెడు భయం వేసింది. చెబితే ఏమనుకుంటారో అని చెప్పలేదు. ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయను. అయినా మనకు నచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనకు నచ్చినట్టుగా ఉండలేకపోతే, ఆ బంధానికి విలువే లేదని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అందుకే ఇప్పుడు మీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను,” అన్నాడు.

క్షణం ఆగి, “అయినా మీ చెయ్యి పట్టుకుని నడిచే అదృష్టాన్ని ఎవరు వదులుకుంటారు? అది నాకు ఇంత తొందరగా దక్కుతుందనుకోలేదు! ఇక మీదట ఇలానే నడిచే అవకాశం ఇస్తారా?” అని అడిగాడు.

ఆమె సన్నగా నవ్వి, అతని చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని “అయితే ఇక మీదట నా సాయం మీకు చాలానే కావాలంటారు…” అంది.

“ఆ… చాలా,” అన్నాడు. అతని స్వరంలో దాచలేని సంతోషం.

“చూద్దాంలేండి… అయినా అయ్యో, నేను చూడలేను కదండీ! ఇప్పుడెలా మరి?” మళ్ళీ ఇద్దరూ మనసారా నవ్వేశారు. చేతిలో చెయ్యి వదలకుండా క్యాబ్ వైపు నడిచారు.

తన చూపు గురించి తనే అంత తేలికగా, సరదాగా మాట్లాడగలగడం ఆమెకే కొత్తగా అనిపించింది. మామూలుగా అయితే, ‘ఒక్క రోజు పరిచయానికే నా చుట్టూ గీసుకున్న గీత చెరిగిపోతోందా?’ అన్న సందేహమో, ఆత్మరక్షణ భావమో వెంటనే ఆమెను అప్రమత్తం చేసేది. కానీ ఇప్పుడు… ఆ ఆలోచనే రాలేదు. అతను తనను అపార్థం చేసుకోడన్న నమ్మకమే ఆ స్థానాన్ని నిశ్శబ్దంగా ఆక్రమించి, ఆమెలో కొత్తగా ఒక భద్రతా భావాన్ని నింపింది.


ఇద్దరూ క్యాబ్ ఎక్కి ఆమె హాస్టల్‌కి బయలుదేరారు. దారంతా మౌనమే. కానీ, ఆ మౌనమే వాళ్ళ మధ్య ఒక అందమైన భాషగా మారి, ఎన్నో కబుర్లు చెప్పుకున్నట్టుగా అనిపించింది. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

కారులో రేడియో మోగడం మొదలై, వాళ్ళ మధ్య మౌనాన్ని మాయం చేసింది. అందులో వ్యాఖ్యాత గొంతు నెమ్మదిగా, భావగర్భితంగా వినిపిస్తోంది, ‘నెలల తరబడి ఎండిపోయిన నేల… ఒక్క చినుకు పడగానే తనలో దాచుకున్న పరిమళాన్నంతా మట్టి వాసనగా వెదజల్లుతుంది! పరిచయాలు కూడా అంతేనేమో… ఒక బంధం అల్లుకోవడానికి దశాబ్దాల సమయం అక్కర్లేదు. మనసుని అర్థం చేసుకునే ఆ ఒక్క మనిషి మన దరిచేరితే చాలు… ఏళ్ళ నిరీక్షణ సైతం క్షణాల్లో మంచులా కరిగిపోతుంది… బిగుసుకుపోయిన ప్రాణం కూడా కలువలా విచ్చుకుంటుంది.’

వ్యాఖ్యాత మాటలు ఆగుతూనే, ఒక సన్నని వేణునాదం మొదలైంది. కురుస్తున్న ఈ వర్షం సాక్షిగా… రేడియోలో వినిపించిన మాటలు, వాళ్లిద్దరి మనసుల్లో జరుగుతున్న సంభాషణకే స్వరం ఇచ్చినట్టుగా అనిపించాయి. అతను మొదటిసారిగా వానను వింటున్నాడు; ఆమె మొదటిసారిగా ఏ భయమూ లేకుండా చల్లని గాలిని ఆస్వాదిస్తోంది.

హాస్టల్ వచ్చేసింది. క్యాబ్ దిగారు. అతను తన జేబులోంచి ఒక ఉత్తరాన్ని తీసి ఆమెకి అందించాడు. ఆమె వేళ్ళు ఆ కాగితాన్ని స్పృశించగానే, దానిమీద బ్రెయిలీ లిపిలో ‘ప్రియమైన శ్రియకు,’ అని ఉన్న అక్షరాలు ఆమెకు అర్థమయ్యాయి.
“ఇప్పుడే వద్దు… తర్వాత రూమ్‌కి వెళ్ళాక చూడండి. ఇక వెళ్లొస్తా మరి,” అని వెనుదిరగబోయాడు.

“ఒక్క నిమిషం…” అని అతన్ని ఆపి, ఆ ఉత్తరం తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది. ఎందుకు ఆపిందో అర్థం కాక అయోమయంగా నిలబడ్డాడు. ఆమె సున్నితంగా తన వేళ్ళను అతని చెవుల మీదుగా కదిపి… ‘ఇంతలా ముస్తాబైతే, నన్ను చూడకుండానే వెళ్తే ఎలా?’ అన్నట్టు మెల్లగా అతని కళ్ళ గంతలు విప్పేసింది.

హాస్టల్ ముందున్న లైట్ల వెలుతురులో ఇప్పుడామె ముఖం మెరిసిపోతోంది. ఉదయం అతను చూసింది నెలవంకనయితే… ఇప్పుడు తన ముందున్నది నిండు పౌర్ణమి చందమామ!

అతను ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. చివరికి, “ఆ ఉత్తరం – ఇప్పుడే చదవండి,” అన్నాడు.

ఆమె కొంత సందిగ్ధంగానే ఆ ఉత్తరం తీసి, తన వేళ్ళతో అక్షరాలను తడిమింది. బ్రెయిలీలో ఇలా ఉంది:

‘మిమ్మల్ని మొదటిసారి చూసిన క్షణంలో కలిగిన భావాలను కాగితం మీద పెట్టాలని ఎన్నో మాటలు వెతికాను. కానీ, మీ నయనాలను, నాట్యాన్ని సంపూర్ణంగా వర్ణించే మాటలు మాత్రం నాకు దొరకలేదు. నాకొచ్చిన మాటల్లో చెప్పాలంటే… కొన్ని పరిచయాలు పేరుతో గుర్తుంటాయి. కొన్ని మాటలతో. కానీ, మీతో పరిచయం మాత్రం మీ నాట్యంవల్లనూ, ఆ నాట్యంలో మీ కళ్ళు పలికిన హావభావాలవల్లనూ గుర్తుండిపోతుంది. మీ కళ్ళు నన్ను ఆకర్షిస్తే, మీ కళ మాత్రం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే తపనను కలిగించింది… ఇప్పుడు ఈ ఉత్తరం మీ చేతుల్లో ఉందంటే… మీతో గడిపిన ఈ సాయంత్రం నా మనసును ఎంతగానో హత్తుకుందనే అర్థం. ఈ రోజు మొదలైన మన పరిచయం ఎక్కడివరకు వెళ్తుందో నాకు తెలియదు. కానీ మీకు కూడా నా స్నేహం నచ్చితే, మీ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, మీ నవ్వుల్లో, మీ నిశ్శబ్దాల్లో, మీ నాట్యంలో, చివరికి మీ జీవితంలోనూ భాగమయ్యే అదృష్టాన్ని నాకు ఇస్తారా? మీ సమాధానం ‘అవును’ అయితే, అది నా జీవితంలో దక్కే అత్యంత అందమైన కానుక. ‘కాదు’ అయినా – మీ నిర్ణయాన్ని అంతే గౌరవంతో అంగీకరిస్తాను. మీ సమాధానం ఏదైనా, ఈ రోజు మీతో గడిపిన ప్రతి క్షణం మాత్రం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా చివరివరకూ నాతోనే పదిలంగా ఉంటుంది. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను.’

చదువుతున్నంతసేపూ అతని చూపు ఆమె ముఖం మీదే నిలిచిపోయింది. ఆమె ముఖంలో ఏ చిన్న భావమైనా చదివేయాలని అతని మనసు తపించింది. ప్రతి క్షణం అతనికి మరింత భారంగా అనిపించింది.

అంతా చదివిన ఆమె, ఆ ఉత్తరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా “వెళ్తానండీ. లేట్ అవుతోంది. గుడ్ నైట్,” అంది.

ఒక్క క్షణం అతను అవాక్కయ్యాడు. ఇంకా ఏదో చెబుతుందేమోనని ఎదురుచూశాడు. కానీ, ఆమె ఏమీ మాట్లాడలేదు. ఉదయం దేవుని సన్నిధిలో మొదలైన ఆ పరిచయం, రాత్రికల్లా తన జీవితాన్నే మార్చేస్తుందని అతను ఊహించలేదు. ఇంత దగ్గరగా అరచేతిలోకి వచ్చిందనుకున్న ఆనందం, ఒక్కసారిగా వేళ్ల సందుల్లోంచి జారిపోతున్నట్టనిపించింది. హాస్టల్‌కి వచ్చే దారంతా, తన జీవితంలో ఇంత అందమైన రోజును రాసిన దేవుణ్ణి పొగిడాడు. ‘నిన్ను ఇంకేమీ అడగను’ అని హామీ కూడా ఇచ్చేశాడు. కానీ, అదే దేవుణ్ణి ఇప్పుడు ఏమని అడగాలో మాత్రం అతనికి అర్థం కాలేదు.

చెట్టు ఆకుల మీదినుంచి రాలిన ఒక చినుకు, అతని చెంపల మీదుగా జారింది. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. వెనక్కి తిరిగి భారంగా ఓ అడుగు వేశాడు. వర్షపు నీటి గుంటలో పడిన ఒక అడుగు శబ్దం, అతని మనసులో చివరిసారిగా మిగిలిన ఆశను కూడా ముంచేసినట్టనిపించింది.

వెనకనుంచి వేగంగా పడుతున్న అడుగుల శబ్దం అతనికి అర్థమయేలోపే, ఆమె వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ వేగానికి ఇద్దరూ తూలి కారుకు బలంగా తగిలారు. కారు స్వల్పంగా ఊగింది.

“కొంచెం సేపు ఆగి, మెల్లగా కాల్ చేసి చెబుదామనుకున్నా. కానీ, చెప్పే సమాధానం ‘అంగీకారమే’ అయినప్పుడు… నా మనసు ఊరుకోలేదు. ఆ తొందరలో కింద ఉన్న రాయిని గమనించలేదు… సారీ,” అంది.

“పర్లేదండీ,” అన్నాడు తేరుకోలేక.

“ఏంటి, గొంతు మారింది? జవాబు చెప్పలేదని కోపం వచ్చిందా?”

అతను ఏమీ మాట్లాడలేదు.

“ఏంటి, నిజంగానే… మనసులో నన్ను తిట్టుకున్నట్టున్నారే?”

“ఏదో కొద్దిగా,” అన్నాడు చిరునవ్వుతో.

ఇద్దరి మధ్యా క్షణం నిశ్శబ్దం. అప్పుడే ఏం చేసిందో గుర్తొచ్చినట్టుగా ఆమె మెల్లగా అతనికి దూరంగా జరిగి, తలదించుకుంది.

“నిజంగా…” అంటూ మెల్లగా గొంతు సవరించుకుని, “మొదటి పరిచయంలోనే నేను మిమ్మల్ని ఇంతలా ఇష్టపడతానని అనుకోలేదు. అందుకే నమ్మలేకపోతున్నాను,” ఆమె మాటల్లో ఇప్పుడు అల్లరి లేదు. ప్రతి మాటా తనకే కొత్తగా అనిపిస్తున్నట్టుంది.

ఆమె వైపు కాకుండా, పైన నిర్మలమైన ఆకాశాన్ని చూస్తూ “ఒక్కసారి మీ మెదడు చెప్పే లాజిక్‌ను పక్కన పెట్టి, మీ మనసు ఏం చెప్తుందో వినండి. అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు.” ఒక్క క్షణం ఆగి, “ఇంతకీ ఏమంటోంది?” అన్నాడు.

“ఆ లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి… ఈ మ్యాజిక్‌ని ఫీల్ అవ్వమంటోంది.” అని అతని గుండెలపై తన తలను ఆనించింది.

వర్షం ఆగిపోయింది. మేఘాల మధ్యనుంచి తొంగిచూసిన నిండు పౌర్ణమి చంద్రుడు ఆ రాత్రికి మరింత శోభను తీసుకొచ్చాడు. ఆమె లోకంలోని చీకటిని అర్థం చేసుకోవడానికి అతను రాత్రంతా కళ్ళ గంతలు కట్టుకుని గడిపాడు. బదులుగా, అతని ఏకాంతంలోకి ఆమె ఒక నిండు పౌర్ణమిలా ప్రవేశించి వెలుగును నింపింది. ఇప్పుడు ఆ వెన్నెల వెలుగులో,ఇద్దరూ ఒకరి ప్రపంచంలో మరొకరు తమ స్థానాన్ని కనుగొన్నట్టనిపించింది.

ఇంతలో డ్రైవర్ క్యాబ్ లోంచి దిగి, “ఏందన్నా ఇది? కారుమీద అలా పడిపోయారు? ఇంకా ఈఎంఐలే పూర్తి కాలే. ఇంకొంచమైతే కారుకి సొట్ట పడేది. మీరు తొందరగా ఖతం చెయ్యుండ్రి. ఇంటికి పోవాలె…” అని కసురుకున్నాడు. ఏదో గొణుగుతూ డ్రైవర్ సీట్ వైపు నడిచాడు.

ఆ మాటలకు నవ్వుకుంటూ, ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు మరింత గట్టిగా పట్టుకున్నారు.